చిరుజల్లు-50

0
7

పట్టాలు తప్పిన బండి

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి మంజరి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని తెల్సి ఆమెను చూడటానికి వెళ్లింది రేఖ.

మంజరి దగ్గర ఎవరూ లేరు. కళ్లు మూసుకొని పడుకున్న మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుంది రేఖ. ఎంతో కష్టం మీద కళ్లు తెరిచి చూసి, బలహీనంగా నవ్వు తెచ్చుకుంది మంజరి.

“నా చిన్ననాటి స్నేహితురాలివి. చివరి క్షణాల్లో నా పక్కన ఉన్నావు. అదే నాకు సంతోషం” అన్నది మంజరి.

“ఎవరూ లేరేం?” అని అడిగింది రేఖ.

“నాకు ఎవరున్నారు? నేను ఎప్పుడూ ఒంటరిదానినే” అన్నది మంజరి.

అలా ఇంకా ఏవో చెప్పాలని ప్రయత్నించింది. కాని శరీరం సహకరించలేదు. ఇంకేం మిగల్లేదు అన్నట్లు తనువు చాలించింది.

మంజరి చేయి రేఖ చేతిలోనే ఉంది.. ఎన్నో అందమైన కథలు రాసిన చెయ్యి.. ఎన్నో ప్రేమ సన్నివేశాలను అత్యంత రమణీయంగా వర్ణించిన చెయ్యి.. అనేకానేకమైన మానసికోద్వేకాలను, కష్టాలకు, కన్నీళ్లకు భాష్యం చెప్పిన చెయ్యి.. ఈ క్షణాన అచేతనం అయిపోయింది.

తన రచనలతో లక్షలాది పాఠకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మంజరి, ఈ సూర్యస్తమయం వేళ అలా దిగంతాల అవలకు వెళ్లిపోయింది. వీడ్కోలు చెప్పటానికి ఎవరూ లేరు అక్కడ, రేఖ తప్ప.

రేఖ భర్తకు ఫోన్ చేసింది. అతను వచ్చాడు.

బాడీని ఆమె ఇంటికి తీసుకెళ్లింది.

తెలియజేయ వల్సిన బాధ్యత ఉంది గనుక, మంజరి భర్తకు ఫోన్ చేసి చెప్పారు.

“నాకు సంబంధించినంత వరకూ, ఆమె చనిపోయి చాలా కాలం అయింది” అన్నాడు ఆమె భర్త.

మంజరికి ఇన్నాళ్లూ అత్యంత ఆప్తుడుగా మారిన సందీప్‍కీ తెలియ జేశారు.

ఆయనకు ఆరోగ్యం ఏమీ బాగా లేదని, ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నారనీ ఫోన్ లోనే తెలియజేశారు.

భర్త గానీ, ఈ ఆప్తుడు గానీ వస్తారని రేఖ అనుకోలేదు. కానీ తెలియజేయటం తన బాధ్యత కాబట్టి దాన్నినెరవేర్చింది. అంతే.

“ఇన్ని రోజులూ మంజరి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే తిరిగి చూడని వాళ్లు, ఇప్పుడు అంత్యక్రియలు జరిపించటానికి వస్తారని అనుకోవటమూ మన అత్యశే అవుతుంది. ఈమె చనిపోయిందని తెల్సాక, ఇన్నాళ్లూ కనిపించని బాధకు గురి చేస్తున్న కాలిలోని ముల్లు, కంట్లోని నలుసూ, తొలగిపోయినట్లు, పెద్ద రిలీఫ్ ఫీలవుతారనుకుంటా..” అన్నాడు రేఖ భర్త.

“జీవితంలోని ప్రేమకూ, అనుబంధానికీ, సహచర్యానికీ ఉన్న విలువ ఇంతేనా? జీవిత కాలాన్ని తమకు పంచి ఇచ్చిన మనిషి చనిపోతే, కనీసం తొంగి చూసేందుకూ తీరకలేకపోతే, ఈ అనుబంధాలకు ఉన్న విలువ ఏమిటి?” అన్నది రేఖ.

“ఏమీ లేదు. ప్రేమ అనేది ఒక వ్యామోహం. కొన్నాళ్లకు మెహం మొత్తుతుంది. అనుబంధాలు అనేవి వ్యాపార లావాదేవీలు. అంతే. అంతకన్నా ఇంకేం లేదు” అన్నాడు రేఖ భర్త.

ఒకరిద్దరి మిత్రుల సహకారంతో రేఖ, ఆమె భర్త జరగవల్సిన కార్యక్రమాలు జరిపించారు.

***

మంజరి మొదటి నుంచీ ఒక అర్థం కాని పజిల్ లాగానే మిగిలిపోయింది. అంత గొప్ప భావస్ఫూరకమైన కథలు ఎలా రాసేది? అన్ని విభిన్నమైన ఆలోచనలు, ఊహలూ ఆమెకు ఎలా వచ్చేవి? అందరికన్నా ఎంతో విలక్షణంగా, క్షుణ్ణంగా ఆలోచించగల మనిషి, తన జీవితాన్ని ఎందుకింత అస్తవ్యస్తం చేసుకుంది? ఏం సాధించింది? ఏం పొగొట్టుకుంది? – ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానాలు మంజరి మాత్రమే చెప్పగలదు. కానీ ఆమె గొంతు ఇప్పుడు శాశ్వతంగా మూగబోయింది.

మంజరి చనిపోయిందని తెల్సి, ఒక పత్రికా విలేఖరి, రేఖ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“మంజరిగారూ ఎన్నో కథలూ, నవలలూ రాశారు. బహుమతులూ, అవార్డులూ అందుకున్నారు. అందరికీ ఆమె రచనలు మాత్రమే తెల్సుగానీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. ఆమె జీవితంలో ఎన్నో అపశృతులున్నాయనీ, ఆ అనుభవాల వల్లనే, ఇంత వైవిధ్యమైన కథలు రాయగలిగిందనీ, కొందరు అంటుంటారు. మిస్టరీగా మిగిలిపోయిన ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె రచనల గురించి, వాటికి గల ప్రేరణ గురించి మీకు తెల్సిన విషయాలతో ఒక వ్యాసం రాసిస్తే మా పత్రికలో ప్రచురిస్తాం” అన్నాడు ఆ విలేఖరి.

రెండు రోజుల తరువాత మళ్లీ వస్తానని వెళ్లిపోయాడు ఆ విలేఖరి.

రేఖ మంజరి ఇంటికి వెళ్లి, అక్కడున్న కాగితాలు, పుస్తకాలూ తిరగెయ్యడం మొదలు పెట్టింది. బీరువాలోని అరల్లో ఆమె రాసిన కథలు పత్రికలలో అచ్చు అయినవి – నవలల కాపీలు ఉన్నాయి. ఆమె సర్టిఫికెట్స్ కొన్ని డైరీలూ ఉన్నయి.

రేఖ ఆ డైరీలు తీసింది. పదిహేనేళ్ల కిందటి నుంచీ ఉన్న డైరీలన్నీ వరసగా పేర్చి పెట్టుకుంది. ప్రతి రోజూ డైరీ రాసే అలవాటు లేకనో, లేక రాసేందుకు ఏమీ లేకనో, కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. మంజరి చేత రాత ముత్యాల కోవలాగా ఉంది.

రేఖ చదవటం మొదలుపెట్టింది.

***

ఇవాళ నేను ఆఫీసులో పని చేస్తుండగా టెలిగ్రాం వచ్చింది. నేను రాసిన ‘పట్టాలు తప్పిన బండి’ కథకు మొదటి బహుమతి వచ్చింది. నా ఆనందానికి పట్ట పగ్గాలు లేవు. ఆ టెలిగ్రాం పుచ్చుకొని రోడ్డు మీద పరుగెత్తుతూ, కనిపించిన వాళ్లందరికీ చెప్పాలనీ – అనిపించింది. సంతోషంతో ఉక్కరి బిక్కిరి అయ్యాను.

ఆఫీసులో అందరికీ తెల్సిపోయింది. అందరూ కంగ్రాట్స్ చెబుతూనే ‘ఎంత డబ్బు ఇస్తారు?’ అని అడగటం మొదలు పెట్టారు. వీళ్లు ప్రతిదీ డబ్బుతో కొలుస్తారు. నా కథను కొన్ని వేల మంది పాఠకులు చదువుతారు. నా పాత్రలతో, నా ఆలోచనలతో, ఆ కాసేపూ వాళ్లందరినీ ఆకట్టుకుంటాను, నా స్పందనకు వాళ్లూ స్పందిస్తారు. ఇంత గొప్ప అనుభూతికి వెలకట్టటం సాధ్యమా?

***

సందీప్ మా ఆఫీసర్. ఆయనకు కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయనికీ విసుక్కుంటూ ఆందరి మీదా ఆరుస్తుంటాడు. కానీ నాతో మాత్రం మమూలుగానే మాట్లాడుతాడు.

‘పట్టాలు తప్పిన బండి’ కథ చదివి సందీప్ మొచ్చుకున్నాడు. తన ఆఫీస్‍లో ఇంత మంచి రైటర్ ఉండటం ఆయనకు గర్వకారణం అన్నాడు. అందర్నీ ఎప్పుడూ విసుక్కునే ఆయన మెచ్చుకోవటం విశేషమే. మిగిలిన వాళ్ల ప్రశంసలు ఒక ఎత్తు అయితే, ఆయన ప్రశంసలు మరొక ఎత్తు.

***

ఈ మధ్య సందీప్ నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇది వరకటి కంటే మరింత ప్రాముఖ్యత నిస్తున్నాడు. అందుకనో, కాదో తెలియదు గానీ, నేను అందంగా కనిపించాలన్న కాంక్ష నాలో బయలుదేరింది. ఇప్పుడు రచయిత్రిని గదా, సందీప్ అడుగుతున్నాడు మళ్లీ ఏమీ రాయటం లేదా అని. ఏదన్నా చిన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దీని మీద ఒక కథ రాయి అని సూచిస్తున్నాడు.

***

మా ఆఫీసులో కొత్తగా చేరిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆమె వివాహానికి మమ్మల్ని ఆహ్వానించింది. ఇద్దరం కల్సే ఆ వివాహానికి వెళ్లాము. ఆ అమ్మాయి తన పెళ్లి హడావుడిలో ఉండిపోతుంది. గనుక బాస్‍ను చూసుకునే డ్యూటీ నాకు అప్పగించింది. నిజానికి నేను ఒక గెస్ట్‌నే కదా. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే మరింత దగ్గర చేస్తుంటయి. ఆయన పక్కనే కూర్చున్నాను. ఫోటోగ్రాఫర్ ప్రత్యేకంగా మమ్మల్ని ఇద్దర్నీ కలిపి ఫోటోలు తీశాడు. భోజనాల సమయంలో.. బఫేలో నేను ఆయనకు, ఆయన నాకు వడ్డించటం ఒకే చోట చేరి తినటం.. మా ఆఫీసులోని వాళ్లంతా కొంచెం దూరం నుంచి అంతా గమనిస్తూనే ఉన్నారు.

***

పెళ్లి ఫోటోలు వచ్చాయి. నేను నవ్వుతూ ఆయనతో మాట్లాడుతున్న ఫోటో చాలా బాగుంది. అది ఆయనకు నచ్చింది. “నువ్వు పెళ్లికూతురి కన్నా బావున్నావు” అన్నాడు. నేను సహజంగానే సిగ్గు పడ్డాను. ఆ ఫోటో దాచుకుంటానని తీసుకున్నాడు.

***

ఈ మధ్య మా మధ్య దోస్తీ ఎక్కువైంది. లంచ్ టైంలో ఆయన రూంలోనే లంచ్ చేయమంటున్నాడు. పై ఆఫీసరు కదా ఆయన చెప్పినట్లు వినాలి కదా ఆ సమయంలో తన కుటుంబం గురించి, తన వ్యక్తిగత అభిప్రాయాల గురించి తరచి తరచి అడుగుతున్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి అయిందనీ, నా భర్తకు ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం అనీ, ఆయన ఆరోగ్యం అంత మంచిది కాదనీ, డయాబిటిక్ పేషంట్ అనీ, ఆయనకు కోపం ఎక్కువనీ, ఎవరితోనూ కల్సి మెల్సి ఉండే స్వభావం కాదనీ, చాలా కన్జర్వేటివ్ టైప్ అనీ.. రోజూ కాస్త కాస్త చెప్పేశాను.. సందీప్ నా పట్ల సానుభూతి చూపించాడు. మన వాళ్లు తొందరపడి చిన్నతనంలోనే పెళ్లిల్లు చేసేసి చేతులు దులుపుకుంటారనీ, జీవితంలో స్థిరపడక ముందే ఇలా గుదిబండలు తగిలిస్తే, తరువాత జీవితంలో ఎంత ఏడుస్తామో వాళ్లకు అర్థం కాదనీ, అన్నాడు. ఆయన వైవాహిక జీవితంలో ఏదో తెలియని వెలితినీ, అసంతృప్తినీ, అసహనాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పాడు. తను అందరికన్నా చాలా సంతోషంగా, జాలీగా ఉండాలని అనుకుంటాడనీ, కానీ ఇంటికి వెళ్లగానే భార్య అయిన దానికీ, కాని దానికీ వేధిస్తూ, కాల్చుకు తినేస్తుందనీ, పిచ్చెక్కిపోయి. ఆఫీసు కొచ్చి అందురి మీదా అరుస్తుంటాడనీ చెప్పాడు. సందీప్ పరిస్థితికి జాలేసింది. తన మీద కథ రాయమని అడిగాడు. “నా మీద అంటే, నా వీపు మీద కాదు. కాగితం మీదనే రాయి” అని పక పకా నవ్వాడు.

***

ఒక పత్రిక వాళ్లు నవలల పోటీ పెట్టారు. ఆ పోటీకి నవల రాయమని అడిగాడు. టైం ఎక్కడుంది – అని అడిగాను. ఇంట్లో వంట చేయటం, ఆఫీసులో పని చేయటంతోనే సరిపోతుందనీ చెప్పాను. ఇది ఎప్పుడూ ఉండేవే. ఇవే జీవితం కాకూడాదు. సృజనాత్మకత అందరికీ ఉండదు. ఒక కార్డు ముక్క రాయలేని వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటిది అందమైన అద్భుతమైన కథలు రాయగల సామర్థ్యం ఉండీ రాయలేకపోవటం నిజంగా మన చేతులను మనం కట్టేసుకున్నట్లే అవుతుంది.. అని అన్నాడు. సందీప్ చెప్పింది నిజమననిపించింది. కానీ ఈ పద్మవ్యూహంలో నుంచి బయటపడే దారి ఏది? అని అంటే, ఆయనే దారి చూపించాడు. నెల రోజులు శలవు పెట్టించాడు. నా కోసం ఒక హోటల్లో ఒక రూం బుక్ చేయించాడు. ఆ హోటలు గదికి తీసుకెళ్లాడు.. ఇవాళ్టి నుంచి ఇదే నీ ఆఫీసు. నవల రాయి ఒక పరీక్షకు రాస్తున్నట్లు భావించి, నీ పాండిత్యమూ, నీ శక్తియుక్తులూ అన్నీ మిళితం చేసి నవల రాయి. నీకు ఇదొక ఛాలెంజ్ మాత్రమే కాదు, ఒక మంచి అవకాశం కూడా.. అని అన్ని ఏర్పాట్లు చేశాడు. నిజంగానే నా కోసం ఇంత శ్రద్ధ తీసుకున్న సందీప్ మీద గౌరవం, అభిమానం, కృతజ్ఞతా భావం, అన్నీ కలిమిడిగా పెరిగిపోయాయి.

***

ఇల్లూ, ఆఫీసూ, రొటీన్ మధ్య రోజూ బొంగరంలా తిరుగుతుండే నాకు సందీప్ కల్పించిన ఈ ఏకాంతం, ఒంటరితనం ఎన్నో భావోద్వేగాలను రేకేత్తించింది. చిన్నప్పటి నుంచీ నాకు తెల్సిన మనుషులూ, వాళ్ల మాటలూ, వ్యక్తిత్వాలూ, ఆలోచనా ధోరణులూ, అన్నీ విడివిడిగా కాగితాల మీద రాసుకున్నాను. దాదాపు పాతిక రకాల మనుష్యుల మనస్తత్వాలు పోగుపడినయి. ఈ పాతిక మందినీ ఒక చేట చేర్చి చూస్తే వచ్చే సమస్యలూ, ఇబ్బందురూ, ఘర్షణలు, అన్నీ ఒక చోట రాశాను. ఒక మాదిరిగా కథ రూపు దిద్దుకున్నది. దానికి ఇంకా మెరుగులు పెట్టాలి.

సందీప్ ఇందులో హీరోగా కనిపిస్తున్నాడు. మనిషి ఎంత ఆనందంగా సంతోషంగా జాలీగా బేఫికర్‍గా ఉండాలనుకున్నా, పరిస్థితులు సాలెగూడులో చిక్కుకున్న మనిషి, కష్టాలు, కన్నీళ్లు మధ్య ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అదే మరి సంఘం చెక్కిన శిల్పం అంటే. ఒక మనిషి పైకి రావటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో, పతనమైపోవటానికీ అన్ని అవకాశాలూ ఉంటయి. ఒక లక్ష్యాన్నీ, గమ్యాన్నీ తనకు తానే నిర్దేశించుకున్న మనిషి, ఆ దిశగా దూసుకుపోతూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. పతనమై పోయేవాడు తన గురించి నలుగురూ చులకనగా చూస్తున్నారని తెల్సినా, ఆ విషయం పట్టింటుకోడు. తన సుఖ సంతోషాలనే చూసుకుంటాడు. అలాగే వృద్ధిలోక వచ్చేవాడూ, తన చేతికి అందిన ప్రతి పట్టుకొమ్మనీ పట్టుకొని పైకి ఎక్కుతాడు. ఇదే న్యాయం, ఇదే ధర్మం.. ఎవరేమనుకున్నా వినిపించవు.. ఇంకేమీ కంటికి కనిపించవు.. ఇలాంటి ఆలోచనలన్నీ ఆయా పాత్రలకు ఆపాదించి నా కథకు బలం చేకూర్చాను. ఇంకా రాయటం మొదలు పెట్టాను.

***

సందీప్, రోజూ హోటల్‍కు వచ్చి చూసి పోతున్నాడు. ఆ రోజు రాసిన కాగితాల చూసి, చదివి, సలహాలు ఇస్తున్నాడు. అవి మరింత కట్టుదిట్టంగా కథను నడిపించటానికి తోడ్పడుతున్నయి. క్లయిమాక్స్, ముగింపు విషయంలో ఆయన ఇచ్చిన సలహాలు బాగా ఉపకరించాయి.

***

నవల పూర్తి అయింది. సందీప్ నేనూ ఇద్దరం కల్సి వెళ్లి పోస్ట్ చేసి వచ్చాం. పెద్ద బరువు దించుకున్నట్లు ఎంతో రిలీఫ్ గానూ, ఏదో ఘనకార్యం చేసినట్లు తృప్తిగానూ ఉంది.

***

నా నవల ‘శృతి లేని గీతం’కు మొదటి బహుమతి వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. సందీప్ చెయ్యి కలిపాడు. ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి స్టార్ హోటల్లో ఇద్దరం కల్సి భోం చేశాం. మానసికంగా మేము చాలా దగ్గర అయినట్లు అనిపిస్తోంది. జీవితంలో కోరి కష్టాలు తెచ్చుకోవటం, వాటిని అనుభవించటమే జీవిత పరమార్థం అనుకోవటంలో అర్థం లేదనీ, ఒక కవిగారు చెప్పినట్లు సుఖపడితే తప్పలేదోయ్.. అనీ సందీప్ అన్నాడు. అందులోను నిజం లేకపోలేదనిపించింది.

***

నవల బాగా క్లిక్ అయింది. ‘శృతిలేని గీతం’కి మంచి స్పందన వచ్చింది. ఆ నవలను సందీప్‍కి అంకితం ఇచ్చాను. రచయిత్రిగా మంచి గుర్తింపు రావటమే కాదు, మరి కొన్ని నవలలు రాయమని అంటూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హోటల్ రూంలో ఉండి రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. సందీప్ వచ్చి కథల గురించి చర్చిస్తున్నాడు. ఆయన సూచించే విషయాలు ఆలోచింప చేస్తున్నయి. నా రచనలకు కొత్త అందాలు చేకూరుతున్నయి.

***

ఒక సహృదయుడికి గయ్యాళి భార్య, ఒక తెలివిగల స్త్రీకి, అసమర్థుడు, చేతగాని వాడు భర్తగా దొరికితే ఏం చెయ్యాలి? సంకెళ్లు తగిలించుకోవాలా? వాటిని ఛేదించుకోవాలా? సందీఫ్ ఆలోచనా ధోరణి నాకు బాగా నచ్చుతోంది. ఈ ధోరణి నా రచనల్లోనూ కనిపిస్తోంది. నాకు అభ్యుదయవాది అన్న పేరూ వస్తోంది. నా రచనలు సమాజాన్ని చెడగొడుతున్నాయని తిట్టిపోసిన వాళ్లూ పెరిగిపోతున్నారు. ఐ డోంట్ కేర్.

***

రోజూ రాత్రిళ్లు హోటల్ రూంలోనే చాలా సేపు ఉంటున్నాం. మానసికంగా శారీరకంగానూ చాలా దగ్గరయ్యాం. ఏది తప్పు? ఏది ఒప్పు? ఒకరికి తప్పు అయినది మరొకరికి ఒప్పు కావచ్చు. సందీప్‍తో శృతిమించిన సాన్నిహిత్యం గురించి నెమ్మదిగా అందరికీ తెల్సిపోయింది. మేం లోకాన్ని పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయింది.

కానీ నా భర్త నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు. ఆంక్షలు ఎక్కువ అయినయి. ఇల్లు కదలొద్దని శాసిస్తున్నాడు. “నీ గురించి అందరూ అనేక రకాలుగా అనుకుంటున్నారు. ఆ పిచ్చి పిచ్చి రాతలన్నీ కట్టి పెట్టి కొంపలో పడి ఉండు” అనీ అంటున్నాడు.

ఇప్పుడు నేనొక సుప్రసిద్ధ రచయిత్రిని, బోలెడు మంది నా రచనలకు నీరాజానాలు పలుకుతున్నారు. సభల్లో వేదికల మీద పూలమాలలు వేసి గౌరవిస్తున్నారు. అన్నీ మానేసి ఇంట్లో కూర్చోమంటాడు.

నాకు నచ్చిన విధంగా బతకటం కోసం ఆయన నుంచి దూరంగా వచ్చేశాను. ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాను. అన్ని పత్రికలూ నా నవలలు ప్రచురిస్తున్నాయి. బహుమతులు, పారితోషికాలూ వస్తున్నాయి.

ఉద్యోగమూ ఉంది. సందీప్ ఉన్నంత వరకూ పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది. అందుకు ఢోకా లేదు.

***

ఒక కోరిక మిగిలిపోయింది. తల్లిని కావాలన్న అభిలాష ఎక్కువైంది. చుట్టూ ఎంత మంది ఉన్నా, కడుపున పుట్టిన బిడ్డలతో సమానం కాలేరు. ఇదే మాట అంటే సందీప్ నవ్వాడు. “ఎంత ఎత్తుకు ఎదిగినా నీలోని స్త్రీ మార్దవం మాత్రం తొలిగిపోలేదు” అన్నాడు. “నాకంటూ ఒక బిడ్డ కావాలనుకోవటం తప్పు అవుతుందా?” అది సృష్టి ధర్మమే కదా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కష్టమైనా, నిష్ఠూరమైనా అతనికి ఒక భార్య వుంది. పిల్లలు ఉన్నారు. తనదంటూ ఒక సంసారం ఉంది. నాకూ ఉండేది ఒకప్పుడు. అనుబంధాన్ని తెంచేసుకున్నాను. పేరు, ప్రతిష్ఠ, కీర్తీ, భుజకీర్తులూ, కీరీటాలూ, సత్కారాలూ,.. ఈ ప్రవాహంలో పడికొట్టుకుపోయానా నేను?

***

మా మధ్యనున్న సంబంధం గురించి అందరికీ తెల్సి దానికి ఏవేవో పేర్లు పెడుతుంటారు. ఫిజిక్స్ అనీ, కెమిస్ట్రీ అనీ.. ఇంకా ఈ దోబూచులాటలు ఎందుకు?

సన్మాన సభకి సందీప్‌తో వెళ్లాలని అనుకున్నాను. అతను రానన్నాడు. ఎందకని అందరికీ తెల్సిన విషయాన్ని ఒప్పుకునే ధైర్యం లేదా?

నా సంతోషం అంతా అయిపోయింది. వేదిక మీద అందరూ ఆకాశానికి ఎత్తేశారు. కాని అందరి చూపుల్లో ఏదో నిర్లక్ష ధోరణి కనిపించింది. లేక అది నా ఊలికిపాటా?

రాత్రి ఇంటి కొచ్చి ఏడ్చాను.. మొదటిసారిగా పట్టలేని దుఃఖం వచ్చింది. ఆపుకున్నా ఆగని వేదన. నాకు ఎవరూ లేరా? ఏం సాధించాను? ఏం పొగొట్టుకున్నాను?

***

సందీప్ రావటం తగ్గించాడు. వచ్చినప్పుడల్లా తన బాధలూ, బాధ్యతలూ, ఇబ్బందులూ, ఆర్థిక సమస్యలూ ఏకరువు పెడుతున్నాడు. డబ్బు సాయం చేయమని అడుగుతున్నాడు. ఇప్పటికే చాలా సాయం చేసాను. అది ఏమీ అతనికి గుర్తుండ లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కారణం చెబుతూనే ఉన్నాడు.

***

ఈ ఏడాదిలో రెండు సార్లు మాత్రమే వచ్చాడు. అదీ పిల్ల పెళ్లి కోసం ఒకసారి, కొడుకు చదువు కోసం ఒకసారి. డబ్బు కోసం.. నేను డబ్బు అవసరం అయినప్పుడు మాత్రమే గుర్తు వస్తున్నాను.

***

ఆరోగ్యం బాగోలేదు. బాగా క్షీణించి పోయానని ఒకరిద్దరు అన్నారు. జీవితం రంగు వెలిసిన బొమ్మలా ఉంది. ఏ రకమైన ఆకర్షణా లేదు. ఉత్సాహమూ లేదు. వయసు ప్రభావం కనిపిస్తోంది.. అలసట.. నడవటమూ కష్టంగా ఉంది.. షుగర్ వచ్చిందన్నారు. మొన్న పనిమనిషి వచ్చి మంచి నీళ్లు అందించేదాకా మంచం దిగలేకపోయాను.

***

బాత్ రూంలో కాలు జారి పడ్డాను. ఎదుటి అపార్ట్‌మెంట్ వాళ్లు అస్పత్రిలో చేర్చారు. డబ్బు లేదు.. చికిత్స కూడా లేదు..

జీవితం కొడిగట్టిన దీపంలా ఉంది. ఎంతో సేపు పట్టదు ఆరిపోవటానికి.

***

రేఖ డైరీలు చదవటం పూర్తి చేసింది.

ఒకనాటి ప్రముఖ రచయిత్రి మంజరి అంతరంగ మథనాన్ని ఏమీ దాచకుండా పాఠకులకు తెలియజేయటం కోసం వ్యాసం రాయటం మొదలు పెట్టింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here