చిరుజల్లు-25

0
5

రాంగ్ నెంబర్

[dropcap]ఫో[/dropcap]న్ మోగింది. కొత్త నెంబరు. అతనికి పరిచయస్థుల నెంబరు కాదు. అయినా సరే ఎవరో, ఏమో అని రిసీవ్ చేసుకున్నాడు.

అవతలి నుంచి వడగళ్ల వానలాగా బడబడబడ దబాయింపు మొదలైంది.

“ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? నువ్వొక పెద్ద గవర్నరు అనుకుంటున్నావా? ప్రెసిడెంటు అనుకుంటున్నావా? నిన్న పదింటికి వస్తానన్నావు. రోజంతా నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వు పది చోట్లకు పోవాలి. గంట గంటకీ సంపాదించుకోవాలి. నేనేమో నా పనులన్నీ మానుకొని, నీ కోసం రోజంతా ఎదురుచూస్తూ ఉండాలి. రాకపోతే రానని చెప్పాలి. వేరొకడ్ని చూసుకుంటాను. నాకు చచ్చినన్ని పనులున్నాయి. మిగిలిన పనులన్నా చూసుకునేదాన్ని, రోజంతా వేస్ట్ చేశావు. ఏం మనిషివయ్యా నువ్వు? ఇవాళ అయినా వస్తావా, రావా, ఏదో ఒకటి చెప్పు. నన్ను వెయిటింగ్‌లో పెట్టొద్దు. చెడ్డ చిరాగ్గా ఉంది” అని ఆగింది చారులత.

“మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, వస్తాను….” అన్నాడు పతంజలి.

“అదేంటి? కొత్తగా అడుగుతున్నావు? మా ఇల్లు తెలియదా?” అని దబాయించింది చారులత.

“మీ ఇల్లే కాదు. మీరు ఎవరో కూడా తెలియదు. మొదటిసారిగా మీ కోకిల కంఠాన్ని వింటున్నాను” అన్నాడు పతంజలి.

“సారీ, అండీ. రాంగ్ నెంబరు. ఏమనుకోకండి. మా ప్లంబర్ అనుకున్నాను… నిన్న వస్తానన్నాడు. రోజంతా ఎదురు చూశాను. బాత్ రూంలో నీళ్లు రావటం లేదు. ఎంత ఇబ్బందిగా ఉందో? ఈ పనివాళ్లు తెగ ఏడిపించేస్తున్నారండీ” అన్నది చారులత.

“పోనీ, మా ప్లంబర్‌ను పంపించమంటారా” అన్నాడు పతంజలి.

“ప్లీజ్. చాలా అవస్థగా ఉంది…”

“మీ ఇంటి అడ్రసు చెప్పండి” అన్నాడు పతంజలి.

ఆమె చెప్పింది.

“దగ్గరే… ఒక గంటలో పంపిస్తాను…” అన్నాడు. అన్నట్లుగానే రెగ్యులర్‌గా తమ ఇంట్లో పని చేసేస ప్లంబర్‌కి ఫోన్ చేసి పంపించాడు.

అతను వెళ్లాడు. పని చెయ్యటం పూర్తి అయ్యాక ఆమె మళ్లీ ఫోన్ చేసి థాంక్స్ చెప్పింది.

“చిన్న విషయాలే గానీ, కొన్ని సార్లు ఎంత ఇబ్బంది పెడతాయో చెప్పలేం” అన్నది చారులత.

“సొంత ఇల్లు అన్నాక, సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొంత మంది పని వాళ్లను టచ్‌లో ఉంచుకోవాలి…” అన్నాడు పతంజలి.

“నిజమే. నేను ఎవర్నీ టచ్‌లో ఉంచుకోవటం లేదు…” అన్నదామె.

ఒక వారం తరువాత మళ్లీ ఫోన్ చేసింది.

“మీకు తెల్సిన ఎలక్ట్రీషియన్ ఎవరైనా ఉన్నారా?” అని అడిగింది.

“అలాగే, పంపిస్తాను” అన్నాడు పతంజలి.

అతను వెళ్లటం పని చేసి పెట్టడం, ఆమె థాంక్స్ చెప్పటం షరా మామూలే.

రెండు వారాల తరువాత మళ్లీ ఫోన్.

“నేనేనండీ చారులతను…”

“మళ్లీ ఏమొచ్చింది?”

“ఏమొచ్చిందంటే, ఏం చెప్పమన్నారు… మీరే అన్నారు గదా… ఇల్లు అన్నాక ఏదో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటయి అని. మా టీ.వీ.లో వీడియో వస్తోంది గానీ, ఆడియో రావటం లేదు… ఎవరైనా ఉన్నారా?”

“టీ.వీ.లు ఎవరికీ ఇవ్వకండి. ఆ కంపెనీ సర్వీసు సెంటర్‌కి ఫోన్ చెయ్యండి…”

“నాకు తెలియదే…”

“ఏం టీ.వీ. మీది?”

“శాంసంగ్…”

పతంజలి ఆ కంపెనీ సర్వీస్ సెంటర్‌కి ఫోన్ చేసి, చెప్పాడు. వాళ్లు వచ్చి రిపేరు చేసి ఇచ్చారు.

“చాలా చాలా థాంక్స్ అండీ” అన్నది చారులత.

“నాకెందుకు థాంక్స్. నేను చేసిందేముంది ఇందులో…”

“అయ్యో, భలే వారే… తెలియనివన్ని తప్పులని దిట్టతనాన పలుకగరాదన్నట్లు, ఏది తెలియకపోయినా మీరే కదా చెబుతున్నారు… అన్నట్లు వినాయక చవితి రేపా, ఎల్లుండా?”

“ఎల్లుండే…”

“చూశారా… సర్వజ్ఞులు మీరు…”

“మీరు తిడుతున్నారో, పొగుడుతున్నారో తెలియటం లేదు…”

“మీది మరీ విడ్డూరం గాక పోతే, తిట్టడం ఎలా ఉంటుందో మీకు తెలియదా ఏమిటి?”

పది రోజుల తరువాత.

“నేనేనండి. ఇప్పుడు కొద్దిగా డబ్బు దాచుకోవాలంటే, బ్యాంకులో యఫ్.డి. వేయటం మంచిదా? పోస్టాఫీసులో వేయటం మంచిదా?”

“అయిదారేళ్ల దాకా అవసరం లేదనుకుంటే, పోస్టాఫీసులోనే వెయ్యండి…”

నెల రోజుల తరువాత…

“మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలని ఉందడి. మీకు వీలుంటుందా?”

“మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా నాకు వీలవుతుంది” అన్నాడు పతంజలి.

“అయితే రేపు సాయంత్రం ఆరింటికి హైదరాబాదు సెంట్రల్ దగ్గర మీ కోసం కన్నుల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తుంటా…”

“ఎదురు చూడండి గానీ, కళ్లల్లో చమరు పోసుకొని, వత్తులేసుకొని… ఇలాంటి పిచ్చి పనులు చేయకండి…”

“అట్లే కానిండు… కానీ అక్కడేమీ కొనొద్దు. ముందే చెబుతున్నాను…” అని అన్నది.

అనుకున్న సమయానికి, అనుకున్న చోట తారట్లాడుతుంటే, ఒక అపురూపమైన అందచందాల బాల ఎదురుగా వచ్చింది. ఫోన్‌లో పలకరించి ఆమెనని నిర్ధారించుకుని దగ్గరకు వెళ్లాడు.

“ఏంటి నములుతున్నారు?” అని అడిగింది.

“కాలక్షేపం కోసం… మసాలా పల్లీలు…” అంటూ నాలుగు పల్లీలు ఆమె చేతులో పోశాడు.

“ఇష్టమైన వాళ్లు పల్లీలు ఇచ్చినా, అవి వజ్రవైఢూర్యాలకన్నా విలువైనవిగా ఉంటాయి…” అన్నది చారులత.

అయిదు నిముషాల తరువాత క్యాంటిన్‍లో కూర్చున్నాక పతంజలి అన్నాడు “చారులత అంటే, ఏదో ఒక గడకర్రకు డ్రెస్ వేసినట్లు, నల్లగా, పొడుగ్గా ఉంటుందనుకున్నాను గానీ…”

“మా నాయనమ్మ పేరు నాకు పెట్టారు…”

“పర్లేదు. మీ నాయనమ్మకు ఆ రోజుల్లో మంచి పేరే పెట్టారు…”

“ఇంతకీ, నన్ను చూసి ఏమనుకున్నారు?…”

“నేను చూస్తే పర్లేదు. పెద్ద ప్రాబ్లం లేదు. అదే వేయి కన్నుల వాడు ఒక కన్ను మీ మీద వేస్తే, శచీదేవికి సవతి పోరు తప్పదు మరి…”

“అల్లాంటి వాడిని నేను క్రీగంట కూడా చూడను…”

“ఎందుచేత?”

“వాడు దేవేంద్రుడే కావచ్చు. కారెక్టర్ ముఖ్యం…” అన్నది చారులత.

“అదీ నిజమే…” అన్నాడు పతంజలి.

అతను తినటానికి, తాగటానికి ఏవేవో తెచ్చి పెట్టాడు.

“ఏమీ వద్దన్నాను గదా…”

“క్యాంటిన్ వాడు ఏమన్నా ఫీల్ అవుతాడని…”

కాసేపటికి మాల్‌లో తిరగటానికి వెళ్లారు.

“ఏమన్నా తీసుకోండి…” అన్నాడు పతంజలి.

“ఏమీ కొనొద్దు అన్నాను గదా…”

“అవునంటే కాదనిగదా… ముందు నుంచే కొనొద్దు, కొనొద్దు అంటే, కొనమని గుర్తు చేయటమే గదా…” అన్నాడు.

“మీకు అలా అర్థం అయిందా?” అన్నది.

“చిన్న గిఫ్ట్… చేతి వాచీ తీసుకోండి…”

“ఎందుకని?”

“వాచీ అయితే, మీ చేతిని అంటి పెట్టుకొని ఉంటుంది. చేతిని నేను పట్టుకున్నట్లే ఉంటుందని…”

వద్దన్నా వినకుండా ఆమెకు వాచీ కొని ఇచ్చాడు.

అక్కడ నుంచీ వారానికీ, పదిరోజులకీ ఎక్కడో ఒక చోట కలుస్తూనే ఉన్నారు. కలిసినప్పుడల్లా అతన్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. ఇష్టాయిష్టాలను, మరీ ముఖ్యంగా అలవాట్లనూ, గుణగణాలను పరీక్షిస్తూనే ఉంది. ఆ విషయం అతనికీ తెలుస్తూనే ఉంది.

ఒక రోజు ఫోన్ చేసింది.

“మా వాళ్లు అందరూ తిరుపతి వెళ్లారు. రెండు రోజుల దాకా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను. మీరు నాకు కంపెనీ ఇవ్వొచ్చుగదా…”

“ఇది అసలు, యాసిడ్ టెస్ట్ అన్నమాట…”

“అంటే?”

“ఏం లేదు… నువ్వు అడగటం, నేను కాదనటమూనా? అలాగే వస్తాను… ఎప్పుడు రావాలి?”

“సాయంత్రం రండి. ఇవాళా, రేపూ అన్నీ ఇక్కడే…”

“అన్నీ… అంటే?”

“తిండీ, తిప్పలూ, నిద్రా, గిద్రా, స్నానం, గీనం… అన్నీ…”

“అంతకన్నానా?… మహద్భాగ్యం…”

సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు.

భోజనానికి రెస్టారెంట్‌కి వెళ్లారు.

“తినే ముందు ఏమన్నా తాగుతారా?” అని అడిగింది.

“మంచి నీళ్లు తాగుతాను…”

“అది కాకుండా… విస్కీ, బీరు?…”

“అలవాటు లేదండి… అస్సలు అలవాటు లేదు…”

“ఎందుచేత?”

“ఎందుచేత అంటే, మొదటి నుంచీ మాది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్‌లో కూడా మిడిల్… అంచేత ఖరీదైన అలవాట్లు ఏమీ లేవు… బతకటానికి ఎంత వరకు అవసరమో, అంత వరకే అలవాటు చేసుకున్నాను…”

తినేసి, ఇంటి కొచ్చిన తరువాత, బాల్కనీలో కూర్చున్నారు. వర్షం కురుస్తోంది. అతను నవ్వుతున్నాడు.

“ఎందుకు నవ్వుతున్నారు?”

“ఏదో జోక్ గుర్తొచ్చింది…”

“చెబితే, నేనూ నవ్వుతాను గదా…”

“నా లాంటి వాడు ఒకడు, మీలాంటి వాళ్ల ఇంటికి ఇలాంటి రాత్రి పూటే వస్తే, ఇలాంటి వర్షమే పట్టుకుంది. ఆమె ఆ రాత్రికి వాళ్ల ఇంట్లోనే పడుకోమని బెడ్ రూం చూపించింది. ఒక గంట తరువాత చూస్తే, అతను వర్షంలో తడిసి ముద్ద అయిపోయి, లోపలికి వచ్చాడు. ఎందుకు వర్షంలో తడిశావు అని అడిగింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోమన్నారు గదా… ఇంటికెళ్లి పైజామా తెచ్చుకున్నాను…”

“వాడెవడో, మీలాంటి వాడే… అవునుగానీ, పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి?”

“పెళ్లి చేసుకోవటం వేస్ట్ అనిపిస్తోంది. దాని వల్ల సుఖం కన్నా కష్టమే ఎక్కువ…” అని ఆగాడు.

మళ్లీ అతనే అన్నాడు.

“పెళ్లి తరువాత దశ పిల్లలు. మన ప్రాణాలన్నీ వాళ్ల మీద పెట్టుకొని పెంచుతాం. తరువాత రెక్కలు రాగానే రివ్వున ఎగిరి పోతారు. అలా ఎగిరిపోయిన వాళ్లనే తల్చుకుంటూ మిగిలిన జీవితమంతా కుమిలిపోవటం… యవ్వనమంతా ఎదురు చూడటం, వృద్ధాప్యం అంతా వెనుతిరిగి చూడటం… ఇదే జీవితం…”

చారులత నిట్టూర్చింది.

కాసేపటికి అతని బెడ్ రూం చూపించింది. “ఇందాక మీరు చెప్పినట్లు ఈ వానలో ఎక్కడికీ వెళ్లకుండా, ఇక్కడే పడుకోండి. నేను ఎదురుగా రూంలోనే పడుకుంటాను. ఏమన్నా కావాలంటే, వచ్చి లేపండి… మొహమాటపడకండి… మీ ఇల్లే అనుకోండి…”

“అలాగే నండి.. మా ఇల్లే అనుకుంటా…” అన్నాడు తనకు చూపించిన రూంలోకి వెళ్తూ.

మర్నాడు మధ్యాహ్నం “నేను కంపెనీ మారుదామనుకుంటున్నాను. నా రెజ్యూం తయారు చేసి పెట్టండి…” అనడిగింది.

“ఎన్ని పరీక్షలురా దేవుడా? రిటెన్ టెస్ట్ కూడానా?” అని అనుకున్నాడు.

అనుకున్నట్లుగానే ఆమె వేరే కంపెనీలో చేరింది.

ఇంక అక్కడి నుంచీ అతన్ని కలవటం తగ్గిపోయింది. కొన్నాళ్లకు అసలు మానేసింది.

“ఈ కంపెనీలో పని చాలా ఎక్కువగా ఉంటోంది. ఇరవైనాలుగు గంటలూ చాలటం లేదు” అన్నది ఒకసారి.

“మా మేనేజర్ చాలా డైనమిక్ పర్సనాలిటీ. అలాంటి వాడిని నూటికో, కోటికో ఒక్కడ్ని గాని చూడలేం” అన్నది.

కొన్నాళ్లకు ఫోన్ చేసి చెప్పింది. తన పెళ్లి గురించి. వెడ్డింగ్ కార్డు వాట్సప్‌లో పెట్టాను – చూడమంది.

అతను వాళ్ల పెళ్ళికి వెళ్లలేదు.

***

చాలా ఏళ్లు గడిచిపోయాయి. పతంజలి అంచెలంచెలుగా ఎదిగి ఒక యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్ అయ్యాడు.

పని మీద ఢిల్లీ వెళ్లి వచ్చాడు. పర్సనల్ అసిస్టెంట్ చెప్పాడు.

“ఎవరో చారులత అట అండీ, రెండు రోజుల నుంచీ ఫోన్ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలట…”

ఫోన్‌లో చెప్పింది. “చాలా కాలం అయింది. బహుశా నేను గుర్తు ఉండకపోవచ్చు. మీతో ఒక విషయం మాట్లాడాలని చేశాను…”

“దేని గురించి?” అని అడిగాడు.

“మా అమ్మాయి చదువు గురించి.. అమెరికా వెళ్తానంటోంది… మంచి చెడులు మీతో కల్సి మాట్లాడాలని ఉంది…”

“రేపు మధ్యాహ్నం, మా ఇంటికి లంచ్‌కి రండి…” అన్నాడు.

మర్నాడు ఆమె అతని ఇంటికి వచ్చింది.

ఇద్దరిలోనూ ఎంతో మార్పు. ఆకారాల్లోనే కాదు, ఆలోచనల్లో కూడా.

చారులత క్లుప్తంగా తన కథ చెప్పింది. తన కంపెనీలో అతన్నే పెళ్లి చేసుకుంది. దారుణంగా మానసికంగా దెబ్బతిన్నది. అతనికి లేని దుర్గుణం లేదు. చివరకు డ్రగ్స్ కేసులోను దొరికి పోయాడు. ఉద్యోగం పోయింది.

రెండేళ్ల కిందట పోయాడు.

“పెద్దగా బాధపడలేదు. ఎంతో కాలంగా సలుపుతున్న పుండును కోసి, తీసేసినట్లు అనిపించింది. అంతకన్నా పెద్దగా దిగులు పడిందీ లేదు…” అన్నది చారులత.

“నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు?” అని అడిగింది.

“నువ్వు పెట్టిన పరీక్షలు ఒకటా, రెండా? మొట్టమొదటిసారి కనిపించినప్పుడే చెప్పావు, కారెక్టర్ లేని వాడు దేవేంద్రుడైనైనా చేసుకోనని… చివరకు ఒక దరిద్రుడ్ని చేసుకున్నావు… లలాట లిఖితం… దాన్ని ఎవరూ చెరపలేరు…” అన్నాడు పతంజలి.

చారులత కూతురికి అమెరికా యూనివర్సిటీలో సీటు రావటానికి పతంజలి తన పలుకుబడినంతా ఉపయోగించాడు.

జ్యోత్స్న అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిపోయింది.

ఇప్పుడు చారులతను ఒంటరితనం మరింత వేధిస్తోంది.

ఒక వారం తన ఇంటికి పతంజలిని పిలుస్తోంది. ఒక వారం అతని ఇంటికి తను వెళ్తోంది.

ఒక రోజు రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఆమె ఇంటి బాల్కనీలో కూర్చున్నప్పుడు పతంజలి అన్నాడు.

“నిన్ను నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను…”

“ఇప్పుడు అది అంత అవసరమా?”

“అవసరమే. నేను ఉన్నంత కాలం నీకు ఇబ్బంది లేదు. నేను పోయాక నీకు ఇబ్బంది లేకుండా నీకు ఫామిలీ పెన్షన్ రావాలంటే, పెళ్లి చేసుకున్నట్లు రికార్డుల్లో చూపించాలి…” అన్నాడు.

వర్షం తగ్గింది. అతను బెడ్ రూంలోకి వెళ్లాడు. ఆమె కూడా వెళ్లి తలుపు వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here