కోవిడ్ టీకాల సామర్థ్యం, సాఫల్యత: ఒక పరిచయం

1
8

[dropcap]కో[/dropcap]విడ్ టీకాలు రావడం మొదలయ్యాక రోజూ సోషల్ మీడియాలో ఏ టీకా మంచిదంటూ చర్చలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది అర్థం చేసుకునే ప్రయత్నంలో తెలుసుకున్నవి ఈ వ్యాసం ద్వారా పంచుకుంటున్నాను.

మామూలుగా శాస్త్ర పరిశోధనలో మందులూ, టీకాలు వంటివి మార్కెట్లోకి వచ్చేముందు వివిధ దశలలో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని గతంలో “కోవిడ్ టీకాలు, కథా కమామిషు” వ్యాసంలో ప్రస్తావించాను. వీటిని బట్టి ఆ మందు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తోంది? అన్నది అంచనా వేసి అది వారు అనుకున్న స్థాయికి ఉంటే, దాన్ని క్రమంగా జనాలకివ్వడానికి తగినదిగా నిర్ణయం తీసుకుంటారు. దీనిని సామర్థ్యం (efficacy) అనుకుంటే, అది ల్యాబులు దాటి బయటకొచ్చాక దాని పనితీరుని సాఫల్యత (effectiveness) అంటారు. రెండూ అసలు వేర్వేరుగా ఎందుకుండాలి? ఎందుకుంటాయి? అంటే – ఎంత మనలాంటి మనుషుల మీదే పరిశోధనలు చేసినా భూమ్మీద ఉన్న అందరి మీదా చెయ్యలేరు కదా! ఒక యాభై వేలమంది మీద పరిశోధన చేశారు అనుకుందాం – అయినా కూడా ఇన్ని కోట్ల ప్రపంచ జనాభాలో యాభై వేలు ఎంతని? కనుక, పరిశోధనల్లో కనబడే సామర్థ్యం వేరు, బయటి ప్రపంచంలో సాఫల్యత వేరు అనమాట.

అయితే, ఈ సామర్థ్యం గురించి వైద్యేతర జనం మధ్య అపోహ ఉన్నట్లు తోస్తుంది నాకు. ఉదాహరణకి కోవిడ్-19 కి వేసే ఒక టీకా 90% సామర్థ్యం కలది అన్నారు. అంటే ఏమిటి? అది వంద మంది వేస్కుంటే తొంభై మందికి కోవిడ్ రాదనా? మరి మిగిలిన పది మంది సంగతేమిటి? టీకా వేసుకున్నా వాళ్ళకి వ్యాధినిరోధక శక్తి రాదా?  లేక, ఈ టీకా వేసుకుంటే కోవిడ్ సోకే అవకాశం 90% తగ్గుతుందా?  అయితే మరి‌ టీకా పనితీరు బాగున్నట్లా? లేనట్లా?

టీకా సామర్థ్యం: సాధారణంగా ఇలా టీకాల పనితీరు అంచనా వేయడం కోసం వివిధ దశలలో చేసే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వ్యక్తులని రెండు గుంపులుగా విభజిస్తారు – ఒక గుంపుకి టీకా ఇస్తే, రెండో గుంపుకి ఉత్తుత్తి టీకా (Placebo) ఇస్తారు. తరువాత టీకా ఇచ్చిన వారిలో ఎంతమందికి వ్యాధి వచ్చింది? ఆ ఉత్తుత్తి టీకా గుంపులో ఎంతమందికి వచ్చింది? అన్నది పరిశీలించి, టీకా వల్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయా?‌ అన్నది అంచనా వేస్తారు. ఉదాహరణకి: మొదటి గుంపులో ఓ వంద మంది ఉన్నారనుకుందాం. ఒకరికి టీకా వేసుకున్నాక కూడా కోవిడ్ వచ్చింది. రెండో గుంపులో కూడా ఓ వందమంది ఉంటే, ఇందులో ఓ పది మందికి కోవిడ్ వచ్చింది. అంటే ఈ రెండో గుంపుకి ఇచ్చిన ఉత్తుత్తి మందుతో పోలిస్తే టీకా తొంభై శాతం వ్యాధి నిరోధక సామర్థ్యం కలిగి ఉన్నట్లు. కనుక, ఒక టీకా సామర్థ్యం తొంభై శాతం అంటే పది శాతానికి వ్యాధి వస్తుందని కాదు. టీకా వేసుకున్నవారిలో ఈ వైరస్‌తో సంపర్కం అయినా వ్యాధి వచ్చే అవకాశం తొంభై శాతం తగ్గుతుందని. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా కొత్త కోవిడ్ టీకాకి అనుమతి లభించాలంటే ఈ సామర్థ్యం కనీసం యాభై శాతం ఉండాలి.

ఈ క్రింది పట్టికలో కొన్ని ప్రముఖ కోవిడ్ టీకాలకి ఈ క్లినికల్ ట్రయల్స్‌లో నిర్థారితమైన సామర్థ్యం గురించి కొన్ని వివరాలు చూపవచ్చు.

టీకా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం తీవ్రం, కానీ ఆసుపత్రి పాలవడం/మరణాలు లేవు తీవ్రం, ఆసుపత్రి పాలవడం/ మరణాలు నిరోధించడం
కోవిషీల్డ్/ఆస్ట్రా జెనెకా దాదాపు 81% దాదాపు 100% దాదాపు 100%
కోవ్యాక్సిన్ దాదాపు 78% దాదాపు 93%
ఫైజర్ దాదాపు 95% దాదాపు 66%
మాడర్నా దాదాపు 94% దాదాపు 100% దాదాపు 100%

ఇది వికీపీడియా నుండి తీసుకున్నది. ఈ సంఖ్యల వెనుక ఇక్కడ ప్రస్తావించని వివరాలు చాలా ఉన్నాయి. అసలు వీటిల్లో ఒక్కోదానిలో ఎంతమంది పాల్గొన్నారు? వయసులెంత? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఏ దేశాల వాళ్ళు? అసలా “దాదాపు” ఎందుకు? ఖచ్చితంగా ఓ నంబర్ పెట్టొచ్చుగా? ఇలా ఎన్నో ప్రశ్నలకి జవాబులు తెలిస్తే కానీ వీటి గురించి ఒక అంచనాకు రాలేము. అయినా కూడా ఇవి ఎందుకు పెట్టావు, చదివేవాళ్ళని అయోమయానికి గురి చేయడానికి కాకపోతే? అని ఎవరన్నా అడగొచ్చు. నా ముఖ్య ఉద్దేశ్యం – ఈ టీకాలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అన్న యాభై శాతానికి మించిన సామర్థ్యాన్నే కలిగి ఉన్నాయని చెప్పడం, అలాగే, టీకా వేశాక కూడా ఖర్మ కాలి వ్యాధి వచ్చినా ఇవన్నీ దాని తీవ్రతను తగ్గించగలిగినవే అని చెప్పడం. మరిన్ని వివరాల గురించి ఆసక్తి ఉన్న వారు పై వికీ పట్టికలో ఉన్న రిఫరెన్సులని గానీ, ఆయా సంస్థలు ప్రచురించిన పరిశోధనా పత్రాలను/ప్రెస్ రిలీజులను చూడండి.

టీకా సాఫల్యత: ఈ ల్యాబు పరిశోధనలన్నీ అయ్యాక టీకాలని బైట విరివిగా వాడ్డం మొదలుపెట్టాక నిజంగా ఫలానా టీకా వల్ల సమాజంలో వ్యాధి ప్రాబల్యం తగ్గిందా? అన్న ప్రశ్నకి సమాధానం ఈ సాఫల్యత చెబుతుంది. ఇది కరెక్టుగా సామర్థ్యం ఉన్నంత ఉండాలని లేదు. ఎందుకంటే ల్యాబు పరిశోధనలు వేరు, బయటి ప్రపంచం వేరు కనుక. సరే, వేర్వేరే – అయితే, ల్యాబు పరిశోధనల్లో ఎవరు పాల్గొంటారో ఆ పరిశోధన చేసేవాళ్ళకి తెలుసు. తర్వాత వాళ్ళకి వ్యాధి వచ్చిందా? రాలేదా? ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? ఇలాంటివన్నీ వాళ్ళని మళ్ళీ పిలిచి ఆరా తీసుకోవచ్చు. కానీ, బయట ప్రపంచంలో మనం కోట్ల సంఖ్యలో ఇలా ఇన్ని దేశాల్లో ఈ టీకాలు వేసుకుంటున్నాము. మరి ఈ టీకా సాఫల్యత అసలు ఎలా అంచనా వేస్తారు/వేస్తున్నారు?

ఒక పద్ధతి ఏమిటంటే ఏదో ఓ కాలపరిధిలో కోవిడ్ పాజిటివ్ అయిన వ్యక్తుల వివరాలు సేకరించి, వాళ్ళ టీకా వివరాలతో దాన్ని ముడిపెట్టి టీకా ప్రభావవంతంగా ఉందా లేదా ఆంచనా వెయ్యడం. ఉదాహరణకి, బ్రిటన్‌లో సామూహిక కోవిడ్ టీకా కార్యక్రమం మొదలైనాక అలా చేసిన ఒక పరిశోధనలో రెండు మూడు నెలల (డిసెంబర్ 2020-ఫిబ్రవరి 2021) వ్యవధిలో కోవిడ్ లక్షణాలు ఉన్న దాదాపు లక్షన్నర మంది ఎనభై పైబడిన వారిపై టీకాలు ఎలా పనిచేస్తున్నాయో తెలిసింది. ఇలా వివిధ దేశాలలో, వివిధ కొత్త వేరియంట్లు కూడా వస్తుండగా ఈ పద్ధతిలో వివరాలు సేకరిస్తూ టీకా సాఫల్యత గురించి కొత్త కొత్త ఫలితాలు తెలుసుకుంటోంది ప్రపంచం ఇప్పుడు! దీర్ఘకాలంగా ఇస్తున్న టీకాలకి ఇలాంటి పరిశోధనలు ఏళ్ళ తరబడి చేస్తూనే ఉంటారు. కనుక కోవిడ్ టీకాల సాఫల్యత గురించి కూడా ఇప్పుడు తెలిసినదే మనకి తుది సమాచారం కాదు!

సరే, పద్ధతి ఇదీ. కోవిడ్ టీకాల సాఫల్యత ఎంత మరి?

కెనడాలో నేనుండే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ కోవిడ్ టీకాల సాఫల్యత గురించి పరిశోధనాపత్రాల సారాన్ని మామూలు మనుషులకి అర్థమయ్యే విధంగా ఒక కరపత్రం ప్రచురించింది. అందులో రాసినదాని ప్రకారం తీవ్రంగా వ్యాధిరావడాన్ని, ఆసుపత్రి పాలవడాన్ని, మరణాలని ఫైజర్, మాడర్నా, కోవిషీల్డ్ – ఈ మూడూ 70-90 శాతం దాకా నివారిస్తున్నాయి. రెండు డోసులయ్యాక సాధారణ తీవ్రతతోనైనా వ్యాధి వచ్చే అవకాశం 91-98 శాతం తగ్గిపోతుందట ఫైజర్/మాడర్నాలతో. టీకాలొచ్చిన తరువాత కొత్తగా ప్రబలమైన డెల్టా వేరియంట్ విషయంలో టీకాల సాఫల్యత కొంత తగ్గినా, 60-80 శాతం దాకా ఉందట. కోవాక్సిన్ గురించి ఇలాంటి పరిశీలనను ఇంకా అందుబాటులో లేవు అనుకుంటాను. నాకు కనబడలేదు. ఇతర కోవిడ్ టీకాలకి కూడా ఇలాంటివి చూడాలంటే వికీపీడియాలో పరిశోధనాపత్రాల వివరాలతో సహా చూడవచ్చు. ఈ నంబర్లు చూస్తే నూటికి నూరు శాతం ప్రభావవంతంగా ఉండొద్దా? అరవై దాకా పడిపోడమేమిటి కొత్త వేరియంట్లకి? అని ఎవరికన్నా సందేహం కలగొచ్చు.

అసలు మంచి “సాఫల్యం” అంటే ఏమిటి? మంచి “సామర్థ్యం” అంటే ఏమిటి? – ఇది మంచి ప్రశ్న, పెద్ద ప్రశ్న.  కానీ, 2019-20 కాలానికి అమెరికాలో ఏటేటా అందరినీ తీసుకోమని ఫ్లూ టీకా సాఫల్యత వివిధ ఫ్లూ వేరియంట్లని కలుపుకుంటే నలభై శాతానికి దగ్గరగా ఉంది! అంటే ఈ లెక్కన ప్రస్తుతం మనకిస్తున్న కోవిడ్ టీకాలన్నీ ప్రస్తుతం వస్తున్న వేరియంట్లకి కూడా బాగా పనిచేస్తున్నట్లే లెక్క! ఫ్లూ తో కోవిడ్‌కి పోలిక ఏమిటి? అనుకోవచ్చు కానీ, నా ఉద్దేశ్యం కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే కొద్దీ టీకాల సామర్థ్యం కొంత తగ్గినా ఇంకా అవి బాగా పనిచేస్తున్నట్లే లెక్క అని చెప్పడం. అలాగే ఈ టీకాలు ఇలాగే ఉండిపోవు. వాళ్ళ పరిశోధనలూ ఆగవు. కాలానుగుణంగా ఫ్లూ టీకాలు ఏటేటా అప్పుడు ప్రబలంగా ఉన్న వేరియంట్ల కోసం మార్చినట్లు కోవిడ్‌కి కూడా మారుస్తారేమో..? ఇక, ఈ లెక్కలపైనా, ఈ అంచనాలపైనా శాస్త్రవేత్తల మధ్య వాదోపవాదాలు లేకపోలేదు.  కానీ, వాటి గురించి చర్చ ఈ వ్యాస పరిథి  బాహిరం.! పిల్లా పెద్దలకి ఇచ్చే అనేక రకాల ఇతర వ్యాధులు/టీకాల సాఫల్యత గురించిన వివరాలు కూడా వారి వెబ్సైటులో ఇక్కడ చూడవచ్చు. ఆహా, కానీ దీనికర్థం సాఫల్యం నూరు శాతం లేకపోయినా టీకాలు ఇచ్చేస్తున్నారని కానీ ఆ టీకాలు పనిచేస్తాయని కాదుగా? అనిపించవచ్చు ఎవరికైనా. నిజమే. మంచి సందేహమే.

అసలు టీకా పని చెయ్యడం అంటే ఏమిటి? – టీకా తీసుకున్నాక వ్యాధి రాకపోవడం ఒక్కటే టీకా పనితీరుకి కొలమానం కాదు. పొరపాట్న వచ్చినా అది ప్రాణాంతకం కాకపోవడం… ఎక్కువ మంది టీకా తీసుకునే కొద్దీ సమాజంలో ఒకరి నుండి ఒకరికి వ్యాధి సంక్రమించే వేగం మందగించడం…. ఆసుపత్రులలో చేరాల్సి రావడం తగ్గడం (బెడ్ల కొరత రాకపోవడం, ఇతర వ్యాధులు గలవారికి వైద్యం చేసేందుకు వైద్యులు అందుబాటులో ఉండడం కూడా!)….. మరణాలు తగ్గడం…. ఐసీయూల్లో చేరాల్సిన అవసరం తగ్గడం…. ఇవన్నీ టీకా సాఫల్యంలో భాగమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కోవిడ్ టీకాలతోనూ ఇవన్నీ ఏదో ఒక స్థాయిలో జరుగుతున్నాయి. కనుక ఏది ఎంత శాతం పనిచేస్తుంది? అన్న పోలిక మాని, మీ డాక్టరు ఏవో ఆరోగ్య కారణాల వల్ల మిమ్మల్ని టీకా వేసుకోవద్దంటే తప్ప (వాళ్ళూ ఉంటారండీ – వాళ్ళకి వ్యాధి సోకకూడదు అనుకున్నా ఇతరులం టీకా వేసుకోవాలి) మనకి అందుబాటులో ఉన్న కోవిడ్ టీకా అర్జెంటుగా వేసుకోవడం ఉత్తమం అన్నది వివిధ ప్రజారోగ్య శాఖలు, వైద్యుల ప్రసంగాలు/వ్యాసాల ద్వారా నాకు అర్థమైన విషయం.

సరే, ఈ కోవిడ్ టీకాలన్నీ బాగా పనిచేస్తున్నాయి అంటున్నారు, ఓకే- కానీ, ఎన్నాళ్ళ పాటు మనల్ని రక్షిస్తాయి?   ఇటీవలే ఆస్ట్రాజెనెకా/కోవీషీల్డ్ టీకా వేసుకున్న వాళ్ళకి జీవితకాలం వ్యాధినిరోధకశక్తి ఉండొచ్చంటూ వచ్చిన ఒక పరిశోధన గురించిన వార్త చూశాక అసలు ఈ టీకాలు మొదలుపెట్టి ఆర్నెల్లే కదా అయింది… జీవితాంతం రక్షణ ఉందని ఇంతలో ఎలా తెలుసుకుంటారు? అన్న సందేహం కలిగింది. అలాగే, అసలు ఈ టీకాల ప్రయోగాలలో పాల్గొనేది ఎవరు? ముఖ్యంగా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లోనే వాటిని వేసుకోడానికి ముందుకొస్తున్న ఆ ధైర్యశాలులు ఎవరు? అన్న కుతూహలం కూడా కలిగింది. కనుక నాకు చేతనైతే వీటి గురించి కూడా రాయాలని అనుకుంటున్నాను. కొన్నాళ్ళ క్రితం “ఫలానా టీకా డెబ్భై శాతం కూడా ఎఫెక్టివ్‌గా లేకపోతే మనకి ఎందుకిస్తున్నారు?” అని ఒక ఆన్లైన్ చర్చలో అడిగిన స్నేహితురాలి ప్రశ్నే నన్ను ప్రధానంగా ఇవన్నీ చదవడానికి ప్రేరేపించింది. కనుక ఆమెని అజ్ఞాతంగానే ఉంచుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటికిక సెలవు.

References:

  1. Vaccine efficacy, effectiveness and protection. WHO/ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి వ్యాసం. గొప్ప పరిచయం. తప్పక చదవాల్సినది. ఇలాంటివి తెలుగులో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో రావాలి!
  2. Ontario Agency for Health Protection and Promotion (Public Health Ontario). COVID-19 real-worldvaccine effectiveness – what we know so far. Toronto, ON: Queen’s Printer for Ontario; 2021. (ఇది నేను ఉండే రాష్ట్ర ప్రభుత్వపు ప్రజారోగ్య శాఖ వారి కరపత్రం. పరిశోధనాపత్రాలు చదవాలనుకుంటే దీని చివర్లో వివరాలు ఉన్నాయి).
  3. How Flu Vaccine Effectiveness and Efficacy are Measured. CDC వారి వ్యాసం.
  4. Olliaro, P., Torreele, E., & Vaillant, M. (2021). COVID-19 vaccine efficacy and effectiveness—the elephant (not) in the room. The Lancet Microbe. (ఈ పరిశోధనలలో ప్రచురించే సంఖ్యల పట్ల కొంచెం విమర్శనాత్మక దృక్కోణం)
  5. Bernal, J. L., Andrews, N., Gower, C., Robertson, C., Stowe, J., Tessier, E., … & Ramsay, M. (2021). Effectiveness of the Pfizer-BioNTech and Oxford-AstraZeneca vaccines on covid-19 related symptoms, hospital admissions, and mortality in older adults in England: test negative case-control study. bmj, 373. (కోవిడ్ టీకా సాఫల్యత పరిశోధక పద్ధతులకి ఒక ఉదాహరణ)
  6. Burnett, E., Parashar, U. D., & Tate, J. E. (2020). Real-world effectiveness of rotavirus vaccines, 2006–19: a literature review and meta-analysis. The Lancet Global Health, 8(9), e1195-e1202. (దీర్ఘకాల టీకా సాఫల్యత పరిశోధనల గురించి ఒక వ్యాసం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here