చిరుజల్లు 4

0
7

భవసాగరం

శ్లో.

[dropcap]మ[/dropcap]న ఏవ జగత్సర్వం – మన ఏవ మహారిపుః
మన ఏవ హి సంసారో – మన ఏవ జగత్త్రయమ్.

ఈ మనస్సే సర్వ జగత్తూ అయి ఉన్నది. మనస్సే పరమ శత్రువు. అదియే సంసార హేతువు. అదే మూడు లోకములూ అవుతున్నది. మనస్సును స్వాధీనమునందు ఉంచుకొన్నచో జగములన్నీ స్వాధీనమై యుండును.

పేరుకు సత్యానందమే గాని, పాపం జీవితంలో ఆనందమే ఎరుగడు. అందుకు కారణం కూడా స్వయంకృతాపరాధమే. ముక్కు మీద కోపం, నాలుక చివర చిరాకు. పెళ్ళాం లోకువ కాబట్టి, తెల్లారి లేచి టూత్ పేస్ట్ వెతుక్కోవడం దగ్గర నుంచి, రాత్రి బెడ్‍షీట్ మార్చడం దాకా విసుక్కుంటూ ఉంటాడు. కసురుకుంటూనే ఉంటాడు. “తిండి తగ్గించు, లావెక్కుతున్నావ్” అంటాడు. “నేనేం కూర్చుని తినడం లేదు. రెక్కలు విరిగిపోయేటట్లు, డొక్కలు అరిగిపోయేటట్లు చాకిరీ చేసి, కంచంలోకి రెండు పూటలా వండి వారుస్తుంటే, మీ పొట్ట పీపాలా పెరుగుతోంది” అంటూ కౌంటర్ విసురుతుంది భార్యామణి ఘాటుగానే.

కొన్ని సంసారాలు చూడముచ్చటగా అన్యోన్యంగా ఉంటుంటే మరికొన్ని సంసారాలు ఎందుకు ఉప్పూ, నిప్పులా ఉంటున్నాయంటే, ప్రధానమైన కారణం వాళ్ళ మానసిక స్థితి అనే చెప్పాలి.

ఒక అరగంట కరెంటు పోతే, “ఊపిరాడక చచ్చిపోతున్నాం” అంటూ ఆ ఆఫీసుకు ఫోన్ మీద ఫోన్ చేసేస్తుంటారు. “మీ వీధిలో చెట్ల కొమ్మలు కొట్టేస్తున్నారు మునిసిపాలిటీ వాళ్ళు. మధ్యాహ్నం మూడింటిదాకా కరెంటు రాదు” అంటే, జీవితంలో పడరాని పాట్లు పడుతున్నట్లు బాధపడి అందరినీ తిట్టిపోస్తారు.

అయితే అన్నివేళలా అలా తారాజువ్వలా రివ్వుమని రెచ్చిపోవటం కుదరదు. ఆఫీసులో బాస్ ‘యూస్‍లెస్ ఫెలో’ అంటే ‘యస్సర్’ అనే అంటాడు. ‘యూ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్’ అంటే ‘యస్సర్’ అనే అంటాడు.

మనుషుల్లో ఎవడి చింతన వాడిదే. ‘సెల్ఫ్ లవ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది లైఫ్‍లాంగ్ రొమాన్స్’ అన్నాడో జ్ఞాని. అంటే ఏమన్న మాట? తనను తాను ప్రేమించుకోవటం మొదలుపెడితే, అదింక చచ్చేదాక తెమలదు. ఇది మనకు కొంతమందిలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ మొదలుపెట్టినా, తన గొప్పల డప్పుల చప్పుడు దగ్గరకే చేరుతుంది. “నేను ఆ ఆఫీసులో పని చేసినప్పుడు, పెద్ద పెద్ద మినిస్టర్ల బిల్లులు పాస్ చేయకుండా ఆపేసేవాడిని. నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసేవాళ్ళు. అయినా సరే, నెల రోజులు తిప్పించుకుని గానీ,  బిల్లుల మీద సంతకం చేసేవాడిని కాదు” అని అడిగిన వాడికి,  అడగని వాడికీ తన గత వైభవం గురించి చెప్పుకుంటాడు. కానీ చివరకు తనను సస్పెండ్ చేసిన విషయం మాత్రం ఎవరికీ చెప్పుకోడు.

స్వార్థ చింతన సర్వే సర్వత్రా ప్రయోగించేవాళ్ళూ మన చుట్టూ బోలెడు మంది కనిపిస్తారు. రైల్వే బెర్త్ కోసమో, సినిమా టికెట్టు కోసమో అడ్డదారి వెతుక్కుంటే ఫర్వాలేదు. దేవుడి దర్శనం కోసం మంత్రిగారి పి.ఎ. రికమండేషన్ ఉపయోగించుకుంటే, దేవుడి కన్నా పి.ఎ. గారే గొప్ప అన్న మాటే గదా.

సెల్ఫ్ డబ్బా కొందరికి ఎంత అలవాటు అంటే, అది లేనిదే నిముషమైనా గడవదు. “నేను చెప్పే ప్రతీ మాటనూ దేశంలోని లక్షలాది మంది వింటారు” అని ఒక పెద్దమనిషి అంటే, ఆయన ఏ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అనుకుంటాం. కాదు. ఆయన టి.వి.లో యాంకర్‌ట.

అన్నిటికీ మన మనసే కారణం. పదిమందితో స్నేహంగా ఉన్నా, ప్రతివాడికీ శత్రువుగా మారినా, అన్నిటికీ మనసే కారణం. ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటారు. ఆ మహాతల్లి ఉన్నంతలో అందరికీ సమానంగానే పెట్టి పెంచి పెద్ద చేస్తుంది. నలుగురికీ పెళ్ళిళ్లూ, పేరంటాలూ అవుతయి. ఎవరి సంసారాలు వాళ్లకి ఏర్పడతయి. ఒకే ఊళ్లో దగ్గర దగ్గరే ఉంటారు. కొందరు మాత్రం మా అన్న, మా చెల్లి అంటూ అన్యోన్యంగా ఉంటి, చీమ చిటుక్కుమన్నా వచ్చి కొండంత అండగా నిలబడతారు. అదే మరి కొన్ని కుటుంబాల్లో అయితే, ఒకే తల్లి కడుపున పుట్టినవాళ్ళూ బద్ధ శత్రువులుగా మారిపోతారు. పక్క నుంచి పోతున్నా పట్టించుకోరు. అందుకు ఏవో సవాలక్ష కారణాలు వాళ్లు వల్లె వేయవచ్చు గాక. కానీ అవేవీ అంతటి శత్రుత్వాన్ని సృష్టించేవి మాత్రం కాదు.

మహా నగరాల్లో ఏడంతస్తుల మేడల్లో నివసించేవారికి, చుట్టుపక్కల ఉన్న పార్క్‌కి వెళ్లే తీరికా, ఓపికా ఉండవు. ఏడాదికోసారి పిక్నిక్ పేరుతో ఏ అడవిలోకో వెళ్ళినప్పుడు అక్కడ గుక్కెడు మంచినీళ్ళు దొరకకపోయినా సరే, ‘అహా, ఈ రమణీయ ప్రకృతి ఎంత కన్నుల పండుగా నున్నది’ అని ఉప్పొంగిపోతాడు. అలా అని ఒక రాత్రి ఆ రమణీయ ప్రకృతి ఒడిలో పవ్వళింపగలడా అంటే, అస్సలు ఉండలేడు. ఆ కొండా కోనల మధ్యా ఉండేవాడు నగరం నడిబొడ్డున వచ్చి ఉండమన్నా ఉండలేదు. ఈ ఉండటం, ఉండలేకపోవటం అనేది ఒక మానసిక స్థితి తప్ప మరొకటి కాదు.

ఒక యువకుడు ఒక యువతిని చూసి, పరవశం పొంది, ‘నా కోసమేనా దిగి వచ్చినావు?’ అని అంటాడు. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె అనీ అంటాడు. సరే… ఇంక ప్రేమాయణం మొదలవుతుంది. ఎప్పుడో తప్ప, ప్రేమలు ఎప్పుడూ సుఖాంతం కావు. నూటికి తొంభై శాతం విఫలమే అవుతాయి. అప్పుడు రంభలా కనిపించిన చిన్నదే, రాక్షసిలా కనిపిస్తుంది. ఏ రోడ్డు మీదనో నలుగురూ చూస్తుండగానే కత్తితో పొడిచి పోలీసు స్టేషన్‌కి వెళ్తాడు. ఒకే అమ్మాయి ఒకప్పుడు రంభలాగానూ, మరొకప్పుడు రాక్షసిలా కనిపించటానికి, ఆ అమ్మాయి వేషం మార్చుకోలేదు. ఇతనే మనసు మార్చుకున్నాడు. అసలు ప్రేమ అనేది మనిషి మానసిక స్థితి బాగాలేనప్పుడు కలిగే ఒక ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితి మాత్రమేనని ఒక వేదాంతి సిద్ధాంతీకరించాడు.

ఎంతటివారికైనా కాలం ఎప్పుడూ ఒక్కరీతిగా గడవదు. శరవేగంతో పరిగెత్తే కాలం ఎండలనీ, వానలనీ, చీకటినీ, వెన్నలనీ, వడగాడ్పులనూ, హిమసుమాలనీ మన మధ్యకి తెస్తూ ఉంటుంది. వాటితో పాటే కష్టనష్టాలూ వస్తయి. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో, ఒక్కరాత్రి కురిసిన కుంభవృష్టికి మున్నీట మునిగిపోతే, రైతు కంటి వెంట కారేది రక్త కన్నీరు మాత్రమే. అంతటి కష్టాన్నీ తట్టుకొని నిలబడి, మళ్లీ మళ్లీ మడి దున్నుతూనే ఉంటాడు. పైరు నాటుతూనే ఉంటాడు. కాయకష్టం చేయటం తప్ప, మరోటి తెలియని మనిషి మంచి మనసు అది.

ఇక ఉద్యోగాల విషయానికొస్తే, స్త్రీలు ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగాలు చేస్తారే గానీ, సీరియస్‍గా పని చెయ్యరు – అని కొందరు తేలికగా మాట్లాడుతుంటారు. అది నిజం కాదనీ, స్త్రీ పురుషుని కన్న ధైర్యంగానే పోరాడగలదనీ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మి వంటి వాళ్లు చాలా కాలం కిందటనే రుజువు చేశారు.

ఏదైనా మొదట్లో ఎవరికైనా కొంత కొత్తగానూ, కొంత భయం గాను ఉండవచ్చు. నాలుగు రోజులు అలవాటైతే అదే మామూలు అయిపోతుంది. స్త్రీ ఇది వరకు ఇంటి వరకే పరిమితం అయ్యేది. పిల్లల్ని కనటం, పెంచటం ఆమె చేసినట్టు పురుషుడు చెయ్యలేడు. స్త్రీది ఉయ్యాల ఊపే చెయ్యి అనీ అంటారు. కాని ఆమె తుపాకీ కూడా పట్టుకోగలదని రుజువు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నయి.

గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు, అమెరికా నుంచి నాలుగు లక్షలా పదిహేనువేల మంది సైనికులు సౌదీ అరేబియా వెళ్లారు. అందులో ఇరవై నాలుగు వేల మంది స్త్రీలు ఉన్నారు. బ్రిటన్ నుంచి మూడు వేల మంది సైనికులు వెళ్లారు. అందులో వెయ్యి మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలావరకు ఇంజనీర్లు, డాక్టర్లు, డ్రైవర్లు, వంటవాళ్ళు వంటి పనులకు వెళ్ళినా, ఆ సమయంలో అదీ అత్యంత ఆవశ్యకమైనదే గదా. మహిళలు యుద్ధంలో ముందుకు దూసుకుపోయినా, దూసుకొనిపోకపోయినా, అందుకు తగిన శిక్షణ అంతా ఇస్తారు. ఒక మహిళ ఎటువంటి ఆయుధం లేకుండా తన టేబుల్ దగ్గర కూర్చుని పని చేస్తుంటుంది. ఒక ఆగంతకుడు వచ్చి ఆమెపై కాల్పులు జరపటానికి సిద్ధపడతాడనుకోండి. అతని దగ్గర నుంచి ఆయుధం లాక్కొని, అతనిపై కాల్పులు జరిపే నైపుణ్యాన్ని, శిక్షణనూ వారికి ఇస్తారు.

అమెరికా నౌకాదళానికి చెందిన కాథరిన్ లాంబర్ట్ గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్న మహిళలలో ఒకరు. ఆమెకు నాలుగేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. ఆ పిల్లవాడిని వదిలేసి ఆమె యుద్ధానికి వెళ్లింది. యుద్ధానికి వెళ్లిన అమెరికన్ సైనికులను టీ.వీ. తెర మీద చూపిస్తున్నప్పుడు “మా అమ్మ ఇందులో ఉంది” అంటూ ఆ పసివాడు టీ.వీ.స్క్రీన్‍ను ముద్దుపెట్టుకునేవాడు. మనసున్న మమతానుబంధాన్ని ఎన్ని విధాల వివరించినా, ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది.

ఏ విషయమైనా ఎవరికైనా చెప్పేటప్పుడు, ‘ఐ థింక్’, ‘అయామ్ సారీ’ అనే మాటలు వీలున్నంతవరకూ వాడే అవసరం రాకుండా చూడండి. చెప్పే విషయాన్ని దృఢంగానూ, నిశ్చయంగానూ చెప్పినప్పుడే ఎదుటివారికి నమ్మకాన్ని కలిగించగలుగుతారు.

పిల్లల్ని పెంచటం అంటే, ఒక బాలుడినో, ఒక బాలికనో పెంచటం కాదు. ఒక భావి తరాన్ని తయారు చేస్తున్నారన్న భావంతో వాళ్లని పెంచాలి. కూతురుకి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంటారు. పోలికల మాట ఏమో గాని, తండ్రి ధైర్యసాహసాలు, తెలివితేటలు, బయట ప్రపంచంలోకి చొరబడి అన్నీ నెగ్గుకు రాగల సామర్థ్యం అబ్బితే, ఆడపిల్ల నిజంగా అదృష్టవంతురాలే.

చిన్నప్పటి నుంచీ ఒక చాక్లెట్ కొనాలన్నా, ఒక పెన్సిల్ కొనాలన్నా తండ్రి వైపు చూడటం పిల్లలకు అలవాటు. చిన్నప్పుడు తండ్రే పిల్లలకు ఆరాధ్య దైవం. పిల్లలు ప్రతీదీ అనుకరించటంతోనే నేర్చుకుంటారు. ఇంటికొచ్చి, స్కూలు టీచర్ లాగా ప్రవర్తించటం మొదలుపెడతారు. బయట ప్రపంచంలో అనుబంధం పెరిగే కొద్దీ, వాళ్లకు ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి. ఈ ఇష్టాయిష్టాలు ఏర్పడే సమయంలోనే తల్లిదండ్రుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. న్యాయం గురించీ, ధర్మాధర్మాల గురించీ, మంచి చెడుల గురించి పాతికేళ్ల వయస్సులో ఎలాంటి అభిప్రాయాలు మనసులో దృఢంగా నాటుకుంటాయో, అవే ఇంక వాళ్ల జీవిత మార్గాన్ని నిర్దేశిస్తాయి.

తండ్రికి ఏది ఇష్టమో, పిల్లలకీ అవే ఇష్టం. ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక సిద్ధాంతం, ఒక దృక్పథం అన్నీ తల్లిదండ్రుల నుంచే పిల్లలకు వారసత్వంగా వస్తయి.

కూతురుకు తండ్రి అంటే ఎంత ఇష్టమంటే, తన పేరు పక్కన తండ్రి పేరు చేర్చుకుంటుంది, సుజాతా రావు అనో, పద్మజా రెడ్డి అనో. తండ్రితో పిక్నిక్ వెళ్లిన సమయాలూ, తెలియని విషయాలన్నీ తండ్రిని అడిగి తెలుసుకున్న రోజులూ, తండ్రితో ఆడి, పాడి అలిసిపోయిన సమయాలు, పట్టరాని సంతోషంతో తండ్రిని చుట్టేసుకున్న క్షణాలూ, ఆపుకోలేని దుఃఖం వచ్చినప్పుడు తండ్రి భుజం మీద వాలిపోయిన సందర్భాలూ – ఎన్నో భావావేశాలు పిల్లల మదిలో మెదులుతుంటయి.

ఈ జన్మను తల్లి ఇస్తే, ఈ జీవితాన్ని తండ్రి ఇస్తాడు. అన్నిటికీ మనసే ముఖ్యం.

కనిపించని మనసే మనిషిని నియంత్రిస్తుంది.

ఏనుగు ఎంత? అంకుశం ఎంత? పెను చీకటి ఎంత? చిరు దీపం ఎంత? మన మనసూ అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here