దాతా పీర్-8

0
12

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[పొద్దుటి పనులు ముగించుకుని రసీదన్, కబ్రిస్తాన్ గేట్ దాటి బయటకొచ్చి, రాధే దుకాణంలో చాయ్ తాగుతుంది. అక్కడ్నించి దల్దలీ రోడ్డులో మీదుగా అబ్దుల్ బారీ రోడ్డులో గాంధీ మైదాన్ మలుపువైపు వెళ్తుంది. షాహ్ అర్జా దర్గాకు వెళ్ళాలని ఆమె ఆలోచన. టెంపో స్టాండులో ఓ టెంపో ఎక్కి పథర్ మస్జిద్‌కు, అక్కడ్నించి షాహ్ దర్గాకు వెళ్తుంది. ఆ దర్గాలో తన మేమమామ కొడుకు ఫకీర్‍గా ఉంటున్నాడని విందామె. ఎప్పుడో చిన్నప్పుడు చూసిందతనిని. అతని పేరు గుర్తురాలేదామెకు. షాహ్ అర్జా దర్గాలో తల మీద ముసుగు కప్పుకుని మోకాళ్ళమీద కూర్చుంటుంది రసీదన్. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండే దర్గా ఎందుకో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిసేపటికి బయటకి వెళ్ళిన సమదూ ఫకీర్ తిరిగి వచ్చాడు. పీట దగ్గర పాత్రలో ఉన్న నీళ్ళతో వజూ చేసి లోపలికి వస్తాడు. రసీదన్‍ని చూసి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతాడు. అతన్ని చూస్తే తన మేమమామని చూసినట్టే ఉంటుంది. తన పేరు చెప్పి – నువ్వు అబ్రార్ మామ కొడుకువేనా- అని అడుగుతుంది. ఆ బంధాలన్నీ మరిచిపోయానని, ఇప్పుడు తానొక ఫకీరునని అంటాడు. ఉన్నట్టుంది అతని పేరు గుర్తుకొస్తుంది రసీదన్‍కు. పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తుంది. ఇద్దరూ బయటకు వచ్చి మర్రిచెట్టు దగ్గరున్న చప్టా మీద కూర్చుంటారు. ఎలా ఉన్నారని అడుగుతాడు. బానే ఉన్నామంటూ తన జీవితం గురించి చెప్తుంది రసీదన్. చిన్నమ్మాయి సంగతి చెప్పి, ఆమె కోసం ప్రార్థించమంటుంది. తనని తన పద్ధతిలో బ్రతకనీయమని, నీ జీవితానికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని అంటాడు. తాను కూడా ప్రార్థిస్తానని చెప్తాడు. కొంతసేపు మాట్లాడుకున్నాకా టీ తెప్పించి ఆమెతో పాటు తాగుతాడు. తమ ఇంటికి ఆహ్వానిస్తుందతన్ని. వస్తానంటాడు. తానిక బయల్దేరుతానని రసీదన్ అంటే, సమదూ ఫకీర్ లోపలికి వెళ్ళి, కలకండ పలుకులు ఉన్న ఒక తెచ్చి ఆమె కొంగులో వేసి, అందరికీ పంచమ్మా అని చెప్తాడు. పీర్ ముహానీకి వచ్చి, దాతా పీర్ మనిహరీ మసీదు దగ్గర ఉండిపోమ్మని అడిగితే, తాను షాహ్ అర్జాను వదిలిపెట్టి ఎక్కడికీ రాలేనని చెప్తాడు. కొంతసేపటికి రసీదన్ వెళ్ళిపోతుంది. ఫకీరు తన పనిలోకి దిగుతాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-7- రెండవ భాగం

[dropcap]ర[/dropcap]సీదన్ అత్తయ్యకు వీడుకోలు చెప్పి సమదూ ఫకీర్ తన గదికి వచ్చి, అక్కడ పరచి ఉన్న చాప మీద గోడకు ఆనుకుని కూర్చున్నాడు, కళ్ళు మూసుకుని! వ్యాకులతతో మనస్సు, గత కాలపు జీవితాకాశంలో పక్షిలాగ ఎగురుతూ ఉంది. ఎగురుతూ ఎగురుతూ, అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఇసుక తిన్నెల మీద చేరుకుంటుంది, ఇంకోసారి కొండలూ కోనల్లో, జలపాతాల దగ్గరా పచ్చిక బయళ్ళమీదా ఎగురుతుంది!! నాలుగువైపులా పెద్ద ఎత్తున చల్లని గాలి.. అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయేలా!! వాటిలోపల ఒక తీరమంటూ లేని సముద్రం, అన్నిటినీ తనలో కలుపుకునేందుకు సిద్ధమన్నట్టు పెద్ద పెద్ద అలలతో ముందుకు దూకుతూ!!

సమదూ ఫకీర్ ఒకసారి కళ్ళు తెరచి చూశాడు. చలి కాలపు ఎండ ముక్కలు ఉన్నట్టుండి నిప్పు కణికల్లా మండుతూ మెరుస్తున్నాయి. ఎండ తాలూకు యీ ముక్కల కాంతి ఏదో దారుల్లో ఆయన ఉనికిని కరిగిస్తూ ఉంది. ఆయన కనురెప్పల మీద ఒక్కసారి అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. మంచు రేణువులు జారిపడుతున్నాయి. చిత్రమైన పరిస్థితి!! ఏదో గాయపు గుర్తు. లోపల దాక్కుని ఉన్న పాత గాయం, ఇప్పుడు మళ్ళీ తాజాగా!! సమదూ ఫకీర్ కళ్ళ ముందు మళ్ళీ ఒకసారి చీకటి కమ్మింది. ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి, ‘అల్లా తాలా!! దయ ఉంచు!! ఓ నా పవిత్ర రక్షకుడా!! కరుణించు! నా చీకటి కోణాలమీద తప్పిదాల మీద దయ చూపు!! నా తప్పులను క్షమించు! ఈ చిత్రహింస ఏమిటి నాకు? ఎలాంటి భూతం తలమీదికెక్కింది నాకు?’

సమదూ ఫకీర్ అరచేతులు ఆకాశం వైపు చాచి ఉన్నాయి. ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇందాక చాయ్ తెచ్చిన అబ్బాయి, ఎంగిలి గ్లాసులు తీసుకుని డబ్బులు అడగాలని వచ్చిన వాడల్లా అక్కడి దృశ్యం చూసి, మాటలు రాక నిలబడ్డాదు. సమదూ ఫకీర్ ఏడుస్తుండగా చూడటం ఇదే మొదటిసారి ఆ అబ్బాయికి! దర్గాకు వచ్చిపోయిన ఎందరో ఫకీర్లను చూశాడు కానీ ఎవరినీ ఇంతగా ఏడుస్తూ చూడనేలేదు.

రోజు గడచింది.

సమదూ ఫకీర్ అస్సలు భోజనం చేయనేలేదు. తన గదిలో చాపమీద గోడకు వీపానించో, లేదా చేతులు రెండూ తలకింద పెట్టుకుని ముడుచుకుని పడుకునో ఉన్నారంతే!! మధ్యలో నమాజ్ సమయమైనప్పుడు ఆ రాతి చప్టా దగ్గరికెళ్ళి వజూ చేసి, మళ్ళీ అదే విధంగా పడుకోవటం!!

రాత్రయింది.

చలి పెరిగింది. చంద్రుడొచ్చాడు. మంచు పడటం మొదలైంది. గాలి వేగంగా వీస్తే మంచు వీడిపోతూ ఉంది. చంద్రుడు కనిపిస్తాడు. లేదంటే మళ్ళీ మబ్బుల్లోకి! చంద్రుడూ, మంచూ, గాలీ – అన్నీ రాత్రితో కలిసి ఆడుకుంటున్నాయి. సమదూ ఫకీర్ తన గదిలో పొద్దుటినుంచీ ఎలా పడున్నారో ఇప్పుడూ అలాగే పడున్నారు.

సమదూ జీవితంలో అజ్ఞాతంగా మనసు లోపలి పొరల్లో ఇన్ని రోజులూ దాక్కుని ఉన్న దుఃఖాలు, కళ్ళు చెదిరే వాటి రంగులూ, మాసిపోయిన సంగతులూ – అన్నీ హఠాత్తుగా తమ ఉదాసీనత ముసుగును తొలగించుకుని క్రూరంగా మీద పడుతున్నాయి శత్రువుల్లా!! మునుపెప్పుడో వీటినుండీ ఎంతో కష్టపడి మరీ తప్పించుకున్నా డాయన. అలా, షాహ్ అర్జీకి దగ్గరివాడయ్యాడు. మసక బారిన జ్ఞాపకాల నీడలు తమ రంగులు మార్చుకుని ఇలా నాట్యమాడతాయని ఆయన కలలోనైనా ఊహించలేదు. తన మనసు లోపలెక్కడో ఉన్న పచ్చటి జ్ఞాపకాన్ని శాశ్వతంగా పోగొట్టుకోవటమిష్టం లేదతనికి! ఆయనెప్పుడూ ఏడువలేదు. తన ఆత్మకు నల్ల దుస్తులు వేయ లేదెన్నడూ!!

ఉన్నట్టుండి గాలి దారి మళ్ళింది. మెల్లి మెల్లిగా వేగం పెంచింది గాలి. ఎంత వేగమంటే దానిలో సుడులు లేస్తున్నాయి. మంచు తెర పీలికలు పీలికలైపోయింది. చంద్రుడు కనిపించాడు. వెన్నెల పూలు కనిపించాయి. రాగి, మర్రి చెట్ల ఆకుల పైన వెన్నెల క్రీడలు! గాలి వేగానికి దిరిసెన, రాగి, మర్రి చెట్ల కొమ్మలన్నీ ఊగుతున్నాయి. అంతా మారిపోతూ ఉంది. ఒక సున్నితమైన స్పర్శ. వెన్నెల పూల మధ్య జూబీ రూపం మెరిసిపోయింది.

సమదూ పట్నా విశ్వవిద్యాలయంలో దర్భంగా హౌస్‌లో ఎం.ఏ. ఉర్దూ చివరి సంవత్సరంలో ఉన్నాడు. జూబీ మొదటి సంవత్సరంలో ఉంది. ఎం.ఏ. మొదటి సంవత్సరంలో సమద్, మీర్ కవిత్వం మీద ఒక డెసర్టేషన్ పేపర్ సబ్మిట్ చేశాడు. జూబీ ఎం.ఏ. మొదటి సంవత్సరంలో చేరినప్పుడు. ఆమె కూడా డెసర్టేషన్ పేపర్ కోసం మీర్ కవిత్వాన్నే ఎంచుకుంది. అంతే! మీర్ కవే వీళ్ళ కథకంతా కారణమయ్యాడు. ఏదో పవిత్రాకాశం నుంచీ విత్తనంలా మీర్ భూమి మీద పడి, వెన్నెల్లాంటి దుర్లభమైన పూలతకు కారణమయ్యాడు. ఆ లతనే ప్రేమ అని ప్రపంచ మంటుంది.

మీర్‌ను అడ్డం పెట్టుకుని ఇద్దరూ కలిసేవారు. మొట్టమొదటిసారి కలిసినప్పుడే జూబీ కళ్ళనుండీ తన గురించి తొంగిచూస్తున్న ఒక ప్రశ్నను గుర్తించాడు సమదూ.

నేనెవరిని? నా ప్రతిబింబమా! నేను మళ్ళీ జీవితాన్ని పొందాను!

నా గుండెలో నిప్పులా మండుతోంది

నేను ఆనంద సాగరంలో అగ్నితో నిండి ఉన్నాను

వంద రంగులు నా అల లమధ్య నేను మళ్ళీ ఇక్కడ ఉన్నాను!!

జూబీ తన కళ్ళు దించేసుకుంది.

మీర్‌ను చదువుతూ, లెక్కిస్తూ, తెలుసుకుంటూ, ఇద్దరి రోజులూ ఎగురుతూ గడచిపోతున్నాయి. నిద్ర లేని రాత్రులు కళ్ళల్లో కొవ్వొత్తులలాగా కరిగిపోతున్నాయి. సమదూకైతే దర్భంగా హౌజ్ పూర్తిగా మారిపోయింది. ముందైతే క్రిక్కిరిసినట్టుండే అక్కడి సందులూ, గొందులూ, భవనాల వాసన, సమద్‌కు అస్సలు పడేది కాదు. ఇప్పుడు వాటినుండీ వచ్చే వన్నీపరిమళాలే అతనికి!! ఇప్పుడా గాలి వీచికలకు పులకించిపోతున్నాడు. దర్భంగా హౌస్‌ను ఆనుకుని పారుతున్న గంగానది వెడల్పైన తీరాల్లో నడిచే నావల్లో జాలరుల వలలూ, జాలర్ల చేతుల నుండీ జారి నదిలోకి పడేందుకు అతురపడుతున్న వలలూ, ఎగిరెగిరి పడుతున్న జల ధారలతో పాటు ఎగసి పడుతున్న జల పుష్పాలను చూస్తూ రోజులు గడుపుతున్నాడు.

యూనివర్సిటీ నుండీ, సమదూ రహ్మనియాకు వస్తాడు. సబ్జీ బాగ్‌లో యీ అడ్డాలో సమద్‌కు ప్రత్యేకమైన గుర్తింపుండేది. స్నేహితులూ, అభిమానులూ ఇతనికోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇప్పుడు సమద్ కవితల పద్ధతే మారిపోయింది. ఆయన ఆత్మ ఒక మాయా ప్రపంచంలో విహరిస్తూ ఉన్నదిప్పుడు. నిట్టూర్పుల శూన్యంలో దాక్కున్న ఏదో మోము, ఆయన గజళ్ళూ, గేయాల్లోనుంచీ తొంగి చూసేది. ఆకాశంలో ఉన్న చంద్రుడూ, చుక్కలూ ఆయనతో మెల్లిగా మాట్లాడుతుంటాయి. గంగ ఆవలి తీరం నుంచీ వచ్చే గాలి ఆయన్ను పలుకరిస్తూ ఉంటుంది.

మసీదు లౌడ్ స్పీకర్ నుంచీ వినిపిస్తున్న అజాన్ శబ్దం విని సమదూ ఫకీర్ లేచాడు. వజూ చేసి, జానమాజ్ పరచి, నమాజ్ చదివేందుకు సిద్ధమయ్యాడు.

***

సమదూ ఫకీర్ నమాజ్ చేసుకుని లేచాడు. రోజూ లాగే పచార్లు మొదలు. తక్కిన రోజుల్లాగే తొందరగా వెళ్ళాలని ఆయన కోరిక. దర్గా రోడ్డు దాటాడు. పత్థర్ కీ మస్జిద్ చేరాడు. అక్కడికి దగ్గరగా ఉన్న టేకారీ రోడ్డులోకి ప్రవేశించాడు. ఇది గంగా తీరానికి వెళ్ళే రోడ్డు కాబట్టి, పల్లంలో ఉంటుంది.

గంగా తీరానికి వెళ్ళేటప్పటికి మంచు దుప్పటి వీడిపోయింది. ప్రభాతంలో బూడిద రంగు ఆకాశం, సూర్యుణ్ణి ఆహ్వానించేందుకు సన్నాహాలలో మునిగిఉంది. గంగ అటువైపునుండీ వస్తున్న పొద్దుటి గాలి తాలూకు చల్లదనం, సమదూ తనువూ, మనసులను సున్నితంగా తాకుతున్నాయి.

చల్లగానే ఉంది, కానీ సమదూ ఫకీర్ మనసులోపల ఎన్నో సంవత్సరాలనుండీ నివురు గప్పినట్టున్న నిప్పు, మళ్ళీ రాజుకుంది, ఆ వేడిముందు యీ చలి ఏపాటిది?

జూబీతో కలిసి సమద్ తిరగని దర్గా లేదా మందిరమో పట్నాలో అస్సలు లేవేమో!! అలాగే మీర్ కవితలు వినిపిస్తూ తిరగని గంగాతీరాలు, ఇసుక తిన్నెలూ కూడా ఉండవు.

మొట్టమొదటిసారి, కృష్ణా ఘాట్‌లో గంగానది ప్రశాంత తరంగాలే సాక్షులుగా జూబీ చేతులను సుతారంగా పట్టుకుని మీర్ కవితలను చదివాడు.

చెట్టు నిండా పువ్వులు చూసి నివ్వెరపోయా!

నా ప్రియురాలు సృజన కేంద్రం అని తెలుసుకున్నా!

చిత్రమైన సమయమది!

మధ్యాహ్నం ముగుస్తోంది. ఎవరి నీడనో పొందాలనే దాహంతో, సూర్యుడు గంగ ఒడిలో దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఆత్మనుండి వెచ్చదనాన్ని పొందాలనీ, వేడి నిట్టూర్పులను ముద్దిడుకోవాలనీ గాలి ఆత్రుత పడుతున్నది. కృష్ణా ఘాట్ మెట్ల మీదుగా దిగి, చిత్తరువులు వేయాలని, భూమి రెండో వైపునుంచీ తన వెలుగును సేకరించుకుని ఇక్కడికి వచ్చేసేందుకు ఆత్రుతపడుతున్నాడు, చందమామ.

జూబీ వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నాయి స్వేచ్ఛగా, గాలి తాకిడికి ఎగురుతూ, సమద్ ముఖమ్మీద పరచుకుంటూ!! ఈ వెంట్రుకలనుండీ వస్తున్న వసంతంలో విచ్చుకున్న పూల సుగంధం సమద్ నాసికా రంధ్రాలద్వారా, ఒంట్లోకి ప్రవేశించి, రక్తంలో చేరి, వసంతాన్ని రచిస్తున్నది.

సమద్ జూబీ కళ్ళలోకి చూశాడు. అపరాజిత పూలలా విచ్చుకున్న నీలి రంగు నక్షత్రాల వెలుగును ఆ కన్నుల్లో చూశాడు. గంగా తీరం మీద వాలి ఉన్న ఆకాశాన్ని చూశాడు. ఆకాశం నుండి అమృతం జాలువారుతున్నది. జూబీ, సమద్, భూమి హృదయాన్ని చుంబించి, ఇప్పుడిప్పుడే మొలకెత్తిన గడ్డి లాగా అమృత వర్షంలో తడుస్తున్నారు. జూబీ పెదవులు వణికాయి.

ఎక్కడ చూసినా, ప్రేమ! ప్రేమ!

ప్రపంచమంతా నిండి ఉంది ప్రేమ!

జూబీ తలదించుకుంది. సమద్ యీ గజల్ లోని మరో పాదం అందుకున్నాడు.

మిత్రమా! అసలు శత్రువనేవాడు ఎక్కడున్నాడు?

న్యాయమడిగేదీ, న్యాయ నిర్ణేతా రెండూ ప్రేమే కదా!!

సమద్, జూబీ, కృష్ణా ఘాట్ మెట్లమీద కూర్చున్నారు. సమద్ కుడి భుజమ్మీద జూబీ తలానించింది. గంగ ఒడ్డున ఏకాంతం తప్పక లభిస్తుంది. ఈ సమయంలో సాధారణంగా ఉండే రద్దీ ఉండదు. ఇది సోమరిపోతుల, జూదరుల, ప్రేమికుల సమయం. వీళ్ళ విషయంలో అడ్డంకులు లేకుండా ఉండటమే స్థాయీ భావం. జూబీ కళ్ళు మూసుకుని ఉంది. సమద్, ఇసుక పైన ఆటలాడుకుంటున్న పావురాలను చూస్తున్నాడు.

సమద్ అడిగాడు. ‘ఒక కవిత వింటావా?’ అని.

‘ఊ..’ జూబీ కళ్ళు తెరచి సమద్ వైపు చూసింది.

సమద్ ముఖమ్మీద స్వప్న వర్ణాలు.

‘అసంపూర్తిగా ఉందింకా!! పూర్తయిన తరువాత వినిపించనా?’

‘పూర్తి కాకుంటే ఏమిటిట? అలాగే వినిపించండి..’ జూబీ ఆజ్ఞాపించింది. సమద్ నవ్వాడు.

వసంత కాలపు మేఘాల కొంగు

గాలికి రెపరెపలాడుతున్నది!

సుదీర్ఘ కాలం నుండీ కాలపు పైరు

నీ అందం, ఓ చంద్రబింబ వదనమా!

‘ఇప్పటికి చాలు లెండి, తరువాత పూర్తి చేద్దురు కానీ!!’ జూబీ ముఖమ్మీద ఒక అల్లరి నవ్వు!! కళ్ళల్లో సరసమైన చాతుర్యం!! సమద్ దాన్నే చూస్తుండిపోయాడు.

ఇద్దరూ వెనక్కి మళ్ళారు. దారిలో రెండు వైపులా రాళ్ళ ముక్కలతో ఎత్తైన ప్రహరీ గోడ. గోడల మధ్య ఉన్న నెర్రెలలో పూల పొదలు మొలుచుకొచ్చాయి. గుత్తులు గుత్తులుగా విరబూసిన ఆ పూలు గాలి తాకిడికి కదిలి పోతున్నాయి.

‘మీ నాన్నకు తెలుసా మరి.. ఇలా.. ప్రేమ..??’

‘నాకేమీ తెలీదు. దయ ఉంచి, ఇప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడకండి. నన్నెందుకు భయపెడు తున్నారిలా?’ జూబీ ఒకటే వణికిపోతూ ఉంది.

సమద్ తన బుద్ధితక్కువతనానికి తనను తానే తిట్టుకున్నాడు. జూబీ నుండీ సెలవు తీసుకున్నాడు.

***

ఉదయం షికారు తరువాత గంగాతీరం నుండి వెనక్కి వచ్చే ముందు, సమదూ ఫకీర్ ఆకాశాన్ని చూచాడు. ఆకాశంలో సూర్య బింబం ఉదయిస్తూందా లేక.. కాదు కాదు, జూబీ ముఖమా? కాదు. సూర్యుడే!! అరుణార్కుడు!! ఇప్పుడిప్పుడే పుట్టాడుగా! ప్రసూతి గృహం నుంచీ తొంగి చూస్తున్నాడు!!

సమదూ ఫకీర్ ఇసుక తిన్నెలనుంచీ లేచి పైకి ఎక్కాడు. టేకారీ రోడ్డు నుంచీనే తిరుగు ప్రయాణమయ్యాడు. దర్గాకు ముందు గడ్డితో కప్పబడిన గుడిసె, రహ్మత్ మియ్యా చాయ్ దుకాణం దగ్గర ఆగాడు. రహ్మత్‌తో కుశల ప్రశ్నలవీ అయ్యాక అక్కడే బెంచ్ మీద కూర్చున్నాడు. రహ్మత్, చాయ్ ఇస్తూ తటపటాయిస్తున్నట్టు అడిగాడు, ‘నిన్న అహ్మదన్నాడు, ఫకీర్ చాచాకు మనసు బాగాలేదని!! ఏమయింది స్వామీ? ఏం జరిగిందసలు? ఈ రోజు మిమ్మల్ని కలవాలనే అనుకున్నాను.’

‘ఏమీ కాలేదు రహ్మత్ మియ్యా!! ఫకీర్ నవ్వినా ఏడ్చినా ఒకటే!! దిగులు పెట్టుకోకు. చెప్పే విషయముంటే తప్పకుండా చెబుతాగా!!’ సమదూ ఫకీర్ నవ్వేశాడు.

ఎండ బాగా వ్యాపించింది. పొగమంచసలే లేదు. గాలి మాత్రమే ఉంది, ఎముకల్లో అప్పుడప్పుడూ గుండు సూదులు గుచ్చేలా!!

***

సమద్ ఉర్దూ ఎం.ఏ పూర్తయింది. యూనివర్సిటీ టాప్ వచ్చాడు. సమద్ అత్యంత సన్నిహితులైన స్నేహితులు కొందరు, రహమనియా హోటల్‌లో వేడుకలు చేశారు. జూబీ అందరికన్నా ముందు కచ్చీ దర్గాకు వెళ్ళి, సూఫీ సంత్ షేఖ్ షహాబుద్దీన్ ఉరఫ్ పీర్ జగ్జోత్ దర్బారులో హాజరయింది. అక్కడినుంచీ మీతన్ ఘాట్‌లో ఖాన్ కాహ్ మున్ ఎమియా చేరుకుంది. మఖ్దూం మునయీ పాక్ దర్గాలో పూల దుప్పటి మొక్కు చెల్లించింది. అక్కడి నుంచీ షాహ్ అర్జా సన్నిధికి! ఇదివరకే సమద్‌తో కలిసి యీ చోట్లకంతా జూబీ ఓసారి వెళ్ళింది. అతను ఫస్ట్ రావాలని మొక్కుకుంది. జూబీ ఇలా అన్నిచోట్లకూ వెళ్ళిందని తెలిసి, ‘నన్ను కూడా తీసుకుని వెళ్ళవలసింది కదా నువ్వు?’ అని అడిగాడు.

‘నన్ను మీరు ఆటపట్టిస్తారని..!’

‘నేనే ముందు నిన్నా చోట్లకు తీసుకు వెళ్ళాను కదా! మర్చిపోయావా?’

‘ఐతే ఏమయింది? నేను కదా మొక్కుకున్నది, అందుకే నేనే వెళ్ళాను.’

‘జూబీ! నీకు తెలుసుకదా! గడచిన పదేళ్ళలో యూనివర్సిటీలో లెక్చరర్‌షిప్ కోసం ప్రకటన రానేలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. ఫస్ట్ వస్తే ఏమిటి లాభం మరి? లెక్చరర్‌షిప్ రాదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలంతే!!’ సమద్ ముఖంలో రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్న కష్టాల నీలి నీడలు!!

‘పత్రికల్లో?’

‘పత్రికల్లోనా? ఇప్పుడా? ఇప్పుడదంతా రాజకీయ నాయకుల ఆశ్రయంలోకి వెళ్ళిపోయింది. అది నాకిష్టం లేదు.’

‘అబ్బా, ఇప్పుడాసంగతెందుకు? సంతోషంగా ఉండాల్సిన సమయం. మీరేమో..!!’ జూబీ అడ్డుకుంది.

సమద్ ప్రేమతో జూబీని చూశాడు.

జూబీ కళ్ళు వాల్చింది సిగ్గుతో!

ఒక సముద్రం ఉవ్వెత్తున లేచింది. దానిలోపల్లోపల ముత్యపు చిప్పల దుప్పటి పరచుకుని వుంది. వాటిలో ముత్యాలు పెరుగుతున్నాయి. ఈ సముద్రపు నురగలు, తీరాన ఉన్న ఇసుకమీద చిత్రాలు గీస్తున్నాయి.

సమద్ జూబీతో అన్నాడు, ‘నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. నాకు విరిగి ముక్కలై చెల్లాచెదరవటం మాత్రమే తెలుసు.’

జూబీ మౌన దృక్కులతో చూసిందతన్ని!! ఉదయపు నిర్మలకాశంలో ఏదో వజ్ర నక్షత్రం ఒక పల్చటి గీత గీచినట్టే కనిపించింది సమద్ ముఖంలో! ఆ గీతను తన కొంగు చివర్లతో తుడిచివేయాలనిపించిందామెకు!! సమద్ కళ్ళు దూరంగా ఉన్న అనంతాన్ని చూస్తున్నాయి. ఆ కళ్ళమీద తన పెదవులానించాలనిపించిందామెకు!! సమద్ ఆధారంగా ఆమెలోని బాధలూ, ఉత్సాహాలూ, కోరికలూ – అన్నీ ఒక్కటై ఒక వాద్య సంగీతంలా లోపల్లోపల మ్రోగుతున్నాయి. బూడిద రంగు చంద్రుడిలో కలం ముంచి రాసినదీ, గొంతుకలో గోరీల మీద కురిసిన మంచు లోని తడి ఉన్నదీ, పొందటం కంటే కోల్పోవటమే ఎక్కువగా ఉన్న ఒక విషాద గీతంలాగే కనిపిస్తాడు జూబీకి సమద్ ఎప్పుడూ.

వీలర్ సెనేట్ హాల్ గోడకు వీపానించి నిలబడి ఉన్నాడు సమద్. జూబీ అన్నది, ‘పదండి, మెట్లమీద కూచుందాం.’

‘నువ్వెళ్ళు. మీనాన్న బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.’ సమద్ అన్నాడు.

‘మా నాన్నేం చేశాడు మధ్యలో మీకు? ఇలా మాటి మాటికీ..!’ జూబీ కోపం నటించింది.

‘అరె, నేనేదో హాస్యానికన్నాను.’ నవ్వుతూ అన్నాడు సమద్.

‘మీరా? హాస్యానికా? హాస్యాలవీ ఉంటాయా మీకసలు? హాస్యాలాడటం ఎప్పటినుంచీ తమరు?’ జూబీ యీ రూపం పూర్తిగా కొత్త సమద్‌కు! తన రెండు చెవులూ పట్టుకుని అన్నాడు, ‘క్షమించండి దేవీ!! ఇంకెప్పుడూ అలా అనను.’

కిల కిల నవ్వింది జూబీ.

సమద్ కూడా కొత్త రంగులో వెలిగిపోయాడు.

సముద్రపుటలలు, తమ విశాలమైన ఖజానాలో దాక్కుని ఉన్న నిధులను బైటికి తీసుకుని వస్తుంటాయో, అలాగే రసీదన్ వెళ్ళిపోయిన తరువాత, సమద్ గత జీవిత స్మృతులు ఒక్కొక్కటీ బైటపడుతున్నాయిప్పుడు, రాత్రింబవళ్ళూ !! ఇలా ఎప్పుడూ జరుగలేదింతవరకూ!!

పొద్దెక్కుతూ ఉంది. సమదూ ఫకీర్ తన గదిలోనుంచీ బైటికి వచ్చాడు. ఆకాశం కేసి తలెత్తి చూశాడు. ఇవ్వాళ ఎండ కొంచెం తక్కువగా ఉంది. గత రోజులకంటే చలి కాస్త తక్కువగా ఉంది. నేలను పరీక్షగా చూశాడతను. గడచిన రోజుల్లో చలి ఎక్కువవటం వల్ల నీరసించిన మొక్కలకు ప్రాణం వచ్చినట్టుంది. ఆకాశానికేసి చూస్తూ, గడ్డి మొక్కలు ఎండ కాచుకుంటున్నాయి.

నెమ్మదిగా సమదూ ఫకీర్ దర్గా దాటి బైటికొచ్చి, రహమత్ చాయ్ దుకాణం వైపు నడిచాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here