కాలనీ కబుర్లు – 6

0
12

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]హం[/dropcap]టరు హనుమంతప్ప బ్రతికే ఉన్నాడా అన్న నా ప్రశ్నకు లేడు అన్నట్లు తలూపాడు. ఆ రోజుల్లో రావిగుడ దగ్గర ఉన్న అడవిలో లేళ్లు, దుప్పులు, కనుజులు, అడవి పందులు తెగ ఉండేవి. ఇక కుందేళ్లు, అడవికోళ్లు, నెమళ్లకు లెక్కే లేదు. వేట కోసం వెళ్లిన వాడు ఉత్త చేతులతో ఎప్పుడూ తిరిగిరాడు.

ఆ రోజుల్లో ఆఫీసులో పనిచేసే రాంబాబు ఘటికుడు. ఉద్యోగంతో పాటు బిజినెస్సు కూడా ఉండేది అతగాడికి. తనపై ఆఫీసర్లను గుప్పిట్లో ఉంచుకొనేందుకు కొన్ని తంత్రాలు ఉండేవి. కొత్తగా చేరిన అతని బాస్ చాలా జాగ్రత్తయిన మనిషి. ఇండెంటుపై సంతకం చేయాల్సి వస్తే క్షుణ్ణంగా పరిశీలించి గాని సైన్ చేసేవాడు కాదు. అది రాంబాబుకు ఇబ్బంది కలిగించే విషయం. స్టోర్సులో సిమెంటు, రాడ్స్, ఇనుప పైపులు, పెయింట్సు దండిగా ఉండేవి. రాత్రిపూట వాటికి కాళ్ళొచ్చి రాంబాబు షాపులో ప్రత్యక్షమయ్యేవి. కాని ఈ అధికారి రాకతో ఆ లావాదేవీలు ఆగిపోయాయి.

రాత్రిపూట ట్రక్కులు ఖాళీగా పడి ఉండేవి. మందు పోయిస్తానంటే చాలు డ్రయివర్లకు ఎక్కడ లేని హుషారు. తనకు అనుంగు చెలికాడు హనుమంతప్పని పిలిచి విషయం చెప్పాడు రాంబాబు. హనుమంతప్ప తిరుగులేని వేటగాడు. లైసెన్సు లేని డబుల్ బార్ గన్ ఉండేది అతనికి. వేటకు వెళదాం, వేడుక చేద్దాం అని బాస్‌ని ప్రలోభబెట్టాడు రాంబాబు. వేట అన్న రెండు అక్షరాల మాట వింటే వెర్రి వెంగళప్ప కూడా వీరప్పన్ అయిపోతాడు. రాళ్లల్లో మాటు వేసి కొండ మేకను కొట్టాడు హనుమంతప్ప. తిరుగుదలలో చెక్ గేట్సు ఉంటాయి. డిపార్టుమెంటు వెహికల్ అని పెద్దగా చెక్ చెయ్యలేదు. టార్పాలిన్ కింద జంతువుని ఉంచి కూచోవడంతో రక్తం వరదలు కట్టింది. గ్యారేజ్ దగ్గర ఆపి ఎర్ర ఇటుకలతో తుడిచినా ట్రక్కు డాలాలో రక్తం కనపడడం, ఆఫీసు స్టాపుకి తెలియక తప్పలేదు. బండి లాగ్ బుక్ రాయడం కొత్త ఆఫీసరు డ్యూటీ. అతగాడెంత స్టిక్టు ఆఫీసరయినా అడకత్తెరలో పోక చందమయింది అతని పరిస్థితి. అతని బలహీనత రాంబాబుకి బలమయింది. కొన్నాళ్ల తరవాత వేటకు వెళ్లిన మిత్రులిద్దరిలో రాంబాబు తుపాకీ గుండు తగిలి పోయాడు. అది ఎలా జరిగిందో ఇప్పటికీ వీడని మిస్టరీ. నూరు శవాలు తిన్న రాబందు గాలివానకు చచ్చింది అన్న సామెత ఊరికే పోలేదు.

“అంకుల్ ఆల్ ట్రెయిన్సు ఆర్ క్యాన్సిల్డ్…” అంటు అరచెంచాడు విక్కీ. కొండ మీద నుండి రాళ్లు దొర్లి రైలు ట్రాక్ ధ్వంసమయిందట. అప్ ట్రెయిన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి… అతని కంఠంలో ఆనందం స్పష్టంగా కనబడుతోంది. “అంకుల్ అంతా మన మంచికే జరిగింది. రేపు మీరంతా మా ఇంటికి లంచ్‌కి వస్తున్నారు, వస్తున్నారు… ” మరో మాటకు తావివ్వకుండా లేచి వెళ్లిపోయాడు దుర్మార్గుడు అలియాస్ ఓం.

మర్నాడు బ్రేకుఫాస్టు ముగించుకొని ఓం ఉంటున్న ఇంటికి చేరుకున్నాం. టూ బెడ్ రూమ్ హవుసది. ముచ్చటగా ఉంది. అంతకన్నా అందంగా ఇల్లు సర్ది ఉంది.

“చూడు ఎంత పొందికగా ఉందో. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు…” అన్నాను ధైర్యంగా. మూతి ముప్పయి మూడు వంకర్లు తిప్పి, “ఉండుండు, ఇంటికి పద నీ తాట తీస్తా” అని కళ్లతోనే హెచ్చరించింది శ్రీమతి. ఆ దగ్గరలోనే మిగతా అన్నదమ్ములు కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అందరికీ ఇద్దరేసి పిల్లలు. ఒకడికయితే ఒకరే సంతానం. అదే స్వామి వాళ్లకిచ్చిన కానుక. తండ్రి చేసిన తప్పులు చెయ్యకుండా కుటుంబ నియంత్రణ చేసి, స్వంత గూడు ఏర్పరచుకొన్న అన్నదమ్ములను చూస్తే ముచ్చటేసింది.

ఆలుగడ్డలతో పాటోళ్ళీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలతో అద్బుతంగా ఉంది లంచ్. అంతవరకు మషాలా కూరలతో మా నోళ్లు మట్టికొట్టుకుపోయాయి. ఆడాళ్లందరికీ పూలు, పళ్లు, రవిక గుడ్డలు పెట్టి నాకు కూడా బట్టలు పెట్టి కాళ్లకు నమస్కరించారు ఓం దంపతులు… “ఇదేమిటి నన్ను ఋణగ్రస్తుడిని చేసావు ఓం…” అన్నాను. మాట ఊసుకి… “సార్… ఇదంతా మీరు పెట్టిన బిక్ష…” పూడుకుపోయిన స్వరంతో ఓం అన్న మాటలకు గతంలోకి నా ఆలోచనల ప్రవాహం పరుగెట్టింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here