చిరుజల్లు-42

0
12

చైతన్య స్రవంతి

[dropcap]ఎ[/dropcap]దలోని రొదతో,

ఉండుండి గుండెలవిసేలా అరుచుకుంటూ రైలు శరవేగంతో పరుగిడుతోంది.

కిటికీ దగ్గర కూర్చున్న గీత నలుగురిలోకి చూసే ధైర్యం లేక దూరంగా చీకట్లోకి చూస్తోంది. పక్కనే కూర్చున్న ఆమె తండ్రి డాక్టరు శ్రీనివాసమూర్తి కంపార్టమెంటులో నిస్తేజంగా వెలుగుతున్న దీపాల వంక ఇంకా నిస్తేజంగా చూస్తున్నాడు.

తండ్రీ, కూతురూ పక్కపక్కనే కూర్చున్నా పెదవి విప్పి పలుకలేని విషణ్ణవదనాలతో అంతర్ముఖులై ఉన్నారు. గీత వెనక్కి వాలి కళ్లు మూసుకుంది. రైలు ఏదో బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది కాబోలు దడదడా శబ్దం ఎక్కువైంది. గీతకు భయం ఎక్కవైంది. ఏదో ఒక ప్రమాదం జరిగి, రైలు పడిపోయి ఈ జీవితానికి ఇంతటితో ముగింపు పలికగలిగితే బావుండును – అని ఆమె అనుకుంటోంది. రైలు మరింత వేగంగా పరుగెత్తి అనుకున్న దానికన్నా త్వరగా గమ్యం చేరితే బావుండును – అని డాక్టర్ శ్రీనివాసమూర్తి అనుకుంటున్నాడు.

గమ్యం అంటే గుర్తొచ్చింది. ఇంక తన కూతురు జీవితానికి గమ్యం ఏమిటి? ఇప్పుడేం చేయాలి? ఈ ప్రశ్నలు ఆయన్ను వేధిస్తున్నయి.

శ్రీనివాసమూర్తి దంపతులకు ఒక్కతే కూతురు. అందుచేత సహజంగానే ఆ పిల్ల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గీత బహు చలాకీ ఆయిన పిల్ల. ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తుంది. నవ్వుతూ నవ్విస్తూ కేరింతలు కొడుతూ, చైతన్యానికి మారు పేరుగా ఇంట్లో ఎప్పుడూ ఆనంద కోలాహలాన్ని రేకేత్తిస్తుంది. సినిమా చూసి వచ్చాక, వచ్చీరాని ముద్దు మాటలతో పాటలు పాడుతుంటే, ఆ తల్లిదండ్రుల సంతోషం చెప్పనలవి కాదు. లేత చేతులూ కాళ్లూ తిప్పుతూ డాన్స్ చేస్తుంటే, ‘మా బంగారు తల్లి నాట్యమయూరి’ అని ముద్దుల వర్షం కురిపించేవారు. స్కూలు నుంచి వచ్చాక టీచరును అనుకరిస్తూ చీపురు పుల్లలతో కిటికీలు తలుపుల మీద కొడుతుంటే ‘దీన్ని లెక్చరర్  చెయ్యాలి’  అనే అనుకున్నారు. తండ్రి కుర్చీలో కూర్చుని చీటీలు రాస్తుంటే, ‘చివరకు ఇది డాక్టరే అవుతుంది’ అని సంతోషించారు. ఎన్నెన్నో అనుకుని, మరెన్నో ఆశలు పెంచుకున్నారు.

వయసు వచ్చే కొద్దీ గీత కూడా రోజు రోజుకీ పెద్ద పెద్ద ఆలోచనల నిచ్చెనలను ఆకాశానికి వేసి విహాయస లోకాల్లో విహరిస్తూ ఉండేది. ఆ పిల్లకు కంట్లో నలుసు పడితే, కాలులో ముల్లు విరిగితే, ఆ తల్లిదండ్రులు విలవిలలాడి పోయేవారు. పెద్ద చదువులు చదివించి మంచి స్థితికి తీసుకొచ్చి, నలకూబరుడ్ని తెచ్చి పెళ్లి చేసి, ఇద్దర్నీ ఐశ్వర్యపు ఒంటి స్తంభపు మేడ మీద ఉంచాలని ఆశించారు. గీత కాలేజీ చదువుకు వచ్చేటప్పటికి, వాళ్లకీ ధ్యాస మరింత ఎక్కువ అయింది.

తల్లి కూతురును అనుక్షణం గమనిస్తూ ఉండేది. కూతురు ఎక్కడికి వెళ్తోంది, ఎవరితో మాట్లాడుతోంది, ఏం మాట్లాడుతోంది అన్నీ ఆరా తీసేది.  “ఏంటమ్మా, నువ్వు మరీనూ, నా ఫ్లెండ్స్ ఇళ్లకు వెళ్లనివ్వవు. వాళ్లతో తిరగనివ్వు. నీకు అన్నీ అనుమానాలే” అని విసుక్కునేది గీత.

“నీకు మంచీ చెడూ తెలియ జెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నువ్వు పొరపాటు పడకుండా, తప్పుదారిన పడి తప్పటడుగు వేయకుండా చూడాల్సిన బాధ్యత నాకు ఉంది”  అని ఆమె చెప్పేది.

కూతురు విషయంలో భార్య అతిగా శ్రద్ధ చూపుతున్న విషయం శ్రీనివాసమూర్తి గమనించాడు. “అమ్మాయి మరీ చిన్న పిల్ల ఏమీ కాదు. దానికి స్వంతంగా ఆలోచించగల అవకాశం ఇవ్వాలి” అని ఆయన చెప్పాడు.

అప్పటి నుంచీ ఆమె కూతుర్ని ఎక్కువ ఆరాలు అడిగేది కాదు. గీతకు ఉన్న స్నేహితురాండ్రు అందరిలోకీ మేరీ ముఖ్యమైనది. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్లు. సినిమాలు, పిక్నిక్‌లూ తప్పని సరి. ఒక్కో రోజు గీత మేరీ ఇంట్లోనే ఉండిపోయేది. రాత్రి పది గంటలకు ఇంటికి ఫోన్ చేసి తను ఇంటికి రావటం లేదని చెప్పేది.

ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనని గీత తల్లిదండ్రులు భయపడుతూనే ఉన్నారు. ఆయన మాత్రం పిల్లకు ఆ మాత్రం స్వేచ్ఛ ఇచ్చినా పరవాలేదని అనుకున్నాడు.

మేరికి ఒక అన్న ఉన్నాడు. అతని పేరు జోసెఫ్. గీతకు అతనితో పరిచయం పెరిగింది. స్నేహం ఏర్పడింది. కొన్ని సమయాల్లో మేరీ ఇంట్లో ఉండేది కాదు. గీతకు అప్పుడు జోసెఫ్ తోడుగా ఉండేవాడు. మాటలు పెరిగాయి. అబిప్రాయాలు కలిశాయి. మానసికంగా మరింత దగ్గరయ్యారు. రోజూ చూడకుండా ఉండలేని స్థితికి వచ్చారు. కల్సుకోవటం విడిపోవటానికే, విడిపోవటం తిరిగి కల్సుకోవటానికే అని అర్థమయ్యాక, విడిపోకుండా ఉండేలా పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు.

ఈ విషయం శ్రీనివాసమూర్తి దంపతులకు తెలియగానే వాళ్ల హృదయాంతరంగాలలో పెను తుఫాను చెలరేగింది. గొడవలూ, ఘర్షణలూ, కన్నీటి వర్షాలూ, గద్దింపుల మేఘ గర్జనలూ జరవల్సిన బీభత్సం అంతా జరిగింది.

“నీకు చదువునూ, డబ్బునూ, సకల సౌకర్యాలనూ ఇచ్చాను. వాటితో పాటే పూర్తి స్వేచ్ఛనూ ఇచ్చాను. చదువు అబ్బకపోయినా ఫర్వాలేదు. డబ్బు దుర్వినియోగం అయినా ఫర్వాలేదు. కానీ నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంటే, చూస్తూ ఊరుకోలేకపోతున్నాను” అన్నాడు శ్రీనివాసమూర్తి.

“మా ఇద్దరి మధ్యా ఏర్పడ్డ స్నేహం తరగనిదీ, చెరగనిదీ. జోసప్ నన్ను అపురూపంగా చూసుకుంటాడు. ఇరవై నాలుగు గంటలూ ఒకరి మీద మరొకరి ధ్యాస తప్ప మరొకటి లేదు. ఈ డబ్బు, సంపదా, ప్రపంచంలోని ఏ ప్రలోభమూ మమ్మల్ని విడదీయలేదు. మేం ఇప్పుడు ఇద్దరం కాదు. ఒక్కరమే. అతన్ని తప్ప మరొకర్ని భర్తగా ఊహించుకోలేను” అని చెప్పింది గీత.

“వయసులో ఉన్న వాళ్లు, పాలపొంగులాంటి యవ్వనంలో ఉన్న వాళ్లు ప్రేమ మైకంలో పడటం సాధారణమే. కానీ ఈ మైకం ఎన్నాళ్లో ఉండదు. ఒకటి రెండు సంవత్సరాల తరువాత ఆయిన వాళ్లు అందరూ దూరమై, కట్టుకున్న వాడితో కొట్లాటలు మొదలు అయినాక, ఏకాకిగా మిగిలినప్పుడు, ఎంత పెద్ద తప్పు చేశావో అప్పుడు తెలుస్తుంది” అన్నాడాయన.

“ఎవరికో రోడ్డు ప్రమాదం జరిగిందని, ఎవర్నీ రోడ్డు మీద నడవొద్దనటం భావ్యమేనా, నాన్నా..”

“ఈ రోజున నేను చెబుతున్న మాటలు గుర్తు పెట్టుకో.. పరస్పర విరుద్ధమైన వాతావరణాలలో పెరిగిన మీరిద్దరూ కల్సి జీవించలేరు. ఇది నిజం. ఒకటి, రెండేళ్ల తరువాత ఒకరికొకరు రంగువెలిసిన బొమ్మల్లా కనిపిస్తారు. అప్పుడు ఇల్లు ఒక కురుక్షేత్ర రణరంగం అవుతుంది. యుద్ధం అనివార్యం అవుతుంది. ఇప్పుడు విడిచి ఉండలేము అనుకున్న వాళ్లే, అప్పుడు కల్సి ఉండలేము అని అనుకుంటారు..” అన్నాడు శ్రీనివాసమూర్తి.

“మీరు మేధావులే కావచ్చుగానీ, ఈ విషయంలో మాత్రం మీ అంచనాలు పూర్తిగా తల్లకిందులవుతాయి. మేం ఆజన్మాంతం కల్సే ఉంటాం. ఈ విషయంలో మీతో ఛాలెంజ్ చేస్తున్నాను” అన్నది గీత ఆవేశంగా.

“రేపటి నుంచీ, నీ జీవితమే ఒక ఛాలెంజ్‌గా మారబోతోంది” అని చెప్పాడు శ్రీనివాసమూర్తి.

గీతకు తన అభిప్రాయాలకు తోడు, ప్రేమించిన వాడి ప్రోద్బలం కూడా తోడు అవటంతో, ఆమెకు అతను చెప్పిందే ఎంతో  గొప్పగా కనిపిస్తుంది.

గీత ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవటానికి సిద్ధమైనప్పుడు తల్లి కుమిలి కుమిలి ఏడ్చింది. పిల్లను ఆపమని ఆమె భర్తను వేడుకుంది.

“అది మన కంటి వెలుగు. ఈ ఇంటి దీపం. అది వెళ్లిపోయాక మన జీవితాల్లో చిమ్మ చీకటే మిగిలిపోతుంది. ఇన్నాళ్ల మన ఆశలు, కోరికలూ అన్నీ చెల్లాచెదరైపోతుంటే, నా గుండె బద్దలైపోయి, నేను నిలువునా రెండుగా చీలిపోతుంటే, మీరు అంత నిశ్చింతగా ఎలా ఉండగలగుతున్నారు చెప్పండి” అని ఏడ్చేసిందామె.

“బాధపడకు అనసూయా. పిల్లలు మన నుంచి వస్తారు. కానీ వాళ్లు పూర్తిగా మన వాళ్లు కారు. మనతో ఉంటూ, మన ఇంట్లో ఉంటూ మన కళ్లముందు చెట్టంత మనుషులుగా ఎదుగుతారు. కానీ వాళ్లు మనం చెప్పినట్లు వినరు. మనం ఉండమన్నట్లు ఉండరు. వాళ్లకు సొంత ఆలోచనలూ, అభిప్రాయలూ ఏర్పడతాయి. వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మనం నిన్నటి మనుషులం. వాళ్లు ఈనాటి మనుషులు. అందుచేత మన మాటలు నచ్చవు. వెళ్లనీ దాని ఇష్టమైన చోటుకు వెళ్లనీ. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది” అన్నాడాయన.

ఆ విధంగా గీత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చర్చిలో క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకుంది. పెళ్లికి రమ్మని ఫోన్‌లో పిల్చినప్పుడు శ్రీనివాసమూర్తి అన్నాడు.

“గీతా, నీ మీద నాకు జాలి తప్ప కోపం లేదు. తండ్రిని కనుక నిన్ను ఇన్నేళ్ల పాటు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వాడిని కనుక, ఇంకా ఆశ చావక అడుగుతున్నాను. ఈ చివరి క్షణంలో అయినా, నీ మనసు మార్చుకోలేవా?”  అని దీనంగా అడిగిన తండ్రికి దృఢ చిత్తంతో చెప్పింది.

“అతన్ని తప్ప మరొకర్ని నా భర్తగా ఈ జన్మలో ఊహించలేను, నాన్నా” అన్నది.

కన్న కూతురు పెళ్లి చేసుకుంటున్నాను ఆశీర్వదించమంటే, ఏమనాలో తెలియలేదు ఆయనకు.

“తెల్లవారి లేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న డాక్టరుగా సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్న నన్ను ఈ దెబ్బతో తలెత్తుకోలేకుండా చేశావు. ఏ మొహం పెట్టుకుని నన్ను నలుగురిలోకి రమ్మంటావు?  తిట్టి, కొట్టి ఇంట్లో కూర్చోబెట్టేందుకు నువ్వు చిన్న పిల్లవు కావు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియటం లేదు. ఈ విషయంలో నిన్ను నేను సమర్థించలేకపోయినా, నీతో సహకరించ లేకపోయినా, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలనే కోరుకుంటాను” అని అంటున్నప్పుడు ఆయన గొంతు జీరపోయింది.

గీత వివాహం చేసుకుంది. ఆమె తండ్రి కన్నా, తల్లి మానసికంగా బాగా కృంగిపోయింది. ఆమె వీధి మొహం చూడలేకపోయింది. జబ్బు పడిన దానిలా మంచం దిగటం లేదు.

ఏడాది గడిచింది. ఎవరి పట్టుదలలో వారున్నారు. గీత భర్తతో వెళ్లిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న ఊరిలో అతనికి ఉద్యోగం దొరికింది.

ఒక రోజు ఆ ఊరి నుంచి కార్డు వచ్చింది. ఎవరో అపరిచితులు రాశారు. “మీ అల్లుడు జైల్లో ఉన్నాడు. మీ అమ్మాయి ఒంటరిగా దిక్కు లేని దానిలా పడి ఉంది. వచ్చి తీసుకెళ్లండి” అని దాని సారాంశం.

శ్రీనివాసమూర్తి ఆ ఊరికి వెళ్లాడు. కూతురి ఇంటి తలుపు తట్టాడు. తండ్రిని గీత సాదరంగా ఆహ్వానించింది. ఆమె మొహంలో విషాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి జరిగినదంతా చెప్పారు.

“మీ అల్లుడి తప్పు ఏమీ లేదు. ఈ ఊరిలోని ఒక రౌడీ వెధవ మీ అమ్మాయి మీద కన్ను వేశాడు. ఆరు నెలల నుంచి అనేక విధాలుగా వేధిస్తున్నాడు. చాలా సార్లు గొడవలు జరిగాయి. కిందటి వారం వాడు తాగొచ్చి నానా అల్లరీ చేశాడు. మీ అల్లుడు కొట్టాడు. వాడు చచ్చాడు. ఇతన్ని జైల్లో పెట్టారు. ఇదీ కథ..”

శ్రీనివాసమూర్తి నిట్టూర్చాడు. గీత చెప్పింది “విధి వక్రించింది. మాకు కష్టాలు తప్పలేదు. కానీ అతనికి నేనంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. అందుచేత నేను ఓడిపోలేదు..” అని గుర్తు చేసింది.

“నీకు నేను ఎంతో ఉదాత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. ఈ మారుమూల పల్లెలో ఈ ఇరుకు గదిలో, ఈ కొట్టాటల్లో, ఘర్షణల్లో, రక్తపాతంలో నువ్వు సుఖపడుతున్నానంటే, నాకు నమ్మకం లేదు..” అన్నాడాయన.

“ఇక్కడ సౌకర్యాలు లేకపోవచ్చు. కాని ఇది నా ఇల్లు..”

“డ్రగ్స్ లాగా ప్రేమ కూడా ఒక మత్తు పదార్థం. ఆ మత్తులో ఉన్న మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నీకు రక్షణ లేదు. అతన్ని విడిచిపెట్టేంత వరకూ మన ఇంటికెళ్దం. రా..” అని నచ్చచెప్పాడు.

“నేను మీ ఇంటికి రావచ్చా నాన్నా. నా మీద కోపం లేదా?”

“మీరు పిల్లలు. తప్పులు చేస్తుంటారు. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు కాకపోతే ఎవరు క్షమిస్తారు.. అతని తరపు వాళ్లు ఎవరూ రాలేదా అమ్మా..”

“రాలేదు. మా పెళ్లి వాళ్లకూ ఇష్టం లేదు..”

రైలు దిగి ఆటో ఎక్కినప్పటి నుంచీ గీత గిల్టీగా ఫీలవడం మొదలు పెట్టింది. ఎందుకో స్పష్టంగా చెప్పలేకపోయినా, తాను ఓడిపోయానన్న న్యూనతా భావం కలిగింది.

తండ్రి మాటలే గుర్తొస్తున్నాయి.  “పిల్లలు తప్పు చేస్తారు. తల్లిదండ్రులు కాకపోతే మరెవరు క్షమిస్తారు?”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here