చిత్ర రహస్యం

0
12

[dropcap]”క[/dropcap][dropcap][/dropcap]ళ అనేది మనిషిని ప్రతిభావంతుడిగా నిరూపిస్తుంది. అదే కళ ఒక్కొక్కసారి జీవితం గడవటానికి దారి చూపిస్తుంది. కళ ఒక్కొక్కసారి మనిషిని చిక్కులలో నుండి కాపాడుతుంది. అటువంటి కథే మీకు చెబుతాను” అని చెప్పారు విద్యాపతి గారు.

“చెప్పండి… చెప్పండి” అని ఎంతో ఆసక్తిని కనబరిచారు చుట్టూ చేరిన చిన్నారులు.

కథ చెప్పసాగారు విద్యాపతి గారు.

***

గంగాధరపురం రాజు విక్రమవర్మ గారికి ఆదిత్యుడనే కుమారుడు ఉన్నాడు. వాడు చదువు మీదా, కళలు మీద ఆసక్తి చూపలేదు. ఒక సోమరిగా కాలం గడుపుతున్నాడు. రాజు, రాణి వాడికి అనేక విధాలుగా విద్యను గురించి, కళలను గురించి చెప్పారు. అయినా వారి మంచి మాటలు వాడి తలకెక్కలేదు.

ఈ విషయం గురించి రాజగురువు సోమనాధుడిని సంప్రదించారు.

రాజగురువు సోమనాథుడు “రాజా! విద్య మీద ఆసక్తి లేక పోయినా, కళల పట్ల ఆసక్తి కలిగిస్తే మెదడు చురుకుదనం పొంది, ఇతర విద్యల మీద ఆసక్తి కలగవచ్చు. కళ వలన మనిషిలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. యువరాజా గారి విషయంలో నా ప్రయత్నం నేను చేస్తాను” అని చెప్పారు.

“ప్రయత్నించడంలో తప్పు లేదు, తమరి ప్రయత్నం తమరు చేయండి” అన్నారు రాజు గారు.

ఆ రెండో రోజే సోమనాథుడు యువరాజు ఆదిత్యుడిని పాపయ్య అనే ప్రసిద్ధ చిత్రకారుని వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పాపయ్య ఒక అద్భుత చిత్రం చిత్రిస్తున్నారు. ఆయన వేస్తున్న చిత్రం, రంగుల కలయిక ఆదిత్యుణ్ణి ఎంతో ఆకర్షించాయి.

రెండోరోజు కూడా ఆదిత్యుడు పాపయ్య వద్దకు వెళ్లి ఆయన చిత్ర కళను పరిశీలించసాగాడు. క్రమేపి ఆదిత్యుడికి కూడా చిత్ర కళ మీద ఆసక్తి పెరిగింది. తనకు చిత్రకళను నేర్పించమని పాపయ్యను అడిగాడు. మరి రాజు గారి కుమారుడు. చిత్ర కళ మీద ఆసక్తి పెంచుకున్నాడు. కనుక ఆదిత్యుణ్ణి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు పాపయ్య. ఈ విషయం తెలిసిన రాజగురువు తన ఆలోచన నిజమైనందుకు సంతోషించారు. రాజు గారు కూడా తన కుమారుడు ప్రయోజకుడు అవుతున్నందుకు ఎంతో సంతోషించాడు.

ఆ విధంగా ఆదిత్యుడు పురాణాల ఆధారంగా, చరిత్రల ఆధారంగా మంచి చిత్రాలు చిత్రీకరించసాగాడు. కొన్ని చిత్రాల్లో అంతర్లీనంగా ఆ చిత్రాలకు సంబంధించిన అక్షరాలు కూడా వ్రాసే నేర్పు సంపాదించాడు! ఆ విషయం పాపయ్య రాజగురువు, రాజు గారికి చెప్పి చూపించాడు. ఇతరులు ఆ రాతలు కనిపెట్టలేక పోయేవారు!

ఇలా ఉండగా ఒక రోజు ఆదిత్యుడు అతని ఇద్దరు స్నేహితులతో విహారానికి, వేటకు అడవికి వెళ్లాడు. వాళ్ళు అలా అడవిలో చాలా దూరం వెళ్లారు.

రెండు కుందేళ్ళను పట్టుకొని అంతఃపురానికి వెళ్లాలని వెను తిరిగి కొంచెం దూరం నడిచే సరికి నలుగురు దొంగలు వీరిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్లారు. యువరాజు వంటి మీద ఉన్న హారం, ఉంగరాలు అతని స్నేహితుల ఉంగరాలు తీసుకున్నారు. వారు చాలా డబ్బు గలవారని దొంగలు గ్రహించారు. వీరిని బంధించి వీళ్ల పెద్దలను పెద్ద మొత్తంలో బంగారం అడగాలని, ఆ విధంగా వారు బంగారం ఇస్తేనే వారిని వదలి పెడతామని భయపెట్టాలని నిశ్చయించినారు. ఆదిత్యుడు అతని స్నేహితులు వారి దుష్ట పన్నాగం పసిగట్టారు.

ఏమైనా తెలివి ఉపయోగించి వారి చెర నుండి బయట పడాలని నిర్ణయించుకున్నాడు ఆదిత్యుడు. దొంగల నాయకుడు వారి చిరునామా అడిగాడు.

“అయ్యా మీరెన్ని చెప్పినా మా పెద్దలు వినరు, ఎందుకంటే మేము వేరే రాజ్యానికి వెళుతున్నామని చెప్పాము” అన్నాడు ఆదిత్యుడు.

“మరి ఏ విధంగా మీ వాళ్ళని భయపెట్టి బంగారం అడగాలి? మీరే చెప్పండి. లేక పోతే మిమ్మల్ని వదలం”అని కర్కశంగా అడిగాడు దొంగల పెద్ద.

“దానికి ఒక మార్గం ఉంది. నాకు బొమ్మలు వేయడం వచ్చు, నేను వేసే బొమ్మలు నా బొమ్మల శైలి మావాళ్లకు తెలుసు. నేను బొమ్మ వేసి మీకు ఇస్తాను. దానిని మీరు ఏదో విధంగా దానిని మా నాన్నగారికి చేరిస్తే, దానిని చూసి భయపడి మీకు బంగారం ఇస్తారు. అప్పుడు మమ్మల్ని వదలి వేయండి, ఆ చిత్రాన్ని మా నాన్న సోమనాధుడు (రాజగురువు) కి చేర్చితే మీకు మేలు జరుగుతుంది”అని తెలివిగా చెప్పాడు. తన తండ్రి పేరు ఎందుకు చెప్పలేదంటే, తమ అంతఃపురం, సైనికులను వారు గమనించి  వెను తిరిగవచ్చు, అదే రాజగురువు ఇల్లు చిన్నది, కేవలం గ్రంథాలలో ఉన్న విజ్ఞాన భాండాగారం ఆ ఇల్లు. అందుకని దొంగలు వేరే విధంగా ఆలోచిస్తారు.

దొంగలు తమ వద్ద ఉన్న ఒక జంతువు తోలును ఆదిత్యుడికి ఇచ్చి చిత్రం చిత్రీకరించమన్నారు. ఆదిత్యుడు అందుబాటులో ఉన్న ఆకులు, పువ్వులు, గడ్డి రసాలతో ఒక వింత ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించి ఇచ్చాడు. అందులోనే రహస్యంగా తమ ఉనికిని గురించి దొంగలను గురించి రాజగురువుకు అర్థం అయ్యేలా వ్రాశాడు.

ఆ దొంగల్లో ఒకడు మర్యాదస్తుడి వేషం వేసుకుని రాజగురువు ఇంటికి వెళ్లి ఆదిత్యుడు చిత్రించిన చిత్రం ఇచ్చి, “అయ్యా తమరికి ఒకరు ఈ చిత్రం ఇచ్చి వంద తులాల బంగారు ఇవ్వాలని, బంగారం ఇవ్వకపోతే చిత్రం చిత్రీకరించినవాడు వాడి ఇద్దరు మిత్రులు ప్రమాదంలో పడతారట, రేపు ఊరి చివర ఉన్న హనుమంతుడు గుడి కుడి పక్కన ఉన్న పొదలో బంగారం సంచి ఉంచాలి, నాకు ఈ చిత్రం ఇచ్చి వారు వెళ్లి పోయారు. ఇక మిగతా విషయాలు మీరే చూసుకోవాలి” అని చెప్పి వెళ్లిపోయాడు.

రాజగురువు ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించారు. అయన మొహం చిరునవ్వు మెరిసింది. చిత్రం లోని రాతని ఆయన గ్రహించిన గలిగాడు.

“సరే బంగారం సంగతి నేను చూసుకుంటా. మా పిల్లల కంటే ఏదీ ఎక్కువ కాదు” అని చెప్పాడు. మారు వేషంలో ఉన్న దొంగ వెళ్లి పోయాడు.

వెంటనే రాజగురువు రాజు గారిని కలసి ఆదిత్యుడు, అతడి ఇద్దరు స్నేహితులు వారు ఎక్కడ ఉన్నది అన్నీ ఆ చిత్రాన్ని చూపించి వివరించాడు.

వెంటనే రాజు గారు మెరికల్లాటి పది మంది సైనికులను చిత్రంలో వివరించిన విధంగా దారిని తెలిపి ఆదిత్యుడిన బంధింబంధిన చోటును వివరించి వారితో పాటు అడవికి బయలుదేరాడు.

చిత్ర సహాయంతో అతి సులభంగా ఆదిత్యుడు అతని మిత్రుల బంధించిన స్థావరం కనుక్కొని దొంగలను సులభంగా బంధించారు. దొంగలకి తగిన శిక్ష వేసి వారిలో మార్పు తీసుకు రావడానికి రాజగురువు తగిన ప్రణాళిక రూపొందించారు.

***

“చూశారా చిన్నారులూ – ఆదిత్యుడికి కళ అతనిని, స్నేహితులను దొంగలనుండి ఎలా రక్షించిందో. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక కళ నేర్చుకోవాలి తద్వారా బుద్ధి వికసిస్తుంది. చిత్ర లేఖనం, శిల్ప కళా, రచనలు చేయడం, వక్తగా మాట్లాడటం కూడా! మరి మీరు మంచి కళని మీ అభిరుచిని బట్టి నేర్చుకుంటారు కదూ” అని అడిగారు విద్యాపతి గారు.

“తప్పకుండా నేర్చుకుంటాం గురువు గారు” అని ముక్తకంఠంతో పలికారు ఆ చిన్నారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here