[box type=’note’ fontsize=’16’]తాను అభిమానించే కవి కొన ఊపిరితో తన వద్దకు వస్తే అతనికి ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ అంతరంగ మథనం “డి.ఎన్.ఆర్.” కథ.
[/box]
“బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్నప్పుడే
క్షణాల మధ్య అగాధంలో స్వప్న చక్షువులకు నిషా
ఖడ్గ ధారల మధ్య క్షతగాత్రుడైనా
అప్పుడు ఉజ్వలంగానే ఉంటాడు
వైరుధ్యాలను వెన్నెముకగా ధరించిన నేను
ఎడారిలో వానజల్లుల రహస్యాన్ని ఏనాడో
మౌనంగా స్వీకరించాను…
కాలం మరెవరో కాదు నేనే…”
గంభీరంగా మంద్రస్వరంలో ఆయన స్వరం తన కవితాగానం చేస్తోంది.
చిక్కడపల్లి త్యాగరాయ గానసభ, మినీహాల్ కళా సుబ్బారావు వేదిక. కవి సమ్మేళనం. ‘ఆధునిక తాత్త్విక కవుల అంతర్మథనం’ అనే పతాకం కింద వేదిక మీద కవులు ఆశీనులయి ఉన్నారు. ఆయన సన్నగా పొడుగ్గా తెల్లని లాల్చీ పైజమాలో, నెరిసిన బంగారు గిరజాల జుత్తుతో దట్టమైన కళ్ళద్దాల్లోంచి చూస్తూ కవితని చదివేస్తున్నారు. ఆయన ఒక కవీ విశ్లేషకులు కూడా.ప్రసిధ్ధ కవుల పరిచయం లో భాగం గా అజంతా కవితని గానం చేస్తున్నారు.
ఒక్కొక్క వాక్యానికీ ఆ వాక్యంలోని ఆర్ద్రతకీ సభికులు, కవితా ప్రియులు చప్పట్లు కొడుతున్నారు.
“ఎక్కడా ఎవరూ లేరు
అందరు ఇళ్ళు చేరుకున్నారు
వీధి గాయకుడు పాట ఆపేశాడు
ఎక్కడా ఎవరూ లేరు, అంతా ఇళ్ళు చేరుకున్నారు
హంతకులు కత్తులు మూలపెట్టారు
రాక్షసులు పాతాళబిలం చేరుకున్నారు
రాజ్యాధిపతులు నెత్తురు చేతులు
కడుక్కున్నారు
ఎక్కడా ఎవరూ లేరు…”
అంటూ ఆయన కొనసాగిస్తుంటే వాళ్ళ హర్షధ్వానాలు.
మరొకటి ఎత్తుకున్నారు.
“నేను మాట్లాడే భాష వేరు
మృత్యువాంఛ ప్రజ్వరిల్లుతున్న వేళ
మనిషి అంతరాంతరాలలో
నేను వ్రాసే కవిత్వం వేరు…”
ఆయనకి హఠాత్తుగా ఆయాసం మొదలైంది. మాట తడబడసాగింది.
“శిరస్సు బద్దలై… ప్రవహిస్తున్న సె ల యే… రు…”
ఆయాసంతో తడబడుతున్న ఆయన తూలిపడిపోసాగారు. వేదికమీద ఉన్న అందరూ ఆయన చుట్టూ మూగారు.
కవీ విశ్లేషకుడూ అయిన విరాగి ఆయాసంతో కుప్పకూలిపోతున్నాడు.
ఎవరో అన్నారు “ఆయనకు ఉబ్బసం ఉంది. ఏంబులెన్స్‌కి ఫోన్ చేయ్యండి! 108 అర్జెంట్..”
కవిత్వం ఆగిపోయి కాసేపట్లో శ్వాస కోసం ఇబ్బందిపడిపోయే ఆయన వూపిరి భారంగా గురకలో వినిపించసాగింది.
“హాస్పటల్, ఎమర్జెన్సీ వార్డ్! అర్జెంట్… హార్ట్ ఎటాక్ కావచ్చు…”
అందరూ సాయం పట్టి వాహనంలో స్ట్రెచర్ మీద్ పడుకోబెట్టగానే ఏంబులెన్స్ వివేక్ హాస్పిటల్ వైపు దూసుకుపోసాగింది.
***
వివేక్ హాస్పిటల్. ఆర్ఐసియు. ప్రక్కన ఉన్న డ్యూటీ రూమ్‌లలో డాక్టర్లు తేజస్విని, అభినవ్ హడావిడిగా లేచి కోట్లు సర్దుకున్నారు. సిస్టర్ ఫోన్ చేసింది, డాక్టర్ ధీరజ్ రౌండ్స్‌కి వస్తున్నారని. గబగబా బయటకి వచ్చారు.
ధీరజ్ డాక్టర్ అంటే అందరికీ భయం. భయం కంటే గౌరవం. ఆరడుగుల పొడవు, ఎప్పుడు చూసినా రెండ్రోజుల నుంచి షేవ్ చేసుకోకుండా వున్న గడ్డం, నలుపు తెలుపు రంగుల గిరిజాల జుట్టు, తీక్షణమైన కళ్ళు. అతను చీఫ్ ఫిజీషియన్. అదే హాస్పిటల్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. కానీ రోజూ రౌండ్స్‌కి రాడు. తన గదిలో పుస్తకాలు చదువుకుంటూ ఒకప్పుడు, ఇయర్ ఫోన్లు పెట్టుకుని కీబోర్డ్ వాయిస్తూ తన సంగీతం తనే వింటూ ఏదో లోకంలో వుంటాడు. రిటైర్‌మెంట్ వయసు దాటినా అతన్ని చీఫ్‌గానే కొనసాగిస్తున్నారు. అతి కష్టమైన కేసులు, క్లిష్టమైన వ్యాధి నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు అతన్ని పిలుస్తుంటారు. మిగిలిన సమయాల్లో తనకిష్టమైన కేసులని తీసుకుని వైద్య విద్యార్థులకి వ్యాధి నిర్ణయం, వైద్య రంగంలోని నూతన పరిణామాల గురించి క్లాస్‌లు చెబుతాడు.
ఆయనొక వింత వ్యక్తి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఎప్పుడు సంతోషిస్తాడో తెలియదు. ఆయన మాట కూడా కటువుగానే వుంటుంది. పేషంట్లు బాధపడేట్టు మాట్లాడుతాడు. కాని అతని వ్యాధి నిర్ణయం ఇతరులకి అవగాహనలో లేనిది. ఖచ్చితంగా కరక్టే అవుతుంది.
అతని మందు పని చేస్తుంది! అందుకే అతన్ని ఈ హాస్పిటల్‌లో కొనసాగనిస్తున్నారు.
అందుకే అతనంటే చిన్నడాక్టర్లకి భయం.
“గుడ్ మార్నింగ్ సార్!”
ధీరజ్ డాక్టర్ “మార్నింగ్” అని గొణిగి, “ఎక్కడా ఆ కవి గారు?” అని అడిగాడు,
“బెడ్ నంబర్ 9 సర్. ఎక్యూట్ ఎస్.ఓ.బి (ఆయాసం) సి.ఓ.పి.డి. హెవీ స్మోకర్ సార్. హైపర్ టెన్షన్.”
“చెస్ట్ ఎక్స్‌రే?”
“న్యూమోనిటిస్ ప్యాచ్ వుంది సర్, రైట్ లోబ్”
“ఇ.సి.జి. ఎకో?”
“ఓల్డ్ ఎం.ఐ. ఎకోలో గుండె ప్రకంపనం తక్కువగా ఉంది. ఎజెక్షన్ 35%”
“కిడ్నీ, లివర్, బ్లడ్ కెమిస్ట్రీ?”
“అవి మాత్రం నార్మల్ సార్!”
“కాని ఆక్సీజన్ శాచ్యురేషన్ మాత్రం 88 పర్సెంటే వుంటోంది. ఆక్సీజన్ మాస్క్ ఇస్తేనే సరిపోతోంది”
ధీరజ్ డాక్టర్ వస్తూనే అన్ని వివరాలు కనుక్కున్నాడు.
బెడ్ మీద కవి విరాగి బలహీనంగా ఆయాసపడుతూ ముఖం మీది ఆక్సీజన్ మాస్క్‌తో భారంగా వూపిరి తీస్తున్నాడు.
సి.ఓ.పి.డి. (దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి), శ్వాసక్రియ వైఫల్యం, గుండె పోటు వల్ల గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం. వృద్ధాప్యం…
“పల్మనరీ ఎంబాలిజం కావచ్చా?” అడిగాడు.
“లేదు సార్. డి-డైమర్ నార్మల్”
“నమస్తే! నా పేరు డాక్టర్ ధీరజ్” అన్నాడు.
ఆయన కళ్ళు చికిలించి చూశాడు.
ధీరజ్ కేస్ షీట్ చదివాడు. ట్రీట్‌మెంట్ అంతా కరెక్టుగానే వుంది. ఏంటీబయాటిక్స్ వూపిరితిత్తుల శ్వాసనాళాల్ని వ్యాకోచింపజేసే ఎసిబ్రోఫిలిన్, నెబ్యులైజర్‌తో వాయువులు, స్టిరాయిడ్స్, రక్తం పల్చబడే మందులు అన్నీ ఉన్నాయి.
“ఇదేమిటి?” అని అడిగాడు ఆశ్చర్యంగా కేస్ షీట్ మొదటి పేజీలో D-N-R Do Not Resuscitate (నన్ను రక్షించకండి) అన్న టైటిల్‌తో వున్న కాగితం మీద విరాగి అన్న సంతకం, సాక్షి సంతకాలు. “పూర్తి తెలివితేటలతో నేను కోరుకున్న విధంగా నన్ను వెంటిలేటర్, ఎండోట్రేకియల్ ఇన్‌ట్యుబేషన్‌తో రక్షించవద్దు…”
కారిడార్‌లో చూశాడు. వృద్ధ వనిత, ఆయన భార్య కావచ్చు. పెద్ద బొట్టుతో మెళ్ళో పసుపుతాడుతో ముతకరంగు కాటన్ చీరలో… బీదతనంలోనే హుందాతనంతో నిలబడి వుంది. ఆమె పక్కనే ఒక మధ్యవయస్కుడు పంచె కట్టుకుని నెరసిన జుట్టూ కళ్ళజోడుతో నిలబడి వున్నాడు. వాళ్ళ కళ్ళల్లో దైన్యం వున్నా, ఆందోళన లేదు.
బయటకు వచ్చి, “ఎందుకని మీరు డి.ఎన్.ఆర్. సంతకం పెట్టించారు? చికిత్స చేస్తే ఆయనకు తగ్గుతుంది! లేక ఆర్థిక కారణాలా? ఇన్సూరెన్స్ లేదా?”
“రోజుకి నలభై వేలు అవుతుందన్నారు డాక్టరు గారూ! మేం భరించలేం.”
“ఆయనకి ఆరోగ్య శ్రీ కార్డు కానీ, ఇన్సూరెన్స్ కానీ…”
“ఆరోగ్య శ్రీ వుంది కానీ ఆయన వేరే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళరు. వెళ్ళినా పై ఖర్చులు తడిసి మోపెడవుతాయి!” అన్నది ఆవిడ.
ధీరజ్ డాక్టర్ కళ్ళు మూసుకున్నాడు.
విరాగి! విరాగి! విరాగి! ఒక మహానుభావుడు. ఒక మహాకవి. విశ్లేషకుడు.తన ఊహల్లో విలయాన్ని సౌందర్యాన్ని సృష్టించిన పదచిత్రకారుడు.మహాకవి అంతరంగాన్ని తనకి ఆవిష్కరించిన వ్యక్తి. ఇలా మరణ శయ్య మీద!
“నాకు నిలయం లేదు.
నాకు విలయం లేదు
అశాంతిని ఆక్రమిస్తాను
అడవిలో వెన్నెలను
దుస్తులుగా ధరిస్తాను…”
“అర్ధరాత్రి భీభత్సం
మేలుకొనేటప్పుడు
శూన్యం మీద శూన్యంగా కూర్చుని
రాలుతున్న నక్షత్రాల మీద
నా గీతం రచిస్తాను…”
***
రెండో రోజు మధ్యాహ్నం ధీరజ్ రౌండ్స్‌కి మళ్ళీ వచ్చాడు.
కవి విరాగి ఆయాసపడుతున్నాడు. అప్పటికే హాస్పిటల్ యాజమాన్యం నుంచి ఒత్తిడి.
“ఆయన్ని డిశ్చార్జ్ చేయండి. ఫీజులు కట్టలేడు. మనకి ఎందుకు? LAMA – లెఫ్ట్ ఎగైనెస్ట్ మెడికల్ అడ్వైజ్ క్రింద పంపించేయండి. ఆ తర్వాత బిల్ కట్టకపోతే మనకి కష్టం!”
ధీరజ్ చుట్టూ అసిస్టెంట్లు అన్నీ చెబుతున్నారు.
ఆక్సీజన్ శాచ్యురేషన్ పడిపోతోంది. దీర్ఘకాలం అంటే ఇరవై ఏళ్ళు సిగరెట్లు తాగిన ఫలితం. జ్వరం తగ్గలా.
“నమస్తే” అన్నాడు ధీరజ్.
ఆయన కళ్ళు ఆర్పారు.
“నేను మీ అభిమానిని” అన్నాడు ధీరజ్.
ఆయన పెదాల్లో జాలిగా మందహాసం.
“ఓకె. నేను ఆయనని డిశ్చార్జ్ చెయ్యను. ‘లామా’ కూడా చెయ్యను. ఆయన తప్పక బాగవుతారు!”
***
మూడవరోజు.
జ్వరం పెరిగింది. ధీరజ్ రౌండ్స్‌కి వచ్చినప్పుడు ఆయన ఇంకా ఆయాసపడుతున్నాడు. ఆర్.ఎం.ఓ. సుబ్బారావ్ ప్రక్కనే వచ్చి నిలుచున్నాడు.
“మీరేమన్నా సరే! నేనాయనని డిశ్చార్జ్ చేయను!”
“సూపర్నెంటు గారు, డైరక్టర్ గారు గట్టిగా చెప్పారండి! వారి బంధువులు కూడా ఒప్పుకుంటారు. సంతకం పెట్టించేసి, పంపేయండి అనీ” ఆర్.ఎం.ఓ. మెల్లగా, రహస్యంగా చెబుతున్నాడు.
“విరాగి గారూ ఎలా ఉన్నారు?” అడిగాడు ధీరజ్.
ఆయన మాట్లాడలేదు.
డా. తేజస్విని హఠాత్తుగా అరిచింది, “సార్! SpO2 ఫాలింగ్, 80, 70, 60%”
కవి విరాగి ఆయాసపడసాగాడు. ఆ క్షణంలో ఆయన కనుగుడ్లు పైకి వెళ్ళిపోతున్నాయి. పెదాలు వణికి, చేతులు కాళ్ళు కొట్టుకోసాగాయి. నోటి వెంబడి నురగ!
“ఆయనకి సీజర్స్ (ఫిట్స్) వస్తున్నాయి. ఎనక్సియా! (ఆక్సిజన్ లేమి). ఎన్‌సెఫలోపతీ (మెదడు వ్యాధి).. ఇంట్యూబేట్ ఫాస్ట్…!”
మానిటర్ అలారం మోగసాగింది.
ఎవరూ కదలలేదు.
“డాక్టర్ తేజీ! తేజస్వినీ ఫాస్ట్… ఇంట్యూబేట్. అభినవ్! ఫాస్ట్! ఏంటి అలా చూస్తున్నారు?”
నర్సులు, డ్యూటీ డాక్టర్లు తన శిష్యులు అందరూ నిశ్చలంగా స్థాణువుల్లా కదలిక లేకుండా విగ్రహాల్లా నిలబడ్డారు.
“Do Not Resuscitate సార్. సంతకం పెట్టేశారు” అంది తేజస్విని డాక్టర్.
“వాట్ నాన్సెన్స్! హి ఈజ్ డైయింగ్. మహా కవి, వేదాంతి.. నో… నో!”
ఆర్.ఎం.ఓ. సుబ్బారావ్ ఈసారి పెద్దగానే అన్నాడు – “D-N-R కేసు సార్! ఏం చేయకండి! పల్స్.. 60 – 59%, 58 SpO2…”
మెరుపు వేగంతో పేషంట్ తల దగ్గర నిలబడి మెడని వెనక్కి తిప్పి ఎమర్జెన్సీ ట్రేలోని ఎండోట్రేకియల్ ట్యూబ్ తీసి ఆయన గొంతులోంచి శ్వాసనాళంలోకి అమర్చాడు ధీరజ్.
“కనెక్ట్ వెంటిలేటర్!” భీకరంగా అరిచాడు.
నర్స్ నీలవేణి వెంటనే కనెక్ట్ చేసింది.
సుబ్బారావ్ అరుస్తూనే ఉన్నాడు… “సార్! వద్దు!”
“నేను… నేను కడతాను బిల్! నా జీతంలో కట్ చేయండి సరేనా?” ధీరజ్ డాక్టర్ అరిచాడు.
“గెటవుట్ ఫ్రం హియర్. హి ఈజ్ మై పేషంట్. ఐ హావ్ టు సేవ్ హిమ్. గివ్ ఎటివాన్ 1 ఎం.జి. ఐవి. చెక్ బిపి…” అరుస్తూ, ఆర్డర్స్ ఇవ్వసాగాడు.
65, 70, 80, 90, 95 – 98% SpO2 మానిటర్‌లో పెరిగి పేషంట్, కవి విరాగి క్రమబద్ధంగా ఊపిరి తీయసాగాడు.
“లెవిపిల్ బైకార్బోనేట్ ఎట్రోపిన్” ధీరజ్ అరుస్తూనే ఉన్నాడు.
***
ఐదు రోజుల తర్వాత…
విరాగికి పూర్తిగా తగ్గింది. వెంటిలేటర్ పూర్తిగా తీసేసి ఎక్స్‌ట్యుటేట్ చేశారు. లేచి కూర్చున్నాదు. ఎవరో ఆయన నుదుటన బొట్టు పెట్టారు. భార్య ఒక గిన్నెలో ఏదో జ్యూస్ తాగిస్తోంది.
“రేపే డిశ్చార్జ్…” అన్నాడు ధీరజ్ నవ్వుతూ.
“సార్. ఇప్పటి కయినా సిగరెట్స్ మానండి. మీకు తీవ్రమైన ఆస్తమా వుంది. ఇంట్లోనే ఆక్సీజన్ సిలిండర్ పెట్టుకోండి! నెబ్యులైజర్‌తో మందులు రాసిచ్చినవి పీల్చండి. అంతే, అన్నీ తగ్గిపోతాయి! కవిత్వం మాత్రం ఆపద్దు!” నవ్వాడు.
డాక్టర్ తేజస్విని, అభినవ్, నర్స్ నీలవేణి ఇప్పుడు చిరునవ్వుతో చూస్తున్నారు.
విరాగి నీరసంగా, ధీరజ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు.
వాళ్ళ డబ్బు సమస్య లేదు కాబట్టి ఇప్పుడు ఆమ్.ఎమ్.ఓ. సుబ్బారావ్ అక్కడ లేడు.
మానిటర్ కూడా ప్రశాంతంగా వుంది.
***
ఆఖరి రోజు.
కవి విరాగి డిశ్చార్జ్ అయ్యాడు.
అయనని ఇంటికి తీసుకువెళ్ళడానికి బయట ఏంబులెన్స్ సిద్ధంగా వుంది. చేతి సంచులతో భార్య, కుమారుడు నిలుచున్నారు.
వార్డ్ బోయ్‌ని వద్దని, ధీరజ్ డాక్టర్ ఆయనని వీల్ ఛెయిర్‌లో కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళసాగాడు తనే స్వయంగా. మాసిన గడ్డం, ఎర్రని కళ్ళు ధీరజ్ డాక్టర్ సీరియస్ ముఖంలో ఈరోజు ఎప్పుడూ లేని తృప్తి.
కవి విరాగి మెల్లగా అడిగాడు.
“డాక్టర్! నన్ను ఎందుకు రక్షించావ్? ఆకాశమార్గాన పోయేవాడిని మళ్ళీ భూమి మీదకి ఎందుకు లాగావ్?”
“మీరు నా పేషంట్ కాబట్టి! మీరొక మహావ్యక్తి కాబట్టి. నేను మీ ఫ్యాన్‌ని కాబట్టి!”
కారిడార్‌కి అటుఇటూ నడుస్తూ వార్డ్‌బోయ్‌లు, డ్యూటీ డాక్టర్లు తేజస్విని, అభినవ్, నర్స్ నీలవేణి ఇంకా కొందరు స్టాఫ్ నిలబడి ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్నారు.
గద్గద స్వరంతో అంకితభావంతో డాక్టర్ ధీరజ్ ఆలపించసాగాడు.
అది అజంతా రాసిన అద్భుత కవిత.
“చెప్పలేదా నేను చెప్పలేదా
అంతా ఒకే శబ్దం అని
సర్వవ్యాప్తమైన శబ్దవలయంలో
ఖండితహస్తాలు ఆవిష్కరిస్తున్న
జననాంతర గ్రహణ దృశ్యాలను తలచుకొని
నీ కన్నులు జలార్ద్రమైనపుడు
చెప్పలేదా నేను చెప్పలేదా
మృత్యువు ఒక హెచ్చరిక మాత్రమే అని
ఆకురాలుతున్న శబ్దం ఒక ఆహ్వానం మాత్రమే అని
చెప్పలేదా నేను, చెప్పలేదా….
……
……
అక్షరం నిండా అన్నీ అద్భుతాలే అని
శబ్ద శక్తి సార్వభౌమాధికారం అనాహతం అని
…..
……
శరీరాన్ని జయించిన ఒక జీవితం
అట్టడుగున శబ్దపేటికలో
ఒక అస్థిక వికసిస్తున్న శబ్దం నేనే
అంతా ఒక చిత్కళ!”
(సమాప్తం)
~ మధు చిత్తర్వు
(ఈ కథలోని కవితలు మహాకవి అజంతా ‘స్వప్నలిపి’ లోనివి. వారికి కృతజ్ఞతలు)