చిరుజల్లు-93

0
9

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

దుర్గమ్మ తల్లి

[dropcap]దు[/dropcap]ర్గ సినిమా టికెట్టు కోసం క్యూలో నిలబడింది. సినిమా ఆ వేళనే రిలీజు. జనం కిటికిటలాడుతున్నారు. టిక్కెట్ల కోసం తొక్కిసలాట. టికెట్టు దొరుకుతుందో లేదోనని దుర్గకు చాలా టెన్షన్‌గా ఉంది. బుకింగ్ కౌంటర్ దాకా వెళ్లగలిగింది. ఆమె ముందున్న వాళ్ల వరకు టిక్కెట్లు ఇచ్చి, ఆమె దగ్గరకు వచ్చేసరికి బుకింగ్ కౌంటర్ క్లోజ్ చేశారు.

దుర్గకు కళ్ల నీళ్లు ఒక్కటే తక్కువ. ఏడుపు మొహంతో వెనుతిరిగింది. తనను తాను తిట్టుకుంది. ప్రతీదీ ఇంతే. చేతికి అందినట్లే అంది చెయ్యి జారిపోతుంటుంది. ‘ఛీ, వెధవ బతుకు’ అని తిట్టుకుంటూ ఇల్లు చేరింది.

హాల్లో తల్లీ తండ్రీ కూర్చుని ఉన్నారు. వాళ్ల మొహాల్లో ప్రపంచంలోని విషాదం అంతా పోగు పోసినట్లుంది.

“ఎక్కడికి వెళ్లావే” అని అడిగింది తల్లి.

“పావని వాళ్ల ఇంటికి వెళ్లానమ్మా” అని అలవాటైన అబద్ధం చెప్పి లోపలికి వెళ్లింది.

“కిందటి వారం పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు నువ్వు నచ్చావుట” అని చెప్పింది తల్లి.

దుర్గ ఆశగా తల్లి వంక చూసింది. ఆమె తలుపుకి చేరబడి కూర్చుని మిగతా కబురు చెప్పింది.

“కానీ, కట్నమే ఎక్కువ అడుగుతున్నారు. నలభై  లక్షలు అయినా ఇవ్వకపోతే, మాట్లాడాల్సిన పని లేదన్నారు” అన్నది తల్లి.

“మీ నాన్న సంపాదనలో పట్టుమని పట్టుమని పదివేలు కూడబెట్టింది లేదు. అప్పు పుట్టే ఆశ లేదు. నీ తరువాత ఇంకో ఆడపిల్ల ఉంది. చదువు చెప్పించాల్సిన మగపిల్లాడు ఉన్నాడు.” అంటూ ఆమె తన మనసులోని ఆవేదనను వెళ్లబోసుకుంది.

దుర్గ వినడం లేదు. ఆమె మనసంతా పోటెత్తిన సముద్రంలా ఉంది.

‘నలభై లక్షలు ఇస్తే పెళ్లి అవుతుంది. అంటే పర్మినెంటుగా వంటమనిషి ప్లస్ పనిమనిషి పోస్ట్ దొరుకుతుంది. ఏమటీ అన్యాయం? ఏమిటి దోపిడీ?’ దుర్గ మనసులో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో పడగ విప్పి ఆడుతున్నయి.

వాళ్లది మధ్య తరగతిలో కింద తరగతి కుటుంబం. దారిద్ర్యపు రేఖకు దిగువన లేరు. ఎగువ లేరు “దారిద్యపు రేఖ సరిగ్గా నా నుదుటి  మీద నుంచి వెళ్తోంది” అని అంటుంది దుర్గ.

ఆస్తిపాస్తులలోనే కాదు, అందచందాలలోనూ దుర్గది లోయర్ మిడిల్ క్లాసే. చామన చాయగా ఉంటుంది. ఆ వయసు పిల్లల మధ్య నిలబడితే, కొంచెం పెద్దదానిలాగా, కొంచెం లావుగా కనిపిస్తుంది.

డబ్బు లేకపోయినా, పెద్దగా అందచందాలు లేకపోయినా, దుర్గకు మనసు ఉంది. ఆ మనసునిండా ఎన్నో కోరికలున్నయి. అందరిలాగా మంచి మంచి చీరలు కట్టుకోవాలి. పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లాలి. ఖరీదైన షాపుల్లో షాపింగ్ చెయ్యాలి. కార్లల్లో తిరగాలి. సరదాగా షికార్లు చేయాలి. సినిమాలు చూడాలి. ఒకటేమిటి ఎన్నో ఆశలు..

ఇవన్నీ కావాలి అని అడిగితే, పావని నవ్వుతూ అంటుంది “ఈ కోరికలన్నీ తీరాలంటే, మనకి ఒక చీరల షాపువాడు, ఒక హోటలు ప్రొప్రయిటరూ, ఒక కార్ల డీలరూ, ఒక సినిమా హాలు యజమాని, కనీసం నలుగురు, అయిదుగురు మొగుళ్లు అయినా ఉండాలి..” అని.

ఆ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ దుర్గ తల్లి తండ్రీ చాలా సీరియస్‍గా ఆలోచించారు. ఎన్ని సంబంధాలు చూసినా, పిల్ల నచ్చలేదని వెళ్లిపోతున్నారు. ఇంక దీన్ని ఎవడూ చేసుకోడు అని అనుకుంటున్న తరుణంలో వాళ్లు దుర్గను చేసుకుంటామని అంటున్నారు. పిల్ల అందంగా లేదు కాబట్టి, కట్నం ఎక్కువ అడగటం సహజమే కదా. ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది. అందుకని ఇల్లు అమ్మి అయినా సరే, పిల్ల పెళ్లి జరిపించాలన్న అభిప్రాయానికి వచ్చారు.

అదే సమయానికి దుర్గ డాబామీద కూర్చుని త్రీవంగా ఆలోచిస్తోంది. తను అందంగా లేదు కాబట్టి డబ్బు ఎక్కువ ఇస్తే చేసుకుంటాడు. అంటే ఏమిటి? తన మీద ప్రేమ లేదు. డబ్బు మీదనే ప్రేమ. అసలీ పెళ్లి పేరుతో లక్షల రూపాయలు ఎందుకు ధారపోయాలో దుర్గకు అర్థం కాలేదు.

అబ్బాయి ఆస్తి, చదువు, ఉద్యోగం బట్టి కట్నం రేటు పెరుగుతుంది. అమ్మాయి అందంగా ఉంటాలి. చదువుకొని ఉండాలి. ఉద్యోగం చేసి సంపాదించాలి. ఇన్ని లక్షణాలు ఉండీ, ఇంత డబ్బు పోసి అతన్ని కొనుక్కుంటే, ఆ అమ్మాయి  చెప్పనట్లు అతను విని తీరాలి కదా. అదేం లేదు, వాడికి చాకిరీ చేసి పెట్టాలి. తిట్టినా, కొట్టినా నోరు మూసుకుని పడి ఉండాలి. వాడికే కాదు వాడి తరపు వాళ్లందర్నీ గౌరవించాలి.

పెళ్లి పేరుతో ఈ అమ్మకాలు, కొనుగోళ్లు ఏమి ఆమెకు నచ్చలేదు.

మర్నాడు తండ్రి చెప్పాడు ఈ సంబంధం ఖాయం చేయబోతున్నట్లు.

“వద్దు నాన్నా, నేను పెళ్లి చేసుకోను” అని చెప్పింది.

“అదేమిటమ్మా, పెళ్లి చేసుకోకుండా ఎన్నేళ్లుంటావు?”

“ఎన్నేళ్లు అయినా ఉంటాను. నా మీద ప్రేమతో కాకుండా, నాతో వచ్చే డబ్బుతో పెళ్లి చేసుకుంటాడు. ఆ డబ్బు ఖర్చు అయిపోయాక, నా పరిస్థితి ఏమిటి? కనుక కట్నంగా ఇవ్వదలచిన డబ్బు ఏదో నాకు ఇవ్వండి. దానితో ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాను” అని చెప్పింది దుర్గ.

తండ్రి దగ్గర డబ్బు తీసుకుని, ఒక జిరాక్స్ మిషన్ కొన్నది. బాగా రద్దీగా ఉండే చోట, చిన్న గది అద్దెకు తీసుకుంది. మంచి రోజు చూసి జిరాక్స్ బిజినెస్ ప్రారంభించింది. మొదట్లో పెద్దగా లాభాలు కనిపించలేదు. అయిదారు నెలలు గడిచేటప్పటికి, చేతినిండా పని ఉన్నట్లు అనిపించింది. స్టూడెంట్స్ బజార్లో దొరకని పుస్తకాలు, తెచ్చి జిరాక్స్ తీయించుకోవటం నిత్యకృత్యం అయింది.

ఏడాది తిరిగేటప్పటికి డిమాండ్‌ను తట్టుకోవటం కష్టం అయింది. మరో మిషన్ కొన్నది. ఒక కుర్రాడిని తనకు సహాయంగా పనిలో పెట్టుకుంది. ఆదాయం రెట్టింపు అయింది. ఉదయం ఎనిమిది గంటల నుంచీ, రాత్రి పది గంటల దాకా రెండు మిషన్లూ తీరిక లేకుండా పని చేస్తున్నయి.

నెమ్మదిగా కంప్యూటర్ కోర్స్‌లు ట్రెయినింగ్ ఇవ్వటానికి తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఆమె దగ్గర పని చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు దుర్గ ఒక చిన్నపాటి బిజినెస్ మాగ్నెట్ అయిపోయింది.

దసరా పండగ వచ్చింది. దసరా మామూళ్ల కోసం ఆ ఏరియాలోని గూండా మనుషులను పంపించాడు. ఆమె పైసా కూడా ఇవ్వను అని చెప్పింది.

వాడి బెదిరింపులు ఎక్కువ అయినాయి. ఈ విషయాలన్నీ వివరిస్తూ దుర్గ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. డి.జి.పికి, మినిస్టర్‌కి కూడా ఫిర్యాదు చేయటంతో ఆమెకు రక్షణ కల్పించారు. దుర్గ చేసిన పనితో మిగిలిన షాపు వాళ్లకూ బోలెడంత ధైర్యం వచ్చింది. వాళ్లందరికీ దుర్గ మీద గౌరవం పెరిగిపోయింది.

ఇప్పుడు దుర్గ తన వ్యాపారాన్ని ఇతర రంగాలకూ విస్తరింప చేసింది. పెద్ద బట్టల షాపూ తెరిచింది.

అన్ని విధాలా ఆమె పరిస్థితి, పలుకుబడీ పెరిగింది. చెల్లెలి పెళ్లి చేసింది. తమ్ముడిని విదేశాలలో చదివిస్తోంది.

ఆ ఏరియాలో వర్తకుల సంఘానికి అధ్యక్షురాలు అయింది. ఆ సంఘం తరపున రాజకీయ నాయకులనూ, మంత్రులనూ కల్సుకుంటోంది.

ఒక మెడికల్ షాపు యజమాని హఠాత్తుగా చనిపోయాడు. అతని భార్య పెద్దగా చదువుకున్న మనిషి కాదు. ఆ షాపు యజమాన్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ షాపులో ఆమె కింద అరడజను మంది పని చేస్తున్నారు.

ఆ షాపులో పని చేసే మధుసూదనం కూతురికి చదువు మీద శ్రద్ధ లేదు.

“దానికి సినిమాలు, టీ.వీలు చూడటం, తప్ప, అబ్బాయిలతో స్నేహాలు చేయటం తప్ప, చదువు మీద శ్రధ్ధ లేదు. ఇది ఏమై పోతుందో నని భయంగా ఉంది..” అని మధుసూదనం దుర్గతో చెప్పాడు.

దుర్గ అమ్మాయిని పిలిపించింది.

“నీకు చదువు మీద శ్రద్ధ లేకపోతే, వదిలెయ్.. నీకు ఇష్టమైన పని ఏదో నిర్ణయించుకో. దానిలో ప్రావీణ్యం సంపాదించు. ప్రేమ, పెళ్లి అవసరమే. ముందు నీకో వ్యక్తిత్వం ఏర్పుచుకో” అని చెప్పింది.

అంతటితో వదలకుండా రోజూ దగ్గర కూర్చోబెట్టుకొని బోధించటం మొదలు పెట్టింది.

“మనదేశంలో ఉన్న జనాభాలో సగం మంది ఆడవాళ్లు ఉన్నారు. దేశ భవిష్యత్తు యువతరం మీద ఆధారపడి ఉంది. యువత పగటి కలలు కనటం మానేసి పని చేయటం ప్రారంభిస్తే, మన సాధించలేనిది లేదు” అన్నది దుర్గ.

మధుసూదనం దుర్గమ్మ తల్లికి నమస్కరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here