కరోనా డైరీ

0
11

[dropcap]ఉ[/dropcap]న్నట్టుండి మన జీవితాల్లోకి కనిపించని సునామీలా వచ్చేసింది కరోనా. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసింది. చిన్న, పెద్ద, బీద, గొప్ప, కులం, మతం తేడా లేకుండా నాకు అందరూ సమానమే అన్నట్లు ఇక్కడ అక్కడ ఎక్కడ అనే తరతమ బేధాలు లేకుండా రవి కాంచని చోటు కవి గాంచున్నట్లు కవిని మించిపోయింది.

చైనాలో పుట్టిందని తెలియగానే మనం తెలివితేటలు ఉపయోగించి విదేశీయులను రాకుండా కట్టడి చేసి ఉంటే ఈ ఉపద్రవం ఛాయలు కూడా మన మీద పడేవి కావు. కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచాం. కాబట్టే అవస్థలను కొని తెచ్చుకున్నాం. కొందరు ఈ జాగ్రత్త పడి తప్పుకున్నారు. ఆ సంఖ్య బహుకొద్దిగా ఒకటో రెండో! అంతే!

ప్రభుత్వం మొదటి లాక్‍డౌన్ పెట్టినప్పుడు కొందరు తెగ సంతోషపడిపోయారు. ఎందుకంటే ‘ఆన్‍లైన్’లోనే ఇంట్లో కూర్చుని చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చని. జీతం మామూలుగానే. ఇంట్లో భార్య, అమ్మ చేసి పెడుతుంటే పని చేసుకోవడం బాగుంటుందిగా. కాకపోతే ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు, పిల్లలను కేర్ సెంటర్లో, స్కూళ్ళకు పంపేవాళ్ళు ఒక చేతిని నాలుగు చేతులుగా చేసుకుని పని చెయ్యవలసి వచ్చింది. ఇక ఎందరికో ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మాకు ఉద్యోగాలు పోవు అనే నమ్మకంతో ఇంటి నిండా ఫర్నీచర్లు అప్పుచేసి కొన్నవాళ్ళు తలపట్టుకున్నారు. రోడ్డున పడలేదు కానీ ఇంట్లో కుమిలి పోయారు. ఎంతసేపూ ఎలా ఖర్చుపెట్టాలని ఆలోచించేవారే తప్ప పొదుపు ఊసు ఎత్తనివారే ఈ జాబితాలో. భవిష్యత్తు గురించి చక్కటి గుణపాఠం దీనితోనే ప్రారంభమయ్యింది.

భార్యలకు సాయం చెయ్యని వారు కూడా రంగంలోకి దిగక తప్పలేదు. పిల్లాపాపలతో మురిపాలు పంచుకోలేనివాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్‍లలో పైకి వెళ్ళి విందుభోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఆనందించారు. మళ్ళీ అవన్నీ టి.వీ.ల్లో కూడా ప్రసారమయ్యాయి.

కరోనా వల్ల ముందుగా వచ్చిన మార్పు ‘షేక్‍హాండ్‍లు’ మానెయ్యటం. నాకైతే అదెంతో నచ్చింది. చక్కగా మన సంప్రదాయం ప్రకారం ‘నమస్తే’ చెప్పుకోక ఇదేమిటని ఎప్పుడూ విసుక్కొనేదాన్ని. నేనైతే ఎవరికీ షేక్‍హ్యాండ్ ఇచ్చేదాన్ని కాదు, మనసులో నవ్వుకుంటారని తెలిసినా!

పబ్‍లు, డేటింగులు అంటే కూడా పడేది కాదు. విదేశీ సంస్కృతిని మనం అనుసరించటమేమిటని మనసు ప్రశ్న. వినేవాడెవడు? అలాంటివన్నీ మూతపడ్డాయి. అదొక ఆనందం.

బయటనుంచి రాగానే కాళ్ళు కడుక్కోమంటే మంచంమీద డామ్మని పడే పిల్లలూ, పెద్దలూ ఇప్పుడు ఎవరూ చెప్పకుండానే కాళ్ళు కడుక్కోవడం చూసి ‘భలే బుద్ధి చెప్పింది కరోనా’ అని సంబరపడకుండా ఉండలేక పోయాను.

అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు అన్నిచోట్లా వెల్లివిరుస్తున్నాయి కుటుంబంలో అన్న వార్తలు కూడా ఎంతో సంతోషాన్నిచ్చాయి.

కాకపోతే పనులు చేసుకుని ఏ రోజు కా రోజు పొట్ట నింపుకునేవారి పరిస్థితి తలచుకుంటేనే దుఃఖం ముంచుకొచ్చేది. యజమానులు కొన్నిచోట్ల ఆదుకున్నారు. కానీ అది చాలా కొద్దిశాతమే. పనిమనుషులు వస్తే జాగర్త కావాలని వారిని మానిపించేసి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవటం ప్రారంభించారు అందరూ, ఇబ్బంది అయినా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? పనులలోకి మనంతట మనమే రావద్దన్నాం కదా అని జీతాలు ఇచ్చారు. అలా ఒక నెల. తర్వాత ఇవ్వమని చెప్పిన వాళ్ళూ ఉన్నారు. పనులు లేక సంపాదన లేక అప్పులతో జీవించడం ప్రారంభించారు.

మాది 140 అపార్ట్‌మెంట్స్ కూడలి. A,B,C బ్లాక్స్. ఇక రోజూ సందడే సందడి. మోపెడ్స్ మీద, ఆటోల మీద, మినీట్రక్కుల మీద, ఇలా పనులు లేని వాళ్ళంతా కూరగాయలు, పండ్లు అమ్మటం మొదలుపెట్టారు. ఒకేచోట ఎక్కువ వ్యాపారం జరుగుతుందని అందరూ మా దగ్గరకే వచ్చేవారు. మాకూ ఎక్కడికి వెళ్ళకుండా గుమ్మం దగ్గరకే రావటంతో సౌకర్యంగా ఉండేది, కాస్త ధరలు ఎక్కువైనా!

లాక్‍డౌన్ ఎత్తేశాకా వారంతా మాయమైపోయారు. అది వేరే సంగతి. సందట్లో సడేమియా అన్నట్లు మధ్యలో ‘మందు’ షాపులు తెరుచుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని ఆ నిర్ణయమట. అది మాత్రం చాలా బాధనిపించింది నాకేం నష్టం లేకపోయినా.

మరి అక్కడ షాపుల ముందే తాగేసేవాళ్ళు గుంపులుగానే ఎక్కువగా. సోషల్ డిస్టెన్స్ పాటించేవాళ్ళు తక్కువ. ఈ వరసలో ఆడవాళ్ళు కూడా ఉండటం కాస్త ఆశ్చర్యాన్నే కలిగించింది. ఆత్రం ఆపుకోలేక తాగి ఎక్కడో ఏ రోడ్డు మీదే యాక్సిడెంట్‍కి గురయితే. ఇది కరోనా అప్పుడే కాదు మామూలప్పుడు కూడ ఉంటుంది అనుకోండి. అసలే పైసలు లేక చస్తుంటే ఇంట్లో ఉన్నవి ఊడ్చి, సామానులు అమ్మేసిన వాళ్ళూ ఉన్నారు. ఇవన్నీ అదనపు బాధలే కదా! కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

ఇక వలస కార్మికుల బాధలు వింటుంటేనే కళ్ళలో కన్నీరు క్రమ్ముకునేది. వేలవేల మైళ్ళు అష్టకష్టాలు పడి ఇంటికి చేరి మళ్ళీ పనులు లేక వచ్చిన చోటకే వెళ్ళిపోతున్నారన్న వార్తలు మనసును కలిచివేసేవి. ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం.

ఇక కరోనా బారిన పడిన వారి తిప్పలు తిప్పలు కావు. ఎక్కడకు వెళ్ళినా చేర్చుకోము అనే. రెండు మూడు చోట్ల తిరిగాక ఎంతో పెద్ద రికమండేషన్ చేస్తే కానీ ప్రవేశం, రూము దొరకని స్థితి. ఇక ఆ తరువాత డబ్బు నీళ్ళలా లక్షలు లక్షలు జారిపోవడమే.

కరోనా నెగెటివ్ ఉన్నా పాజిటివ్ అని చెప్పి డబ్బులు గుంజేస్తున్న వైద్యులు ఒక ప్రక్క. మరో ప్రక్క ప్రాణాలు కోల్పోతున్న యువ వైద్యులు, నర్సులు. నాణానికి బొమ్మా, బొరుసులా, పాలకులు, శాస్త్రవేత్తలు, పారిశుద్ద కార్మికులు. ఇలా ఎందరో…. ఎందరో నిరంతరం ఈ కరోనా నిర్మూలనలో యోధులులా… సైనికులులా పరిశ్రమిస్తుంటేనే ఇలా ఈనాడు మనం భద్రంగా ఉండగలుగుతున్నాం. బయటకు వస్తే మాస్క్, గుమ్మంలోపలే క్షేమం మన నినాదమైపోయింది. శానిటైజర్ దైనందిన జీవితంలో ఓ భాగమైపోయింది.

ఎంత జాగ్రత్త తీసుకున్నా ‘నేనొస్తున్నా’ అని వచ్చేస్తున్న కరోనాకి విరుగుడుగా వేడినీరు, ఆవిరిపట్టటం, కషాయం…. ఇలా ఎన్నో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా నివారణ మందు రావటం అనివార్యం!

ఆ రోజు కోసమే మనందరి ఎదురుచూపులు. అప్పటిదాకా భయాన్ని వదిలి దీనితో పోరాటమే మన కర్తవ్యమని ప్రబోధిస్తూ ఎదురుచూస్తున్న రోజుల్ని దాటుకుని వాక్సిన్‍ని అందుకున్న రోజులకు వచ్చేసాం.

ఇప్పుడు డాక్టర్స్, వైద్య సిబ్బందికి అయిపోయి అరవై ఏళ్ల వారి దాకా కరోనా వాక్సిన్ వచ్చింది.

ముందు ముందు అందరికీ కూడా!

మనం కరోనాని జయించినట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here