చిట్టితల్లి శతకం-3

0
12

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]

21.
అస్త్రరాజి భంగి నలవాటులన్నియు
మనల బాగుపరుచు మంచి వైన
చెడ్డవయిన నవియె చెలగి చెఱపు చేయు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
22.
సర్దుబాటు లేక సామరస్యముతగ్గి
యెడవు పెంచు చుండు నెక్కువగను
మమత లేని చోట మనవారె పగవారు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
23.
శక్తి యున్నదనుచు శరము దూయగ రాదు
నాపదలకు తావు చూపరాదు
సత్తువెంత యున్న సంధిచేయుటె మేలు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
24.
చక్కదనము జూచి మక్కువ బడువారు
నిధులు జూచి చెంత నిలచు వారు
నట్టనడుమ విడచి నట్టేట ముంతురు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
25.
తల్లి దండ్రులకిడ తగు గౌరవమ్మును
నిన్ను జూచి సంతు నేర్చు కొంద్రు
నిన్ను గారవింత్రు మన్నన పెరుగగా
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
26.
సాధ్యమౌన? యన్న సంశయమ్ము గలుగ
తొట్ట తొలుతె దాని త్రుంచ వలయు
నాస్థ యున్న గెలుచు యవకాశములు మెండు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
27.
ఎదుటి వారి కష్టమెరిగి తీర్చుకొలది
మంచి చేయు కోర్కె మదిని పెరుగు
సద్గుణమ్ము లబ్బు సజ్జనులవలన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
28.
మబ్బులన్ని చుట్టి మర్తాండు నాపినన్
వెలుగులన్ని దిశల వెల్లి విరియు
నెదుగు వాని నాప నెవ్వరి తరమౌను?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
29.
ఎడరు లెన్ని నీవు నెదురొడ్డి నిలచిన
గుండె నిబ్బరమును కూడ గట్టి
సాగవలెను సుమ్ము సాలెపురుగు రీతి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
30.
ఎక్కు వెగర రాదు రెక్కలున్ననుగాని
నెదుట పడెడి లెడరు లెరుగు వరకు
వేచి యుందురమ్మ నీచ మానవు లెల్ల
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here