దాతా పీర్-10

0
9

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[సమద్ ఏదైనా ప్రభుత్వోద్యోగంలో చేరాలి లేదా పెద్ద కొడుకుతో పాటు హోటల్ బిజినెస్‍లోకి దిగాలని సమద్ తండ్రి కోరిక. సమద్ రెండో అన్నయ్య పాట్నాలో బ్యాంక్ మేనేజర్‍గా పనిచేస్తున్నాడు. తండ్రి చెప్పిన రెండు మార్గాలు తనకి నచ్చలేదని అమ్మకి చెప్తాడు సమద్. ముందు పి.హెచ్.డి. చేయాలనుకుంటున్నానని అమ్మ ద్వారా తండ్రికి చెప్తాడు. పెద్దన్నయ్య మసూద్‍కి ఇది నచ్చదు. ఖాళీగా ఉంటున్న సమద్ పగలంతా తన రిసర్చ్‌కు సంబంధించిన పనుల్లో, లేదా రహ్మనియా లోనో ఉండి, రహ్మనియా మూసేసిన తరువాత కబ్రిస్తాన్‌కి వస్తాడు సమద్. అక్కడ తన కవితలు చదివి వినిపిస్తాడు. ఏడాది తర్వాత పీ.హెచ్.డీ. ప్రవేశ పరీక్షలో పాసై, మీర్ కవిత్వంలో సూఫీవాదం అన్న విషయం మీద తనకిష్టమైన ప్రొఫెసర్ పర్యవేక్షణలో రిసర్చ్ కోసం రిజిస్టర్ చేసుకుంటాడు. పరీక్షలైపోయాక, జూబీతో కలవడం కుదరదు. ఇంట్లో జూబీనే పెద్దకూతురు కావడంతో, ఆమెకు పెళ్ళి చేయాలని తొందరపడుతూంటారు ఆమె తల్లిదండ్రులు. తండ్రి ఆతిఫ్ ఖాన్ త్వరలో రిటైరవబోతున్నాడు. మధ్యలో రెండు సార్లు సస్పెండ్ అవడం వల్ల ప్రమోషన్ ఆగిపోతుంది. భార్య బానో ద్వారా జూబీ – సమద్‍ల ప్రేమ సంగతి తెలుసుకుని కోపగించుకుంటాడు. సమద్ గురించి విచారించి, అతనితో పెళ్ళయితే, జూబీ సుఖపడలేదని ఇంట్లో అందరికీ చెప్తాడు. భార్య నచ్చజెప్పిన మీదట సమద్ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతాడు. ఆయన సమద్‌ని తక్కువ చేసి మాట్లాడి, సమద్‍కు బదులుగా రెండో కొడుక్కు మసూద్‍ని అల్లుడిని చేసుకోమంటాడు. ఆతిఫ్ ఖాన్ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి ఈ వార్త చెబుతాడు. బానో మండిపడుతుంది. ఎంత నచ్చజెప్పినా వినడు ఆతిఫ్ ఖాన్. జూబీకి ఈ విషయం తెలిసి మౌనంగా ఉండిపోతుంది. నికాహ్ తేదీ నిశ్చయమవుతుంది. సమద్‍కి ఈ వార్త తెలిసి ఖిన్నుడవుతాడు. జూబీ ఎలాగొలా సమద్‍తో మాట్లాడి తనపై నమ్మకం ఉంచమని చెప్తుంది. సమద్‍లో మార్పులొస్తాయి. కవిత్వాన్ని వదిలేస్తాడు, ఎప్పుడూ తిరిగే ప్రాంతల వైపే వెళ్ళడం మానేస్తాడు. నికాహ్ సమయంలో కాజీ అడిగినప్పుడు ఈ పెళ్ళి తనకిష్టం లేదని చెబుతుంది జూబీ. కాసేపు గందరగోళమయ్యాకా, అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి తాను చేయించనని చెప్పి కాజీ వెళ్ళిపోతాడు. పెళ్ళి ఆగిపోతుంది. మసూద్‍ తనకి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు బాధపడతాడు. ఇందుకు తన తండ్రే కారణమని అనుకుంటాడు. సమద్‍లో నిరాసక్తత పెరిగిపోతుంది. ఒకనెల తరువాత జూబీ చనిపోయిందన్న వార్త తెలుస్తుంది. తండ్రే చంపేసాడనీ, పోలీసులొచ్చి అరెస్టు చేశారనీ తెలుస్తుంది. భయంకరమైన యీ నిజాన్ని విన్న తరువాత సమద్ జీవచ్ఛవమవుతాడు. ఇల్లూ వాకిలీ వదిలి భిక్షువుగా మారి, ఎక్కడెక్కడో తిరుగుతాడు. క్రమంగా షాహ్ షర్జాలో స్థిరపడతాడు. ఏడు సంవత్సరాల తర్వాత అతనికి శాంతి లభిస్తుంది. సమద్ ఫకీర్ అయిపోతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-8

[dropcap]స[/dropcap]మదూ ఫకీర్‌ను కలిసొచ్చాక రసీదన్ ప్రపంచమే మారిపోయింది. ముందు రెండు మూడు రోజులు ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంది. తన మేనల్లుడు సమదూ కాంతిమయ జీవిత ప్రకాశంలో స్నానించి వచ్చిన తరువాత, రసీదన్ మౌనంగా ఇంటి పనులు చేసుకుంటూ, తన పిల్లలను గమనిస్తూ ఉంటున్నది. గత జీవితపు జ్ఞాపకాల్లోకి వెళ్తూ వస్తూంది. అప్పటి మనుషులను గుర్తుకు తెచ్చుకుంటున్న ఆమె మనసులో ఏమి జరుగుతోందో, కొడుకూ, కూతుళ్ళతో సహా, ఎవరూ గుర్తించలేకుండానే ఉన్నారు. సత్తార్ మియ్యాకు వీటితో సంబంధమే లేదు.

అమీనాను సాబిర్ అడిగాడు, ‘మీ అమ్మకేమైంది అసలు? మాట్లాడటమే లేదే?’

‘నాకూ అర్థం కావటం లేదు. ఒక రోజు ఇంట్లోంచీ మాయమైపోయింది. ఇక్కడైతే ఎక్కడికీ వెళ్ళటం, రావటమే లేదు. కానీ ఆ రోజు మధ్యాహ్నం తరువాత వచ్చిందింటికి! ఎక్కడికెళ్ళిందో ఏమీ చెప్పనేలేదు. అడిగినా మౌనమే!! అదిగో, ఆ తరువాతే, ఇలా తయారైంది.’ అమీనా దిగులుగా అంది!

ఆ రోజు రసీదన్ ఇంటికి రాగానే ఫజ్లూ కూడా అడిగాడు. ‘ఎక్కడికెళ్ళావ్ చెప్పకుండా? నీకోసం ఎప్పటినుంచో వెదుకుతూనే ఉన్నాం. మెయిన్ రోడ్‌లో పీర్ బహోర్ పోలీస్ స్టేషన్ దగ్గర టెంపోలో నువ్వు వెళ్తుండగా చూశానన్నాడు సత్తార్ మియ్యా. ఏమి పనుందని అక్కడికెళ్ళావ్? చెప్పకుండా వెళ్ళొద్దెక్కడికీ!! మునుపటి రోజుల్లో పాట్నా కాదు. ఎక్కడ చూసినా జనం జనం, ఎక్కడైనా పడితే కష్టమైపోతుంది. ముందే నేను ఒకటిన్నర కాలువాడిని, నీకేమైనా ఐతే, ఎలా?’

ఫజ్లూ ప్రశ్నలకూ రసీదన్ మౌనమే సమాధానం.

చున్నీతో అసలు మాటలున్నట్టే ఉండదు రసీదన్‌కు! చున్నీ అడగాలేదు, రసీదన్ చెప్పనూ లేదు. అడగకున్నా అమ్మ ఇటీవల ఏమీ మాట్లాడకుండా ఉంటున్న సంగతి చున్నీ గమనిస్తూనే ఉంది. మాటమాటకూ తనమీద విరుచుకుపడే అమ్మ, ఏమీ మాట్లాడకుండా ఉంటూంది అంటే, అంటే ఏదో లోపల్లోపల జరుగుతోంది ఆమెలో!!

ఈ లోపల రసీదన్, చాలా సమయం దాతా పీర్ మనిహారీ మసీదులోనే గడుపుతోంది. అక్కడి శుచీ, శుభ్రతా అన్నీ ముందునుంచీ తనే చూసుకునేది. అక్కడ రోజూ అగర్బత్తీలు వెలిగించటం, ఎక్కడినుంచైనా నాలుగైదు పూలు తీసుకువచ్చి అలంకరించటం, ఆమె బాధ్యతే!! కానీ సమదూ ఫకీర్‌ను కలిసి వచ్చిన తరువాత, ఇంకా ఎక్కువ సేపు మసీదు దగ్గరే కూర్చుంటూంది, సమాధి మీదే చూపులు నిలిపి! తరచూ ఆమె కళ్ళకెదురుగా, సమదూ ఫకీర్, కాలే ఫకీర్ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నట్టున్న ఒక బొమ్మ కనిపిస్తూ ఉంటూంది. ఒకరిది నల్ల రంగు జుబ్బా, మరొకరిది తెల్ల రంగు జుబ్బా. రసీదన్ జీవితంలో ఇదన్నిటికంటే అందమైన మజిలీ. ఇది చూస్తూ ఆమె కళ్ళల్లో తడి! ఈ రోజుల్లో ఆమె తనను తానే మర్చిపోతోందప్పుడప్పుడు! ఇలా తన్ను తాను మరచిపోయే అలవాటును సమదూ ఫకీర్ నుంచీ వెంట తెచ్చుకుంది. రసీదన్‌కు ఇదంతా బాగుందనే అనిపిస్తూంది మనసులో! ఇప్పటిదాకా ఆమె జీవితమంతా బాధాకరంగానే గడిచింది, యంత్రం లాగానే!! అలా తన జీవితముంటుందని ఊహించనైనా లేదామె!! అలా అని ఇప్పుడు కోపమూ లేదు, ఫిర్యాదూ లేదు! ఒకవేళ చెప్పాలనుకున్నా, ఎవరికి చెప్పుకుంటుంది? నజీర్ వెళ్ళిపోయిన తరువాత సత్తార్ మియ్యాను గుదిబండలాగా మెడకు తగిలించుకుని తాను చేసిన తప్పు లోపల్లోపల మంటలాగ కాల్చివేస్తూనే ఉంది ఇప్పుడు కూడా!!

ఈ రోజుల్లో రాత్రులు కాస్త తెరిపినపడినట్టున్నాయి! వేగంగా గాలి వీస్తుంది. మంచు తేలిపోతుంది. కానీ చలైతే ఉండనే ఉంటూంది, అస్సలు సిగ్గులేకుండా డేరా వేసుకుని కూర్చుని, కదిలే ఉద్దేశమే లేనట్టు! ఏదో ఒకటి రెండు గంటలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూంది. ఒకరోజు ఎండలో కూర్చుని మొబైల్‌లో గుసగుసగా మాట్లాడుతున్న చున్నీని రసీదన్ చూసి పిలిచింది, దగ్గరికి రమ్మని సైగ చేస్తూ! ముందు చున్నీకి అర్థం కాలేదు. విస్తుపోయి అమ్మ వైపు చూసింది. రసీదన్ మళ్ళీ మళ్ళి దగ్గరికి రమ్మని సైగ చెస్తుంటే లేచింది.

ముంగిలిలో పొయ్యిమీద అన్నం కోసం ఎసరు పెట్టి కూర్చుని ఉంది అమీనా. చున్నీని సైగ చేసి అమ్మ పిలుస్తూ ఉంటే చూసి, తను కూడా ఉలిక్కిపడింది. నమ్మలేకపోతూంది, కానీ కాళ్ళూ, చెవులూ ఉన్నాయికదా, జరుగుతున్నది చూపిస్తూ! ఎసరునలాగే వదిలి, అమీనా కూడా పిల్లిలాగా చప్పుడు చేయకుండా వెనకే నడిచింది. దాతా పీర్ మసీదు దగ్గర అమ్మ, చున్నీతో మాట్లాడుతూ ఉండటం చూసింది, ఒక్క క్షణం ఆగింది. మళ్ళీ వెనక్కి వచ్చి, కుత కుతా ఉడుకుతున్న ఎసరులో బియ్యం వేసింది.

రసీదన్ చున్నీతో అన్నది.. ‘చున్నీ, నేను చెప్పే ఒక్కో మాటా ప్రశాంతంగా విను.’

‘ప్రశాంతంగా చెబితే ప్రశాంతంగానే వింటాను. నువ్వు చెప్పు ముందు!’ చున్నీ మాటల్లో అదే మునుపటి పొగరు.

‘నీ పొగరు కాస్త తగ్గించు బిడ్డా! నేను నిన్ను కన్నాను. నీ మంచికే చెబుతాను గానీ చెడుకు కాదు. ఏ చెత్తకుప్పలోనుంచో తీసుకుని రాలేదు కదా నిన్ను? అర్థమైందా? నన్ను నమ్ము. మీ నాన్న చనిపోయేనాటికి నువ్వింకా నా పాలు తాగుతున్నావ్. ఇక్కడ గుంతలు తవ్వి తవ్వి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను. నీకేది ఇష్టమైతే అదే చేస్తాను. బబ్లూతో పెళ్ళా? అలాగే చేస్తాను. మనమేమీ శేఖ్ లమో, పఠాన్లమో కాదు కదా, వంశం గురించి బాధపడేందుకు? నువ్వు నీ ధోరణి కాస్త మార్చుకో! అంతే! ముప్పైరెండు పళ్ళ మధ్య నాలుకలాంటివి మన జీవితాలు. హిందువుల ప్రాంతమిది. అందరితో కలిసి మెలిసి ఉండాలి. ఈ రోజుల్లో ఒక మాటతో గొడవలు సృష్టించడానికి ఎంతో సమయం పట్టదు, జనాలకు! అర్ధరాత్రీ, అపరాత్రీ, బబ్లూ గోడ దూకి వస్తాడిక్కడికి! వయసులో ఉన్న ఆడా మగా పిల్లలమీదో కన్నేసి ఉంచుతారందరూ! ఖర్మకాలి బబ్లూతో ఏమైనా ఐతే, జనాలేమంటారు? నీ జీవితం నాశనమైపోతుంది. అర్థం చేసుకో చున్నీ!! బబ్లూ రాకపోకలు బంద్ ఇంకమీద! అమీనా కోసం కూడా సంబంధాలు చూస్తున్నాం. ముందు తన పెళ్ళి కానీ. తరువాత నువ్వేమంటే అదే చేద్దాం. మరొక్క మాట, బబ్లూతో కూడా చెప్పు మాట మార్చకు అని! దొంగ దొంగగా కలవటం మానెయ్. దోపిడీ కేసైతే ఇంకా నడుస్తూనే ఉంది. ఏదో ముట్టజెప్పి కేసునుంచీ బైట పడితే ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టుకుంటే మంచిది. పోగొట్టుకునే బదులు, మన చేతుల్లో డబ్బులుంటాయ్. ఫజ్లూతో మేము మాట్లాడుతాం. నేను బతికున్నంతవరకూ, నిన్నెవరూ ఏమీ చెయ్యలేరు. దాతా పీర్ ముందు చెబుతున్నా, నువ్వు నా మాట విను!’ తన మాటలాపి, రసీదన్ పెద్ద నిట్టూర్పు విడిచింది. నమ్మకం నిండిన కన్నులతో చున్నీకేసి చూసింది.

చున్నీ తల వంచుకుని అమ్మ మాటలు వింటూ ఉంది. తన ప్రేమ సంగతి ఇంత తేలికగా విడిపోతుందని ఊహించనేలేదసలు! అమ్మ మంచితనం చూసి ఒకవైపు ఆశ్చర్యం, మరో వైపు ఆనందం!! తలెత్తి అమ్మకేసి చూసింది. ఆమె ముఖంలో సరికొత్త రంగు! తన ప్రేమ జయించిన రంగు, నమ్మకపు రంగది!! చున్నీ గొంతులోంచీ అమృతం చిలికింది, ‘అమ్మా, నా మీద నమ్మకముంచు. పద, వెళ్దాం.’

ఇక్కడ ఎసరులో బియ్యం ఉడుకుతున్నాయి. అటు చున్నీ, అమ్మా – ఇద్దరి కలయిక గురించి అమీనా మనసు ఉడికిపోతూంది. అన్నంలోంచీ గంజి వార్చి, మళ్ళీ అటుకేసి వెళ్ళింది నక్కి నక్కి అమీనా. ఇద్దరూ చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేమి మాట్లాడుకుంటున్నారో విందామని ప్రయత్నించింది, ఊహూ, లాభం లేదు. అమ్మ గురించి కాదు కానీ, చున్నీ తనను చూస్తే? అమ్మో, అందుకే మళ్ళీ పిల్లిలా నెమ్మదిగా వచ్చేసింది.

రసీదన్ లేచింది. లేస్తూ లేస్తూ, ఒకసారి అబ్బా.. అంది మోకాలి నొప్పిని అణుచుకుంటూ! చున్నీ అమ్మకు చేయందించింది. కూర్చోవటానికీ, నిల్చోవటానికీ, కాస్త ఇబ్బంది పడుతోంది, రసీదన్ ఇటీవల. నడుస్తూ నడుస్తూ, చున్నీ అడిగింది, ‘ఆ రోజు ఎక్కడికెళ్ళావ్? చాలాసేపటికొచ్చావ్ ఇంటికి! అందరమూ వెదుకుతూనే ఉన్నాము.’

‘చెబుతా చెబుతా! ఈ వయసులో ఎక్కడికి పారిపోగలను? నిన్నూ తీసుకెళ్తా ఒకసారక్కడికి!’ నవ్వుతూ చున్నీ వైపు చూసింది రసీదన్.

ఇద్దరూ ముంగిలిలోకొచ్చారు. తనకేమీ పట్టనట్టు, అమీనా పొయ్యిలో మిగిలున్న నిప్పుతో చేతులు కాచుకుంటూ ఉంది. అక్కడున్న స్టూల్ మీద కూర్చుంటూ రసీదన్ అమీనానడిగింది, ‘చాయ్ పెడతావా అమీనా?’

‘ఊ..’ హుంకరించింది అమీనా.

‘లే లే, ఈ రోజు నేను చేస్తాను చాయ్.’ పొయ్యికేసి నడుస్తూ చున్నీ ఉల్లాసంగా అంది.

కరెంటు షాక్ తగిలినట్టే అనిపించింది, అమీనాకు! అదిరిపడింది. ‘అరే.. యీ రోజు ఏదో అద్భుతం జరుగుతోందే?’ అనుకుంది.

కబ్రిస్తాన్ దగ్గర సందడి మొదలైంది. ఈ రోజు జుమ్మా కదా!! నమాజ్ కోసం జనం మసీదులోకి వస్తున్నారప్పుడే!! వజూ చేసేచోట కుళాయిల దగ్గర చేరిన వాళ్ళ గొంతులు ముంగిలిలో వినిపిస్తున్నాయి.

***

రసీదన్ ఫజ్లూతో పాటూ, మసీదు దగ్గరున్న గదిలో కూర్చుని ఉంది. సాబిర్ కూడా ఉన్నాడక్కడే!! సాయంత్రపు మసక చీకటి. చలి పెరుగుతూ ఉంది. ఇంతకు ముందు ఫజ్లూ చెప్పడంతో సాబిర్ ల్హాసా మార్కెట్ నుండీ షాల్ తీసుకునొచ్చాడు. ఆ షాల్ కప్పుకునే రసీదన్ కూర్చునుంది. ఆ గదిలోకి రసీదన్ అంతగా రాదు. ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ, అక్కడ కూర్చుని మందు తాగుతుంటారని ఆమెకు తెలుసు. తానక్కడికి వెళ్ళినప్పుడు అక్కడేవైనా అలాంటివి కనిపిస్తే, తనకు ఏడుపొస్తుంది. ఇద్దరూ యీ విషయంలో సిగ్గులేనివాళ్ళే!! అందుకే తనే దూరంగా ఉంటుంది.

రసీదన్‌ను గదిలోకి వస్తూ చూసి ఇద్దరికీ నోటమాటలేదు. ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. ఏమీ తోచలేదు, అందుకే ఫజ్లూ హాస్యానికి అంటున్నట్టు అన్నాడు, ‘అరె! ఈ రోజు ఏమి నేరం జరిగిందని ఇన్‌స్పెక్టర్ గారు స్వయంగా దాడి చేయడానికి వచ్చేశారిక్కడికి?’

‘ఇప్పటిదాకా రానేలేదు, ఇప్పుడు పెద్దవాళ్ళైన పిల్లల మీద దాడి చేయడమా? అలా చేసినా, భయపడతారనటానికి, మీరు అమ్మ ఒళ్ళో పెరుగుతున్న పిల్లలేమీ కాదు గదా?’ రసీదన్ జవాబిచ్చింది.

‘ఎందుకమ్మా? నువ్వంటే పీర్ ముహానీ మొత్తం గడగడలాడిపోతుంది. భయపడకుండా ఉండటానికి మేమెంత చెప్పు?’ ఫజ్లూ గోముగా అన్నాడు.

‘మీతో మాట్లాడాలి కొంచెం..’

‘ఇదిగో, నేను వచ్చేస్తా ఇప్పుడే!’ లేస్తూ అన్నాడు సాబిర్.

‘నీకేం పనొచ్చి పడిందిప్పుడు? నిన్నెప్పుడైనా పరాయి వాడిలా చూశామా చెప్పు?’ అధికారం చూపుతూ, రసీదన్ సాబిర్‌ను మాట్లాడనివ్వలేదు.

సాబిర్ కూర్చున్నాడు మళ్ళీ!

రసీదన్ గది నలువైపులా చూసింది. ఊపిరి బిగబట్టి, రసీదన్ ఏమి చెబుతుందో వినేందుకు సిద్ధంగా ఉన్నారు, ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ! ఫజ్లూ కబ్రిస్తాన్ గేట్ దగ్గరున్న వీధి లైట్ వేసి కూర్చున్నాడు. వెలుగు పరచుకుంది చుట్టుపక్కల! ఆ గదిలోనే కబ్రిస్తాన్ లోని అన్ని లైట్ల మెయిన్ స్విచ్ ఉంది.

‘చున్నీ నికాహ్ బబ్లూతో చేసేద్దామని ఉంది.’ రసీదన్ గొంతులో దృఢత్వముంది.

ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ తెగ ఆశ్చర్యపోయారు. ఈ మాటలు విని, రసీదన్‌తో ఏమనాలో తోచటమే లేదు ఇద్దరికీ! ఒకరినొకరు చూసుకున్నారు. రసీదన్ ఇంకా ఏమి మాట్లాడుతుందో అని చూస్తున్నారు. రసీదన్ అందుకుంది, ‘ఎవరి నొసటి రాతెలా ఉందో అలాగే ఔతుంది. చున్నీ నొసట అలా రాసి ఉంటే దాన్నెవరు మార్చగలరు? చున్నీ జీవితంలో సుఖం రాసిపెట్టి ఉంటే, రేపు బబ్లూ మంచి వాడైపోవచ్చు. ఇంక అతను, కసాయి కుటుంబానికి చెందిన వాడంటారా? కసాయికీ, కాటికాపరికీ తేడా ఏముంది? అన్నిటికన్నా ముఖ్యమైన మాట. చున్నీ బబ్లూను ప్రేమిస్తూంటే, దాన్ని అడ్డుకునేందుకు మనమెవరం? చున్నీ సుఖంగా ఉంటుందంటే, నేనెలాగైనా యీ పని చేస్తాను.’ ఈ మాటలంటున్నప్పుడు రసీదన్ చెవుల్లో సమదూ ఫకీర్ మాటలే గింగిరుమంటున్నాయి, ‘ప్రేమ చాలా గొప్ప ఆట అత్తయ్యా!! అందరికీ రాసి ఉండదు. అల్లా తాలా దయ ప్రేమ. నీ బిడ్డ అదృష్టవంతురాలు. తిట్టవద్దు తనను! ఆమెకు జన్మనిచ్చినందుకు దానికి ధర వసూలు చేయవద్దు తననుంచీ! ఆమె ప్రేమ ఆమెకు దక్కనీ! ఆమె జీవితానికి, ప్రేమ రంగులు నింపనీ అని ప్రార్థించు.’

రసీదన్ మాటలు పూర్తి కాగానే అసహనంగా సాబిర్ అన్నాడు. ‘మరి అమీనా?’

‘ఆమెనింట్లో కూర్చోబెట్టుకుంటానని ఎక్కడన్నాను? ఇప్పుడు చున్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. పగలూ రాత్రీ ఆమె గురించి ఇంట్లో గొడవలే గొడవలు! మన వీధిలో ప్రతి ఇంట్లోనూ ఒకటే చర్చ, చున్నీ, బబ్లూ ప్రేమ గురించి! మీరిద్దరూ కూడా తన వెంట పడ్డారు. ఏ సంబంధమూ లేని సత్తార్ మియ్యాకు కూడా ఇదే ధ్యాస! తిన్నది అరగటమే లేదు పాపం! బబ్లూకు ఏమన్నా అయితే నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి గుట్టంతా విప్పేస్తాను.’ రసీదన్ పట్టుదల చూసి ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ పూర్తిగా విస్తుపోయారు.

ఫజ్లూ అమ్మ ముఖాన్నే తదేకంగా చూస్తున్నాడు. తరువాతన్నాడు, ‘అమ్మా!! నిన్ను కాదని ఎప్పుడైనా వెళ్ళానా నేను? చెప్పు. నీ బిడ్డ, నీ ఇష్టం. ఏమి చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. మమ్మల్ని ఏమి చేయమంటే అదే చేస్తాం.’

‘మీ ఇద్దరూ కూడా మీ ప్రవర్తనతో తెగ బాధ పెట్టేస్తున్నారు. పగలూ రాత్రీ గంజాయీ, తాగుడూ!! సాబిర్‌కు ముందూ వెనకా ఎవరూ లేరు. తల్లీ తండ్రీ లేరు. పెంచి పెద్ద చేసిన పిన్నీ ఎటు పోయిందో మరి. బిల్కీస్‌కు ఏమనిపించిందోగానీ..’ రసీదన్ కళ్ళలోనుంచీ బొటబొటా నీళ్ళు దూకాయి. కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ, గదిలో నుండీ బైటికి నడిచింది రసీదన్.

ఫజ్లూ, సాబిర్ అక్కడే కూర్చుండిపోయారు మౌనంగా!! రసీదన్ వెళ్ళిపోయిన తరువాత, గదిలో నిశ్శబ్దం తాండవించింది చాలాసేపు! ఒకరినొకరు చూసుకుంటూ కూర్చునే ఉన్నారు. తరువాత ఫజ్లూ సైగ చేస్తే చిలుం తయారు చేయటం మొదలెట్టి అన్నాడు సాబిర్.

‘మీ అమ్మ ఒక్కసారి మారిపోయిందిరా ఫజ్లూ! నిన్నటివరకూ చున్నీ వెంటపడేది, ఇప్పుడు చూడు, ప్రపంచమంతా చున్నీకి శత్రువే, తనకొక్కతికే ఆమె గురించి దిగులు అన్నట్టు మాట్లాడుతూంది. భలే వింతగా ఉంది.’

ఫజ్లూ మౌనంగానే ఉన్నాడు. చిలుం మీద పురికోన తాడు వెలిగించి దమ్ము పీల్చిన తరువాత అన్నాడు, ‘వారం కిందట ఎక్కడికో వెళ్ళి వచ్చింది. అప్పటినుంచీ మారుతున్నట్టనిపించింది. రెండు మూడు రోజులు అసలేమీ మాట్లాడలేదు. ఇప్పుడర్థమే కావటం లేదు, ఇలా మారిపోయిందెలా అని!’

‘ఇప్పుడేమైనా సరే, అమీనా పెళ్ళి కాకుండా చున్నీ పెళ్ళికాకూడదు. పెద్ద కూతురింట్లో కూర్చుని ఉంటే రెండవ కూతురు మొగుడితో షికార్లా? ఇది తప్పు.’ సాబిర్ అన్నాడు, దమ్ముకొడుతూ! గుండెలో దడదడ మొదలైందతనికి!

‘సత్తార్ మియ్యా కనబడలేదీరోజు! నువ్వు కలిశావా?’ ఫజ్లూ అడిగాడు.

‘లేదు. నిన్న చెప్పాడు, కమిటీవాళ్ళు అన్నారట, గోదాం తీసేయమని! ఒకవేళ తీసేయకపోతే పోలీస్ కేసు పెడతామని బెదిరించారట కూడా!! వీధిలోవాళ్ళూ కమిటీవాళ్ళతో చెప్పారట, ఇక్కడినుండీ యీ మేక చర్మాల గోదాం తీసేయకపోతే గొడవలు జరుగుతాయని! ఈ గొడవల్లోనే ఉండి ఉంటాడు. జనాలను ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలిగా!!’

‘గోదాం తీసేయాల్సిందే! ఇక్కడిప్పుడు కష్టమే! గోదాం తీసేస్తే నీ వ్యాపారానికీ నష్టమేనే!’

‘నాకేమీ కష్టం కాదు ఫజ్లూ మియ్యా!! అల్లా నోరిచ్చాడంటే తినేందుకు ఆహారమూ ఇస్తాడంతే!! నాకూ చాలైంది యీ వ్యాపారంతో! సత్తార్ మియ్యాతో మాట్లాడాలి ఏదో ఒకటి! ఆలోచించుకున్నాను. చాలానే చేశాను. ఇప్పుడింక అలా జరగదు. కొత్త వ్యాపారమేదైనా చూసుకోవాలని చూస్తున్నా.’

ఇద్దరి గుండెల్లో పొగ నిండుకుంది. ప్రభావం చూపిస్తూంది. కళ్ళు ఎర్రబడ్డాయి.

***

అటు రసీదన్, ఫజ్లూ, సాబిర్‌తో మాట్లాడుతూ ఉంటే, ఇటు చున్నీ మొబైల్‌లో జరిగిందంతా బబ్లూకు వివరిస్తూంది. అమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల, పగలే చున్నీ మాటల్లో అమృతం ఒలికిపోతోంది.

బబ్లూ చున్నీ మాటలు వింటున్నాడు. ఈ రోజు రాత్రి కబ్రిస్తాన్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నా డిప్పటికే! చున్నీ మాటలు వింటుంటే, తనను రాకుండా చేసేందుకు ఆమేమైనా మాయమాటలు చెబుతోందా అని అనుమానం వచ్చింది. ‘కాదు, కూడదు, నేనొస్తాను..’ అని బబ్లూ పట్టు పట్టేసరికి, చున్నీ ఇంత ఎత్తున ఎగిరింది. ‘నేను నీకోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధం. ఐనా సరే, నీకు నామీద నమ్మకం లేదా? అబద్ధమెందుకు చెబుతాన్నేను నీకు? నాకెవరంటేనూ భయం లేదు. నువ్వంటే కూడా!! చూడు బబ్లూ! నీకు బాగా తెలుసు. భయస్తులే అబద్ధాలు చెబుతారు. నీకు నమ్మకం లేకపోతే ఫోన్ పెట్టెయ్.’

బబ్లూను దారిలోకి తేవాలని చున్నీ ప్రయత్నం. బబ్లూ గొడవ మొదలు పెట్టాడు. ‘ఈ రోజొక్క రోజూ కలుద్దాం. మాంచి హోటల్ నుంచీ మటన్ డబుల్ ఉల్లిపాయతో తెస్తా..’ అని ఆశ చూపాడు.

‘నువ్వే తిను మటన్, డబుల్ ఉల్లిపాయతో! నా నాలుక మీద పుండయింది. బబ్లూ! నీ మాటల్లో ఇదే నాకు నచ్చదు. చెప్పేశా కదా, రావొద్దంటే రావొద్దు. అల్లా మియ్యా దయవల్ల ఎలాగో అమ్మ ఒప్పుకుందనుకుంటే, నువ్వేమో ఇలా అడ్డుపుల్ల వేస్తున్నావ్. రేపు పొద్దున వస్తాను. కలుద్దాం.’ చున్నీ తన నిర్ణయం చెప్పేసి, ఫోన్ కట్ చేసేసి, నవ్వుకుంటూ గొణిగింది, ‘మా బబ్లూ మియ్యా కూడా తక్కువ వాడేం కాదు, గొడవ మనిషే!’

నిన్నటి దాకా చున్నీ మనసులో ఇరవై నాలుగ్గంటలూ, బబ్లూ గురించి ఎన్నెన్నో సందేహాల సుడిగాలులు ఆవరించి ఉండేవి, నిద్రలేకుండా చేసేవి. ఈ రోజు ఆమె కన్నుల్లో బంగారు వన్నెల కాంతులు!! పీర్ ముహానీలో యీ సందు గొందుల్లోని ఇళ్ళూ, జనమూ, కబ్రిస్తాన్‌లో సమాధుల మీద చిన్న చిన్న బూడిద రంగు దుమ్మూ – వీటన్నిటి రంగూ మారిపోయింది.

దాతా పీర్ మణిహారీ మసీదు పైన పడుతున్న సోడియం వైపర్ లైట్ వెలుగును చూస్తూంది చున్నీ. దాని అచ్చమైన తెలుపు రంగు కూడా ఆమె కళ్ళకు బంగారు రంగుగా మారిపోయింది. సమాధి దగ్గర మసీదు వెనుక గోడకు వీపానించి కూర్చుని ఉన్న చున్నీ, బబ్లూ మియ్యా ముఖం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. మంచి పొడవూ, దిట్టమైన శరీరం, గుండ్రటి ముఖం. హీరో సల్లూ భాయిలా, ధైర్యమున్న మగాడిలాంటి నడక. నవ్వూ!! ఒక్కసారి గుండెలనిండ గాలి పీల్చి, కబ్రిస్తాన్ ఎత్తైన గోడను రెప్పపాటులో లాఘవంగా ఇటునుంచటూ అటునుంచిటూ దూకేసేంత శక్తి! అమ్మ ఇచ్చిన ధైర్యం తాలూకు రెక్కలతో ఆకాశంలోని తన కలల ప్రపంచంలో ఎగురుతోంది చున్నీ!! బబ్లూతో తన ప్రేమ జీవితాన్ని పొందేందుకు కొత్త దారి దొరికింది చున్నీకి! అతని బలమైన బాహువుల్లో చిక్కి, ముక్కలు ముక్కలై పోవాలి. అతని ఎత్తైన భుజమ్మీద తల వాల్చి కళ్ళు మూసుకుని ఏదైనా ప్రేమ గీతం పాడుకోవాలి. ఆపైన అతని గుండెమీద వాలిపోయి నిశ్చింతగా నిద్రపోవాలి. ఇవన్నీ ఇప్పుడామె తాజా కోరికలు.

దూరంగా లాల్జీ టోలా వైపున్న ప్రహరీగోడ దగ్గర ఏదో నీడ తచ్చాడటం చూసింది చున్నీ. ఆమె వైపుకి వస్తూందా నీడ. మెల్లి మెల్లిగా నీడ దగ్గరికొచ్చింది. దగ్గరికి, ఇంకా దగ్గరికి! ముందుకు కదిలింది నీడ! ఆ నీడ చేతిలో గాజుల మలారముంది. ఇద్దరూ కలిసి దాతా పీర్ మణిహరీ సమాధి దగ్గర గాజులు సమర్పించారు. ప్రార్థించారు. తెరుచుకుని ఉన్న కళ్ళతోనే కల కంటూ ఉంది చున్నీ. దూరాన ఉన్న చెట్టు పైన కూర్చుని ఉన్న ప్రవాస పక్షులు ఒక్కసారి రెక్కలు టపటప లాడిస్తూ లేచాయి. తన గూడు మరచిపోయిన ఏదో పక్షి, మళ్ళీ గూటికి వచ్చినట్టుంది.

చున్నీ తన అరచేతులతో ముఖం తుడుచుకుంది. బబ్లూ చాయ రేఖామాత్రంగా కూడా లేదిప్పుడు. దాతా పీర్ మణిహారీ సమాధినే రెప్పవేయకుండా చూస్తూంది చున్నీ. పీర్ ఆశీర్వాదం తనకు లభించిందనుకుంది మనసులో!

***

ఒకరోజు పొద్దున సత్తార్ మియ్యా ఒక చెడు వార్త తీసుకుని వచ్చాడు. నులివెచ్చని ఎండ, తేలికపాటి గాలులతో వచ్చిన అద్భుతమైన ఉదయపు వేళ ఇలాంటి వార్త వినవలసి వస్తుందని ఎవరూ అనుకోరసలు. చున్నీ మీద పిడుగు పడినట్టే అయింది. రసీదన్‌కు కూడ చాలా పెద్ద దెబ్బే తగిలింది. ఆమె తన చేతులు ఆకాశo లోకి చాచి, అల్లాహ్‌ను దయచూపమని ప్రార్థించింది. ఫజ్లూ, సాబిర్, అమీనాలకైతే యీ వార్త ఏమాత్రం ప్రాధాన్యత లేనిదే ఐనా విన్న తరువాత, అంత బాగా అనిపించలేదు. కానీ వార్త వినగానే సత్తార్ మియ్యా ముఖంలో ఒక దుర్మార్గపు నవ్వైతే తొణికిసలాడింది.

వార్త నిజమైనదే!

చున్నీ చాలా కష్టపడి ఒప్పించిన తరువాత గోరీలగడ్డకు రావటం వాయిదా వేశాడు కానీ మటన్ మీద ప్రేమ అలాగే ఉంది. వాళ్ళ నాన్న హోటల్‌లో మటన్ సప్లై చాలాకాలం నుండీ చేస్తున్నవాడే కాబట్టి ఎప్పటినుంచో అక్కడికి అతను వెళ్ళిరావడమైతే ఉన్నది. బబ్లూ చున్నీని కలవలేకపోతున్నానే అన్న దిగులుతో ఆమెను కలిసేందుకు కొత్త కార్యక్రమం మొదలుపెట్టాడు. అతడు తన స్నేహితులతో హోటల్‌కు చేరుకున్నాడు. రెండు ప్లేట్లు మటన్ ప్యాక్ చేయించాడు. ఈ కొలతల్లో మద్యం కోసం మోబైల్ మీద ఆర్డర్ చేశాడు. మందు తాగటం ఆపేసిన తరువాత ఇదొక్కటే కాస్త సాయమైంది. ఈ మద్యంలో వందలాది జనం ప్రాణాలు ఆధారపడుంటాయి. కళ్ళు మూసి తెరిచేంత లోపల రావటం, అంతలోనే మాయమై పోవటం! మద్యం సప్లై భాషలో పూర్తి బాటల్ ఒక రూపాయి, హాఫ్ బాటల్ అర్ధ రూపాయి, పావు బాటల్ నాలుగణాలు. రూపాయీ అర్ధా దొరకటం కష్టం. అందువల్ల నాలుగణాలదే రాజ్యం.

మటన్ దో ప్యాజా, నాలుగు క్వార్టర్లు (మద్యం) తో పాటూ బబ్లూ, వాళ్ళ స్నేహితుల విందు రాజేంద్రనగర్ వంతెన కింద ఏర్పాటైంది. రెండు మూడు రోజులకోసారి పోలీసు వాళ్ళకు కూడా మద్యం కాస్త ఇవ్వాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్‌కు కూడా సప్లై చేసేవాడతను. ఇన్‌ఫార్మర్ కూడా! మరికాసేపట్లో విందు ప్రారంభమయ్యేదే, అంతలోనే పోలీసులొచ్చారు, బబ్లూ, ఇద్దరు స్నేహితులతో పట్టుబడ్డాడు.

పొద్దున బబ్లూ నాన్న కల్లూ మియ్యా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు.

వయసులో ఉన్నప్పుడు కల్లూ మియ్యాకు కూడా గొప్ప పేరుండేది. ఒకసారి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ మున్షీ మీద కత్తితో దాడి చేశాడు మియ్యా. పెద్ద గొడవే అయింది. చాలా రోజులు పరారీ మీదే ఉన్నాడు. పోలీస్ స్టేషన్‌లో మున్షీ కొత్తగా వచ్చాడు. లోహానీపూర్ చిక్పట్టీ లోకి వెళ్ళి డబ్బులివ్వకుండా గుండెకాయలూ, కిడ్నీలూ తెచ్చు కునేవాడు. కల్లూ కసాయి చరిత్ర తెలీదతనికి. ఈ కారణంగానే ఇంత గొడవయింది. కల్లూ మియ్యా పరారీలో ఉండటమే కాదు, ఆ మున్షీకి కూడా దేహ శుద్ధై, అతడు బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు.

కల్లూ మియ్యా పోలీస్ స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ ముందు చేతులు కట్టుకుని నిలబడున్నాడు. ఇన్‌స్పెక్టర్ అన్నాడు, ‘మొత్తం 50 వేలు. బెయిల్‌కు మరో 50 వేలని చట్టం చేసింది ప్రభుత్వం. కోర్టూ గీర్టూ, వకీల్ ఖర్చూ, మళ్ళీ విడిగా!! పోలీస్ స్టేషన్ నుంచే ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇంకా ఎక్కువే! రేట్ ఇలా నడుస్తూంది కల్లూ మియ్యా!! నువ్వు పాత కాపువే! అన్ని అర్థం చేసుకుంటావ్. ఇప్పుడింక నువ్వే చెప్పాలి త్వరగా!!’

‘హుజూర్, కాస్త తగ్గించి దయ చూపండి.’ కల్లూ మియ్యా బ్రతిమాలే నాటకం మొదలెట్టాడు.

‘చాలా సేపు ఆపి ఉంచటం కష్టం. ఈలోపల ఎస్.పీ. ఎప్పుడంటే అప్పుడు స్టేషన్ లోకి వచ్చేస్తున్నాడు. వీడికి వాసన పట్టేసే అలవాటుంది. వచ్చాడంటే వంద ప్రశ్నలేస్తాడు, ఇంకా ఎందుకు ఆపి ఉంచావని!! నువ్వూ పట్టుబడతావ్ ఫిజికల్‌గా!! వెళ్ళు, తొందరగా ఏర్పాటు చెయ్యి. సరుకు రెడీ చెయ్యి, కొడుకును తీసుకునిపో!!’ పోలీస్ అధికారి తన నిర్ణయం చెప్పేసి, మరోపనిలో తల దూర్చాడు.

కల్లూ మియ్యా పళ్ళు నూరుతూ బబ్లూని బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ నుంచీ బైటికొచ్చాడు.

పోలీస్ స్టేషన్ ముందు రసీదన్, చున్నీ నిలబడున్నారు.

కల్లూ మియ్యా తన ధ్యాసలో తనున్నాడు. ముందుకెళ్తున్నవాడు వెనక నుంచీ ఏదో గొంతు వినబడి వెనక్కి చూశాడు. దగ్గరికొచ్చాడు. ముందైతే గుర్తు పట్టలేదు కానీ, తనను పిలిచే యీవిడెవరబ్బా అని సందేహం. దగ్గరగా చూసిన తరువాత అన్నాడు,’ నువ్వు కబ్రిస్తాన్ రసీదన్ బీ వే కదా??’

‘ఔను.’ రసీదన్ గొంతులో మొహమాటం.

‘సత్తార్ ఎక్కడ?’

కల్లూ మియ్యా మమూలుగానే అడిగాడు. కారణం రసీదన్ అంటే సత్తార్ మియ్యా పెళ్ళాం గానే తెలుసతనికి! ఒకసారి సత్తార్ మియ్యా ఆహ్వానం మీద విందుకు వెళ్ళాడు రసీదన్ ఇంటికి! ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులతో పాటూ, గోరీలగడ్డకు కూడా వెళ్ళి వస్తూనే ఉంటాడిప్పుడు కూడా. అలా రసీదన్ జ్ఞాపకం! అంతే! కానీ చున్నీకి యీ ప్రశ్న, ఈటె పోటు లాగా అనిపించింది. లోగొంతుకలో అన్నది, ‘ఇప్పుడాయనతో మాకేమీ సంబంధం లేదు.’ అని!

‘కానీ సత్తార్ ఉండేదక్కడేగా?’

‘అవును. కానీ మా ఇంట్లో కాదు.’ చున్నీ అనేసింది. రసీదన్ మౌనంగా ఉంది.

‘సరే, పోలీస్ స్టేషన్‌లో పనేంటి?’

‘బబ్లూ గురించి తెలుసుకుందామని..” చున్నీ, రసీదన్ కన్నా ముందే మాట్లాడుతోంది.

‘బబ్లూ? బబ్లూ నీకెలా తెలుసు?’ కల్లూ మియ్యా, అమ్మాయి తెంపరితనం చూసి ఆశ్చర్యపోతున్నాడు.

‘కబ్రిస్తాన్‌లో మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు.’ రసీదన్ గొంతు పూడుకుపోతూ ఉంది.

కల్లూ మియ్యా కూడా యీ వార్తను ముందే ఆ నోటా ఈ నోటా విన్నాడు కానీ నమ్మకం లేదు. ఈ రోజుల్లో వయసులో ఉన్న వాళ్ళ సంగతులన్నీ నమ్మటం సాధ్యమా? అనుకున్నాడు. ఎవడికో ఏదైనా ఇలాంటి వార్తలను ఊరికే గాల్లోకి వదలాలనే పిచ్చి ఉంటుంది కూడా!! కానీ యీ రోజు తన కళ్ళముందుకే వాస్తవం వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించాక అన్నాడు, ‘పోలీసోడు 25 వేలు అడుగుతున్నాడు ! అప్పో సప్పో చేసేందుకే వెళ్తున్నా!! పిల్లలు పనికిమాలిన వాళ్ళైతే తండ్రి పేరు భ్రష్టు పడుతుంది. రసీదన్ బీ! వయసులో ఉన్న ఆడపిల్లతో పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చోవద్దు.’

రసీదన్‌నూ, చున్నీని అక్కడే వదిలి ముందుకెళ్ళిపోయాడు కల్లూ మియ్యా. ముందీ పోలీస్ స్టేషన్ నుంచీ కొడుకు వెధవను విడిపించుకోవాలి. తరువాత వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడాయన! ఇంట్లో డబ్బుంది, కాస్త తక్కువ పడుతుందంతే! హోలీకి సరిగ్గా నెల రోజులుంది. అందుకే సరుకు కొనేందుకు సిద్ధంగా పెట్టుకుందామనుకుంటూ రూపాయి రూపాయిగా కూడబెడుతూ ఉన్నాడు తను! గొణుక్కున్నాడు. ‘ఇప్పుడిలా అయింది. ఇంక అల్లానే దిక్కు. వ్యాపారమెలా సాగాలో? డబ్బున్నవాడికే అప్పు పుడుతుంది. సరుకుండకపోతే హోలీ సమయంలో సంపాదనెలా? ఇలాంటి పిల్లలుండటం కన్నా, పిల్లలుండకపోతేనే మంచిది. ఈ నా కొడుకు, ఎటూ కాకుండా చేశాడు. వయసులో ఉన్న కొడుకును కొట్టినా తిట్టినా లాభమే ఉండదు. ఇప్పుడే వీణ్ణి ఇంట్లోంచీ తరిమేస్తే సరి. కబ్రిస్తాన్ లోనే ఇల్లరికంగా పడుంటాడు వెధవ!’

కల్లూ మియ్యా వెళ్ళిపోయిన తరువాత కూడా పోలీస్ స్టేషన్ దగ్గరినుంచీ కదిలేందుకు చున్నీ ఒప్పుకోనేలేదు. బబ్లూను ఒక్కసారైనా చూడాలని చున్నీ తాపత్రయం. తన మొండితనం చూసి రసీదన్ కోపంగా అనేసింది, ‘నువ్విక్కడే ఉండు. తరువాత నువ్వే అనుభవించు.’

రసీదన్ మాటలతో మనసుకెలాగో సర్ది చెప్పుకుని తనతో కలిసి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది చున్నీ. వెనక్కి తిరిగి తిరిగి చూస్తుంది, బొటబొటా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ!! ముందు రసీదన్, వెనక చున్నీ! రాజేంద్రనగర్ గోలంబర్ దాటారు. తరువాత మాయీ ధాన్. లోహానీపుర్ లోని చిక్ పట్టీలో వెలుతురుంది. కల్లూ మియ్యా దుకాణం మూసి ఉంది. అక్కడే బెంచీ మీద బబ్లూ చిన్న తమ్ముడు రోడ్డుమీద వస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళను చూస్తూ కూర్చుని ఉన్నాడు దిగులుగా!!

***

కల్లూ మియ్యా చిన్న కొడుకుతో పాటూ ఇల్లు చేరాడు. ఇంట్లో ఇరవై వేలే ఉన్నాయి. దుకాణానికి వెళ్ళి మాంసం సరుకు చూశాడు. చాతీ, గుండె, మూత్రపిండాలూ – ఇవన్నీ కలిపి రెండున్నర కిలోలున్నాయి. అవన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. చాలా సార్లు బ్రతిమాలిన తరువాత ఇన్‌స్పెక్టర్ ఒప్పుకున్నాడు, ‘తక్కిన డబ్బు ఐదు వేలకు బదులుగా దుకాణం నుండీ అప్పుడప్పుడూ మటన్ తెచ్చి ఇస్తాన’ని ఒప్పుకున్న తరువాత!

నాన్న వెనక తలొంచుకుని ఇల్లు చేరుకున్నాడు బబ్లూ. ఇంటికి రాగానే వాళ్ళమ్మ, దగ్గరికి తీసుకుని ఏడ్చింది. తరువాత, భోజనం తెచ్చింది. కల్లూ మియ్యా ఇదంతా మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. అన్నం తినమని కొడుకును బ్రతిమాలుతూ ఉంటే, ఇంక ఆగలేక పోయాడు, ‘బుద్దిలేనిదానా!! నీ డ్రామాలు ఆపు! ఇరవై వేలు నగదూ, రెండున్నర కిలోల మటనూ తిని వస్తున్నాడు నీ కొడుకు. పేరు మంటగలిసింది. అది సరే! ఇంకా ఐదు వేలకోసం ఎంత వసూలు చేస్తారో ఆ పోలీసులు కొట్టునుంచీ! ఈ నా కొడుకు వల్ల ఎటూ కాకుండా పోయాము మనం! జమ చేసి ఉంచిన డబ్బూ పోయింది. వీడి కొత్త కథ వింటే నువ్వు డాన్స్ చేస్తావే!! ప్రేమ కథ నడుస్తోంది వీడిది! సత్తార్ మియ్యా ఆ కబ్రిస్తాన్ ఆమెను ఉంచుకున్నాడు కదా, దాని మొదటి మొగుడి కూతురితో వీడి కొత్త కథ!! తల్లీ కూతురూ ఇద్దరూ పోలీసు స్టేషన్ దగ్గర కలిశారు. ఇప్పుడర్థమైందా, దుకాణంలో డబ్బులు ఏ కలుగులోకి వెళ్తున్నాయో? ఈ వెధవ ముడ్డిమీద కత్తితో కోసి, ఇంట్లోనుంచీ వెళ్ళగొట్టాలి మనం!’

బుసకొడుతూ కల్లూ మియ్యా ఇంటినుండీ బైటపడి దుకాణం వైపు నడిచాడు. బబ్లూ ముందు కంచముంది. అతని దవడ నొప్పి ఇంటికి రాగానే ఎక్కువైంది. కుడి కన్ను కింద చర్మం నల్లబడింది. రాత్రి పోలీసులు ఆరగా ఆరగా మసాజ్ చేశారు. తల్లి అడిగింది, ‘ఎవర్రా ఆ కబ్రిస్తాన్ పిల్ల?’

‘నీకూ ఇప్పుడే కావాలా? ఎదురుగా భోజనం పెట్టి, పక్కనే కత్తిపెట్టినట్టు!’

‘సరేలే, ముందు తిను. తరువాతే చెప్పు.’ బబ్లూ ప్రేమ గురించి తెలిసి వాళ్ళమ్మ లోపల్లోపల ఆనందపడింది.

‘మంచిదమ్మా! చాలా మంచిది. నీ ఇల్లూ వాకిలీ అంతా చక్కగా నిర్వహిస్తుంది. ఇదుగో యీ ముసలాయన తోనే కష్టం. నీకు సరైనవాడే కాదీయన! పగలూ రాత్రీ నిన్నొక్కటే ఆడిపోసుకుంటూ ఉంటాడు. ఈయన్ను ఆ పిల్ల సరైన దారిలో పెడుతుంది.’ ముద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు బబ్లూ.

‘యా అల్లా!! ఏమంటున్నావ్ రా నువ్వు?’

‘నిజమమ్మా!! చాలా మంచిది కానీ లొంగేది కాదు. మీ ఆయనకు చెప్పు, యీ రోజు ఏమేమి ఇచ్చాడో అన్నీ సంపాదించి ఇచ్చేస్తాను. నా ప్రేమ మీద కత్తి పెట్టదలిస్తే మాత్రం, దాన్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. మళ్ళీ యీయన చేతికి దక్కను.’

బబ్లూ వాళ్ళమ్మ అతన్నే చూస్తూ ఉంది. దవడ నొప్పి వల్ల అన్నం ముద్దలు నమలకుండా అలా మింగేస్తున్నాడు. చున్నీ వాళ్ళమ్మతో కలిసి పోలీస్ స్టేషన్‌కు తనను చూడడానికే వచ్చిందని విని గుండె కిందకీ మీదకీ అయింది బబ్లూకు! తొందరగా చున్నీకి ఫోన్ చేయాలని తహతహలాడుతున్నాదు.

అటు ఏడుస్తూ రసీదన్‌తో పాటీ చున్నీ ఇంటికొచ్చింది. లక్ష చెప్పినా ఏడుపాపలేదు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు ఉబ్బిపోయాయి. కాటుక నిండా పెట్టుకుని, తుళ్ళుతూ తిరిగే చున్నీ కళ్ళల్లో ఉదాసీనత నిండింది. పొద్దుటినుంచీ ఒక అన్నం మెతుకైనా తినలేదు చున్నీ.

అమీనా మౌనంగా ఉంది. చున్నీకి ధైర్యం చెప్పాలనిపించినా మళ్ళీ భయపడింది, పరిస్థితి తిరగబడితే ఎలా అని! చున్నీ మనస్థితి మీద నమ్మకం లేదు అమీనాకు! చాయ్ చేసి అమ్మ చేతికిచ్చింది. చున్నీ ముందు కప్పు పెట్టి వచ్చేసింది. చాయ్ చల్లారిపోయింది కానీ చున్నీ తాకనైనా లేదు.

మధ్యాహ్నం తరువాత, చున్నీ ఇంతసేపూ ఎదురు చూస్తున్న రింగ్ టోన్ మ్రోగింది. చున్నీ ఊపిరి హెచ్చింది. ఫోన్ తీసింది.

బబ్లూ మాట్లాడుతున్నాడు.

అతని గొంతు వినగానే చున్నీ ఏడుపు కట్టలు తెంచుకుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది చున్నీ. అవతల బబ్లూ ఏమి చెబుతున్నాడో వినటమే లేదసలు. ఒకటే ఏడుపు! కాసేపటికి కన్నీటి వరద ఆగింది. మొబైల్ తీసుకుని ముంగిట్లోంచీ బైటికొచ్చి, గోరీలగడ్డ లోకి వెళ్ళిపోయింది. బబ్లూతో గొడవ పడుతూ, కొట్లాడుతూ ఉంది చాలా సేపు. ‘నువ్వసలు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వచ్చావ్? అవసరమేంటి?’ అని అటు బబ్లూ అడగ్గానే, రెచ్చిపోయి, అతని మీద తిట్లు కురిపించటం మొదలెట్టింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here