చిరుజల్లు-51

0
11

దివి నుండి భవికి..

[dropcap]స్వ[/dropcap]చ్ఛమైన గాలి వీస్తున్నంత సేపూ దాని విలువ తెలియదు. ఉక్కపోసి ఊపిరాడని సమయంలో అది ఎంత అవసరమో తెల్సివస్తుంది.

హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతున్నంత కాలం, స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు. ఒకరి దాస్యం చేయాల్సి వచ్చినప్పుడే, పోగొట్టుకున్న స్వేచ్ఛ ఎంత గొప్పదో తెల్సివస్తుంది.

భార్య కొండత అండగా పక్కన నిలబడి, ప్రతి చిన్న అవసరాన్నీ కనిపెట్టి, అన్నీ అమర్చి పెడుతున్నంత సేపూ, ఆమె విలువ తెలియదు. ఆమె దూరమైనప్పుడు మాత్రమే ఆమె లేని లోటు ఎంత వ్యథాభరితమో తెల్సి వస్తుంది.

చంద్రశేఖర్ నిద్ర లేచాడు. అయినా ఇంకా బద్ధకంగా కళ్లు మూసుకొని పడుకొని ఉన్నాడు అలవాటు కొద్దీ ‘హరిణీ’ అని పిలిచాడు. ఆ పిలుపు ఆ గదిలో ప్రతిధ్వనించిందే తప్ప జవాబు లేదు.

హరిణీ లేదు.. ఏ పిలుపూ వినిపించనంత దూరం వెళ్లిపోయింది. ఇంకా అతనే మర్చిపోలేకపోతున్నాడు. అలవాట్లలో నుంచి బయటపడి కటువైన వాస్తవాన్ని గుర్తు ఉంచుకోలేకపోతున్నాడు.

పడక గదిలో నుంచి బయటికొచ్చాడు. ‘యాగదిరీ’ అని పిల్చాడు. జవాబు లేదు.

పూల మొక్కల దగ్గర నిలబడి పైప్‍తో మొక్కలకు నీళ్లు పోసే హరిణి కళ్ల ముందు మెదిలింది. ఇప్పుడు హరిణి లేదు. పూల మొక్కలు ఎండిపోతున్నయి. తన లాగే, సరియైన అయినా పాలనా లేక.

ఆమె తనను ఎంతగా లాలించిందో, పాలించిందో, ప్రేమించిందో, కంటి చూపులతోనే శాసించిందో అప్పట్లో తెలియలేదు. ఆ వెలితి ఇప్పుడు పూడ్చుకోలేనిది.

ఇంటి ముందు ఆటో ఆగింది. ఇంటి కొచ్చే వాళ్లు ఎవరున్నారా – అని అనుకుంటూ అటు వైపు చూశాడు. సూట్‌కేస్ చేత బుచ్చుకొని అరవింద లోపలికి వచ్చింది.

“ఏం, మావయ్యా, బావున్నావా? నిద్ర లేచావో లేదో అని అనుకుంటూనే వచ్చాను. లేచావన్నమాట..” అన్నది నవ్వుతూ.

అరవింద నవ్వులో సమ్మోహనం ఉంది. ఎలాంటి వాడైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, ఋషిలాంటి పురుషుడైనా సరే.

అరవింద చంద్రశేఖరానికి అక్క కూతురు. కల్లా కపటం తెలియని మనిషి. నోట్లో మాట దాగదు. భోళా మనిషి. అనుకున్నదేదో మొహాన అనేస్తుంది ఎలాంటీ దాపరికమూ లేకుండా.

అరవింద వచ్చిదంటే సుడిగాలి వచ్చి చుట్టుముట్టనట్లే ఉంటుంది. లోపలికి వచ్చి బాత్‌రూంలోకి వెళ్లి ముహం కడుక్కొని వచ్చింది.

“ఏంటి మామయ్యా ఇంటికి అతిథిని వస్తే కాఫీలు, టిఫెన్లూ ఇచ్చి మర్యాదలు చేయవద్దా?” అని అడిగింది.

“అక్క కూతురు కూడా అతిథి అవుతుందా? నువ్వు ఇంట్లో మనిషివే కదా. నీకు కొత్త ఏముంది?” అన్నాడు చంద్రశేఖర్.

“ఓ.కే, ఓ.కే,.. ఇది నా ఇల్లే అనుకొని అన్నీ నేనే చూసుకోవాలంటావ్. ఇట్సాల్ రైట్.. నీ నమ్మిన బంటు ఆంజనేయులు ఉండాలి గదా, ఏడి వాడు?”

“ఆంజనేయులు కాదు, యాదగిరి. పాల కోసం వెళ్లినట్లున్నాడు. అడుగో, మాటలోనే వచ్చేశాడు..” అన్నాడు చంద్రశేఖర్.

అయిదు నిముషాల్లో అరవింద కాఫీ అందించింది.

“ఏమిటిలా, చెప్పా పెట్టకుండా సుడిగాలిలా వచ్చావు?” అని అడిగాడు.

“అంటే, నేను వస్తే సుడిగాలి, గాలివానా, తుఫానూ, బంగాళాఖాతంలో వాయుగుండం, అల్పపీడనం.. డిప్రెషన్, ఇవన్నీ వస్తాయంటావా?” అని అడిగింది అరవింద.

“అవన్నీ ఏమోగానీ, నువ్వొస్తే ఇంట్లో ఉన్న డిప్రెషన్ తగ్గి, కాస్త తెరిపి ఇచ్చినట్లుగా ఉంటుందే.”

“థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్.. ఈ పూట వంట నేను చేస్తాను. కూరలు ఉన్నాయా, ఆంజనేయులూ?” అని అడిగింది.

“ఆంజనేయులూ, ఇంజనాయిలూ అంటే వాడు పలకడు. వాడి పేరు యాదగిరి. పేరు గుర్తు పెట్టుకో..” అన్నాడు చంద్రశేఖర్.

“దేవుడు నాకు చిన్న మెదడు ఇచ్చాడు. దానిలో ఎన్ని అని గుర్తు పెట్టుకోను? తప్పదు కాబట్టి నీ పేరు గుర్తు పెట్టుకుంటాను. నీ పనివాడినీ, పాలవాడినీ, పెరుగువాడినీ, ఇరుగువాడినీ, పొరుగువాడినీ.. అందర్నీ పేరు పేరునా గుర్తు పెట్టుకోవాంటే కష్టం మామయ్యా.. ” అన్నది అరవింద నవ్వుతూ.

“నువ్వు ఎవరినీ గుర్తుంచుకోవద్దు. నన్ను ఒక్కడిని గుర్తుంచుకో చాలు. అలా నవ్వుతుంటే చాలు.. నువ్వు ఏమీ మారలేదు అరవిందా?”

“నేను ఎందుకు మారాలి మామయ్యా?” అన్నది ఫ్రిజ్ తెరిచి చూస్తూ.

ఒక గంట తరువాత వంట చేసింది. ఇద్దరూ భోజనాలు చేశారు. ఆమె ఎక్కడికో బయల్దేరింది.

“ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు.

“అయ్యా, అడిగావా? వెళ్లేటప్పుడు ఎక్కడికని అడగకూడదు మామయ్యా?”

“నువ్వేం పెళ్లి చూపులకు వెళ్లటం లేదుగదా?” అని అడిగాడు

“అంతకన్నా ఎక్కవే అనుకో..”

ఆగి, కొంచెం సేపు కూర్చుని అన్నది. “నేను నాలుగింటికల్లా వస్తాను, సాయంత్రం ఇద్దరం షాపింగ్‍కి వెళ్దాం..”

అరవింద బయటకు వెళ్లిపోయింది.

చంద్రశేఖర్‍కు గతమంతా కళ్ల ముందు మెదిలింది.

***

ఒకప్పుడు అరవిందనే వివాహం చేసుకోవాలనుకున్నాడు. అక్క కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అరవింద మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడలేదు. బహూశా అరవిందకూ అదే అభిప్రాయం మనసులో ఉండొచ్చు. ఆడపిల్లలు తొందరగా బయటపడరు గదా. చిన్నప్పటి నుండీ ఉండే చనువు అన్నిటినీ కప్పేస్తుంది. సిగ్గు పడటాలూ, మొహమాటాలూ వంటివి ఏమీ ఉండవు మరి.

అనుకోకుండా ఒక స్నేహితుడి చెల్లెలు అయిన హరిణిని చూసినప్పటి నుంచీ ఆమె మీద నుంచి దృష్టిని మరల్చలేకపోడు. ఒకటికి రెండు సార్లు కల్సిన తరువాత హరిణి వైపు అయస్కాంతం వైపు లాగినట్లు అయిపోయింది. ఆమె అందం, మాట తీలూ, నడవడీ, నిండు నది లాంటి తొణకని బెణకని నడక, విపరీతంగా ఆకర్షించాయి. అయిదారు నెలల్లోనే హరిణి అతని మనసంతా ఆక్రమించేసింది. అనుక్షణమూ అవే కళ్లు ముందు కదలాడసాగింది.  హరిణి నుంచీ ఆమోదమూ లభించింది.

ఈ విషయం అక్కతో చెప్పినప్పుడు, ఆమె నిట్టూర్చింది.

“ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉందో అక్కడే జరుగుతుంది. ఒకరికొకరు తారసపడటం, ఆకర్షితులవటం, మనసులు కలవటం.. ఆ నాలుగు ముఖాల వాడు, మన ముఖాన ఏం రాసి ఉంటాడో అదే జరుగుతుంది. మనమంతా ఆ నాటకంలోని పాత్రధారులం మాత్రమే..” అన్నది అక్క.

“నువ్వు ఏమంటావు?” అని అరవిందను అడిగాడు.

“అమ్మ చెప్పింది. విన్నావు కాదా. నేనూ ఆ నాటకంలో ఒక వేషధారిని. పైగా నాది పూర్ మెమరీ. నా పోర్షన్ కూడా మర్చిపోతుంటాను..” అన్నది అరివింద తెలివిగా.

హరిణితో వివాహం అయిన తరువాత కూడా అరవింద వస్తూనే ఉండేది. పెళ్లి కాకపోతేనేం? పరాయిది కాదు గదా. దగ్గరి చుట్టరికం ఉంది గదా. వచ్చినప్పుడల్లా హరిణి తోనూ చాలా చొరవగా మాట్లాడుతుండేది. ఉన్న రెండు రోజులూ ఊపిరాడనివ్వకుండా సినిమాలూ, షికార్లూ  షాపింగ్‍లు అంటూ ఏదో ఒక ప్రోగ్రాం పెడుతుండేది. హరిణినీ తనతో లాక్కెళ్లేది. హరిణి తప్పించుకోవాలని చూసినా, అరవింద వదిలేది కాదు. ఇద్దరూ అక్కా చెల్లెళ్లా లాగానే ఉండేవాళు.

ఒకసారి అరవింద బలవంతం మీద సెకండ్ షో సినిమాకు టిక్కెట్లు బుక్ చేశాడు. హరిణికి ఒంట్లో బావుండలేదు. రాలేనని చెప్పింది.

అరవిందతో సినిమాకు వెళ్లొచ్చాడు.

“నిజం చెప్పు నేను అరవిందతో సినిమాకు వెళ్లొచ్చానని ఫీలవుతున్నావా?” అని అడిగాడు అరమరికలు లేకుండా ఉండాలని.

“ఏముంది ఇందులో ఫీల్ అవటానికి? అరవింద ఏమన్నా కొత్త మనిషా? మీకు అక్క కూతురు. నాకన్నా ముందు నుంచీ మీరు కల్సి మెల్సి తిరుగుతున్నారు. పండగలూ, పబ్బాలూ, పెళ్లళ్లూ, ఫంక్షన్లూ ఎన్నింటికి వెళ్లి వచ్చి ఉంటారు? ఇది ఇప్పుడు కొత్తగా జరిగిదేమీ కాదు గదా.. ఏముంది ఇందులో ఫీల్ అవటానికి? నిజానికి ఫీల్ అవాల్సింది అరవింద. ఆమె ఏదో ఒక సమయంలో మిమ్మల్ని భర్తగా ఊహించుకునే ఉంటుంది. అలా తను ఉండాల్సిన స్థానంలో నేను ఉన్నాను. ఆమె కళ్లముందు, ఆమెకు కావాల్సిన వాడితో నేను కాపురం చేస్తున్నాను. అయినా అరవింద ఎలాంటి అరమరికలు లేకుండా మనింటికి వచ్చి చనువుగా, చొరవగా ఉంటోంది. అలాంటప్పుడు మీరు సినిమాకో, షికారుకో వెళ్లి వచ్చినంత మాత్రాన కొంపలు మునిగిపోయినట్లు నేను బాధపడాల్సింది ఏముంది? చిన్నప్పుడు ఎలా కలిసిమెలసి తిరిగారో, ఇప్పుడూ అలాగే తిరగొచ్చు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు మాత్రం ఎందుకు?” అన్నది హరిణి.

“తన భర్త, తన భార్య అనుకున్న మనిషితో మరొకరు సన్నిహితంగా మసలుతుంటే, భరించలేని వాళ్లే ఉంటారు, కానీ నువ్వు ఇంత ఉన్నతంగా విశాల హృదయంతో ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దేవతవే. నేను ఎంతో అదృష్టవంతుడిని..” అన్నాడు చంద్రశేఖర్.

చాలా సమయాల్లో, సమస్యల్లో హరిణి ఆలోచించే పద్ధతి, పరిష్కరించే తీరు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రతి రోజూ, అనుక్షణమూ ఆమె ఔన్నత్యమే సాక్షాత్కరిస్తుంటే, ఏ ఒక్కదాని గురించో, ఒక్క సమయం గురించో వెతికి పట్టుకోవటం, నీటిలో జాడలు వెతికి చెప్పటం లాంటిదే అవుతుంది.

ఆఫీసులోని కొంత మంది మిత్రుల వల్ల చంద్రశేఖర్‍కి తాగుడు అలవాటు అయింది. నెమ్మదిగా దానికి బానిస అయ్యాడు. కానీ ఆ విషయం తనకు తెల్సినా, ఇతరులకు, ముఖ్యంగా బంధువులకు తెలియనివ్వకుడదని, ఆమె పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య అదొక పెద్ద అభ్యంతరకరం అయిన విషయంగా ఎవరూ భావించకపోయినా, అదొక అదనపు ఆకర్షణగా అందరూ ఘనంగా చెప్పుకుంటున్నా, ఆమె మాత్రం భర్త గౌరవాన్ని మెట్టు దిగనిచ్చేది కాదు. అందరి ముందూ.

బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, ఆయనకు ఆఫీసుపని ఎక్కువగా ఉన్నదనీ, ఇంటికి రావటానికి ఆలస్యమవుతుందనీ చెప్పి, వాళ్లకు భోజనాలు వడ్డించి నిద్రపుచ్చేందుకు విశ్వప్రయత్నం చేసేది.

చంద్రశేఖర్ అక్క ఒకసారి హరిణితో అన్నది “వాడికి నువ్వంటే ప్రాణం. తాగుడు మానెయ్యామని గట్టిగా చెబితే, వాడు నువ్వు గీసిన గీటు దాటలేడు. వాడిని ఎందుకు కంట్రోలు చెయ్యవు? ”

“కంట్రోలు చేయటానికీ, అలిగీ, కోపగించుకొని, పోరి, పోట్లాడి మాన్పించటానికి ఆయన చిన్నపిల్లాడేం కాదు. మీకూ, నాకూ ఇంకా అనేక మందికి అనేక విషయాల్లో పాఠాలు చెప్పగల జ్ఞాని. ఆయనకు ఇష్టమైన పని చేయవద్దని నేను యాగీ చేస్తే, దాని మీద ఇష్టం మరింత పెరుగుతుంది. నా మీద అయిష్టం ఏర్పడుతుంది. నా మీద ఆయనకు ఉన్న ప్రేమ తగ్గిపోయే పని ఏదీ నేను చేయలేను” అన్నది హరిణి.

అక్క ద్వారా  ఈ మాటలు విన్న చంద్రశేఖర్‍కి మత్తు దిగిపోయింది. ఎనెస్తీషియా మత్తు దిగి మామూలు స్పృహలోకి వచ్చినట్లు అయింది. ఆ తరువాత ఇంక అతను మందు ముట్టలేదు. ఇందువల్ల ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ప్రేమతో పాటు ఎనలేని గౌరవం, అనురాగం పెరిగిపోయినయి.

సాయంత్రం కాగానే వచ్చి ఆమె ముందు వాలేవాడు. ఒక రోజు సడిలేని నడిరేయి హరిణి ఒడిలో అతను పడుకొని ఉండగా అడిగింది.

“ఈ మధ్య మీరు పెందరాళే వస్తున్నారు. తాగుడు మానేశారు. సంతోషమే. కానీ నా కోసం మాత్రం మానెయ్యకండి. మీ ఏ చిన్న సంతోషానికీ నేను అడ్డు రాకూడదు.”

“నీ కళ్లల్లో ఉన్న మత్తు, నీ కౌగిలిలో ఉన్న సౌఖ్యం కన్నా, ఆ కల్తీ మధ్యం ఆనందం గొప్పదేమీ కాదు అని ఆలస్యంగా తెల్సుకున్నాను” అన్నాడు చంద్రశేఖర్.

మర్నాడు వానలో తడిసి ఇంటికి వచ్చాడు. ఎక్కడ జలుబు చేస్తుందోనని హరిణి కంగారు పడుతూ తల తుడిచింది. అదీ చాలక ధూపం వేసింది.

“నా కోసం ఇంత ఆరాటపడే మనిషి దొరకటం ఎన్ని జన్మల పుణ్యఫలమో. నీకేం కావాలో కోరుకో” అన్నాడు.

“మీరు చిన్న పిల్లాడిలా ఇలా నా కొంగు పట్టుకు తిరుగుతుంటే, ఇంక నాకేం కావాలి?” అన్నది హరిణి నవ్వుతూ.

“చిన్న పిల్లాడంటే గుర్తుకొచ్చింది. నీకు ఒక చిన్న పిల్లాడు కావాలని అనిపించటం లేదా?” అని అడిగాడు.

“రాసి పెట్టి ఉంటే ఎప్పటికో ఒకప్పటికి ఆ కోరిక తీరకపోదు” అన్నది హరిణి.

ఒకసారి అల్మారాలో ఆమె చీరల కింద నుంచి కొన్ని ప్రిస్క్రిప్షన్ కాగితాలు బయటపడినయి. తీరా విచారిస్తే తెల్సిన విషయం పిల్లలు కగలగపోవటానికి తన వద్ద ఏమన్నా లోపం ఉందా అని పరీక్షలు చేయించుకుంది. ఆమె దగ్గర ఏ లోపమూ లేదని డాక్టరు చెప్పింది.

“ఈ విషయం నాకెందుకు చెప్పలేదు. నేనూ పరీక్షలు చేయంచుకునే వాడినిగదా..” అన్నాడు చంద్రశేఖర్.

“మీ దగ్గర ఏ లోపమూ లేదు. ఉండదు. అలాంటి ఊహ కూడా నాకు రాదు” అన్నది. ఆ మాటలు అంటున్నప్పుడు. వాటి బలం ఎంతో చెప్పటానికే అన్నట్లు ఆమె కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి.

“ఎందుకీ కన్నీరు?”

“ఇంకెప్పుడూ ఈ విషయం ఎత్తకండి” అన్నది ఇంత శృతి మించిన ప్రేమ ఎవరిలోనూ ఉండదు. కొంత మందికి అది పిచ్చిగానూ, వెర్రిగానూ అనిపించనూ వచ్చు.

ఒక సంధ్యాసమయంలో అందమైన వనదేవతలా ఉన్న ఆమె పక్కన నడుస్తూ అన్నాడు.

“నీ కోసం దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతవు. ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోను?”

“భార్యాభర్తల మధ్య రుణాలు, అప్పులూ తీర్చటాలు వంటివి ఏమీ ఉండవు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం మరొకరం బ్రతుకుతున్నాం. అంతే” అన్నది.

రాయి తగిలి అతని కాలికి చిన్న దెబ్బ తగిలింది. చివ్వున రక్తం చిమ్మింది. హరిణి కంగారు పడిపోయింది. చీర కొంగు చించి కట్టు కట్టింది. డాక్టరు దగ్గరకు తీసుకెళ్లింది. ఇంజెక్షన్ ఇప్పించింది. మందులు మింగించింది.

“ఇంత చిన్నదానికి అంత కంగారు పడాలా?” అని అడిగాడు.

“అంత నెత్తురు కారిపోతే అది చిన్న విషయమా? సెప్టిక్ అయితే? ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే చిన్న విషయాలే ప్రాణం మీదకు తెస్తాయి. నా ప్రాణాలన్నీ మీమీదే పెట్టుకొని బ్రతుకుతున్నాను. మీకు ఏదన్నా అయితే నేనేం కావాలి?”

“నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు?”

“మీకేం? మగ మహారాజులు. ఎలాగైనా బ్రతికేస్తారు. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను” అన్నది మళ్లీ కన్నీళ్లు పెట్టుకుని.

కష్టసుఖాలు వెలుగు నీడల్లాంటివి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలూ అవుతుంటయి.

చంద్రశేఖర్ పని చేసే కంపెనీ దివాలా తీసింది. ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగాన్ని నమ్ముకొని చేసిన అప్పులు ఉన్నయి. వాటిని ఎలా తీర్చాలో తెలియలేదు. రేపటి నుంచీ రోజు గడిచేది ఎలానో తెలియలేదు. అంత వరకూ స్నేహితుల్లా బంధువుల్లా ఉన్న వాళ్లు కూడా మొహం చాటేశారు. చంద్రశేఖర్ దిగులుతో కృశించిపోయాడు.

అప్పులు తీర్చలేక అవమానాలు భరించలేక ఇంక ఆత్మహత్యే శరణ్యం అన్న ధోరణికి వచ్చాడు.

“ఎందుకంత కృంగిపోతారు? నేను ఉన్నాను అన్న విషయమూ మర్చిపోయారా?”

“నువ్వు ఉన్నావనే ఆగిపోయాను. లేకపోతే ఎప్పుడో జీవితానికి చరమ గీతం పాడేవాడిని” అన్నాడు.

ఆమె నగలు, పుట్టింటి వాళ్లు ఇచ్చిన పొలమూ అమ్మి అప్పులు తీర్చింది. రుణబాధలు తీరిపోయినా, నెల నెలా వచ్చే ఆదాయం లేనందు వల్ల మనోవ్యథకు గురి అవుతున్నాడు

దీనికీ హరిణి పరిష్కారం కనుగొన్నది.

ఆమె స్నేహితురాలు ఎవరో ఉంటే కొద్ది రోజులు ఆ స్నేహితురాలు చుట్టూ తిరిగి, ఆమె భర్త ద్వారా ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది.

“హరిణీ, రోజు రోజుకీ నువ్వు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతున్నావు. నేను కృతజ్ఞతా భారంతో కృంగిపోతున్నాను” అన్నడు.

“బావుంది. భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు ఏమిటి?  మీరూ నేనూ వేరు కాదు. మనం, మనం సగం సగం. కుడి చేతికి దెబ్బ తగిలితే ఎడమ చేతితో మందు వేసుకుంటాం. కుడి చేయి, ఎడమ చేతికి కృతజ్ఞతలు చెప్పాలా?” అని అడిగంది.

ఈ వరుస దెబ్బల్లో నుంచి కోలుకోవటానికి, నాలుగు రోజులు ఎక్కడికైనా విహార యాత్రకి వెళ్లాలనుకున్నారు.

ఒక సాయంత్రం సముద్రం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆమెను ఫోటో తీయాలనుకున్నాడు.

“నువ్వు అక్కడ నిలబడు. అల నీ వెనక పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఫోటో తీస్తాను. చాలా బాగా వస్తుంది..” అన్నాడు.

అతను చెప్పింది ఏదీ హరిణి కాదనదు.

భయపడుతూనే వెళ్లి నిలబడింది. భయపడినట్లే జరిగింది. పెద్ద అల వచ్చింది.

అతను కెమేరాలో చూస్తున్నాడు.

అల ఆమెను తనలోకి లాక్కుపోయింది. సముద్రంలోకి ఈడ్చుకొని పోయింది.

హరిణి శవమై తేలింది.

ఇప్పుడింక ఆమె జ్ఞాపకాలే మిగిలాయి.

ఆ ఇంట్లో ప్రతి క్షణం ఆమె తిరుగుతున్నట్లే ఉంటుంది. ఆమెను పిలుస్తుంటాడు. పలకకపోయినా ఏదో మాట్లాడుతునే ఉంటాడు ఆమె బదులు ఇవ్వకపోయినా?

***

నాలుగు గంటలకు అరవింద వచ్చింది.

ఇద్దరూ షాపింగ్‍కి వెళ్లారు. నాలుగు పట్టుచీరలు కొన్నది. ఏ కలర్ బావుంటుందో చెప్పమంటూ అడిగి సెలక్ట్ చేసింది.

“ఇన్ని పట్టు చీరలు కొంటున్నావు. ఏమిటి విశేషం?”

“పెళ్లి సెటిల్ అయింది.”

చంద్రశేఖర్ ఆశ్చర్యపోయాడు. భార్య చనిపోయాక ఏర్పడిన శూన్యం అరవింద వల్ల పూడుతుందేమో అన్న ఆశ ఈ మధ్యనే లీలగా మదిలో మెదులుతోంది. అది కాస్తా అడియాసే అయింది.

అతను అడగకుండానే అరవింద సమాధానం చెప్పింది.

“హరిణి నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెల్సు. ఆమె జ్ఞాపకాలలో నుంచి నువ్వు బయటపడలేవు. ఆమె స్థానాన్ని ఆక్రమించే అర్హత నాకు లేదు” అన్నది అరవింద.

చంద్రశేఖర్ మాట్లడలేదు.

“భార్యగా కావాలనుకుంటే, ఎవరో ఒకరు దొరకుతారు. కానీ నీ కోసమే దివినుంచి భువికి దిగి వచ్చే దేవత దొరకటం కష్టం..”

అరవింద ఇంకా ఏదో చెబుతోంది. అతని కళ్లు ముందు వెన్నెల కన్నా చల్లగా నవ్వుతున్న హరిణి కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here