చిరుజల్లు-44

0
10

కరుణించిన కరుణ

[dropcap]కా[/dropcap]రు డ్రైవరు గంట సేపు ఆ కాలనీలోని వీధుల్లో వాకబు చేశాకగానీ ఆ ఇల్లు ఎక్కడో తెలియలేదు. కారు ఒక చిన్న సందులోకి వెళ్లి ఆగిపోయింది.

కరుణ కారు దిగి చుట్టూ చూసింది. అవన్నీ చిన్న చిన్న ఇళ్లు. తక్కువ ఆదాయం గల వారి కోసం కట్టించినవి. కారు ఆగగానే ఆ ఇళ్లల్లోని ఆడవాళ్లు తొంగి చూశారు.

“సులోచనాదేవి ఇల్లు ఎక్కడ?” అని అడిగింది కరుణ.

“అదిగో, ఆ ఎదురిల్లే” అన్నది ఒక నడివయసు స్త్రీ.

కరుణ ఆ ఎదురింట్లోకి వెళ్లింది. అరవై ఏళ్లు వయసులో నున్న సులోచనాదేవికి చూపు మందగించింది. కరుణ వైపు ఎగాదిగా చూస్తూ “ఎవరు కావాలండీ?” అని అడిగింది.

“సులోచనాదేవి గారంటే..” అని కరుణ అర్థోక్తిలో ఆగిపోయింది.

“నేనే, ఇంతకీ మీరు..? ” అని అడిగింది సులోచనాదేవి.

కరుణ అదోలా నవ్వింది. “నేను మిమ్మల్ని చూద్దామనే వచ్చాను. ఇప్పుడెలా ఉన్నారు? మీ ఆరోగ్యం బావుందా?”

“నా ఆరోగ్యమా? ఊరు పొమ్మంటోంది. కాడు రమ్మంటోంది. ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను.. ఇంతకీ నువ్వేవరో నేను పోల్చుకోలేకపోతున్నాను. ఎవరమ్మా నువ్వు?” అని అడిగింది సులోచనాదేవి.

“మీరు ఇంతకు ముందు నన్ను చూడలేదులెండి. అందుచేత పోల్చుకోలేరు. మీ మనవడు మీ దగ్గరే ఉన్నాడా?” అని అడిగింది కరుణ.

“నా దగ్గరకాక ఇంకెక్కడ ఉంటాడమ్మా. కోడలు వాడిని అలా అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయింది. వాడు పిచ్చివాడైపోయాడు..”

“అర్థంతరంగా వెళ్లిపోయిందంటే? చనిపోయిందా?” అని అడిగింది కరుణ.

“చనిపోయినా బావుండేది.. మాకు సంబందించినంత వరకూ చనిపోయినట్లే లెక్క. ఇంతకూ ఈ వృద్ధాప్యంలో నాకు కష్టాలు వచ్చి పడినయి. మా వాడు దాని పేరు చెబితేనే మండి పడుతున్నాడు. నలుగురిలోకి వెళ్లలేక పోతున్నాడు. అగ్ని పర్వతంలాగా లోలోపలే రగిలిపోతున్నాడు. ఉన్న ఊళ్లో తెల్సిన వాళ్ల మందు తలెత్తుకు తిరగలేక ముంబాయి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. దాని దోవన అది వెళ్లిపోయింది. వీడి దోవన వీడు వెళ్లిపోయాడు. ఈ పసివాడు నా కాళ్లకు కనిపించని బంధమైనాడు. కాళ్లూ చేతులూ ఆడని ఈ వయసులో, కంటి చూపు మందగించిన ఈ దశలో, పసివాడ్ని పెంచే భారం నా నెత్తిన పడింది. ఏం చేయను చెప్పు తల్లీ” అని బాధపడింది సులోచనాదేవి.

ఇప్పుడు వార్ధక్యంలో ఉన్నందువల్ల ఇంత నిస్సహాయంగా మాట్లాడుతోంది గానీ, కొన్నేళ్ల కిందట ఈమె వెలగబెట్టిన డాబు, దర్బం తక్కువైన వేమీ కావు.

అప్పట్లో ఆమె మాట వేద వాక్కులా జరిగితీరేది. వయస్సు ప్రభావం వల్ల పరిస్థితుల ప్రభావం చేత ఆమె కృంగిపోయింది. అయినా ఒకనాటి దర్పం ఇంకా లీలగా కనిపిస్తూనే ఉంది.

ఇంతలో పిల్లవాడు నిద్ర లేచి ఏడుపు మొదలెట్టాడు. సులోచనాదేవి పాల సీసాను శుభ్రం చేయటం మొదలెట్టింది. కరుణ పిల్లాడిని ఎత్తుకొని ఆడించింది. పిల్లవాడు ఏడుపు ఆపాడు.

కరుణ ఇల్లంతా ఒకసారి కలియ జూసింది. పేదరికం ఎటు చూసినా కనిపిస్తోంది. కరుణ డ్రైవర్ని పిలిచింది. పిల్లవాడికి కావలసిన డ్రెస్సూ, ఆట వస్తువులూ తీసుకురమ్మని డబ్బు ఇచ్చి పంపించింది. కారు వెళ్లపోయింది.

సులోచనాదేవి పిల్లవాడ్ని అందుకొని వాడికి పాలు పడుతూ, తనలో తనే ఏదో గొణుక్కుంటోంది.

“నా ఖర్మ ఇలా కాలింది. కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ధం. పశువులు కూడా కడుపున పుట్టిన వాటి మీద మమకారాన్ని చంపుకోలేవు. పశువుల కన్నా అధ్వాన్నం అయిపోతున్నారు..” అని సణుగుతోంది.

“మీ అబ్బాయి డబ్బు పంపించటం లేదా?” అని అడిగింది కరుణ.

“పంపించకేం అమ్మా.. నేను పది ఉత్తరాలు రాస్తే, పదో పరకో పంపిస్తాడు. వాడు ఏడుపు ఏమిటో అక్కడ. వీడి ఏడుపు అంటే వినిపిస్తుంది. వాడి ఏడుపు వినిపించదు గదా. ఈ రోజుల్లో పసిపిల్లల్ని పెంచటం ఎంత కష్టం? ఎంత కష్టమైనా తల్లిదండ్రులకు తప్పదు. అది వాళ్ల బాధ్యత. కానీ ఇద్దరూ ఆ బాధ్యతల నుంచి తప్పంచుకున్నారు. మధ్యలో ముసలిదాన్ని నా మీద పారేసి వెళ్లిపోయారు. ఇది ఎంత వరకు సబబో, చదువుకున్న దానిని నువ్వే చెప్పాలి..” అన్నదామె.

కరుణ నిట్టూర్చింది.

“పెద్దవారు మీరిలా కష్టపడుతుంటే, చూడటానికి నాకే బాధగా ఉంది. కొంచెం సాయం చేస్తాను ఉండండి” అంటూ పిల్లవాడికి స్నానం చేయించింది.

ఇంతలో డ్రైవరు చెప్పినవన్నీ తీసుకొచ్చాడు. డ్రెస్ పిల్లవాడికి తొడిగింది. బొమ్మలు ముందు పెట్టి ఆడించింది. సరియైన పోషణ లేక అలా ఉన్నాడు గానీ, అన్నీ అమరితే, పిల్లాడు సొట్ట బుగ్గలతో, బోసి నవ్వులతో ముద్దొస్తున్నాడు.

“బాబుకు అన్నీ తండ్రి పోలికలే వచ్చాయి” అన్నది కరుణ.

“ఆ,ఆ, తండ్రి పోలికలే వచ్చాయి. అందుకే వాడి అదృష్టం అలా తగలడింది” అన్నది సులోచనాదేవి రుసరుసలాడుతూ.

కరుణ ఆమె దగ్గర శెలవు తీసుకుంటూ అయిదు వేలరూపాయలు ఆమె చేతిలో పెట్టింది. “పిల్లవాడి ఖర్చుకు ఉంచండి” అన్నది కరుణ.

“ఏమిటమ్మా ఇదంతా? ఎవురు నువ్వు? నాలాంటి పేదరాలి ఇల్లు వెతుక్కుంటూ రావటం ఏమిటి? వాడికి ఇవన్నీ ఇవ్వటం ఏమిటి? ఇదంతా కలా, నిజమా అని నమ్మలేక పోతున్నాను. ఇంతకీ నువ్వు ఎవరో చెప్పనే లేదు.”

“మేం ఒక సంఘం పెట్టుకున్నాం. సమాజంలో ఇలా మా అవసరం ఎవరికి ఉంటుందో, వాళ్ల ఇంటికి వెళ్లి మాకు చేతనయినది చేస్తుంటాం. నేను మీకు కావల్సిన దాన్నే అనుకోండి. మీ ఇంట్లోని మనిషినే అనుకోండి. ఇంత కాలం మీ విషయం తెలియక రాలేకపోయాను. ఇక నుంచీ వీలున్నప్పుడల్లా వస్తూనే ఉంటాను..” అన్నది కరుణ.

“కనీసం నీ పేరు అయినా చెప్పు అమ్మా.. మా వాడు అడిగితే చెప్పటానికి అయినా, నేను తెల్సుకోవాలిగదా..”

“నా పేరు కరుణ..”

“కరుణ.. నిజంగా నీకు తగిన పేరేనమ్మా అది..” అన్నది సులోచనాదేవి.

కరుణ ఆమె దగ్గర శలవు తీసుకొని వచ్చి కారులో కూర్చుంది. కారు వేగంగా మందుకు వెళ్తోంది. ఆమె ఆలోచనలు మాత్రం వెనక్కి వెళుతున్నాయి.

కొన్నేళ్ల కిందట ఇదే సులోచనాదేవి ఏకైక కుమారుడు ఆనంద్‌ను.. తాను ప్రేమించింది. చదువుకున్నంత కాలం ఒక్క రోజు అయినా ఆనంద్‌ను చూడకుండా ఉండలేకపోయింది. అప్పట్లో అతనూ అంతే. కల్సుకున్నప్పుడే కాదు, విడిపోతున్నప్పుడూ ఒకరి ఆలోచనలతోనే మరొకరి మనసు నిండిపోయేది. “నిన్న నువ్వు నా కలలోకి వచ్చావు” అని ఒకరు అంటే. “నువ్వు నా కళ్లల్లోనే మెదలుతున్నావు” అని మరొకరు అనేవారు నవ్వుతూ.

సినిమాలూ, షికార్లూ, కబుర్లు, వీటితోనే సరిపోయేది కాలమంతా .

ఒకరినొకరు చదవటం పూర్తి అయిన పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలూ అయిపోయ్యాక, అసలు పరీక్ష ఎదురైంది.

“ఇక ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, ఆనంద్” అన్నది కరుణ.

“నీకు తెలియనిది ఏముంది కరుణా, నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మా అమ్మే, నాకు తల్లీ తండ్రీ అన్నీ. నన్ను ఈ మాత్రం చదివించటానికి ఎన్నో కష్టాలు పడింది. అందుచేత ఆమెకు చెప్పకుండా, ఆమెను ఒప్పించకుండా ఏమీ చేయలేను” అన్నాడు ఆనంద్.

అతను చెప్పిందీ సబబుగానే ఉంది. పెద్దవాళ్లకు చెప్పి, ఒప్పించే కదా వివాహం చేసుకోవాలి. కరుణ ఒక రోజు ఆనంద్‌ను తన ఇంటికి తీసుకెళ్లింది. తల్లిదండ్రులకు పరిచయం చేసింది. క్లుప్తంగా విషయం చెప్పింది.

“మీ అమ్మకు చెప్పే ధైర్యం నీకు లేకపోతే, మేమే వచ్చి ఆమెతో మాట్లాడుతాం” అన్నాడు కరుణ తండ్రి.

కరుణ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లి సులోచనా దేవిని కల్సుకున్నారు. “పిల్లలు ఇద్దరూ ఇష్టపడ్డారు. మనకు అంతకన్నా కావల్సిందేముంది?” అన్నది కరుణ తల్లి.

“వాడి మొహం. వాడికేం తెల్సు. వాడి మంచి చెడులు చూడవల్సిన దాన్ని నేను. వాడి పెళ్లి విషయంలో రెండు షరతులున్నాయి. మొదటిది అమ్మాయి మా కులానికి చెందినదై ఉండాలి. రెండవది పాతిక లక్షల కట్నం తీసుకురావాలి. ఈ రెండు విషయాల్లో రాజీ పడే ప్రశ్నే లేదు” అన్నది సులోచనాదేవి స్పష్టంగా.

రెండవ షరతు విషయంలో ఇబ్బంది లేకపోయినా, అసలు సమస్య మొదటి షరతు దగ్గరే వచ్చింది.

కరుణ మీద ఎంత ప్రేమ, వ్యామెహం ఉన్నా, ఆనంద్ తల్లిని ఒప్పించలేకపోయాడు. ఆమెను ఎదిరించనూ లేకపోయాడు.

“ఆమె మాట కాదంటే, మా అమ్మ ఎలాంటి అఘాయిత్యం అయినా చేస్తుంది కరుణా, ఆమె సంగతి నీకు తెలియదు” అన్నాడు ఆనంద్.

కరుణ మౌనంగా కన్నీరు నింపుకోవటం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఆ నిరాశానిస్పృహల నుంచి తేరుకోవటానికి చాలా కాలం పట్టింది. మనసు మళ్లించటం కోసం ఉద్యోగంలో చేరింది.

చూస్తుండగానే ఆనంద్ జీవితం చకచకా మారి కొన్ని దశలు దాటి పోయింది. భర్త అయినాడు. తండ్రి అయినాడు. భార్య ఉండీ లేనిదే అయింది.

తను ఉండాలని ఆశపడిన స్థానంలో ఇంకెవరో వచ్చారు. ఆమె అయినా నిలబడిందా అంటే అదీ లేదు. జీవితం అంతా ఒక చదరంగం.

కరుణ తరచూ సులోచనాదేవి ఇంటికి వెళ్లి వస్తోంది. వెళ్లినప్పుడల్లా పిల్లవాడికి బహుమతులు పట్టుకెళ్తూనే ఉంది.

“ఎందుకమ్మా, వీడి మీద నీకింత మమకారం?” అని అడిగింది సులోచనాదేవి.

“ఏమో, నాకు తెలిస్తే గదా, మీకు చెప్పటానికి? నేను వీడ్ని పెంచుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే..” అని అడిగింది కరుణ.

“వాడికి తల్లీ తండ్రీ ఉండీ లేని వాళ్ళు అయినాడు. నువ్వు కరుణించిన దేవతలా వచ్చి ఆదుకుంటున్నావు. తల్లి లేని లోటు తీరుస్తున్నావు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే బలమైనది అమ్మా” అన్నది సులోచనాదేవి.

కరుణ బాబును ఎత్తుకొని వెళ్లి కారులో కూర్చుంది. పసివాడిని గుండెలకు హత్తుకుంటే, అప్పుడెప్పుడో ఆనంద్‌ను గుండెలకు హత్తుకున్న అనుభూతి కలిగింది.

“ఎప్పుడో ఒక రోజు ఆనంద్ వస్తాడు, వీడిని వెతుక్కుంటూ.. తననూ వెతుక్కుంటూ.. ” అనుకున్నది కరుణ నిట్టూరుస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here