చిరుజల్లు-23

0
7

ఎదురు చూసి… ఎదురు చూసి…

[dropcap]సుం[/dropcap]దరేశం పార్కులో కూర్చుని చిదంబరం కోసం ఎదురు చూస్తున్నాడు. రోజూ అయిదింటికల్లా ఠంచనుగా పార్కులో ఆ బెంచీ మీద వాలిపోయే చిదంబరం ఇవాళ ఎందుకనో అయిదున్నర అయినా అతీ గతీ లేడు.

చిదంబరం అతనికి ఏమంత బంధువూ కాదు, చిరకాల స్నేహితుడు కాదు. రెండు నెలల కిందట ఈ పార్కులోనే, ఈ సిమెంటు సింహాసనం మీదనే కూర్చుని, తనని చూసి నవ్వుతూ సగం సింహాసనాన్ని తనకు ఇచ్చాడు.

అప్పటి నుంచీ రోజూ ఎన్నో విషయాలు చెబుతూ, మానసికంగా దగ్గర అయ్యాడు. ఇంత వరకు సుందరేశానికి అంత సన్నిహితంగా వచ్చిన వాళ్లు గానీ, అంత హితంగా, అమితంగా అతనితో మాట్లాడిన వాళ్లు గానీ లేరు. సొంత కుటుంబ విషయాలూ చిదంబరం ఏ మాత్రం దాపరికం లేకుండా చెబుతున్నాడు.

“నా కొడుకూ, కోడలూ మాదాపూర్‌లో ఉంటారు. ఇద్దరూ చెరో లక్ష సంపాదించుకుంటారు. అయినా సరే, నేను వాళ్ల దగ్గర నుంచీ పైసా ఆశించను… మరీ బలవంతం చేసినప్పుడు ఎప్పుడన్నా వాళ్లింటికి వెళ్లినా, ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుంటాను ఆ…, ఆ ఇంట్లో నుంచి బయటకొస్తే, చెప్పొద్దూ నాకు టాయలెట్‍లో నుంచి బయటికొచ్చినంత ఫ్రీగా ఉంటుంది ఆ… ఇక్కడ చెట్ల కింద ఉన్నంత హాయి ఇంకెక్కడా ఉండదు… ఆ…” అని చిదంబరం చెబుతుంటే, సుందరేశానికి అచ్చంగా తన మనస్సులోని మాటే చెబుతున్నాడనిపించేది.

చిదంబరం ఒకటి రెండు సార్లు సుందరేశం కుటుంబ విషయాలు అడిగినా, అవి ఏమంత చెప్పుకోదగినవి కానందు వల్ల, తన సంగతులేవీ అతనికి చెప్పలేదు.

ఇవాళ ఎందుకో తన చరిత్ర అంతా విప్పి చెప్పాలన్నంత ఆత్రంగా ఉంది. కానీ చిదంబరం ఎందుకో ఇంకా దిగబడలేదు. రాకుండా ఉండడు. వస్తాడు. సుందరేశం ఎదురు చూస్తున్నాడు. గేటు వంకే చూస్తున్నాడు.

సుందరేశానికి గతమంతా కళ్ల ముందు కదులుతోంది.

పేదరింకంలో పుట్టాడు. పేదరికంతో పెరిగాడు. జీవితమంతా దారిద్య్రంతోనే సహజీవనం చేశాడు.

అయిదారేళ్ల వరకు ఏం జరిగిందో అతనికి తెలియదు. తండ్రి లేడు. తల్లి నిజంగానే అనాథ అయింది. పిల్లాడికి పేరు కూడా స్కూలుకు తీసుకెళ్లినప్పుడు, టీచర్ పెట్టాడు సుందరేశం అని.

తల్లి రోజూ పిల్లవాడిని స్కూలులో వదిలి, పనిలోకి వెళ్లేది. వాడు ఇంటికొచ్చి, అమ్మ కోసం ఎదురు చూసి, ఎదురు చూసి ఆకలితో అలమటించి శోష వచ్చి పడిపోయేవాడు. తల్లి వచ్చి, చెంపల మీద సున్నితంగా తట్టి నిద్ర లేపి, రెండు ముద్దలు అన్నం నోట్లో పెట్టేది.

ఒంటి మీద ఉన్న చొక్కా, లాగూ ఎవరో దానం చేసినవే. ఉంటున్న ఇల్లూ, ఇల్లు కాదది పూరిల్లు… ఎవరి దయతోనో దొరికినదే.

పలకా, బలపమూ పంతులుగారి పుణ్యమే. ఎలిమెంటరీ స్కూలు దాటే వరకూ అలాగే గడిచింది. రెండేళ్లు హైస్కూలుకు వెళ్లినా, అది తన వంటికి సరిపడదని వెళ్లడం మానేశాడు.

ఇరవై ఏళ్ల దాకా ఊరంతా తిరగటం తప్ప మరో పని లేదు. తల్లి చనిపోయాక, ఆ ఉరితో ఉన్న అనుబంధమూ తీరపోయింది.

“ఇక్కడ నీకు తాడూ బొంగరం లేదు గదా… నగరానికి వెళ్లు. ఏదైనా పని చేసుకొని బతకొచ్చు” అని ఒకరిద్దరు సలహా ఇస్తే నగరానికి వచ్చాడు.

ఊరి చివర ఎక్కడో ఒక చిన్న ఆశ్రయం సంపాదించాడు. ‘ధనము నిప్పచ్చరంబు, విద్యయు హుళక్కి’ అన్నట్లు చేతిలో డబ్బూ లేదు. నోట్లో అక్షరం ముక్కా లేదు. దొరికిన చోట దొరికినది తిని పడుకోవటమే అన్నట్లుగా రోజులు గడుస్తుండగా…

ఎండిన మానులా ఉన్న జీవితానికి చిన్న చిరుగు తొంగిచూసింది. అదీ ఎదురు చూసి… ఎదురు చూసి… ఎదురు చూసి నందువల్లనే.

రోజూ తొమ్మిది గంటలకు బస్ స్టాప్ లోకి ఒక అమ్మాయి వచ్చేది. ఆమెకు సుందరేశం అక్కడే తారసపడ్డాడు.

ఉదయం, సాయంత్రం ఆ అమ్మాయి బస్సు ఎక్కే సమయానికి, దిగే సమయానికి ఎదురుగా ప్రత్యక్షమయ్యేవాడు.

మొదట్లో కోర చూపులు, ఓర చూపులు… రాను రాను చూపులు కోలాటాల కోలాహలాలు మొదలైనయి.

చూపరి చూపులతోనే చూచాయ మనసు తెలిపేది. ఒకప్పుడు దూరంగా నిలబడేది. కొంచెం కొంచెం దగ్గరగా నిలబడసాగింది. అనుకోకుండా చేతులు తగిలినప్పుడు, అనుకున్నదేదో అయినట్లు అనిపించేది.

ఒక రోజు చిన్న కాగితం ముక్క కింద పడేసింది. అతను దాన్ని తీసుకున్నాడు. దాని మీద ‘నా పేరు చూడామణి’ అని ఉంది.

సుందరేశానికి గొప్ప మణి దొరికింది. అతని జీవితం గొప్ప మలుపు తిరిగింది.

సుందరేశం రోజూ ఆమెను వెంబడించేవాడు. సిటీలో ఒక బట్టల దుకాణంలో ఆ అమ్మాయి సేల్స్ గర్ల్. ఆ దుకాణం ముందరే సుందరేశం జెండా పాతేశాడు.

మెల్లిగా మాటలు కలిశాయి.

“మేము పేదవాళం…” అన్నది ఆ అమ్మాయి – చూడామణి.

“నేనూ పేదవాడినే…” అన్నాడు సుందరేశం.

“పెళ్లి ఖర్చు పెట్టుకోలేం.”

“నాకూ ఎవరూ లేరు. ఏ ఖర్చులూ లేవు. ఆదాయమూ లేదు మరి” అన్నాడు సుందరేశం.
“డబ్బు లేకపోవటం దారిద్ర్యం కాదు. ఏ పని చెయ్యాలని లేకపోవటం, చెయ్యక పోవటం అదీ అసలైన దరిద్రం…” అన్నది చూడామణి.

“రేపటి నుంచి ఏదో ఒక పని చేస్తాను… తరువాతే నీకు కనిపిస్తాను” అన్నాడు సుందరేశం.

వారం రోజుల తరువాత కనిపించాడు,

“రోజూ అయిందింటికి లేచి, కాలనీలో అందరి ఇళ్ళల్లో పేపరు వేస్తున్నాను. ఏడింటికి ఎమ్మెల్లే ఇంటికి వెళ్లి, మొక్కలకు నీళ్లు పోసి, ఆయన తండ్రి ముసలాయనకు అన్నీ అందించి, ఇంటి కొచ్చిన వాళ్లందర్నీ కూర్చోబెట్టి, అయ్యగారు చెప్పిన పనులన్నీ చేసి,… సాయంత్రం ఇంటికెళ్తున్నా….” అన్నాడు సుందరేశం.

రెండు నెలల తరువాత సుందరేశానికి, చూడామణికి పెళ్లి అయింది. ఇన్ని నెలల ఎదురు చూపులకు ఫలితం దక్కింది.

***

సందరేశం పార్కులో కూర్చుని చిదంబంరం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరున్నర అయింది. ఇవాళ ఎందుకనో ఇంకా రాలేదు. వస్తే చిదంబరానికి తన కథ అంతా పూర్తిగా చెప్పాలనుకుంటున్నాడు.

ఎదురు చూస్తున్నాడు. గేటు వంకే చూస్తున్నాడు.

మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయాడు.

ఇటు సుందరేశానికి ,అటు చూడామణికి కూడా ఏదో ఒక గొప్ప సామ్రాజ్యాన్ని జయించినంత ఆనందంగా ఉంది… కొత్త కాపురం, కోరిన వరం… అప్పటి వరకూ నిరామయంగా, నిరుత్సాహంగా, నీరసంగా గడిచిన రోజులన్నీ, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో, ఉత్తేజంతో పరుగులు తీస్తున్నాయి.

సందరేశానికి కొడుకు పుట్టాడు. అతని సంతోషం అంతా ఇంతా కాదు. వాడికి శ్యాం అని నామకరణం చేశారు.

ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఖర్చు పెరిగింది. భార్యాభర్తలు ఇధ్దరూ మరింత పొదుపు చెయ్యటం నేర్చుకున్నారు. కొన్ని అవసరాలను త్యజించారు.

కాలం పరుగులు తీసింది.

శ్యాం హైస్కూలు చదువుకు వచ్చాడు. సుందరేశం ఎం.ఎల్.ఏ. గారి కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడి బామాలి కొడుకును మంచి ఖరీదైన స్కూలులో చేర్పించాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు అయింది.

ఆ స్కూలులోని అందరు పిల్లలు కార్లలో వచ్చేవారు.

“మనకి కారు ఎందుకు లేదు?” అని అడిగాడు కొడుకు.

“కారు కొనటానికి మన దగ్గర అంత డబ్బు లేదు…”

“డబ్బు మన దగ్గర ఎందుకు లేదు? వాళ్ల దగ్గర ఎందుకు ఉంది?”

సుందరేశం దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు.

ఒక ఏడాది గడిచింది. స్కూలులో గొప్పవాడి కొడుకు ఒకడు ఏదో అన్నాడని శ్యాం తన క్లాసులోని వాడిని కొట్టాడు. వాడి తండ్రి పోలీసు కేసు పెట్టాడు.

శ్యాంను వారం రోజులు బాల నేరస్థుల హోంలో ఉంచారు.

వాడు మరీ రెచ్చిపోయ్యాడు.

కాలేజీ చదువుకు వచ్చాక లోకం మీదనే కక్ష పెంచుకున్నాడు. ఒక పారిశ్రామికవేత్త కొడుకును పట్టుకొని వేదిక మీదనే దులిపేశాడు.

“నీ అయ్య ఎలా పారిశ్రామికవేత్త అయ్యాడు? నీ తాత పొలాలు, ఇళ్లూ అమ్మి డబ్బు తెచ్చి పెట్డాడా? లేదే… బ్యాంకు నుంచి తీసుకొచ్చాడు. పోనీ ఎన్నడన్నా, ఒక రోజు ఫాక్టరీలో పని చేశాడా? లేదే? కాపిటల్ లేదు లేబరూ లేదు. కానీ కోట్ల లాభాలు మీవి? ఏం? కాదనగలవా?” అని అడిగాడు.

శ్యాం ధోరణి ఎవరికీ నచ్చలేదు. కాలేజీ చదువు పూర్తి కాకుండానే మానేశాడు. విప్లవోద్యమంలో చేరాడు.

“నా కోసం వెతకొద్దు. నాకు వీలున్నప్పుడు వచ్చి పోతుంటాను” అని ఒక చీటీ రాసి పెట్టి చీకట్లో కల్సిపోయాడు.

అప్పటి నుంచీ సుందరేశం కొడుకు కోసం రోజూ రాత్రిళ్లు ఇంటి ముందు కూర్చుని ఎదురు చూస్తూనే ఉన్నాడు…

ఎప్పుడో ఒక పండగ ముందు రోజు రాత్రి వచ్చి తల్లీ, తండ్రితో మాట్లాడి వెళ్లాడు.

“ఎక్కడికి వెళ్లావు? ఏం చేస్తున్నావు?” అని అడిగింది చూడామణి.

“ఈ సమాజంలో అడుగడుగునా కుడి ఎడమల దగా, దగా. సమాజాన్ని మారుస్తాను…” అన్నాడు శ్యాం.

“సమాజాన్ని మార్చాలంటే, నువ్వు సమాజంలో ఉండి నలుగుర్ని నీ వైపు ఆకర్షించుకోవాలి గదా… సమాజానికి వెలి అయి, బలి అయి, సమాజాన్ని ఎలా మారుస్తావు?” అని అమాయకంగా అడిగింది చూడామణి.

“మాటలతో, నీతి లేని చట్టాలతో ఇది మారదు. తూటాలతో మారుస్తాం…” అన్నాడు పట్టరాని ఆవేశంతో.

చీకట్లో నుంచి వచ్చి, చీకట్లో వెళ్లిపోయ్యాడు.

ఆరు నెలల తరువాత ఒక రోజు మధ్య రాత్రి వచ్చి తలుపు తట్టాడు. ఒక అమ్మాయిని వెంట తీసుకొచ్చాడు.

“నా భావాలు నచ్చి, నన్ను పెళ్లి చేసుకుంది. మీ కోడలు” అన్నాడు శ్యాం.

ఆ అమ్మాయికి పెళ్లి అయిందని చెప్పగల చిహ్నాలేమీ లేవు.

“నీ పేరు?” అని అడిగింది చూడామణి.

“విప్లవి…” అని అన్నది అమ్మాయి.

ఇద్దరికీ అన్నం వండి పెట్టింది. తిని వెళ్లిపోయ్యారు.

ఇంకో ఏడాది తరువాత, విప్లవి నిండు గర్భిణిగా వచ్చింది.

మర్నాడు చూడామణి కోడల్ని ఒక ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

చూడామణికి మనవడు పుట్టాడు. ఒక వారం రోజులు అయినాక శ్యాం వచ్చి భార్యను తనతో తీసుకుపోయాడు.

ఈ పసివాడిని ఏం చెయ్యాలో చూడామణికి తెలియలేదు.

అన్నట్లు చూడామణి ఇప్పుడు బట్టల కొట్లో సేల్స్ గర్ల్ కాదు. ఆ షాపు యజమాని ఒక పెద్ద మాల్ పెట్టాడు, తమ్ముడితో కల్సి.

ఆ మాల్‌లో చూడామణి ఇప్పుడు వంద మంది పని వాళ్ల మీద సూపర్‌వైజర్. యజమానికీ, ఆయన తమ్ముడికీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, అన్నీ ఆమె అయింది. ఆదాయమూ బాగా పెరిగింది.

యజమాని తమ్ముడు కుబేరుడే అయినా, పిల్లలు లేరు. తన మనవడిని ఆయనకు పెంపుడు కొడుకుగా ఇచ్చింది వాళ్ల కోరిక మీద.

శ్రీమంతుడి ఇంట్లో తన మనవడి వైభోగం చూసే భాగ్యం లేకుండానే, రెండేళ్లు కాన్సర్‌తో తీసుకొని చనిపోయింది.

ఇవన్నీ సుందరేశం, చిదంబరానికి చెప్పాలనుకున్నాడు. కానీ ఎందుకనో చిదంబరం ఇవాళ రాలేదు, రాత్రి ఎనిమిది అయినా.

***

సుందరేశం వృద్ధాశ్రమంలో కన్ను మూశాడు.

అతని అంత్యక్రియలు ఎవరు చేయాలో ఆ ఆశ్రమం వారికి తెలియదు. సుందరేశం కోసం డబ్బు పంపిస్తున్న ఒక యువకుడి అడ్రసు అతని డైరీలో దొరికింది.

అతనికి ఫోన్ చేశారు.

“నేను వెంటనే బయల్దేరి వస్తున్నాను. నేనే అంత్యక్రియలు చేస్తాను…” అన్నాడు ఆ యువకుడు.

అంత పెద్ద శ్రీమంతుడి కొడుకు, ఈ నిరుపేదకు అంత్యక్రియలు చేయటానికి అమెరికా నుంచి రావటం ఆశ్రమం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది.

సుందరేశం బాడీ మార్చురీలో… ఉంచారు

అతని శవం ఎదురు చూపులు చూస్తోంది… రెండు రోజుల నుంచీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here