చిరుజల్లు-28

0
7

నేరము – శిక్ష

[dropcap]ప్ర[/dropcap]శాంతి ఎన్‌క్లేవ్‌లో నున్న యాబై అపార్ట్‌మెంట్స్ వాళ్లకీ ఎమర్జన్సీ మీటింగు ఏర్పాటు చేశారు. అన్ని అపార్ట్‌మెంట్స్‌లో ఉండే పిల్లా మేకా అంతా సెల్లార్‌లో ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆశీనులైనారు. మరి కొందరు కుర్చీల్లో ఉన్న వారి వెనక నిలబడి ఉన్నారు.

అక్కడున్న యాభై కుటుంబాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాళ్ల మధ్య నున్న సఖ్యత ఉప్పుకీ, నిప్పుకీ ఉన్న దానికి ఏమీ తీసిపోదు. అయినా ఒకరి మొహాలు ఒకరు చూడక తప్పదు. చూసినా వెంటనే స్వగతంలో ‘ఛీ, నీ మోము చూచుటయే మహా పాపము’ అని తన మొహం పక్కకు తిప్పేసుకుంటారు. క్రికెట్ ఆడే వారి సిక్సర్ కిటికీ అద్దాలు పగల గొడుతుంటయి. భక్తి ఛానల్స్ లోని మంత్రోచ్చారణలు, న్యూస్ ఛానల్స్ లోని పలు పార్టీల వాద ప్రతివాదాలతో ఒంటి కాలి మీద పక్క వారి మీదకు కయ్యానికి కాలు దువ్వే ఇరుగు పొరుగు వారితో, ఇండో పాక్ బార్డర్ లాగా ఆ ఎన్‌క్లేవ్ ఎప్పుడూ ఘర్షణలతో, అక్రమ చోరబాట్లతో, విధ్వంసక చర్యలతో, కుట్రలతో, కుతంత్రాలతో ఆ అయిదంతస్తుల భవనం అట్టుడికి పోతుంటుంది.

ఇంత గందరగోళం మధ్యా, దట్టంగా ఉన్న ముళ్ల కంచె మధ్య అందమైన గులాబీ పువ్వు అరవిరిసినట్లు, జన్మ జన్మల నిరీక్షణ తరువాత తారసపడినట్లు, కన్నులతో వలపు వెన్నెలలు గుమ్మరించుకుంటూ అనుక్షణం అనిమిష నేత్రాలతో నిలువెల్ల తడుముతూ, విడలేని కౌగిలి విడిపించుకున్న వారిలా భారంగా నడుస్తూ – ఓ ప్రేమ జంట కూడా ఉన్నది.

అత్యవసర సమావేశం మొదలైంది. ముందు వరసలో కూర్చున్న ప్రదీప్ కుర్చీలో నుంచి లేచి, ఆలస్యంగా వచ్చిన మామ్మగారిని బలవంతంగా తన కుర్చీలో కూర్చోబెట్టి అతను వెళ్లి అశ్వనికి అరగజం దూరంలో నిలబడ్డాడు. కొత్తగా వచ్చే వారికి స్థలం ఇవ్వటం కోసం, సర్దుకుంటూ సర్దుకుంటూ ప్రదీప్ అశ్వని పక్కన చేరాడు – అక్కడ ఆశీనులైయిన్న కురువృధ్ధుల్, కురు వృద్ధ బాంధవులనేకుల్ చూచుచునుండ.

సమావేశం మొదలైంది. వర్షాకాలం మొదలైంది. వర్షాలు కురుస్తున్నయి గనుక తక్షణ చర్యలు – సెల్లార్ లోకి రోడ్డు మీద నుంచి వాన నీళ్లు రాకుండా చెయ్యటం, డ్రెయినేజ్ బ్లాక్ కాకుండా చూడటం, నెలవారీ ఇచ్చే మెయింటెనెన్స్ రేటు పెంచటం, వాచ్‌మన్ జీతం పెంచటం, ఎన్‌క్లేవ్ మొత్తానికి రంగులు వేయటం – లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉంటయి.

మధ్యలో మాధవిగారు ఒక సమస్య తెచ్చారు.

“పై వాళ్ల నుంచీ, వాళ్ల బాత్ రూం పైపు లీక్ అయి, నీళ్లు కారుతున్నాయండీ… అది రిపేరు చేయించమనండి…” అంటుంది.

“మాకేం సంబంధం… అది ఆ పై వాళ్ల నుంచీ వస్తోంది. అది జాయింట్ పైపు కిందదాకా… మా ఒక్కళ్లకీ సంబంధించింది కాదు. కదిలిస్తే యాభైవేలు అవుతుంది…” అంటుంది సుశీలగారు.

కొంత మంది ఈమెను, కొంత మంది ఆమెనూ సపోర్ట్ చేశారు. గోలగోల అయింది.

ఇంకెవరో అన్నారు. “బిల్డింగ్ చూడటానికి అసహ్యంగా ఉంది. రంగులు వేయించాలి…”

“ఇప్పుడేమన్నా పెళ్లా, పేరంటమా? ఎందుకు రంగులు?” అన్నారు మరొకరు.

“అవునండీ, ఎవరిదన్నా పెళ్లి చేయిస్తే సరి…” అన్నాడు ప్రదీప్

అందరూ అతని వేపు చూశారు. అతను అశ్వని వైపు చూశాడు. ఆమె ఇంకెటో చూసింది.

మెయిన్‍టెనెన్స్ ఇంకో వంద పెంచాలన్న అంశం వచ్చింది.

ప్రెసిడెంట్ పెంచాలన్నాడు. సెక్రటరీ వద్దన్నాడు. షరా మామూలే. రెండు గ్రూపులు… అవుననీ, కాదనీ గొడవ.

“వసూలు చేసేదానిలో మీరెంత తింటున్నారో?”ఎవరో అన్నారు.

“తింటం, తాగటం కాదు… అక్కడ లెక్కలున్నయి…”

“లెక్కలదేముంది? మనం ఎంత వేస్తే అంతే…”

“నాతో పెట్టుకోకండి. కాల్చిపారేస్తాను…”

“ఏంటి, నువు కాల్చేది, సిగరెట్టా, చుట్టా…”

“షటప్…”

“యూ షటప్ స్కౌండ్రల్…”

కూర్చున్న వాళ్లల్లో సగం మంది లేచారు.

“ఈ కొలువు కూటమి క్రమక్రమముగా రణరంగముగా మారుచున్నదేమి?” అన్నాడు ప్రదీప్, అశ్వని చెవిలో.

ఆమె అతని వైపు చూసి నవ్వింది వెన్నెలకన్నా చల్లగా. వాళ్లు అందరి మధ్యా ఇరుక్కొని ఉన్నందున అతను ఆమె నడుం మీద చెయ్యి వేశాడు.. ఎవరూ చూడకుండా…

ఆగ్రహవేశాల మధ్య మీటింగ్ వాయిదా పడింది. అందరూ ఒకరినొకరు దూషించుకుంటూ వెళ్లిపోయారు.

టచ్ చేసినందుకు అశ్వని, ప్రదీప్ వంక చూసింది. అందులో ఏ భావమూ లేదు. ఆ భావము అంత కన్నా లేదు.

“తప్పు నాది కాదు. సుమచరుడిది…” అన్నాడు నెమ్మదిగా ఆమె చెవిలో గొణుగుతూ.

అశ్వని ముద్దుగా, బొద్దుగా బంగారు రంగులో, విప్పారిన నేత్రాలతో చూస్తూ, మధువులొలికే అధరాలతో, తడబడే నడకలతో, చందురుని మించు అందమొలికించుతూ ఉంటుంది.

ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ విశాఖలో ఉన్నాడు. అశ్వని ఒక్కతే రెండో అంతస్తులో ఉంటుంది. ప్రదీప్ కూడా ఐ.టి.లో ఉద్యోగం చేస్తూ మూడో అంతస్తులో ఉంటున్నాడు.

ఒక రోజు తెల తెల వారుతుండగానే, ప్రశాంతి ఎన్‍క్లేవ్ కేకలతో, అరుపులతో దద్దరిల్లింది. అందరితో పాటు ప్రదీప్, అశ్వని నిద్ర కళ్లతో లేచి వచ్చారు.

ఒకాయన పెంపుడు కుక్క మెట్లు ఖరాబు చేసింది. అది చూడకుండా ఇంకోకాయన అడుసు తొక్కినట్లు తొక్కాడు. తోక మీద లేచిన పాములా బుసకొట్టాడు. తెలుగులో ‘యువర్ మదర్,’ ‘యువర్ సిస్టర్…’ అంటున్నాడు. రెండో ఆయనా భాషా పాండిత్యం ప్రదర్శిస్తున్నాడు.

“మెట్లు కదా…” అన్నది అశ్వని నైట్ డ్రస్‍లో డ్రీమ్‌నెస్‌తో.

“కుక్క కదా… ” అన్నాడు ప్రదీప్ ఆమెను ఓరకంట దొరచూపు చూస్తూ.

ఒక రోజు సాయత్రం ప్రదీప్ లిఫ్ట్‌లో నుంచి దిగుతుండగా, అశ్వని కూడా లిఫ్ట్ లోకి వచ్చింది – పుల్ మేకప్‍తో

“ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా….” అన్నది అశ్వని.

“నువ్వే పెళ్లికూతురిలా తయారైనావు. జాగర్త… పెళ్లి కొడుకు పొరపాటు పడొచ్చు…” అన్నాడు ప్రదీప్.

ఆమె నవ్వింది నిండు జాబిల్లిలాగా.

ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు ఎన్‍క్లేవ్ సెక్రటరీ బిర్రుగా గుర్రమెక్కి వచ్చాడు. బండి ఆపి స్కూటర్ స్టాండ్ వేయబోయి, తూలి పడ్డాడు. వాచ్‍మన్ కూడా తూలుతూనే వచ్చాడు.

ఇద్దరూ మాటలు తూలారు. సెక్రటరీకి కోపం వచ్చింది. వాచ్‍మన్‍ని కొట్టాడు. తన జీతం పెంచకుండా సెక్రటరీయే అడ్డుపడ్డడని వాడికి కోపం. అందుచేత వాడు రాత్రికి రాత్రి ఖాళీ చేసి చెప్పాపెట్టకుండా వాళ్ల ఊరికి ఉడాయించాడు.

పోతూ, పోతూ నీళ్లు పైకి ఎక్కంచే మోటారు మీద బండ రాయితో కొట్టి కసి తీర్చుకున్నాడు.

మర్నాడు ఎవరికీ నీళ్లు లేవు. ఒకటే గోల, గందరగోళం. అందరి అరుపులు, తిట్లు.

ప్రదీప్ మాత్రం తన బాత్‍రూంలో ఎప్పుడూ నీళ్లు నిలవ ఉంచుకంటాడు.

అశ్వని అడిగింది నీళ్ల గురించి. “నువ్వు ఇక్కడికొచ్చి నీళ్లాడవచ్చు” అని చెప్పాడు ప్రదీప్.

“నువ్వు కాసేపు అలా బయట విహారించి రా” అన్నది అశ్వని.

అలాగేనంటూ బయటకు వెళ్లాడు. అరగంట తరువాత వచ్చాడు.

అశ్వని ఒంటి మీద ఆచ్ఛాదనం లేని చోట మంచి ముత్యాల్లా మెరుస్తున్న నీటి బందువులు ఆమెకు మరింత శోభనిచ్చాయి.

ఇద్దరి చూపుల కోలాటాలలో చెప్పలేని భావాలెన్నో ఉన్నాయి.

ఇంక ప్రదీప్ పెళ్లి ప్రస్తావన తెద్దామనుకునే లోపు, ఆకాశవాణిలాగా వార్తలన్నీ చేరవేసే మామ్మగారు అశ్వనికి అమెరికా సంబంధం కుదిరినట్లు అందరి చెవిన వేసింది.

అది ప్రదీప్‌కీ తెల్సింది. ఏదో చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే దాగిపోయినయి. కాలిఫోర్నియా కొండల మీది కార్చిచ్చు లాంటిదేదో దహించి వేసింది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయ్యాడు.

గడ్డాలు పెంచాడు. మౌనం వహించాడు. దేని మీదా ఆసక్తి లేదు. సామ్రాజ్యాలు కోల్పోయిన వాడిలా ఉన్నాడు. అన్న హితవు లేదు. ఇస్త్రీ మడతలు విప్పటం లేదు. నిస్త్రాణగా పడుకొని పాత సినిమాల్లోని విరహ గీతాలు వింటున్నాడు.

ఆ ఎన్‌క్లేవ్ అందరి విషయాలూ అందరికీ క్షణాల్లో తెల్సిపోతుంటయి. ప్రదీప్ పైన అందరికీ జాలీ, కరుణ, దయ గోదావరి వరదలాగా పొంగిపోర్లుతోంది.

అయిదో అంతస్తులో కుశాలరావు అనే విప్లవ భావాలు గల కవి ఉన్నాడు. అతనూ భగ్న ప్రేమికుడే. కుశాలరావు అప్యాయంగా ప్రదీప్ భుజం మీద చెయ్యి వేసి “నాతో రా” అంటూ బార్‌కి తీసుకెళ్లి హితోపదేశం చేశాడు.

“పిచ్చివాడా, ప్రేమించిన అమ్మాయి దొరకలేదని క్రుంగిపోవటం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని సుఖపడిన వారి కన్నా, భార్య చేత బాధించపడిన వారే ఎక్కువగా ఉన్నారు చరిత్ర నిండా.”

“ప్రపంచాన్ని గడగడలాడించిన నెపోలియన్, హిట్లర్ లాంటి వాళ్లూ ప్రేమలో పడి దగా పడిన వారే తమ్ముడూ… మన లాంటి మామూలు మనుషులు ఆడదాని ఓర చూపుకు బోర్లా పడిపోవటంలో వింతేమీ లేదు. చరిత్రలో మేధావులుగా పేరు తెచ్చుకున్న వాళ్లంతా భార్య పోరుతో విసిగిపోయారని తెలిస్తే, ఆశ్చర్యపోతాం. గొప్ప సాహితీవేత్త షేక్స్‌పియర్ మొదట్లో నీలాగే అన్నెవాట్లె అనే చిన్నదాన్ని ప్రేమించినా అతనికి తనకన్నా ఎనిమిదేళ్లు పెద్దది అయిన అన్నె హతవే అనే ఆమెతో పెళ్లి జరిగింది. వాళ్ల సంసార జీవితం ఏ మాత్రం సాఫీగా సాగలేదు. ఆనాటి పరిస్థితులను బట్టి ఆయన బాగానే సంపాదించినా భార్యకు ఏమీ ఇవ్వలేదు. అంతగా కక్ష సాధించాడు.”

“ఛార్లెస్ డికెన్స్ అనే మహా రచయిత కూడా భార్యా బాధితుడే. ఇరవై మూడేళ్లపాటు ఆమెతో నరకం అనుభవించాక, వివాహం రద్దు చేసుకున్నాడు. పది మంది పిల్లలు కలిగాక కూడా భార్యకు వారానికి ఏడు పౌండ్లు మాత్రమే ఇచ్చేవాడు. మరదలికి మాత్రం చివరకు పద్నాలుగు వేల పౌండ్లు ఇస్తూ వీలునామా రాశాడు.”

“సోక్రటీస్ గురించి తెలియని వారు లేరు. భార్య పరమ గయ్యాళి. ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఓపిగ్గా భరించేవాడు. ఒకసారి కోపంతో బకెట్ నీళ్లు ఆయన మీద కుమ్మరించింది. మేఘాలు గర్జించిన తరువాత వర్షించటం మామూలేగదా. అని తన మీద తనే జోక్ వేసుకున్నాడు. ఆవమానాలన్నీ ఆయన్ని వేదాంతిగా మార్చాయి.”

“వార్ అండ్ పీస్ నవల రాసిన టాల్‍స్టాయ్ జీవితం భార్యతో యుద్ధం చేయటంతోనే సరిపోయంది. ఆయనకు భార్య మీద ఎంత అసహ్యం కలిగిందంటే, తన అంత్యక్రియలకి ఆమె రాకూడదని కోరుకున్నాడు.”

“ఇప్పటికీ గొప్ప ఆమెరికా అధ్యక్షడిగా కీర్తింపబడుతున్న అబ్రహం లింకన్ వైవాహిక జీవితమంతా దుర్భరమే. యవ్వనంలో ఉండగా ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఆమె చిన్నతనంలోనే చనిపోయింది. తరువాత మేరీ టాడ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె నోటి దురుసుతనానికి తట్టుకోలేక పారిపోయాడు. అయినా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో పాతికేళ్లు నరకప్రాయమైన జీవితం గడిపాడు. ఆయన స్నేహితులనూ తిట్టి పోసేది. అన్ని అవమానాలనూ దిగమింగుతూ కాలం గడిపాడు. దేశాన్ని సరిదిద్దిన ఆయన భార్యను ఎందుకు సరిదిద్దులేకపోయాడు. ఆయన జీవితంలోని అత్యంత దారుణమైన సంఘటన ఏదీ అంటే – ఆయన హత్య కాదు, మేరీ టాడ్‍తో వివాహం జరగటమే – అతి దారుణమైన సంఘటన అని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు.”

“ఇలా ప్రపంచ చరిత్రను మలుపు తప్పిన ఎందరో మహానీయులు, రాజులు, చక్రవర్తులూ ప్రేమ అనే ఉచ్చులో పడి గిలగిల్లాడిపోయారు. ప్రేమ అనే గోతిలో పడితే, శాశ్వతంగా సుఖశాంతులకు దూరమవుతావు సుమా అని బెట్రాండ్ రెస్సెల్ హెచ్చరించాడు.”

“కనుక ప్రియురాలితో పెళ్లి తప్పిపోవటం నీ అదృష్టం అనుకో. జీవితకాలపు శిక్షపడకుండా తప్పించుకున్నావు…”

అని ఎంతో విశదంగా, ఎన్నో రోజుల పాటు కుశాలరావు ప్రదీప్‍కి బ్రెయిన్ వాష్ చేశాడు. అతనికి జ్ఞానోదయం అయింది.

మర్నాటి నుంచీ ప్రదీప్ భక్తి మార్గంలో పడ్డాడు. విభూతి దట్టించి, పట్టుబట్టలు కట్టి పూజలు చేస్తున్నాడు. గురువారం, శనివారం ఉపవాసాలు ఉంటున్నాడు. కోటీశ్వరరావుగారి ఉపన్యాసాలు వింటున్నడు.

“ఏంటయ్యా, ఒక్కసారిగా ఇలా మారావు?” అని మామ్మగారు అడిగింది.

“అంతయు నీవే, హరి పుండరీకాక్ష…” అంటూ వెళ్లిపోయాడు.

మామ్మగారు ఈ వింతను అశ్వనికి చేరవేసింది.

రాత్రి పదకొండు గంటలకు అశ్వని, ప్రదీప్‍కి ఫోను చేసింది.

“ఏం చేస్తున్నావు?” అని అడిగింది.

“నిద్ర రావటం లేదు, కీర్తనలు వింటున్నా…”

“జోల పాడతాను వస్తావా?” అన్నది.

“అంతకన్నానా?” అంటూ కిందకు దిగి ఆమె అపార్ట్‌మెంట్ లోకి వెళ్లాడు.

వారం రోజులు తరువాత, ఇద్దరూ అందరికీ శుభలేఖలు పంచి పెట్టారు.

“జీవితకాలం శిక్ష అనుభవిస్తావు” అని శపించాడు కుశాలరావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here