చిరుజల్లు-80

0
8

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

అద్దం

[dropcap]భా[/dropcap]నుమతి డాక్టరు దగ్గరకు బయల్దేరుతోంది. ఆమె భర్త రఘుపతి తొందర పెట్టేస్తున్నాడు. ఆమె ముస్తాబు తెమలటం లేదు.

“ఈ నెమలి ఫింఛం చీరకట్టుకొనా? బేబీ పింక్ కలర్ చీర కట్టుకోనా?” అని అడిగింది భానుమతి.

“ఏదో ఒకటి కట్టుకొని తొందరగా రా..” అని రఘుపతి ఆమె హ్యాండ్ బాగ్ అందుకున్నాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసే అలవాటు లేకపోయినా, తెరిచి ఉన్నందువల్ల అందులో ఏమున్నాయోనని అనాలోచితంగా చూశాడు.

అందులో పగిలిపోయిన చిన్న అద్దం ముక్క కనిపించింది. దాన్ని తీసి చూశాడు. చాలా పాతది. కళాయి పోయినందు వల్ల ప్రతిబింబం సరిగ్గా కనిపించటం లేదు.

“ఏమిటీ, ఈ పగిలిపోయిన అద్దం ముక్కను ఇంత భద్రంగా దాచుకున్నావు? పారేస్తున్నా..” అన్నాడు రఘుపతి.

భానుమతి చుట్టుకుంటున్న చీరను అలాగే పట్టుకొని పరుగెత్తుకొచ్చింది.

“దాన్ని పారెయ్యకండి, ప్లీజ్..” అన్నది.

“అది కాదు. ఇది పగిలిపోయిన అద్దం ముక్క. చెయ్యి గీసుకుపోగలదు” అన్నాడు అతను.

“అసలు మీరు నా బ్యాగ్ ఎందుకు తెరిచారు? అందులో నా వస్తువులు ఏవేవో ఉంటాయి. అవన్నీ మీరు చూడకూడదు.” అన్నది భానుమతి.

“నీ వస్తువులు నాకు అక్కర్లేదు. కాని దీని వల్ల డేంజర్ అంటున్నాను.”

“అయినా సరే, అది అందులో ఉండాల్సిందే” అన్నది పైట సర్దుకుంటూ.

“అందుకే మనల్ని సెంటిమెంటల్ ఫూల్స్ అని అంటుంటారు. పగిలిపోయిన గాజు పెంకుల్ని, వాడిపోయిన పూలదండల్నీ, ఏదో ఒక సెంటిమెంటు పెట్టుకొని ప్రాణప్రదంగా దాచుకోవటం.. అది పోతే ప్రాణం పోయినట్లు బాధపడటం..” అని అంటున్నాడు అతను.

“నేను రెడీ. ఇంక బయల్దేరండి” అన్నది భాను.

ఒక గంట తరువాత వాళ్లిద్దరూ డాక్టర్ కనకవల్లి దగ్గర ఉన్నారు. ఆమె భానుమతిని పరీక్ష చేసింది.

“కంగ్రాచ్యులేషన్స్. షీ ఈజ్ ప్రెగ్నెంట్.. ఇక నుంచీ డైట్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. నెలకోసారి చెకప్ చేయించుకోవాలి” అంటూ తీసుకోవల్సిన జాగ్రత్తలు చెప్పింది.

“థాంక్స్” అన్నాడు రఘుపతి.

“థాంక్స్ మీ ఆవిడకు చెప్పండి. నాకు మాత్రం ఫీజు ఇవ్వాండి.. టానిక్ రాసిస్తాను.. అది వాడండి” అని కనకవల్లి రఘుపతికి ప్రిస్క్రిప్షన్ కాగితం అందించింది.

ఇంటికి వచ్చాక రఘుపతి భార్యను దగ్గరకు తీసుకున్నాడు.

“నీక ప్రమోషన్ వచ్చిందోయ్. తల్లివి కాబోతున్నావు” అన్నాడు.

“ఆ ప్రమోషన్ ఏదో మీకూ వచ్చినట్లే లెండి.. మీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను, నన్ను వదిలిపెడితే..” అన్నది భానుమతి.

“బాబు పుడితే, వాడి ఆటలూ, పాటలూ, నవ్వులూ, ఏడుపులూ.. రాణీ గారికి ఇంక వాడితోనే లోకం. ఇక్కడ మొగుడు వెధవ ఒకడున్నాడన్న విషయమే గుర్తుండదు” అన్నాడు భార్య తలను తన తలతో ఢీకొడుతూ.

“లేదు లెండి, నాకు ఏ వెధవ అయినా, మొగుడు వెధవ తరువాతే..” అని నవ్వేసింది.

“నన్ను అంత మాట అంటావా?” అని చేతులు మరింత గట్టిగా బిగించాడు.

పోస్ట్ మ్యాన్‌ కేక విని భార్యను వదిలేసి బయటకు వెళ్లాడు.

భానుమతిని పదవ తేదీ పదకొండు గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని కోరుతూ ఒక ప్రముఖ కంప్యూటర్ కంపెనీ వాళ్లు పంపిన లెటర్ అది.

రఘుపతి సంతోషంతో కేక పెట్టాడు. “మేడమ్, మీకు ఇంటర్వ్యూ వచ్చింది. అన్నీ సంతోషకరమైన వార్తలే ఇవాళ. ఒకదాని తరువాత మరొకటి. నక్కను తొక్కినట్లున్నావు..”

“నక్కను తొక్కలేదు. కుక్కను తొక్కలేదు. కష్టపడి చదువుకున్నాను. అప్లయ్ చేశాను. ఇంటర్వ్యూకి పిల్చారు. అంతే” అన్నది భానుమతి, కవరు అందుకుంటూ.

“మేమూ కష్టపడే చదువుకున్నాం. అడ్వకేట్ అని బోర్డు పెట్టుకొని కూర్చున్నాం” అన్నాడు రఘుపతి నిరుత్సాహంగా.

“చదువుకున్న వాళ్లంతా తెలివిగలవాళ్లు కారు. ఆ సంగతి ఆ కంపెనీ వాళ్లకు తెల్సు. అందుకనే నన్ను పిలిచారు” అన్నది భానుమతి.

“ఎంత మాట అన్నావే? పెళ్లాం కాబట్టి ఊరుకుంటున్నాగానీ, లేకపోతే పరువు నష్టం దావా వేసేవాడిని..”

“ఏ దావా వేసినా మీరు గెలవలేరు. ఎందుచేతనంటే నా స్టేట్‌మెంట్ కరెక్ట్. మీ చదువు అయిదేళ్ల కిందట ఆగిపోయింది. మా కంప్యూటర్ విద్య అలా కాదు. ఇది ఆగిపోవటం అంటూ ఉండదు..”

“అవునవును. ఉయ్యాల్లో ఉన్నప్పుడు మొదలు పెడితే, అంతిమ యాత్రలో పూర్తి అవుతుంది” అన్నాడు రఘుపతి.

రఘుపతి మళ్లీ ఇంటర్వ్యూ లెటర్ చూశాడు. కాలెండర్ చూశాడు. “అన్నట్లు పదో తేదీన మా నాన్న తద్దినం. అన్నయ్యగారింటికి వెళ్లాలి. నువ్వు ఒక్కదానివే వెళ్లాల్సి ఉంటుంది” అన్నాడు రఘుపతి.

“అసలు వాళ్లు నన్ను ఒక్కదాన్నే ఇంటర్వ్యూ చేస్తారనుకుంటా.. ఎందుకంటే ఉద్యోగం చేయవల్సిన దాన్ని నేను ఒక్కదాన్నే గనుక..”

“సంతోషించాంలే. ఇవాళ ఎందుకో అమ్మాయిగారి తెలివి తేటలు ఓవర్ ఫ్లో అయిపోతున్నయి..”

“తెలవి తేటలు అంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఒకర్ ఫ్లో అవకమానవు.. ముఖ్యంగా అమందానంత కందళిత హృదయారవిందులమైనప్పుడు..”

“ఇప్పుడు ఏమైందని, అంతగా అమందానందం పొందటానికి..”

“బిడ్డను ఎత్తుకోబోతున్నాను. పసిపిల్లవాడు ఒక పజిల్ లాంటి వాడు. ఏదీ చెప్పలేడు. ఒక పుస్తకం లాంటి వాడు. ఆ పుస్తకం చదవటానికి మాములు భాష చాలదు. దానికి ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ లాంగ్వేజ్ ఉంటుంది. బిడ్డను ఎత్తుకున్న తల్లికి మాత్రమే ఆ భాష తెలుస్తుంది” అన్నది భానుమతి.

“ఓర్నాయినో.. ఇవాళ నీకేదో అయింది. ఇటు చంటివాడు, అటు కంపెనీ ఉద్యోగం. నీ వరస చూస్తుంటే తిన్నగా ఉద్యోగం చేసేటట్లు లేవు. నేను ఒకటి చెబుతున్నాను విను. ఇక నుంచీ మనకు ఖర్చులు పెరుగుతయి. నేను అడ్వకేటుగా బోర్డు కట్టుకున్నాను. ఒకసారి మంచి కేసు తగిలితే నాగులు రూపాయలు రానూవచ్చు. కొన్నాళ్లు ఏమీ రాకపోనూ వచ్చు. నీకు ఉద్యోగం వస్తే, నెలనెలా జీతం వస్తుంది గనుక, బండి నడుస్తుంది. దిగులు ఉండదు. అందుచేత నీ ఉద్యోగం మనకు చాలా ముఖ్యం. అర్థమైందా?” అని అడిగాడు.

“నాకు మీరు చెప్పకపోయినా అర్థం అవుతోంది. కానీ ఆ కంపెనీ వాళ్లకు మన ప్రాబ్లం అర్థం అయి, జాబ్ ఇవ్వాలి గదా..” అన్నది భానుమతి.

“అదీ నిజమే. ఇప్పుడు ఇంటికి ఇద్దరు నిరుద్యోగులున్నారు. ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తారో తెలియదు. అంతమందిలో నువ్వు ఎక్కడ నిలబడతావో తెలియదు.. ఒక పని చేస్తాను. ప్రతి చట్టానికి కొన్ని లొసుగులున్నట్లుగానే, ప్రతి కంపెనీకి కొందరు మూలవిరాట్‌లూ, కొందరు ఉత్సవ విగ్రహాలూ ఉంటారు. ఇవాళ్టి నుంచి గాలింపు మొదలెట్టి, ఎవడో ఒకడ్ని పట్టుకొని ఈ ఉద్యోగం చెయ్యి జారిపోకుండా చూస్తాను” అన్నాడు రఘుపతి.

అక్కడి నుంచి అతనికి తెల్సిన వాళ్లందరికీ ఫోన్లు చేసి, ఏదైనా లింకు దొరుకుతుందేమోనని ప్రయత్నించటం మొదలు పెట్టాడు.

హముమంతుడు లంకనంతా గాలించి, చివరకు సీతమ్మను కనుగొనట్లు రెండు రోజులపాటు తెల్సిన వాళ్లకీ, తెలిసీ తెలియని వాళ్లకీ, తెల్సిన వాళ్లకు తెల్లీన వాళ్లకు ఫోన్లు చివరకు ఒక సోర్సు పట్టుకున్నాడు.

ఒక చిన్ననాటి క్లాస్‌మేట్‌కి తెల్సిన ఒక పెద్ద మనిషిని పట్టకున్నాడు. ఆయన చెబితే ఉద్యోగం వచ్చినట్లే – అని అన్నారు.

ఆ ఫ్రెండ్‌ని వెంటబెట్టుకొని నాలుగు సార్లు ఆ పెద్ద మనిషి ఇంటి చుట్టూ తిరిగితే, చివరకు ఎలాగో ఆయన దొరికాడు.

తీరా ఆ పెద్ద మనిషి, ఆ కంపెనీ యం.డి.కి ఫోన్ చేస్తే, ఆయన ఢిల్లీలో ఎక్కడో ఏదో మీటింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అంత బిజీగా ఉన్నప్పుడు ఈ చిన్న విషయం కోసం ఆయన్ని డిస్టర్బ్ చేయటం బాగోదని ఆ పెద్ద మనిషే అన్నాడు.

ఆ కంపెనీ యం.డి. తిరిగొచ్చేలోపల ఈ పెద్ద మనిషి వేరే పని మీద ఎక్కడికో వెళ్తున్నాడు. అందుచేత ఈ పెద్ద మనిషి తన లెటర్ హెడ్ మీద “ఈ అమ్మాయికి హెల్ప్ చెయ్యి” అని ఒకే ఒక వాక్యం రాసి ఇచ్చాడు. ఆ ఒక్క వాక్యమూ రాంబాణంలా పని చేస్తుందనీ చెప్పాడు.

ఆ మాత్రం లెటర్ సంపాదించగలిగినందుకు రఘుపతి నీలి నీలి మేఘాలలో తేలిపోయాడు.

ఇంటి కొచ్చి భార్యతో అన్నాడు “ఈ ఉత్తరం ఉంది చూశావా? ఇది పాశుపతాస్త్రం. ఉద్యోగం వచ్చి నీ ఒడిలో వాలవల్సిందే.”

ఆ వేళంతా చాలా హుషారుగా ఉన్నాడు. భార్యకు ఉద్యోగం వచ్చినట్లేనన్న సంతోషంలో ‘ఏమని పాడెదనో ఈ వేళ’ అని పాడుకుంటూ ఊగిపోయాడు.

పదో తేదీ ఉదయం భానును ఆ కంపెనీ ముందు దించాడు.

“ఇంటర్వ్యూ అయ్యాక మా అన్నయ్యగారింటికి వచ్చెయ్. మన వాళ్లు అందరూ అక్కడే ఉంటారు. హాపీ న్యూస్ చెప్పెయ్యవచ్చు. ఆ లెటర్ బ్యాగ్‌లో జాగ్రత్తగా పెట్టుకున్నావు గదా..” అనీ గుర్తు చేశాడు.

భానుమతి తల ఊపి లోపలికి వెళ్లింది.

అది ఒక పెద్ద పేరు మోసిన కంపెనీ. అందులో ఉద్యోగం రావటం అంటే జీవితాన పూలవాన అన్నంత సంతోషమే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లంతా ఫ్రంట్ ఆఫీసులో కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.

భానుమతి కూడా వెళ్లి కూర్చుంది. రెండు నిముషాలు తరువాత ఇంకొక ఆమె వచ్చి పక్కన కూర్చుంది. “ఇంటర్వ్యూకి వచ్చారా?” అంటూ పలకరించింది.

ఆమె వయసు ముప్ఫయికి పైనే ఉండొచ్చు. మిగిలిన వాళ్లతో పోలిస్తే ఆమె వయసు చాలా ఎక్కువేనని చెప్పాలి.

చాలామందిని పిల్చారు. అందులో బాగా చదువుకున్న వాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. తనకు ఆ ఉద్యోగం వచ్చే ఆశ లేదని ఆమె చెప్పుకుంది నిరాశగా.

“మీ పేరు?” అని అడిగింది భానుమతి.

“నా పేరు దమయంతి.. చూడండి. బోలెడు డబ్బు పోసి కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాం. చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం. ప్రతి వాళ్లూ ఎక్స్‌పీరియన్స్ కావాలంటారు. ఇంటర్వ్యూలకు తిరగటం, నిరాశగా తిరుగు మొహం పట్టటం.. విసుగొస్తోంది” అన్నది దమయంతి.

ఒంటిగంట దాకా వీళ్లని పిలవలేదు. లంచ్ బ్రేక్‌లో కిందకి దిగి వచ్చారు. కాంటిన్‍‌లో కాఫీ తాగుతున్నప్పుడు భానుమతి అడిగింది.

“మీరు కొంచెం లేటుగా మొదలు పెట్టారా చదవటం?”

“చాలా లేటుగా మొదలు పెట్టాల్సి వచ్చింది.  నా భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆయన ఉన్నంత కాలం నాకు ఉద్యోగం చేయవల్సిన అవసరం లేకపోయింది. ఆయన పోయాకే..” అంటూ పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని పెదవి బిగువున బిగబట్టుకుంది. కర్చీఫ్‌తో కన్నీరు తుడుచుకుంది.

“అయామ్ సారీ” అన్నది భానుమతి.

“ఫర్వాలేదులెండి.. అకస్మాత్తుగా ఆయన పోవటంతో జీవితం అంతా అంధకార బంధురం అయిపోయింది. ఏదో ఒకటి చేయాలి. పిల్లల్ని పైకి తీసుకరావాల్సిన బాధ్యత నా మీద ఉంది.. తప్పదు గనుక అప్పులు చేసి ఈ కోర్సులు నేర్చుకున్నాను. ఉద్యోగం వచ్చే సూచనలు లేవు. అప్పు మిగిలింది.. వడ్డీలు కట్టటమే కష్టంగా ఉంది. అప్పు చేసి పెద్ద తప్పు చేశానేమోనని అనిపిస్తోంది..” అంటూ ఆగిపోయింది.

ఇద్దరూ మళ్లీ పైకి వెళ్లారు. గాజు తలుపులు, గాజు గోడలలో నుంచి భానుమతి బయటకు చూస్తోంది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు, స్త్రీలు పురుషులు పిల్లలూ.. కనిపిస్తున్నారు.

బ్యాగ్ లోంచి పగిలిపోయిన అద్దం ముక్కలో తన మొహం చూసుకుంది. అద్దానికి స్వార్థమనే కళాయి పూస్తే, ఆ అద్దంలో మనం మాత్రమే కనిపిస్తాం. ఆ కళాయి పూయకపోతే బయట తిరుగుతున్న వాళ్లంతా కనిపిస్తుంటారు.

భానుమతి బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి రికమండేషన్ లెటర్ తీసి దమయంతికి ఇచ్చింది.

“మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు గదా.. లోపల ముఖర్జీ అని ఒకాయన ఉంటారు. బయటకు వచ్చేటప్పుడు ఆయనకు ఈ కవర్ ఇచ్చెయ్యండి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది” అని భాను రహస్యంగా దమయంతికి చెప్పింది. దమయంతి ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది. ఆ చూపులో అంతులేని కృతజ్ఞత ఉంది.

భానుమతి ఇంటికి వచ్చింది.

రఘుపతి చాలా హుషారుగా ఉన్నాడు. ఉద్యోగం వచ్చేస్తుందని అందరికీ చెప్పేశాడు.

ఆడవాళ్లందరి భోజనాలు అయినయి. భాను కూడా భోం చేసింది.

మరదలు వచ్చి భానుతో చెప్పింది – ఆమె పర్సులో నుంచి యాభై రూపాయలు తీసుకున్నట్లు.

“వదినా, నీ పర్సులో పగిలిపోయిన అద్దం ముక్క ఎందుకు? చెయ్యి గీసుకు పోదూ?” అని అడిగింది.

“అదా.. ఆ అద్దంతో చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని. ఎండలో నుంచుని సూర్యుడి కిరణాలు అద్దం మీద పడి, అవి చీకటిగా ఉన్న గదిలోకి రిఫ్లెక్ట్ అవుతుంటే చూసి ఆనందించేదాన్ని. అప్పట్లో అదో ఆట. చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగు చూపించాలన్న సత్యాన్ని నాకు ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది అద్దం.. మీ అన్నయ్య సెంటిమెంటల్ ఫూల్ అంటాడు గానీ, సెంటిమెంట్స్ లేకపోతే, మనిషికీ, పశువుకీ తేడా ఏముంది?” అన్నది భాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here