కాలనీ కబుర్లు – 8

0
7

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]నా[/dropcap]కు మరో విషయం గుర్తుకొచ్చింది. వేసవి రావడం, కోయిల కూతలతో పాటు, మల్లెలు, మామిడి పరిమళాలు నలు దిశలా పరుచుకొన్నాయి. ప్రకృతి మాత నిండు చూలాలిగా కనపడసాగింది. అమెకు పురుడు పొయ్యడానికా అన్నట్లు మా ఆవిడ పిల్లలతో కన్నారింటికి వెళ్లింది. కావల్సినంత స్వేచ్ఛ దొరకడంతో మేం మగాళ్లం వీర విహారం చేశాం. అందులో భాగంగా పార్టీ చేసుకోదలిచాం. కాలనీలో కోళ్లు దొరికే చోటు ఒకటే ఉంది. అది ఓం ఇల్లు. కేజిన్నర బరువున్న పుంజుని సెలక్టు చేసి పట్టుకు రాబోతున్నాను. దానిని కాల్చి డ్రెస్సింగు చేసి వండమని సలహా ఇచ్చింది ఓం తల్లి. ఆ పనేదో మీరే చేసి పెట్టండని వచ్చేసాను. గంట తర్వాత వెళ్లి మాంసం పట్టుకొచ్చి వండాను. నల భీమాదుల తర్వాత అంతటి వాడినని తారీపు ఇచ్చారు మిత్రులు. కాని ఒక పంటి కిందకు కూడా చికెను రాలేదని సణుక్కున్నారు నాయాళ్లు. కొంత సేపటి తర్వాత ఓం నా క్వార్టరుకి వచ్చాడు. మూతి ఎర్రగా హనుమంతుని మూతిలా ఉంది. నేరుగా పెరట్లోకి వెళ్లి మామిడిపళ్లు తెంపి ఆబగా తినసాగాడు. ఏమయిందని అడిగాను. భోజనంలో చికెను చాలా కారంగా ఉండడం మూలాన తట్టుకోలేక పళ్లు చీకుతున్నానని అమాయకంగా జవాబిచ్చాడు వాడు. ఆ చికెను ఎక్కడిదో అప్పుడు అర్థమయింది నాకు.

పనిమనిషి పారమ్మ వచ్చింది. పని చేస్తున్న సేపు గొణుగుతుండేది. నాకు చిరాకు వేసి గసిరాను. తన సణుగుడికి ఫ్లాష్‌బ్యాక్ చెప్పింది పారమ్మ. ఆమెకు ఒకే ఒక కూతురు. పెళ్లయి కాపురం చేసుకొంటుంది. ఉగాది పండగకి పిల్లలతో రమ్మనమని ఆ విషయం స్వామి భార్యకు చెప్పి పోస్టలు కవరుకు డబ్బులిచ్చింది పారమ్మ. అడ్సస్సు కోసం ఇంటికొచ్చిందామె. గంట తర్వాత వెళ్లి ఉత్తరం విశేషాలు చదివి విన్పించమందట. ఉత్తరం రాయడం, పోస్టింగు చేయడం కూడా అయిందని చెప్పిందట. మరి అడ్రస్సో అని అమాయకంగా అడిగితే.. ఆపాటిది నాకెరుక నేదేటీ. ఒయిబాగులో ఇసకతోటలో నేదైటీ నీ బొట్టి. అదే రాసేసి పడేయమన్నాను నడిపోడికి… కక్కుర్తి మనిషి. దాని నోట్లో నా సాడు పొయ్య. తిట్ల దండకం నాన్‌స్టాప్‌గా కొనసాగింది. ఇలా చెప్పుకుపోతుంటే స్వామి దేవమ్మ ఘనకార్యాలు మహాగ్రంథమవుతుంది. ఆవిడకు జనం ముద్దుగా పెట్టిన పేరు చీటీల చిన్నమ్మ అని. చీటీలు వేసి ఆమె చెయ్యితో పాటు కాలు, ఒళ్లు కూడా కాల్చుకొంది. కొందరి జాతకం ఎటువంటిదంటే ఏలిన నాటి శని అలా ఏళ్ల తరబడి ఉండిపోతాడు.

హఠాత్తుగా స్కూటరు వచ్చి ఆగడంతో నా ఆలోచనల దారం పుటుక్కుమని తెగిపోయింది.. “నమస్తే బాబుగారూ. నన్ను పోల్చారా” అన్నాడా స్కూటరిస్టు. తేరిపార చూసాను ఆగంతకుణ్ణి. అవును… అతను ఖడంగాబాబు. ఆఫీసులో క్యాషియరుగా ఉండేవాడు. మందస నుంచి వచ్చేసిన ఒడియా సోదరుడు. ఇద్దరం కౌగలించుకొన్నంత పని చేసాం. “కూకోండి సారూ. ఎలదాం” అన్నాడు. పిల్లకాయలు మరి ఐసుక్రీం కాదు కదా ఐసు కూడా దొరకదని నిర్ధారణకి వచ్చాకా మరి పత్తా లేరు. నాకు ఊసు పోవాలిగా. మారు మట్లాడకుండా ఖడంగా వెనుక కూర్చోవడం ఏమిటి, సర్రున ముందుకు దూసుకుపోయింది స్కూటరు. ఐ.బి. ముందు ఆపాడు ఖడంగా. అతగాడిని చూడగానే డీలక్సు సూటు తెరిచి ఏం కావాలన్నట్లు చేతులు జోడించి నిలబడ్డాడు వాచ్‌మ్యాన్. చల్లని బీరు, వేడి వేడి ఉల్లి పకోడా కడుపు లోకి జారుకొంటుంటే పాత విషయాలు నెమరు వేసుకొన్నాం ఇద్దరం.

***

ప్రతీ ఏడాది ఆఫీసు ఆడిట్ చేయడానికి రాజధాని నుండి ఆడిట్ స్టాఫు వస్తారు. వాళ్లని ఐ.బి.లో పెట్టి చూసే బాధ్యత కాషియరు ఖడంగాదే. ఆడిట్ వాళ్లు అల్లుడితో సమానం. టూతుబ్రష్, టూతు పేస్టు, దువ్వెనలు, సబ్బులు, తలకు రాసుకొనే వాసన నూనెలు, పౌడర్లు కొనిపించి వాళ్లు తెచ్చుకొన్న పాత సరుకుతో పబ్బం గడుపుకొనేవాళ్లు. ఉల్ఫాగా వచ్చిన సరుకుని రాజధాని వెళ్లగానే వాళ్లకు తెలిసిన షాపుల్లో ఇచ్చి రేషను తీసుకోవడం ఆనవాయితీ. ఈ అపర అల్లుళ్లు ఆడిట్ జరిగినన్నాళ్లు రెండు పూటలా చికెను, మటనులతో మస్తుగా తిని మందుపార్టీలు కూడా ఇవ్వమనేవారు. ఉన్న ఊళ్లీ మామూలు టీ తాగి బీడీలు కాల్చే నాయాళ్లకి ఇక్కడ టిఫిను కింద ఆమ్లెట్, ఖీమా పరోటా, పీష్ కట్లెట్‌లు కావలిసివచ్చేది. బోర్నువిటా తాగి విల్సు ప్లేకు సిగరెట్లు ముట్టించేవారట. వీటన్నిటికీ ఆఫీసు క్యాష్ నుండి చెల్లించి ఆ లోటుని ఫాల్సు వోచర్సుతో పూడ్చుకొనేవాడు. ఇటువంటి కొత్త విషయాలు చెప్పి మమ్మల్ని నవ్వించేవాడు ఖడంగా.

మందు కొట్టిన మగాళ్లకి మన్మథుడు కామదహన శరాలు గుప్పిస్తాడు. ఆ బాధకు తాళలేక ఆడిట్ వాళ్లు అమ్మాయిలు దొరుకుతారా అని నైటు వాచ్‌మ్యాన్‌ని అడిగితే ..ఎందుకు దొరకరూ, టూ ఇంచెస్ పుట్, సిక్స్ ఇంచెస్ కట్.. అని సీరియస్సుగా చెస్తే మారు మాట్లాడకుండా రగ్గులో దూరిపోయేవారట. నవ్వుతూ, నవ్వుతూ పొలమారేను… బాబుగారూ ఎవరో తలుచుకొంటున్నారు. మరొక్క విషయం చెప్పి సభ చాలించేద్దామా. సరేనా.. అని ఆఖరి పెగ్గు గటగటా తాగేసి మూతి తుడుచుకొని ఖారా కిళ్లీ బిగించేసాడు ఖడంగా. ఒకరోజు ఆడిట్ వాళ్లు ఖడంగాని ప్రేమతో పిలిచి “మరి అన్నీ బాగున్నాయి కాని మీ ఊర్లోని మార్కెట్టు చూపించవా” అని అడిగారట. ఏదో టెండరు పెడతారని మనస్సులో అనుకొని “అదెంత భాగ్యం బాబులూ, పదండి వెళదాం” అని ఆఫీసు జీపులో తీసుకువెళ్లాడు ఖడంగా.

మార్కెట్టులో దొరికే సాంబ్రాణి, పాలగుండ, చందనం చెక్కలు లాంటి అటవీ ఉత్పత్తులు కొన్పించి, “బనియన్లు లేవు పద కొందాము” అన్నారట. తనకు తెలిసిన గార్మెంటు షాపుకు తీసుకెళ్లాడు. గంట పాటు సెలక్షను చేసి కౌంటరు దగ్గరకు వచ్చారు ఆడిట్ మహాశయులు. బిల్లు అమౌంటు చెప్పేసరికి నమ్మశక్యం కాలేదు. “ఆ స్టాల్ బనియన్లకి అంత అవుతుందా అని సందేహం కలిగి ప్యాకెట్టు విప్పి చూసేసరికి బనీయన్లతో పాటు బ్రాలు, పెట్టీకోట్లు బయటపడ్డాయి” అని ఖడంగా చెప్తుంటే నాకు నవ్వు ఆగలేదు. అప్పటికే బీర్బల్ అవతారం ఎత్తిన నేను బరువు తగ్గించుకోడానికి బాత్రూంలో దూరాను. అద్దంలో చూసుకొన్నాను కదా మొహం ఎర్రగా కందిపోయి ఉంది. కల్తీ సరుకా అన్పించింది. ఒక్క బీరుకే అవుటు అయిపోవడం ఎన్నడూ జరగలేదు.

“సిరి పట్ట లేదు గాని సీడ మాత్రం పట్టింది. ఆడిట్ వాళ్లకు తాగించి తాగించి నేనీ మందుకి బానిసయిపోయాను గురువుగారూ…” వైనతేయిడికి ఏడ్పు ఒక్కటే తక్కువ. అన్ని రోజులు రావిగుడలో గడిపిన నాకు ఆ రోజు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే రోజు. నవ్వుతూ బతకాలిరా, నవ్విస్తూ జీవించాలిరా అన్న సిద్దాంతం ఖడంగాది. పుట్టినప్పుడు ఏదీ తేలేదు, పోయేటప్పుడు అది వెంటరాదు అనే అతని తత్త్వానికి నా జోహారు. హోటలు ముందు ఆగింది స్కూటరు. నా చేతులు రెండూ పట్టుకొని “ఈ సేవకుడి వల్ల పొరబాటు ఏమైనా జరిగితే క్షమించండి సారూ…” అని చెప్పి నిష్క్రమించాడు గురుడు. కిళ్లీ వేసుకోవాలనిపించింది. కాని దగ్గర్లో బంకులేవీ లేవు. కన్పించిన కుండీ లోని కాక్టసు ముక్క తుంచి నమిలాను. దాని సైడు అఫెక్టు తర్వాత తెల్సింది.

లంచ్ తినేసి పడక సీను పేద్దామనుకొనేలోగా లిఫ్టు ఇరిగేషను ఆరంభమయింది. తాగింది, తిన్నది అంతా కక్కుకొన్నాను. దానితో పాటు ఆరు అంగుళాల నాలిక బయటకు వచ్చేసింది. ఏది దాచాలనుకొన్నానో అది ఓపెను సీక్రెట్ అయిపోయింది. చెడుగుడు ఆడేసింది మా అవిడ. ప్రయాణం ముందు పెట్టుకొని వెధవ్వేషాలు వేసి ప్రాణం మీదికి తెచ్చుకోవడం ఎందుకు అని రంకెలు వేసింది. హేంగోవరు కన్నా ఆమె చేసిన హంగామా మరిత సలుపు పెట్టింది. ఓం కి ఫోను చేసి వెంటనే వచ్చి డాక్టరు దగ్గరకు తీసుకు పొమ్మని ఆర్డరు జారీ చేసిందామె.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here