కాలనీ కబుర్లు – 7

2
10

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]త[/dropcap]న బాస్ తనను సతాయిస్తున్నాడు, ఎంత పని చేసినా సంతృప్తి పడడం లేదని ఓం నా దగ్గర వాపోయాడు. ఆ బాసుగాడు ఎటువంటి వాడో ఆరాలు తీసాను. ఓం ని పిలిచి మంత్రోపాసన చేసాను.

రావిగుడకి పాతిక కిలోమీటర్ల దూరంలో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. అక్కడ ఫారెస్టు ప్రాడక్ట్సు… అందులో అపురూపమైన అడవి తేనె, గుగ్గిలం, పాలగుండ లాంటివి దొరుకుతాయి. చక్రకేళి అరటిపళ్లు ఎర్రగా కంటికింపుగా కనపడతాయి. అదొక పెడ కొని బాస్ ఇంటికి వెళ్లి మా పెరట్లో పండినవి అని చెప్పి ఇచ్చాడు. ఆవు ఈనితే ముర్రిపాలను జున్ను చేసి ఇవ్వడం, కోడి, బాతు గుడ్లు ఇచ్చి బాసుని ఆకట్టుకున్నాడు ఓం. “అమ్మా మీరు చూడ్డానికి చాలా బాగుంటారు సుమా, కాని ఒబేసిటీ దాన్ని వల్లకాడు చేస్తుంది. పొద్దున్నే లేవగానే వేడినీళ్లలో తేనె కలుపుకొని కాస్త నిమ్మరసము జోడించి తాగండమ్మా. ఇదుగోండి మీ కోసం గాలించి తెచ్చాను. ఇది తాగిన నెలరోజులకి సార్ మిమ్మల్ని పోలుస్తే ఒట్టు” అన్నాడు. ఆవిడ ఉబ్బితబ్బిబ్బయి ఆచరించడం మొదలెట్టింది. ఆవిడ చిక్కి సన్నబడిందో లేదో కాని బాసుకి బదిలీ అయిపోయింది. వెళుతూ కొత్తాఫీసరుకు ఓం ని పరిచయం చేస్తూ “హి యీజ్ ఏన్ ఎస్సెట్ ఫర్ ది డిపార్టుమెంటు” అని తారీఫ్ ఇచ్చి మరీ వెళ్లాడు.

అంచెలంచెలుగా సోపానాలు అదిగమిస్తూ ఉన్నత పదవులు చేపట్టాడు ఓం. ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి ఉండడం అతని స్వభావం. అతగాడికి సరిగ్గా సరిపడింది అతని ఇల్లాలు. కుట్టుమెషీను మీద కూచుంటే చాలు ఆమెలో అంతర్గతంగా దాగిన ఆర్టిస్టు బయటపడతాడు. కొత్త కొత్త డిజయిన్లతో కుట్టడంతో పెళ్లి కాని పడుచులు అక్కడ క్యూ కడతారు. ఇంటిపని, వంటపని, కుట్టు పని చేస్తూ పిల్లలికి తనే ట్యూషను చెబుతుంది. మరుదులు, తోడికోడళ్లతో సఖ్యంగా, సరదాగా మసలడం గమనించాను. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా ఆ కుటుంబ సభ్యులే చాలు, నిండుదనం తెస్తారు. తలిదండ్రుల పేర్లు పిల్లలకు పెట్టి కన్నవారి ఋణం తీర్చుకున్నడా త్యాగమూర్తి. ఆ అన్నదమ్ముల ఐకమత్యం చూసి ముచ్చటేసింది నాకు.

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలతో ముడిపడ్డాయన్న మార్క్స్ మాటలు మచ్చుకు కానరావక్కడ. వాళ్ల ఆప్యాయతలకు, అనురాగానికి, ఆదర్శ జీవితానికి నా కళ్లు చెమర్చాయి. కంట్లోని నీటితెర కనబడకుండా అక్కడనుండి నిష్క్రమించాను. రంగరాజు తదితరులు బస్సు, ట్రక్కులు పట్టుకొని స్వస్థాలాలకు తరలిపోతున్నారు. నాకు రిస్కు తీసుకోవడం ఇష్టం లేదు. రైల్వే ట్రాక్‌ని యుద్ధప్రాతిపదికన బాగుచేస్తారని నాకు బాగా తెలుసు. ఇంటివాళ్లు ఎన్ని సణిగినా నేను కాతరు చెయ్యలేదు. ‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’ అన్నది నా పాలసీ.

***

రావిగుడలో ఏదైనా సరే అత్యధికంగా ఉంటాయి అని చెప్పాను కదా. ఉదయాన్నే సూర్యభగవానుడు సురసురలాడుతున్నాడు. నేను బయల్దేరుతుంటే అరటికెట్లు వెంటబడ్డారు. నింపాదిగా నడుచుకొంటూ వెళుతున్నాం! “తాతగారూ ఐసుక్రీం తింటాం..” అన్నారు పిల్లకాయలు. సైకిలు చక్రాలున్న చెక్కబండి మీద ఒకడు పోతున్నాడు. మంచి బేరం తగిలిందని వాడు ఆగడమే తరవాయి మా పిల్లరాక్షసులు బండిని చుట్టుముట్టారు. వెనీలా, చాకోలెట్టు, స్ట్రాబెర్రీ ఐసుక్రీంలతో రిచ్ గా ఉంది. పెద్దనోటు ఇవ్వడంతో చిల్లర కోసం ఆగాల్సి వచ్చింది. కాలక్షేపానికి బండివాడితో మాటలు కలిపాను. అతగాడు బతికి చెడ్డవాడట. ఇద్దరు కొడుకులు వ్యసనపరులు కావడంతో ఆస్తి హారతికర్పూరమయిపోయింది, భార్య పోయింది. బ్రతుకుతెరువు కోసం గత్యంతరం లేక వీధుల్లో ఐసుక్రీం అమ్ముకోవలిసివచ్చిందని వాపోయాడు వాడు.

పూర్వాశ్రంలో ఏమిటి చేసేవాడివని అడిగాను. ఒకప్పుడు కాంట్రాక్టు పనులు చేసేవాడినని, ఎలక్ట్రిక్ కాలనీ క్వార్టర్సు కట్టిన ఘనత తనదే అన్నాడు. క్వాలిటీలో రాజీ పడనని కావలిస్తే వెళ్లి తన పనితనం చూడమని బడాయిలు పోయాడు. అఫ్ కోర్సు ఇప్పుడు కడుతున్న ప్రభుత్వ భవనాలు కన్న అవి ఉత్తమోతైనవని ఘంటాపదంగా చెప్పొచ్చు. సిమెంటు పాళ్లు తక్కువ, ఇసుక పాళెక్కువ నీటి గుత్తపనుల్లో. ఏ క్షణాన రూఫ్ కూలుతుందేమో అని బడిలోని పిల్లలు బయట చెట్ల కింద కూచుని పాఠాలు చదువుకోవడం వార్తాపత్రికల్లో చూస్తుంటాం.

పిల్ల పిశాచులు హిమక్రీములని అలా అలా నిమిషాల్లో చప్పరించేసి రెండవ విడతకి రడీ అయిపోయారు. ఇలా అయితే నాకు చిల్లర రాదు సరికదా బండిలోని సరుకంతా పిల్లల పొట్టలకు సరఫరా అయిపోవడం తధ్యం. తర్వాతర్వాత నా మీద ధ్వజం ఎత్తుతారు నా కూతుళ్లు, వాళ్లతో పాటు వాళ్ల మగ మహారాజులు. బండివాడు బహు నేర్పరి. అటు వ్యాపారం కొనసాగిస్తూ ఇటు నాకు మాటలమ్మి మనీ చేసుకొంటున్నాడు. ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి స్వామి లాంటి స్వామిభక్తి పరాయణుడు దొరకడని, తన దగ్గర పని చేసినంతకాలం జీతం పెంచమని అడగలేదు, తనూ పెంచలేదని బాధపడ్డాడు. స్వామి పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులయ్యారని చెప్పాడు. కాని ఆ మాటల్లో కాస్త అసూయ ధ్వనించింది. తన కొడుకులకి కాన్వెంటు స్కూళ్లలో కాసులు ఖర్చు చేసినా ఫలితం వికటించింది. స్వామికి చేసిన ద్రోహం తనకీ నాడు కట్టికుడుపుతందని కళ్లనీళ్లు పెట్టుకొన్నాడు. అతనే కంట్రాక్టరు పండాబాబు, స్వామి గారి యజమాని.

నా జ్ఞాపకాల పేటిక తెరుకొంది. ఒకసారి ఓం తిరుపతి వెళ్లాడు. నడిపివాడు కాకరకాయ సదును. తన తోటి పిల్లలతో కూడి ఒకడ్ని కొట్టాడు. ఎర్రటి రక్తం చూడగానే పిల్లలంతా పరుగో పరుగు. పోలీసు కేసయింది. ఖాకీల దృష్టి స్వామి కొడుకు మీద పడింది. మిగతా పిల్లలెవరూ ఆచూకీ చిక్కలేదు. లాకప్పులో ఉన్న వాడికి బయటకు తేవాలంటే బెయిలు కావాలి. ఊర్లో స్వామికి ఉన్న ఒకే ఒక ఆసరా పండాబాబు. “నీ కొడుకు నన్ను ఒకసారి తిట్టి అవమానపరిచాడు, వాడికి ఒళ్లంతా పోత్రం” అని నక్కా, మేకపిల్ల కట్టుకధ అల్లి తప్పించుకొన్నాడు. స్వామి కాలికి బలపం కట్టుకొని తిరగని గుమ్మం లేదు. ఇటు ఇల్లాలు నిండు చూలాలు. ఇంట్లో పైసా లేదు. మేమంతా నిస్సహాయులమై చూస్తున్నాం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ మాటలు నిజమన్పించాయి ఆ క్షణాన. ఓం మేనమామలెవరూ వంగి వాలలేదు, తొంగి చూడలేదు. అప్పటినుండి ఓం కి బందువులు రాబందులన్న విషయం అర్థమైంది. మనిషిలో కసి, కక్ష పెరిగింది. డబ్బు కూడబెట్టి స్థలం కొన్నాడు. స్థిరచరాస్తులుండాలని పెద్దలెందుకన్నారో కార్యరూపంలో చేసి చూపెట్టాడు కన్న తండ్రికి. ప్రార్థించే పెదవుల కన్నా పని చేసే చేతులు మిన్న. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అన్న సిద్దాంతం స్వామి వదులుకున్నాడు. ఎవ్వరికీ చెప్పకుండా కుటుంబనియంత్రణ ఆపరేషను చేసుకొని వచ్చేసాడు. ఒక్కొక్కరు పిల్లాడు అందుకొచ్చారు. అప్పుడు దిగివచ్చారు మేనమామలు. సైజులు వారీగున్న ఈడొచ్చిన ఆడపిల్లలని అంటగట్టడానికి చూసారు. ససేమిరా అని మొండికేసాడు ఓం. ఒక అక్క కూతురు మాత్రం ఆ ఇంటకోడలిగా అడుగుపెట్టింది..!

“సాబ్ ఆప్కా పైసా లీజియే”.. అన్న పండా పిలుపుతో నా ఆలోచనలు చెల్లాచెదురయి ఈ లోకంలోకి ఊడిపడ్డాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here