చివరి నిర్ణయం

4
11

[box type=’note’ fontsize=’16’]జాతీయ స్థాయి మలిశెట్టి సీతారాం సాహిత్య కథల పోటీ-2020లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]‘‘నీ[/dropcap] నిర్ణయమే సరైనదని అనిపిస్తోందిరా, ఇప్పుడు’’ అన్నాడు మిత్రుడు.

ఆయన చిన్నగా నవ్వి ‘‘ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. రావాలనుకుంటే వచ్చెయ్. కాకపోతే ఇందులో ఖాళీలు లేవు. ఇప్పుడప్పుడే అయ్యే అవకాశం కూడా లేదు’’ అన్నాడు చిన్నగా నవ్వుతూ.

‘‘అవును మరి, వాళ్లు అంత బాగా చూసుకుంటుంటే ఖాళీలెలా అవుతాయ్?’’ అంటూ మిత్రుడు కాస్త పెద్దగా నవ్వాడు.

‘‘వీళ్లే ఇక్కడకు దగ్గరలో మరో బిల్డింగ్ కడుతున్నారట. అది పూర్తయితే, కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. అనుకుంటున్నావ్ గానీ, దీనికి కూడా చాలా డిమాండ్ ఉందిరోయ్. వచ్చే నెలలో ఏదో మంచి రోజు చూసుకుని అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభిస్తారట’’ అన్నాడు, తనకు తెలిసిన సమాచారాన్ని వివరిస్తూ.

మిత్రుడు ఒక్క క్షణం మౌనం వహించి, ‘‘మరోసారి తనతో కూడా మాట్లాడి చివరి నిర్ణయం తీసుకుంటా’’ అన్నాడు.

‘‘సరే’’ అంటూ మిత్రుడిని తన గదికి తీసుకెళ్లాడాయన. తను చదివేసిన ఓ కథా సంకలనం, ‘బావుంద’ని జిరాక్స్ తీయించి పెట్టిన ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథ మిత్రుడి చేతిలో పెట్టి, మెయిన్ గేట్ వరకు తోడు వెళ్లి సాగనంపి వచ్చాడు.

తిరిగి గదికి వచ్చిన ఆయన విశ్రాంతిగా కూర్చుని టీవీ పెట్టాడు. అందులో వచ్చే కార్యక్రమంతో సంబంధం లేకుండా ఆయన ఆలోచనల్లోకి జారిపోయాడు. ఆయన ఇక్కడకు వచ్చి సుమారు ఐదేళ్లు అవుతుంది. ‘వచ్చి సాధించినదేమిటా’ అంటే ఓ పక్కన అందంగా అమర్చిన ఏడెనిమిది పుస్తకాలే సాక్ష్యం. ఇంకా కట్టలు విప్పని వాటి ప్రతులు కూడా సాక్ష్యమే. జీవితం హాయిగా, ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. తనలో తాను సంతృప్తిగా తలపంకించుకున్నాడు. భోజనం సమయం అవుతుండటంతో లేచి టీవీ ఆఫ్ చేశాడు. సమీక్ష చేయాల్సిన కథల పుస్తకాన్ని టీవీ కింద షెల్ఫ్ లోంచి తీసి రైటింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నాడు. అన్నట్టు ఇప్పుడు రాయడం అంటే, కంపోజ్ చేయడమే. ఇక్కడికి వచ్చాకే కంపోజ్ చేయడం నేర్చుకున్నాడు. కంపోజింగ్ వచ్చాక ముప్పయ్ వేలు పెట్టి లాప్‌టాప్ కొనుక్కున్నాడు. దాంతో గతంలోలా కాగితం మీద కొట్టివేతలు, దిద్దుబాటులు, ఇంటూ మార్కులు పెట్టి పైన రాయడం, బాణం గుర్తులు.. ఇవేవీ లేవు. అంతా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. పత్రికలు కూడా బాగానే అప్‌డేట్ కావడం వల్ల మెయిల్ చేస్తే స్వీకరిస్తున్నాయి.

ఇక్కడకు రాకముందు ఒక పుస్తకం తీసుకురావాలంటే రెండేళ్లకు పైగా పట్టింది. ఎప్పుడూ ఏవో ఒక పనులు, ఆటంకాలు. కాస్త ప్రశాంతంగా పని చేసుకోవడానికి సమయం చిక్కేదే కాదు. కోడుకు, కోడలకు చేదోడుగా ఆ పనీ, ఈ పనీ చేసి పెట్టడం; మధ్యలో మనవల పనులు.. ఇలా సమయమంతా తెలియకుండానే గడిచిపోయేది. మనవళ్లతో ముచ్చట్లు బాగానే వున్నా, వాళ్ల అల్లరిని భరిస్తూ అన్నీ అమర్చాల్సి వచ్చేసరికి ఆమె అలిసిపోయేది. అందుకే అందరూ ఏమనుకున్నా, ఫర్వాలేదనే తెగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక్కడకు వచ్చిన కొత్తలో కాస్త తప్పు చేసిన ఫీలింగ్ ఏదో వెంటాడేది. కానీ, ఇక్కడి వాతావరణం, సౌకర్యాలు, క్రమశిక్షణ వారిని త్వరగానే ఆకట్టుకున్నాయి. ఇంట్లోలా ‘పొద్దున్నే ఏం చేసుకోవాలి, ఏమున్నాయి? ఎలా చేస్తే ఎవరికి నచ్చుతుందో, లేదో’ అనే సంశయం లేకపోవడంతో ఆమె ప్రశాంతంగా నిద్ర లేస్తోంది.

పొద్దున్నే లేవగానే వేడి వేడి కాఫీ, వాకింగ్, యోగా, తరువాత టిఫిన్.. అన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగిపోవడంతో ఆయన మనసు కూడా ప్రశాంతంగా ఉంటోంది. టిఫిన్ చేసి వస్తే, ఇక భోజనం వరకూ ఆయనకు ఖాళీయే. అందుకనే తన రచనలకు సంబంధించిన పనులన్నీ చకచకా పూర్తి చేసుకుంటూ, ఒక క్రమ పద్ధతిలో తన పుస్తకాలన్నీ తీసుకురాగలుగుతున్నాడు. సాయంత్రం కాసేపు ఏవైనా కార్యక్రమాలున్నా ఆయన రాసుకోవడానికీ, చదువుకోవడానికీ ఎటువంటి ఆటంకం కలగించేవి కావు. పెద్దవాడు కావడం, కాస్తో, కూస్తో పేరున్న రచయిత కావడంతో చాలామంది తమ రచనలపై వ్యాసం రాయమని, అభిప్రాయం చెప్పమని అడుగుతూ తమ పుస్తకాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అప్పుడు కాస్త, అప్పుడు కాస్త చదవడంతో రచనలోని భావోద్వేగాన్ని సరిగా అందుకోలేకపోయేవాడు. ఇక్కడ దానిపైనే దృష్టి పెట్టి చదువుకుంటూ ఉండటంతో, రచనంతా బుర్రలో భ్రదంగా ఉంటోంది. దాంతో చకచకా నాలుగు ముక్కలు కూడా రాసివ్వగలుగుతున్నాడు. ఆయన వెలువరించే పుస్తకాలు, రచనలు భావితరాలకు వెలుగు దివిటీలని చాలామంది ఆయన కృషిని అభినందిస్తూంటారు.

భోజనం హాలు రావడంతో చేతులు కడుక్కోవడానికి వెళుతుంటే ఆమె వచ్చింది. ఆమెను చూస్తేనే అర్థమవుతోంది, ఆనందంగా ఉందని. ముఖంలో నవ్వులు విరబూస్తున్నాయి. కాస్త సిగ్గు పడుతూ,

‘‘ఇది చూసి ఎలా వుందో చెప్పండి’’ అంటూ ఓ డ్రాయింగ్‌ను రెండు చేతులతో తెరిచి పట్టుకుంది.

కలర్ కాంబినేషన్‌లో కాస్త తేడాలున్నాయి కానీ, బొమ్మ బావుంది.

‘‘చాలా బావుందోయ్, తొందరగానే పెద్ద ఆర్టిస్ట్‌వి అయిపోతున్నావ్’’ అన్నాడాయన అభినందనగా.

‘‘చాల్లెండి, మీరు మరీనూ. ఏంటో, ఈ వయసులో వీళ్లు నాతో బొమ్మలు వేయిస్తున్నారు’’ అంటూ మురిసిపోతూ భోజనానికి కూర్చుంది.

భోజనాలు అయ్యాక ఇద్దరూ తమ గదికి వచ్చారు.

ఆమె తన బొమ్మను మళ్లీ చూసుకుని ‘‘అయితే బానే వుందంటారు? ఎక్కడ పెడదాం?’’ అంది గోడలవైపు చూస్తూ.

‘‘బానే కాదు, చాలా బావుంది. దగ్గరైతే నేనే వెళ్తా, లేకపోతే రేపు ఎవరినైనా పంపించి ఫ్రేమ్ కట్టిస్తా. అప్పుడు గోడకు పెడదాం’’ అన్నాడాయన.

ఆమె ఇంకా మురిసిపోతూ ‘‘ఓ ఫొటో తీస్తారేంటి, దీన్ని’’ అని అడిగింది.

ఆయన తన సెల్ ఫోన్‌తో ఫొటో తీసి, అంచులవీ క్రాప్ చేసి ఆమెకు వాట్సప్ చేశాడు. ఆమె అది చూసుకుని ‘థ్యాంక్స్’ అంటూ లవ్ సింబల్ పెట్టింది.

ఆయన తన ఫోన్‌లో ఆ మెసేజ్ చూసుకుంటుంటే, ఆమె కిలకిలా నవ్వింది. ఆమె ముచ్చట చూస్తే ఆయనకీ నవ్వొచ్చింది. లేచి దగ్గరకు వెళ్లి తల మీద తట్టి ‘‘నువ్వు మరీ చిన్న పిల్లవై పోతున్నావ్’’ అన్నాడు.

ఆమె సిగ్గుపడుతూ తలదించుకుని, చేతులు రెండూ పైకెత్తి ‘‘అయితే ఎత్తుకోండి’’ అంది.

ఆయన ఆమె చేతులు పట్టుకుని, మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు.

***

ఓ రోజు ఇద్దరూ వాకింగ్‌కు బయలుదేరుతుండగానే మిత్రుడి నుంచి ఫోన్. తన భార్య కూడా ఒప్పుకుందని, త్వరలోనే వచ్చి అడ్వాన్స్ కట్టేస్తానని సంతోషంగా చెప్పాడు. ఆయన, ఆవిడా కూడా సంతోషించారు.

నాలుగు రోజుల్లోనే దంపతులిద్దరూ వచ్చారు. అడ్వాన్స్ సొమ్ము కట్టేసి వీరిని కలిసి మాటల్లో పడ్డారు.

‘‘ఎవరు ఏమైనా అననీండి వదినగారూ, మీరూ అన్నయ్యగారూ మంచి నిర్ణయం తీసుకున్నారు. హాయిగా ఉన్నారు. మాకూ ఇన్నాళ్లకు కుదిరింది. ఇక అంతా ఆ భగవంతుడి దయ. మీ అందరినీ చూస్తే ధీమాగానే ఉంది. అనుకుంటాం గానీ, వృద్ధాశ్రమం అంటే ఏదో దిక్కూ మొక్కూలేనివాళ్లే చేరతారని. అది పూర్తిగా తప్పని అర్థమైంది. అయినా, ఏవో అప్యాయతలు, అనురాగాలు అని అనుకుంటాం గానీ, ఏమున్నాయి చెప్పండి. అంతా హడావిడి, మీకు తెలియందేముంది. ఆ తొడతొక్కిడికి తట్టుకోలేక, నలిగిపోతూ ఆత్మవంచన చేసుకోవడం కాకపోతే. ఏదైనా కాస్త దూరంగా ఉంటేనే విలువా, గుర్తింపూ. అంతగా ఉండలేకపోతే, అప్పుడే పోవచ్చని ఆయన మాటకు సరే అన్నా’’ ఇలా ఆ మిత్రుడి భార్య వాక్ప్రావాహం సాగిపోతూనే ఉంది.

‘‘ఏంటోయ్ నీ మాటలకు ఇంక పుల్‌స్టాప్‌లే ఉండవా’’ అనే సరికి ఆమె మాటలు ఆపి లేచి నిలబడింది. నలుగురు సరదాగా నవ్వుకున్నారు.

వాళ్లు వద్దంటున్నా, ఫర్వాలేదంటూ దంపతులిద్దరూ, మిత్రుడి దంపతుల వెంటే మెయిన్ గేట్ వరకూ వెళ్లారు.

‘‘ఏమోరా, తప్పో ఒప్పో.. ఇన్నాళ్లూ పిల్లలను పైకి తీసుకురావడానికి నానా అగచాట్లు పడ్డాం. ఇహ వాళ్లూ సెటిలయ్యారు. ఇప్పుడైనా మన ఆసక్తులపై దృష్టి పెట్టకపోతే ఎలా అని నువ్వన్న మాటలు బాగా పనిచేశాయిరా. ఓపిక చాలకపోవడం, కోడలితో ఆమెకు మాటామాటా రావడం కూడా కలిసొచ్చాయనుకో’’ అన్నాడు మిత్రుడు, అసలు విషయం బయటపెడుతున్న ధోరణిలో.

‘‘ఇక అంతా కలిసొచ్చే కాలమే అనుకో. అంతా మంచే జరుగుతుంది. నువ్వేమీ అధ్యైర్యపడకు’’ అని భరోసా ఇచ్చాడు.

మిత్రుడి చివరి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆ దంపతులిరువురికీ తిరిగి స్వాగతం పలకడానికి ఉవ్విళ్లూరుతూ, ప్రస్తుతానికి వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here