చిరుజల్లు-49

0
7

తెగిన గాలిపటం

[dropcap]జూ[/dropcap]నియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి రెక్చరర్లతో మాట్లాడుతున్న సమయంలో రామలింగయ్య లోపలకి వచ్చాడు. ఆయన్ను చూడగానే వరలక్ష్మి ఆహ్వానం పలికింది. కొత్త వ్యక్తి రావటంతో లెక్చరర్లు బయటకు వెళ్లిపోయారు.

“చాలా కాలానికి గుర్తొచ్చాను” అన్నదామె నవ్వుతూ.

“అదేమన్నమాట, నువ్వే మా మీద శీతకన్ను వేశావు. అయిన వాళ్లం. ఊళ్లో ఉన్నాం. ఎప్పుడైనా ఒకసారి అయినా మా ఇంటి వైపు తిరిగి చూసిన పాపాన పోయినావా?” అన్నాడయన చనువుగా.

“నిజమే. నాకు ఈ కాలేజీ ఒక గుదిబండ అయిపోయింది. ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. క్షణం తీరుబడి ఉండటం లేదు” అన్నదామె కుర్చీలో వెనక్కి వాలి.

“తీరుబడి చేసుకుంటే, అదే ఉంటుంది. అంత ఊపిరాడకుండా సంపాదించి ఎవరికి పెట్టాలనీ.. ఉన్నది ఒక్క కొడుకు. వాడూ నిన్ను మించిన వాడు అయినాడు. ఇంకేం కావాలి చెప్పు? ఈ కిష్కింధ మూకనంతటినీ వెంటేసుకుని ఊపిరాడని సమస్యలతో సతమతమవటం అవసరమా చెప్పు..?”

“వాళ్లు కిష్కింధ మూక కాదు. నేనీ సంసార జలధిని దాటేందుకు నాకు వారధి కట్టిన మహానుభావులు. వాళ్ల రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను..” అన్నది వరలక్ష్మి.

కాసేపు కాలేజీ గురించి, ఆమె బాగోగుల గురించి అడిగాడు. ఒక పక్క ఆయనతో మాట్లాడుతూనే, ఇన్నేళ్ల తరువాత తనను వెతుక్కుంటూ ఈయన ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తోంది.

“అయితే ఈ బిల్డింగ్ నీ సొంతమేనన్న మాట. మంచి సెంటర్‍లో ఉంది. పది కోట్లు పలుకుతుందా?” అని అడిగాడు రామలింగయ్య.

“ఇది కాలేజ్ బిల్డింగ్, నా సొంతం కాదు. మార్కెట్ విలువ ఎంత ఉంటందో నేను కనుక్కోలేదు. ఆ అవసరం రాలేదు..”

“అబ్బే. అందుకు కాదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావో తెల్సుకుందామని..” అని నవ్వాడు.

“నా ఎత్తు ఎప్పుడూ అయిదున్నర అడుగులే. ఇక మెట్లెక్కి ఎంత ఎత్తుకు వెళ్లినా, మళ్లీ కిందకు రావల్సిందే గద, ఎప్పుడో ఒకప్పుడు..” అని నవ్వింది.

“అమ్మా, నువు చదువుల సరస్వతివి. నీతో మాట్లాడటం నాకు చేతనవుతుందా చెప్పు. మొత్తం మీద నువ్వు వృద్ధిలోకి వచ్చినందుకు సంతోషం. మమ్మల్ని నువ్వు మర్చిపోయినా, నిన్న మేము మర్చిపోలేదు.. ఇంతకీ నీ తమ్ముడు గిరిధర్ నీ దగ్గరకు వస్తూపోతూ ఉంటాడా?”

“అ అనుబంధాలు తెగిపోయి చాలా కాలం అయింది. నేనొక తెగిన గాలిపటాన్ని.”

“ఆ దారం తెగినందు వల్లనే, నువ్వు వృద్ధిలోకి వచ్చావు. సరే. అయిందేదో అయిపోయింది. కర్మానుసారాన్ని బట్టి బుద్ధి వక్రిస్తూ ఉంటుంది. తప్పులు చేశాడు. అందులో అనుమానం లేదు. అయినా పరాయి వాడేం కాదు. సొంత తమ్ముడు. పంతాలూ, పట్టింపులూ ఎల్లకాలం ఉంటాయా చెప్పు. పొరపాట్లు జరుగుతుంటయి..”

“పొరపాట్లు కూడా గొప్ప మేలు చేస్తాయ్ బాబాయ్. కొలంబస్ పొరపాటున అమెరికా కనుగొన్నాడు..”

“అవునుగదా. అంతటి గొప్ప వాళ్లే పొరపాట్లు చేసినప్పుడు, మామూలు మనుషులం, మనం పొరపాట్లు చేయకుండా ఉంటామా? సర్దుకుపోవాలి. నీకూ పది మంది బంధువులు లేరు. ఉన్నది ఒక్క తమ్ముడు. రక్త సంబంధం.  ఈ వయసులో నీకూ అయిన వాళ్లు అండగా ఉంటే, ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పు. పైకి ఎంత బింకంగా ఉన్న ఆత్మీయుల కోసం మనసు అలమటిస్తూనే ఉంటుంది. నీలాగే వాడూ లోలోపల మథన పడుతుంటాడు. నువు ఊ అంటే వాడ్ని నీ దగ్గరకు లాక్కొస్తాను. చేసిన వెధవ పనులకు, కన్నీళ్లతో నీ కాళ్లు కడుగుతాడు. ఆ మబ్బులు తొలిగిపోతే అక్కా తమ్ముళ్లు ఇద్దరూ ఒకటైపోరూ..” అన్నాడు రామలింగయ్య రాజీ కుదిర్చే ధోరణిలో.

“నా కంత అదృష్టం లేదు బాబాయ్. నేనొక శాపగ్రస్తురాలిని..”

“ఆ, ఆ శాపమూ లేదు, పాపమూ లేదు. అన్నీ మనం అనుకోవటంలో ఉంటుంది.. ఇంతకీ నీ కొడుకు పేరు ఏమిటన్నావ్?”

“విద్యాసాగర్..”

“ఏం చదివాడు?”

“యం.బి.ఏ. ఒక పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు.”

“ఇంకేం? జీతం కూడా బాగానే వస్తుంటుంది. నాకు తెల్సమ్మా. ఇంత మంది పిల్లల్ని పైకి తీసుకొస్తున్నావు. కొడుకును వదిలేస్తావా? చాలా సంతోషం. చూసి పోదామని వచ్చాను. చూశాను. ఎవరి సహాయమూ లేకపోయినా, నీకు దేవుడి సహాయం ఉంది. అందుకే ఇంత వృద్ధిలోకి వచ్చావు..” అన్నాడు రామలింగయ్య.

వెళ్తానని లేచాడు. బయటదాకా వచ్చింది సాగనంపటానికి. బిల్డింగ్ నంతా ఒకసారి ఎక్స్‌రే కళ్లతో తనిఖీ చేశాడు.

“నీ కొడుకు నాగార్జున సాగర్‍ని అడిగానని చెప్పు..”

“అలాగే, వాడి పేరు విద్యాసాగర్..”

“అవును కదూ. ఈ సారి ఇంటికొస్తాను. వాడిని చూసినట్లూ ఉంటుంది. తీరుబడిగా మాట్లాడినట్లూ ఉంటుంది.” అన్నాడు రామలింగయ్య.

“అలాగే రండి” అన్నదామె.

ఆయన వెళ్లిపోయాడు.

ఆ రోజంతా ఆయన చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. ఆయన ఊరికే చూసిపోవటానికే వచ్చాడంటే ఆమె నమ్మలేకపోతున్నది. తమ్ముడి ప్రస్తావన తెచ్చాడు. పంతాలు, పట్టింపులూ వద్దన్నాడు. రక్త సంబంధీకుల కోసం మనసు మథనపడుతుంటుందన్నాడు. ఊ అంటే వాడిని తీసుకొచ్చి కాళ్ల మీద పడేస్తానన్నాడు. ఇదంతా ఏదో అనాలోచితంగా అన్నది కాదు.

ఇన్నేళ్ల తరువాత ఇప్పుడీ చుట్టరికాలూ, అనుబంధాలు, ఆప్యాయతలూ ఎందుకు పుట్టుకొచ్చాయో గ్రహించలేనంత అమాయకురాలు కాదు. అసలీ రాద్ధాంతాలు జరగటానికి కారణం ఎవరు?

గిరి.. వాడంటే చిన్నప్పటి నుంచీ ఆమెకు వల్లమాలిన అభిమానం. వాడికంటే నాలుగేళ్ల పెద్దది. తల్లి చనిపోయినందు వల్ల వాడి పట్ల మరింత మమకారం ఏర్పడింది. తండ్రి ఉన్నా అన్నీ ఆయనతో చెప్పలేడు. అక్క దగ్గర చనువు వేరు. అన్ని విధాలా కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది.

వేలెడంత పిల్లాడిగా ఉన్నప్పుడు స్కూలుకు వెళ్లనని మొండికేసేవాడు. అక్క వెంట ఉండి స్కూలుకు తీసుకెళ్లేది. అక్క చెయ్యి పట్టుకుని అంటి పెట్టుకొని నడిచేవాడు. “కాళ్లకు అడ్డం పడుతున్నావు, కొంచెం ఎడంగా నడవరా” అన్నా వినేవాడు కాదు. ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కను అతుక్కొని కూర్చునేవాడు. కొన్నాళ్లు అయ్యాక, కొంచెం ఎదిగాక, రోజూ ఎవరితోనో ఒకరితో తగువు పెట్టుకునేవాడు. అక్క వెళ్లి తమ్ముడ్ని సమర్థిస్తూ అడ్డంగా వాదించి వాడి తగువులు తీర్చి వచ్చేది. అక్క తమ్ముడి హోం వర్క్ చేసి పెట్టేది. రాత్రిళ్లు పాఠాలు చదవమంటే, కునికిపాట్లు పడేవాడు. పరీక్షల్లో కాపీ కొట్టబోయి పట్టుబడితే, డిబార్ చేయబోతే, తల్లి లేని పిల్లాడు అన్యాయం అయిపోతాడని హెడ్మాస్టర్ కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడింది.

కాలేజీలో చేరాక, అక్కడ ఇంకో రకమైన సమస్యలు. అమ్మాయిల వెంటపడి, లవ్ లెటర్స్ రాస్తే, చంపటానికి ఇంటి మీదకొస్తే, అటకమీద పడుకోబెట్టి, కాపాడింది. ఇంకొన్నాళ్లకు జల్సాలు మరిగి, డబ్బుల కోసం ఇంట్లో వస్తువులు అమ్మేస్తుంటే, తండ్రి ఇంట్లో నుంచి గెంటేస్తుంటే అడ్డపడింది.

“ఒరే గిరీ, తల్లి లేని పిల్లలం. మంచీ చెడూ చెప్పే వాళ్లు లేరు. ఇతరులను చూసి అన్నీ మనమే నేర్చుకోవాలి” అన్నది అక్క.

“నేర్చుకుంటున్నాను గదా..” అన్నాడు తాగిన మైకంలో.

“ఏం నేర్చుకోకూడదో, అవి నేర్చుకుంటున్నావు. ఈ ప్రపంచంలో బాగుపడటానికి ఎన్ని అవకాశాలున్నాయో, చెడిపోవటానికీ అన్ని అవకాశాలున్నాయి..”

“గొప్ప సత్యం చెప్పావు సిస్టర్..”

“మన దౌర్భాగ్యం ఏమింటే గొప్ప సత్యాలను మనం అర్థం చేసుకోలేం. చిన్న చిన్న సత్యాలను పట్టించుకోం. మనం ఎప్పటికీ మర్చిపోలేని విషయాలు చెబుతున్నాను విను. మనలాంటి ఉండీ లేని వాళ్లం డబ్బు పోగొట్టుకోకూడదు. ఒక వేళ డబ్బు పోయినా గౌరవం పోగొట్టుకోకూడదు. ఒక వేళ గౌరవం పోయినా, ఆరోగ్యం పోగొట్టుకోకూడదు. నువ్వు డబ్బూ, గౌరవం, ఆరోగ్యం అన్నీ పోగొట్టుకుంటున్నావు. ఇంక చివరకు మిగిలేది జబ్బులేరా” అని కన్నీళ్లు నింపుకొని చెప్పింది. వాడు మాత్రం వింటూనే గురక పెట్టి నిద్రపోయాడు.

కాలం వేగంగా పరుగెత్తింది. ఈ పరుగు వల్ల ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండలేరు. అందులోనూ ఆడపిల్ల విషయంలో త్వరత్వరగా మార్పులు వస్తయి.

వరలక్ష్మికి పెళ్లి అయింది. భర్త సుధీర్ మంచితనం మూర్తీభవించిన మనిషి. ఆయిన నీడలో నిశ్చింతగా కాలం గడిపింది. రెండేళ్ల తరువాత పుట్టింటికి, వెళ్లాలనుకుంది.

సుధీర్ వద్దు లెమ్మన్నాడు.

“తల్లి లేకపోయినా తండ్రి ఉన్నాడు. అమ్మ లేని లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. పురిటి ఖర్చులు భరించలేనంత బీదవాడు కాదు. వెళ్లకపోతే ఆయన బాధపడతాడు” అన్నది వరలక్ష్మి.

“సమస్య అది కాదు. మొదటి పాయింట్ నిన్ను చూడకుండా నేను ఉండలేను. ముఖ్యంగా ఈ సమయంలో నిన్ను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడికి వెళ్తే ఏవో కనిపించని సమస్యలుతో నీకు మనశ్శాంతి ఉండదేమోనని నా భయం. మీ నాన్నను చూడాలనుకుంటే అయన్నే ఇక్కడకు పిలిపిద్దాం” అన్నాడు సుధీర్.

వరలక్ష్మ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. “తల్లి ప్రేమకు దూరం చేసి దేవుడు అన్యాయం చేశాడని అనుకునేదాన్ని. అపారమైన ప్రేమను అందించే భర్తను ఇచ్చాడు. నాకు దేవుడు న్యాయమే చేసినట్లు అనిపిస్తోంది” అన్నది.

నెలలు దగ్గర పడే కొద్దీ తనకు తానే కొత్తగా అనిపిస్తోంది. నిండుగా కనిపిస్తోంది.

తండ్రి ఆమెను చూడటానికి వచ్చాడు. ఆయన మొహంలో సంతోషమూ, విచారమూ కూడా చోటు చేసుకున్నాయి.

“నిన్ను ఇలా చూడగలిగినందుకు సంతోషంగా ఉంది. నీకు కనీసం బొట్టు పెట్టి, చీర, రవికె ఇచ్చేవాళ్లు ఎవరూ లేరన్న విచారమూ ఉంది.. నువ్వే బొట్టు పెట్టుకొని తీసుకోమ్మా” అన్నాడు.

పురుడొచ్చి బాబుకు మూడు నెలలు నిండే వరకూ తండ్రి ఆమె దగ్గరే ఉన్నాడు. ఇంకో రెండు రోజుల్లో బయల్దేరుతున్నాడు.

ఆయనకు టికెట్టు రిజర్వ్ చేయంచటానికి వెళ్లిన సుధీర్ స్కూటర్ యాక్సిడెంట్‍లో చనిపోయాడు.

ఆ విషయం వినగానే వరలక్ష్మి మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. ఆమె తండ్రి చేష్టలుడిగినట్లు ఉండిపోయాడు.

జరగకూడనిది జరిగిపోయాక, ఇంక జరగవల్సినవన్నీ జరిగిపోయాయి.

వరలక్ష్మి పుట్టింటికి వచ్చింది.

“ఇంక నీకు దేవుడే దారి చూపించాలి” అని తండ్రి నిస్సహాయంగా అన్నాడు.

“ఇంత అన్యాయం చేశాక, దేవుడ్ని తల్చుకోబుద్ధి కావటం లేదు” అన్నది వరలక్ష్మి.

“నేను బతికినంత కాలం బతకబోను. నాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. అది నీ పేర రాశాను. ఇంతకన్నా ఈ పేదవాడు నీకు ఇవ్వగలిగింది ఏమీ లేదమ్మా” అన్నాడాయన.

“ఇప్పుడీ రాతకోతలు ఎందుకు నాన్నా? నీకు వారసుడు తమ్ముడు ఉన్నాడు.”

“వాడు సరియైన వాడు అయితే నాకింత బాధలేదమ్మా. కాలాన్ని నమ్మటానికి వీల్లేదు. అయిన గాయాలు చాలు. నీకు తల దాచుకోవటానికి ఇంత నీడ అయినా ఉండొద్దా?” ఇంక ఆయన నోటి వెంట మాటలు పెగల్లేదు. కన్నీరు తుడుచుకున్నాడు.

వార్ధక్యం మరో బాల్యం అంటారు. ముసలితనంలో ఆయన మనోధైర్యం కోల్పోయి చీటికీ మాటికీ పసిపిల్లాడిలా ఏడుస్తుంటే వరలక్ష్మి ధైర్యం తెచ్చుకొని ఆయనను ఓదార్చాల్సి వచ్చేది.

మనోవేదనకు ముందు లేదన్నారు. కూతురు ఎంత ఓదార్చినా ఆయనకు దుఃఖం ఆగటం లేదు. ఏడాది తిరిగే లోపలే ఆయనా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

ఈ సువిశాల ప్రపంచంలో ఆమె ఏకాకిగా మిగిలిపోయింది. ఒళ్లో.. పసివాడు. తల్లి కష్టాలు తెలియనందువలన వాడు ఒక రకంగా అదృష్టవంతుడు, మరో రకంగా దురదృష్టవంతుడు.

అక్క బాగోగులు ఏవీ పట్టించుకోని గిరి తనకు నచ్చిన దాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. భార్య సంపాదిస్తోంది. అందుచేత సరదాలకేమీ లోటు లేదు. పోనీలే వాడిలో కుదురు ఏర్పడింది కదాని వరలక్ష్మి సంతోషించింది.

ఒక రోజు ఉదయం వచ్చాడు. అక్క అదరించింది. “ఏమిట్రా అసలు ఇటు వైపు తిరిగి చూడటం లేదు. అంత తీరిక లేకుండా ఉన్నావా?” అని అడిగింది

అడిగిన దానికి సమాధానం చెప్పలేదు.“నవ్వు ఇల్లు ఖాళీ చెయ్యి. నేను ఈ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను” అన్నాడు.

“మీ ఆవిడ సంపాదిస్తోంది. తిండికి లోటు లేదు. నాకు దమ్మిడీ ఆదాయం లేదు. తిండికి జరగటం లేదు. ఈ కాస్త నీడ లేకుండా చేస్తావా?” అని అడిగింది.

“ఇది నా ఇల్లు. ఖాళీ చెయ్యమంటున్నాను., అంతే.. నేను ఇంకేమీ వినదల్చుకోలేదు” అన్నాడు వాడు.

“నాన్న నా పేర రాశాడు.”

“ఆయనెవరు రాయటానికి. తండ్రి ఇల్లు కొడుక్కి కదా రావాలి..”

“ఇది ఆయన స్వార్జితం.. ఎవరికైనా ఇవ్వవచ్చు.. నా దీనస్థితి చూసి నాకు తల దాచుకోను నీడ కూడా లేదని.. నాకు ఇచ్చాడు..”

“నా మాట ఎదిరిస్తే, నువ్వు ఎంతో కాలం, ఉండలేవు. నా సంగతి నీకు తెలియదు” అని కోపంగా అరుస్తూ వెళ్లాడు.

రాత్రికి నలుగురు రౌడీలతో తాగి వచ్చాడు. తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడ్డాడు. పిల్లాడి పీక పిసుకుతామని, చంపేస్తామని బెదిరించారు. అన్నంత పనీ చేసేటట్లే ఉన్నారు. పిల్లవాడిని ఏమీ చేయవద్దని బ్రతిమలాడింది. పిల్లాడు కావాలో, ఇల్లు కావాలో తేల్చుకోమన్నారు.

రాత్రికి రాత్రి కట్టుబట్టలతో బయటకొచ్చింది. ఎక్కడికి పోవాలో తెలియదు. గుడి మందు అరుగు మీదకు చేరింది.

డబ్బు లేదు. నా అన్న మనిషి లేడు. తలదాచుకోను నీడ లేదు. తినటానికి పట్టెడు అన్నం దొరకటం లేదు. చెయ్యి జాచి ఎవరినీ అడగలేదు.

ఆమె దుస్థితి చూసి పూజారి జాలి పడి, గుడిలోనే ఉండిపొమ్మన్నాడు. దేవుడి ప్రసాదమే రెండు పూటలా కడుపు నింపుతోంది.

“ఏమీ లేనప్పుడు కాదమ్మా, ఏమీ చేయలేనప్పుడు నిజంగా బాధపడాలి” అని ఓదార్చాడు పూజారి.

“నేను ఏం చేయగలను?” అని అడిగింది.

“నిన్ను నువ్వే ఆ ప్రశ్న వేసుకో, సమాధానమూ వెతుక్కో..” అన్నాడు పూజారి.

ఆమె నిట్టూర్చింది.

తనకన్న అద్వాన్న స్థితిలో నున్న పిల్లలను అరుగు మీద కూర్చో బెట్టి పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది.

దేవుడే దారి చూపించాడు. ఆయన కొండంత అండగా నిలిచాడు. అంచెలంచెలుగా ఎదిగింది. టీచరుగా ఒక స్కూల్లో చేరింది. ఆ స్కూలుకు యజమానురాలు అయింది. స్కూలుతో పాటే ఆమె కూడా అభివృద్ధిలోకి వచ్చింది.

జూనియర్ కాలేజి నడిపేదాకా వచ్చింది. కొడుకును ప్రయోజకుడిని చేసింది. వాడికి మంచి ఉద్యోగమూ వచ్చింది.

ఇంత జరిగాక, ఇన్నేళ్లు గడిచాక..

ఇప్పుడు ఈ రామలింగయ్య ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. చుట్టరికాలను, అనుబంధాలను గుర్తు చేశాడు.

అన్నట్లుగానే పది రోజుల తర్వాత మళ్లీ వచ్చాడు.

అట్టే అధిక ప్రసంగం లేకుండా అసలు విషయానికి వచ్చాడు

“నీ తమ్ముడి కూతురు కృష్ణకుమారి. పెళ్లికి ఎదిగింది. చూడటానికి బాగానే ఉంటుంది. ఓ మాదిరిగా చదువుకుంది. మీ వాడికిచ్చి చేయాలని మీ తమ్ముడు, మరదలూ అనుకుంటున్నారు. నువ్వు ఊ అంటే రేపే వాళ్లను నీ దగ్గరకు తీసుకొస్తా..” అన్నాడు రామలింగయ్య.

“చేసుకోవటం, చేసుకోకపోవటం తరువాత విషయం. ఊళ్లోనే ఉన్నా ఇన్నాళ్లూ ఒకరి మొహాలు, మరొకరు చూసుకోకుండానే గడిపేశాం. సరే ఇవాళ నువ్వొచ్చి వాళ్లను తీసుకొస్తానంటున్నావు. చూడటానికి అభ్యంతరం ఏముంది?” అన్నది వరలక్ష్మి.

“వాడు తప్పుల మీద తప్పు చేశాడు. నీకు తీరని అన్యాయం చేశాడు. అలాని వాడు బాగుపడిందీ లేదు. నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు. పోనీ వాడన్నా ఇల్లు నిలబెట్టుకున్నాడా అంటే, అదీ లేదు. అప్పుల వాళ్లు తన్నుకుపోయారు. తెగిన గాలిపటంలా నిరామయంగా నిలబడ్డ నువ్వు మాత్రం, అందనంత ఎత్తుకు ఎదిగావు. లక్షలు పోసిన వాళ్ల కన్నా మిన్నగా కొడుకును తీర్చిదిద్దావు. వాడు రత్నంలా తయారైనాడు. అందరం సగర్వంగా వాడు మా వాడని చెప్పుకోగల స్థితిలో ఉన్నాడు. కానీ గిరి పరిస్థితే బాగోలేదు.. నువ్వు క్షమిస్తే వాడొచ్చి నీ కాళ్ల మీద పడతాడు..” అన్నాడు రామలింగయ్య.

“వాడు చేసిన ఎన్ని తప్పులు క్షమించలేదు..” అని నిట్టూర్చింది వరలక్ష్మి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here