సినీగీతాల్లో దీపావళి

1
10

(12 నవంబర్ 2023 దీపావళి పర్వదినం సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ)

[dropcap]“దీ[/dropcap]పం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే!” అని శాస్త్రం చెబుతుంది. అంటే దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం, దీపం తమస్సు (చీకటి) ను పోగొడుతుంది. దీపం వల్లనే సర్వలోకాలూ ప్రకాశిస్తాయి. సంధ్యాదీపానికి నమస్కరిస్తున్నాను అని అర్థం. సూర్యాస్తమయం అవగానే దీపం వెలిగించి నమస్కరించటం మన సంప్రదాయం. దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ దీపావళి. అంటే అజ్ఞానాంధకారంనుంచీ వెలుగులోకి ప్రయాణించటమే దీపావళి పరమార్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస బహుళ అమావాస్య నాడు జరుపుకుంటాము.

దీపావళి ఎందుకు జరుపుకుంటాము, దాని ప్రాశస్త్యం ఏమిటి అనే దానికి రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాక్షస సంహారం కావించి, వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చిన శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు ప్రజలందరూ దీపాలు వెలిగించారని ఒక కథ. అలాగే కురుక్షేత్రయుద్ధంలో విజయం సాధించి, ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయిన సందర్భంగా కూడా దీపాలు వెలిగించారని మరో కథనం. శ్రీమహావిష్ణువు వామనుడుగా వచ్చి బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానం కోరాడు. అంగీకరించిన బలి దాతృత్వానికి సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే ‘ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్యలందు దానం చేసిన వారి పితృదేవతలకు స్వర్గం ప్రాప్తించేటట్లు చేయమని, వారి ఇంట్లో లక్ష్మీదేవి నెలకొనేటట్లు చేయమ’ని కోరుకుంటాడు. అప్పటి నుంచీ దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటున్నట్లు వామన పురాణం చెబుతుంది.

అన్నిటిలోకి ప్రసిద్ధమైన కథ సత్యాకృష్ణులు నరకాసురుడిని సంహరించిన తర్వాత ప్రజలు అందరూ సంతోషంతో దీపాలు వెలిగించి పండగ చేసుకోవటం. ఈ కథ భాగవతంలోనూ, హరివంశంలోనూ వస్తుంది. ఒకప్పటి మన చలనచిత్రాలలో సందర్భానుసారంగా మన సంస్కృతిలో భాగమైన పండగలను కూడా చూపించారు. దీపావళి కథనం మీద ఏకంగా చలనచిత్రమే తీశారు. ఇందులో శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రల్లో యన్.టి.ఆర్., భూదేవి, సత్యభామ పాత్రల్లో సావిత్రి, నరకాసురుడుగా యస్.వి.ఆర్., ప్రధాన పాత్రలలో నటించారు.

నరకాసురుడు జన్మించిన తర్వాత పొత్తిళ్ళలో బిడ్డను తెచ్చి చూపించి భూదేవి “మన కుమారుడు చిరంజీవిగా వర్ధిల్లేటట్లు ఆశీర్వదించండి ప్రభూ!” అంటుంది.

“లోకకంటకులు చిరంజీవులుగా వర్ధిల్లలేరు దేవీ!” అంటాడు విష్ణువు.

“ధర్మస్వరూపులైన మీకూ సహనమూర్తినైన నాకూ జన్మించిన వాడు లోకకంటకుడు ఎలా అవుతాడు స్వామీ!”

“హిరణ్యాక్షుడిని సంహరించిన ఆగ్రహం చల్లారకముందే నన్ను అనురక్తుడిని చేశావు. రాక్షస ముహూర్తంలో జన్మించిన ఈ బాలుడు మహాబలవంతుడై, ధర్మభ్రష్టుడై కన్నతండ్రినే కయ్యానికి కవ్విస్తాడు”

“ఆ దుర్ఘటనే అనివార్యమైనప్పుడు వీడిని వధించనని మాట ఇవ్వండి ప్రభూ!”

“నాకు నేనుగా వధించను” అంటాడు విష్ణువు.

నరకాసురుడు పెరిగి పెద్దవాడై శివుడి గురించి తపస్సు చేసి తల్లి చేతిలో తప్ప ఎవరి వల్లనూ మరణం లేకుండా వరం పొందుతాడు. “కన్నతల్లి కొడుకుని వధిస్తుందా!” అనే ధైర్యంతో అనేక దారుణకృత్యాలు చేస్తూ ఉంటాడు. అతడు పెట్టే బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకుంటారు. భర్తతో పాటు యుద్దానికి వెళ్ళిన సత్యభామ, కృష్ణుడు సొమ్మసిల్లినప్పుడు నరకుడితో యుద్ధం చేసి సంహరిస్తుంది. ఆ విధంగా తన కుమారుడు అని తెలియక వధిస్తుంది. నరకబాధలు వదలినందుకు ప్రజలు పండగ చేసుకుంటారు ఇలా –

వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి

మూడు లోకాల నరకుడు బాధింపగా, హరి కరుణించి

వెలుగులు చూపించెను, హరి అనుమతిగా నరకుని

స్మృతిగా హాయి ఈనాడు దీపావళి”

(చిత్రం: దీపావళి – 1960 – గానం: ఘంటసాల, సుశీల బృందం – రచన: సముద్రాల)

శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ విజయం చిత్రాలలో కూడా నరకాసుర వృత్తాంతం వస్తుంది. మొదటి చిత్రంలో వాణిశ్రీ, రెండవ దానిలో జమున సత్యభామలుగా నటించారు. రెంటిలో శ్రీకృష్ణుడు యన్.టి.ఆర్ యే! పౌరాణిక చిత్రాల్లోనే కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా దీపావళి జరుపుకునే ఘట్టాలు అనేకం ఉన్నాయి.

ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో దీపాలు వెలిగించి ఇలా పాడుతుంది.

విరిసిన ఆనంద దీపావళి, మెరిసిన అనురాగ దీపాలివి

వెతలకు దూరాలు వెలుగుల తీరాలు మమతలు మా ఇంటి దీపావళి”

(కన్నవారిల్లు – 1978 – సుశీల – వేటూరి సుందరరామ మూర్తి)

మనుషులు సుఖంగా ఉన్నారు అనటానికి తార్కాణం బాగా డబ్బు ఉండటం కాదు. కష్టాలు లేకుండా, అందరూ ఆత్మీయంగా కలసిమెలసి ఉంటే సుఖంగా, సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ తల్లి అదే చెబుతుంది. అందులోనూ పిల్లలున్న ఇల్లు సందడితో కళకళలాడుతూ ఉంటుంది. అందుకే పిల్లల్ని ఉద్దేశించి ఇలా చెబుతున్నది.

కన్నులలోన వెన్నెలవాన కౌగిలిలోన గారాల కూన

మా పాటకు పల్లవి మీరు మా తోటకు మల్లెలు మీరు

మా కంటికి దివ్వెలు మీరు మా పండగ నవ్వులు మీరు

చీకటి వాకిట ముగ్గుల ముంగిట దీపాలే మీరు”

పసికూన మెత్తటి శరీరస్పర్శ గుండెకు హత్తుకోవాలనిపిస్తుంది. కొత్తగా తల్లి అయిన ఇల్లాలి కళ్ళలో వెన్నెలవాన కురుస్తుంది. అలాంటి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరినీ సమానంగానే ప్రేమిస్తుంది తల్లి. ఇల్లు ఒక పూలతోట లాంటింది, పిల్లలు ఆ తోటలో పూచిన పువ్వులు లాంటి వారు. నిత్యం వారిని చూస్తూ ఉండటం కన్నా ఆనందం ఉండదు తల్లిదండ్రులకు. అందుకే నా కంటికి వెలుగులు మీరు అని చెబుతున్నది. అలాంటి పిల్లల నవ్వులతో, అల్లరితో నిండిన ఇల్లే అసలైన ఇల్లు. ఇంటిముందు ముగ్గు ఎంత శోభ నిస్తుందో, పిల్లలు కూడా ఇంటికి అంత అందాన్ని ఇస్తారు అని ఆ తల్లి భావన. వారితో కలసి దీపాలు వెలిగిస్తూ పండగ చేసుకోవటం కన్నా మించిన ఆనందం లేదు. ఈ చిత్రంలో తల్లిగా అంజలీదేవి నటించింది.

ఇంకొక చిత్రంలో దీపాలు వెలిగించి ఇంటిల్లిపాదీ టపాకాయలు కాలుస్తూ ఇలా పాడుతున్నారు.

వెన్నెలరోజు ఇది వెన్నెలరోజు

అమావాస్య నాడు వచ్చే పున్నమిరోజు

పెద్దలంత పిల్లలుగా మారే రోజు

పల్లెదో పట్టణమేదో తెలియని రోజు, దీపావళి రోజు”

దీపావళి అమావాస్య రోజు వస్తుంది. సాధారణంగా ప్రతి అమావాస్య లోనూ చీకట్లు ముసురుకుంటాయి. కానీ ఈ రోజు మాత్రం పున్నమేనేమో అనిపిస్తూ వెలుగులు పూయిస్తుంది. ఇప్పుడంటే మారుమూల పల్లెల్లోనూ కరెంట్ వచ్చింది గానీ, ఒకప్పుడు కరెంట్ పట్టణాల్లో మాత్రమే ఉండేది. పల్లెల్లో కిరోసిన్ దీపాలు వెలిగించుకునేవారు. దీపావళి రోజు మాత్రం పల్లెకి, పట్టణానికి తేడా తెలియదు అంటున్నాడు. ఏ ఊరు అయినా వెలుగులతో నిండిపోతుంది. ఆ సందడి సంతోషంలో పెద్దలు కూడా పిల్లలలాగా మారిపోతుంటారు. టపాకాయలు కాలుస్తుంటారు. అయితే ఈ టపాకాయలు ఎందుకు కాలుస్తారో జీవితానికి ఇలా అన్వయించి చెబుతున్నాడు కవి.

జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది

జువ్వల్లే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది

నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చిపెడుతుందని

తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది”

చిచ్చుబుడ్డి ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతూ రివ్వున పైకెగిరి, అంతే వేగంతో నేలరాలిపోతుంది. అలాగే మన జీవితం కూడా క్షణికం. ఎప్పుడు మృత్యువు కబళిస్తుందో చెప్పలేము. చూసేవారికి మన జీవితం ఇంత స్వల్పమైనదా అనిపిస్తుంది. కానీ బ్రతికి ఉన్నప్పుడు తారాజువ్వలాగా వేగంగా అభివృద్ధిలోకి రావాలి. లేకపోతే వెనకనున్న వాడు మనల్ని తోసేసి, దాటిపోతాడు. ఇది పోటీ ప్రపంచం. నిప్పుతో చెలగాటం ఆడితే ఎప్పుడైనా ప్రమాదమే అన్నదానికి సూచనగా టపాకాయ వెలిగిస్తారు. ఇక్కడ నిప్పు అంటే తన స్థాయిని మరిచి, గొప్పవాళ్ళతో పంతాలకు పోవటం. అలా జరిగినప్పుడు ముప్పు సంభవిస్తుంది. ఈ పాట ‘రామయ్య తండ్రి’ (1975) చిత్రంలో బాలు, సుశీల పాడారు. మల్లెమాల రచించిన గీతం ఇది. ఈ పాటలో సత్యనారాయణ, రంగనాధ్, ప్రభ, మాస్టర్ రమేష్ నటించారు.

దీపావళి పండగ డబ్బున్న వారికే కాదు, పేదలకు కూడా ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. ఓ శ్రామిక వాడలో పేదవాళ్ళు ఇలా పాడుతున్నారు.

ఓహో వయ్యారి లాహిరీ! రావే రంజైన రంగేళి జాగిరీ!

వచ్చింది దీపాల పండగ ఉన్నోళ్ళ డబ్బంతా దండగ”

ఏరోజు కారోజు కూలీనాలీ చేసుకుని బ్రతికే పేదలు దీపాలు వెలిగించి, అందరూ కలసిమెలసి మాట్లాడుకుంటూ జరుపుకుంటారు. ఇలాంటి పండగలు ధనవంతుల డబ్బు దండగ చేయటానికే వస్తాయి అని వారి భావం. వారు ఎలా సంతోషంగా గడుపుతారో ఇలా చెబుతున్నారు.

మేడల్లో చూడరే మిద్దెల్లో చూడరే రంగు మతాబాల జోరు

పాకల్లో చూడరే పంచల్లో చూడరే సొగసైన దీపాల తీరు

కోట్లు కూడబెట్టినా గొప్ప వెలగబెట్టినా మనకున్న ఈ హాయి మహారాజుకి లేదోయి”

(ఋణానుబంధం 1960 – పి.బి.శ్రీనివాస్, పి.సుశీల – కొసరాజు)

మేడలని మిద్దెలని రంగురంగుల కరెంట్ దీపాల తోరణాలతో అలంకరిస్తారు. అంతకన్నా రంగురంగుల మతాబులు వెలిగిస్తూ పండగ చేసుకుంటారు. కానీ పేదల పూరిపాకల్లో నూనె దీపాలు మాత్రమే వెలిగించి సంబరపడతారు. పేదలందరి ఇళ్ళూ పక్కపక్కనే ఆనుకుని ఉంటాయి. అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఏదైనా అవసరం వస్తే వెంటనే సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల డబ్బు లేకపోయినా ధైర్యంగా, ఆనందంగా జీవిస్తారు. డబ్బున్నవారికి ఎదుటి వాడితో రెండు మాటలు ఎక్కువ మాట్లాడితే హోదా తగ్గిపోతుంది అనుకుంటారు. ఎన్ని కోట్లు కూడబెట్టినా, ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా మనకి ఉన్న ఈ హాయి వాళ్లకి ఉండదు అని ఆ పల్లెలో వారి భావన. ఈ పాటలో అంజలీదేవి, గుమ్మడి బృందం నర్తించారు.

ఇక మధ్య తరగతి వారి గురించి చెప్పాలంటే, జీవితం చీకటి వెలుగులతో కూడినది. కొన్నాళ్ళు కష్టాలు, కొన్నాళ్ళు సుఖాలు ఉంటాయి. అందుకు ప్రతీకే దీపావళి పండగ. అందుకే ఓ ఇంట్లో ఇలా పాడుకుంటున్నారు.

చీకటివెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి, అందాల ప్రమిదల

ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాలవెల్లి”

జీవితం చీకటివెలుగుల మిశ్రమమైనా భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుంది అనే ఆశాభావంతో జీవిస్తారు. అటువంటి ఆశలకి ప్రతీకగా దీపాలను వెలిగిస్తారు.

పండగలకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన కూతుళ్ళు, అల్లుళ్ళని పిలుచుకుంటారు. ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, పెళ్ళికాని అమ్మాయిలు అందరూ హుషారుగా ఉంటారు. ఇదే సమయం అని బావ మరదళ్లతో చిలిపి పరిహాసాలు ఆడతాడు. వారి మాటలు విని తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉంటారు.

అల్లుళ్ళు వవస్తారు అత్తవారిళ్లకు

మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు

బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు

వీధీ వీధీ తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు”

బావ సరసాలకు మరదళ్ళు మర్యాద చేస్తారు. ఎలా! బావ వీపుమీద వీసెడు గుద్దులు గుద్ది! ఆడపిల్లల మెత్తటి చేతులు వీపుమీద పడుతుండే అదీ ఒక వేడుకే! మగవాళ్ళు దాన్ని పరిహాసంగానే తీసుకుంటారు గానీ సీరియస్ అవరు. బావ మాత్రం తక్కువ తిన్నాడా, మరదల్ని ఇలా ఆటపట్టి స్తున్నాడు.

అమ్మాయి పుట్టింది అమాస నాడు

అసలైన గజదొంగ అవుతుంది చూడు

పుట్టినరోజున దొరికాడు తోడు

పున్నమినాటికి అవుతాడు జోడు”

అమావాస్య రోజు పుడితే గజదొంగ అవుతారు అని పరిహాసమాడతారు వెనకటి రోజుల్లో. ఎందుకంటే దొంగతనం చేయాలనుకున్న వాడికి అమావాస్య అనుకూలమైనది. కటికచీకటిలో సులభంగా తప్పించుకుని పారిపోవచ్చు అని. ఈరోజుల్లో పక్కింట్లో ఏం జరుగుతున్నా ఇరుగుపొరుగు వారు పట్టించుకోరు. అందుకని పట్టపగలే దర్జాగా దొంగతనాలు చేసి, తాపీగా వెళ్ళిపోతున్నారు. సరే, మళ్ళీ పాటలోకి వస్తే ఇక్కడ బావగారి ఉద్దేశం అమ్మాయి నిజంగా దొంగతనం చేస్తుందని కాదు, అబ్బాయిల మనసులను దోచేస్తుందని! బావ ఉద్దేశం అర్థం అయి అమ్మాయి కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికే ఇంకో అబ్బాయికి మనసిచ్చేసింది. అందుకని పుట్టినరోజున తోడు దొరికాడు. వచ్చే పున్నమినాటికి తోడు అవుతాడు అని నర్మగర్భంగా చెపుతున్నది.

ఈ మనోహరమైన గీతం ‘విచిత్ర బంధం’ (1972) చిత్రంలో ఘంటసాల, సుశీల ఆలపించిన ఆత్రేయ రచన. ఇందులో బావగా అక్కినేని, మరదళ్ళుగా వాణిశ్రీ, వై.విజయ నటించారు.

ఓ పెళ్ళికాని అమ్మాయి అక్క ఇంటికి వచ్చింది. పుట్టింటివారు ఎవరు వచ్చినా సంతోషమే ఆడవాళ్ళకి. చెల్లెల్ని ఆదరంగా చూసి అందరం ఇక్కడే దీపావళి పండుగ జరుపుకుందాము అన్నది అక్క. అక్క కొడుకుని ఎత్తుకుని ముద్దులాడుతూ ఇలా పాడుతున్నది చెల్లెలు.

ఆడేపాడే పసివాడ ఆడేనోయి నీతోడ

ఆనందం పొంగేనోయి దీపావళి

ఇంటింట వెలుగు దీపాల మెరుగు

ఎనలేని వేడుకరా!”

చెల్లెలిని పెళ్లికూతురు లాగ అలంకరించి చూసుకుని ఆనందిస్తుంది అక్క. అక్క ఇంటిపనులతో సతమతమయ్యేటప్పుడు పిల్లల ఆలనాపాలనా చూస్తుంది చెల్లెలు. ఉమ్మడి కుటుంబాలలో అక్కచెల్లెళ్ళు ఇలా చాలాకాలం పాటు ఆప్యాయతలతో ఉంటారు. ఇక్కడ కూడా పసివాడితో ఆడుతూ పాడుతూ ఆనందిస్తుంది చెల్లెలు. ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంటే చూడటానికి ఎంతో వేడుకగా ఉన్నది అంటున్నది.

చిన్నారి జయమంచు మ్రోగే పటాసు

చిటపటమని పూలు చిమ్మే మతాబు

నీ రూపమే ఇంటి దీపము బాబు

మాలో పెరిగే మమతవు నీవు

మంచనిపించి మము మురిపించిన

మరి వేరె కోరమురా!”

టపాకాయ ‘డాం’ అని అన్నా, అది పిల్లాడిని ఆశీర్వదిస్తున్నట్లుగా జయశబ్దంగానే వినిపిస్తుంది ఆమెకి. మతాబులు చిటపటమని వెలుగురవ్వలు విరజిమ్ముతుంటే అవి బాబు మీద పూలు చల్లుతూఉన్నట్లు ఉన్నదట. మా ఇంటి కంతటికీ దీపంలా వెలుగు నిచ్చేవాడివి నువ్వు. నువ్వు మాకు చేయదగిన ఉపకారం ఏమీ లేదు. పెరిగి పెద్దయి అందరిచేత మంచి అనిపించుకుంటే చాలు. అంతకన్నా మేం కోరుకునేది ఏమీలేదు అని అంటున్నది చెల్లెలు. లేడిపిల్లలా చెంగుచెంగున అటుఇటూ గంతులేస్తుంటే చూసి ఆనందిస్తున్నారు అక్కాబావలు.

ఈ పాట ‘పెళ్ళికానుక’ (1960) చిత్రం కోసం చెరువు ఆంజనేయశాస్త్రి రాసిన గీతం ఇది. పి.సుశీల గానం చేశారు. ఇందులో చెల్లెలిగా బి.సరోజాదేవి, అక్కగా కృష్ణకుమారి, బావగా అక్కినేని నాగేశ్వరరావు, పిల్లాడిగా మాస్టర్ బాబు నటించారు.

ఇంకా పల్లెటూరు, ఇంటింటా దీపావళి వంటి ఎన్నో చిత్రాల్లో దీపావళి వైభవాన్ని తెలియజేసే గీతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం దీపావళి పండగకి నెలరోజుల ముందునుంచే టపాకాయల శబ్దాలు మొదలయ్యేవి. ఇక ఆ రోజు చెప్పనక్కరలేదు. ఊరంతా సందడి, కోలాహలం. ఇప్పుడు పండగరోజు మాత్రమే, అదీ కొద్దిగంటలు మాత్రమే అనుమతిస్తున్నారు టపాకాయలు కాల్చుకోవటానికి. పర్యావరణం దెబ్బ తింటుందట. టపాకాయలు కాలిస్తే పర్యావరణ కాలుష్యం, వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తే పర్యావరణ కాలుష్యం, మైకుల్లో భజనలు చేస్తూ దైవధ్యానం చేసుకుంటే పర్యావరణ కాలుష్యం. ఇలా ఎక్కడికక్కడ నిబంధనలు విధిస్తున్నారు. పర్యావరణం మీద అంత ప్రేమ ఉన్నవారు చెట్లను పెంచి ఏ.సి.ల వాడకం తగ్గించండి! ఏ.సి.లు వాడటం మానేస్తే పర్యావరణాన్ని మూడొంతులు కాపాడినట్లే! అంతేకానీ సంస్కృతీ సాంప్రదాయాలు నిరోధించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఆనందాన్ని నింపుతూ ఐకమత్యాన్ని, సామరస్యాన్ని పెంపొందించే సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవలసిన, కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here