చిరుజల్లు 6

0
6

జయాపజయమ్ములు ఎవ్వాని సొమ్ము?

[dropcap]T[/dropcap]o become an able and successful man in any profession, three things are necessary, nature, study and practice.

పుట్టిన ప్రతివాడూ జీవితంలో గొప్పగా వెలిగిపోవాలనుకుంటాడు. చివరకు చితిమంటలలో మాత్రమే గొప్పగా వెలిగిపోతాడు.

ప్రతివాడికీ డబ్బు కావాలి. పేరు ప్రఖ్యాతులు కావాలి. తాను సుఖాలలో ఓలలాడిపోవాలనుకుంటాడు. కానీ అది ఎందుకు సాధ్యం కావటం లేదు అన్న ప్రశ్నకు ఎవరి సమాధానం వారిదే. నేను గొప్పవాడినే, ఎన్నో సాధించాలనుకున్నాను. కానీ వాళ్లు ఎవరో అడ్డుపడ్డారు. లేదా పరిస్థితులు కల్సి రాలేదు. నిజమే. ఇవన్నీ సరియైన కారణాలే. గొప్పవారిగా ఎదిగిన వారందరికీ కూడా ఎన్నో అవరోధాలు ఎదురైనాయి. వాటిని అధిగమించినందువలననే వారు గొప్పవారు అయినారు.

ధనవంతులు భోగభాగ్యాలలో తులతూగుతుంటారు అనీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారనీ అందరూ అనుకుంటుంటారు. కానీ నిజానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు డబ్బు చాలా పొదుపుగా వాడుతుంటారు. అత్యవసరమైనప్పుడు, అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేస్తుంటారు. విప్రో, ఇన్‍ఫోసిస్, టాటా వంటి కంపెనీల అధినేతలు విమానంలో ప్రయాణం చేయవల్సి వచ్చినప్పుడు, ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేస్తారని చాలామందికి తెలియదు. సౌకర్యం అందుబాటులో ఉన్నా డబ్బు చూసి చూసి ఖర్చు పెడుతుంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరూ ఇవ్వనంత భారీ మొత్తాలను విపత్తుల సమయంలో విరాళంగా ఇస్తుంటారు.

సినిమాలలో హీరోలను మానవాతీతులుగా చూపిస్తుంటారు. కానీ నిజజీవితంలో హీరోలు అందరూ ఎంతో అణుకువగా వినయంగా ఉంటారు. తమ పని ఏమిటో చూసుకుంటారే గాని, ఇతర విషయాల గురించి అసలు పట్టించుకోరు. అవసరమైన విషయాలు చూసుకోవటానికే టైం చాలదు.

ఒకసారి దిలీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారాన్ని అందుకొని ఢిల్లీ నుంచి విమానంలో ముంబయి వస్తున్నాడు. ఆ విమానంలో వస్తున్న ఒక అతి సాదాసీదాగా ఉన్న వ్యక్తికి సిబ్బంది ఇస్తున్న గౌరవాన్ని బట్టి ఆయన ఎవరో తెల్సుకున్నాడు. ఆయన రతన్ టాటా అని తెల్సుకుని ఆయన పక్కన కూర్చుని తన పేరు చెప్పాడు ఎంతో వినయంగా. “నేను ముంబాయిలో ఉంటాను” అన్నాడు దిలీప్ కుమార్. “అలాగా, ఏం చేస్తుంటారు మీరు ముంబాయిలో?” అని అడిగాడు ఆయన. అంత పెద్ద నటుడి గురించి ఆయనకు తెలియదంటే, ఆయన దృష్టి అంతా ఎప్పుడూ దేనిమీదనే లగ్నమై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

గొప్పవారు ఎప్పుడూ వినయంగానే ఉంటారు. ‘విద్య యొసగును వినయంబు, వినయమున బడయు పాత్రత. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట’ – అని చెప్పుకున్నాడు మహాకవి, అందులో తన ప్రతిభ ఏమీ లేదంటూ. మహానుభావుల చరిత్రలు తిరగేస్తే మనకు కనిపించేది, తమకు తాము విధించుకున్న క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ లేనిదే ఎవరూ ఏమీ సాధించలేదు, రాణించలేరు. వీరిలో కనిపించే రెండో సుగుణం ఏమిటంటే, తమ సామర్థ్యం గురించి ఎక్కడా ఎప్పుడూ ఒక్కమాట కూడా చెప్పుకోరు. అందరి సహకారం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని – తాను ఎంత సాదాసీదా వ్యక్తినేనని చెప్పకనే చెబుతుంటారు.

గొప శాస్త్రవేత్తగా పేరొందిన సర్ ఐసాక్ న్యూటన్ ఏమన్నాడంటే “ఈ లోకానికి ఏ మాత్రం అంతు చిక్కని మహా సముద్రం లాంటి ‘సత్యం’ ముందు, నేను ఆ సముద్ర తీరంలో చిరుకెరటాలతో ఆడుకుంటున్న పసివాడిని” అని. ఎంత వినమ్రత ఆయన మాటల్లో?

మహాపురుషులు, గొప్ప శాస్త్రవేత్తలూ, నాయకులూ తమ స్వప్రయోజనాల గురించో, కీర్తి ప్రతిష్ఠల గురించో మాత్రమే ఆలోచించరు. తాము ఏదో సాధించామన్న అహంభావాన్నీ కలిగి ఉండరు. ప్రకృతిని సెర్చ్, ‘రిసెర్చ్’ చేయటానికి ఈ జీవితకాలం సరిపోదని వారు అంటుంటారు.

అవాంతరాలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి.

గొప్పవారి జీవితాలు అన్నీ పూలపాన్పులు కావు. అడుగడుగునా ఎన్నో కష్టాలు, మరెన్నో సమస్యల వలయాలు… భూమాతకు సాష్టాంగపడే సమయాలు ఎన్నో. వారి గొప్పదనం ఎక్కడుందంటే, క్రింద పడిన ప్రతీసారీ, లేచి నిటారుగా నిలబడి, జీవనయానాన్ని ముందుకు సాగించటంలోనే ఉన్నది.

ఎలెక్ట్రిక్  బల్బ్ కనిపెట్టటానికి థామస్ ఎడిసన్ అనే మహాశయుడు వెయ్యిసార్లు విఫలమైనాడు. ఇన్నిసార్లు విఫలమైనప్పుడు నిరాశా, నిస్పృహలు ఆవరించలేదా అంటే, విఫలమైన ప్రతిసారీ ఎలా చెయ్యగూడదో తెలుసుకున్నానని ఆయన అన్నాడు.

ప్రతి క్రీడాకారుడు, శాస్త్రవేత్త, వ్యాపారస్థుడు, ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. అయినా ముందుకు సాగుతూనే ఉంటారు.

హార్లాండ్ డేవిడ్ శాండర్స్ అనే వ్యక్తి అమెరికలోని ఇండియానాలో 1890 సెప్టెంబరులో జన్మించాడు. చిన్నతనంలో మేనమామ దగ్గర చేరి ఆవిరి యంత్రాలకు బొగ్గు వేస్తుండేవాడు. కొన్నాళ్లకు ఇన్సూరెన్స్ ఏజెంటుగా పనిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కలిగారు. నిలకడగా ఏ పని చేయలేని అతనితో విసిగిపోయి, అతని భార్య పిల్లలతో సహా వేరే చోటుకి వెళ్లిపోయింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. చివరకు కోడి మాంసాన్ని పెనం మీద కాకుండా, ప్రెజర్‍తో వేయించటం అన్న చిన్న చిట్కా నేర్చుకొని హోటల్స్‌కు అమ్మటం మొదలుపెట్టాడు. డెబ్బయి ఏళ్ళ వయసులో కె.ఎఫ్.సి. (కెంటకీ ఫ్రైడ్ చికెన్) అనే చిన్న కంపెనీ ప్రారంభించి, అమెరికాలోనే గాక, ఇతర దేశాలలోను 600 కె.ఎఫ్.సి. హోటల్స్‌ను తెరిచాడు.

ఇలాంటిదే పాట్రీషియా నారాయణన్ అనే స్త్రీమూర్తి కథ కూడా. వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కలిగారు. భర్త తాగుబోతుగా మారాడు. ఆయన్ను వదిలి పుట్టింటికి చేరుకుంది. స్వయంకృషితో తనను తాను పోషించుకోవాలనుకుంది. ఆమెకు రుచిగా వంటలు చేయటం వచ్చు. చెన్నై లోని మెరినా బీచ్‍లో చిన్న హోటలు తెరిచింది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. చెన్నైలోనే అనేక చోట్ల హోటల్సు ప్రారంభించింది. అన్నీ బాగున్నాయి అనుకునే సమయంలో కూతురూ, అల్లుడూ ఒక ప్రమాదంలో మరణించారు. అయినా కొడుకు సహాయంతో తన జీవన యాత్ర కొనసాగించింది.

ప్రతివాళ్ళకీ జీవితం మీద ఒక కల ఉండాలి. ఆ కల నెరవేరగలిగేంత చిన్నదిగానూ ఉండాలి. జీవితాన్ని మలుపు తిప్పేంత గొప్పదిగానూ ఉండాలి.

కల ఎప్పుడూ పీడకల కాకూడదు. అది ఒక సుమధుర సుందర స్వప్నం అయి ఉండాలి. ఇక్కడొక చిన్న కథ చెప్పాలి. ఒకామెకు దయ్యం తనను వెంబడిస్తోందన్న భయం పట్టుకుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ దయ్యం ఆమె వెంటబడుతూనే ఉంది. అడవులలోకీ, కొండల్లోకి వెళ్లింది. దయ్యం అక్కడికీ వచ్చింది. కొండ అడ్డం వచ్చింది. ఇంక ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో ఎదురు తిరిగి దయ్యాన్ని అడిగింది “నువ్వు నన్ను ఏం చేస్తావు?” అని. “నువ్వు ఏం కావాలనుకుంటే నేను దాన్ని నీకు ఇస్తాను” అన్నది దయ్యం. “నాకు ఒక అందమైన రాకుమారుడు కావాలి” అన్నదామె. ఆ దయ్యం అందమైన రాకుమారుడుగా మారిపోయింది. కనుక భవిష్యత్ పై మనం కనే కల కూడా మనల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేదిగా ఉండాలి.

సాధారణమైన శక్తియుక్తులతోనే, ఆశించిన స్థాయికి చేరుకోవచ్చునని ఎందరో రుజువు చేసి చూపించారు. ధీరూభాయి అంబానీ యెమెన్‍లో ఒక చమురు కంపెనీలో పనిచేయటంతో జీవితాన్ని ప్రారంభించి, ఇండియాకు వచ్చి బర్మా షెల్ డీలర్‍గా పని చేసి తనకంటూ ఒక మహా సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు.

పుల్లారెడ్డి కర్నూలులో వీధుల్లో తిరిగి మిఠాయిలు అమ్మటంతో జీవితం ప్రారంభించి, ఎన్నో స్వీట్ షాపులనే గాక విద్యాలయాలను ఏర్పాటు చేశాడు.

పేదరికంలో పుట్టి, మేరు పర్వతంలా ఎదిగినవారూ ఉన్నారు. హిమాచల్‍ప్రదేశ్ లోని చోటూ శర్మ అనే వ్యక్తి బి.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. దాని వల్ల పెద్ద ప్రయోజనం లేదని తెల్సుకున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశ మాత్రం ఉంది. కంప్యూటర్ రంగంలో దిగితే మంచి జీతాలు వస్తాయని, అటువైపు తిరిగాడు. ఛండీఘర్ వచ్చి ఆప్‌టెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‍లో ప్యూన్‍గా చేరాడు. తిండి తినీ తినకా, రోజంతా ఆ కంపెనీ సెంటర్‍లోనే ఉంటూ ఒక ఏడాదిలో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకున్నాడు. ఖాళీ సమయంలో కంప్యూటర్ పాఠాలు నేర్చుకున్నాడు. ఇతర విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఈవెనింగ్ క్లాసులు మొదలుపెట్టాడు. ఛండీఘర్‍లోనే వెయ్యిమంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ డెవెలప్‍మెంట్ చెబుతూ సి.యస్. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ ప్రారంభించి, 125 మందిని తన కంపెనీలో చేర్చుకున్నాడు. హిమాచల్ గౌరవ పురస్కారాన్ని పొందాడు.

మనిషికి ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న తపన ఉంటే తను చేసే చిన్న చిన్న పనులతోనే అందర్నీ ఆకర్షించవచ్చు. మరొకరికి మార్గదర్శకులూ కావచ్చు. ఒక రైల్వే స్టేషన్‍లో అతను వార్తా పత్రికలు అమ్ముతుంటాడు. అయితే ఆ పత్రికలు పేర్చటంలోనే తన ప్రతిభ చూపేవాడు. నలుగురినీ ఆకర్షించే వార్త ఏదయినా ఉంటే అది అందరికీ ప్రముఖంగా కనబడేటట్లు పత్రికలు పేర్చి పెట్టేవాడు. పత్రికలు బాగా అమ్ముడుపోయేవి. అతనిని చూసి ఈ చిన్న విషయం తెలుసుకున్న ఒక అమ్మాయి ప్రేరణ పొంది, పెద్ద సైకియాట్రిస్ట్‌గా ఎదిగింది. నేర్చుకోవటం అనేది నిరంతరం సాగే ఒక ప్రక్రియ.

చేసే పని చిన్నదే అయినా, అందులో నువ్వు నెంబర్ వన్‍గా ఉండు – అని జాన్ ఎఫ్. కెన్నెడీకి ఆయన తండ్రి చేసిన హితోపదేశం.

ముంబాయిలో ఒకతను వీధిలో కూర్చుని చెప్పులు కుడుతుండేవాడు. అతని కొడుకుని కష్టపడి ఇంజనీరింగ్‍లో చేర్పించాడు. కానీ ఆ చదువు అతనికి ఎందుకూ పనికిరాలేదు. అతని దృష్టి రోడ్డు మీద బొమ్మలు గీయటం మీదకు మళ్లింది. ఒక రోజు సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి వెళ్లాడు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరటానికి ఆ రోజు ఆఖరి రోజు. ఎవరినో అడిగితే అప్లికేషన్ ఫీజు నూటయాభై రూపాయలు ఇచ్చారు. ఇంజనీరింగ్ మానేశాడు. ఆర్ట్స్ వైపు శ్రద్ధ పెరిగింది. ఒక మరాఠీ వార్తా పత్రికలో చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం ద్వారా ఎంతోమందిని కల్సుకునే అవకాశం లభించింది. ఒక అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం లభించింది. తరువాత లండన్ లోనూ, న్యూ యార్క్ లోను ఉండే కంపెనీలలో పని చేశాడు. 2011లో ఇండియాకు తిరిగొచ్చాడు. యు.కే. కేంద్రంగా గల ఒక కంపెనీకి మేనేజింగ్ పార్ట్‌నర్ కాగలిగాడు. తనకు ఎంతో ఇష్టమైన రంగంలోనే పని చేస్తూ ఎవరికీ అందని ఫలాలను అందుకోగలిగిన అదృష్టవంతులు చాలామంది ఉంటారు. కావల్సిందల్లా పట్టుదల, నిరంతర శ్రమ.

జపాన్ చాలా చిన్న దేశం. కానీ అమెరికా లాంటి దిగ్గజంతో వ్యాపారరంగంలో పోటీ పడుతోంది. రహస్యం ఇదే. కష్టపడి పని చేయటం. జపాన్ లోని పనివాళ్ళకు యాజమాన్యం మీద కోపం వస్తే సమ్మెలు చేయరు. ఎక్కువ గంటలు పని చేసి, ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తారు. అందుకు కావల్సినంత మార్కెట్ లేనందువల్ల, కంపెనీకి ఎదురయ్యే చిక్కులు వేరే విధంగా ఉంటయి.

మనకు రోజూ వినిపించే గొప్పగొప్పవారి పేర్లు ఎన్నో ఉన్నయి. వాళ్లంతా ప్రారంభంలో అనేక ఇబ్బందులు పడ్డవారే. సత్యజిత్ రాయ్‍కి మూడో ఏట తండ్రి చనిపోయాడు. తల్లి ప్రోద్బలంతో కొన్నాళ్లు రవీంద్రుని శాంతినికేతన్‍లో చదివాడు. ఆయన దృష్టి సినిమాల వైపు మళ్లింది. అతి కష్టం మీద భార్య నగలు అమ్మి ఒక సినిమా తీశాడు. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. భారతరత్న అయినాడు.

ఇక సినిమా నటుల జీవితాల్లోకి తొంగి చూస్తే, అపారమైన కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తిపాస్తులు సంపాదించిన వారంతా అతి సామాన్యమైన పేద కుటుంబాలలో నుంచి వచ్చినవారే.

గడ్ది పరక రాత్రికి రాత్రి ఎదుగుతుంది. కానీ టేకు చెట్టు పెరగటానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది మరి. ఓపిక… ఓపిక కావాలి దేనికైనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here