చిట్టితల్లి శతకం-2

1
16

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]

11.
నమ్మ వలదు సుమ్మ నెమ్మిచూపినగాని
మాయగాండ్రు గలరు మరువబోకు
మభ్యపెట్ట గలరు మంచి మాటలజెప్పి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
12.
ఎన్ను కున్న దారులెంత కఠినమైన
పట్టుకొనిన నుడుము పట్టురీతి
చేరగలవు తుదకు కోరుకొన్నదరికి
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
13.
మంచి చెప్పు వారి పంచన చేరిన
నాప సాధ్యమౌన యమతి పనులు
కాలనాగు కాటు నేల మానగలదు
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
14.
ఎదుటివారి నతిగ నెగతాళి చేయుచు
బాధ పెట్టుటసలు పాడికాదు
మనిషి కదియె ముప్పు మరచిపో వలదమ్మ
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
15.
కలిమియున్న నేమి మెలపులేకున్నచో
బ్రతుకు చెడును సుమ్మ వసుధ యందు
సర్దుబాటు తోడ సంతసమ్మది కల్గు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
16.
ఓడిపోయె ననుచు నుజ్జనసేయక
తీర్చిదిద్దు కొనెడి తీరుగనుము
సాన పెట్టినపుడె సాధ్యమగును కొన్ని
చెప్పుచుంటి వినుము! చిట్టితల్లి!
~
17.
సన్నిహితుల చెంత సామరస్యము తోడ
మెలగవలెను గాని యలుక వలదు
పంతమొదలి నపుడె బలగమ్ము పెరుగును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
18.
జలధినైన దాటు సాధనమ్ము కలదు
పాము విషమునైన పాచ వచ్చు
ఖలునికున్న బెడుసు కక్కించ లేమమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
19.
విజయమందు నపుడు విఱ్ఱవీగగ రాదు
దెబ్బతినిన నాడు దిగులు తగదు
ఎగసిన యలలన్ని యెడగడ్డ చేరున?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
20.
కట్టె కాల్చి వేయు కాలమ్ము చెల్లిన
జింత కాల్చి వేయు జీవనమ్ము
ధీమసమ్ము తోడ తెరలి సాగవలెను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here