చిరుజల్లు-61

0
8

కస్టమర్ కేర్

[dropcap]ఎ[/dropcap]ప్పటిలాగానే బృంద చాలా బిజీగా ఉంది. ఆమె కన్‌జ్యూమర్ గూడ్స్ తయారు చేసే ఒక పెద్ద కంపెనీలో కస్టమర్ కేర్‌లో పని చేస్తోంది. ఆమె కౌంటర్‌లో కూర్చుని ఫోన్‌లో వచ్చే కాల్స్‌కి సమాధానాలు చెబుతుంటుంది. కౌంటర్‌కి కొంచెం ఎడంగా వరుసగా నున్న కుర్చీల్లో కొంత మంది కస్టమర్స్ వచ్చి కూర్చుంటారు. సీరియల్ నెంబరు ప్రకారం ఒకరి తరువాత మరొకరిని పిల్చి వాళ్ల సమస్య ఏమిటో తెల్సుకోవాలి.

రామాయణంలో పిడకల వేటలాగా మేనేజర్, ఆయన భార్య మధ్య వచ్చే గొడవ ఒకటి. ఇద్దరి చేతుల్లోనూ సెల్ ఫోన్స్ ఉన్నయి. ఈయన ఫోన్ చేసినప్పుడు ఆమె మాట్లాడదు. ఆమె చేసినప్పుడు ఈయన మాట్లాడడు. మధ్యలో బృందకు ఫోన్ చేసి ‘అది ఏం చేస్తోందో కనుక్కో’ అని ఈయన అంటాడు. ‘ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కో’ అని ఆమె అడుగుతుంది. మధ్యలో బృందకి ఈ చిలక రాయబారం తప్పదు.  ‘దాన్నేమన్నా పిచ్చి కుక్క కరిచిందా?’ అని ఈయన భార్య మీద నిప్పులు కక్కేస్తాడు.  ‘ఈయనతో కాపురం చేస్తే పిచ్చికుక్కలు కరిచినట్లే ఉంటుంది’ అని ఆవిడ రెచ్చిపోతుంటుంది. భగవంతుడా –  ఎలాంటి దంపతులను సృష్టించావయ్యా అని బృంద నిట్టూరుస్తుంది.

రవికాంత్ కూడా అదే కాల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. అయితే అతను ఫ్రంట్ ఆఫీస్ కౌంటర్‌లో కాకుండా, వెనకనున్న రిపేర్ సెక్షన్‌లో పని చేసి, కంప్లయింట్స్ ఇచ్చిన వాటిని ఎంత వరకు రిపేర్ చేశామో వచ్చి ఆమె పక్కన కూర్చుని చెప్పిపోతుంటాడు. అందుచేత ఇద్దరి మధ్యా పైకి కనిపించని ‘కనెక్షన్’ ఉంది.

రవికాంత్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె ఫోన్‌లో ఎవరితోనో అంటోంది ‘మీ కంప్లయింట్ నెంబర్ నైన్‌టీన్ ఫార్టీ త్రీ’ అని. మళ్లీ ఫోన్ మోగింది. ఆమె రిసీవ్ చేసుకుంది.

రవికాంత్ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నారని అడిగింది.

“ఏం లేదు. ఫోన్ మోగినప్పుడల్లా, అది చంటి పిల్లాడి ఏడుపులా అనిపిస్తుంది. నువ్వు కాల్ రిసీవ్ చేసుకుంటే పిల్లాడిని ఒడిలోకి తీసుకున్న తల్లిలా అనిపిస్తావు..” అన్నాడు రవికాంత్.

బృంద నొసలు చిట్లించింది. “నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను మీకు తల్లిలా కనిపిస్తున్నానా?”

“లేదులే.. ఇప్పుడే అరవిరిసిన రోజా పువ్వులా ఉన్నావు.. చేతిలోకి తీసుకొని ఆఘ్రాణించాలనిపిస్తోంది..”

“సభ్యత.. సభ్యత..” అన్నది బృంద.

“కాంటీన్‌కి వెళ్లి మనం సగం సగం కాఫీ తాగి రావచ్చుగదా..” అన్నాడు రవికాంత్.

“నాకీ సగం సగం పనులు అస్సలు నచ్చవు..”

“అవునవును. పదిగంటల నుంచి తెగ వాగి ఉన్న నీకు అలసిన దేవేరికి కనీసం రెండు కప్పుల కాఫీ అయినా పడాలి..” అన్నాడు రవికాంత్.

పదిమిముషాల తరువాత కాఫీ తాగుతూ బృంద అడిగింది.

“ఏంటి విశేషాలు? మీ ఇంట్లో అంతా క్షామమా? సుఖులే బ్రోతల్ సుతుల్, చుట్టముల్..” అని అడిగింది.

“ఒక వాక్యం మాట్లాడితే రెండు తప్పులు. క్షామం కాదు క్షేమం. బ్రోతల్ కాదు భ్రాతల్..”

“సర్లెండి. భావం అర్థమైతే చాలు. భాష ప్రయోజనం అదేగదా..” అన్నది బృంద.

“సరే గానీ, నీతో మాట్లాడాలి..”

“ఇప్పుడు మాట్లాడుతున్నారు గదా..”

“ఇది కాదు. కొంచెం సీరియస్ విషయం. సాయంత్రం ఓ అరగంట ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం..”

“ఒక పెళ్లికాని కుర్రాడు, ఒక పెళ్లికాని అమ్మాయితో సీరియస్ విషయం మాట్లాడాలీ.. అని అంటే, అది ఏమై ఉంటుందబ్బా?” అని అడిగింది బృంద.

“అదే మరి, సాయంత్రం అలా ఎక్కడన్నా కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు రవికాంత్.

బృంద సరే అంది.

సరే మరి, సాయం సంధ్య వేళ ఒక పచ్చిక బయలులాంటి చోట కూర్చున్నారు. రవికాంత్, బృందనే చూస్తున్నాడు.

“ఒక అరగంట మాట్లాడాలన్నారు. వచ్చి అప్పుడే పావుగంట అయిపోయింది. ఇంత వరకు ఏం మాట్లాడలేదు. ఇంకో పావుగంట కూర్చుని వెళ్లిపోదాం.” అన్నది బృంద.

“ఏం లేదు, మా వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.”

“అది వాళ్ల బాధ్యత కదా..”

“పిల్లను చూసి నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు..”

“అది మీ బాధ్యత కదా..”

“కాని నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు..”

“ఏదైనా శారీరిక సమస్యా?”

“అదే లేదు.. సామాజిక సమస్య.. పెళ్లి చేసుకున్న వాళ్లు ఎవళ్లూ సుఖంగా ఉన్నట్లు నాకు కనిపించటం లేదు. మా పేరెంట్స్‌ని చూస్తున్నాను. ప్రతిదానికీ ఒకరు అవునంటే, మరొకరు కాదంటారు. మా వదిన ఎప్పుడూ మా అన్నయ్యను సాధిస్తూనే ఉంటుంది. రోజుకు పదిసార్లు వాడు సన్యాసుల్లో కల్సిపోతానని బెదిరిస్తుంటాడు. మా అక్కకు ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ మొగుడు ముండాకొడుకు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నానని ముక్కు చీదేస్తూ ఉంటుంది. ఏతా వాతా నాకున్న నిశ్చితాభిప్రాయం ఏమిటంటే – పెళ్లి అనేది ఒక పెద్ద సుడిగుండం. దానిలోకి దూకామంటే, జీవితానికి సుఖశాంతులు ఉండవు. అందుచేత పెళ్లి అనే లంపటం తగిలించుకోనకూడదని అనుకుంటున్నాను..” అన్నాడు రవికాంత్.

“మీ ప్రాయమే, నా ప్రాయం.. అదే నా అభిప్రాయం కూడా. కానీ ఇంటిలోన పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినుర వేమ..” అన్నది బృంద.

“ఇందుకో చిన్న ప్లాన్ వేశాను.. ఈ ఆపరేషన్‌లో నీ కోఆపరేషన్ కావాలి..”

“నేను పని చేసేది కస్టమర్ కేర్ గదా.. మీకు ఏ విధంగా సహాయపడగలను?” అని అడిగింది బృంద.

“ఏం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నా ప్రేమను తిరస్కరించింది. నేను భగ్న ప్రేమికుడిని.. ఆమెను మర్చిపోలేను. మరొక అమ్మాయిని చేసుకొని గొంతు కొయ్యలేను – అని ఇంట్లో వాళ్లకి చెబుతాను. అమ్మాయి ఎవరూ అని అడుగుతారు. అప్పుడు నేను నీ పేరు చెబుతాను.. ఒక వేళ ఎవరన్నా నిన్ను అడిగితే, నేను చెప్పింది నిజమేనని నువ్వు చెప్పాలి.. అలా నాకు సహాయం చెయ్యాలి” అని అన్నాడు రవికాంత్.

“ఓ.కే. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదు. నాది కూడా సరిగ్గా ఇదే ప్రాబ్లం. మన మేనేజరుగాడికి, వాడి భార్యకూ మధ్య తడిక రాయబారం చేయలేక చస్తున్నాను.. కనుక నేను నిన్ను ప్రేమించానని, నువ్వు నా ప్రేమను తిరస్కరించావనీ, నా హృదయం గాయపడిందనీ చెబుతాను. మా వాళ్లు అడిగితే – అది నిజమేనని నువ్వు సర్టిఫై చెయ్యాలి.. ఓ.కేనా?” అని అడిగింది బృంద.

“ఓ.కే..” అన్నాడు రవికాంత్. “డన్” అంటే “డన్” అని అనుకున్నారు.

తమ పథకం ప్రకారం – అతను బృందను ప్రేమించి, విఫలమైనాడని, అతని ఇంట్లో వాళ్లకి చెప్పాడు. ఆమె కూడా రవికాంత్‌ను ప్రేమించి, విఫలమైంది, భగ్న ప్రేమికురాలిని అయినానని చెప్పింది.

పెద్దవాళ్లు – వాళ్లూ వాళ్లూ మాట్లాడుకున్నారు. వాళ్లూ వాళ్లూ ఒప్పేసుకున్నారు.

ఇప్పుడింక ఎలా తప్పించుకోవాలో వీళ్లకు తెలియలేదు.

“పెళ్లి కావల్సిన ప్రతి వాళ్లకూ, కీచులాడుకునే జంటను చూస్తే, జన్మలో పెళ్లి చేసుకోకూడదనే అనిపిస్తుంది. కానీ ఇది జీవితం. ఈ కీచులాటలు జీవీతంలో ఒక భాగమే. జీవితంలోని బాధ్యతల నుంచి పారిపోవాలనుకోవటం అవివేకం. ఏ ఒడిదుడుకులూ లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. అలలు ఎగిసిపడుతుంటేనే సముద్రానికి ఆ అందం..” అన్నాడు రవికాంత్ తండ్రి.

ఆరు నెలల తరువాత, బృంద, రవికాంత్ ఇద్దరూ వెంకటేశ్వర స్వామి గుడిలో నిలబడి శుభలేఖలు దేవుని ముందు పెట్టి నమస్కరించారు.

వెనుక నుంచి శ్రావంగా పాట వినిపించింది. ‘కలియుగ మెటులైనా కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా’ – అని.

ఎవరా అని తిరిగి చూసింది బృంద.

కాబోయే ఆడబిడ్డ – అంటే అర్ధమొగుడు? అప్పుడే మొదలైందా సర్వేశ్వరా? – అని అనుకుంది బృంద.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here