చిరుజల్లు-141

0
10

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

చిన్ని చిన్ని ఆశ

[dropcap]పం[/dropcap]డగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బొమ్మల కొలువు. కానీ సావిత్రి ఇంట్లో ప్రత్యేకంగా బొమ్మలు పోగు చేయాల్సిన పని లేదు. ప్రాణమున్న బొమ్మలే, కదిలే బొమ్మలే ఇంటి నిండా పోగవుతాయి. సావిత్రి అత్తగారు, మామగారు ఆమె దగ్గరే ఉంటారు. అందుచేత వాళ్ల కూతుళ్లనీ, అల్లుళ్లనీ, – అంటే సావిత్రి ఆడబిడ్డలనూ వారి వారి భర్తలనూ పండగకు రమ్మని ఫోన్ చేసారు. అందరినీ ఒకసారి చూసినట్లు అవుతుందనీ, అందరూ శలవులు పెట్టి వచ్చేస్తారు. ఇద్దరు కూతుర్లూ, వాళ్లు కొనుకున్న భర్తలూ, ఇద్దరు కొడుకులూ వాళ్ళను కొన్న భార్యలూ, వాళ్లు కన్న వాళ్ళు, వాళ్ల పిల్లలూ – అంటే మనవళ్ళు మనమరాళ్ళు అంతా కలిపి, అన్ని వయసులలోనూ ఉన్నవాళ్లు – దేవుడు చేసిన బొమ్మలు – పాతిక మంది దాకా చేరతారు. ఆరు నెలల పసివాడి నుంచీ, అరవై ఏళ్ల వృద్ధుల దాకా పరిపరి వయసుల వారు బిలబిల మంటూ వచ్చేస్తారు -వయసులు మరచి, వరసలు కలుపుకుంటూ.

సరే మరి. అంతా అయినవారే. పరాయి వాళ్లు ఎవరున్నారు. ఆరంగ ఆరంగ అందరికీ కాఫీలు, టిఫిన్లు, స్పెషల్ ఐటమ్స్ రెండు పూటలా విందు భోజనాలు వేళకు అందించాలి గదా. తిన్న తరువాత ఎంతసేపని ఈ నాలుగు గోడల మధ్య పడి కొట్టుకుంటారు. అక్కడ కొత్తగా మాల్ వచ్చింది, ఇక్కడ కొత్తగా సినిమాహాల్ వచ్చింది అంటూ టైం పాస్‌కని బయల్దేరతారు.

ఈ రోజుల్లో అన్నిటికన్న ట్రాన్స్‌పోర్ట్‌కు అయ్యే ఖర్చు ఎక్కువ గదా.

“ఒరే అన్నయ్యా ఊబర్ పిలవరా” అంటే, తప్పదు మరి. పరాయివాళ్లేం కాదుగదా.

“సెకండ్ షోకి ఆన్‍లైన్‌లో బుక్ చేయరా” అని అడిగితే, కాదని ఎలా అంటాడు.

పండగకు చీరలు, అలుళ్లకి బట్టలూ, పిల్లలకూ డ్రెస్సులూ కొనకపోతే ఎలా? వాళ్లు చాలా తెలివిగా ఖర్చు పెట్టిస్తారు.

“ఒరే అన్నయ్యా, చీరకు నువ్వు ఎంత ఇవ్వదల్చుకున్నావా ఇవ్వు, పైన ఇంకో వెయ్యో, రెండువేలో వేసి నేను నాకు నచ్చింది కొనుక్కుంటాను” అని వ్యూహాత్మకంగా అంటే, అన్నయ్య మొహమాటపడి, వెయ్యికీ, రెండు వేలకీ వెనకాడకుండా అందరికీ వారివారి అభీష్టం కొలది కొనటం అవుతుంది.

ఇంక ఇంత దూరం, ఇంతింత చార్జీలు పెట్టుకొని వచ్చినందుకు గిఫ్ట్‌లు ఇవ్వకపోతే ఏం బావుంటుంది? ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఇవ్వకపోవటం మర్యాద కాదు గదా – అందరికీ గిఫ్ట్‌లు పేరు పేరునా ఇవ్వవలసిందే.

షిల్లలు ఊరుకోకుండా ఆన్‌లైన్‍లో కొన్ని బుక్ చేసుకుంటారు. సరదాపడి సెల్‌ఫోన్లు గట్రా అమెజాన్‌లో తెప్పించుకుంటారు.

అంతా అయిపోయాక, రాత్రి సర్దుమణిగాక, అందరూ నిద్రలో ఉండగా, సావిత్రితో భర్త అంటాడు.

“సారీ, సావిత్రి, బడ్జెట్ అనుకున్నదాని కన్నా ఎక్కువ అయింది. నీకు ఏమీ కొనలేదు” అని.

“డబ్బు ఎక్కడిది?” అని అడుగుతుంది సావిత్రి.

“కొంత లోన్ తీశాను. కొంత కార్డు మీద చార్జి చేశాను” అంటాడు.

ఇంత అప్పు చేసినా, సావిత్రికి పండగకు కొత్త చీర కొనుక్కోవాలన్న చిన్న చిన్న ఆశ కూడా తీరలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here