దాతా పీర్-18

0
10

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[చున్నీ ఇల్లొదిలి పారిపోయాకా, రసీదన్ బాగా క్రుంగిపోతుంది. అమ్మని సముదాయించి, ఊరడిస్తుంది. అమీనా. చాలా రోజుల తరువాత రెండు ముద్దలు తింటుంది రసీదన్. సాబిర్ అమీనాకి ఫోన్ చేస్తాడు. ఆమె మాట్లాడదు. దాతా పీర్ సమాధి వద్దకు వస్తుంది. అక్కడంతా పిచ్చి మొక్కలు మొలిచి ఉంటాయి. రెండు రోజుల క్రితం కురిసిన వానల వల్ల అక్కడంతా చెత్త పేరుకుపోయి ఉంటుంది. దాతా పీర్ సమాధి చుట్టు పక్కల శుభ్రం చేసి, దుప్పటి సరిగా పరుస్తుంది అమీనా. ఇంట్లోకి వెళ్ళి అగరొత్తులు, ధూపం తెచ్చి, సమాధి దగ్గర వెలిగించి ప్రార్థిస్తుంది. చున్నీ కనిపించడంలేదని చెప్పడానికి అమీనా ఫోన్ చేసినప్పుడు – సాబిర్ మేనమామతో నూర్ సరాయ్‍లో కచేరి చెయ్యడానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. చున్నీ వార్త విని ఆందోళన చెందిన సాబిర్ – ఆ విషయాన్ని మామయ్యలతో చెప్తే – ఈ సమయంలో అక్కడికి వెళ్ళడం గానీ, పోలీసు కేసులో చిక్కుకోడం గానీ మంచిది కాదని అతన్ని వారిస్తారు. తాను వచ్చి ఆసరగా నిలబడతానని అమీనా ఎంతో నమ్మి ఉంటుందని సాబిర్‍కు తెలుసు. కానీ ఏమీ చేయలేకపోతాడు. రెండో రాజు సాయంత్రం నూర్ సరాయ్ నుంచి బయల్దేరి సుల్తాన్ గంజ్ వచ్చేసరికి రాత్రవుతుంది. ఫజ్లూకూ, అమీనాకూ ఫోన్ చేస్తాడు, ఫజ్లూ ఫోన్ కట్టేసుంటుంది, అమీనా ఫోన్ మోగుతుంది కానీ ఆమె మాట్లాడదు. మర్నాడు ఉదయమే సాబిర్ పీర్ ముహానీ కబ్రిస్తాన్‍కి వెళ్తాడు. ఆ రోజు రెండు శవాలు వస్తుండడంతో బాగా హడావిడిగా ఉంటుంది. రసీదన్, ఫజ్లూ పనిలో ఉంటారు. అమీనా బయట నుంచి వస్తుంది. సాబిర్‍ని పట్టించుకోదు. అప్పు చేసి తెచ్చిన సామాన్లతో వంట ప్రయత్నం మొదలుపెడుతుంది. అక్కడే కూర్చున్న సాబిర్‍ను అస్సలు పట్టించుకోదు. చాయ్ పెట్టవా అని అడిగితే, మౌనంగా టీ చేసి ఇచ్చి వెళ్ళిపోతుంది. తాను ఊర్లో లేనని, నూర్ సరాయ్‍లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేశావనీ, అందుకే వెంటనే రాలేకపోయానని అబద్ధం చెబుతాడు. కాసేపటికి ఫజ్లూ వస్తాడు. వడలిపోతున్న శరీరంతో ఉన్న ఫజ్లూని చూసి గంజాయి మానెయ్యమని చెప్తాడు సాబిర్. రసీదన్ కూడా వస్తుంది. సాబిర్‍ని చూసి ఏం మాట్లాడదు. సాబిర్ అక్కడ్నించి వెళ్లిపోతాడు. తన వ్యథని దాతా పీర్‌తో చెప్పుకుంటుంది అమీనా. – ఇక చదవండి.]

అధ్యాయం-11 – మూడవ భాగం

[dropcap]తె[/dropcap]ల్లవారింది. చున్నీ గురించి ఎలాంటి వార్తా అందలేదింకా! రాధే దుకాణంలో కూర్చుని చాయ్ తాగింది రసీదన్. శాహ్ అర్జా దర్గాను సందర్శించుకునేందుకు వెళ్తున్నానని చెప్పింది. అబరార్ మేనమామ కొడుకు సమదూ ఉంటాడక్కడే! అతన్ని కలిసి వస్తానని చెప్పింది. దల్దలీ వీధి గుండా నడిచి, గాంధీ మైదాన్ చేరుకుంది. అక్కణ్ణించీ ఆటో రిక్షాలో పత్థర్ కీ మస్జిద్ తరువాత మసీదు దారి గుండా శాహ్ అర్జా దర్గా.

రసీదన్ దర్గా లోకి వెళ్ళి నమస్కరించింది. సమదూ ఫకీర్ ఎక్కడా కనిపించలేదు. దర్గాలో మసీదు దగ్గర కూర్చునున్న ఒకతన్ని అడిగింది. ‘తన గదిలో ఉన్నారేమో!’ అన్నాడాయన. రసీదన్ బైటికొచ్చి అతని గదికేసి నడిచింది. దారిలో గదుల వైపు మరొకతను కనిపించాడు. అతన్నడిగితే, ఆగమని సైగ చేసి గదుల వైపు వెళ్ళి పోయాడతను. అక్కడే నిలబడి సమదూ ఫకీర్ కోసం చూస్తూ ఉంది. పొద్దుటి నడక నుండీ సమదూ ఫకీర్ తిరిగొచ్చి, గదిలోనే ఉన్నారు. కాసేపటికి, ఇందాకటి వ్యక్తితో కలిసి బైటికొస్తూ రసీదన్‌ను చూశారు. దగ్గరికి వచ్చి నవ్వారు. ‘ఇంత పొద్దున్నే వచ్చారేమమ్మా? అంతా బాగున్నారా?’ అనడిగారు.

‘అల్లా తాలా దయ! ఆరోగ్యం బాగా లేదు సమద్! నీతో చాలా మాట్లాడాలి.’ రసీదన్ తన దుఃఖం, అశాంతిని దాచుకోలేకపోతోంది.

‘రామ్మా, కూచుందాం.’ సమదూ ముందుకు నడిచాడు. రసీదన్ వెనుక!

అదే పాత మర్రి చెట్టు కింద చప్టా మీద ఇద్దరూ కూర్చున్నారు!

సమదూ ఫకీర్‌ను పిలవటానికి వెళ్ళినతణ్ణే మళ్ళీ పిలిచి సమదూ ఫకీర్ ‘మా అత్త వచ్చింది, నన్ను కలవటానికని! రహమత్ మియ్యాతో చెప్పి, చాయ్ పంపమని చెప్పు మా కోసం!’ అన్నారు. రసీదన్ వైపు తిరిగి ‘చాలా ఆందోళనగా ఉన్నావత్తా! జరుగరానిదేమైనా జరిగిందా?’ అన్నారు.

రసీదన్ ఘొల్లు ఘొల్లున ఏడ్వటం మొదలెట్టింది. సమదూ కొంచెం సేపు ఆమె వైపే మౌనంగా చూస్తూ కూచున్నారు. ఆపకుండా ఆమెను ఏడువనిచ్చారు. కాసేపటి తరువాత సంబాళించుకుంది రసీదన్. చీర కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది. దగ్గరున్న కుళాయి దగ్గరికెళ్ళి ముఖం కడుక్కుని, గొంతులోకి కాసిని నీళ్ళు పోసుకుంది. కొంగుతోనే ముఖాన్ని మళ్ళీ తుడుచుకుని, తిరిగి సమదూ కూర్చున్న చోటుకే వచ్చింది. కూర్చుని ఉన్న సమదూ ఆమెనే చూస్తున్నారు.

‘చున్నీ పారిపోయింది సమద్!’ రసీదన్ అంది.

‘ఆ అబ్బాయి తోనేనా?’

‘ఆ..!’ రసీదన్ హుంకరింపు.

‘నువ్వెందుకు ఏడుస్తున్నావ్?’

‘నీ పెళ్ళి అతనితోనే చేయిస్తాననే ‘చున్నీతో అన్నాను. నిన్ను కలిసివెళ్ళిన మరు దినమే చెప్పానిలా! కానీ ఆ అబ్బాయి నాన్న ఒప్పుకోలేదు. నేనేమీ చెయ్యలేక పోయాను. ఎక్కడికెళ్ళిందో? ఎలా ఉందో?’

‘అత్తా! ఏమీకాదు తనకు! ధైర్యస్తురాలు. ధైర్యం లేనివాళ్ళే కష్టాలు పడతారు. ఆ పర్వర్దిగారే ఆ అమ్మాయిని చక్కగా చూసుకుంటారులే! చాయ్ తాగు ముందు!’ రహమత్ మియ్యా దుకాణం నుంచీ చాయ్ వచ్చిందప్పటికే! ఒక కప్పు రసీదన్ చేతికిచ్చి, రెండోది తాను తీసుకున్నారు సమద్.

చాయ్ తాగాక ‘పీర్ మనిహరీ రావా? వచ్చి దాతా పీర్ మనిహారీ ని కలుసుకో! నీ వంశానికి చెందిన స్థలం. మీ తాతగారే దానికి సొంతదారు కదా!’ అంది.

‘రావాలి. ఏదో ఒక రోజు అదే మట్టిలో కలవాలి కదా! మసూద్ భాయీ చనిపోయారు. నీకు తెలుసా?’

‘లేదు. వారి శవ యాత్ర పీర్ ముహానీకి రాలేదు.’

‘ఔను, ఫారూక్ భయ్యా హారున్ నగర్‌లో ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ వారిని కలిసేందుకెళ్ళారు. అక్కడుండగానే గుండె నొప్పి వచ్చింది. అక్కడి ఆసుపత్రిలోనే చేర్చారు. చనిపోయారాయన. ఫారూక్ భయ్యా చిత్కోహరా కబ్రిస్తాన్‌కు తీసుకెళ్ళారు. పీర్ ముహానీ చాలా దూరమనిపించిందేమో ఆయనకు! నాకూ తరువాతే తెలిసిందీ సంగతి. పరుగు పరుగున వెళ్ళాను. నేను మెల్లిగా అన్నాను కూడా!’ సమదూ తన పెద్దన్న చనిపోయిన విషయం చెప్పాడిలా.

‘నేనైతే మంచీ, చెడూ – యెటువంటి వార్తా అందుకునే అర్హతే లేనిదాన్నైపోయాను.’ రసీదన్ ముఖంలో ఉదాసీనత. మళ్ళీ అడిగింది, ‘ఆయన పిల్లలూ?’

‘అందరూ పెద్దవాళ్ళైపోయారు. హోటల్ పని చూస్తున్నారు. అమ్మతో జామున్ గల్లీ లోనే ఉంటున్నారు. పెద్దబ్బాయి పెళ్ళని ఎవరో చెబుతుండగా విన్నాను.’ సమదూ నవ్వారు. అదో చిత్రమైన నవ్వు. ఇందులో బాధా లేదు, సంతోషమూ లేదు. కాసేపాగి అన్నారు, ‘త్వరలోనే వస్తానత్తా! ఏదైనా అవసరమొస్తే సందేహించక చెప్పు. ఈ ఫకీర్ భాయీ మీద నమ్మకముంచు. నువ్వు జాగ్రత్త!’

‘చున్నీ సంగతి తెలిసేందుకు ప్రార్థించు సమద్! ఆమెకే హానీ జరుగకూడదు.’

‘అల్ హద్ములిల్లా.. పర్వర్దిగార్ మీద నమ్మకముంచు. తన కేమీ కాదు. తొందరలోనే తన గురించి మంచి వార్తొస్తుంది. నువ్వకారణంగా దిగులు పడి, ఆరోగ్యం చెడుపుకోకు.’

ఎండ పెరుగుతోంది. ఒకటే ఉక్కపోతగా ఉంది. గాలెప్పుడు వీస్తే అప్పుడు పడిపోదామని కాచుకుని ఉన్నట్టుగా ఉన్నాయి మర్రి చెట్టు ఆకులు!! కానీ గాలెక్కడ దాక్కునుందో! రసీదన్ మాటి మాటికీ కొంగుతో ముఖాన్ని తుడుచుకుంటూంది. ‘నేను నిన్నూ కష్టపెడుతున్నాను సమద్! కానీ ఏం చేసేది? నిన్ను కలిసినప్పటినుంచీ నా నమ్మకం నువ్వే అయ్యావ్. నీతో మాట్లాడితే ప్రశాంతత వస్తుంది నాకు!’

‘అత్తా! నీకెప్పుడు రావాలనిపించినా రా! తమ్ముడి దగ్గరికి వచ్చేందుకు సంకోచం దేనికి? ఆ.. ఒక ఫోన్ నంబరిస్తాను. ఫజ్లూ దగ్గర ఫోనుండే ఉంటుంది. కొడుకు పేరు ఫజ్లూనే కదా?’

‘ఆ ఇదే పేరు. పెద్దమ్మాయి అమీనా దగ్గర కూడా ఫోనుంది.’

‘వాళ్ళకు చెప్పు, యీ నంబర్‌లో నాతో మాట్లాడిస్తారు నిన్ను. ముందైతే నేను ఫోన్ పెట్టుకోలేదు. ఇటీవల మా దర్గా పెద్దాయన బలవంతంగా నా చేతిలో పెట్టేశాడు.’ సమదూ లేచి దర్గా లోపలికెళ్ళి ఒక స్వీట్ పాకెట్, ఫోన్ నంబర్ వ్రాసిన చిన్న కాగితం పట్టుకొచ్చారు. రసీదన్ చేతికిచ్చి ‘ఇంకొక కప్పు చాయ్ తాగుతావా’ అని అడిగాడు.

‘ఇప్పుడొద్దులే!’

‘తాగత్తా! ఏమైనా తిన్నావా అసలు? బిస్కెట్ తెప్పిస్తాను. నీతో పాటూ నేనూ తీసుకుంటాలే!’

రసీదన్ ఏమీ మాట్లాడలేదు. సమదూ గేట్ దాకా వెళ్ళి చాయ్ బిస్కెట్ కోసం రహమత్‌కు కబురు పెట్టి వచ్చారు. రసీదన్, ఆయనకు దాదా, తనకు నానా ఐన కాలే ఫకీర్ కథలు వినిపిస్తూ కూచుంది. తాత చెప్పిన హజ్రత్ దాతా పీర్ మనిహారీ కథలు కూడా! చాయ్ బిస్కెట్ తరువాత మళ్ళీ ఒకసారి పీర్ ముహానీకి రమ్మని చెప్పి, అక్కడినుంచీ బయలుదేరిందామె ఇంటికి! ముందుటి లాగే గేట్ దాకా వచ్చారామెతో సమదూ ఫకీర్!

***

రసీదన్ ఇంటికొచ్చింది. పీర్ ముహానీ కబ్రిస్తాన్ వాతావరణమే మారిపోయి ఉంది.

ఆమెను చూడగానే, అమీనా కోప్పడుతున్నట్టుగా అంది, ‘ఉన్నట్టుండి ఎక్కడికెళ్ళిపోతావమ్మా చెప్పా పెట్టకుండా? మా పై ప్రాణాలు పైనే పోయాయి నిన్ను వెదకలేక! తరువాత రాధే అన్న చెప్పాడు దర్గాకెళ్ళావని!’

‘నేనెళ్ళటం వల్ల యేమి ముంచుకునొచ్చిందిక్కడ?’

‘చున్నీ ఫోనొచ్చింది, కలకత్తాలో ఉందట బబ్లూతో పాటు! బబ్లూ అత్త ఇంట్లో! నిన్న నిక్కా కూడా అయిందట! ఆమే చేయించిందట! అందరినీ కలిసేందుకు తొందరలోనే వస్తుందట!’ ఒక్క గుక్కలో చెప్పేసింది అమీనా! తరువాతంది, ‘మాట్లాడు. నిన్ను వెదుక్కుంది. నీతో మాట్లాడాలని తెగ ఆరాట పడింది.’

‘నేనేం చెప్పేది? ఎక్కడుందో, ఎలా ఉందో తెలిసింది. ఇదే చాలు నాకు. ఇప్పుడెళ్ళి నీ చెల్లినడుగవయ్యా కల్లూ భయ్యా! హు.. మహా వెళ్ళాడు, పోలీస్ స్టేషన్‌కు రాయింటానికి! ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అతని చెల్లెలు బలవంతంగా నా బిడ్డకు పెళ్ళి చేయించిందని రాయిస్తే ఏమౌతుంది?’ రసీదన్ ఏడుస్తూ, మాట్లాడుతోంది.

‘అమ్మా! నువ్వు కూడా అర్థం పర్థం లేకుండా బుర్ర వేడెక్కించుకుంటూ ఉంటావ్! అల్లా దయ వల్ల వాళ్ళెక్కడున్నారో తెలిసింది. తాననుకున్నది తనకు దక్కింది. పెళ్ళి కూడా అయింది. ఇంక బాధెందుకు? ఇంక నీ ఏడుపాపు. బబ్లూ వాళ్ళ నాన్నతో నీకేంటి పనింక?’ పెద్ద ఆరిందానిలా అమ్మను సముదాయిస్తోంది అమీనా.

ఫజ్లూ ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే రసీదన్‌కు ఆవేశమొచ్చింది. గొంతు చించుకుంటూ అరిచింది, ‘పోరా ఫజ్లూ! ఆ కల్లూ కసాయి ఇంటికి! ఇప్పుడడుగు, ముఖమెక్కడ పెట్టుకుంటాడో? గౌరవంగా పెళ్ళి జరిపించి ఉంటే వాడిదేం పోయేదట? అడుగు వాణ్ణి! వాడి ముఖాన ఉమ్మేసి రా! పోరా!’

‘పిచ్చెక్కిందా? దండెత్తి పోవాలా? అంత సీనుందా మనకు? గుండెలు బాదుకోవటం మానుకో! ఏది ఏమైనా మంచే జరిగింది. ఎక్కడికెళ్ళిందో, అక్కడ సుఖంగా ఉండనీ!’ ఫజ్లూ కూడా అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

ఎన్నో రోజులనుండీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న చీములా బాధంతా ఒక్కసారి బైటికొచ్చింది రసీదన్‌కు! మెల్లి మెల్లిగా కన్నీళ్ళాగాయి. అమీనా మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఫజ్లూ ఆమె దగ్గరే నిల్చున్నాడు. కాస్త తేరుకున్నాక అన్నాడు, ‘అమ్మా డబ్బులివ్వు, మేక పిల్ల మాంసం తెస్తాను. చాలా రోజులయింది కడుపునిండా అన్నం తిని!’

అమీనాకు నవ్వొచ్చింది. దుపట్టాలో ముఖం దాచుకుంది, నవ్వు కనబడకుండా! ఫజ్లూ కేసీ తరువాత అమ్మ కేసీ చూసింది. ఫజ్లూ వడ్డీ వ్యాపారిలాగా కదలకుండా నిల్చున్నాడు అమ్మ ముందు. రసీదన్ అతణ్ణోసారి చూసి, కొంగు విప్పి, ఐదు వందల నోటిస్తూ అంది, ‘నీ పొట్టకు ఎప్పుడూ ఆకలే! తీసుకు పో! నాలుగు రాళ్ళు వెనకేద్దామనుకుంటే ఊహూ.. వీడి నాలుకకెప్పుడూ.. ఆ రుచి అంటుకునే ఉంటుంది.’

ఫజ్లూ ఒక్క సారి ముందుకురికి ఆ నోటు తీసుకుని వెళ్ళిపోబోతుంటే అమీనా వెనక నుండీ అరిచింది, ‘ఇదిగో తమ్మీ! గరం మసాలా కూడా తీసుకు రా! రాధే భయ్యాకు చెప్పు రెండు చాయ్ లు పంపించమని!’

చాలా కాలం తరువాత ఫజ్లూను తమ్మీ! అని పిలిచింది అమీనా.

చాయ్ తాగి రసీదన్ ముంగిట్లోంచీ బైటికొచ్చింది, దాతా పీర్ మనిహారీ సమాధి దగ్గర సాగిలబడేందుకు! రెండు చేతులూ ఎత్తి ప్రార్థించింది. కళ్ళు మూసుకుంది. తన తాత కాలే ఫకీర్ నూ గుర్తు చేసుకుంది. నల్ల జుబ్బా, నల్ల తలపాగా, మెడనిండా రంగు రంగుల పూసల హారాలేసుకుని, చేతిలో వెండి పొన్ను కర్ర, మరో చేతిలో భిక్షాపాత్రతో ఎదుట నిల్చుని ఉన్నాడు నానా నవ్వుతూ! రసీదన్ పెదవులు వణుకుతూ పిలిచాయి.. ‘తాతా!’ అని..!!

‘అవును తల్లీ! నీ మొర అల్లా ఆలకించాడు. కూతురు పెళ్ళైపోయింది. నువ్వూరికే కంగారు పడొద్దు.’

‘కూతురు పెళ్ళి నేను చూడనేలేదు నానా!’

‘ఐతే ఏంటమ్మా? నేనక్కడే ఉన్నాగా? దాతా పీర్ కూడా ఉన్నారు. నీకు చెప్పేవాణ్ణి గుర్తుందా, దాతా పీర్ ఒళ్ళు మరచి చెట్టూ పుట్టా పట్టుకుని తిరిగే రోజుల్లో ఏ గడపలోనైనా అమ్మాయిని చూస్తే చాలు, పెళ్ళీ పాటలు పాడుతూ ఉండేవారని? చాలా తీయని గొంతుక, శ్రుతి బద్ధమైన గొంతుక నిచ్చాడు అల్లా ఆయనకు! విను! గాలిలో నీ చెవులను రిక్కించి విను, ఆయన గొంతు వినిపిస్తుంది నీక్కూడా! ఇప్పుడుకూడా ఆయన పాడుతూనే ఉన్నాడమ్మా!’

గాలి స్తంభించి పోయినట్టూ, ఇప్పుడు వినిపిస్తున్న శబ్దాలన్నీ, నిశ్శబ్దాలై, ఒకే గొంతు బాగా పెద్దగా వినిపిస్తూంది.

ఈ రోజు బన్నాకు శుభాకాంక్షలు

కల్యాణానికి సుదినం వచ్చింది,

కలకాలం యీ జంట వర్ధిల్లాలి

ఖుస్రో పేరు నిలబెట్టాలి. (ఖుస్రో కవి పేరు)

రసీదన్ చెవుల్లో అమృతధారలు! అశ్రుధారలు ఆమె కళ్ళల్లోంచీ రాలుతున్నాయి. ఈ బిందువుల్లో ఆమె కలలూ, సంతోషాలూ అన్నీ!! సమాధి పైన ఎండా, నీడా వస్తూ పోతూ ఉన్నాయి. కళ్ళు తెరిచి చూసిందామె. దాతా పీర్ లేరు. తాత కాలే ఫకీరూ లేరు, చెట్ల పైనుండీ కిందకి రాలిన ఆకులూ, వాటి రాపిడి వల్ల శబ్దమూ తప్ప! రసీదన్ ఆ ఆకులను ఏరుకుంది. తన కొంగుతో సమాధిని తుడిచింది. దాని మీదున్న దుప్పటిని విదిలించి, మళ్ళీ చక్కగా కప్పింది. ఎగిరిపోకుండా దాని నాలుగు కొసల్లో చిన్న చిన్న రాళ్ళను కట్టి వేలాడదీసింది. అగరొత్తులూ, ధూపమూ వెలిగించింది.

ఇంటి ఆవరణలోకి వచ్చి ముందు అమీనాకు, సమదూ ఫోన్ నంబర్ ఇచ్చిన కాగితమిచ్చి సమదూ నంబర్ కలిపి ఇమ్మంది. ఫోన్ చేసి అతనితో మాట్లాడింది. చున్నీ నుండీ ఫోన్ వచ్చిందనీ, ఇంకా జరిగిన సంగతులన్నీ చెప్పింది. అన్నీ విని, అల్లా తాలా కు కృతజ్ఞతలు చెప్పారాయన. తరువాత అమీనా, చున్నీకి ఫోన్ చేసి రసీదన్‌తో మాట్లాడించింది. తల్లీ, కూతుళ్ళిద్దరూ, చాలా సేపూ ఏడుస్తూనే ఉన్నారు. కాస్త నెమ్మదించిన తరువాత చున్నీ అన్నది, ‘తొందరగానే మేమిద్దరమూ వస్తామమ్మా! బబ్లూ కోర్టులో హాజరు కావాలి కూడా! నువ్వు ఏడవకు. మా గురించి ఆలోచించకు. మేము బాగున్నాం. నువ్వు జాగ్రత్త! అన్నకు చెప్పు, మా మీద కోపమొద్దని!’

రసీదన్ ఇంటి ముంగిట మాంసం సాలన్‌తో పాటూ, ఉడుకుతున్న మసాలా దినుసుల పరిమళం పరవళ్ళు తొక్కుతూంది. భాద్రపదపు ఎండ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. మేఘాలు మళ్ళీ అలుముకుంటున్నాయి. గాలిలో తడి పెరిగింది.

***

సత్తార్ మియ్యా హఠాత్తుగా రోడ్డు మీద ఊడిపడ్డాడు.

తర్నేజా సేఠ్ దుకాణం నుంచీ సామాన్లు తీసుకుని అమీనా రోడ్డెక్కిందో లేదో, ఆమె దారికి అడ్డంగా సత్తార్ మియ్యా! అతన్నుంచీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, మళ్ళీ మళ్ళీ అడ్డుకుంటున్నాడు సత్తార్ మియ్యా. అమీనా గట్టిగా గద్దించింది, ‘పోనివ్వు నన్ను!’ అంటూ!

‘మీకు బాగా పొగరెక్కిందే! మీ అమ్మతో, మీ అన్నతో మళ్ళీ మాట్లాడుతాను కానీ, ముందిది చెప్పు, నీకింత పొగరెక్కడినుంచీ వచ్చింది? చొంగ కారుస్తూ తిరిగేదానివి నాముందు?’ అమీనా రోడ్డు మధ్యలో ఉందన్న సంగతే మర్చిపోయాడు సత్తార్ మియ్యా. అతని లోపల దాక్కుని వున్న వెకిలితనం పడగ విప్పింది.

‘నీ మీద ఉమ్మను కూడా ఉమ్మను నేను. నా దారినుండి వెళ్ళిపో!’ అమీనా గర్జించింది.

మెల్లిగా జనం పోగయ్యారు. గత కొన్ని రోజులుగా అతనంటే పడటం లేదక్కడి వాళ్ళకు. ముందే అతని గురించి మంచి అభిప్రాయం లేదెవరికీ! ఇతని పద్ధతేమీ బాగాలేదనీ, రసీదన్ ఇద్దరు కూతుళ్ళమీదా ఇతని కన్ను పడిందని, అందరికీ అర్థమైందిప్పటికే!

‘నీ ప్రియుడెగిరిపోయాడుగా చేతిలోంచీ?’ పళ్ళు నూరుతూ అన్నాడు సత్తార్.

చుట్టూతా జనం చేరుతూనే ఉన్నారు. ఈలోగా బబితా గోప్ వచ్చిందక్కడికి. ఆమెను చూడగానే అమీనాకు ఏనుగంత బలమొచ్చేసింది. మున్నా సింహ్ యాదవ్ కూడా చూశాడిది. అమీనా మళ్ళీ గొంతెత్తి అరిచింది, ‘దుర్మార్గుడా, వెళ్ళిక్కణ్ణించీ!’ అని!

‘పోకపోతే ఏం చేస్తావే?’ ఛాతీ విరుచుకుని నిలబడ్డాడు సత్తార్.

ఉన్నట్టుండి బబితా గోప్ ఇద్దరి మధ్యలోకి వచ్చి, సత్తార్ మియ్యా గూబ గుయ్యి మనేలా ఒక్కటిచ్చింది.

ఇంకేముంది? అక్కడి వాళ్ళందరూ సత్తార్ మియ్యాను తిట్టిపోయటం మొదలెట్టారు. విరుచుకు పడ్డారు. కుర్తా పైజమా చినిగిపోయాయి. కింది పెదవి తెగింది. చూస్తూ చూస్తుండగానే, కళ్ళ కింద చర్మం కమిలిపోయింది. బబితా మొదలెట్టింది. తక్కిన పనంతా మున్నాసింహ్ యాదవ్ అనుయాయులు చేసేశారు.

రోడ్డు మధ్యలో దెబ్బలు తిన్న సత్తార్ మియ్యా! మున్నా సింహ్ యాదవ్ సేన ఎప్పుడు తమ పని తాము చేసుకుని వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియనేలేదు. లోహానీ పూర్ నుంచీ పీర్ ముహానీ వరకూ సత్తార్ మియ్యా రాజ్యంగా ఉండేది ఒకప్పుడు. ఈ రోజు అదే సత్తార్ మియ్యా, అవమానకరంగా తల వంచుకుని నిలబడ్డాడిక్కడే! ఎక్కడికెళ్ళాలో తోచటమేలేదు పాపం. తన గదికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్వాలో, లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు వ్రాసివ్వాలో, లేక ఎక్కడైనా దూకి చావాలో తెలీటమే లేదు. పీర్ ముహానీ మీద తన పట్టు సడలకుండా ఉండి ఉంటే, ఈనాడీ పరిస్థితి వచ్చేది కాదేమోననిపించింది సత్తార్ మియ్యాకు.

తర్నేజా సేఠ్ తన దుకాణం నుండీ నీళ్ళ బాటల్ తీసుకు వచ్చాడు. సత్తార్ మియ్యాను కాళ్ళూ చేతులూ కడుక్కోమన్నాడు. తరువాతన్నాడు. ‘తమ వయసేమిటో గుర్తు పెట్టుకోవాలెవరైనా! నువ్వేమీ యువకుడివి కావు. ఒకవేళ ఐనా, నువ్వు ఈ రోజు చేసిన పనికి ఇదే జరిగేది. తొందరగా వెళ్ళిపో ఇప్పుడింక!’

సత్తార్ మియ్యా అక్కణ్ణించీ జారుకున్నాడు. తలవంచుకుని నాలుగో వీధిలోకి జొరబడ్డాడు. తన జీవితమింతగా మారిపోతుందని ఊహించనేలేదాయన. ఆ రోజు కూడా అనవసరంగా చున్నీ విషయంలో తల దూర్చి, ఐదు వేలు వదిలించుకున్నాడు తను. గోదాం ఇక్కడినుంచీ తీసేయాల్సి వచ్చింది. వ్యాపారం మీద ప్రభావం చూపిందీ మార్పు. రాబడి తగ్గిపోయింది. కొత్త గోదాము లోకి వెళ్ళి కొన్ని నెలలైనా కాలేదు. అప్పుడే ఆ యజమాని ఖాళీ చేయమని వెంటపడ్డాడు. రోజూ ఇదే గొడవ!

తాను తొందరపడకుండా ఉండి ఉంటే, యీ రోజు రసీదన్ పీక తన చేతిలోనే ఉండేది. నిక్కా విషయంలో రసీదన్ ఏమీ మాట్లాడేది కాదు. ఆడదే నిక్కా గురించి పట్టించుకోకుండా నెత్తిన పెట్టుకుంటూ ఉంటే తనకేంటిక? అని తనూ పెద్దగా పట్టించుకోలేదప్పుడు. నిక్కా నామా (పెళ్ళి పత్రం) లేకపోతే ఆమె కుటుంబం మీద తనకే హక్కూ ఉండదు. నిక్కా జరిగిఉంటే, ఆమె లక్ష సార్లు మొత్తుకున్నా, వాళ్ళింట్లోకి తను వెళ్ళేందుకెవడూ అడ్డుకోనేలేడు. ఈ సంఘటన తరువాత, ఆ వీధిలో ఎవరికీ మొహం చూపించలేక పోయాడు తను! రసీదన్ ఇంట్లోకి వెళ్ళటం, ఆమె మీద తన హక్కు ప్రదర్శించటం మాట అటుంచి, అసలు, ఆమె ముందుకే వెళ్ళలేక పోతున్నాడిప్పుడు! గొణుక్కుంటున్నాడు లోలోపలే- ‘వీధి మొత్తంలో, తన మంచితనంతో నాటకాలాడి, మంచి ఆడదానిగా పేరు తెచ్చు కుంది. అందరి కళ్ళల్లో, నన్ను చెడ్డవాణ్ణి చేసేసింది రాక్షసి!’

రోజంతా తన గదిలోనే ముఖం దాచుకుని ఉండిపోయాడు సత్తార్ మియ్యా. రాత్రీ బైటికి రాలేదు. తన ఇంటి యజమాని కొడుక్కు, యాభై రూపాయిలు లంచమిచ్చి, భూలోటన్ దుకాణం నుంచీ, మందు పౌచ్, అప్నీ పసంద్ హోటల్ నుంచీ రోటీలు, చికెన్ మసాలా తెప్పించుకున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండు లాగుంది. మనసులోనే తిట్టుకున్నాడు, ‘దొంగ వెధవలు కుళ్ళబొడిచేశారు,’ అని! మందు కొట్టకుండా ఉంటే యీ నొప్పి తగ్గేదేలేదన్నట్టుంది. పౌచ్ ఖాళీ చేసి సత్తార్ మియ్యా అనుకున్నాడు, ‘ఈ పీర్ ముహానీ నుండి వెళ్ళిపోవలసిందే ఇంక! ఇక్కడుండి ఏం చేయాలి? కబ్రిస్తాన్ కమిటీ వాళ్ళకు ఆ స్థలం అప్పగించేసి, యీ దరిద్రపు చోటు నుంచీ వెళ్ళిపోయి, ఆ సబ్జీ బాగ్ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట గుడారం వేసుకోవాలి. అక్కణ్ణుంచే యీ రసీదన్ సంగతేంటో చూడాలి!’

***

రాత్రి చందమామ కనిపించనేలేదు. మేఘాలు కప్పేశాయి బాగా! రాత్రంతా బాగా కురిసి, తెల్లారేసరికి పారిపోయాయి. పీర్ ముహానీలోకి కొత్త వార్త తెచ్చింది ఉదయం.

కబ్రిస్తాన్ దక్షీణం వైపున్న గోడ పునాదులు పూర్తిగా కదిలిపోయి గోడంతా ఉన్న పాటున కూలిపోయింది. పోయిన సంవత్సరం, కబ్రిస్తాన్ లకు ప్రహరీగోడలుండి తీరవలసిందే అన్న ప్రభుత్వ ప్రణాళికననుసరించి, యీ గోడ లేచింది. సరిగ్గా వారం రోజుల కిందట, వర్షాల వల్ల కబ్రిస్తాన్‌లో నేలంతా చిత్తడి చిత్తడయ్యింది. నేలంతా కుంగి పోయింది లోపలికి! కాంట్రాక్టర్ బాగా దండుకున్నాడు. ఇటుకల మీద సిమెంట్ సరిగా వేయనేలేదు. పెద్ద పెద్ద గోడల బరువునాపేందుకు మధ్య మధ్య వేసే పిల్లర్లు, అస్సలు బాగా లేవు. ఫజ్లూ ఎన్ని సార్లు మొత్తుకున్నా కమిటీ వాళ్ళెవరూ పట్టించుకోనేలేదు. ప్రభుత్వం ఇంజనీర్ తన కమిషన్ తాను తీసేసుకుని, ఇంట్లో పడుకున్నాడు. గోడ పడిపోవటానికో సాకు కావాలి. వర్షాకాలం ఆ సాకును ఇచ్చేసింది. అదే చోట బారీ సాహబ్ మసీదూ ఉంది. దాని వెనక దాదాపు ఇరవై, ముప్ఫై అడుగుల భూమి ఖాళీగా పడుంది. అక్కడెటువంటి గోరీలూ లేవు. కబ్రిస్తాన్ కమిటీ ఆ స్థలంలో చెట్లు నాటించాలనుకుంది. గోడ పడిపోయిన శబ్దానికి లాల్‌జీ టోలాలో ఉన్న వాళ్ళకు భూకంపం వచ్చేసిందనిపించింది. ఈ గోడ తరువాత, ఒక సన్నని బాటుందక్కడ! రోడ్డుకటు వైపు, వరుసగా ఇళ్ళున్నాయి. ఎక్కువగా హిందువులవే! యాదవుల ఆధిపత్యానికి యీ ప్రాంతం, పాట్నా అంతా చాలా ప్రసిద్ధి. తెల్లారగానే కూలిన గోడలోంచీ ఇటుకలను అక్కడి వాళ్ళంతా ఎత్తుకెళ్ళటం మొదలెట్టారు. చూస్తూ చూస్తుండగానే సాయంత్రమైనా కాకముందే అర్ధం కన్న ఎక్కువ ఇటుకలన్నీ మాయం. చాలావరకూ ఇంటి కప్పుల మీదికీ, మరికొన్ని, అటూ ఇటూ వెళ్ళిపోయాయి. పోయినసారి ప్రహరీ గోడ కట్టే సమయంలో లాల్‌జీ టోలా స్థానికులంతా ఏకమై, యీ వీధి సర్వే లెక్కల ప్రకారం ఇంకా వెడల్పుగా ఉందనీ, అందుకని, కాస్త స్థలం వదిలిపెట్టి గోడ కట్టాలనీ పేచీ పెట్టారు, కానీ అది జరగలేదు.

ఈ సారి అక్కడి వాళ్ళు పంతం పట్టారు, వీధినెలాగైనా వెడల్పు చెయ్యాలని! సగం రోజులోనే ఏడడుగుల సందు, పన్నెండడుగుల వీధయింది. వీధి కటువైపు, గడ్డితో కప్పబడిన గుడిసెలు వెలిశాయి. చూస్తూ చూస్తుండగానే లాల్జీ టోలా జరిగి జరిగి బారీ సాహబ్ మసీదుకు నాలుగైదడుగుల సమీపానికి వచ్చేసింది. కబ్రిస్తాన్ లోని పదహైదు ఇరవై అడుగుల నేల, ప్రహరీగోడ పొడవునా కబ్జా ఐపోయింది. ఈ గుడిసెల్లో, రోజువారీ జీవితానికి ఉపయోగపడే సామానులన్నీ అమ్మటం మొదలైంది. దీన్నాపటం రసీదన్, ఫజ్లూకు అసాధ్యం. కబ్రిస్తాన్ కమిటీ, పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేయించింది. అధికార యంత్రాంగం ముందుకు కదిలింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144వ సెక్షన్ అమలులోకి తెచ్చింది. లాల్జీ టోలా స్థానికులు కోర్టుకెళ్ళారు. 144వ సెక్షన్ ఎత్తివేయమని కోర్టు ఆదేశించింది. స్టేటస్ కో అమల్లోకి వచ్చింది. కబ్రిస్తాన్ మూత పడింది. కోర్టు నిర్ణయం లేనిదే అధికార యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి. కబ్రిస్తాన్ కమిటీ, లాల్జీ టోలా స్థానికుల మధ్య యీ స్థితి ఊగిసగాడుతూనే ఉండిపోయింది. కోర్టు ఇటువంటి విషయాల్లో ఎలాంటి ప్రాధాన్యతనూ ఇవ్వదనీ, త్వరగా నిర్ణయించదనీ లాల్జీ టోలా స్థానికులకు తెలుసు. అందుకే ఎంత వీలైతే అంత దీన్ని సాగదీయటమే మంచిదని వాళ్ళూ ఊరుకున్నారు. పోలీసు వాళ్ళకు కూడా ఇలా అక్రమంగా గుడిసెల్లో జరిగే వ్యాపారాల వల్ల అదనపు ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళూ ఊరుకునే ఉన్నారు, పరిస్థితి కొనసాగుతూనే ఉంది – అలాగే!! రోజులు మాత్రం గడచిపోతూనే ఉన్నాయ్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here