చిరుజల్లు-76

1
5

గులాబీ రేకలు

[dropcap]రే[/dropcap]డియోలో ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, రేవుల్లో ఎన్ని ప్రమాద సూచికలు ఎగరేసినా, సైన్యాన్ని సిద్ధంగా ఉంచినా, వచ్చే ఉపద్రవం ముంచుకు రానే వచ్చింది.

కారు మబ్బులు కమ్ముకొచ్చాయి. వానొచ్చింది. వరదొచ్చింది. మూడు రాత్రిళ్లూ, పగళ్లూ ఆకాశం అదే పనిగా రోదించింది.

ఎప్పుడూ ఇంతే. అక్కడెక్కడో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఇక్కడ కోస్తా జిల్లాల్లో అల్లకల్లోలమే. పేద పేద ప్రజల బ్రతుకుల్లో భారీ వర్షాలే. మిట్టా పల్లం ఏకం అయితే, గుడిసె, మిద్దే మేడా కొట్టుకుపోతే, చెట్టూ చేమ నేలకొరిగితే, బురద పాముల్లా కొట్టుకొచ్చిన వారంతా, అదే ఈదుకొచ్చిన వారంతా, గుళ్ళల్లోనూ, సత్రాల్లోనూ, దేవుడి చావిడీలల్లోనూ చేరి చలిగాలికి చుట్టులు చుట్టుకుపోయి, పడి – అదే పడుకొని ఉన్నారు.

జరగవల్సిన ప్రకృతి బీభత్సం అంతా జరిగాక, ఇక రాజకీయ నాయకుల బీభత్సం మొదలైంది. హెలికాప్టర్లల్లోనూ, కార్లల్లోనూ తిరిగి, అసలే చలికి వణికిపోతున్న వారిమీద విపరీతమైన సానుభూతి వర్షం కురిపించారు. నాలుగు అన్నం పొట్లాలు ఇచ్చి నలభై ఫోటోలు తియించుకొని, దేశ విదేశీ పత్రకలు అన్నింటిలో ప్రముఖంగా అచ్చొత్తిపించుకున్నారు. పది దుప్పట్లు ఇచ్చినందుకు దాఖలాగా నూటపదహారు వీడియో కాసెట్లు దేశ విదేశాల టీవీలకు పంపారు. అక్కడ బురద ఆరక ముందే, ఇవంతా ఇప్పటికి మీ నిర్లక్ష్యం వల్లనే అంటే, కాదు అప్పటి మీ అవినీతి వల్లనే అని రాజకీయ పార్టీల వాళ్లు ఒకరి మీద మరొకరు బురద చల్లుకున్నారు. మీరు కోట్లు పంచిపెట్టండి అంటే, మీరు దోచుకున్నంతా బయటకు తీయమని విమర్శనాస్త్రాలు గుప్పించుకున్నారు. పత్రికల వాళ్లు నిధులు పోగచేయటం మొదలు పెడితే, సినిమాల వాళ్లు జోలెకట్టి, అడుక్కునే దగ్గర చిల్లర డబ్బులు అడుక్కున్నారు. యల్. బి. స్టేడియంలో వెకిలివేషాలు వేసి నిధులు పోగుచేశారు. త్యాగనిరతికి నిదర్శనంగా ఒక రోజు షూటింగులు ఆపేశారు. వీరి దేశభక్తికి, ఈ కళామతల్లి ముద్దు బిడ్డలను ముఖ్యమంత్రులు కొనియాడారు.

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో ఏ వన్ సుపర్ స్టార్‍గా దేదీప్యమానంగా వెలుగొందిపోతున్న సుప్రసిద్ధ సినీ నటీ తరంగిణి ఓ భారీచిత్రం నిర్మాణానికి కోనసీమలో షూటింగ్‌కి వచ్చి, అప్సరా హోటల్లో మకాం పెట్టింది. పబ్లిసిటీకి బాగా పనికొస్తుందని సినీ డైరెక్టర్ సలహా ఇస్తే, మూడు గంటల సేపు మేకప్ వేయించుకొని, ఫోటోగ్రాఫర్లను వెంటబెట్టుకొని వరద బాదితులను పరామర్శించటానికి వెళ్లింది. చిరునవ్వు పెదాలపైన తగిలించుకొని, మొక్కుబడిగా నమస్కారాలు చేస్తూ పోతున్న తరంగిణి ఒకచోట హఠాత్తుగా ఆగిపోయింది. ఓ మూల ముడుచుకొని కూర్చుని చలికి వణికి ఆమెను ఎక్కడో చూసినట్లుంది ఎక్కడా?.. అవును.. ఆమె పార్వతి!

పదేళ్ల కిందట తరంగిణి – పూర్వశ్రమంలో తాయారమ్మగా ఉన్నప్పుడు, పార్వతి ఈడుదే. ఇద్దరూ ఇరుగూ పొరుగూ వాళ్లే. సీతాకోక చిలకల్లా రివ్వున ఎగురుతుండే వాళ్లు. అట్ల తద్దెనాడు, ఉయ్యాల లూగటం, సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు పెట్టటం, వెన్నెల్లో కాళ్లాగజ్జాలాడటం, ఇంట్లో చెప్పకుండా మాట్నీలకు చెక్కెయ్యటం – లాంటివన్నీ గుర్తుకొచ్చాయి తరంగిణికి.

ఒక సినిమా కంపెనీ వాళ్లు కొత్త ముఖాలు కావాలని ప్రకటన ఇస్తే, అది చూసి, ఒకరోజు రాత్రి ఇద్దరూ మద్రాసు చెక్కేసారు. ఎవరన్నా మోసం చేస్తారేమోనని పార్వతి భయపడుతూనే ఉంది. ఎవడేనా ఒంటి మీద చెయ్యివస్తే నరికి పోగులు పెడదామని తాయారు ధైర్యం చెప్పింది.

సినిమా కంపెనీ వాళ్లు చేయవల్సిన నగ్న పరీక్షలన్నీ చేశారు. పార్వతిని సెలెక్ట్ చేశారు. అనక ఆమెను ఒక హోటల్ రూంలో ఉంచారు. తనతో పాటు నాలుగు రోజుల పాటు తాయారును కూడా అదే రూంలో ఉండనివ్వమని బ్రతిమిలాడితే, వాళ్లు సరేనని పార్వతి కోరికను మన్నించారు.

అంతా కొత్తవాళ్లు. ఎవరేం చేస్తారోనని బిక్కు బిక్కు మంటున్న పార్వతికి తాయారు ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉంది. ఎవడైనా వెధవ్వేషాలేస్తే, తన్ని తగలెయ్యమని.

ఆ రోజు రాత్రి ఇద్దరు గదిలోకి వచ్చి వాళ్ల మీద పడ్డారు. పార్వతి చాచిపెట్టి తన్నింది. వచ్చిన అవకాశాన్ని అలా కాళ్లదన్నుకుంది. తాయారు మాత్రం ఆయాచితంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వచ్చిన వాడిని గట్టిగా కౌగిలించుకుంది.

మర్నాడే పార్వతిని ఇంటికి పంపించారు. వాళ్లు తాయారును తరంగిణిగా మార్చారు. హీరోయిన్ అయింది. అలా తరంగిణి వెళ్లి బూరెల బుట్టలో పడింది. ఇంక ఊపిరాడనన్ని అవకాశాలు ఆమెను వెతుక్కంటూ వచ్చాయి. వెనక్కి తిరిగి చూసుకునే తీరికలేదు.

కార్లు, మేడలూ, బేంక్ బాలెన్స్‌లూ, కాల్‌షీట్స్, ఘాటింగ్‌లూ, అవార్డులూ సన్మానాలూ, అలా అలా గాలిలో విహరిస్తూనే ఉంది. పార్వతి మాత్రం తిరిగొచ్చి గాలికి కొట్టుకుపోతూ, ఇదుగో ఇక్కడికొచ్చి ఈ వేళకు ఈ వరండాలోకి చేరింది.

ఆ వేళ అలా వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోమని సలహా ఇచ్చినది తాయారు, దాన్ని అలా కాలదన్నుకున్నది పార్వతి. కానీ తాయారు మాత్రం ఆ అవకాశాన్ని అక్కున చేర్చుకుని కీర్తి శిఖరాలకు చేరింది. ఇవన్నీ గుర్తుకొచ్చాయి తరంగిణికి.

గ్లిజరిన్ అవసరం లేకుండానే ఆమెకు కన్నీరు పెల్లుబికి వచ్చింది.

జలజల మని కన్నీరు కారుతుంటే, గబగబా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది తరంగిణి – ఒకనాటి తాయారు. ఆ సన్నివేశానికి పాత్రికేయులంతా తమ మేధా సంపత్తిని జోడించి, ఆమె కరుణార్ద్ర హృదయాన్ని పేజీల కొద్దీ వర్ణించారు.

పార్వతి – పాపం పిచ్చిది. అన్నీ తెల్సినా ఏమీ తెలియనట్లే చలికి వణికిపోతూ ముడుచుకొని పడుకొని ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here