చిరుజల్లు-144

0
6

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఇంత లేటు వయసులో..

[dropcap]ఇ[/dropcap]ది ఈ మధ్య కొద్ది కాలంగా ప్రాచుర్యంలోకి వస్తున్న కొత్త ట్రెండ్ అనే చెప్పాలి.

ఏమిటంటే భార్యను గానీ, భర్తను గానీ పోగొట్టుకోని, లేదా విడాకులు తీసుకుని ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళు, ముఖ్యంగా యాభై ఏళ్లు దాటి, ఇక వార్ధక్యపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న వార్లు, తమకు ఒక తోడును వెదుక్కుంటున్నారు. పూర్వం జాయింట్ ఫామిలీలు ఉన్నప్పుడు, ఈ సమస్య వేధించేది కాదు. అన్న దగ్గరో అక్క దగ్గరో శేష జీవితం గడిపేవారు. ఇప్పుడా ఆ అవకాశం లేదు. ఎదిగిన పిల్లలు, ఉద్యోగాల వేటలో పడి, రెక్కలల్లార్చుకుంటూ ప్రపంచం నలుమూలలకూ ఎగిరిపోతున్నారు. వీళ్లు వెళ్లి వాళ్లతో ఉండనూ లేరు. ఇక్కడ ఏకాకిగానూ ఉండలేకపోతున్నారు. వృద్ధాశ్రమాలు వీరికి సరిపడవు. అందుచేత తోడు కోసం వెతుక్కుంటున్నారు.

“యాభై ఏళ్లు, అరవై ఏళ్ల వయసులో మీకు మళ్ళీ పెళ్లి అవసరమా?” అని అడిగే వాళ్లూ ఉన్నారు. ఒక పక్క ఈ విమర్శల తాకిడి ఎదురవుతున్నా, మరో పక్క శాపంలా మారుతున్న ఒంటరితనం, మరో పక్క విహరిస్తున్న కోరికల శారికలు – తీరని కోరికలు, ఊరించే ఊహలు, ఇవన్నీ మరో పక్క అలజడి రేపుతున్నయి.

నిజానికి – పిల్లలు ఉన్నాసరే, భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడినప్పుడు, విడిపోయి, మళ్లీ పెళ్ళి చేసుకునే సంస్కృతి కొన్ని దేశాలల్లో సాధారణ విషయంగానే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు ఇది మనకూ అనుభవం లోకి వస్తున్నది.

వయో వృద్ధుల మానసిక వేదన అర్థం చేసుకున్న ఒకరిద్దరు ఉదార హృదయులు, ఒంటరివాళ్లను జంటలుగా చేయటానికి ఒక సంస్థ నెలకొల్పి రెండునెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకునే యాభై ఏళ్లు దాటిన వాళ్లు ఇందులో పేరు నమోదు చేసుకోవాలి. సమావేశం గురించి వారం రోజుల ముందుగా తెలియజేస్తారు. వచ్చిన వాళ్లకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు గనుక నామమాత్రంగా కొంత ఫీజు వసూలు చేస్తారు. వచ్చిన వారందరికీ టోకెన్ నెంబరు ఇస్తారు.

తమ వంతు రాగానే ప్రతివాళ్లూ వేదిక ఎక్కి, క్లుప్తంగా తమ వివరాలు, తాము తోడు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తికి ఉండవల్సిన లక్షణాల గురించి తెలియజేస్తారు.

పరిచయాలు పూర్తి అయ్యాక ఎవరికైనా ఎవరైనా నచ్చినట్లయితే, అక్కడే కూర్చుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు.

ఆ తరువాత ఇద్దరికీ ఇష్టమైతే వివాహం చేసుకోవచ్చు. అయితే మొదటి వివాహం చేసుకున్న వ్యక్తి మరణించినట్లుగానే, విడాకులు తీసుకున్నట్లు గానీ, ఆధార్ కార్డులతో సహా రుజువులు చూపించాల్సి ఉంటుంది.

***

అలాంటి ఒక వయో వృద్ధుల స్వయంవరం సమావేశానికి వసుధ వచ్చింది. యాభై అయిదేళ్లు ఉంటయి. అయినా ఆ వయసులో కూడా మిసమిసలాడే మేలిమి బంగారం రంగులో మెరిసిపోయే, ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేటట్లుగా, దిరిసెన పువ్వుకన్నా సుతిమెత్తని మేనులో, నిండార విరబూసిన బొండు మల్లెల తోట లాగా, పుష్టి గల విగ్రహంతో, దారి తప్పి వచ్చిన దేవకన్యలా వచ్చింది. అందరూ ఆమె మీద నుంచి దృష్టి మరల్చుకోలేక పోయారు.

ఒక హోటల్లో ఏర్పాటు చేసిన అనాటి సమావేశానికి మొత్తం యాభైమంది మగవారు, ఇరవై మంది ఆడవాళ్లూ వచ్చారు. వచ్చిన మగవాళ్లల్లో భానుమూర్తి కూడా ఉన్నారు. అరవై ఏళ్లు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నత స్థాయి పదవిలో పని చేసి రిటైరైనాడు.

పరిచయాలు పూర్తి అయినయి. దాదాపుగా పది మంది వసుధతో మాట్లాడాలని ఆసక్తి చూపారు. కానీ ఆమె మాత్రం ఎవరికీ చూడటానికి ఇష్టపడలేదు. ఒక్క భానుమూర్తితో మాత్రమే అరగంటకు పైగా మాట్లాడింది..

విడివిడిగా వచ్చిన ఆ ఇద్దరూ కలిసే ఆయన కారులో వెళ్లారు. అక్కడి నుంచీ వాళ్లు విడిపోయింది లేదు.

“కలలో వరించగా, కలవరించగా, కన్నులు తెరిచి చూస్తే నీవే కనిపిస్తున్నావు” అన్నాడు భానుమూర్తి.

“గత జన్మలో ఇంద్రుడువో, చంద్రుడివో, నలకూబరుడిపో అయి ఉంటావు. ఈ జన్మలో నా కోసం వచ్చావు” అన్నది వసుధ ఆయన కౌగిలిలో, అగరుబత్తి పొగలాగా మెలికలు తిరిగిపోతూ.

ఆమె అయస్కాంతం అయితే, అతను ఇనుపతీగలాగా ఆమెకు అతుక్కుపోతున్నాడు.

అలరెడు ముద్దు గుమ్మ, నడయాడెడి బంగరుబొమ్మతో, భానుమూర్తికి రేయి పగలుగా, పగలు రేయిగా మారిపోతోంది.

“పున్నమి వెన్నెల వెలుగులో తాజ్ మహల్ చూడాలని ఉంది” అన్నది వసుధ.

ఆగ్రా వెళ్లారు.

“సముద్రపు ఒడ్డున నీవు నేనై, నేను నీవై తిరుగాడాలని ఉంది” అన్నది.

గోవా వెళ్లారు.

“సూర్యోదయాల సోయగాలు, సూర్యాస్తమయాల వయ్యారాలు చూడాలని ఉంది” అన్నదామె.

కన్యాకుమారి వెళ్లారు.

“కృష్ణుడు నడయాడిన నేలను చూడాలని ఉంది” అన్నది.

బృందావనం వెళ్లారు.

ఢిల్లీ, ముంబయి, కలకత్తా, జైపూర్, ఉదయ్‌పూర్ – ప్రకృతి పులకించిన ప్రతి చోటుకి వెళ్ళారు.

కొన్నాళ్ల తరువాత భానుమూర్తి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. “నా కొడుకు మన పెళ్లికి అంగీకరించటం లేదు” అని చెప్పింది.

భానుమూర్తి అమెరికాలో నున్న కూతురితో మాట్లాడాడు.

“అరవై ఏళ్ల వయసులోనే నీకో ఆడది కావాల్సి వచ్చిందా?” అని సూటిగా అడిగింది.

“అది కాదు. ఒంటరితనం భరించలేక..”

“ఒంటరితనాన్ని వదిలించుకోవటానికి ఎన్ని వ్యాపకాలు లేవు? సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, ధార్మికం – ఏ రంగం ఎంచుకున్నా, కాలం తెలియకుండానే గడిచిపోతుంది. ఆలోచించుకో” అన్నది.

ఇక్కడ భానుమూర్తికి తెలియని విషయం ఒకటి ఉన్నది.

వసుధ పరిచయం అయినప్పటి నుంచీ, అతను వయోవృద్ధుల పరిచయ వేదిక సమావేశాలకు వెళ్లటం మాసేశాడు.

కానీ అతనికి తెలియకుండా వసుధ మాత్రం ఆ సమావేశాలకు వెళ్తూనే ఉంది.

ఒక సమావేశంలో అగర్వాల్ తగిలాడు. ఆమె అందం ముందు సాగిలపడ్డాడు. అతనికి బంగారు నగల షాపు ఉంది. దానికి ఆమెను యజమానురాలిని చేస్తానన్నాడు.

జూబ్లీహిల్స్ లోని మేడలోకి ఆమె తన నిపాసాన్ని మార్చి వేసింది.

ఆమె అర్థాంతరంగా ఎలా అంతర్ధానం అయిందో భానుమూర్తికి తెలియలేదు.

అతనికి తెల్సినదల్లా, ఇన్నేళ్లుగా కాపాడుకున్న వ్యక్తిత్వం మట్టిపాలు అయిందని మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here