చిరుజల్లు-30

0
8

కల కానిది…

[dropcap]చా[/dropcap]లా మంది అమ్మాయిలకు లాగానే మృణాళినికి నవలలూ, నాటకాలు అంటే చాలా ఇష్టం. నవలలు చదువుతున్నా, నాటకాలు, సీరియల్స్ చూస్తున్నా, ఆయా పాత్రలతో మమేకం అయిపోయి, తనే ఆ కష్టాలు పడుతున్నట్లు ఫీల్ అయిపోతుంది. కష్టాలు కొంచెం ఎక్కువ అయితే, వలవలా కన్నీరు వరదలా పారుతుంది. అవన్నీ కల్పితాలు అని తెల్సినా ఎందుకంత బాధపడిపోతావని అమె కజిన్ రవి అనేవాడు.

“ఆ మాట కొస్తే ఈ జీవితము శాశ్వతమా? ఇదీ అశాశ్వతమని తెల్సినా, నిజ జీవితంలో ఎందుకు కాసేపు నవ్వుతారు, కాసేపు ఏడుస్తారు? చిన్న దెబ్బ తగిలినా, పరీక్షలో తప్పిపోయినా, ఉద్యోగం ఊడిపోయినా, మనకేమీ పట్టనట్లు, స్థితప్రజ్ఞులు లాగా ఎందుకు ఉండలేకపోతున్నాం?” అని ఎదురు ప్రశ్నిస్తుంది మృణాళిని.

ఒక రోజు రవి తన స్నేహితుడు ప్రవీణ్‌ను మృణాళినికి పరిచయం చేశాడు. ప్రవీణ్‌కు నాటకాల పిచ్చి. చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. తాను వేసే నాటకాలకు రమ్మని మృణాళినిని ఆహ్వానించేవాడు. ఆమె తప్పని సరిగా హాజరయ్యేది. అతని వేషం ఎందుకు బావుందో, ఇంకా బావుండాలంటే ఎలా ఉండాలో వివరించేది. అవన్నీ ప్రవీణ్‌కి నచ్చేవి. అందుచేత ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. క్రమంగా స్నేహం తొండ ముందిరి ఊసరవెల్లి అయినట్లు రంగులు మార్చుకుంది.

“నీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, నీ మెప్పు పొందటం కోసమే నేను నాటకాలు ఆడుతున్నాను” అనీ అన్నాడు.

“ప్రతి కళాకారునికీ కొంత మంది అభిమానులుంటారు. అలాగే నీకూ అనేకానేక మంది అభిమానులుంటారు. ఆ వేలాది మందిలో నేనూ ఒక దానిని. అంతే” అన్నది మృణాళిని.

“నాకో చిన్న కల ఉంది. కాదు చిన్న ఆశ. కాదు కాదు చిన్న కోరిక. నేను టీ.వీ. సీరియల్స్‌లో నటించాలి. నన్ను అలా టీ.వీ. తెరమీద చూసి ఎలా ఉన్నానో చెప్పాలి. నాకు డబ్బు ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఎవరన్నా ఒక చిన్న వేషం ఇస్తే చాలు… నువ్వు చూడాలి.” అన్నాడు ప్రవీణ్ ఒకసారి.

“టీ.వీ. సీరియల్స్‌లో వెయ్యటం ఏమన్నా బ్రహ్మ విద్యా ఏమిటి? అందులోనూ నీలాంటి పండిపోయిన నటుడికి…” అని నవ్వింది.

“ఏమన్నావ్? నేను పండిపోయానా?” అన్నాడు ప్రవీణ్ కళ్లింత చేసి.

“అంటే నటనలో పక్వానికి వచ్చావని… పరిణితి చెందావని…” అని సర్ది చెప్పింది మృణాళిని.

“థాంక్స్…”

“నీ కోరిక త్వరలోనే తీరుతుంది. బుల్లి తెర మీద నువ్వు వెలిగిపోయే రోజు ఎంతో దూరం లేదు…”

“నీ నోటి మాట వల్ల అలా జరిగితే, నువ్వు ఏం కోరితే అది ఇస్తాను…” అన్నాడు ప్రవీణ్.

“పదివేలు పెట్టి పట్టు చీర కొనిపెట్టు…” అన్నది మృణాళిని.

“తప్పకుండా…” అన్నాడు ప్రవీణ్.

ఈ ఒప్పందాలు అయిన రెండు నెలలకే ప్రవీణ్ టి.వీ. సీరియల్‌లో నటించే ఛాన్స్ వచ్చింది.

ప్రవీణ్ ఆ విషయం మృణాళినికి చెప్పాడు మొహం నిండా ఆనందాతిశయాన్ని పులుముకొని.

“నీ కల నిజమవుతోంది గదా… సంతోషం…” అన్నది మృణాళిని.

ఆ సీరియల్‌లో మంచి వేషమే ఇచ్చారు. ప్రవీణ్ కూడా చాలా బాగా చేశాడు.

“నీకు పట్టు చీర కొనిపెట్టాలి గదా…” అన్నాడు.

“ఛీ, ఛీ. నేనేదో ఊరికే సరదాకి అన్నాను… నాకేం వద్దు. నీ టాలెంటే నీకు గొప్పవరం… ఏమైనా ఒక ఫ్రెండ్ గొప్పవాడు అయినందుకు గర్వంగా ఉంది…” అన్నది మృణాళిని.

ఇంకో రోజు అన్నది “మొన్న నువ్వు నటించిన ఒక సీన్ చూసి ఏడ్చేశాను…”

“నువ్వు ఏడిస్తే, అది గొప్పగా వచ్చినట్లే లెక్క…” అన్నాడు ప్రవీణ్.

ఒక రోజు సీరియల్ ఘాటింగ్ జరుగుతున్న చోటుకి, ఆ సీరియల్ డైరెక్టర్ భార్యతో కల్సి మృణాళిని రావటం చూసి ఆశ్చర్యపోయాడు.

“ప్లజంట్ సర్‌ప్రైజ్…” అన్నాడు ప్రవీణ్.

“డైరెక్టర్ గారు మా ఇంటి దగ్గరే ఉంటారు. ఆయన భార్య నేను అప్పుడప్పుడు కల్సుకుంటుంటాం…” అన్నది మృణాళిని.

“ఇన్నాళ్లూ చెప్పనే లేదు… దొంగా…” అన్నాడు ప్రవీణ్.

మృణాళిని నవ్వింది నిండు జాబిల్లి లాగా.

కొన్నాళ్ల తరువాత, ప్రవీణ్ మృణాళినితో అన్నాడు.

“నాకో చిన్న కల ఉంది… కాదు, కాదు, చిన్న ఆశ ఉంది… కాదు కాదు. చిన్న కోరిక ఉంది. నేను ఏదన్నా సినిమాలో చిన్న వేషం వేయాలి. అది నువ్వు చూడాలి. నేను సినిమాలో వేసిన వేషం చూసి నువ్వు ఏడవక్కర్లేదు.. ఇలాగే నిండుగా నవ్వినా చాలు… అది నా కల…” అన్నాడు ప్రవీణ్.

“నీ కోరిక త్వరలోనే తీరాలని నేను రోజూ అమ్మవారికి పూజ చేస్తాలే…” అని నవ్వింది.

“నీ నోటి మాట చలవ వల్ల, ఆ కోరిక తీరితే నువ్వు ఏది అడిగితే అది గిఫ్టుగా ఇస్తాను…”

“పది లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వు… ” అన్నది మృణాళిని.

“అది నా శక్తికి మించినా సరే, నీ కోరిక తీరుస్తాను…” అన్నాడు ప్రవీణ్.

ఇంకో నాలుగు నెలల గడిచాయి. అతను నటిస్తున్న సీరియల్‌కి డైరెక్టర్‍గా ఉన్న అతనికి సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

ప్రవీణ్ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మొదలెట్టాడు. మృణాళిని కూడా డైరెక్టర్‍కి ఆయన భార్య చేత చెప్పించింది.

“ఏ వేషం ఇచ్చినా అదరకొట్టేస్తాడు. వాడ్ని వదులుతానా?” అన్నాడు డైరెక్టరు.

సినిమా పూర్తి కావటం, హిట్ కావటం కూడా జరిగిపోయ్యాయి. ఆ డైరెక్టర్ బిజీ అయిపోయాడు. ఆయన ఎక్కడుంటే, ప్రవీణ్ అక్కడ ఉండాల్సిందే.

చూస్తుండగానే ప్రవీణ్ పెద్ద స్టార్ అయిపోయాడు. ఇప్పుడు రోజుకు రెండు షిఫ్ట్ లలో అంటే, ఒకేసారి రెండేసి సినిమాల్లో నటిస్తున్నాడు. క్షణం తీరిక లేదు.

ఒక రోజు ప్రవీణ్ కారులో మృణాళిని ఇంటి ముందు దిగాడు. ఖరీదైన పట్టు చీర, డైమండ్ నెక్లెస్, పూలు పళ్లూ తెచ్చి ఆమెకు వెండిపళ్లెంలో పెట్టి ఇచ్చాడు.

“ఇంత గొప్ప నటుడు నా ఇంటికి వస్తే, కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేని పేదరాలిని… నేను ఎప్పుడో ఏదో సరదాకి, అదీ మాటవరసకి అంటే, అవన్నీ నిజమనుకొని ఇప్పుడు ఇవన్నీ తెచ్చారా? నాకు నోట మాట రావటం లేదు, ఈ సంభ్రమాశ్చర్యాలతో….” అన్నది మృణాళిని.

“నటన మనిద్దర్నీ దగ్గరకు తీసుకొచ్చింది. స్టేజ్ మీద నా నాటకాలు చూడటానికి నువ్వు వచ్చినప్పటి నుంచీ, ఇవాళ్టి వరకూ నేను మొహానికి రంగు వేసుకున్నప్పుడల్లా నువ్వే, నీ నవ్వే నా కళ్ల ముందు కదులుతుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు చేస్తే నువ్వు ఏం తిడతావో అని నిన్ను మెప్పించాలన్న ఒకే ఒక లక్ష్యంతో, దీక్షగా నన్ను నేను నటుడిగా మెరుగులు దిద్దుకుంటున్నాను. ఒక రకంగా నేను నీకు ఏకలవ్య శిష్యుడిని…” అన్నాడు ప్రవీణ్.

“చాల్లే ఊరుకోండి. మీరేమిటి? నేనేమిటి? ఏకలవ్యుడు ఏమిటి? శిష్యుడు ఏమిటి? భలే తమషాగా మాట్లాడుతున్నారు…” అన్నది మృణాళిని.

“నేను చెప్పింది నిజం మృణాళినీ… నా ఈ పేరు ప్రతిష్ఠల వెనక, నీ అదృశ్య హస్తం ఉంది…” అన్నాడు ప్రవీణ్.

“ఒక మనిషి పైకి రావటానికి అనేక కారణాలుంటయి. మీ కృషి, మీ అదృష్టం మిమ్మల్ని నటుడిగా తీర్చిదిద్దాయి. ఇందులో నేను నిమిత్తమాత్రురాలను…” అన్నది మృణాళిని.

“నా అదృష్టదేవతవి నువ్వే. నువ్వు ఏదన్నా అంటే, అది జరిగి తీరుతుంది. అది నా నమ్మకం. అందుచేత జీవితాంతం నువ్వు నా పక్కన ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను…”

“మీరెక్కడ నేనెక్కడ?”

“నేను ఎక్కడుంటే, నువ్వు అక్కడే. నా పక్కనే ఉండాలి” అన్నాడు.

ప్రముఖ నటుడు, ఒక సాదా సీదా అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అందర్నీ ఆశ్చర్యపరచింది.

మృణాళిని, ప్రవీణ్ కట్టుకున్న అందాల అద్దాల మేడలోకి అడుగు పెట్టింది.

కాలం పరుగులు తీసింది.

ప్రవీణ్‌కు అవార్డులూ, ప్రశంసలూ పుంఖానుపుంఖాలుగా వచ్చి పడుతూనే ఉన్నాయి.

ఇద్దరికీ కలిపి సన్మానాలు, సత్కారాలు అసంఖ్యాకంగా జరిగినయి.

ఒక రోజు రాత్రి ప్రవీణ్, మృణాళినితో అన్నాడు.

“నాకు ఒక చిన్న కల ఉంది… కాదు, కాదు. ఆశ ఉంది… కాదు, కాదు కోరిక ఉంది…”

“ఏమిటది?”

“నటుడుగా నేను ఒక స్థాయికి ఎదిగాను. నిర్మాతగానూ స్థిరపడాలని ఉంది. నువ్వేమంటావు?”

“కానివ్వండి. మీ కోరికను నేను ఎప్పుడు కాదన్నాను గనుక…” అన్నది మృణాళిని.

ప్రవీణ్ స్వంతంగా సినిమా తీస్తున్న విషయం పెద్ద సంచలనం సృష్టించింది. డైరెక్షన్ కూడా ఆయనే చేస్తుండటం మరింత ఆశ్చర్యపరచింది.

ఖర్చు ఏ మాత్రం వెనకాడకుండా భారీ ఎత్తున నిర్మాణం మొదలు పెట్టాడు. బడ్జెట్ అనుకున్న దాని కన్నా మించి పోయింది. సగం కూడా తీయకముందే ప్రవీణ్ దగ్గరున్న డబ్బంతా ఆవిరైపోయింది.

సినిమా ఆగిపోయిందన్న అపకీర్తి రాకూడదని, అప్పులు తెచ్చాడు. అతి కష్టం మీద సినిమా పూర్తి అయింది.

కానీ కాలం కల్సిరాలేదు. సినిమా అంతంత మాత్రంగా ఉన్నందున, కరోనా వల్ల, మరి కొన్ని సినిమాల పోటీ వల్ల, కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు, మరెన్నో కారణాల వల్ల ప్రవీణ్ సినిమా ఆడలేదు.

అప్పులు మిగిలాయి. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చింది. ప్రవీణ్ వైభవం అంతా ఒక్క సినిమాతో తీరిపోయింది.

రోజులు గడవటమే కష్టంగా ఉంది.

మృణాళిని చిన్న ఉద్యోగం సంపాదించింది.

“సంసారం రెండు ఎద్దుల బండి లాంటిది అంటారు. ఒక ఎద్దు నడవలేక పోతే, రెండో ఎద్దే భారాన్ని మోయాల్సివస్తుంది…” అన్నది మృణాళిని.

“నాకు ఇదంతా ఒక కలలాగా ఉంది…” అన్నాడు ప్రవీణ్.

“ఇది కల కానిది… జీవితం…” అన్నది మృణాళిని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here