చిరుజల్లు-142

0
12

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఏం మిగిలింది?

[dropcap]రా[/dropcap]ణి భర్త రాక కోసం ఎదురు చూస్తోంది.

పెళ్లికి వెళ్లాలి. రాత్రి ఎనిమిది గంటలకు ముహుర్తం. అందుచేత అందరూ ఆరుగంటల కల్లా వచ్చేస్తారు. రాణి కూడా ముందుగానే వెళ్ళి పెళ్లి వేడుకలలో పాల్గొనాలని ఆశ పడుతోంది. కానీ భర్త ఆఫీసు నుంచి ఇంకా రాలేదు.

నాలుగు గంటలకల్లా వచ్చేస్తానన్నాడు. అయిదుగంటలు అవుతున్నా అయిపు లేడు. ఫోన్ చేసింది. ఇదుగో వస్తున్నా, ఇదుగో బయల్దేరుతున్నా, ఇదుగో ట్రాఫిక్‌లో ఉన్నానంటూ అయిదు నిముషాలకోసారి చెబుతూనే ఉన్నాడు.

అసలు రాణి ఈ పెళ్లికి వెళ్లాలని వారం రోజుల నుంచీ రోజులు లెక్కపెట్టుకుంటోంది. ఏ చీరలు కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి అని ఉన్న వాటి లోనివి తీసి సెలక్ట్ చేసి పెట్టుకుంది. అందరి ముందూ ప్రత్యేక ఆకర్షణ కావాలని ఆమె తాపత్రయం. ఉన్న చీరలలో బాగా ఖరీదైనవిగా కనిపించేవి కట్టుకుని, విడిచేసి, మరొకటి కట్టుకుని అద్దంలో చూసుకుని విప్పేసి, మరొకటి చుట్టుకుని – చివరకు ఎలాగో ఒకదాని దగ్గర మనసు కుదుటపరుచుకుంది.

ఇక నగల విషయాల కొస్తే, ఉన్నవే రెండు మూడు రకాలు. వేటినీ వదలకుండా మూడింటినీ మెడలో దిగేసుకుంది. మేకప్ చెడిపోకుండా జాగర్త పడుతోంది.

పదిసార్లు ఫోన్ చేశాక, రాణి భర్త అశోక్ వచ్చాడు. అప్పటికే ఆరు గంటలు అయింది. లేటు అయిపోతోందని కంగారు పడింది. అశోక్ అయిదు నిముషాల్లో తయారై, కారులో కూర్చున్నాడు.

అరగంటలో ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు. కారు దిగి వెళ్లేటప్పటికి, నిండా పదిమంది కూడా లేరు. ఇంకా డెకరేషన్ వాళ్లు, లైటింగ్ వాళ్లు, ఫొటోగ్రాఫర్స్ మాత్రం తమ ప్రయత్నాల్లో ఉన్నారు.

ఒకడు “మైక్రోఫోన్ టేస్టింగ్, వాన్, టూ, వాన్, టూ” అంటున్నాడు.

హాల్‌కి వెనక వైపున ఉన్న గదుల్లో పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లికొడుకు తరపు వాళ్లూ కాఫీలు తాగుతూ మేకప్‌లు చేయించుకుంటూ బిజీగా ఉన్నారు. ఏడు గంటలకు పెళ్లి కొడుకు, అతని దగ్గర బంధువులూ, కుటుంబసభ్యులూ అయిదారు కార్లల్లో వచ్చి గుమ్మం దగ్గర ఆగారు. పెళ్లికొడుకును కారు దిగనివ్వలేదు.

ఎవరో వెళ్లి కబురు చెబితే, అప్పుడు తీరుబడిగా పెళ్లికూతురు తరపు వాళ్లు ఎదురెళ్లి స్వాగతం పలికారు, హారతులు ఇచ్చారు. పన్నీరు చల్లారు. మేళ తాళాలతో హాలులోకి తీసుకొచ్చారు.

అప్పటికీ ఇంకా పట్టుమని పాతిక మంది కూడా లేరు. పురోహితుడి హడావిడి మొదలైంది. “వధువును తీసుకు రావాలి, ముహుర్తం సమీపిస్తోంది” అంటూ మైక్‌లో చెబుతున్నాడు.

నలుగురు, అయిదుగురు హడావిడిగా పెళ్లికూతురు ఉన్న గది వద్దకు వెళ్ళారు. ఆమెకు ఇంకా మేకప్ పూర్తి కాలేదంటూ గది తలుపులు కూడా తెరవలేదు.

ఓ పావుగంట హడావిడి తరువాత అమ్మాయి మేకప్ పూర్తి అయింది. పదిమంది స్త్రీలు చుట్టూ కదిలిరాగా, మంగళవాయిద్యాల మధ్య నెమ్మదిగా పెళ్లి నడకలు నడుస్తూ పెళ్లికూతురు వేదిక మీదకు వచ్చింది.

ఆ వేదిక మీద ఏం జరుగుతోందో, హాల్‌లో కూర్చున్న వాళ్లకి ఎవరికీ కనిపించకుండా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి దగ్గర బంధువులంతా చుట్టుముట్టి నిలబడ్డారు.

గౌరీ పూజ అయింది. జీలకర్ర బెల్లం వేడుక ముగిసింది. కన్యాదానం జరిగింది. మంగళ సూత్రధారణ కూడా పూర్తి అయింది. తలంబ్రాల వేడుకా అయిపోయింది.

ఇవేవీ హాలులో కూర్చున్న వాళ్లకి, అంటే పెళ్లి వేడుక చూద్దామని వచ్చిన వారికి ఏమీ కనిపించలేదు.

పెళ్లి అయిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకు మొత్తం కలిపితే ఓ వంద మంది ఉన్నారు.

ముప్ఫయి రకాల వంటకాలతో వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. తీరా చూస్తే ఓ వంద మంది కన్నా ఎక్కువ మంది లేరు హాలులో.

రాత్రి పదకొండు గంటలకు పెళ్లి సందడి సర్దుమణిగింది. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.

చేసిన అలంకారాలు, వంటలూ, మిగిలినయి. ఏం చేయాలో తెలియలేదు.

హాలు వాళ్ళను అడిగితే, రేపు ఆ భోజన పదార్థాలన్నీ పేదలకు పంచి పెడతారున్నారు.

మర్నాడు పెళ్లి కూతురు తల్లితో, రాణి కూడా సత్యనారాయణ వ్రతానికివెళ్లింది.

అంతా అయిపోయాక, తిరిగివస్తున్నప్పుడు, పెళ్లికూతురు తల్లి కామేశ్వరి రాణితో అన్నది –

“సంబంధాలు కుదరటమే కష్టంగా ఉంది. ఏదో ఒక సంబంధం కుదరటమే అదృష్టం అనుకున్నాం. పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేయాలని అడిగారు. నెలలో ముహూర్తం కుదిరింది. చేతిలో డబ్బు లేదు. వెయ్యి గజాల స్థలం సగానికి సగం ధరకి అమ్మేసి పెళ్లి చేశాం. కానీ చివరకు ఏం మిగిలింది? ఇంత ఆర్భాటం అవసరమా? ఆ స్థలం ఉంటే, లోన్ తీసుకుని ఇల్లు కట్టుకునే వాళ్లు. ఆ ఏరియాలో వీళ్లు గజం కూడా కొనలేరు” అన్నది కామేశ్వరి పంటి బిగువున దుఃఖం ఆపుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here