[dropcap]“జీ[/dropcap]విత చక్రం సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు?” క్విజ్ మాస్టర్ గారి గొంతు హాల్‌లో ప్రతిధ్వనించింది
హాల్ అంతా నిశ్శబ్దం. సూదిమొన నేలపై తాకితే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది. మా ఊపిరి చప్పుడు మాకే విస్ఫోటనం లాగా వినిపిస్తోంది.
ఈ ప్రశ్నకి సమాధానం చెబితే మేము టీం నాలుగుతో సమానం అయిపోతాము. ఆ తరువాత ఇంకొక ప్రశ్న ఉంటుంది. దానిపైన ఆధారపడి మొత్తం క్విజ్ ఫలితం ఆధారపడి ఉంది.
మాది మూడో టీం.
పై ప్రశ్నకి మొదటి టీం “కేవీ మహదేవన్” అని సమాధానం చెప్పారు. అందరూ క్విజ్ మాస్టర్ వంక ఊపిరి బిగ పట్టి చూస్తున్నాం. క్విజ్ మాస్టర్ ఒక రకమైన నిరసనతో వారి వంక చూసి పెదవి చివర ఒక విధమైన హేళన మిళాయించి “రాంగ్!!! టీం టూ” అని ప్రకటించి టీం టూ వంక చూస్తూ –
“ఇది పాస్ ఆన్ ప్రశ్న. మీరు వెంటనే సమాధానం చెప్పాలి. ఆలోచించటానికి సమయం ఉండదు” అని జోడించారు.
వారు టకీమని “ఇళయరాజా” అనేశారు.
అప్పటి దాకా క్విజ్ మాస్టర్ మొహంపై లీలగా కనిపించిన నిరసన ఈ మారు బాహటంగానే వ్యక్తం అయింది.
“చదువులు సరే! సినిమాల గూర్చి కూడా తెలియకుంటే ఎలా?” అనేశారు. హాలంతా నవ్వులతో ప్రతిధ్వనించింది.
ఇక మా వంతు.
మళ్ళీ హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. అందరి దృష్టి మా మీద కేంద్రీకృతం అయింది.
***
నేను డిగ్రీ చదువుకుంటున్న రోజులలో జరిగింది ఈ సంఘటన. ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ మొదటి అంతస్తులో విశాలమైన మా ఇంగ్లీష్ క్లాస్ రూంలో జరుగుతోంది ఈ క్విజ్ కార్యక్రమం.
పంకజ్ సర్, బాషా సర్ మాకు హిందీ లెక్చరర్లుగా ఉండేవారు ఆ రోజుల్లో. పంకజ్ సర్ గారికి ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ వచ్చిన కారణంగా హిందీ చెప్పటానికి ఇంకో లెక్చరర్‌ని నియమించటం జరిగింది.
ఆయన రావటం రావటమే సంచలనాత్మక విడుదల అన్న తరహాగా ‘అక్యుమెన్ ఫ్రెండ్స్ సొసైటీ’ అనే పేరిట ఒక యువజన సంఘాన్ని స్థాపించి ఆ చత్రం కింద అనేక క్విజ్ కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించేవాడు. ఆయన రాకతో మా కాలేజిలో ఒక కొత్త చైతన్యం వచ్చిన మాట వాస్తవం.
ఆయన పాఠాలు చెప్పటం అంతంత మాత్రమే అని విన్నాను. మాకు చివరి సంవత్సరం హిందీ సబ్జక్టు లేకపోవటం వల్ల ఆయన ప్రావీణ్యం క్లాసులో చవి చూసే అవకాశం లేకపోయింది. మా జూనియర్స్ చెప్పటం వల్ల ఆయన పాఠాలు చెప్పే తీరులో ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది అనే విషయం కర్ణాకర్ణిగా విన్నాము.
బాషా సర్ గారు చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. ఆయన చెప్పిన ఒక లెసన్ ‘నాఖూన్ క్యోం బడ్తే హై’ అన్న పాఠం నాకు ఇంకా బాగా గుర్తు ఉంది. దానికి తోడు అయనకి ఉర్దూ పారసీక భాషలలో ప్రావీణ్యత ఉండటం వల్ల ఆయా సాహిత్యాలలోని మాధుర్యాన్ని జోడించి ఇవే అంశాలు ఆయా సాహిత్యాలలోని ఇతర పద్య కావ్యాలలోని అంశాలతో తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక విధమైన తాదాత్మ్యతతో చెప్పేవారు.
గాడిదకెందుకురా పన్నీటి వాసన అన్నట్టు మాకు ఈ పాఠాలు ఆయన చెప్పబోవటమే చిత్రం. మేము సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీస్కుంటే మార్కులు ఎక్కువ వస్తాయనే భ్రమతో సెకండ్ లాంగ్వేజి హిందీ తీసుకోవటమే తప్పించి ఆయా సాహిత్యాలలో లోతుపాతులు మాకు తెలిసి ఏడిస్తే కద.
‘ఎంత మంది శ్రోతలు ఉన్నారని కాదు, నీవు ఎలా చెబుతున్నావు అన్న దాని మీదనే ఏకాగ్రత నిలుపు’ అన్న మోటివేషనల్ కోట్ ఆయన్ని ప్రేరేపించేదేమో తెలియదు. ఆయన మాత్రం చక్కగా చెప్పుకుంటూ వెళ్ళేవారు.
ఇక పంకజ్ సర్ గూర్చి చెప్పేదేముంది. ఆయన సహజంగానే కవి. ఆయన చెబుతూ చెబుతూ మధ్య మధ్యలో కన్నడ సాహిత్యానికి సంబంధించి అనేక అంశాలు కూడా మాకు చెప్పేవారు. ఆయనకి కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సాధికారత ఉంది.
ఇక మళ్ళీ ఈ యువ లెక్చరర్ నిర్వహిస్తున్న క్విజ్ పోటీ విషయానికి వద్దాం.
నేను అప్పటికే ఆయన నిర్వహించిన వక్తృత్వం పోటీలు, వ్యాస రచన పోటిలలో పాల్గొని బహుమతులు గెలుచుకుని ఆయన గుడ్ బుక్స్‌లో ఉన్నాను.
***
మేము నాలుగో టీంతో పోలిస్తే ఒక పాయింట్ వెనుక పడిఉన్నాము.
‘జీవిత చక్రం’ సంగీత దర్శకుడు ఎవరూ అన్న విషయం నాకు తెలుసు. ఇక ఈ ప్రశ్నకి మాకు పాయింట్ రావటం ఖాయం.
అంతకు ముందే ఈ సినీ రౌండ్‌లో “లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాట ఒకటి చెప్పండి” అని అడిగారు. ఆ ప్రశ్న అడిగి అక్కడితో ఆగిపోయి ఉంటే ఇబ్బంది లేకపోయేది. ‘ఆఖరి పోరాటం’ లో ‘తెల్ల చీరకి తకధిమి తకధిమి రేగేనమ్మ..’ అన్న పాట కాకుండా ఇంకొకటి అని మడత పేచి పెట్టారు. అప్పట్లో ఆఖరి పోరాటం విడుదల అయిన కొత్తలు, అందరికీ ఆ పాట ఒక్కటే తెలుసు ఇక లతా మంగేష్కర్ తెలుగులో ఏమి పాడిందో ఎవ్వరికి తెలియదు. దేవుని దయ వల్ల నేనే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాను.
‘సంతానం’ చిత్రంలో ‘నిదుర పోరా తమ్ముడా..’ అనే పాట అని. దాంతో మా టీంకి గెలుపు ఊపిరులు ఊదిన వాడిని అయ్యాను.
ఇప్పుడు ఈ ప్రశ్న జీవిత చక్రం ప్రశ్న.
బలంగా ఊపిరి పీల్చుకుని చెప్పాను ‘శంకర్ జై కిషన్’ అని.
సాక్షాత్తు మా టీం మెంబర్స్ నన్ను పిచ్చి వాడిని చూసినట్టు చూశారు. సిక్సర్ కొట్టాల్సిన సందర్భంలో కాచ్ ఇచ్చిన బాట్స్‌మన్‍ని సాటి రన్నర్ చూసినట్టు ఉంది వారి చూపు.
ఇక వాళ్ళు క్విజ్ మాస్టర్ గారి ప్రకటన వినటానికి కూడా ఇచ్చగించలేదు. బాగులు సర్దుకుని, షూశ్ సరి చేసుకుని ఇక బయలు దేరటానికి సిద్ధం అయ్యారు.
అప్పుడు వినిపించింది క్విజ్ మాస్టర్ గారి ప్రకటన. ఎంతో ఉద్వేగంగా అరిచారు ఆయన. “కర్రె..క్..ట్” అని.
అప్పుడు మ్రోగాయి హాల్‌లో కరతాళ ధ్వనులు. వాళ్ళంతా నా అభిమానులు అని కాదు. ఓడిపోతున్న టీంకి సహజంగానే జాలితో కూడిన సపోర్ట్ లభిస్తుంది అనుకుంటా.
ఇక మా టీం నాలుగో టీం సరి సమానం అయింది.
మా టీం మేట్స్ నా వంక కాస్త జాలిగా చూస్తున్నట్టు తోచింది. వాస్తవానికి నా పాత్ర ఏమీ లేదు వాళ్ళ లెక్క ప్రకారం ఈ రవుండ్‌లో సినిమాల గూర్చి నాకేమీ తెలియదని, చిరంజీవికి బ్రహ్మాండమైన ఫాన్‌ని ఒకడ్ని మా టీంలోకి చేర్చుకున్నాము.
యముడుకి మొగుడు లో ఫలాన పాటలో చిరంజీవి ఎన్ని దుస్తులు మార్చుకున్నాడు, ఖైదీ సినిమా ఎన్ని సెంటర్స్‌లో నూరు రోజులు ఆడింది?, పసివాడి ప్రాణంలో కాశ్మీర్ లోయలో పాటలో లొకేషన్స్ ఎక్కడ ఎన్నుకున్నారు? గువ్వ గోరింక తో పాటలో భానుప్రియ కన్ను కొట్టిందా లేదా?, చిరంజీవి కన్ను కొట్టాడా ప్రేక్షకుల వంక చూసి?, చిరంజీవి ఏ సినిమా నుంచి ప్రేక్షకుల వైపుకి తిరిగి కన్ను కొట్టడం మొదలెట్టాడు? తదితర వివరాలు అన్నీ వాడు టక్ టక్ మని చెప్పగలడు. వాడికి కదిలే ఎన్‍సైక్లోపిడియగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
కానీ ఈ క్విజ్ మాస్టర్ అడిగే సినీ ప్రశ్నలకి అతను గుడ్లు తేలేశాడు.
నన్ను వాస్తవానికి జీకె, సాహిత్యం గట్ర అంశాలలో రాణిస్తానని భ్రమకి గురయ్యి తీసుకున్నారు టీం లోకి.
ఆయన సాహిత్యానికి సంబంధించిన రవుండ్‌లో షేక్‌స్పియర్, కీట్స్, షెల్లీ, పోతన, తిక్కనా రేంజిలో ఆడిగేటప్పటికి నేను గుడ్లు తేలేసాను అదివరకటి రవుండ్లలో.
ఏతావాతా చావు దప్పి, కన్ను లొట్టబోయి చివరి దశకి వచ్చాం.
నాలుగో టీం వాళ్ళు మేధావులేమీ కాదు కానీ. ఖచ్చితంగా వాళ్ళకి పోతన, తిక్కన, నన్నయ్య, ధూర్జటి, సుభద్ర కుమారి చవుహాన్, షేక్శ్పియర్, కీట్స్ షెల్లీ స్థాయి జ్ఞానం లేదన్నది నిర్వివాదాంశం.
అక్కడ మాచ్ ఫిక్సింగ్ జరిగిందని మావాళ్ళ వాదన. ఆ కుర్రాళ్ళంతా ఆయనతో బాటు మోటారు సైకిళ్ళలో కాలేజికి వచ్చేవారు, కాలేజీలో కాస్తా తీరిక దొరికితే ఆయనతో బాటుగా వెళ్ళి ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న పాక టీ స్టాల్ లో టీ త్రాగేవారు, వాళ్ళందరూ సినిమాలకి కూడా వెళ్ళే వాళ్ళూ. ఏతావాతా వాళ్ళు అంతా ఒక టీం అన్నది నిస్సందేహంగా సత్యం.
ఇక రెండో టీం కి నేరుగా ప్రశ్న.
“ఎల్ వీ ప్రసాద్ పూర్తి పేరు ఏమిటీ?”
వాళు స్టయిల్‌గా “లక్కారపు వెంకట ప్రసాద్.. ఉండొచ్చు” అని నీళ్ళు నమిలారు.
మళ్ళీ మా వంతు. ఆలోచించటానికి టయిం లేదు. పాస్ ఆన్ ప్రశ్న కద.
“అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావు” నింపాదిగా చెప్పాను నేను.
అప్పుడు చూడాలి మా టీం మేట్స్ మొహాలు.
“ఒరే నిన్ను చంపినా పాపం లేదు. నిన్ను చంపి పాతర వేస్తాం. ఎల్ వీ అనే పేరులో ఎక్కడన్నా అక్కినేని అనేది ఉందారా” అని వాళ్ళు గొణుగుతూ కొర కొర చూస్తున్నారు.
“ఖ..ర్రె..ఖ్..ట్” క్విజ్ మాస్టర్ ఉద్వేగం పతాక స్థాయికి చేరుకుంది.
అప్పుడు మా వాళ్ళ వంక బ్రహ్మానందం లాగా గర్వంగా చూశాను.
ఇప్పుడు మా టీంకి నేరుగా ప్రశ్న
‘బాబు భాయి మిస్త్రీ ఎవరు?”
“మనకి మేస్త్రీలు తెలుసు గానీ ఈ మిస్త్రీలు తెలియవు కదరా” నా చెవిలో గొణీగాడు మా టీం మేట్.
“పురాణ బ్రహ్మ అని పేర్కొనదగ్గ తొలి తరం హిందీ చిత్ర రంగ సాంకేతిక నిపుణులు, దర్శకుడు” నేనే చెప్పానా, చెప్పనని అనుకున్నానో నాకే అర్థం కాలేదు.
క్విజ్ మాస్టర్ గెంతులు వేయటం ఒక్కటే తక్కువ.
“కర్రెక్ట్” అని అరిచాడు.
ఇప్పుడు నాలుగో టీం కి నేరుగా ప్రశ్న
“గురు దత్ అసలు పేరు ఏమిటి?’
వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. (ముందే లీక్ అయింది అనుకున్న పక్షాన)
“సర్.. సర్.. సర్.. అది అది..” అంటూ నసుగుతున్నారు.
ఆయన వాళ్ళ వంక జాలిగా చూస్తూ పెదాల కదలికతో మౌన భాషలో ఏదో చెబుతున్నాడు అని అనిపించింది. ఏమో ఆయన మంచి వాడేనేమో, మా టీం మేట్స్ అనవసరంగా నా మెదడు కలుషితం చేశారు.
స్టాప్ వాచ్ తాలూకు ‘ఛక్ ఛక్ ఛక్ ఛక్’ అనే శబ్దం మినహా ఏ శబ్దం లేదు. ఫిజిక్స్ లాబ్ నుంచి తెచ్చి పెట్టిన ఆ స్టాప్ క్లాక్ ఇక కొన్ని సెకన్ల తర్వాత ‘గర్రు’ మని చప్పుడు చేసింది.
ఇప్పుడు యథా ప్రకారం ఆ ప్రశ్న పాస్ ఆన్ అయింది. మొదటి టీం వాళ్ళు మిడి గుడ్లు వేశారు. ‘అసలు గురు దత్ ఎవర్రా? సంజయ్ దత్ అన్ననా?’ అని వాళ్ళూ గొణుక్కోవడం వినిపించింది.
రెండవ టీం వాళ్ళ పరిస్థితి కూడా ఏమీ మెరుగ్గా లేదు.
“వసంత్ కుమారు శివ శంకర్ పడుకునే” భయపడుతూ చెప్పాను.
‘ఒరే నీవు ఇంట్లో పడుకోక ఇక్కడికెందుకొచ్చావురా’ అన్నట్టు చూస్తున్నరు మా టీం మేట్స్.
అప్పుడు అరిచారు క్విజ్ మాస్టర్ ఉద్వేగంగా “యెస్ యెస్ యెస్. టీం త్రీ ఈస్ ది విన్నర్” అని.
నేను చిన్నప్పటి నుంచి చదివిన విజయచిత్ర, నీలిమ, సితార, యువ, కినిమా, జ్యోతి చిత్ర, స్క్రీన్, ఫిలిం ఫేర్ మాగజైన్‌ల పరిజ్ఞానం నన్ను గట్టెక్కించింది ఆ రోజు.
ఇంతకూ నేను సినిమాలు చూసేది చాలా తక్కువ. కానీ సినీ సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, వాళ్ళకి సంబంధించిన విజయగాథలు చదువుతూ ఉండేవాడీని ఎక్కువ.
నాకు సినిమాల లోకంటే వాళ్ళ నిజ జీవితంలోనే ఎక్కువ డ్రామా కనిపించేది.
మా అమ్మానాన్నలు కూడా వాళ్ళ పట్ల సానుభూతి కలిగేలా మాట్లాడేవారు. “ఏదైనా పాటలు చూసేటప్పుడు, నెమ్మదిగా వాళ్ళ కాళ్ళ వంక చూడు. ఆ ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా మొహాలపై నవ్వు పులుముకుని వాళ్ళూ నటిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు పూల పానుపులు కావు” ఇలాంటి మాటల వల్ల తెలియకుండానే మాలో సంస్కారాలు జాగృతం చేసారు మా అమ్మానాన్నలు.
ఏ హీరోయిన్‌ని కానీ, హీరోని కానీ ఇతర నటీనటులని కానీ ‘వాడు వీడు, అది ఇది’ అని సంబోధిస్తే మా నాన్నగారు చాలా తీవ్రంగా పరిగణించేవారు. “అతను, ఆమె అనాలి” అని చెప్పటమే కాదు కాస్త కఠినంగా -”నీవు వాళ్ళకి బొడ్డుకోసి పేరు పెట్టావా? వాళ్ళ పేరు చివర గారు అని చేర్చాలి” అని మందలించేవారు.
మా అమ్మగారు అయితే ప్రహ్లాదుడు చెప్పిన ‘అన్య కాంతలు ఎదురైన మాతృ భావమ్మున..’ అనే పద్యం ఒకటి చెప్పేవారు.
ఏతావాతా సినీతారల గూర్చి మన్ననగా మాట్లాడటం, వారి జీవితాల్ని సానుకూల దృక్పథంతో చూడటం నాకు తెలియకుండానే అలవడింది.
కిరణ్ ప్రభ టాక్ షోలు వినేటప్పుడు నాకు ఈ అంశాలు గుర్తు వస్తూ ఉంటాయి.
అది నా క్విజ్ ముచ్చట. మొత్తానికి సినీ తారలు, సాంకేతిక నిపుణులు నన్ను కాపాడారు ఆ రోజు.
ఆ రోజు బహుమతిగా మా టీం మేట్స్ అందరికి నానీ పాల్కీవాలా రచించిన ‘వీ ది పీపుల్’ అనే గ్రంథం ఇచ్చారు.
అది ఎక్కడ పోయిందో, నేనైతే చదివింది లేదు.
స్వస్తి.