దాగిన గుణాలు

0
8

[dropcap]వే[/dropcap]దాద్రిపురం రాజావారు సుధర్ముడికి ఏకైక సంతానం వేదవల్లి అనే కూతురు. ఆమెకు పెండ్లి ఈడు వచ్చేసరికి మంచి వరుణ్ణి వెతికి పెండ్లి చేయాలని సుధర్ముడు నిశ్చయించి ఈ విషయం తన రాణీ రత్నమాలతో, మంత్రి సుహస్తుడితో చర్చించాడు.

సుహస్తుడి సలహా మేరకు వివాహమాడటానికి వచ్చే యువకులకు పరీక్షలు పెట్టి అందులో అత్త్యుత్తమంగా అన్ని పరీక్షల్లో నెగ్గిన యువకుడికి వేదవల్లినిచ్చి వివాహం జరిపించాలని రాజు, రాణి, మంత్రి నిర్ణయించారు.

ఒక శుభముహూర్తాన రాజ కుమార్తెను పెండ్లాడ గోరిన యువకులు, యువరాజులు సుధర్ముడు పెట్టే పరీక్షల్లో పాల్గొని తమ బలాన్ని, తెలివితేటలను నిరూపించుకోవాలని చాటింపు వేయించారు. ఈ చాటింపు విషయం పక్కరాజ్యాల యువరాజులకు కూడా చేరింది. రాజుగారు చెప్పిన తేదీకి సుమారు ఇరవైమంది యువకులు వచ్చారు.

వారిని ఆస్థాన పండితులు, సైనిక దళాధి పతులు రకరకాల ప్రశ్నలు అడిగి ఆయా విషయాలమీద అవగాహన లేని వారిని పంపివేశారు. అనేక మానసిక పరీక్షలు కూడా పెట్టారు. ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని వారిని సాధన ద్వారా మానసిక ధృఢత్వం సాధించాలని చెప్పి పంపారు.

సుధర్ముడిలో ఉన్న మంచి విషయం ఏమిటంటే పరీక్షలలో ఓడిపోయిన వారికి ఏ విధంగా మెళకువలు అభివృద్ధి చేసుకోవాలో చెప్పి తమ మంచితనం చాటుకున్నాడు.

ఆఖరికి అన్ని పరీక్షల్లో ముగ్గురు యువకులు నెగ్గారు. వారు ఇటు పురాణాలు, చరిత్ర, యుద్ధ విద్యల్లో మంచి అవగాహన ఉన్న వారుగా తేలింది.

“మహారాజా పరీక్షల్లో నెగ్గిన ముగ్గురికీ మరొక పరీక్ష పెడితే అసలు వారిలో మనకు కనబడని గుణాలు బయట పడతాయి” చెప్పాడు సుహస్తుడు.

“మంత్రిగారూ, ఏమిటా పరీక్ష? ఏవిధంగా వారిలో దాగిన గుణాలు పరీక్ష చేస్తారు?” అడిగారు రాజు గారు.

“మహారాజా, ముగ్గురినీ మూడు విడి గృహాల్లో నాలుగు రోజులు ఉంచి వారికి అన్నీ అక్కడే సమకూర్చి నాలుగు రోజుల తరువాత వారిని గమనిస్తే మనం చూడని వారి గుణాలు తెలుస్తాయి” వివరించాడు సుహస్తుడు.

సుహస్తుడి మీద నమ్మకంతో అలాగే చేయమని రాజు తన సంసిద్ధతను తెలియచేశాడు.

ఆ విధంగా ముగ్గురినీ మూడు విడి గృహాల్లో ఉంచి అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల తరువాత మంత్రి, సుధర్ముడు వెళ్ళి ఒక ఇంటిని పరీక్షించారు. అందులో ఉన్న యువకుడు కేతనవర్మ ఇల్లంతా గజిబిజిగా ఉంచాడు. తాను తిన్న పండ్లతొక్కలు ప్రధాన గుమ్మం బయట పడేశాడు. ఆ పక్కనే ఉన్న పూల కుండీలలో కొంత వాడినట్టు కనబడ్డాయి! ఆ విషయాలు గమనించాక ఇద్దరూ మరో ఇంటికి వెళ్ళారు. అందులో నాగవర్మ ఉన్నాడు. అతని ఇంటిని పరీక్షిస్తే ఇల్లు శుభ్రంగానే ఉంది. కాని తాను తినిమిగిలిన ఆహార పదార్థాలు, పండ్లతొక్కలు బయట చెత్త కుండీలో పడేశాడు. ఇక్కడ కూడా కుండీలలో చెట్లు ఎండినట్టు కనబడ్డాయి.

ఇక మూడో ఇంట్లో ఉన్న మల్లికార్జునుడు ఉన్నాడు. అతని ఇంటిని పరిశీలిస్తే, ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నాడు. ఆహార పదార్థాలు ఏవీ వృథా చెయ్యలేదు. పండ్ల తొక్కల్ని సన్నముక్కలు చేసి చెట్ల కుదుళ్ళలో వేశాడు. కుండీల్లో నీళ్ళు పోయడం వలన మొక్కలు పచ్చగా పూలతో ఉన్నాయి. కొన్ని పండ్లతొక్కల్ని ఇంటి బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న ఆవుకి వేస్తూ మల్లికార్జునుడు కనుపించాడు!

అందరినీ పరిశీలించిన మీదట మంత్రి సుహస్తుడు ఈ విధంగా చెప్పాడు.

“మహారాజా, కేతనవర్మకి అన్ని విద్యలు ఉన్నాయి, కానీ బద్ధకం ఎక్కువ అందుకే ఇల్లు గజిబిజిగా ఉంచి పండ్ల తొక్కలు కూడా కుండీలో పారవేయలేదు, చెట్లకు నీళ్ళు పోయలేదు. అతని కనబడని గుణం బద్ధకం. పోతే నాగవర్మ ఇల్లు శుభ్రంగానే పెట్టుకున్నాడు కానీ అతనికి చెట్లను కాపాడే గుణం లేదు, ఆహార పదార్థాలు వృధా చేశాడు.

ఇక మల్లికార్జునుడు అన్నివిధాలా యువరాణి వేదవల్లికి సరిజోడి కాగలడు. ఎందుకంటే అతనికి రాజు కుండాల్సిన గుణాలతో పాటు, శుభ్రత, చెట్లను కాపాడే గుణం, జంతువుల పట్ల ప్రేమ ఉన్నాయి. దీని వలన ఇతను రాజ్యపాలన కూడా అద్భుతంగా చేయగలడు” వివరించాడు సుహస్తుడు.

“తమరు చెప్పింది నిజమే, వేదవల్లికి మల్లికార్జునుడే సరియైనవాడు” అంటూ సుహస్తుణ్ణి రాజు, రాణి ఎంతో మెచ్చుకున్నారు.

ఈ విషయాలు వేదవల్లికి చెబితే ఆమె కూడా ఆలోచించి మల్లికార్జునుడితో వివాహానికి తన సమ్మతి తెలిపింది.

కొద్ది రోజుల్లోనే వేదవల్లి వివాహం మల్లికార్జునునితో అంగరంగ వైభోగంగా జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here