చిరుజల్లు-47

0
6

అలుకలు – చిలుకలు

[dropcap]హైం[/dropcap]దవిని చూడగానే ‘నాకు కాబోయే భార్య ఈమే’ అనుకున్నాడు భార్గవ. ఈ విషయం మధ్యవర్తి ద్వారా తెలియజేశాడు.

ఆమె కస్సుమంది. ‘అతనెవరు, నా పెళ్ళి గురించి నిర్ణయాలు చేయటానికి?’ అన్నది.

‘సరే అయితే, నా మనసు మార్చుకుంటున్నాను’ అని కబురు చేశాడు అతను.

ఆమె దారికొచ్చింది. మనసు మార్చుకుని, ‘సరే, ఓకే’ అన్నది.

కొద్దిరోజుల పాటు ఎడబాయని జంటలాగా మసలుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళే కనబడేవాళ్లు. తరువాత నెమ్మదిగా అతను తనకు ఉన్న బరువు బాధ్యతల గురించి చెప్పాడు. ‘తల్లినీ, తండ్రినీ నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంద’న్నాడు.

‘అయితే నీకూ నాకూ పొసగదు పొమ్మ’న్నది హైందవి.

‘నాలుగు రోజుల కిందట కల్సిన నీ కోసం నా తల్లిదండ్రులను ఎలా వదులుకుంటాను. నువ్వే పో’ అన్నాడు భార్గవ.

పెళ్ళి ఆలోచన టెంపరరీగా మానుకున్నాడు. ఆమె కనబడటం మానేసింది. ఈ విషయం తెల్సిన ఆమె ఫ్రెండ్ సర్ది చెప్పింది. “అది చాలా చిన్న విషయం. తల్లిదండ్రులు అందరికీ ఉంటారు. నీకూ ఉన్నారు. నీ పేరెంట్స్‌ని చూడాల్సిన అవసరం నీకూ ఉంది. ఇదే అతనితో చెప్పు” అన్నదా ఫ్రెండ్.

హైందవి మళ్లీ మనసు మార్చుకుంది. పనిగట్టుకుని కల్సి, పలకరించింది. అతనూ మనసు మార్చుకున్నాడు. మళ్ళీ కలుసుకోవటం మొదలుపెట్టారు.

చివరకు విషయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

అందరికీ ఉండే సమస్య వీళ్ళకూ వచ్చింది. కట్నాలు కానుకల దగ్గర పేచీ వచ్చింది. మళ్ళీ విడిపోయారు. నెల రోజుల తరువాత మధ్యవర్తుల ద్వారా ఒక అంగీకారానికి వచ్చారు.

ముహూర్తాలు పెట్టుకున్నారు. చీటికిమాటికీ ఏవేవో కొత్త కొత్త కోరికలు పుట్టుకొచ్చేవి. మగపెళ్ళివారు ఖర్చు పెంచేస్తున్నారని, ఆడపెళ్ళివారు గోల పెట్టారు.

హైందవికి కోపం వచ్చింది. రోజుకోసారి ‘సంబంధం కాన్సిల్’ అని కబురు చేసేది.

“మానెయ్యండి. నెల తిరిగేసరికి దీని తాత లాంటి సంబంధం కుదురుతుంది” అని పెళ్ళికొడుకు తరపు వాళ్ళు బదులుపలికారు.

ఎలాగో రాజీలు కుదురుతూ వచ్చాయి.

వియ్యాలవారు విడిదిలో దిగాకా, మర్యాదలు సరిగ్గా చేయటం లేదంటూ అలగటాలూ – అమ్మాయిగారు ‘అయితే కాన్సిల్’ అనటాలూ – జరుగుతూనే –

ఇరుపక్షాల మధ్యా బెట్టుసరితోనే మూడు ముళ్ళూ పడినయి.

కొత్త కాపురం, కోరిన వరం – అంటారు. ఇలా కోరుతూ, పోరుతూ కల్సొచ్చిన వరం, జరుగుతూ, అలుగుతూ, ఒరుగుతూనే గడిచింది.

“మీ వాళ్ళు మా వాళ్ళను పండుగకు పిలిచి బట్టలు పెట్టాలని తెలీదా?” అన్నాడు భార్గవ.

“మీకు మా వాళ్లెందుకు బట్టలు పెట్టాలి? మీకు కావల్సినవి మీరు కొనుక్కోండి. పరాన్న జీవులుగా ఎంత కాలం బతుకుతారు?” అంది హైందవి.

“వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్? మా వాళ్లు గతిలేని వాళ్లు కాదు. పండగ పూట అల్లుడ్ని, వియ్యాలవారిని పిల్చి, పిడికెడు మెతుకులు పెట్టే యోగ్యత మీవాళ్ళకు లేదని చెప్పు.. గతి లేకపోయినా బెట్టుసరికి తక్కువ లేదు” అన్నాడు భార్గవ.

పుట్టింటివాళ్ళను తిట్టినందుకు హైందవికి కోపం వచ్చింది. మాటకు మాట అప్పగించింది. అతనూ రెచ్చిపోయాడు.

ఇద్దరూ అన్నాలు మానేసి ఆఫీసుకు వెళ్ళారు. ఒక గంట తరువాత కోపం తగ్గింది. భార్యను అనవసరంగా నొప్పించానని అతనూ, అతను అన్నదానిలో తప్పేమీ లేదన్న విచక్షణతో ఆమె, రాజీకి వచ్చారు.

మధ్యాహ్నానికి ఫోన్ చేసి ఒకరినొకరు పలకరించుకొని, హోటల్లో కల్సుకొని భోంచేశారు.

“వండినవన్నీ ఇంట్లో అలానే పడి ఉన్నయి. ఇక్కడ డబ్బు దండగ” అన్నదామె.

“మళ్ళీ మొదలెట్టావా? నాన్ స్టాప్ నాన్సెన్స్” అని విసుక్కున్నాడు.

“మీదే నాన్ స్టాప్ నాన్సెన్స్. నేను కాబట్టి సర్దుకుపోతున్నాను. వేరొకతె అయితే, ఈ పాటికి గుడిసె మీద దెబ్బ కొట్టి లేచిపోయేది..” అన్నది హైందవి కోపంగా.

“నేను కాబట్టి నీ సణుగుడు భరిస్తున్నాను. మరొకడు అయితే, పదహారు రోజుల పండగ వెళ్లకుండానే కాషాయం కట్టుకుని కాశీలో గంగ ఒడ్డున కూర్చుని రామాహరీ అనుకుంటూ ఉండేవాడు”

ఆ విధంగా వాళ్ళ సంభాషణ ఎప్పుడూ, నిప్పుల మీద పడిన ఉప్పులాగా చిటపట మంటూ ఉండేది.

భార్గవ టీ.వీ.లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు.

“వెధవ క్రికెట్. పొద్దుట్నించీ వీడు బంతి మీద బంతి విసరటం, వాడు కొట్టటం, జనం గొల్లుమనటం.. బెర్నాడ్ షా మీ గురించే చెప్పాడు. లెవెన్ ఫూల్స్ విల్ ప్లే ఇట్. లెవెన్ థౌజండ్ ఫూల్స్ విల్ సీ ఇట్.. అని” అన్నది హైందవి.

“అక్కడికి నువ్వు చూసే సీరియల్స్ లోని వాళ్ళంతా, మేధావులు అయినట్టు.. ఆ సీరియల్స్ నిండా చచ్చు డైలాగులు, పుచ్చు సీన్స్..” అన్నాడు అతను.

“మీ టేస్ట్ గురించే చెప్పుకోవాలి..”

“నీ టేస్ట్ మండిపోయి చచ్చిందిలే”

మాటామాటా పెరిగేది. రిమోట్ విసిరేసి, ఇద్దరూ చెరో వైపుకు వెళ్ళారు. అతను వెళ్లి ముసుగు తన్నేవాడు. ఆమె గిన్నెల మీద ఇన్‍స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాయించేది.

ఒక గంట తరువాత కోపం తగ్గేది. హైందవి చెప్పిందీ నిజమే గదా అని భార్గవకి అనిపించేది. భార్గవ అన్నదానిలోనూ రీజనింగ్ ఉందనిపించేది హైందవికి.

అతను లేచి వచ్చి మంచి నీళ్ళు తాగేవాడు.

“కాఫీ ఇస్తున్నా, తాగి వెళ్ళండి. అన్నీ మీ కాళ్ళ దగ్గరకు అందించలేను” అంది బింకంగా.

“నేను టీ.వీ. అమ్మేద్దామనుకుంటున్నా.. అది ఉన్నప్పటి నుంచీ దానిలోనూ గొడవలే, మనలోను లేనిపోని గొడవలే…” అన్నాడు భార్గవ.

“అందరూ ఒకటికి రెండు కొనుక్కోవాలనుకుంటారు. మీరేమో ఉన్నవి అమ్మేయాలనుకుంటున్నారు” అన్నది కాఫీ అందిస్తూ.

“మేమంతా నెంబర్ వన్ ఫూల్స్ కదా.. అందుకని..”

“మీరు మరీ. గోరంతలు కొండంతలు చేసారు.. నెంబర్ వన్ అని నేను అనలేదు. బెర్నార్డ్ షా కూడా అనలేదు.. కావాలంటే వెళ్ళి ఆయన్ని అడగండి ఎందుకలా అన్నాడని..”

“అంటే నేనిప్పుడు చచ్చి స్వర్గాన ఉన్న బెర్నార్డ్ షా దగ్గర కెళ్ళాలని నీ కోరిక అన్నమాట..”

“మీరు స్వర్గానికి ఎందుకు వెళ్ళటం? ఆయన అక్కడ ఇంకా ఉంటాడనేనా?” అన్నది పకోడీలు వేయిస్తూ.

హైందవి షాపింగ్‍కి రమ్మంటే రానని అన్నాడు.

“నువ్వు ఒక్క చీర కొనాలంటే, చీరల షాపు మెట్లన్నీ ఎక్కాలి, దిగాలి. వారు చీరలన్నీ విప్పాలి.. చూడాలి.. అదో పెద్ద ప్రాసెస్. నేను ఆ బాధ పడలేను. నీతో షాపింగ్‍కి రావటం కన్నా గోపయ్య నల్లన అనుకుంటూ గొడ్లు కాయటం బెటర్.. నన్ను వదిలెయ్..”

“వదిలెయ్యక మిమ్మల్ని పట్టుకుని వేళ్ళాడుతున్నానా ఏమిటి? షాపింగ్‌కు రమ్మన్నది నేను చీరలు కొనటానికి కాదు మీకు షర్ట్‌లు కొనటానికి..”

“సరే మరి బయల్దేరు”

“నేను రాను. అనరాని మాటలన్నీ అన్నాకా, నేనెందుకు వస్తాను? ఈ జన్మలో మళ్లీ ఎక్కడికన్నా రమ్మనమని అడిగితే, నా పేరు హైందవి కాదు..” అన్నది ఆవేశంగా.

షరా మామూలే.

ఒక గంట సేపు అలుకలు. మౌనం రాజ్యమేలేది.

రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్యా చీటికి మాటికీ చిరాకులూ, ఘర్షణలూ జరిగేవి. మాటకు మాట అప్పగించటంలో ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరు.

“నువ్వు ఒక జీనియస్‍వి అని అనుకో. నాకు అభ్యంతరం లేదు. కానీ నన్నొక ఇడియట్‍లా చూడకు. ఐ డోంట్ టాలరేట్ దట్” అన్నది హైందవి.

“నేను ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకు ఇస్తాను. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతే నేనేం చేస్తాను?” అన్నాడు భార్గవ.

అతని ఆఫీసర్ ఒకరోజు భార్గవ దంపతులను తమ ఇంటికి డిన్నర్‍కి పిల్చాడు. ఇంటికి వచ్చాక హైందవితో చెబితే తను రానన్నది.

“ఎందుకని?”

“వాళ్లకి కార్లు, మేడలూ, ఖరీదైన చీరలు, భేషజాలూ ఎన్నో ఉంటాయి. వాళ్ళముందు నేను దిష్టి బొమ్మలా ఉంటాను. అక్కడికి వెళ్ళాక నన్ను పలకరించేవాళ్లు ఎవరూ ఉండరు. టేబుల్ మీద పడేసింది తిని రావాలి. నాకు చాలా అవమానంగా ఉంటుంది. నేను రాను..” అన్నది హైందవి.

“ఇద్దర్నీ పిలిచాడాయన. వస్తామని చెప్పాను. ఇప్పుడు వెళ్ళకపోతే బావుండదు. నేను ఆయన ముందు చిన్నబుచ్చుకోవాలి..” అన్నాడు భార్గవ.

చాలాసేపు ఘర్షణ పడ్డాక, అయిష్టంగానే, మొహం మాడ్చుకుని, ఆయన వెంట వెళ్ళింది హైందవి.

ఆ ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు లాన్. అందులో ఒక ఫౌంటెన్, పూలకుండీలు. ఐశ్వర్యానికీ, సంపదకూ దర్పం పడుతోంది ఆ ఇల్లు.

గుమ్మంలోకి వెళ్ళగానే, రాఘవేంద్రరావు నవ్వుతూ ఎదురొచ్చి ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్ళారు. సోఫాలో కూర్చున్నారు. నౌకరు మంచినీళ్ళు తెచ్చి ముందు పెట్టాడు.

విశాలమైన హాల్లో ఖరీదైన ఫర్నిచర్, నిలువెత్తు పాలరాతి బొమ్మలు, అందమైన పెయింటింగ్స్.. ఆయన హోదాను, దర్పాన్ని చెప్పకనే చెబుతున్నయి.

తెల్లని లాల్చీ, పైజమా ధరించి, చిరునవ్వుతో మాట్లాడుతున్న ఆయన్నే గమనిస్తోంది హైందవి.

తామిద్దరే తప్ప, వేరే అతిథులు ఎవరూ లేరు. ఆయన భార్య బయటకు వచ్చి పలకరించకపోవటం హైందవికి కష్టంగా ఉంది.

స్నేహానికి అయినా, కయ్యానికైనా సమానత్వం ఉండాలంటారు. ఆఫీసర్‌కీ గుమాస్తాకీ మధ్య స్నేహం ఉండదు. నిమ్నత్వం ఉంటుంది. ఆయన ఆధిక్యం ఉంటుంది.

రాఘవేంద్రరావు హైందవిని పలకరించారు. ఆమె పేరూ, ఊరూ అడిగి తెల్సుకున్నారు.

“మీ తెనాలిలో మా బంధువు లున్నారు. రెండు మూడు సార్లు వచ్చాను” అన్నాడాయన.

ఎంతసేపూ ఆయన మాట్లాడుతున్నాడే గాని, ఆయనగారి భార్యామణి బయటకు రావటం లేదు. అందుకు హైందవి లోలోపల ఫీల్ అవుతూనే ఉంది.

కాసేపటికి ఆయనే అన్నాడు.

“మా ఆవిడను పరిచయం చేస్తాను రండి” అంటూ ఆయన హాల్లో నుంచి పక్క గదిలోకి తీసుకువెళ్ళాడు.

ఆమె అక్కడ పరుపు మీద పడుకొని ఉంది. నడుము దాకా దుప్పటి కప్పుకొని ఉంది. ఆమె ముఖం మాత్రం అందంగా, కళగా ఉంది.

హైందవిని పరిచయం చేశారు, రాఘవేంద్రరావు.

“కూర్చోండమ్మా. నిజానికి నేను అతిథులకు ఎదురొచ్చి స్వాగతం పలకాలి. అది మర్యాద. కానీ దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు. నడుము దగ్గర నుంచి శరీరం క్రమంగా చచ్చుబడిపోయింది. ఇప్పుడు నా అంతట నేను లేవలేను. రెండు అడుగులు వేయలేను. జీవితాంతం ఈ మంచానికే అంకితం అయిపోవటం ఒక ఎత్తు అయితే, ప్రతి చిన్న పనికీ ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సి రావడం మరొక ఎత్తు..” అన్నాదామె, కనుకొనుల్లో నిండిన కన్నీటి ముత్యాలతో.

“వెరీ సారీ మేడమ్” అన్నాడు భార్గవ.

“పూర్వ జన్మలో ఎవరికి ఏం పాపం చేశానో, ఇప్పుడీ నరకం అనుభవిస్తున్నాను. నా వల్ల అందరికీ బాధ. నేను ఇంటి పనులు చేసుకోలేకపోగా, ఇంకొకరు నాకు సేవలు చేయాల్సి వస్తోంది” అన్నదామె.

భార్గవ ఆమెను ఓదార్చటానికి అన్నాడు – “మీరు అధైర్యపడకండి. సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఎలాంటి జబ్బులనయినా నయం చేయగలుగుతున్నారు డాక్టర్లు..”

“అవును. సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. కొత్త కొత్త రోగాలకు కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు.. కానీ నుదుట రాసిన రాతను ఎవరూ తప్పించలేరు..” అన్నదామె.

ఇల్లు చూపించే మిషతో ఆయన వాళ్ళను అక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చాడు.

“దేవుడు మాకు సంపద నిచ్చాడు. పది సంవత్సరాల పాటు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. కానీ మా తరువాత దీన్ని అనుభవించటానికి మాకు పిల్లలు లేరు. దాని ఆరోగ్యం చూస్తున్నారు గదా. అన్నీ మంచంలోనే జరగాలి. పసిపిల్లను కనిపెట్టినట్లు కనిపెట్టి చూసుకోవాలి.. అందుచేత ఇంక నేను ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను..” అన్నాడాయన.

“అదేమిటి సార్?” అన్నాడు భార్గవ.

“ఇన్నేళ్ళపాటు కంటికి రెప్పలా కాపాడింది. నా కంట్లో నలుసుపడినా, కాల్లో ముల్లు విరిగినా తను విలవిల్లాడేది. నాకు కొంచెం ఒళ్ళు వెచ్చబడితే, ఇల్లు కదలనిచ్చేది కాదు. ఈ డబ్బు, సంపద, సుఖశాంతులు, అన్నీ నాకు నా భార్య వల్లనే వచ్చాయి. తిరిగినంత కాలం నా బాగోగుల గురించే ఆలోచించింది. భార్యగా, సహధర్మచారిణిగా తను చేయాల్సినవన్నీ చేసింది. ఇప్పుడు కదలలేని స్థితిలో ఉంది. దానిని దగ్గరుండి చూసుకోవాలి. అది నా బాధ్యత. మానవత్వం ఉన్న ఒక మనిషిగా..” అంటుండగా ఆయన గొంతు గద్గదమై పోయింది. పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడాయన.

ఆయన మళ్ళీ ఆమె ఉన్న గదిలోకి వెళ్ళారు. పది నిముషాల తరువాత ఆమెను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి, ఆ చక్రాల కుర్చీని నెట్టుకుంటూ తీసుకొచ్చారు.

“రండి, భోజనాలకు లేవండి” అన్నదామె.

“అయ్యో, మీరు వచ్చారా?” అన్నాడు భార్గవ.

“అతిథులు ఇంటికి వస్తే, లోపలికి రమ్మని ఆహ్వానించటం దగ్గర నుండి భోజనం వడ్డించటం వరకు ఇల్లాలి బాధ్యత. టేబుల్  మీద పెట్టి, తినేసి వెళ్ళమంటే, మిమ్మల్ని అవమానించినట్లే అవుతుంది” అన్నదామె.

డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు. ఆమె ఒక్కొక్క ఐటెమ్ తినమని బలవంతం చేసింది. ఆమె అలాంటి స్థితిలో ఉండి కూడా తమ పట్ల చూపే మర్యాదకు, ఆప్యాయతకు హైందవికి దుఃఖం వస్తోంది.

భోజనాలు అయ్యాకా, ఆమె హైందవికి ఖరీదైన పట్టుచీర, రవిక, పండూ, తాంబూలం బొట్టు పెట్టి ఇచ్చింది.

“ఇవన్నీ ఏమిటండీ?” అన్నది హైందవి.

“మాకు పిల్లలు లేరు. నా కూతురు లాంటి దానివి. ఈ మాత్రం చేయకపోతే ఎలా? మీ అమ్మ ఇస్తే తీసుకోవా? నేను మీ అమ్మనే అనుకో.. ఇక నుంచీ నెలకో సారి అయినా వచ్చి ఈ అమ్మను చూసి వెళ్తుండు..” అన్నదామె.

హైందవి ఆమెకు, రాఘవేంద్రరావుకీ పాదాభివందనం చేసింది.

“ఇవాళ నా జీవితంలో మరపు రాని రోజు. నాకు కొత్త అమ్మ, నాన్న దొరికారు” అన్నది హైందవి.

ఆమె చిలకల బొమ్మలు రెండు ఇచ్చింది. “మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉండాలి” అని ఆశీర్వదించింది.

ఆయన రాధాకృష్ణుల బొమ్మ బహుమతిగా ఇచ్చారు.

“ఏ పురుషుడు, ఏ స్త్రీని ప్రేమించనంతగా కృష్ణుడు రాధను ప్రేమించాడు. కనుకనే వాళ్లు ప్రేమకు చిహ్నంగా నిలిచారు” అన్నారాయన.

హైందవి, భార్గవ తమ ఇంటికి వచ్చారు.

“రాధాకృష్ణుల బొమ్మ ముందు రూంలో పెడదాం” అన్నాడు భార్గవ.

“కాదు. చిలకల బొమ్మలు ముందు రూంలో పెడదాం. అది బెడ్ రూమ్‍లో పెడదాం..” అన్నది హైందవి.

కాదన్నాడతను.

“ఎహె, నీకు అసలు ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. బొత్తిగా టేస్ట్ లేదు” అన్నది హైందవి.

“నీ టేస్ట్ మండిపోయి చచ్చిందిలే..” అన్నాడు భార్గవ.

“నన్ను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు..” అన్నది హైందవి.

“ఉన్న మాటే అన్నాను..”

“ఏంటి ఉన్న మాట?..” అని రెట్టించింది హైందవి.

ఆ రాత్రి ఇద్దరూ ఎడమొహం, పెడమొహం గానే పడుకున్నారు.

చిలకలు, అలుకలు పోయినయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here