దాతా పీర్-12

0
8

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[గోరీలగడ్డ కమిటీ వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో చర్మాలను నిలువచేసే గోదాముము కాపాడుకోలేకపోతాడు సత్తార్ మియ్యా. గోదాం తీసేసినా, ఆ స్థలం మాత్రం సత్తార్ నియంత్రణలోనే ఉంటుంది. ఫజ్లూ, సాబిర్ తనతో సంబంధం తెంచుకుంటారని సత్తార్ ఊహించడు. ప్రస్తుతం వాళ్ళిద్దరి తోడూ కావాలనిపిచక, ఓ హోటల్‍లో తానొక్కడే బిర్యానీ తిని, సాబిర్‍ని వెదుకుతూ ఫజ్లూ గదికి వెళ్తాడు. సబ్జీబాగ్ వెళ్ళాలి పద అంటాడు సాబిర్‌తో. రానంటాడు సాబిర్. దాంతో ఇద్దరి మీదా కోపగించుకుంటాడు సత్తార్. వాళ్ళ సంగతి చూస్తానంటూ కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో రసీదన్ కబ్రిస్తాన్ గేటు దగ్గర నిలుచుని వాళ్ళ మాటలు వింటుంది. సత్తార్ వెళ్ళిపోయాకా, లోపలికి వెళ్ళి జరిగినదంతా అమీనాకీ, చున్నీకి చెప్తుంది. కొద్ది సేపటి తర్వాత ఫజ్లూ అక్కడికి వచ్చి సత్తార్ మియ్యాతో జరిగిన గొడవ గురించి చెప్తాడు, మర్నాటి నుంచి సత్తార్‍ను తన గదిలోకి రానివ్వమని అంటాడు. ఆ రాత్రి సత్తార్ మియ్యా జం జం హోటల్ నుండీ కబాబ్, మటన్ కరీ, శకూర్ మియ్యా హోటల్ నుండీ ముగ్గురికోసం ఖమీరీ రోటీ ప్యాక్ చేయించి తీసుకుని ఫజ్లూ గదికి వస్తాడు. ఆ సమయంలో అతన్ని అక్కడ చూసిన ఫజ్లూ, సాబిర్ ఆశ్చర్యపోతారు. చేతిలోని సంచీ అందుకోమని ఫజ్లూకి చెప్పి, జేబులోంచి డబ్బు తీసిస్తూ, సాబిర్‍ని వెళ్ళి మద్యం తెమ్మంటాడు. తాను వెళ్ళనని, తాను తాగడం మానేశానని అంటాడు సాబిర్. ముగ్గురూ మౌనంగా తింటారు. తిన్నాక, సాబిర్‍కి మళ్ళీ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు సత్తార్. తనకి సత్తార్‍ వద్ద పనిచేయడం ఇష్టం లేదని, మరొకరిని చూసుకోమని స్పష్టంగా చెప్పేస్తాడు సాబిర్. మర్నాటి నుంచి తన గదికి రావద్దని ఫజ్లూ కూడా ఖచ్చితంగా చెప్పేస్తాడు. కోపంతో వెళ్ళిపోతాడు సత్తార్. అతను వెళ్ళిపోయాకా, రసీదన్ గదిలోకి వెళ్ళి, మళ్ళీ ఎందుకొచ్చాడని అడుగుతుంది. తాను తెచ్చిన తిండి తిని తోకూపుకుంటూ ఉంటామనుకున్నాడు, తినేసి సమాధానమిద్దామనుకున్నాం, అలాగే చేశాం అంటాడు ఫజ్లూ. దాతా పీర్ సమాధి వద్దకు వెళ్ళి తమని కాపాడమని వేడుకుంటుంది రసీదన్. – ఇక చదవండి.]

అధ్యాయం-9 – రెండవ భాగం

[dropcap]కొ[/dropcap]న్ని రోజులు గడిచాయి. చలి సెలవు తీసుకుంది. పగలు ఇదివరకటికన్నా వేడిగా ఉంటోంది. రాత్రి చలి తక్కువగా ఉంటోంది.

చెట్ల మీద ఠికానా వేసిన ప్రవాస పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి. చీకటి రాత్రులిప్పుడు లేవు. అన్నీ. వెలుతురు రాత్రులే!! దాతా పీర్ మనిహారీ సమాధి మీదున్న తెల్లని సోడియం వేపర్ లైట్ వెలగటం లేదు. కమిటీ వాళ్ళకు ప్రతిరోజూ గుర్తు చేసినప్పటికీ కొన్ని నెలలనుండీ యీ లైట్ పనిచేయటమే లేదు. ముందైతే చున్నీ కూడా దానితో ఆటలాడేది. బబ్లూ మాయలో పడి, రోజూ దానిపై గురిపెట్టేది, నాలుగైదు రోజులకోసారి అది ఆఫ్ ఐపోయేది. ఇప్పుడైతే బబ్లూ రావటం లేదు. ఐనా లైట్ వెలగటం లేదు.

రసీదన్ తన గదిలో పడుకునుంది. ఇంటిపనంతా చేసి, అమీనా కూడా పక్క మీద వాలింది. చున్నీ చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని మొబైల్‌లో చూపులు దిగేసి కూర్చుని ఉంది. ముంగిట్లో వెలిగే లైట్ వెలుగు వరండా వరకూ వ్యాపించింది. వెలుగు ముక్కొకటి వరండా నుండీ తెరచి ఉన్న తలుపు గడప దాటుకుని రసీదన్ గదిలోకి వచ్చి కూర్చుంది.

తానెలాంటి ఉరిని మెడకు వేసుకుని ఉందో, దాని కారణంగా రోజు కొక చావులా ఉన్న తన పరిస్థితి గురించి రసీదన్ ఆలోచిస్తూ ఉంది. ఒక తప్పుకు, పూర్తి జీవితమంతా నరకమైపోయేంత శిక్ష. పగలూ రాత్రీ సత్తార్ మియ్యా నీడ వెంటాడుతూనే ఉంటుంది. మాట మాటకూ, ఎక్కడినుంచో వచ్చి, ముందు నిలబడుతూంది. కమిటీ వాళ్ళు గోదాం తీసేస్తే, మాతో మా పిల్లలతో శత్రుత్వం. సాబిర్ కైతే వేరే జీవితముంది. సత్తార్ మియ్యాతో అతడు పనిచేయకపోతే దానికి ఫజ్లూ కారణం.

షాహ్ అర్జా దర్గా వెళ్ళి వచ్చిన రోజు రసీదన్‌కు ఎంతో ప్రశాంతత చిక్కింది. చున్నీ గురించి ఆమె గుండెల మీదే కూర్చున్న భయాన్ని సమద్ తీసేశాడు. తన మనసును బుజ్జగించాడు. అల్లా మీదే భారం వేసి కూతురు ప్రేమించిన బబ్లూను అంగీకరించింది, తన ఆలోచనల కోసం ఆమె ప్రేమను కాదనటమెందుకని! వాళ్ళ వాళ్ళ జీవితాలు, వాళ్ళ వాళ్ళ అదృష్టాలు! కానీ అల్లాకైతే తనను ఏడిపించటంలో ఆనందమున్నట్టుంది. మనసులో మాట చెప్పి ఇరవై నాలుగు గంటలయిందో లేదో, బబ్లూ పోలీస్ స్టేషన్ చేరాడు! చిన్న చిన్న దొంగతనాలకు ముందే చెడ్డ పేరుంది, దానికి తోడిప్పుడీ కొత్త రగడ! ఈ పిల్ల జీవితమెలా గడుస్తుందో దేవుడా!! ముందే పిల్ల మనసూ, పద్ధతీ కాస్త వంకర! దానికి తోడు ఇష్టపడ్డ మొగుడూ ఇలా..!! నా పరిస్థితిని చూసైనా బుద్ధి రాలేదు దీనికి! ఇదే పరిస్థితి కొనసాగితే జీవితమంతా దిక్కు తోచకుండా తిరుగుడే!! ఇంక అమీనా సంగతి. తొందరగా సాబిర్‌తో ముడిపెట్టేయాలి. ఎలాంటివాడైనా బబ్లూ కంటే మేలే! మందు ప్రేమందామా, తన కొడుకేమైనా తక్కువ తిన్నాడా? ఈ విషయంలో అందరికంటే వాడే పనికిమాలిన వాడు.’

కళ్ళు మూసుకుని తన తాతయ్య కాలే ఫకీర్‌ను గుర్తు చేసుకుంది, రసీదన్.

తరచూ జరిగేదిదే! రసీదన్‌లో అశాంతి ఎక్కువైనప్పుడు మనసు మండిపోతున్నప్పుడు, కళ్ళు మూసుకుని నానాను గుర్తుకు తెచ్చుకుంటుంది. కాలే ఫకీర్ ఎదురుగా వచ్చి నిలబడి ధైర్యం చెబుతాడు.ఆమె తలమీద చేయి వేసి నిమురుతాడు. దాతా పీర్ నీడ ఆమె కళ్ళముందు నుంచుంది.

‘నానా!’

‘ఔను తల్లీ!’

‘జీవితమెలా?’

‘అందరికీ అంతే తల్లీ! నీకూ అంతే! అల్లా మధ్య దారిలో వదిలిపెట్టడు. అందరినీ దాటిస్తాడమ్మా!! నిన్ను కూడా!’

‘సత్తార్ మియ్యా..?

‘వాడేమీ చెయ్యలేడు నిన్ను! ధైర్యంగా ఉండు. భయపడిపోకు! నిన్ను నువ్వు సంబాళించుకో బిడ్డా!’

రసీదన్‌కు నమ్మకాన్నందించి, ఫకీర్ నీడ మాయమైంది. ముంగిటిలోనుంచీ వచ్చి గదిలో కూర్చున్న వెలుగులో లీనమైపోయింది నీడ.

***

రసీదన్ చాయ్ తాగుతూంది. రాధే అచ్చంగా పాలతోనే చిక్కటి చాయ్ చేసి ఇచ్చాడు. చాలా రోజుల తరువాత రాధే దగ్గర చాయ్ తాగేందుకు వచ్చింది రసీదన్. ఇన్ని రోజులు రాకుండా ఉండలేదెప్పుడూ! ఆరోగ్యం బాగా లేనప్పుడు తప్ప, రాధే చేతి చాయ్ తాగి, రెండు మాటలు మాట్లాడకుండా ఉండటం, ఇదే మొదటి సారి. ఇదివరకు ఎప్పుడైనా రసీదన్ రావటం ఆలస్యమైతే, రాధే గుర్తు చేసేవాడు, కానీ యీసారి రాధే కూడా మౌనంగానే ఉన్నాడు. చున్నీ మాటల వల్ల అతనికి పెద్ద దెబ్బే తగిలింది. ఫజ్లూ, సాబిర్ ఇదివరకటిలాగే గదిలోకే చాయ్ తెప్పించుకుని తాగటమో, లేదా అక్కడికే వచ్చి తాగటమో చేస్తూనే ఉన్నారు. ఫజ్లూ ఒక రోజు చెప్పాడు, బబ్లూతో చున్నీ నికాహ్ చేసేందుకు అమ్మ నిర్ణయించింది. ఈ కష్టం నుండీ బైట పడెందుకదొక్కటే మార్గమనుకుంటూంది..’ అని! ఈ వార్త తెలిసిన తరువాత, రాధే, చున్నీ, బబ్లూ మియ్యా గురించి ఆలోచించటం మానేశాడు. ఎవరికేది తోస్తే వాళ్ళది చేసుకుంటారు. ఎవరెటు పోతే తనకేంటి, ఇచ్చి పుచ్చుకునేదేమీ లేనప్పుడు? కానీ ఒకటి, ఈ మాట తనకు చెప్పకుండా దాచిపెట్టేటంత పరాయిదేమీ కాదు, రసీదన్ అత్త మరి! తన మనసులో ఉన్న మాట చెబితే చేతనైన సాయం కూడా చేసేవాడే!! ధైరంగా ఆమెకు అండగా నిలబడేవాడు కూడా!!

రసీదన్ చాయ్ తాగిన తరువాత ఆమె చేతిలో కప్పు అందుకుంటూ అడిగాడు రాధే, ‘చాయ్ బాగుందా అత్తా?’ అని.

‘అవున్రా! నీ చేతి చాయ్ ఎప్పుడైనా బాగుండక పోతుందా అసలు?’

‘ఐనా.. నా కొట్టుకు రావటమే మానేశావ్ నువ్వు! రాకపోకల్లేవ్, సమాచారాల్లేవు.. ఏమి చేశాన్నేను మరి?’ రాధే ఇక ఆపుకోలేకపోయాడు.

‘అల్లా మీదొట్టు. నువ్వేమీ చెయ్యలేదయ్యా! నా మనసే బాగా లేదసలు! ఎక్కడికీ వెళ్ళ బుద్ధి కావటం లేదు. నా కష్టాల్లో నేనున్నాను!! ఇంక నా పిల్లల సంగతి నీముందు దాచేదేముంది? అన్నీ తెలుసు నీకు! అబరార్ మామయ్య చిన్న కొడుకును కలిసేందుకు వెళ్ళానా మధ్య! ఫకీర్ అయ్యాడు. షాహ్ అర్జా దర్గాలో ఉంటున్నాడు. అతణ్ణి కలిసొచ్చిన తరువాత, చున్నీ పెళ్ళి బబ్లూ తో చేసెయ్యాలని నిర్ణయించుకున్నాను.’ ఒక్క గుక్కలో తన కథంతా చెప్పేసింది రసీదన్.

‘నాకు తెలుసత్తా! ఫజ్లూ చెప్పాడు. నువ్వు సరే అనుకుంటే, ఇంక ఎవరడ్డుకుంటాడు? ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసెయ్.’

‘అసలైన కష్టం సత్తార్ మియ్యానే రాధే! ఫజ్లూ, సాబిర్ లను బెదిరించి పోయాడు రాత్రి.’

‘రాత్రి ముగ్గురూ కూర్చుని తాగుతున్నారే? బెదిరించటమేంటి?’ ఉలిక్కిపడ్డాడు రాధే.

‘సాబిర్‌కు ఆయనతో పనిచేయటం ఇష్టం లేదట! కమిటీ వాళ్ళు గోదాం తీసేశారు. దీనికంతటికీ కారణం మేమూ, ఫజ్లూ నట!’ బడబడా తన మనస్సును పరిచేసి, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూంది రసీదన్.

‘అదేంటత్తా, నువ్వు మరీనూ!! సత్తార్ మియ్యా గురించి ఆలోచిస్తావా? ఉత్తుత్తి అరుపులవి. నిన్ను ఇబ్బంది పెట్టేంత బలం వాడికెక్కడుంది? నువ్విక్కడున్నావ్ కాబట్టి వాడికిక్కడ కాస్త విలువ. అదే నువ్వు కాదంటే, వాడీ పీర్ ముహానీ నుంచీ ఎప్పుడో వెళ్ళిపోయుండేవాడు.’ రాధే రసీదన్‌ను సముదాయించి వెళ్ళి పొయ్యి మీద చాయ్ గిన్నె ఎక్కించాడు.

రసీదన్ వెళ్ళేందుకు లేవబోతుంటే ఆపాడు, ‘వెళ్ళకు, ఫ్రెష్‌గా చాయ్ పెడుతున్నా, తాగి వెళ్దువుగానీలే!’

ప్రేమగా అతన్ని చూసి మళ్ళీ కూర్చుంది రసీదన్.

***

ఇక్కడ రసీదన్ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తుంటే, అక్కడ లోహానీపూర్ చిక్ పట్టీలో కల్లూ మియ్యా ఇంట్లో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం జరుగుతోంది. నాన్న బెదిరింపులూ, పగలూ రాత్రీ సాధింపులతో విసుగెత్తిన బబ్లూ మియ్యా, చున్నీతో తన పెళ్ళికి నాన్న ఒప్పుకోకపోతే, ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ప్రకటించేశాడు. బబ్లూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఉరేసుకున్నా, తాను యీ పెళ్ళికి ఎటువంటి పరిస్థితిలోనూ ఒప్పుకోనే ఒప్పుకోనని కల్లూ మియ్యా కథనం. డబ్బు జమ చేసి ఇచ్చేందుకు బదులు, ఇంట్లోని డబ్బంతా ఖర్చుపెట్టే ఇలాంటి కొడుకు ఇంట్లో ఉండీ ఫలితమేంటి? ఇలాంటివాడు ఇంట్లోనుంచీ వెళ్ళిపోవటమే మేలనిపిస్తూందా తండ్రికి! బబ్లూ వాళ్ళమ్మ మధ్యలో తల్లడిల్లిపోతోంది. కొడుకు విషయం ఆలోచిస్తూ ఆరాటపడిపోతూందా తల్లి! ఒకసారి కొడుకుకు నచ్చజెప్పుతుంది, మరోసారి భర్తకు సర్దిచెబుతుంది. భర్త నుండీ తిట్లు తింటుంది. కొడుకు బాధ, కోపం తాకిడికి కరిగి కన్నీరౌతూందోసారి! ‘నీవల్లే ఇంకా ఇక్కడున్నాను, అన్నీ సహిస్తూ’, అంటాడు కొడుకు. ‘నీవల్లే వాణ్ణింకా ఇంట్లో ఉండనిస్తున్నా, లేకపోతే ఎప్పుడో ముడ్డి మీద కొట్టి, ఇంట్లోనుంచీ తరిమేసేవా’ణ్ణంటాడు భర్త.

కల్లూ మియ్యా, బబ్లూను దుకాణం పనులనుంచీ తప్పించేశాడు. దుకాణంలో కూర్చోనివ్వటం లేదు, గల్లా పెట్టెను ముట్టుకోనివ్వటమూ లేదు. ఈ కారణంగా బబ్లూ మియ్యా దగ్గర డబ్బు ఆదాయం తక్కువైంది. కల్లూ మియ్యా లేకపోతే, చిన్నకొడుకు దుకాణంలో కూర్చుంటున్నాడు. నాన్న కళ్ళు కప్పి, బబ్లూ దుకాణం దగ్గరే తచ్చాడుతూ ఉంటాడు. ఎప్పుడైనా సరుకు తెచ్చుకునేందుకు కల్లూ మియ్యా బైటికి వెళ్తేనో, లేదా ఎటైనా కాసేపటి కోసమైనా వెళ్తేనో, రెప్పపాటులో లోపలికి వచ్చి తమ్ముణ్ణి మోసపుచ్చో, అధికారం చూపో, గల్లా పెట్టెనుండీ వందా రెండు వందలు కొట్టేసి మాయమైపోతాడు.

లాల్జీ మార్కెట్, హతువా మార్కెట్, ఖేతాన్ మార్కెట్ దగ్గరి సందుల్లో చున్నీతో పాటూ తిరుగుతూ, ఇద్దరూ, ఇద్దరి ఇళ్ళల్లో పరిస్థితులను గురించి తెలుసుకుంటూ ఉంటారు. చున్నీ, సత్తార్ మియ్యా కథ గురించి చెబితే ఏమాత్రమూ ఆలోచించకుండా ‘చంపేద్దాం సాలేగాణ్ణి! ఫీడా విరగడైపోతుంది..’ అనేశాడు.

‘ఇదొక్కటే తక్కువ నీకిప్పుడు! జూదం, మందూ, దొంగతనం, చైన్ స్నాచ్చింగ్, అన్నీ చేసేశావ్, ఒక మర్డరే బాకీ ఉంది. అదొక్కటీ చేసి, బతుకంతా జైల్లో కూర్చో! నీకోసం ఏడ్చేందుకు నేను కూర్చుని ఉన్నాగా!! కానీ, నేనెన్ని రోజులు కూర్చుంటాను? ఎవడి చెయ్యో పట్టుకుని వెళ్ళిపోతాను. జైల్లో కూచుని మజా చేసుకో!’ చున్నీ గొంతు నిప్పులు కురిపిస్తూ!

‘ఇప్పుడిక మార్కెట్ మధ్య పేచీ పెట్టకు!’

‘నేనా, పేచీ పెడుతున్నానా? మా అమ్మ ఒప్పుకుంటే యీ సత్తార్ మియ్యాను ఒక్క రోజులో దారికి తీసుకొస్తాను. వయసులో పెద్ద అనేమీ లేదు నాకు! బాబూ నాన్నా అని నంగి మాటల్లేవ్ నాదగ్గర!’ చున్నీ సర్దుకుంది. గొంతు కాస్త తగ్గించింది. తబలా లా ఆపకుండా బడబడా మాట్లాడేస్తూంది.

చున్నీ పద్ధతికే బబ్లూ పిచ్చివాడైపోతాడు. ‘నీ మాటలు వింటుంటే ఎంత శక్తి వస్తుందంటే, మనసు కనిపిస్తుంది.. ఇప్పుడే.. నిన్నూ!!’

‘ఆ.. నన్నూ?’ కిలకిలలాడింది చున్నీ.

‘తుపాకీ గురిపెట్టాలి నీమీద, నా మీద కూడా!’ ఓ క్షణం చున్నీ కేసే చూస్తున్నాడు బబ్లూ. మళ్ళీ చున్ని ముఖం మీదే నిలిచిన తన కన్నులు తిప్పేసుకుంటూ ‘మా నాన్న డ్రామా ఇలాగే నడుస్తూ ఉంటే, అదే చేయాల్సి వస్తుందేమో!’ అన్నాడు.

‘ఈ లోగా చాలా డైలాగులేస్తున్నట్టున్నావ్? మాట్లాడ్డం తగ్గించు కాస్త! పద నీకు చాట్ తినిపిస్తా!’ చెయ్యి పట్టుకుని చాట్ కొట్టువైపు లాక్కెళ్ళింది చున్నీ అతన్ని.

ఇద్దరూ చాట్ తింటున్నారు. తన చేతులతో చాట్ తినిపిస్తోంది చున్నీ అతనికి! మధ్య మధ్య చాట్‌లో పులుపు ఎక్కువ వేయమని సైగలు చేసింది కొట్టతనికి. బబ్లూ అన్నాడు, ‘ఏదో గడబిడగా కొడుతోంది.’

‘అర్థం కాలేదు నాకు!’

‘ఆడవాళ్ళకు పిల్లలు పుట్టే సమయంలో పులుపెక్కువ తినాలనిపిస్తుందట!’

‘కుక్కవి నువ్వు, అలాంటివే మాట్లాడుతావ్!’

కళ్ళు రెపరెపలాడిస్తూ అంది చున్నీ.

బబ్లూ ముఖం ముందుంచిన చాట్‌ను లాగేసి, మళ్ళీ అంది, ‘నేను జునైద్ భార్య లాంటిదాన్ని కాదు బబ్లూ మియ్యా!! వెళ్ళి, ఆమెను నాకు. అబద్ధాలకోరువి నువ్వు. ముందే చెప్పాన్నీకు, జునైద్ భార్యననుకోవద్దు నన్నూ! అని!’

‘పిచ్చిదానా! హాస్యం కూడా అర్థం చేసుకోవే?’

‘ఈ రోజు తరువాతెప్పుడైనా ఇలాంటి పిచ్చి జోకులు వేశావంటే, టాటా చెప్పి వెళ్ళిపోతానంతే!! ఇదిగో తిను.. ముఖం వేలాడేసుకోకిలా!’ చున్నీ గొంతు మెత్తబడింది. బబ్లూ నోరు తెరిచాడు, చున్నీ చాట్ నోట్లో పెట్టింది.

తిరిగి వస్తూ బుద్ధ మూర్తి ఉన్న చౌరస్తా దగ్గర ఆగారిద్దరూ! ఇక్కడినుంచీ ఇద్దరూ విడిపోవాలి. బబ్లూ అడిగాడు, ‘నీకు జునైద్ భార్యంటే అసూయ కదా?’ అని.

‘అసూయా? నాకే వీలుంటే ఆ దొంగముండ ఛాతీ చీల్చి, గుండె తినేయాలనుంది. బబ్లూ.. ఆఖరిసారి చెబుతున్నా విను! మన నికాహ్ తరువాతెప్పుడైనా వెనక్కి తిరిగి అటుకేసి చూశావో, గుడ్లు పీకేస్తానంతే! జీవితాంతం నువ్వు జాగ్రత్తగా ఉండు నాతో!’

‘అల్లా మీదొట్టు. అదంతా నువ్వు పరిచయం కాకముందు సంగతి. గడిచిపోయింది. ఇప్పుడసలు ఆవైపు చూడ్డమే లేదు.’ బబ్లూ చున్నీ చెయ్యి పట్టుకుని దానివైపే చూస్తూ ఉండిపోయాడు. ఎదురుగా ధ్యానంలో మునిగి ఉన్న బుద్ధ ప్రతిమ ఎండలో మెరుస్తూంది.

***

కబ్రిస్తాన్‌కు ఎవరిదో శవం రాబోతున్న కారణంగా రసీదన్, ఫజ్లూ, ఇద్దరూ ఆ పనుల్లో మునిగున్నారు. శవాన్ని పూడ్చిపెట్టే గోతులు తవ్వడంలో ఫజ్లూకు సాయంకోసం ఇటీవల ఒకతన్ని కూలీ కోసం రసీదన్ పెట్టుకుంది. ఇటువంటి సమయాల్లో వస్తాడతను, అప్పుడప్పుడు కూడా ఊరికే వచ్చిపోతుంటాడు. దృఢంగా తెల్లగా ఉన్న యీ అబ్బాయి భన్వర్, పోకర్ నుంచీ వస్తాడు. అనుభవమున్న కుర్రాడు. వాళ్ళ నాన్న, షాహ్ గంజ్ కబ్రిస్తాన్‌లో ఇదే పని చేస్తుండేవాడు. నాన్నతో యీ పనిలో పాలుపంచుకునేవాడట! నాన్న చనిపోయాడు. ఇప్పుడీ అబ్బాయి ఇదే పనిలోకి దిగాడు. ఫజ్లూను పని అడిగేందుకొచ్చాడు. వద్దనేశాడు ఫజ్లూ. ఈ సంగతి తెలిసి, రసీదన్ అతన్ని ఒప్పించి, పనిలోకి తీసుకుందీ అబ్బాయిని. షాహ్ గంజ్ దూరం. అక్కడినుంచీ, ఇక్కడే దగ్గరగా పని చూసుకుంటున్నాడీ అబ్బాయి.

ఫజ్లూ, ఆ అబ్బాయీ, గొయ్యి తవ్వుతున్నారు. రసీదన్ నమాజే జనాజా కోసం ఏర్పాట్లలో ఉంది. చనిపోయిన దెవరో బాగా పేరున్నతను. అందువల్ల, ఇక్కడి ఏర్పాట్లలో ఎలాంటి లోపమూ ఉండకూడదని నియమం. ఇలా ఎవరైనా పెద్దవాళ్ళ ఇంటి వ్యవహారమైతే పని కూడా ఎక్కువే ఉంటుంది. రాబడి బాగానే ఉన్నా, లోపాలెంచటమూ ఎక్కువే!

రసీదన్, ఫజ్లూ యీ పనుల్లో ఉంటే, చున్నీ తన ఫోన్ లో తనకిష్టమైన సినిమా చూసే పనిలో ఉంది. సాబిర్, అమీనా, మసీదు వెనక గోడ, దాతా పీర్ మనిహరీ సమాధికీ మధ్య స్థలంలో చాప పరచుకుని కూర్చుని, ఇప్పటి పరిస్థితులూ, రాబోయే రోజుల ప్రభావం వల్ల తమ గోడు గురించి వెళ్ళబోసుకుంటున్నారు.

‘సత్తార్ మియ్యాతో నీ సంబంధం చక్కగా ముగిసింది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావ్?’

‘నా బిజినెస్ నేను చేసుకుంటాను.’

‘బిజినెస్ అంటే డబ్బు కావాలి కదా? ఎక్కడినుంచీ వస్తుంది?’ అమీనా భయం.

‘అన్నీ వస్తాయి. చేద్దామని అనుకున్నాక ఎక్కడినుంచైనా వస్తుందంతే! నువ్వూరికే బుర్ర పాడు చేసుకోవద్దు. ఒక్కసారి..’ సాబిర్ అగిపోయాడు మధ్యలోనే.

‘ఏంటా ఆలోచన?’ సాబిర్ మనసులోని మాట తెలుసుకోవాలని అమీనా ఆరాటం.

మధ్యలో ఎవరైనా ఇలా మాటలాపేయటం ఆమెకు ఇష్టం లేదు. ‘ఇదిగో, ఈ అలవాటే నాకిష్టం లేదు. సగం మాట్లాడుతావ్, సగం కడుపులో దాచుకుంటావ్. నాకు చిర్రెత్తుకొస్తుంది. అమ్మకు కూడా నచ్చదిలా! చిన్నప్పటి నుంచీ సాబిర్ ముంగివెధవే, కానీ దుర్మార్గుడు.. అంటూ ఉంటుంది.’

‘దుర్మార్గుడు కాదు. దుర్మార్గుణ్ణే ఐతే నాకీ పరిస్థితే వచ్చేది కాదు. ఇప్పుడు గూండాలదే రాజ్యం.’

‘ముందైతే ఏమాలోచిస్తున్నావో చెప్పు.’ అమీనా పట్టుదల.

‘ఒకరోజు సుల్తాన్ గంజ్ వెళ్ళిరావాలనుకుంటున్నాను. మా తాతయ్య ఇంటికి! తాతయ్య ఎప్పుడో చనిపోయారు. కానీ మామయ్యలున్నారు. ఒకసారెళ్ళాలి. చూద్దాం, మామయ్యా వాళ్ళకు అమ్మ గుర్తుందో లేదో! ఇప్పుడూ అమ్మను అసహ్యించుకుంటూనే వున్నారా, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయా అని! నా చిన్ననాటి స్నేహితుడు నోమాన్ గురించి కూడా తెలుస్తుంది కదా!’ నీలి నీలి నీళ్ళతో గలగలా ప్రవహించే నదిలో వెన్నెలలా మెరిసే చేపలు యీదులాడుతున్నట్టు, సాబిర్ కళ్ళల్లో కలలు తేలియాడుతున్నాయి.

ఈ లోగా ఒక చెట్టుమీదున్న ఒక ప్రవాస పక్షి లేచి, మరో చెట్టుమీద కూర్చుంది. అన్నీ వెళ్ళిపోయాయి. ఇదొక్కటే మిగిలిపోయింది. ఇప్పుడిక ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళి తన బలగం లోని పక్షులతో కలుస్తుందన్న నమ్మకం లేదు. ఎండ కాలం వస్తూంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం నెలల వేడికి తట్టుకోలేక మెడ నేలకేసి కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోవడమే దీని నుదుట వ్రాసి ఉంది. తరచూ ఏదో ఒక పక్షి విషయంలో ఇది జరిగేదే! తన విషయంలో కూడా ఇదే జరిగిందని సాబిర్ అనుకుంటుంటాడు. తన వంశం, తన వాళ్ళనుంచీ విడిపోయి జీవిస్తున్నాడు తను. ఇదీ ఒక జీవితమా? రోజూ తినే తిండికి ఒక పద్ధతి లేదు. ఒక గౌరవమూ లేదు. ఈ జీవితం చావుకంటే హీనం.

‘వెళ్ళాలనీ, వాళ్ళను కలవాలనీ ఉంటే, తప్పకుండా వెళ్ళు. కానీ ఇంత దిగులుతో కాదు. మనసును చంపుకుని ఏమైనా చేసుకోకు. చాలా రోజులనుంచీ చూస్తున్నా, మాట్లాడుతూ మాట్లాడుతూ, మధ్యలో ఉన్నట్టుండి, మౌనంగా ఉండిపోతావు. అటూ ఇటూ చూస్తుంటావు. మనస్సును సంబాళించుకో సాబిర్! నీవు ఒంటరివాడివి కాదు. నీతో మేమున్నాం. నువ్విలా ఉంటే మాకేమనిపిస్తుందో ఆలోచించు.’ సాబిర్‌ను చూస్తూ ఆందోళన చెందింది అమీనా.

‘నేనూ కాస్త వెనకేశాను. రాధే భయ్యా కూడా సాయం చేస్తానన్నాడు. కాస్త అప్పు చేయాలని ప్రయత్నం. మోయీన్ కబాడి ఒక పాత ట్రాలీ ఇస్తానన్నాడు. ముందు పళ్ళ దుకాణం పెట్టాలనుంది. బిజినెస్స్ కష్టమైందే, కానీ మార్జిన్ బాగుంది.’ సాబిర్ తన వ్యాపారం గురించి వివరాలు చెప్పాడు.

అమీనా ముఖాన సంతోషం. ‘మేక చర్మం వాసన నుండీ విముక్తి నీకు! హమ్మయ్య!! సత్తార్ మియ్యా వ్యాపారమే మొదలుపెడతావేమో అనుకున్నానింతవరకూ!’

సాబిర్ ముఖాన కూడా సంతోషపు చాయలు. తన బిజినెస్ అమీనాకూ నచ్చిందని తెలిసి, అతనికి ధైర్యమొచ్చింది. తనపై తనకు నమ్మకమూ హెచ్చింది. అమీనా అడిగింది, ‘సుల్తాన్‌పుర్ ఎప్పుడెళ్తున్నావ్?’

‘ఏదో ఒకరోజు! బిజినెస్ మొదలు పెట్టిన తరువాత వెళ్ళటం కష్టం కదా! అందుకే ముందే వెళ్ళొస్తాను.’ అలవాటు ప్రకారం సాబిర్ తడబడ్డాడు. అమీనా వైపు చూస్తూ అన్నాడు,’ వెళ్ళొస్తా ఒకసారి! ఏమో, నా నుదుట వేరేగా రాసి ఉందో ఏమో! మామయ్యా వాళ్ళ మనసుల్లో చనిపోయిన చెల్లి పట్ల ప్రేమ ఉప్పొంగి, వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయేమో!’

శవమొచ్చింది. గోరీలగడ్డలో శవ యాత్రతో పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళ సందడి నిండింది. సాబిర్, అమీనా లేచారు. అమీనా ఇంటి ముంగిట్లోకీ, సాబిర్ బైటికీ వెళ్ళిపోయారు. రాధే చాయ్ దుకాణంలోనూ కూర్చునేందుకు స్థలం లేదు. శవయాత్రతో వచ్చిన వాళ్ళక్కడ కూర్చుని చాయ్ తాగుతున్నారు. సాబిర్ నాలుగో వీధిలోకి వెళ్ళాడు. ఎదురుగా సత్తార్ మియ్యా. అసలు అనుకోలేదతను, ఇలా సత్తార్ మియ్యా వీధిలో ఎదురౌతాడని! ఇద్దరూ ఒకరినొకరు చూశారు. కళ్ళు తిప్పుకుని ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. సత్తార్ మియ్యా వీధిలోంచీ బైటికీ, సాబిర్ తన గది వైపుకీ వెళ్ళిపోయారు.

గదిలోకి చేరుకుని, సాబిర్, పెట్టె నుంచీ, నాన్న షెహ్నాయ్‌ని బైటికి తీసి తుడిచాడు. దాన్ని జాగ్రత్తగా తమతో ఇక్కడికి తెచ్చినందుకు మనసులోనే బిల్కీస్ పిన్నికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తుడిచిన తరువాత, దాన్నే చూస్తూ కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని, పిచ్చివాడిలా దాన్ని ముద్దు పెట్టుకుంటూ, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ, నీరసంగా, నేలమీదే వాలిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here