చిరుజల్లు-73

0
12

ప్రేమ పక్షులు

[dropcap]డా[/dropcap]క్టర్ ఆరుంధతిని డిన్నర్‌కి ఆహ్వనించాడు చైతన్య. ఆదివారం నాడు రాత్రి ఏడు గంటలకు వస్తానని చెప్పిందామె. ఏడు గంటల నుంచీ ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఏడున్నర కల్లా వంటవాడు అన్నీ సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. చాలా కాలం తరువాత తన ఇంటికి వస్తున్న పాత స్నేహితురాలి కోసం ప్రత్యేక వంటకాలు చేయించాడు.

ఇల్లంతా సర్ది అందంగా కనిపించేలా తీర్చిదిద్దాడు. అరుంధతి ఇప్పుడు పరాయిది కావచ్చు. కానీ తమ మధ్య వున్న ప్రత్యేకమైన అభిమానం ఎన్నటికీ చెరగనిది, తరగనిది.

టైం ఎనిమిది అయింది. ఇంక వచ్చేస్తుంది – అనుకుంటూనే పత్రిక తిరగేసాడు కాసేపు. ఇంకొంచెం సేపు అయ్యాక టీ.వీ. ఆన్ చేసి వార్తలు విన్నాడు. ఆఫ్ చేసేశాడు. ఒక్కొక్క క్షణం నిశ్శబ్దంగా గడిచిపోతోంది. హాల్లో నుంచి బయటకు వచ్చి పచార్లు చేస్తున్నాడు. ఆలస్యమయ్యే కొద్దీ అసహనం ఎక్కువవుతోంది. తొమ్మిది గంటల దాకా చూసి ఆమెకు ఫోన్ చేశాడు. రెస్పాన్స్ లేదు.

చైతన్య సోఫాలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. ‘ఆమె ఎందికిలా చేసింది?’ అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది. అన్నీ అనుకునట్లు సవ్యంగా జరిగి ఉంటే, అరుంధతి ఈ ఇంటికి ఇల్లాలు అయి ఉండేది. అతనికి గతమంతా కళ్ల ముందు మెదిలింది.

అతను లాయర్‌గా ప్రాక్టీసు పెట్టిన కొద్ది రోజులకే, అరుంధతి డాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించింది.

అప్పట్లో ఇద్దరికీ పెద్దగా పని ఉండేది కాదు. రోజుకోసారి చూడటానికి వచ్చేది. ఆ సమయంలో అతను ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తుండేవాడు.

“నేను నీ కోసం ఇక్కడ పడిగాపులు పడుతుంటే నువ్వు ఎక్కడో తిరుగుతుంటావు. నువ్వు నీ పద్ధతులు మార్చుకోకపోతే, నేను నిన్ను మార్చి మరొకర్ని చూసుకోవాల్సి వస్తుంది” అనేది.

“పెళ్లి అయ్యాక నీ కంట్రోల్ ఎలాగూ తప్పదు. ఇప్పుడైనా కాస్త ఫ్రీగా తిరగనీయ్. ప్రతి స్త్రీ పెళ్లి అయ్యాక భర్త అలవాళ్లను మార్చేందుకు నానా తిప్పలూ పడుతుంది. తీరా అతను మారిపోయాక మీరు పెళ్లికి ముందున్న మనిషి కాదు, మారిపోయారు అని ఆడిపోసుకుంటుంది. నువ్వు అందరిలాగానే ఆలోచిస్తున్నావు” అనేవాడు అతను.

“అసలు నీ వృత్తికీ, నా వృత్తికీ సరిపడదనుకుంటాను” అనేది అరుంధతి.

“ప్రవృత్తి కల్సినప్పుడు వృత్తి ఏదైనా ఫర్వాలేదు. నన్ను చూడటం కాసేపు ఆలస్యం అయితే భరించలేని దానివి. నిన్ను చేసుకోకపోతే ఏం చేస్తావ్?”

అరుంధతి కోపం ముంచుకొచ్చేది. “అంటే, ఏంటి నీ ఉద్దేశం? ప్రేమ లేని జీవితాన్ని నువ్వు భరించగలవుగానీ, నేను భరించలేననా?” అని అడిగేది.

“ప్రపంచంలో ప్రేమ లేకపోతే, ఈ ఇళ్లు అన్నీ సమాధుల్లా మారిపోతయి. మనుష్యులంతా కదిలే మరబొమ్మల్లా మారిపోతారు. వద్దు. అలాంటి దృశ్యాన్ని మనం ఊహించుకోవద్దు” అనేవాడు.

ప్రేమలేని జీవితాన్ని ఊహించుకోలేని వాళ్ల మధ్య క్రమంగా ఎడం ఏర్పడుతూ వచ్చింది. అందుకు కొంత కారణం అతని తల్లి అయింది.

“మీ అమ్మ ఎప్పుడూ నన్ను విమర్శిస్తూ ఉంటుంది. వ్యంగ్యంగా మాటలను తూటాల్లా వదులుతుంటుంది. నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆమెకు ఎదురు చెప్పకుండా ఊరుకుంటుంటే, అది ఆమె నా మెతకదనంగా తీసుకొని రెచ్చిపోతోంది” అని చెప్పింది అరుంధతి.

“నిన్ను ఎందుకు విమర్శిస్తోంది?” అని అడిగాడు.

“నేనంటే అసూయ. ఈర్ష్య. ద్వేషం..”

“అదే ఎందుకని?”

“కొన్నింటికి రీజనింగ్ ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎందుకని? అంటే చెప్పలేవు. అలాగే మీ అమ్మ నన్ను ద్వేషిస్తోంది. బహుఃశా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందు వల్లనే, ఆమె నన్ను ద్వేషిస్తోందేమో. అంతకన్నా మరో కారణం లేదు” అని చెప్పింది అరుంధతి.

నిజమే. అతని తల్లి అరుంధతి మాటనీ, నడకనీ, నడతనీ దుయ్యబడుతూనే ఉండేది. అరుంధతి అతని ఇంటికి వెళ్లటం మానేసింది. అతనే ఆమె కోసం వెళ్లేవాడు.

“రావటం మానేశావేం?”

“మనసులోని మాట నిర్భయంగా చెప్పలేని నిస్సహయ స్థితిలోకి, అలాంటి చోటుకి వెళ్లటం అవసరమా?”

“మరి ఏం చేద్దాం?”

“అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు. మీ అమ్మకీ, నాకూ సరిపడదు. క్షణం సేపు ఒక చోట నిలబడలేని మమ్మల్ని జీవితాంతం ఒకే ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయకు. అది వృథా ప్రయాస” అని స్పష్టంగా చెప్పింది.

జీవితంలో మనకు నచ్చనివి, ఇష్టం లేనివి ఎన్నిటినో వదిలించుకోవచ్చు. కానీ తల్లినీ తండ్రినీ వదిలించుకోలేం.

క్రమంగా అరుంధతిని కల్సుకోవటం తగ్గిపోయింది. అతను దూరమయ్యే కొద్దీ ప్రవీణ్ ఆమెకు దగ్గరయ్యాడు.

అతను కవిత్వం రాస్తాడు. కవులు మాటలతో గారడీలు చేస్తారు. ఆమె అందాలను పొగుడతూ కవిత్వం రాశాడు, ఆమెకు చదివి వినిపించేవాడు.

“మీరు నన్ను ఊరికే పొగిడేస్తున్నారు” అనేది అరుంధతి.

“పొగడ్తలు ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు? దేవుడి ముందు స్తోత్రాలు చదివేది ఎందుకు? పొగడటానికే కదా?”

“నా అందాన్ని చూసేందుకు సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడు. చంద్రుడు తొందరపడి తొంగిచూస్తున్నాడు. ఇవన్నీ అబద్దాలు. మీ కల్పనలు” అని నవ్వేది అరుంధతి.

“సూర్యుడు, చంద్రుడూ నిన్ను చూస్తున్నారన్న ఊహ అబద్ధం కాదు. కవిత్వం అబద్దమే అయినా, కవి చెప్పే దానిలో కొంత అయినా నిజం ఉంది కదా” అని సమర్థించుకునేవాడు ప్రవీణ్.

ప్రవీణ్ ఆమె మీద రాసిన కవితలు అన్నింటినీ అచ్చు వేశాడు. ఆ పుస్తకానికి ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశాడు. సభలోని వారందరూ అరుంధతినీ, ప్రవీణ్‌నీ ఆకాశానికి ఎత్తేశారు.

“అరుంధతి లేనిదే నా కవిత్వం లేదు. నా కవిత్వం లేనిదే నేను లేను” అన్నాడు ప్రవీణ్.

మనుషులు కలిసిన తరువాత మనసులు కలవటమూ సహజమే.

ప్రవీణ్ అరుంధతి వివాహం చేసుకున్నారు.

ఇదంతా జరిగిన కొన్నేళ్లు అయింది.

చైతన్య ఈ మధ్య అనుకోకుండా ఒక మిత్రుడ్ని కలుసుకోవటానికి హాస్పటల్‌కి వెళ్లినప్పడు, అరుంధతి కనిపించింది. ఇప్పుడామె ఇది వరకటి అరుంధతి కాదు. చాలా పెద్ద పేరు మోసిన డాక్టర్. పేరుతో పాటు డబ్బూ గడించింది. మేడ, కార్లు, పలుకుబడి, గౌరవం, అన్నీ సంపాదించుకుంది. అసలు చైతన్య గుర్తు పట్టలేకపోయాడు. ఆమె పలకరించింది. తన రూంలోకి తీసుకెళ్లి కాసేపు మాట్లాడింది. ఆ మాటల్లో ఇదివరకటి ఆప్యాయత కనిపించింది.

“నీకు పెళ్లి అయిందా? మీ అవిడ ఎలా ఉంటుంది? ఏం చేస్తోంది?” అని అడిగింది.

“నాకు పెళ్లి కాలేదు”

“ఎందుకని?”

“మా అమ్మకు నీ మీదనే కాదు, కోడలుగా రాబోయే ఏ అమ్మాయి మీదనైనా అసూయ ఉంటుందని గ్రహించాను. అందుచేత ఆమె ఉన్నంత వరకూ పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యనే ఆమె చనిపోయింది” అని చెప్పాడు చైతన్య.

“అలాగా. అయామ్ సారీ.. రేపొకసారి మీ ఇంటికి వస్తాను” అని చెప్పింది. డిన్నర్‌కి రమ్మని ఆహ్వనించాడు. సరే నన్నది. ఆమె కోసం ఎంత సేపు నిరీక్షించినా ఆమె రానే లేదు.

ఎదురు చూసి, ఎదురు చూసి, చైతన్య అలాగే నిద్రపోయాడు.

రెండు రోజుల తరోవాత చైతన్య ఇంటి ముందు కారు ఆగింది. అరుంధతి వచ్చి తలుపు తట్టింది. ఆశ్చర్యపోయిన చైతన్య ఆమెను లోపలకు ఆహ్వనించాడు.

“వాటే ప్లజంట్ సర్‌ప్రైజ్” అన్నాడు ఆమె సోఫాలో కూర్చున్నాక.

“మొన్న వస్తానని చెప్పి రాలేకపోయాను. అయామ్ సో సారీ. ఆ రోజు ఒక మేజర్ ఆపరేషన్ చేస్తూ.. ఆ ధ్యాసలో పడి నీ విషయం పూర్తిగా మర్చిపోయాను” అన్నది అరుంధతి.

“దానిదేముంది? నీ వృత్తి అలాంటిది. టైం మీ ఆధీనంలో ఉండదు” అన్నాడు చైతన్య.

ఒక క్షణం ఆగి ఆమె అన్నది “నిజమే చైతన్యా. టైం మన ఆధీనంలో లేదు. మనమే దాని ఆధీనంలో ఉన్నాం. మనం చదువుకున్నాం. ఎంతో విజ్ఞానం సముపార్జించుకున్నాం అనుకుంటాం. ఎంతో గొప్పవాళ్లం అయ్యాం అనుకుంటాం. కానీ కాలం ముందు మనం ఎప్పుడూ పాఠాలు నేర్చుకుంటూ తప్పలు దిద్దుకునే చిన్న పిల్లలమే ననిపిస్తుంది.”

“నీకేం తక్కువైందిని? పేరు, ప్రఖ్యాతి, డబ్బూ అన్నీ పుష్కలంగా సంపాదించావు కదా.”

“అన్నీ సంపాదించటమే ఒక రకంగా తప్పు అయింది.”

“అదేమిటి?”

“వృత్తి రీత్యా సక్సెస్ అయ్యాను. కానీ దాని కారణంగానే సంసార జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయ్యాను.”

“అంటే?”

“నీ దగ్గర దాచవల్సినదేమీ లేదు. నేను అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ నా భర్తకు అసూయ ఎక్కువైంది. ఆ అసూయతో, భర్తననే అహంకారంతో అనేక రకాలుగా వేధించటం మొదలు పెట్టాడు. ప్రవీణ్ గొప్ప కవి అవుతాడని ఊహించాను. ఆర్థిక సమస్యలు, ఇతర బాదరబందీలు లేకుండా ఉంటే, గొప్ప కవిత్వం రాస్తాడనుకొని అడిగినంత డబ్బు ఇస్తూ, బోలెడంత స్వేచ్ఛనిస్తూ అన్ని అవకాశాలు కల్పించాను. కానీ అన్నీ బూడదిలో పోసిన పన్నీరే అయినయి. తాగటం, నిద్రపోవటం తప్ప అతను ఏమీ చేయలేని, ఎందుకూ పనికిరాని అసమర్థుడుగా తయారయ్యాడు. పెళ్లి అయ్యాక అతనిలోని కవి చచ్చిపోయాడనిపించింది. పెళ్లి చేసుకున్న నేరానికి అతన్ని భరిస్తూ వచ్చాను. కాని భార్య ఎదుగుదలను చూసి, న్యూనతా భావంతో రగిలిపోయే భర్త భరించలేడని క్రమంగా అర్థమైంది. రోజూ తాగటం, ఏవో తప్పులు వెతుక్కుని, లేనివన్నీ ఊహించుకొని కొట్లాటకు దిగటం మాములు అయిపోయింది. ఈ బాధ భరించలేక పోయాను. ఒకప్పుడు మీ అమ్మ అసూయతో నన్ను విమర్శిస్తోందని నిన్ను కాదన్నాను. ఇప్పుడు సాక్షాత్తూ కట్టుకున్న వాడే కనిపించని అసూయాద్వేషాలతో నిత్యం నరకం చూపిస్తుంటే తట్టుకోలేకపోయాను. నెల రోజుల కిందట ఇంట్లో ఉన్న నగలూ, డబ్బూ తీసుకొని పారిపోయాడు. డబ్బు పోతేపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది..” అన్నది అరుంధతి.

“ఇంత ఉన్నత స్థితిలో ఉండి ఇలాంటి చిన్న సమస్యలతో బాధ పడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను..” అన్నాడు చైతన్య.

“ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, సమస్యల నుంచి తప్పించుకోలేం అనటానికి నా జీవితమే ఒక నిదర్శనం” అన్నది అరుంధతి.

ఇంక చైతన్య ప్రసంగం మరో విషయం మీదకు మళ్లించాడు.

“మొన్న నువ్వు వస్తావని స్పెషల్‍గా వంటలు చేయించాను. అప్పుడు నువ్వు రాలేదు.”

“దేనికైనా అదృష్టం ఉండాలి గదా.”

“ఇవాళ నువ్వు వచ్చే సమయానికి వంటమనిషి వెళ్లిపోయాడు.”

“వాడు వెళ్లటమే మంచిది అయింది. మనకు కాస్త ఏకాంతం దొరికింది. నువ్వు పర్మిషన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఈ పూట ఇక్కడ భోంచేస్తాను.”

“ప్రత్యేకంగా ఏం చేయలేదు.”

“ప్రత్యేకంగా ఏమీ వద్దు. జీవితంలో అన్ని విధాలుగా బాగా అలసిపోయాను. ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి. నా బాధ చెప్పుకునేందుకు నా కష్టాలను పంచుకునేందుకు నాకొక మిత్రుడు కావాలి. నువ్వు ఇంకా నా పాత చైతన్యవే అనుకుంటున్నాను” అన్నది అరుంధతి లేచి వంటింటి వైపు వెళ్తూ.

ఇద్దరూ కల్సి భోం చేశారు.

“నాకు నిద్ర వస్తోంది” అంటూ సోఫాలోనే నిద్రపోయింది.

చైతన్య ఆమె తలకింద దిండు పెట్టాడు పసిపాపలా నిద్రపోతున్న అరుంధతి వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు.

ఎక్కడ నుంచో రెండు పక్షులు వచ్చి కిటికీలో వాలాయి. ఆ పక్షులు రెండూ ప్రేమగా పలకరించుకుంటుంటే, వాటి వంకే చూస్తున్నాడు చైతన్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here