కాలనీ కబుర్లు – 2

0
9

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]మా[/dropcap] గ్రూపులో రాజా రవివర్మ అనే ఇంజనీరు ఉన్నాడు, అతనిది తూ.గో.జిల్లా. బంగారం పండే మాగాణి ఉంది. అటు అత్తవారు కూడా బాగా బలిసిన వాళ్లే. ఖర్చుకు వెనకాడడు… “బిల్లు కితనా హువా సేటు సాబ్..” అని పర్సు తీసాడు.

అంతలో గరుడపక్షిలా వచ్చి వాలాడు లక్కీ. “సారీ అంకుల్స్.. రేపటి పిక్కినిక్ కోసం అరేంజమెంట్సు ఎంత వరకు అయ్యాయో చూసి వస్తున్నాను. కాస్త ఆలస్యమయింది. క్షమించండి” అపాలజీ చెప్తూ అటు తిరిగి “సర్దార్జీ.. బిల్ మేరా అక్కౌంటు మే జమా కర్నా..” అని చెప్పి మమ్మల్ని హోటలుకి తీసుకు వెళ్లాడు.

ఇక్కడ బాలచంద్రన్ గురించి చెప్పాలి. ఏభయి ఏళ్ల క్రితం ట్రెయినెక్కి కేరళ నుండి ఈ ఊరికి వచ్చాడతను. భాష రాదు. మలయాళీ భాష తప్ప మరేమీ రాదు. బస్టాండు దగ్గర నాయరు హోటలుంది. ప్రపంచంలో మలయాళీలకున్న జాత్యభిమానం మరెవరకూ ఉండదనిపిస్తోంది. సర్వరుగా చేరి టైపు, షార్టుహ్యాండు నేర్చుకున్నాడు. రోజుకు రూపాయిన్నర కూలీ మీద విద్యుత్తు శాఖలో చేరాడు. అతని తెలివితేటలు, కష్టపడేతత్త్వం ఆఫీసరుకు నచ్చి వైటు కాలరు జాబ్ ఇచ్చారు. ముందుగా గుమస్తా అయి అంచెలంచెలుగా ఎదిగి బడాబాబయి ఇక్కడే రిటరయి పోయాడు. ఇల్లు కట్టుకొని కొడుకులిద్దరి చేత ఎలక్ట్రిక్ షాపు బెట్టించి చిన్నా చితకా కాంట్రాక్టు పనులు సంపాదించి మంచి గుత్తేదారుగా పేరు తెచ్చుకున్నాడు బాలబాబు.

తెల్లవారింది. క్రిస్మస్ డే. టి.వి.ఆన్ చేయగానే ఏసుప్రభువు మీద గీతాలు విన్పడ్డాయి. మాకందరికి మరియమ్మ గుర్తుకు వచ్చింది. ఆవిడ అసలు పేరు మేరీ. తిరుగుబోతు భర్త తన్ని తగలేస్తే చంకన కొడుకుని, వయసుడిగి పోయిన తల్లిని వెంటబెట్టుకొని రావిగుడ వచ్చిందామె. ఎలక్ట్రిక్ కాలనీకి దగ్గరలో మినీ పేపరు మిల్లు ఉండేది, అందులో తొంభయి తొమ్మిది శాతం కార్మికులు,

ఉద్యోగస్ధులు తెలుగువాళ్లే. అనాథగా వచ్చి చేరిన మేరీని అక్కున చేర్చుకున్నారు ఆమె బంధువులు. ఆంధ్రామెట్రిక్ పాసయిందామె. అప్పట్లో ఎలక్ట్రిక్ డిపార్టుమెంటు హెడ్డుగా పాల్ దొరగారుండేవారు. మేడం పాల్ రాజమండ్రి పిల్ల. ఆమె భాష, యాస, తిండి, తిప్పలు నూటికి నూరుపాళ్లు తెలుగు. ఇంటినిండా నౌకరులు ఉండేవారు. ఊసు పోయేది కాదామెకి. ఆమె బలహీనత కనిపెట్టి మతగ్రంథాలు, పత్రికలు, పేపర్లు సరఫరా చేసి ఆవిడ ప్రాఫు సంపాదించింది మేరీ. తన దీనగాథ సినిమా కథలా చెప్పి తన పిల్లాడిని, తల్లిని ఆమె కాళ్ల వద్ద పడేసింది మేరీ. రక్షించినా, శిక్షించినా నీవేనంటూ పరలోకంలో ఉన్న ప్రభువు ఆదేశించాడని గిమ్మిక్ చేసింది. నెల తిరక్కుండానే మేరీ డిస్పాచరు సీటులో కుదురుకుంది. కొడుక్కి ఆశీర్వాదం అని నామకరణం చేసి పార్టీ ఇచ్చింది. అది మేడం పాల్ తండ్రి పేరు. ఇక్కడ తమాషా అయిన విషయం ఒకటి చెప్పాలి. పాల్ మేడం తెలుగు పుస్తకాలు తెగ చదివి రచయిత్రి అయిపోవడానికి నిశ్చయించుకొంది. కాగితాలు ఖరాబు చేసి ఆంధ్రదేశంలోని అన్ని పత్రికలకు పంపేది. ఆమె రచనల్లోని రసరమ్యత ఆస్వాదించలేని సంపాదకులు వాటిని తిరిగి పంపిస్తుండేవారు. అయినా విసుగు చెందని ఆడ విక్రమార్కలాగ కథలు గుప్పిస్తుండేది పాల్ సతీమణి. వీశెల కొద్దీ బరువుండే కాగితాల్ని తిరుగు టపాలో వస్తే అవి ఇంతంత దూరం మోయలేక పోస్టుమ్యాన్లు బదిలీ చేయించుకొని పోయేవారని గిట్టనివాళ్లు చెప్పుకొనేవారు. నవ్విన నాప చేను పండును. తర్వాతర్వాత రోజుల్లో ఆమె ప్రసిద్ధ రచయిత్రి కావడం, ఆమె నవల్లు వెండితెరకు ఎక్కడం జరిగింది. ఆలోచనలతో మునిగి తేలుతున్న నాకు.. “ఏమిటి ఇంకా కూచుని కునుకుపాట్లు పడుతున్నారా.. బస్సులు వచ్చి రడీగా ఉన్నాయి. లేవండీ మహాశయా..” తొందర చేసింది హైకమాండు.

నోరు మెదపకుండా నిమిషాల్లో తయారయి రిసెప్షను దగ్గరకు వెళ్లేసరికి కోలాహలంగా ఉంది. గతంలో నాతో పని చేసిన సహోద్యుగులు కలిసారు. ఆప్యాయంగా ఒకరినొకరం కౌగలించుకున్నాం. రెండు బస్సుల్లో పెళ్లివారిలా తరలివెళ్లాం. ఊరికి ఉత్తరాన ఉంది పిక్నిక్ స్పాటు. మమ్మల్ని దింపి బస్సులు వెళ్లిపోయాయి. పచ్చని చెట్లు, వాటి మీద పాకిన లతలు.. పూలు, కాయలతో కన్నుల పండుగ చేస్తున్నాయి. ఒక కవి మిత్రడు రాసిన పంక్తులు గుర్తుకు వచ్చి మనసులోనే మననం చేసుకొన్నాను…. “జీతం కోరని కూలియై మానవాళికి జీవితాంతం ఊడిగం చేస్తునే ఉంటుంది… చిన్నప్పటి మొక్క బాల్యంలో నా అక్కలాంటిది. పెద్దయ్యాక చెట్టు అవిశ్రాంత నా తల్లి లాంటిది”.

రాళ్లను ఒరుసుకుంటూ పారుతోంది ఏరు. తెల్లని నురగ నీళ్లలో తేలిపోతుంది. పిల్లల సరదా చూడాలి. పరుగెత్తుకొంటూ వెళ్లి నీళ్లలో కాళ్లు, చేతులుతో తపతప కొడుతూ ఆడుకొంటున్నారు. నిజానికి మేం ఇంత దూరం వచ్చింది వాళ్ల ఆనందం కోసమే, అంతలో దూతల్లా వచ్చి పెడరెక్కలు విరిచి పట్టుకువెళుతున్నారు వాళ్ల తల్లులు. వాళ్లెకక్కడ జారి పడతారని ఆందోళన.

ఏటి ఒడ్డున ఇసుకలో షామియానా కట్టి ఉంది. రెండడుగుల ఎత్తున స్టేజీ కూడా ఉంది. ప్లాస్టిక్ చెయిర్లలో ఆసీనులయ్యామో లేదో పేపరు ప్లేట్సులో గోబీ పకోడా, మసాలా ఉప్మా వచ్చింది. చెప్పొద్దు బకాసురుడి బాబులయిపోయాం. చెట్నీ వెయ్యడం మరిసిపోనాం అని స్టీలు బకెట్‌తో తెచ్చి వెయ్యడం, దానిని ఖర్చు చేయడానికి ఉప్మా మారు వడ్డించుకోవడం, టొమాటో సాస్‌తో పకోడా లాగించడం.. అబ్బో అత్తారింట కూడా అంత మర్యాదలు జరగవు సుమండీ. ఈ రుచి ఇంట్లో ఇల్లాలు చేస్తే రాదేమిటీ అన్న సందేహం వచ్చి మా ఆవిడ కోసం చూసాను. మహిళా మండలిలో అధ్యక్షరాలి ఆస్ధానంలో ఉందామె. అప్పుడు ఆవిడ్ని అడిగి చీవాట్లు తినేకన్నా పకోడా తినడం మేలని నా ఆలోచన్లని వాయిదా వేసుకొన్నాను.

కారు వచ్చిన శబ్దం విన్పించింది. అప్పుడు వచ్చారు బాలచంద్రన్ బలగం. కోడళ్లిద్దరు, కేరళ నుండి వచ్చిన తమ్ముడు, అతని భార్యా పిల్లలు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందడికి మూల విరాట్ బాలబావ. అతని కధ చెప్పకపోతే క్షమార్హుడిని కాను. కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత అధిక శాతం. కాని ఉద్యోగాలు లేవు. బాలబాబు తమ్ముడిని తనున్న ఊరికి రప్పించి తన పలుకబడితో మా డిపార్టుమెంటులో టెంపరరీ పోస్టులో చేర్పించాడు. జయచంద్రన్ చురుకైన కుర్రాడు. తన నేర్పుతో అంచెలంచెలుగా ఎదిగి స్టెనో అయి అక్కడే రిటైర్మెంటు అయ్యేవరకు పని చేసాడు. అన్నదమ్ములిద్దరికీ మరో పేరు రామలక్ష్మణులని. స్వంత ఊరికి వెళ్లి వచ్చినప్పుడల్లా అరటి, పనసతో చేసిన చిప్సు తెచ్చి ఇచ్చేవారు. రాష్ట్రేతర ప్రాంతాల్లో పనిచేస్తున్న మలయాళీలు స్వస్ధలానికి వెళ్తే చుట్టుపక్కల వాళ్లు వచ్చి పై రాష్ట్రంలోని విశేషాలు చెప్పమని కుతూహలం చూపేవారట. తనెప్పుడు అలా ఉద్యోగం కోసం ఊళ్లకి వెళ్లి జన్మభూమికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఊరు, మనుషులు, ఆచార వ్యవహారాలు ఉత్కంఠ రేపేలా కథలు కథలుగా వర్ణించి చెపుదామని ఉబలాటంగా ఉండేది జయచంద్రన్‌కి. ఒక ఏడాది దశరా శలవుల్లో స్వగ్రామం వెళ్తే ఒక్క మనిషి కాదు కదా పిల్లాపిచిక కూడా రాలేదట. ఏమిటీ అని ఆరా తీస్తే ఊరు ఊరంతా గల్ఫ్ నుండి వచ్చిన అమ్మకుట్టీలను కలవడానికి లైను కడుతున్నారట. నర్సులు, సేల్సు గర్ల్స్‌గా పని చేస్తున్న కేరలైట్సు చమురుబావులకు స్వంతదారులన్నట్లు పోజు కొట్టేవారట. ఇలాంటి కబుర్లు చెప్పి మమ్మల్ని ఆకట్టుకొనేవాడు జయబాబు.

(తదుపరి సంచికలో మళ్ళీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here