చిరుజల్లు-138

0
8

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఎప్పటివలె కాదురా..

[dropcap]స[/dropcap]త్యనారాయణ చిన్న పని మీద కూకట్‌పల్లి వెళ్లి, వస్తూ వస్తూ ఎందుకో పద్మను పలకరించాలని అనిపించి, ఆమెకు ఫోన్ చేశాడు.

“హలో.”

“నేను సత్యాన్ని.”

“అబ్బ, ఎన్నాళ్లకు మళ్లీ నీ గొంతు విన్నాను.”

“ఎన్నోసార్లు ఇటు వైపు వచ్చినప్పుడు, నిన్ను చూడాలని అనిపించేది. నాకు పని లేదు గదాని, నీ పని చెడగొట్టకూడదని.. ఊరుకునేవాడిని..”

“గొప్పోడివే. ఇప్పుడు ఎక్కడ నుంచి..”

“మీ ఇంటికి దగ్గర్లోనే ఉన్నాను..”

“మరి ఇంకేం. వచ్చెయ్.”

“మీ ఇంట్లో..”

“రమ్మన్నానా?”

“ఆజ్ఞ. మహారాణీ.”

సత్యనారాయణ పద్మ ఇంటి ముందు కెళ్లి కాలింగ్ బెల్ నొక్కవల్సిన పని లేకుండానే, తలుపులు తెరిచే ఉంచింది. లోపలకు వెళ్ళాడు.

పద్మ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయింది. చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది.

ఎదురుగా కూర్చుంది.

“ఎన్నేళ్లు అయింది సత్యం నిన్ను చూసి..” అన్నది నవ్వుతూ.

“బాగా చిక్కి పోయావు..” అన్నాడు సత్యం,

“నేను నీకు మాత్రమే చాలా సార్లు చిక్కిపోయాను, సత్యం. మళ్లీ అలాంటి వేషాలు దొరకలేదు..” అన్నది పద్మ నవ్వుతూ.

సత్యనారాయణ మంచి రంగస్థల నటుడు. ఇరవై ఏళ్ళ నుంచీ ఎన్నో నాటనాకలలో ఎన్నో పాత్రలలో నటించి, లెక్కకు మిక్కిలిగా అవార్డులు, బహుమతులూ పొందాడు.

పద్మ కూడా నటి. ఆయనతో కల్సి అనేక నాటకాల్లో నటించింది. అవన్నీ స్టేజి మీద ఇద్దరూ భార్యాభర్తలుగా నటించిన నాటకాలే చాలావరకు..

ఒక రకంగా ఇద్దరూ పాప్యులర్ జంట.

ఈ మధ్య నాలుగయిదు సంవత్సరాల నుంచీ నాటకాల జోరు తగ్గింది. అందుచేత కొద్ది కాలం విరామం తరువాత ఇవాళ మళ్లీ కల్సుకున్నారు.

“మీవారు లేరా?” అని అడిగాడు సత్యం.

“లేదు. భీమవరం వెళ్లాడు. ఏడాది కోసారి అక్కడకు వెళ్లి రాకపోతే ఆయనకు తోచదు..”

“నువ్వూ వెళ్లక పోయావా?”

“వెళ్తే, అక్కడ నాకు తోచదు” అని నవ్వింది పద్మ. “కొంచెం కాఫీ తెస్తాను “ అంటూ సోఫా అంచు పట్టుకుని బలవంతాన లేవబోయింది.

“ఏంటీ? ఒంట్లో బావుండలేదా?”

“నిన్నటి నుంచి కొంచెం జ్వరంగా ఉంది..” అన్నది పద్మ.

“అవునా?” అంటూ లేచి, ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు.

“అరే.. ఒళ్లు కాలి పోతోంది. పద.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను.”

“వద్దులే సత్యా. రేపటికి తగ్గిపోతుంది..” అన్నది పద్మ.

అయినా సత్యం వినలేదు. ఆమెను దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లాడు.

ఆయన పరీక్ష చేశాడు. వైరల్ ఫీవర్ అంటూ మందులు రాసిచ్చాడు. మెడికల్ షాపులో మందులు కొనుక్కుని, ఇంటికి వెళ్ళారు.

మంచి నీళ్లు తీసుకొచ్చి, ఆమె చేత టాబ్లెట్లు మింగించాడు.

“పద. కాసేపు పడుకో..” అంటూ పడక గదిలోనే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి, దుప్పటి కప్పి, ఆమె మంచం పక్కనే కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

పద్మ, సత్యం చేతిని రెండు చేతుల్లోకి తీసుకుని నీరసంగా నవ్వుతూ అన్నది..

“ఇంక నువ్వు వెళ్ళు. మీ ఆవిడ ఎదురు చూస్తుంటుంది..”

“ఆవిడ లేదు. పండగకు వాళ్ల అన్నయ్య దగ్గరకు వెళ్లింది.. ఇంటికి వెళ్లి నేను చేసేదేమీ లేదు. ఈ పూట ఇక్కడే ఉంటాను..” అన్నాడు సత్యం.

“నీకు శ్రమ..” అంటున్న పద్మ చేతి నోటికి చేతిని అడ్డు పెట్టాడు.

“తమరు, విశ్రమించండి, మహారాణీ” అన్నాడు నాటక ఫక్కీలో.

పద్మ నవ్వుతూ, చనువుగా సత్యం తొడమీద చిన్న దెబ్బను చరిచింది.

టాక్లెట్లు వల్ల కాసేపు నిద్రపట్టింది.

ఆమె నిద్రలేచేటప్పటి, సత్యం హోటల్ నుంచి భోజనం తెప్పించాడు.

“లే. కొంచెం ఏమన్నా తిని పడుకుందువుగాని..” అంటూ కంచంలో కూర, చారు కలిపి ఆమె నోటికి అందించాడు.

“ఇదంతా ఏదో కలలాగా ఉంది, సత్యం..” అన్నది పద్మ. భోజనాలు అయినాక చాలాసేపు తమ పాత నాటకాల అనుభవాల గురించి చెప్పుకున్నారు.

ఎన్నోసార్లు వేరే నగరాలకు వెళ్లి నాటకాలు వేసి బహుమతులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నయి.

ఇంత కన్నా కూడా అన్యోన్యంగా నటించిన నాటకాలూ ఉన్నాయి.

కానీ ఇప్పుడే.. ఇది నటన కాదు.. నిజంగా జీవిస్తున్నప్పుడే ఇద్దరికీ ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతోంది.

అర్ధరాత్రి దాకా కబుర్లు చెబుతూ కూర్చున్నారు.

బెడ్ రూంలో ఒకే మంచం మీద పడుకున్నారు. మధ్యమధ్యలో లేచి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూస్తున్నప్పుడల్లా, పద్మ ఆ చేతిని అందుకుని మా సున్నితంగా చుంబించింది.

తెల్లవారింది.

పద్మకు జ్వరం తగ్గింది. లేచి కాఫీ పెట్టింది.

సత్యానికి కప్పు అందించింది. ఆతనూ, ఆమె ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగారు.

అతను సాయం చేశాడు. ఆమె వంట చేసింది.

ఇద్దరూ భోజనం చేశారు.

ఒక నాటకంలో ఇలాగే ఆమె చేత భోజనం చేయించాడు. ఎన్నో సార్లు నాటకంలో స్టేజ్ మీద ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేశారు. అప్పుడూ ఆమెను అందరి ముందూ నిర్భయంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఎలాంటి అనుభూతీ లేదు. ఇప్పుడు ఎవరూ లేకపోయినా, ఒంటరిగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆమె చుట్టూ చెయ్యి వేసి నడుస్తుంటే, ఏదో.. మనసు వింత అనుభూతికి లోనవుతోంది.

‘ఎప్పటివలె కాదురా..’ అని మనసు లోని మాట, పద్మ అనేసింది నవ్వుతూ.

సాయంత్రం వెళ్తానని బయల్దేరాడు.

“నీ పట్ల నాకున్న కృతజ్ఞతను నీ పాదాల చెంత ఉంచమని తప్ప, నీకు నేను ఏమివ్వగలను?” అని వంగి ఆతని పాదాలకు నమస్కరించింది.

ఒకనాడు అందరి ముందు స్టేజ్ మీద సత్యం తనకు కప్పిన శాలువానీ, ఇవాళ ఈ ఏకాంత ప్రశాంత వాతావరణంలో ఆతనికి కప్పింది. అతను ఆమెను తన బాహువుల లోకి తీసుకున్నాడు.. ఎప్పుటివలె కాదు.. ఇప్పుడేదో తడబాటుతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here