చిరుజల్లు 19

0
11

ఉయ్యాలలూపే చెయ్యి

[dropcap]ఆ[/dropcap]దివారం నాడు ఆనందరావు సోఫాలో కాళ్లు బార్లా చాపుకుని కూర్చుని టి.వి చూస్తున్నాడు. ఏదో చర్చ అన్నారు గానీ అది రచ్చరచ్చగా ఉంది. పచ్చి పచ్చిగా తిట్టుకుంటున్నారు. అంతకన్నా గొప్ప వినోదం ఏముంటుంది ఎవరికైనా? అలా అతను ఒకానొక రకమైన మహదానందంలో ఉండగా, రజని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రజని ఆనందరావుకి ఫింగర్ లెఫ్ట్ అంకుల్ కూతురు అయినా, ఇద్దరి మధ్యా మంచి చనువు ఉంది.

“ఏంటే, ఉరుములూ, మెరుపులూ లేకుండా ఇలా సడెన్‌గా పిడుగు పడినట్లు వచ్చి పడ్డావు?” అని అడిగాడు ఆనందరావు శయన ఆసనం నుంచి లేచి కూర్చుని.

“వాతావరణశాఖ వాళ్లకు చెప్పకుండా వచ్చాన్లే” అన్నది రజని ఎదురుగా భేటీ అయి. ఇంతలో ఆనందరావు నిజ భార్య కూడా వచ్చి కూర్చుంది.

స్వల్పంగా అల్పాహారాలు, శీతల పానీయాలు అయ్యాక రజని అసలు విషయానికి వచ్చింది. రజని ఏదో ప్రైవేటు ఇంటనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న మరో లెక్చరర్ ముస్లిమ్ యువకిశోరాన్ని లైక్ చేసి, క్రమంగా పీకలోతు ప్రేమలో కూరుకుపోయింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటోంది.

“నీ సలహా ఏంటి?” అని అడిగింది.

“బావుందే, అతని నోసూ, ఫేసూ నాకు తెలియదు. నేనెప్పుడూ చూడను కూడలేదు. ఏం సలహా చెబుతాను?” అన్నాడు ఆనంద్.

“డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాను గదా… అందుకని…” అన్నది రజని.

“అతన్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. ఇప్పుడు నీకు కావల్సింది, ఉచిత సలహా కాదు. మోరల్ సపోర్ట్. మీ పెద్దవాళ్లు ఒప్పుకోరు. కొంత కాలం వరకూ అయినా నిన్ను పట్టించుకోరు. దూరంగా జరుగుతారు. అనేక రకాల ఒత్తిడిలూ, ఒడిదుడుకులూ ఎదురవుతాయి. అన్నిటినీ తట్టుకోగల మనోధైర్యం నీకు ఉందో,లేదో చెక్ చేసుకో…” అన్నాడు ఆనంద్.

రెండు నెలల తరువాత రజని రహస్యంగా నలుగురైదుగురు స్నేహితుల సహాయంతో ప్రేమ వివాహం చేసుంది. ఇది తెల్సిన తల్లిదండ్రులు నలుగురిలోకి రావటం మానేశారు. మానసికంగా కృంగిపోయారు.

రజని సుఖాలే అనుభవించిందో, కష్టనష్టాలే భరించిందో తెలియదుగాని, ఏడాది తరువాత తల్లి అయింది. ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ఉయ్యాలలో వేసే రోజు ఆనంద్‌ని పిలిచింది. “ఇప్పుడు నాకు మిగిలి ఉన్న హితుడు, స్నేహితుడు, బంధువు – అన్నీ నీవు ఒక్కడివే. నీవైనా వచ్చి దీవించు” అని అడిగింది.

పసి పిల్లని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతున్న చెయ్యిని చూస్తూ ఆనందరావు తనలో తాను అనుకున్నాడు.

‘ఇప్పుడు నువ్వు నీ పిల్లను ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావో, ఒకప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను అంత ముద్దూ మురిపెంతోనూ చూసుకొని ఉంటారు. ఇప్పుడేం మిగిలింది వాళ్లకు, కడివెడు కన్నీళ్లు తప్ప… కాలం ఎన్నో మార్పులు తెస్తుంది. ఆడపిల్ల ఒంటరిగా వెళ్లటానికి భయపడుతూ, నలుగురితో కల్సితిరుగుతుంటుంది. కానీ, ఆ సమయం వచ్చినప్పుడు, కన్న వాళ్లనీ, కనిపెంచిన వాళ్లనీ, రోజూ కనిపించే వాళ్లనీ, పుట్టి పెరిగిన పుట్టింటినీ, బంధు గణాన్నీ, సంపదలనూ, తృణప్రాయంగా ఎడమకాలితో తన్నేసి వెళ్లిపోతుందా? అందరూ కాదు. ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటే ఉండొచ్చు. ఏకత్వంలో భిన్నత్వం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.’

***

పుట్టినప్పటి నుండీ మగపిల్లాడికీ, ఆడపిల్లకీ తేడా కనబరుస్తారు. మగపిల్లాడికి, తండ్రి పోలిక అనో, తాత పోలిక అనో, అమ్మ మూతి అనో, పెద్దనాన్న ముక్కు నో, పోలికలు చూస్తారు. కానీ ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవే పుట్టిందని ముద్దెట్టుకుంటారు. అంత తేడా ఉంది మరి. పసిపిల్లలంతా దేవుని రూపాలే. నట్టింట దోగాడే పసిపిల్లలు నీలాకాశం నుంచి జారిపడి బోసి నవ్వులతో తళాతళా మెరిసే నక్షత్రాలు. పారాడే పసిపిల్లతో ఇంటి నిండా కాంతి రేఖలే. అల్లరి చిల్లరి పనులతో మురిపించే మాణిక్యాలే. పిల్లల్ని కనటానికి తల్లి ఎన్ని నొప్పులు పడుతుందో, వాళ్లని పెంచి పెద్ద చెయ్యటానికి అంతకు పది రెట్లు నొప్పులు పడుతుంది.

ఇక బడికి వెళ్లినప్పటి నుంచీ చదివేది పుస్తకాల్లోని పాఠాలనే కాదు, లోకంలోని వింతలన్నింటినీ విప్పారిత నేత్రాలతో చూస్తుంటారు. చదువు అంటే, పరీక్షలు రాయటం కాదు, జీవించటం ఎలాగో నేర్చుకోవటం. చదువురాని వాడూ శ్రమైక జీవనంతో బతుకు వెళ్లదీయగలడు. తెలియనిది తెల్సుకోవటమే విద్య. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ – అన్నారు. ఆడపిల్ల గొంతు విప్పి గానం ఎత్తుకుంటే, కోకిల దరిదాపుల్లో లేకుండా పారిపోతుంది. తకధిమి, తకధిమి అని నాట్యం చేస్తే మయూరాలు తోక ముడుచుకోవాల్సిందే.

సౌందర్యం ప్రకృతిలో ఎక్కడుందీ అంటే, స్త్రీలోనే ఉన్నది. ఆడపిల్లలంతా చైతన్యమూర్తులే. వెలుగులు విరజిమ్మే దీప్తులే. కరుణార్ద్ర హృదయంతో ఆదరించే రేపటి ఫ్లారెన్స్ నైటింగేల్సే. దయతో దీవించే మదర్ థెరిసాలే. ప్రతిదీ అనుభవసారమే కానవసరంలేదు. ఒక ఐడియా చాలు జీవితాన్ని మార్చేస్తుంది….

యవ్వనారంభవేళలో మొగ్గ తొడిగే సిగ్గు సరికొత్త అందాలను సంతరించి పెడుతుంది. ఓర చూపులూ, దోరనవ్వులూ ఇప్పుడిప్పుడే మొదలవుతయి. ‘ఏం పిల్లో, ఎల్దమొస్తావా?’ అంటే ఛీఫో అంటూ అరచేతులతో ముఖాన్ని కప్పేసుకుంటుంది.

ఒక తోడు కోసం, ఒక నీడ కోసం ఎదురు చూసే వేళ ఇది. హృదయంలో యుగళగీతం మొదలవుతుంది. ఎటు చూసినా ఏదో పారవశ్యం. ఎవరిని చూసినా ఏదో తన్మయత్వం ముమ్మరంగా కమ్ముకునే తరుణం అది. అనుక్షణం పరధ్యానం. అన్నిటికీ మరుపు ఉన్నట్లుండి మైమరుపు.

‘ప్రేమలో పడ్డావా?’ అని అమ్మ అడిగితే, ‘నాకు తెలియదు, అసలు ప్రేమంటే ఏంటి?’ అని అడిగే ముగ్ధమనోహర రూపం. తల్లి దగ్గరకు తీసుకుంటుంది. కౌగిలించుకొని, నుదుటి మీద చిన్నగా చుంబించి, అమ్మ అంటుంది గదా.. “ప్రేమ అనేది గాలి లాగా, ధూళిలాగా, భూగోళమంతా నిండి ఉంటుంది తల్లీ. కానీ కంటికి కనిపించదు. మబ్బులు మనకు అందనంత ఎత్తున ఉంటాయి. కాని వర్షం కురిపిస్తాయి. ఆ వర్షంలో మనం తడిసిముద్దయి పోతాం. ప్రేమది కూడా అలాంటి అనుభవమే.”

ప్రేమించటం అంటే, అచ్చంగా నచ్చే మనిషి చెప్పిందల్లా చెయ్యటం. చేసేదల్లా తేటతెల్లంగా చెప్పటం. అతనికి దగ్గరగా ఉన్నప్పుడు, ఎప్పుడూ లేనంతగా మనసు సంతోషంగా ఉండటం. రుచులూ, అభిరుచులూ, ఆలోచనలూ, అభిప్రాయాలూ, కట్టుబాట్లు, సంప్రదాయాలూ అన్నీ కలవటం. ప్రేమించటం అంటే, గులాబీ పువ్వు ఇవ్వటం కాదు. గుండెనే గులాబీగా చేసి చేతికివ్వటం. కేదార్‌నాధ్ లోనూ, కైలాసంలోనూ లభించని మనశ్శాంతి అతని సాన్నిధ్యంలో లభించటం. అతను ఎదురుగా వస్తుంటే, మనసు ఒక ఉత్తుంగ తరంగమై అటువైపు పరుగులు తీయటం. ఎన్నడూ వినని, కనని సుమధుర సంగీతం ఏదో అతని గుండె చప్పుడులో వినటం – అదీ ప్రేమంటే… అని అమ్మ చెప్పినప్పుడు అన్నీ తెల్సినా, ఏమీ తెలియనట్లు తలొంచుకొని తనలో తను నవ్వుకోవటం – అదీ ప్రేమంటే.

‘అబ్బాయి నీకు నచ్చాడా?’ అంటే గడుసుగా ‘మీ ఇష్టం’ అంటుంది తన ఇష్టాయిష్టాలు వాళ్లకు తెల్సుగనుక.

వెళ్లి పెళ్లిపీటల మీద అతని పక్కన కూర్చుంటుంది. పురోహితుడు చెబుతాడు – అతని నెత్తిన చెయ్యి పెట్టమని… అతని చెయ్యి పట్టుకుని తిరగమని… అదో అందమైన అనుభవం.

అక్కడి నుంచీ అంతా కమ్యూనిజమే. నిజమే. ఇద్దరూ ఒకరే అయిపోతారు. ఆ ఒకరూ ఎవరూ అన్నది క్రమంగా తరువాత తెలుస్తుంది.

భార్య అనే సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతంది. అప్పటి దాకా అతను సింగిల్… సింగిల్ జీతం… సింగిల్ జీవితం… సింగిల్ రూం… సింగిల్ బెడ్ రూంలోకి తన వెళ్తుంది… సాయంకాలం…శీతాకాలం… జంటకోసం ఎదురు చూపులు… చూపుల కోలాటాలు.. మనసుల ఆరాటాలు… అన్నీ సగం, సగం…

ఇంటికి దీపం ఇల్లాలు. దీపం వెలిగిస్తుంది. పొయ్యి వెలిగిస్తుంది. వంటలూ, రుచులూ, ఇష్టాయిష్టాలు… అన్నీ తెలిసేలోపే, ఆరితేరిన ఆరింద అయ్యేలోపే, జీవితంలోని కమ్మదనం ఇంకా తెలిసీ తెలియక మునుపే అమ్మతనం తెలుసొస్తుంది.

కాలెండర్లు మారిపోతయి. తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. జీవన విధానం అలవడుతుంది. అదృష్టం అన్నీ ఇస్తుంది. ఒక్క ఇల్లాలుని మాత్రం దేవుడే ఇస్తాడు. ఒక తరం నుంచి మరో తరం తయారయ్యే సంధికాలం. ఈ కాలంలోనే తల్లి పాత్ర తిరుగులేనిది. పిల్లలు ఎవరి మాటా వినరు కానీ తల్లి చెబితే మాత్రం కాదనరు. పిల్లలంటే తల్లికి ప్రాణం. తల్లి అంటే పిల్లలకు సర్వస్వం. ప్రపంచంలోని ఏ శాసనానికీ తల ఒగ్గని వాడు కూడా, తల్లి ఒక్క మాట చెబితే, కట్టుబడిపోతాడు. పట్టుబడిపోతాడు. తిరుగులేని బ్రహ్మాస్త్రం తల్లి కన్నీటి చుక్క. రాయి కూడా నీరు అయిపోవాల్సిందే అమ్మ అశ్రుకణం ముందు.

తండ్రి సంపాదించుకొస్తే, సంసారాన్ని తీర్చిదిద్దే బాధ్యత అంతా తల్లిదే. అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలనాడు బిడ్డలు కాదు అన్నారు. కాలేజీకి వెళ్తున్నాం – అని బయల్దేరి వెళ్తాడు. అక్కడికి తప్ప మిగిలిన అన్ని చోట్లకూ వెళ్తుంటారు. సినిమా హాల్స్, హోటల్సు, పార్క్‌లు, ఇంకా అనేక చోట్ల తిరుగుతూ క్షణం తీరుబడి లేకుండా ఉంటారు. ఎంత బిజీ అంటే, ఇంటి కొచ్చి రెండు మెతుకులు నోట్లో వేసుకునే వ్యవధి కూడా ఉండదు పాపం. ఇక వేరే ఊళ్లల్లో చదువులు వెలగబెట్టే పుత్రరత్నాల గురించి చెప్పనవసరం లేదు.

“ఏం చదువులో ఏంటో, మా వాడు లెటర్ రాస్తే ఒక్క ముక్క అర్థం కాదు. డిక్షనరీ దగ్గరకు పరుగెత్తాల్సిందే” అని ఒక తండ్రి అంటే, “నయంగాదా, మా వాడు లెటర్ రాస్తే, నేను బ్యాంక్‌కు పరుగెత్తాలి…” అని ఇంకో తండ్రి అంటాడు. ఇలాంటి అస్తవ్యస్త జీవితాలతో సతమతమయ్యే సంతానాన్ని చివరకు ఒక దారికి తీసుకొచ్చేది తల్లి మాత్రమే.

ఒక కుర్రాడు తప్పిపోయాడు. ఎవరో తీసుకెళ్లి పోలీసు స్టేషన్లో వదిలేశారు. “మీ నాన్న ఏం చేస్తుంటాడు?” అని పోలీసులు అడిగితే, “ఆడాళ్ల ఎనకాల తిరుగు తుంటాడు” అని చెప్పాడు ఆ కుర్రాడు. అలాంటి మొగుడ్ని గాటు కట్టేసేదీ భార్యే.

ఒక్కొకుటుంబంది ఒక్కో కథ. వ్యథ ఏదైనా అన్నిటినీ భరించేది, సహించేది ఇల్లాలు మాత్రమే. మగాడు భార్యతో కల్సి జీవించనూ లేడు. భార్య లేకుండా జీవించనూ లేడు. ప్రేమిస్తున్నాడో తెలియదు, ద్వేషిస్తున్నాడో తెలియదు. హింసించటం మాత్రం తెలుస్తుంది.

ఒకామె విడాకుల కోసం కోర్టులో దావా వేసింది. జడ్జిగారు అడిగారు “నీ భర్త నిన్ను వదిలేసి పదేళ్లు అయిదంటున్నావు. అయిదేళ్ల కొడుకూ, మూడేళ్ల కూతురు ఉన్నారు గదా?” అంటే ఆమె ఏం చెప్పిందంటే “ఏం జెయ్యమంటారు సారూ, ఏడాదికోసారి వచ్చి, క్షమించు, క్షమించు అంటూ మీద పడిపోతాడు” అని.

ఎన్నిరకాల మనుషులు? ఎన్ని రకాల వేషాలు? ఎన్నిరకాల మోసాలు? ఇన్నిటినీ తట్టుకొని నిలబడుతూనే ఉంది స్త్రీ.

కాలమాన పరిస్థితులు మారే కొద్దీ కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికి అమ్మాయిలు, అన్నింట్లోనూ అబ్బాయిలతో పోటీపడుతున్నారు.

అబ్బాయి ‘నేను యం.టెక్’ అంటే ‘అయితే ఏంటి?’ అంటోది అమ్మాయి. ‘నేను అమెరికా కంపెనీలో ఉద్యోగం చేస్తన్నాను. నెలకు లక్షన్నర జీతం’ అంటే ‘అయితే ఏంటి? నేను ఒక కంపెనీకి యం.డి.ని’ అంటోది అమ్మాయి.

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. గనుక ఆడవాళ్ల పని, ఇది మగవాళ్ల పని అన్న విభజన రేఖ చెరిగిపోయింది. అయ్యగారు కూడా అబ్బాయి డైపర్లు మారుస్తున్నారు. అమ్మగారు వచ్చేటప్పడికి వంట చేసి, టేబుల్ మీద అన్ని రెడీగా ఉంచుతున్నారు.

ఇది వరకు కార్లు, స్కూటర్లూ మగవాళ్లే నడిపేవాళ్లు. ఇప్పుడు అమ్మాయిలు ‘ఎనకమాల కూకోరా బావా?’ అని రయ్ మని దూసుకుపోతున్నారు.

పోలీసు శాఖలో మగవాళ్లే ఉండేవాళ్లు. ఇప్పుడు స్త్రీలకు ప్రత్యేక విభాగాలే ఉన్నయి. సైనికలుగా మగవారే ఉండేవారు. ఆర్థిక నిపుణులూ మగవారే కనిపించేవారు. కాలం మారింది, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి స్త్రీయే అయి ఇంటినీ, దేశాన్నీ నడిపిస్తున్నది. స్త్రీ అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోతోంది నిప్పులు చిమ్ముకుంటూ.

అమ్మమ్మతరంలో, ఆమె ఇంటినీ, పిల్లలనీ చూసుకుంది.

అమ్మ తరంలో ఆమె ఇటు ఉద్యోగాన్నీ, అటు సంసారాన్ని ఓలలాడించింది.

అమ్మాయి తరంలో పెద్ద పెద్ద కంపెనీలనూ, రాష్ట్రాలనూ, రాజకీయాలనూ, దేశాలనూ ఒంటి చేత్తో ఒక ఊపు ఊపుతోంది.

ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడూ, ఆమె మంత్రివర్గంలో అంతా మగవారే ఉండేవారు. కానీ వ్యాఖ్యాతలు మాత్రం ‘she is the only male minister, among the entire women cabinet’ అనేవారు.

అదీ పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here