చిరుజల్లు-84

0
10

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

నమ్మకం

[dropcap]దీ[/dropcap]ప్తి చాలా బిజీగా ఉంది.

ఆమె అక్క గీతకు పెళ్లిచూపులు. గీతను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. అందుచేత దీప్తి ఇంటిని అందంగా నీటుగా సర్దుతోంది. ఫాన్లు దగ్గరి నుంచీ, కిటికీల దగ్గర నుంచీ, అన్ని గదుల్లోనూ దుమ్ము దులిపించి, కర్టెన్లు మార్చి, అల్మారాలో పుస్తకాలు, పేపర్లు సర్ది, హాల్లో డెకరేటివ్ పీసెస్, ఫ్లవర్స్ అమర్చి ఎక్కడ ఏది ఉంటే అందంగా ఉంటుందో చూసుకుంటూ ఒక్కతే పది మంది పని చేస్తోంది.

ఇంతలో అవినాష్ ఫోన్ చేశాడు.

“ఏం చేస్తున్నావురా?” అని అడిగాడు అవినాష్.

“పని మీద ఉన్నానురా..” అన్నది దీప్తి.

“ఏమిటిది? కాబోయే మొగుడ్ని.. కొంచెం కూడా గౌరవం లేకుండా ‘రా’ అంటావా?”

“నువ్వు అన్నావు కదా..”

“నేను ప్రేమ కొద్దీ ముద్దుగా అలా అన్నాను.”

“నేను అంతే..”

“నువ్వు అర్జంటుగా వచ్చి నన్ను కల్సుకోవాలి” అన్నాడు అవినాష్.

“భలే వాళ్లే. ఇంకో గంటలో పెళ్లి చూపులకు వస్తున్నారు..”

“ఎవరికి? నీకే?”

“కాదు. మా అక్కయ్యకు”

“అర్జంటుగా వచ్చెయ్. నీతో ముఖ్యమైన పని ఉంది” అన్నాడు అవినాష్.

“నీ అర్చంటు పని ఏమిటో నాకు తెలుసు. నేను రావటానికి వీలుపడదు.”

“అహె, అందుకు కాదు..”

“మరెందుకు?”

“వస్తే గాని చెప్పలేను..”

“చెబితే గాని రాలేను. చెప్పినా కూడా రాలేను. మా అక్కకు కాబోయే మొగుడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి గదా..”

“అక్క మొగుణ్ని నువ్వు చూసుకునేదేమిటి? వస్తావా, రావా?”

“రాను” అని నిక్కచ్చిగా చెప్పేసింది.

అవినాష్ ఫోన్ కట్ చేశాడు.

దీప్తి బెడ్ రూంలోకి వెళ్లి అక్కను ముస్తాబు చెయ్యటంలో మునిగిపోయింది.

మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి చూపులకు వచ్చారు. ఒక గంట సేపు ఉన్నారు. పెట్టినవన్నీ తిన్నారు. చెప్పినవన్నీ విన్నారు. “తరువాత కబురు చేస్తాం” అని చెప్పి వెళ్లిపోయారు.

అబ్బాయి బాగానే ఉన్నాడు. మంచి ఉద్యోగం. మిగిలిన విషయాలూ బాగానే ఉన్నాయి. వీళ్లు ఈ విషయాలే చర్చించుకుంటున్న సమయంలో అవినాష్ ఫోన్ చేశాడు.

“అర్జంటుగా నువ్వు రావాలి. యమ అర్జంటు” అన్నాడు.

సాయంత్రం ఆరు గంటలకు రోజూ కల్సుకునే హోటల్లో కల్సుకున్నారు. మసక చీకట్లో ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు.

“ఏంటి? పెళ్లికొడుకు ఎలా ఉన్నాడు?” అని అడిగాడు అవినాష్.

“నీకంటే బావున్నాడు.”

“ఏం చదివాడు?”

“నీకంటే ఎక్కువే చదివాడు.”

“ఆస్తిపాస్తులు ఏ మాత్రం ఉన్నయి?”

“నీ కంటే ఎక్కువే ఉన్నయి.”

“వ్యవహారం చూస్తే నువ్వే అతన్ని చేసుకునేటట్లున్నావు..”

“అదేం లేదుగానీ, మరేంటి ఫోన్ల మీద ఫోన్లు..”

“ఏం లేదు.. రేపు నేను ఊరికి వెళ్తున్నాను. రావటానికి రెండు, మూడు వారాలు పట్టవచ్చు..”

“అంతే కదా.. అక్కడికేదో రెండు మూడేళ్లు రానట్లు బిల్డప్ ఇచ్చావు.”

“రేపు పొద్దుటే నా ప్రయాణం ఈలోగా ఈ బ్యాగ్ నీకు ఇవ్వాలని పిలిచాను.”

“ఏముంది ఇందులో?”

“నగలు.. దాదాపు కిలో బంగారు నగలు ఇందులో ఉన్నయి. వీటిని నీ దగ్గర భద్రంగా దాచాలి..” అన్నాడు అవినాష్.

“దేనికి?” అని ఆశ్చర్యంగా అడిగింది.

“ఏం లేదు. గోడలకు చెవులు ఉంటాయి. అందుకని రహస్యంగా నీకు చెబుతున్నాను. మా నాన్నగారి సంపాదనతో ఎన్నో నగలూ, ఆస్తులూ సంపాదించిన విషయం చాలా మందికి తెల్సు. ఈ మధ్య వాళ్ల ఆఫీసులో ఒక స్కాం బయటపడింది. అందుచేత ఆఫీసులో పని చేసే కొందరి ఇళ్ల మీద రైడింగ్ జరిగే అవకాశం ఉంది. కనుక ముందుగానే జాగ్రత్త పడతున్నాం. ఒక వేళ రైడింగ్ జరిగితే, వాళ్లకు దొరకుండా ఉండడం కోసం ఈ నగలు నీ దగ్గర దాచమంటున్నాను. జాగ్రత్తగా ఉంచు. నేను ఊరు నుంచి వచ్చాక, అప్పటి పరిస్థితులను బట్టి, వీటిని తీసుకుంటాను..” అన్నాడు అవినాష్.

“నాకు ముందుగానే నగలు పెట్టేసి కట్టేసుకుంటున్నావన్న మాట, నీకంటే మంచివాడు దొరికినా, నిన్ను కాదని వెళ్లకుండా” అని నవ్వింది దీప్తి.

“మనకు ఏడేడు జన్మల నుంచీ పడి ఉంది బ్రహ్మ ముడి.”

అవినాష్ అందించిన బ్యాగ్ తెరిచి చూసింది. “ఏంటి, ఇవన్నీ బంగారమేనా?” అని ఆశ్చర్యంగా అడిగింది.

“కాదు. కాకి బంగారం.. నేను ఎలా కనిపిస్తున్నాను?” అని అడిగాడు.

“మసక వెలుతురులో మసక మసకగా కనిపిస్తున్నావు..”

“నగలు జాగ్రత్త, వచ్చాక తీసుకుంటాను..”

“నాకేంటి లాభం?”

“నీకే అవి.. మన పెళ్లి అప్పుడు నీకు పెట్టాలని..”

“ఓహో.. అయితే సరే..”

దీప్తి ఆ నగల బ్యాగ్ తీసుకొని బయల్దేరింది. ఇంటికి వచ్చేటప్పటికి శుభవార్త తెల్సింది. పెళ్లివారు ఒప్పుకున్నారు. అందరూ ఆనందోత్సాహలలో మునిగిపోయారు.

రెండు రోజుల వ్యవధిలో నిశ్చితార్థం ఏర్పాటు చేసుకున్నారు. పది రోజులలోనే పెళ్లి ముహుర్తం కుదిరింది.

ఇంక ఇంట్లో అంతా బిజీ అయిపోయినారు. వివాహానికి కావల్సిన ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత దీప్తి మీద పడింది.

తల్లికి లో-బి.పి. అయినా ఆమె తెల్లవారు ఝామున నిద్ర లేచి రాత్రి పదకొండు గంటలకు నడుం వాలుస్తోంది. తండ్రికి గుండె జబ్బు. ఎక్కువ శ్రమ పడితే ఆయన శరీరం తట్టుకోలేదు. అయినా ఆయనా రాత్రింబవళ్లూ క్షణం తీరిక లేకుండా తిరుగుతునే ఉన్నాడు.

పెళ్ళిళ్ల సీజన్ కావటంతో, వ్యవధి ఎక్కువ లేక పోవటంతో ప్రతి దానికి ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తోంది. బంధువులు సాయం చేస్తామంటూ వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ల చేసేదేమీ లేకపోగా, వాళ్లకు కాఫీలూ, టిఫెన్లూ అందించడంతో మరింత సమయం వృథా అవుతోంది.

దీప్తి చేయవలసిన పనులన్నీ ఒక కాగితం మీద రాసుకుని, ఆ లిస్ట్ ప్రకారం అన్నీ వచ్చాయా, లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటోంది. ఎన్ని చేసినా ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఇంకా చెయవలసిన పనులు ఏవో కొన్ని మిగిలిపోతూనే ఉన్నయి. చుట్టాలు వచ్చి పడిపోతున్నారు. ఒత్తిడి పెరిగిపోతోంది.

పనుల ధ్యాసలో పడి తిండీ, నిద్రా కూడా మర్చిపోతోంది.

ఎలా అయితేనేం ఆ రోజు రానే వచ్చింది. మొత్తం మీద అనుకున్న దానికన్నా ఘనంగానే గీతకు, చైతన్యకు వివాహం జరిగిపోయింది.

నెమ్మదిగా బంధువులంతా వెళ్లిపోయారు. మూడు నిద్రలూ గడిచాయి.

చైతన్య దీప్తితో అన్నాడు. “మా పెళ్లిలో ఎటు చూసినా నువ్వే కనిపించావు.. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈవెంట్ అంతా వన్ వుమన్ షోలా అనిపించింది. నీకు మేం రుణపడి ఉన్నాం” అని మరదలిని మెచ్చుకున్నాడు.

“రేపు దాని పెళ్లికి మీరు అన్నీ భుజాన వేసుకొని చెయ్యాలి గదా.. అందుకే ఇప్పుడింత శ్రమ పడింది..” అన్నది గీత.

“అయితే మరి, మీ చెల్లెలికి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా?” అని అడిగాడు చైతన్య.

“అది నా అంత అమాయకురాలు కాదు లెండి. దానికి కాబోయే వాడిని అదే చూసుకుంటుంది” అన్నది గీత.

“అవునా, చెప్పవే? ఎవరన్నా లైన్‌లో ఉన్నారా?”

“అబ్బే, ఇంకా ఏదీ నిర్ధారణకు రాలేదు” అన్నది దీప్తి.

అప్పుడు అవినాష్ గుర్తొచ్చాడు. అతను ఊరికి వెళ్లటం వెళ్లే ముందు నగల బ్యాగ్ దాచి పెట్టమని తనకు ఇవ్వటం అన్నీ గుర్తుకు వచ్చాయి.

‘అవును ఆ నగల బ్యాగ్ ఎక్కడ పెట్టింది తను?’ అనుకుంటూ బీరువాలూ, ఐరన్ సేఫ్‌లూ, సూట్ కేసులూ, అటకలూ అన్నీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు.

దీప్తి కంగారు పడింది. టెన్షన్ ఎక్కువ అయింది. ఎక్కడో చాలా భద్రంగా దాచి పెట్టినట్లు జ్ఞాపకం ఉంది గానీ, ఎక్కడ పెట్టిందీ ఎంతకీ గుర్తు రావటం లేదు.

నెల రోజుల నుంచీ ఇల్లంతా సందడి. ఇంటి నిండా జనం.

‘ఎవరి కంట్లో అయినా పడి.. ఎవరైనా కొట్టేశారా? అంతా మనవాళ్లే అయినా. అన్ని నగలు కనిపిస్తే కళ్లు చెదిరిపోవా? మనసు మారిపోదా?’ అని అనుకుంది.

దీప్తి ఒకటే మథనపడిపోతోంది. ఇల్లంతా గాలిస్తోంది. వెదికిన చోటనే మళ్లీ మళ్లీ వెదుకుతోంది. దేనికో ఎవరికీ చెప్పదు.

అవినాష్ వచ్చాడు. ఫోన్ చేశాడు. అతని దగ్గరకు వెళ్లటానికి మొహం చెల్లలేదు. కాని తప్పదు మరి.

“ఏమిటంత నీరసంగా ఉన్నావు? అసలు దీప్తివేనా అని అనిపిస్తోంది” అన్నాడు అవినాష్.

“నేను దీప్తినే. కానీ ఇది వరకటి దీప్తిని కాను” అన్నది విచారంగా.

“ఏమైంది?”

“నువ్వు ఇచ్చిన నగల బ్యాగ్ ఎక్కడో భద్రంగా దాచి పెట్టాను.. కానీ ఎక్కడ పెట్టిందీ గుర్తు రావటం లేదు. ఈ పెళ్లి గోడవలో పడి మర్చిపోయాను. ఎంత వెతికినా దొరకలేదు..” అన్నది దీప్తి.

“ఏంటి నన్ను పరీక్షిస్తున్నావా?” అని నవ్వాడు అవినాష్.

“నేను నిజమే చెబుతున్నాను” అన్నది దీప్తి.

“తులం, రెండు తులాలు కాదు దీప్తి. కిలో బంగారం. నీ మీద ఎంతో నమ్మకంతో ఇచ్చాను..”

“కాదనటం లేదు. కాని జరిగింది ఇదీ..”

“అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు దీప్తీ. మీ అక్క పెళ్లికి అవి వాడుకొని ఉంటారు. కనబడటం లేదని నాకు కట్టుకథ చెబుతున్నావు. నేను నిజమేనని నమ్మేస్తానని అనుకుంటున్నావు. నా నగలతో అటు నీ అక్క పెళ్లి చేశారు. నిన్ను ప్రేమించిన నేరానికి నిన్ను ఎలాగూ చేసుకుంటాను. ఒక్క దెబ్బతో ఇద్దరి సమస్యలూ తీరిపోతాయి అని ప్లాన్ చేశారు గదూ.. ”

“అవినాష్, నోటికొచ్చినట్లు మాట్లాడకు” అన్నది దీప్తి రోషంతో.

“మరి నగలు తెచ్చి ఇవ్వు. ఈ నాటకం ఆడకుండా ఉంటే ఆ నగలు నీకే దక్కేవి.”

“అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. నీ నగలు లేకపోవచ్చు. కానీ అవి ఎంత అవుతాయో, లెక్క చూసి డబ్బు తెచ్చి నీ మొహాన కొడతాను” అన్నది దీప్తి పరుషంగా.

ఇంటికి వచ్చి బెడ్ రూంలో పడుకుని ఏడుస్తూంటే, గీత దగ్గర కూర్చుని విషయం తెల్సుకుంది.

గీత భర్తను సంప్రదించింది.

“చూడు దీప్తీ, అతను నీకు నగలు ఇచ్చినట్లు సాక్ష్యం లేదు. నువ్వు రసీదు రాసివ్వలేదు. అసలు ఆ బ్యాగ్ నువ్వు నాకు ఇవ్వలేదు – అని గట్టిగా దబాయిస్తే, తిట్టుకోవటం తప్ప అతను చేయగలింగిందేమీ లేదు. కానీ అతను నీకే ఎందుకు ఇచ్చాడు? నిన్ను ప్రేమించినందువల్ల నీకు ఇచ్చాడు. ప్రేమించిన మనిషిని నమ్మాలి. ఆ నమ్మకంతోనే కదా, రేపు నువ్వు అతడిని పెళ్లి చేసుకొని, జీవితాంతం అతనితో కల్సి ఉండటానికి సిద్ధపడుతున్నావు. కానీ ఇప్పుడా నమ్మకం చెదిరిపోయింది. ఆయినదేదో పోయింది. నువ్వు గీతకు చెల్లెలివి. అయితే నాకు పరాయిదానివి ఏమీ కావు. అతనికి ఇవ్వవల్సిన డబ్బు ఎంతో లెక్క చూసి చెప్పమను. వారం రోజుల్లో నేను ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను.. ఈ విషయం మన ముగ్గరికీ తప్ప ఇంకెవరికీ తెలియనివ్వకండి..” అన్నాడు చైతన్య.

“బావగారూ, మీలో దేవుడిని చూస్తున్నాను” అన్నది దీప్తి.

“అదేం లేదు. అప్పుడే నన్ను దేవుళ్లల్లో కలిపెయ్యకు” అన్నాడు చైతన్య.

మర్నాడు పండగ. పనిమనిషి చేత ఇల్లు కడిగిస్తోంది గీత.

బీరువాల వెనుక బూజు పట్టి ఉంటే వాటిని జరిపి శుభ్రం చేయిస్తోంది. ఆ బీరువాకు గోడకు మధ్యనున్న ఖాళీలో ఏదో బ్యాగ్ కనిపించింది. దాని జిప్ తెరిచి చూసింది. కళ్లు చెదిరిపోయే నగలు ఆ బ్యాగ్ నిండా వున్నాయి.

దీప్తిని పిలిచి చూపించింది. ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయింది.

ఆ సాయంత్రమే దీప్తి అవినాష్‌ను కల్సుకుంది. అతని నగలు ఇచ్చేసింది.

“అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. అసలు అవి బంగారం నగలో కాదో టెస్ట్ చేయించుకో. కాదంటే చెప్పు ఎంత డబ్బు అయినా సరే తెచ్చి ఇస్తాను.. ఎందుకంటే నీ నగలు అమ్మి, నా అక్క పెళ్లి చేశామని కదా నీ అభిప్రాయం..” అన్నది దీప్తి.

“ఏంటి దీప్తీ, ఏదో సరదాకి అన్నానుగానీ, నీ సంగతి నాకు తెలియదా? నీ మీద నమ్మకం ఉండబట్టే గదా, దాచమని నీకు ఇచ్చాను. ఇవి నీ నగలేనని ముందే చెప్పాను గదా.. ” అన్నాడు అవినాష్ చనువుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి.

“ముందు చెయ్యి తీయ్.. నేను నీ మనిషిని అయినప్పుడు గదా, నీ నగలు నావి అవుతాయి. ఈ క్షణం నుంచీ నువ్వు ఎవరో, నేనెవరో.. బై” అన్నది దీప్తి.

“అంత కోపం అయితే ఎలా?” అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు.

“టచ్ మీ నాట్” అన్నది దీప్తి, లేచి అక్కడి నుంచి వెళ్లిపోతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here