కోయెన్ సోదరుల చిత్రాలు: కలియుగం ఇంతే!

0
11

[dropcap]కో[/dropcap]యెన్ సోదరుల చిత్రాలలో ఒక నిర్వేదం ఉంటుంది. కలియుగంలో స్వార్థం ఎలా వెర్రితలలు వేసిందో చూపిస్తారు. అయితే పోలీసు పాత్రలు మాత్రం నిజాయితీగా ఉంటాయి. తమ పని తాము చేయాలనే ఉద్యోగధర్మం పాటిస్తారు. సోదరులైన జోయెల్ కోయెన్, ఈథన్ కోయెన్ కలిసి రాసిన స్క్రీన్ ప్లేతో జోయెల్ కోయెన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫార్గో’ (1996). సోదరులిద్దరూ స్క్రీన్ ప్లే రాసి కలిసి దర్శకత్వం వహించిన చిత్రం ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’ (2007). ‘ఫార్గో’ నిజజీవిత సంఘటనల ఆధారంగా రాసిన కల్పిత కథ. ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’కు అధారం అదే పేరుతో థామస్ మెకార్తీ రాసిన నవల.

‘ఫార్గో’లో జెర్రీ తన మామగారి కారు షోరూమ్‌లో మేనేజర్‌గా పని చేస్తుంటాడు. సొంతంగా వ్యాపారం చేయాలని అతని కోరిక. మామగారు డబ్బున్నవాడైనా అతన్ని చిన్నచూపు చూస్తాడు. దీంతో జెర్రీ తన భార్యని కిడ్నాప్ చేయించి మామగారి నుంచి డబ్బు రాబట్టాలని పథకం వేస్తాడు. దాని కోసం కార్ల్, గేయర్ అనే కిరాయి కిడ్నాపర్లను సంప్రదిస్తాడు. వారికో కొత్త కారు, నలభై వేల డాలర్లు ఇస్తానని బేరం కుదుర్చుకుంటాడు. కారు ముందే వారికి అప్పగిస్తాడు.

కార్ల్, గేయర్ జెర్రీ భార్యని కిడ్నాప్ చేసి కార్లో తీసుకెళుతుంటారు. కార్ల్ లొడలొడా వాగే రకం. గేయర్ కరడుగట్టినవాడు. ఎక్కువ మాట్లాడడు. రాత్రివేళ జనసంచారం ఎక్కువ లేని ప్రదేశంలో వెళుతుంటారు. జెర్రీ భార్యని నోరు కట్టేసి, తలపై గుడ్డ కట్టేసి కారు వెనక సీట్లో పడుకోబెడతారు. కొత్త కారు తాత్కాలిక రెజిస్ట్రేషన్ నంబరు కారుకి అతికించకపోవటంతో ఒక పోలీసు ఆపుతాడు. కార్ల్ ఆ పోలీసుకి లంచం ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో జెర్రీ భార్య శబ్దం చేయటంతో పోలీసుకి అనుమానం వస్తుంది. గేయర్ ఇక లాభం లేదని రివాల్వర్‌తో పోలీసుని షూట్ చేసి చంపేస్తాడు. కార్ల్ ఆ పోలీసు మృతదేహాన్ని రోడ్డు పక్కకు లాగుతుండగా అప్పుడే అటుగా వచ్చిన కారు లోని దంపతులు చూస్తారు. సాక్షులు ఉంటే ప్రమాదమని భావించి గేయర్ వారిని కారులో వెంబడించి చంపేస్తాడు. కారుకు రెజిస్ట్రేషన్ నంబరు అతికించకపోవటం అనే చిన్న తప్పు వల్ల మూడు ప్రాణాలు పోయాయి. అన్నీ అనుకున్నట్టే జరగవుగా! పైగా ఇప్పుడు పోలీసులు హత్యల విచారణ మొదలుపెడతారు. తీగలాగితే డొంక కదులుతుంది.

ఆ ఊరి పోలీసు అధికారి మార్జ్. ఆమె ఏడు నెలల గర్భవతి. అమెరికా లాంటి దేశాల్లో గర్భవతులు తొమ్మిదో నెల వచ్చేవరకు ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తారు. మార్జ్ భర్త చిత్రకారుడు. వారిది అన్యోన్య దాంపత్యం. మార్జ్‌ది సునిశిత దృష్టి. నేరం జరిగిన చోట మూడు మృతదేహాలను చూసి ఏం జరిగి ఉంటుందో వెంటనే ఊహిస్తుంది. ఆధారాల సహాయంతో తన ఊరి నుంచి సిటీకి వచ్చి జెర్రీ పని చేసే కారు షోరూంకి వస్తుంది. ఎవరైనా కారు దొంగతనం చేశారా అని అడుగుతుంది. లేదని బుకాయిస్తాడు జెర్రీ. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మార్జ్.

తన ఊరికి తిరిగి వెళ్ళే ముందు స్కూల్లో తనతో చదువుకున్న మైక్‌ని ఒక రెస్టారెంట్‌లో కలుస్తుంది మార్జ్. తమతో కలిసి చదువుకున్న లిండా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని, ఆమె క్యాన్సర్‌తో మరణించిందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటాడు మైక్. తర్వాత మార్జ్ ఒక స్నేహితురాలితో మాట్లాడుతుండగా మైక్ చెప్పింది అబద్ధమని, లిండాతో అతని పెళ్ళి జరగలేదని, ఆమె బతికే ఉందని, మైక్ ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. మనుషులని తెలికగా నమ్మేసే మార్జ్‌కి ఇది విస్మయం కలిగిస్తుంది. మైక్ ఎందుకు అబద్ధం ఆడాడు? తనకు ఉద్యోగం లేదు. మార్జ్‌ని కేసు విషయంలో టీవీలో చూసి అతను కొంచెం అసూయపడ్డాడు. గర్భవతి అని కూడా చూడకుండా ఆమెకి దగ్గరవాలనుకున్నాడు. సానుభూతి పొందటానికి కట్టుకథ సృష్టించాడు. మనుషుల స్వభావాలు ఎంత చిత్రంగా ఉంటాయో!

మైక్ విషయంలో తాను తేలికగా మోసపోవటంతో మార్జ్‌కి జెర్రీ నిజమే చెప్పాడా అని అనుమానం వస్తుంది. ఆమె కారు షోరూంకి వెళ్ళి కార్లని లెక్కించి లెక్కచూపమంటుంది. సరే అని ఆమెని కూర్చోబెట్టి బయటకు వచ్చిన జెర్రీ అక్కడి నుంచి పారిపోతాడు. కథ అనేక మలుపులు తిరిగి ఎంతో రక్తపాతం జరుతుంది.

జెర్రీదే తప్పు అని మనకి అనిపించవచ్చు. అయితే అతనేమీ అప్పులు చేసి చిక్కుల్లో పడలేదు. తన కాళ్ళమీద తాను నిలబడదామనుకున్నాడు. మామగారికి అతని మీద నమ్మకం లేదు. కొత్త వ్యాపారం గురించి అల్లుడి ఆలోచన బావుందని అంటాడు కానీ తానే ఆ వ్యాపారం చేస్తానంటాడు. పోనీ జెర్రీకి వ్యాపారానికి డబ్బు ఇచ్చి తాను అజమాయిషీ చేయవచ్చుగా. అలా కూడా చేయడు. జెర్రీకి మామగారి మీద కసి పెరుగుతుంది. అతని నుంచే డబ్బు రాబట్టాలనుకుంటాడు. జెర్రీ ఎంచుకున్న మార్గం తప్పే. బ్యాంక్ నుంచి అప్పు కోసం ప్రయత్నిస్తే ఆలస్యమైనా తన వ్యాపారం తాను చేసుకునేవాడు. కానీ అంత ఓపిక ఎవరికుంది? అన్నీ వెంటవెంటనే జరిగిపోవాలి. మరి అల్లుడికి సాయం చేయని మామగారిది కూడా తప్పే కదా! ఇలాంటివాళ్ళు అందరూ తమ దయాదాక్షిణ్యాల మీద బతకాలని అనుకుంటారు. కలియుగం ఇంతే!

మార్జ్, ఆమె భర్త ఉన్నదానితో సంతృప్తిగా ఉన్నారు. డబ్బుకన్నా ప్రేమే వారికి ప్రధానం. జెర్రీ కూడా సంతృప్తిపడి ఉంటే గొడవ ఉండేది కాదు. భార్యను కిడ్నాప్ చేయించటం దారుణం. అతను చేసిన తప్పు తన వ్యాపారం గురించి మామగారికి చెప్పటం. మామగారిని నమ్మితే ఆయన ద్రోహం చేస్తాడు. ఇక నేరగాళ్ళ గురించి చెప్పుకోనక్కరలేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు.

అమెరికాలో నార్త్ డకోటా రాష్ట్రంలోని ఫార్గో అనే ఊళ్ళో జెర్రీ కిడ్నాపర్లను కలుసుకోవటంతో కథ మొదలవుతుంది. ఆ చుట్టుపక్కలే కథ నడుస్తుంది. చలికాలం. ఎముకలు కొరికే చలి. మంచు కురవటంతో తెల్ల దుప్పటి కప్పినట్టుంటాయి పరిసరాలు. కొన్ని సన్నివేశాల్లో దూరపు షాట్స్ (లాంగ్ షాట్స్) లో చుట్టూ తెల్లని మంచులో ఒక్క మనిషే ఉండటం చూపిస్తారు. లోకం నిర్లిప్తంగా ఉంటుందని, స్వార్థపరులందరూ ఒంటరివాళ్ళేనని సూచన కనిపిస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయి. ఒకరికొకరు తోడున్నవారే కొంచెం ప్రశాంతంగా ఉండగలరు. శ్రీశ్రీ అన్నట్టు “తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.”

తెల్లని మంచులోనూ, చీకట్లోనూ ఛాయాగ్రాహకుడు రోజర్ డీకిన్స్ తీసిన షాట్స్ అబ్బురపరుస్తాయి. కిడ్నాప్, హత్యలు జరిగినపుడు సంగీతం లేకపోయినా తర్వాత వచ్చే సంగీతం విషాదాన్ని సూచిస్తూ రోదిస్తున్నట్టు ఉంటుంది. రోడెరిక్ జేన్స్ పేరుతో కోయెన్ సోదరులు తమ చిత్రాలకు తామే ఎడిటింగ్ చేస్తారు. ముందేం జరగబోతోంది అనే ఉత్కంఠతో పాటు ప్రేక్షకులకు జరిగిన సంఘటనల గురించి ఆలోచించే అవకాశం ఇస్తూ ఎడిటింగ్ చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి (మార్జ్ గా నటించిన ఫ్రాన్సెస్ మెక్ డార్మండ్), ఉత్తమ సహాయనటుడు (జెర్రీగా నటించిన విలియమ్ మేసీ), ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి అవార్డులు దక్కాయి.

చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కింద చదవండి. లేదంటే చుక్కలు వచ్చేదాకా వదిలేసి ఆ కింద చదవండి.

జెర్రీకి కిడ్నాపర్లను పరిచయం చేసిన వ్యక్తి కారు షోరూం లోనే పనిచేస్తుంటాడు. అతనూ నేరచరిత్ర కలవాడే. కిడ్నాపర్లు కొత్త కార్లో కిడ్నాప్ చేయటానికి వెళుతూ ఒక హోటల్లో ఆగి అతనికి ఫోన్ చేసినట్టు మార్జ్ విచారణలో తెలుస్తుంది. ఆమె మొదట అతన్నే విచారిస్తుంది. తర్వాత అతను కసితో కార్ల్ మీద దాడి చేస్తాడు. కార్ల్ అక్కసుతో సిటీకి వచ్చి జెర్రీని నలభై వేలకి బదులు ఎనభై వేలు కావాలని బెదిరిస్తాడు. జెర్రీ మామగారితో కిడ్నాపర్లు పది లక్షల డాలర్లు అడిగారని అబద్ధం చెబుతాడు. జెర్రీ వద్దంటున్నా నేనే డబ్బు ఇస్తానని బయలుదేరుతాడు మామగారు. కార్ల్‌ని కలిసి నా కూతుర్ని చూపిస్తేనే డబ్బు ఇస్తానని అంటాడు. కార్ల్ కోపంతో అతన్ని షూట్ చేసి చంపేసి, డబ్బు పట్టుకుని పారిపోతాడు. తర్వాత చూసుకుంటే ఎనభై వేల డాలర్ల బదులు పదిలక్షల డాలర్లు ఉండటంతో దురాశతో మిగతా డబ్బుని పాతిపెట్టి గేయర్ దగ్గరకు వెళతాడు. జెర్రీ భార్య అరుస్తోందని అప్పటికే ఆమెను చంపేస్తాడు గేయర్. అనుకున్నదంతా తారుమారు కావటంతో తెగతెంపులు చేసుకుని నీ నలభై వేలు తీసుకో అని కార్ల్ కార్లో బయలుదేరబోతే కారు ఖరీదులో సగం ఇమ్మని అడుగుతాడు గేయర్. అందుకు నిరాకరించి గేయర్‌ని బూతులు తిడతాడు కార్ల్. దాంతో గేయర్ గొడ్డలితో కార్ల్‌పై దాడి చేసి చంపేస్తాడు. జెర్రీ పారిపోవటంతో తన ఊరికి బయలుదేరిన మార్జ్ కాసేపటికి అటే వెళుతూ ఆ ఇంటి బయట ఉన్న కారుని గుర్తుపడుతుంది. ఇంటి వెనకకు వెళ్ళి చూస్తే గేయర్ కార్ల్ మృతదేహాన్ని కట్టెలను ముక్కలు చేసే మెషీన్లో వేయటం కనిపిస్తుంది. మార్జ్‌ని చూసి పారిపోతుంటే ఆమె గేయర్‌ని కాలి మీద షూట్ చేసి అరెస్ట్ చేస్తుంది. జెర్రీ ఒక హోటల్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తారు.

కార్ల్ పాతిపెట్టిన పెద్దమొత్తం జాడ ఎవరికీ తెలియకుండా ఉండిపోతుంది. తన దగ్గర పెద్ద మొత్తం ఉంది కదా అని కారుని వదిలేయవచ్చు కదా! అలా వదిలేసి ఉంటే ప్ర్రాణం దక్కేది. జెర్రీ మామగారు మొండి పట్టుదలకు పోకుండా జెర్రీతో డబ్బు పంపించి ఉంటే ఆయన ప్రాణం దక్కేది. చివరికి మార్జ్ గేయర్‌ని అరెస్ట్ చేసి తీసుకువెళుతూ “కొంచెం డబ్బు కోసం ఇన్ని దారుణాలు చేయాలా? నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. చూశావా ఇప్పుడేం జరిగిందో! అరెస్టయ్యి ఇక్కడ కూర్చున్నావు. బయట చూస్తే అందమైన రోజు” అంటుంది. అంటే స్వేచ్ఛగా బయట ఉండాల్సినవారు ధనాశతో స్వేచ్ఛను కోల్పోతున్నారని ఆమె బాధ.

***

‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’ 1980లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన కథ. టెక్సాస్ మెక్సికో దేశానికి సరహద్దు రాష్ట్రం. మెక్సికో నుంచి డ్రగ్స్ ప్రవేశిస్తుంటాయి. చిత్రం మొదట్లో ఎడ్ అనే వయసు మళ్ళిన పోలీసు అధికారి మాటలు వినపడతాయి. నేర ప్రవృత్తి ఎంతగా పెరిగిపోయిందో వివరిస్తూ అతను నిర్వేదంగా మాట్లాడతాడు. ఉద్యోగం మానేయాలని అనుకుంటాడు. అతని భార్య అతన్ని అర్థం చేసుకుంటుందని తర్వాత మనకు తెలుస్తుంది.

ఆంటాన్ అనే కిరాయి హంతకుడు తనని అరెస్ట్ చేసిన ఒక పోలీసుని చంపేసి పోలీసు వాహనంలో తప్పించుకుంటాడు. అతని దగ్గర ఒక సిలిండర్ ఉంటుంది. దాని గొట్టం చివర ఉన్న ట్రిగ్గర్ నొక్కినపుడు ఒక గుండు బయటకి వేగంగా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి పోతుంది. తప్పించుకున్న అతను దారిలో ఒక కారుని ఆపి ఆ కారు డ్రైవర్ నుదుటి మీద ట్రిగ్గర్ నొక్కుతాడు. అతను చనిపోతాడు కానీ తలలో గుండు ఉండదు. ఇదో కొత్త తరహా ఆయుధం. ఆ కారు దొంగిలించి అందులో వెళ్ళిపోతాడు. అతనొక సైకో హంతకుడు. ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర్ ఆగినపుడు ఆ స్టేషన్ యజమాని అతనితో డాలస్ నుంచి వచ్చినట్టున్నావు అంటాడు. నేనెక్కడి నుంచి వస్తే నీకెందుకు అంటాడు ఆంటాన్. అలాంటి హంతకులకి తమ గురించి ఇతరులు గమనించటం ఇష్టం ఉండదు. మాటల్లో ఆ స్టేషన్… యజమాని మామగారిదని తెలుస్తుంది. పెళ్ళాం ఆస్తి తింటున్నావా అంటాడు ఆంటాన్. యజమాని బిక్కచచ్చిపోతాడు. చివరికి ఆంటాన్ ఒక నాణెం తీసి బొమ్మా బొరుసా చెప్పమంటాడు. అతను చెప్పింది తప్పయితే అతన్ని చంపేయాలనే ఉద్దేశం ఆంటాన్‌ది. యజమాని బొమ్మ అంటాడు. బొమ్మే పడుతుంది. బతికిపోతాడు. లోకంలో కొన్ని పద్ధతులు అందరూ పాటించాలని, అలా పాటించని వారు తనకి ఎదురైతే చంపేయాలనే వింత మనస్తత్వం ఆంటాన్‌ది. అయితే ఇక్కడ తప్పు చిన్నది కాబట్టి బొమ్మా బొరుసా అని అడిగి దాని ప్రకారమే నడుచుకుంటాడు. అంటే నీ అదృష్టానికే వదిలేస్తున్నాను, నా తప్పు ఏమీ లేదని అతని వింత తర్కం.

లువెలిన్ వియత్నాం యుద్ధంలో సైనికుడిగా పని చేసినవాడు. ప్రస్తుతం జింకల వేటగాడు. ఒకరోజు ఒక ఎడారి లాంటి ప్రదేశంలో కొన్ని కార్లు, మృతదేహాలు ఉండటం చూస్తాడు. అమెరికన్లు మెక్సికన్ల దగ్గర డ్రగ్స్ కొంటూ ఉండగా వివాదం వచ్చి కాల్పులు జరిగాయి. ఒక కారులో ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉంటాడు. మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. లువెలిన్ దగ్గర నీళ్ళు ఉండవు. కారు వెనకాల కిలోల కొద్దీ డ్రగ్స్ ఉంటాయి. కొద్ది దూరంలో ఓ చెట్టు కింద ఇంకో మనిషి చనిపోయి ఉంటాడు. అతని దగ్గర ఉన్న పెట్టెలో డబ్బు కట్టలు ఉంటాయి. లువెలిన్ డబ్బు తీసుకుని వచ్చేస్తాడు. కానీ కొన ఊపిరితో ఉన్న మనిషి కోసం రాత్రివేళ నీళ్ళు తీసుకుని మళ్ళీ వెళతాడు. అక్కడికి కొంతమంది వచ్చి అతనిపై కాల్పులు జరుపుతారు. తప్పించుకుని పారిపోతాడు. తన భార్యని పుట్టింటికి పంపించి డబ్బు తీసుకుని ఊరు వదిలి వెళతాడు.

ఆంటాన్‌ని రప్పించి డబ్బు స్వాధీనపరుచుకోమని చెబుతారు అమెరికన్లు. ఆంటాన్‌కి ఒక రిసీవర్ ఇస్తారు. డబ్బు పెట్టెలో ఒక సిగ్నల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ సిగ్నల్‌ని ఈ రిసీవర్ గుర్తిస్తుంది. ఒక పావు కిలోమీటరు వరకు అది పనిచేస్తుంది. ఆ ట్రాన్స్మిటర్ సంగతి లువెలిన్‌కి తెలియదు. అతను పక్క ఊరిలో ఒక మోటెల్ (రహదారి పక్కన బస)లో గది తీసుకుని ఉంటాడు. డబ్బు పెట్టెని పైన ఉన్న ఏసీ పైపులో దాస్తాడు. ఆంటాన్ నేర స్థలం దగ్గర లువెలిన్‌కి చెందిన కారు సహాయంతో అతని ఇంటిని గుర్తించి అక్కడికి వెళతాడు. సిలిండర్ గుండుతో తాళాన్ని పేల్చి లోపలికి వెళతాడు. అక్కడున్న ఫోన్ బిల్లులో పక్క ఊరి నంబర్లు కనపడతాయి. అతను అక్కడికి బయల్దేరతాడు. పోలీసు అధికారి ఎడ్ కూడా లువెలిన్ ఇంటికి వస్తాడు. తాళం పేలి ఉండటం చూస్తాడు. లువెలిన్ ప్రమాదంలో ఉన్నాడని అతనికి అర్థమౌతుంది. అయితే అతను ఎక్కడికి వెళ్ళాడో గ్రహించలేడు. ఇక పిల్లి ఎలుకల చెలగాటం మొదలవుతుంది.

తనది కాని డబ్బుని లువెలిన్ ఎందుకు తీసుకోవాలి? పోలీసులని సమాచారమిస్తే వాళ్ళు చూసుకుంటారు కదా? అది దొంగ సొమ్మే కాబట్టి తీసుకున్నా తప్పు లేదని అనుకున్నాడు. అప్పనంగా వచ్చిన డబ్బుని ఎందుకు వదులుకోవాలి అనుకున్నాడు. సైనికుడిగా పనిచేసిన తనకి ప్రభుత్వం ఏమీ చేయలేదు. అందుకని తన శక్తియుక్తులతో డబ్బుని దక్కించుకోవటంలో తప్పు లేదని అనుకున్నాడు. కలియుగం ఇంతే!

అమెరికన్లు డబ్బు పెట్టెలో ట్రాన్స్మిటర్ ఎందుకు పెట్టారు? ముందు జాగ్రత్త కోసం పెట్టారని అనుకోవాలి. ఒకవేళ డ్రగ్స్ ఇవ్వకుండా మెక్సికన్లు డబ్బు తీసుకుని పారిపోతే దాన్ని ట్రాక్ చేయటానికి పెట్టారు. అలా కాక డ్రగ్స్ కొన్నాక డబ్బుని తిరిగి దక్కించుకోవాలని కూడా అనుకుని ఉండవచ్చు. ఆంటాన్ పద్ధతులు పాటించే మనిషి కాబట్టి అతనికి ముందు కారణమే చెప్పి ఉంటారు. లువెలిన్ తనది కాని డబ్బు తీసుకునిపోయాడు కాబట్టి అతన్ని వేటాడుతూ బయలుదేరుతాడు. ఆ డబ్బు డ్రగ్స్ కొనటానికి తెచ్చిన డబ్బు కదా అంటే ఏమంటాడు? అదో వ్యాపారమంతే, దానిలో తప్పేం లేదంటాడు.

ఎడ్‌కి ఈ నేరాలన్నీ చూసి మతిపోతుంది. ఇలాంటి నేరగాళ్ళని పట్టుకోవటానికి నా సామర్థ్యం సరిపోదు అనుకుంటాడు. ఒక సందర్భంలో తన బంధువుతో మాట్లాడుతూ “వయసు పెరిగిన తర్వాత నాకు దేవుడితో పరిచయం కలుగుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆయన తప్పేమీ లేదు. నాలాంటి వాడి మీద ఆయనకెందుకు కరుణ కలుగుతుంది?” అంటాడు. తాను అసమర్థుడనని బాధపడతాడు. ఆ బంధువు కూడా పోలీసు ఉద్యోగం చేసినవాడే, ఎన్నో నేరాలు చూసినవాడే. ఆయన “ఈ లోకమే అంత. అధర్మం, అన్యాయం ఎప్పుడూ ఉన్నవే. జరగాల్సింది జరుగుతుంది. నీ కోసం ఏదీ ఆగదు” అంటాడు. కలియుగం ఇంతే అనే నిర్వేదం ధ్వనిస్తుంది. చిత్రం పేరు అనువాదం ‘ఇక్కడ పెద్దలకు చోటు లేదు’ అని చెప్పుకోవచ్చు. అంటే కొత్త తరాలు పాత తరాలను పక్కకు నెట్టి కొత్త పోకడలు పోతుంటాయి. మంచి చెప్పినా వినరు.

‘ఫార్గో’లో మంచు పరచిన విశాల ప్రదేశాలుంటే ఈ చిత్రంలో ఎడారి లాంటి ప్రదేశాలుంటాయి. రోజెర్ డీకిన్స్ ఈ చిత్రానికి కూడా ఛాయాగ్రాహకుడు. ఆ ప్రదేశాలు ఎంత విశాలంగా ఉంటాయో మనకి అవగాహన కలుగుతుంది. సంభాషణలు ఎక్కువ ఉండని ఈ చిత్రంలో ఎడిటింగ్ కీలకం. కోయెన్ సోదరులు అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. నేపథ్య సంగీతం అసలు ఉండదు. ‘ఫార్గో’లో విషాద సంగీతం ఉంటే ఈ చిత్రంలో సంగీతం కూడా మూగబోయేంత నిర్వేదం ఉంటుంది. ఆస్కార్లలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సహాయ నటుడు (ఆంటాన్ గా నటించిన హావియెర్ బార్దెమ్), ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి. మొదటి నాలుగు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. హావియెర్ బార్దెమ్ పోషించిన ఆంటాన్ పాత్ర ఈ శతాబ్దపు అత్యంత భయంకరమైన విలన్లలో ఒకరిగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కింద చదవండి. లేదంటే చుక్కలు వచ్చేదాకా వదిలేసి ఆ కింద చదవండి.

అమెరికన్ల బాసు మెక్సికన్లకు కూడా రిసీవర్ ఇచ్చి డబ్బుని వెతకమంటాడు. ఒకరు కాకపోతే ఒకరైనా పట్టుకుంటారని. మెక్సికన్లు ఆంటాన్ కంటే ముందే లువెలిన్ జాడ కనుగొని అతని గదిలో మాటువేస్తారు. లువెలిన్‌కి అనుమానం వచ్చి మోటెల్లో తన గదికి వెనక గది కూడా తీసుకుని ఆ గదిలోకి వెళతాడు. రెండు గదులకి ఏసీ పైపు ఒకటే కావటంతో పైపులోనుంచి నుంచి డబ్బు తీసుకుని పారిపోతాడు. రిసీవర్ సాయంతో అక్కడికి చేరుకున్న ఆంటాన్ మెక్సికన్లని చంపి లువెలిన్ వెళ్ళిన ఊరి వైపు వెళతాడు. అక్కడ ఇద్దరూ ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకుంటారు. ఇద్దరూ గాయపడతారు కానీ లువెలిన్ పారిపోతాడు. కథ మలుపులు తిరిగి ఫోన్లో ఆంటాన్ లువెలిన్‌ని డబ్బు ఇవ్వమని, లేకపోతే అతని భార్యని చంపేస్తానని అంటాడు. లువెలిన్ వినడు.

మెక్సికన్లకు రిసీవర్ ఇచ్చిన అమెరికన్ల బాసుని ఆంటాన్ చంపేస్తాడు. తనకిచ్చిన పని ఇతరులకి కూడా ఇవ్వటం పద్ధతి కాదని అంటాడు. ఎడ్ లువెలిన్ భార్యని కలిసి అతనెక్కడున్నాడో తెలిస్తే చెప్పమని, అతన్ని కాపాడతానని అంటాడు. లువెలిన్ తన భార్యని, అత్తగారిని ఒక చోట కలుసుకోమని ఫోన్ చేస్తాడు. ఆమె ఎడ్‌కి చెబుతుంది. లువెలిన్ అత్తగారి ద్వారా సమాచారం తెలుసుకున్న మెక్సికన్లు ఎడ్ చేరేలోగానే లువెలిన్‌ని చంపేస్తారు. డబ్బు మాత్రం వారికి దొరకదు. ఆంటాన్ తర్వాత డబ్బుని తీసుకుపోతాడు.

ఆంటాన్ లువెలిన్ భార్య ఉన్న ఇంటికి వెళ్ళి నీ భర్తకు మాట ఇచ్చాను కాబట్టి నిన్ను చంపేస్తాను అంటాడు. నాణెం తీసి బొమ్మా బొరుసా చెప్పమంటాడు. ఆమె నిరాకరిస్తుంది. ఆమెని చంపి బయలుదేరుతాడు. అతని కారుకు యాక్సిడెంట్ జరుగుతుంది. చేయి విరుగుతుంది. అక్కడకు పోలీసులు రాకముందే నడిచి వెళ్ళిపోతాడు. ఎడ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు.

లువెలిన్‌ని కాపాడలేకపోయానని ఎడ్ తాను అసమర్థుడినని అనుకుంటాడు. తన బాధ్యత నిర్వర్తించలేకపోయినందుకు దేవుడు కూడా తనని క్షమించడని బాధపడతాడు. కానీ అతను తన శాయశక్తులా తన ప్రయత్నం చేశాడు. కాబట్టి అతని అపరాధమేమీ లేదు. ఆంటాన్ డబ్బు దొరికిన తర్వాత కూడా లువెలిన్ భార్యని ఎందుకు చంపాడు? లువెలిన్ డబ్బు ఇవ్వకపోతే అతని భార్యని చంపేస్తానని బెదిరించినా అతను వినలేదు. అందుకని పద్ధతి ప్రకారం అతని భార్యని చంపాల్సిందే అని ఆంటాన్ నమ్మకం. అయినా ఆమెకి బొమ్మా బొరుసా అని ఒక అవకాశం ఇచ్చానని, మిగతాది ఆమె ప్ర్రాప్తమని అతని వాదన. ఆంటాన్‌కి యాక్సిడెంట్ అవటం అతనికి పడిన శిక్షే అని అనుకోవచ్చు. జీవులని దేవుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది. అధర్మానికి పాల్పడకుండా ఉండటం కష్టం. కానీ ధర్మాన్ని పాటిస్తే ఎడ్‌లా కొంతలో కొంత ఉపశమనంగా ఉంటుంది. ఇంతకీ డబ్బేమైంది? ఆంటాన్ పెద్ద బాసులకి ఇచ్చేశాడని అనుకోవాలి. సినిమాలో ఇది చూపించకపోయినా నవలలో ఉంది. తాను చేసే పనిలో ధర్మాన్ని పాటిస్తాడతను. ఆ చేసే పని సరైనదేనా అంటే అతని దృష్టిలో సరైనదే.

***

ఈ సినిమాలలో నిరాశావాదం కనిపించినా పెడదారులు తొక్కకుండా ఉంటే, దురాశకు పోకుండా ఉంటే కలియుగంలో కూడా జీవితాన్ని నెట్టుకురావచ్చు అనే సందేశం ఉంది. దానికి ఈ సినిమాలలోని పోలీసు పాత్రలే నిదర్శనాలు. వారికి వారిని అర్థం చేసుకునే జీవిత భాగస్వాములుండటం వారి అదృష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here