చిరుజల్లు-55

0
9

కోరికల శారికలు

హరిణి ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆమె మనసు డోలాయమానంగా ఉంది.

సాయంత్రం పార్టీకి వెళ్ళటమా, ఏదో వంక చెప్పి మానెయ్యటమా – టు గో ఆర్ నాట్ టు గో – ఈజ్ ది క్వశ్చన్.

డాక్టర్ సుధాకర్, డాక్టర్ నీలవేణి దంపతులు అమెరికా వెళ్తున్నారు. ఆ సందర్భంగా వారి స్వగృహంలో కొద్దిమంది బంధుమిత్రులకు పార్టీ ఇస్తున్నారు. తాము దూరపు బంధువులూ, దగ్గరమి మిత్రులమూ గనుక, పార్టీకి తప్పనిసరిగా రావాలని పిలిచారు. వాళ్ళిద్దరూ తమ ఫామిలీ డాక్టర్లే గాక, ఎన్నో సార్లు తమను ఆదుకున్న సహృదయులు గనుక తప్పించుకోవటానికి వీల్లేదు.

కానీ ఈ పార్టీకి దీప్తి, అమరేంద్ర వస్తున్నారు. అందుకని వెళ్ళటమా, మానటమా అని హరిణి సందేహిస్తోంది. ముఖ్యంగా అమరేంద్రను చూసేందుకు గానీ, అతని కంట పడేందుకు గానీ హరిణి మనసు అంగీకరించటం లేదు. అతను అక్కడ తారసపడతాడన్న కారణంతోనే ఏదో విధంగా ఈ పార్టీకి వెళ్ళకుండా ఎగ్గొట్టాలని ఆలోచిస్తోంది.

శ్రీనివాస్ ఆఫీసు నుంచి ఒక గంట ముందుగానే వచ్చేశాడు. వస్తూనే హడావిడి చేశాడు. ఈపాటికే ముస్తాబు చేసుకుని రెడీగా ఉండనందుకు విసుక్కున్నాడు.

“నాకు తలనొప్పిగా ఉంది. నేను రాలేను. మీరు వెళ్ళండి” అన్నది హరిణి.

“అక్కడంతా డాక్టర్లే ఉంటారు. నీ తలనొప్పి వాళ్ళు నిముషంలో పోగొడతారు.. బయల్దేరు..” అన్నాడు శ్రీనివాస్.

ఆమె ఇంకేదో సాకు చెప్పింది.

“నీ ఏడుపేమిటో నాకు తెల్సు. అక్కడికి వచ్చే వాళ్ళంతా బోలెడన్ని నగలు పెట్టుకుని, సింగారించుకుని వస్తారని, వాళ్ళతో సమానంగా పోటీ పడలేక పోతున్నానని నీ ఫీలింగ్. ఎక్కడికి రమ్మన్నా నీకిదే రోగం. ఒకళ్ళతో పోటీ ఏమిటి? మనకు ఉన్నదేదో ఉన్నది. లేనిదేదో లేదు. ఇలాంటివి మనసులో పెట్టుకుంటే మనం బ్రతకలేం తెల్సా?” అని చిరాకు పడ్డాడు శ్రీనివాస్.

ఇంక వెళ్ళక తప్పదని అర్థమైంది. పది నిముషాల్లో రెడీ అయింది. స్కూటర్ మీద వాళ్ళింటికి వెళ్ళేటప్పటికి ఆరు గంటలు అయింది.

అప్పటికే ఇంటి ముందు అరడజను కార్లు ఉన్నయి. స్కూటర్ మీద వచ్చింది తాము ఒక్కళ్ళమేనన్న విషయం అర్థమైంది.

లోపలికి వెళ్ళేటప్పటికి డాక్టర్ సుధాకర్, డాక్టర్ నీలవేణి ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించారు. అక్కడున్న నలుగురయిదుగురికి పరిచయం చేశారు.

హరిణి కళ్ళు దీప్తి దంపతుల కోసం ఎదురు చూస్తున్నయి. ఈ విషయం నీలవేణి పసిగట్టింది.

“నీ ఫ్రెండ్ కోసం చూస్తున్నావు గదూ. వచ్చేస్తారు పది నిముషాల్లో..” అని నవ్వించి నీలవేణి.

హరిణి ఇబ్బందిగా నవ్వి చుట్టూ కలియ చూసింది.

సోఫాలో కూర్చున్న వాళ్ళు రాజకీయాల గురించి చర్చిస్తున్నారు. మరో పక్క ఆడవాళ్లు పట్టుచీరలు ఎక్కడ ఎలాంటివి దొరుకుతాయో చెప్పుకుంటున్నారు.

ఇద్దర్ అమ్మాయిలు కొత్తగా రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక అమ్మాయి రెండో అమ్మాయికి సినిమా కథ చెబుతోంది.

“హీరోయిన్, హీరోను అవమాన పరుస్తుంది. ఆమట్న హీరోకి కోపం వచ్చి హీరోయిన్‍ను అందరి ముందూ పబ్లిక్‍గా ముద్దు పెట్టుకుంటాడు..”

“ముద్దెట్టుకోవటం చూపిస్తారా?” ఆసక్తిగా అడిగింది రెండో అమ్మాయి.

“అంటే డైరక్ట్‌గా సూపియ్యరు. ఆ టైమ్‍కి కెమెరా ఆమె వెనక్కి ఎల్లిపోతుందన్న మాట..” అన్నది మొదటి అమ్మాయి.

బయట కారు ఆగిన చప్పుడు అయింది. దీప్తి, అమరేంద్ర వచ్చారేమోనని అనుకున్నది హరిణి. కానీ వాళ్ళు కాదు. మేజర్ విశ్వనాధం దంపతులు వచ్చారు.

ఆయన వస్తూనే డాక్టర్ సుధాకర్, డాక్టర్ నీలవేణి దంపతులకు అభినందనలు తెలిపాడు. గలగలా మాట్లాడేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.

“మీ అమెరికా యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నేను అసలు వరల్డ్ టూర్ చేద్దామనుకున్నాను. కానీ మా ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు. షి ఈజ్ మై కమాండర్..” అన్నాడు.

“ఆవిడను ఎందుకండీ అంటారు? ఆవిడ ఆగమంటే ఆగేవాళ్ళేనా మీరు?” అని నీలవేణి ఆయన భార్యను వెనకేసుకొచ్చింది.

“చూడండీ, అన్నింటికీ నేనంటే అలుసు..” అన్నదాయన భార్య.

నౌకరు వచ్చి నీలవేణిని ఏదో అడిగాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. హరిణి కూడా ఆమెతో పాటే కిచెన్ లోకి వెళ్ళింది.

“నేను ఇక్కడ ఉండి అన్నీ పంపిస్తుంటాను లెండి” అన్నది హారిణి.

“భలేదానివే. వంటింట్లో మగ్గిపోవటానికా నువ్వు వచ్చింది? ఏమీ అక్కరలేదు. హల్లోకి పద..” అన్నది నీలవేణి.

హరిణి మెల్లగా గార్డెన్ లోకి వెళ్ళింది. చీకట్లో వీళ్ళ భవనం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కొంచెం చలిగా ఉంది. అయినా హరిణికి లోపలికి రావాలని అనిపించటం లేదు.

ఒకచోట కూర్చుంది. అక్కడ నుంచీ కనిపిస్తూనే ఉంది. తెల్ల మారుతీ కారు వచ్చింది. అందులో నుంచి దీప్తి దిగింది. బెనారస్ సిల్క్ చీర, స్లీవ్‍లెస్ జాకెట్‌లో అందంగా ఉంది. కాకపోతే ఒక పిసరు లావు అయినందున కొంచెం పొట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా మంచి మనిషి. ‘అక్కా’ అంటూ చనువుగా వెంట తిరుగుతుంటుంది.

తమ రెండు కుటుంబాల మధ్యా ఎంతో అన్యోన్యత ఉంది. చీటికీ మాటికీ ఒకరింటికి మరొకళ్లు వస్తూ పోతూ ఉంటారు. కొంచెం లేటయితే అక్కడే భోజనాలు చేసి వెళ్తుంటారు. సినిమాలు, షాపింగ్‍లకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్‍లో మాట్లాడుకుని ప్రోగ్రాం వేసుకుంటారు.

అమరేంద్ర తన చనువునూ, ఆదరణను అపార్థం చేసుకున్నాడు. వాట్సప్‍లో అదో మాదిరి ధ్వని కలిగించే ఫొటోలు పెట్టటం మొదలుపెట్టాడు. తను రెస్పాండ్ కాలేదు. కొంత కవిత్వమూ పైత్యమూ వెలగబెట్టాడు. దానికీ తను ప్రతిస్పందించలేదు.

ఎవరో ఎక్కడో రాసింది తనకు పంపించాడు.

‘నీవు యౌవన పూర్ణ హృదయినివి. సుర లోక సౌందర్యరాశివి. నా ఆశావహ రసానుభూతివి. నిండు జాబిల్లి లాంటి నీ ముఖారవిందాన్ని చూస్తున్నంత సేపూ, నా అంతరంగం సముల్లాస అలల సాగరం అవుతుంది. సొగసులు ఒలికిస్తూ నన్ను తిలకించినప్పుడల్లా, చటుక్కున్న దగ్గరకు లాక్కోవాలన్న బలీయమైన కోరికను అణచుకోలేకపోతున్నాను. జీవితంలో కొంచెం ఆలస్యంగా తారసపడ్డావు. అయినా మించిపోయింది లేదు. మన మధ్య ఏమంత ఎడం లేదు. నేను చేతులు చాస్తే నువ్వు నా కౌగిట్లోనే ఉంటావు. తాపం చెందిన తనువుకు నీ స్పర్శ చందన లేపనంలా ఉంటుంది. ఏ సంగతీ తెలియజేయి, మాటల్లో కాకపోయినా, క్రీగంటి చూపులలోనైనా..’

“ఎలా ఉంది? బావుంది గదా.. ఎంత అందమైన భావన?” అంటూ తన అభిప్రాయం చెప్పకనే చెప్పమని అడిగాడు.

ఎప్పుడో పెళ్ళి కాకముందు కాలేజీలో చదివే రోజుల్లో ఇలాంటి ప్రేమలేఖలు వచ్చాయంటే, అదంతా వయసు ప్రభావం అనుకోవచ్చు. పెళ్లి చేసుకుని, జీవితంలో స్థిరపడిన తరువాత ఇప్పుడీ ప్రేలాపనలు ఏమిటి? ఎంతో సన్నిహితంగా మసలుతున్న మనుషుల మనస్సులో ఇలాంటి కోరికల శారికలు ఎగురుతుంటాయా?

అతను తన రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఏం చేయాలి? దీప్తికి చూపించాలా? అది పెద్ద షాక్ తింటుంది. వాళ్ళ సంసారంలో నిప్పు రాజేసినట్లు అవుతుంది గదా.

తన భర్తకు చెబితే, ఇప్పటి దాకా స్నేహితుల్లా ఉన్నవాళ్లు ఇద్దరూ బద్ధ శత్రువులు అయిపోతారు గదా. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించటమూ కష్టమే.

హాల్లో మగవాళ్లు అందరూ రెండు మూడు గ్రూపుల కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి చేతుల్లోనూ విస్కీ గ్లాసులున్నయి.

అమరేంద్ర, శ్రీనివాస్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు.

మేజర్ గారు ఏ బ్రాండ్ డ్రింక్ బావుంటుందో వివరిస్తున్నాడు.

శేఠ్‌జీ వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుతున్నాడు.

“డాక్టర్ సాబ్, ఇయ్యాల నేను జెబుతున్నా. ఇగ ఇండియాలోని వాళ్ళంతా అమెరికా బయలుదేరుతారండి.. ఎవరుంటరందీ ఈడ? ఇన్ని టాక్స్‌లా? లాండ్ టాక్స్, హౌస్ టాక్స్, సేల్స్ టాక్స్, టోల్ టాక్స్, టర్నోవర్ టాక్స్, ఎంటర్‍టెయిన్‍మెంట్ టాక్స్, వెహికల్ టాక్స్, ప్రొఫెషనల్ టాక్స్. ఇన్‍కం టాక్స్, ఇంపోర్ట్ టాక్స్, ఎక్స్‌పోర్ట్ టాక్స్.. అరె, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇన్ని టాక్స్‌లు ఉంటాయాండీ?”

పట్టు చీరల ఆడవాళ్ళు టాపిక్ మార్చారు.

“ఆ మిలిటరీ ఆయనకు ఆవిడ మూడో పెళ్ళాం అట..”

“మొదటి ఇద్దరూ ఏమయ్యారో?”

“ఏమోనమ్మా, మనకేం తెలుసు? ముసలి మొగుడూ పడుచు పెళ్ళాం..”

ఇంకో ఇద్దరు అత్తలు మాట్లాడుకుంటున్నారు.

“మా కొడుకూ, కోడలు సరిగ్గా ఇప్పుడే తిరుపతి వెళ్ళారు. అక్కడ కుంభవృష్టి.. మా కోడలు ఎక్కడికి బయల్దేరినా అంతే.. వానలు, వరదలూ..”

అమరేంద్ర హరిణి దగ్గరకు వచ్చాడు.

“ఎంత సేపయింది వచ్చి?”

“ఒక గంట అయింది..” అన్నది హరిణి.

మిలిటరీ ఆయనా, శ్రీనివాస్ గ్లాసులు ఖాళీ చేస్తున్నారు.

“వాటీజ్ యువర్ లిమిట్?”

“స్కై ఈజ్ మై లిమిట్” అన్నాడు మేజర్.

దీప్తి వంటింట్లో నీలవేణికి సాయం చేస్తోంది.

అమరేంద్ర వచ్చి హరిణి పక్కన కూర్చున్నాడు, ఆమెను ఆనుక్ని. హరిణి ఎడంగా జరిగింది.

“వాట్సప్ చూశావా?”

“ఏమిటా మతి లేని చేష్టలు.. నేను మీ స్నేహితుడు భార్యను. మీరు నన్ను చెల్లెమ్మా అని పిలవాలి. పిలవకపోయినా మనసులో అలాంటి భావమే ఉండాలి. నాకు అలాంటి పిచ్చిరాతలన్నీ పంపిస్తారా” అన్నది హరిణి.

“ఏమో, నిన్ను చూస్తే నాకు అలాంటివే పంపించాలని ఉంటుంది. ఎప్పుడన్నా..”

“పిచ్చి వాగుడు ఆపు. రెండు కుటుంబాల మధ్యా ఉన్న స్నేహాన్ని ఇలా అర్థం చేసుకుంటారా? ఆయన దృష్టిలో పడితే యుద్ధాలు జరిగిపోతయి.. రెండు కుటుంబాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది…”

“సారీ నన్ను క్షమించు..”

ఇద్దరూ లోపలికి వచ్చారు.

దీప్తి హడావిడిగా ఉంది.

“ఏంటి, అన్నా చెల్లెళ్ల వనవిహారం అయిందా.. రండి భోజనాలకు” అన్నది ప్లేట్ అందిస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here