చిట్టితల్లి శతకం-1

5
13

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]


1.
పామరుండు వెలుగు పండితుల నడుమ
విరుల తావి యబ్బు గరికవలెనె
విజ్ఞు డెవడొ తెలియు విజ్ఞత పరికింప
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
2.
తాను చెప్పు కొనునె? తన గొప్ప వృక్షమ్ము
చేసిచూపు, బోధ చేరబోదొరులకు
సహనమున్న చోట సఫలత తథ్యమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
3.
తత్వ మఱుక పడునె తనకు తాను చదువ
విదుడు విశద పఱుచ విదిత మౌను
మనసు నిలిపినంత మర్మ మంతదెలియు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
4.
గురువు లెన్నడు తమ గొప్ప చెప్పుకొనరు
యెఱుక గన్న శిష్యు లెఱుక పఱచు
దివ్వె దాచ వచ్చు దీప్తి నాప తరమ?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
5.
త్యాగ మెంత తనది తల్లి తెలుపకున్న
దేహజన్ము లరసి తెలియచేయు
నరయగలవు నీవు నమ్మవై నప్పుడె
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
6
కరుణ రసము చిందు కడకంటి చూపుల
నరయ గానె తొలగు నలమటంత
యట్టి గురువు మాట హద్దు మీరకెపుడు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
7.
శక్తి యున్న గాని యుక్తితో మెలగుచు
శాంతి పథము నెంచి సాగు వారె
వెలుగు నందజేతు రిలలోన మెండుగా!
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
8.
చిన్న నాటి చెలిమి సిరులు జూడదెపుడు
నెదుగు చున్న కొలది మదిని చేరు
నెలమి దూరమౌను కలిమి లేములుజూడ
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
9.
గడన చేసి తనదు కార్యమ్ము జేయించి
యదనుచూచి వెనక హానిపఱచు
దుష్టబుద్ధి నెపుడు దూరముంచుటె మేలు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
10.
బండలడ్డు పడిన ప్రవహించు నదివోలె
చిక్కు లెన్ని యున్న చెదర వలదు
అడుగు వేసినంత నడుగంటు వెతలన్ని
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here