దాలిగుంటలో కుక్క

0
7

[box type=’note’ fontsize=’16’] జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గోపీనాథ్ మహంతి ఒడియా భాషలో రాసిన కథని తెలుగులో అనువదించి పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి చాగంటి తులసి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దుటి నుండి మసాబు. పొద్దు కనబడలేదు. వెలుగుని బట్టి సమయం ఎంతో తెలీటం లేదు. రోజు మొదలో, మధ్యాహ్నమో, సాయంకాలమో? సమయం అంటే కేవలం సమయం, మనిషి అనుభవంలో. మార్గం! కేవలం మార్గం!! ముందు పొడుగ్గా పరుచుకుని! కుడీ ఎడమా ఏం కొంచెం కనబడుతుందో అది కాస్త వెనక్కి గతించిపోతోంది. ముందుకు వచ్చినవాడు వెనక్కి వెళ్ళిపోతాడు – గతంలోకి! వస్తూనే వెళ్ళిపోతాడు! మరి వర్తమానం అంటే? గతించిన దాని స్మృతిలో అలలు లేపి, ఈదుకుంటూ వెళ్ళిపోయే చంచల ఛాయా?! తన ఉద్యోగం వచ్చే ఫిబ్రవరి పన్నెండొవ తారీఖుతో పూర్తైపోతుంది! విశ్వమూర్తి బాబు ఆలోచనల్లో పడ్డారు!

కారులో ఒంటరిగా! ఆ ఏకాంతం ఆయనకి శూన్యం శూన్యంగా తోస్తోంది. ఎన్నెన్నో అలంకరణలతో తాను తొడుక్కున్న పొడుగైన తొడుగు మీద నుండి కిందివరకు తొలగిపోతోంది. ఎన్నెన్నో బంధాలు విడివడి ఎదురుగా కనపడుతున్నాయి. చైతన్య చింతనల ఆవిరిగా ఆయన పైకి ఎగిసిపడుతున్నారు.

కారులో మరొకడు ఉండడం ఉన్నాడు. డ్రైవరు హుస్సేన్! ఖాకీ యూనిఫారంలో! స్టీరింగు పట్టుకుని రోడ్డుమీద కళ్ళు అప్పగించి! మాటామంతీ లేని, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీనట్టు ఉండే మనిషి! ఏదన్నా అడక్కపోతే నోరన్నది విప్పడు! వాడు అక్కడ ఉన్నా లేనట్టే ఉన్నాడు! కారు తన తోవని తనే గుర్తుపట్టుకుంటూ దానంతటదే ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది!

వెనక సీటులో ఎడంపక్క కిటికీ వేపు విశ్వమూర్తి బాబు స్థిరంగా కూచున్నారు. పొడుగు మనిషి, నల్లటి శరీరం, పూర్వంలాగా అంత ఆరోగ్యంగా లేదు. వెడల్పైన మొహంలో కాస్త కండ తగ్గింది. కోలగా, నిండా గుంటలు పడ్డ మొహం. నుదురు విశాలంగా! మీద నుండి మధ్యవరకు బట్టతల అవడంతో మరీ విశాలంగా ఆనుతోంది. బట్టతలకి అటూ ఇటూ తెల్లవెంట్రుకలు. కళ్ళకి దళసరి అద్దాల కళ్ళజోడు. దూరంనుంచి చూస్తే అధికార దర్పం చలాయించే మొహం, ఆత్మవిశ్వాసంతో వెలిగే గంభీరమైన ముఖకవళికలు, ఆ మొహాన్ని చూస్తే ఆయన ఏం అనుకుంటున్నాడో అంతుపట్టదు. ఆ మొహం మీద తొడుక్కున్న తొడుగు అలాంటిది! ఆయన వేసుకునే బట్టలూ తొడుగే! ఏళ్ళ తరబడి అలవర్చుకున్న అలవాటు. బయటా లోపలా రెండింటికీ ఏ విధమైన పొంతనా ఉండదు. రెండూ వేరువేరుగా ఉంటాయి. వాటిమధ్య దళసరైన నల్లటి తెర. దాన్ని దాటుకుని ఎవరి దృష్టీ లోపలకు వెళ్ళలేదు! బయటికి కనిపించేది ముక్కుకి సూటిగా వెళ్ళేరూపం! అలాంటి పోకడ! అలాంటి ప్రవర్తన! ఆదర్శమైన ముద్ర! బాధ్యతగల అధికారి. ఎన్నోరకాల బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. భిన్నభిన్న సమయాల్లో ఆయన ఆయా బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు ఇక ఆ నిర్వహించిన బాధ్యతల కర్తవ్యంలోని ఆ తిరుగుడు అంతా వివరణ పట్టికలో నమోదు అయింది. చాలీచాలని ఇరుకు గోదాములో చిక్కుకుని పూర్తిగా ఎరుపు అయ్యేంతవరకూ నమోదు అయి ఉంటుంది. తర్వాత? ఎలకలు కొరికేయవచ్చు! చెదలు తినీయొచ్చు! మొత్తం పుటలన్నీ పొడిపొడి అయి రాలిపోవచ్చు!

భిన్నభిన్న సమయాల్లో రకరకాల మనుషులు పరిచయంలోకి వచ్చి ఉంటారు. వాళ్ళకి గుర్తు ఉండి ఉంటుంది. ఆ గుర్తైనా వాళ్ళలో ఒక్కడైనా మిగలకుండా ఉన్నంతవరకే! తరువాత తన అనుభవాలను పంచుకున్న మనుషులు అసలు ఉండరు.

ఇది కొత్త విషయం ఏం కాదు! ఉత్పత్తి, నాశనం, విస్మృతి – లోకంలో జరిగే సనాతన క్రమం! ఇప్పుడు ఇదిగో ఈ క్షణంలో విశ్వమూర్తి బాబు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు చూశారు. ఈరోజు ఆయన తన చివరి టూరు ప్రోగ్రామును ముగించుకొని కాస్త తొందరగానే భోంచేసి పగలు 11 గంటల 35 నిమిషాలకు రావుర్‌కెలా విశ్రాంతి గృహం నుండి తమ కారులో బయల్దేరారు. కేందూఝర్ తోవని భువనేశ్వర్ తిరుగు ప్రయాణమయ్యారు.

చీకటి రాత్రుల మసక వెలుతురులో సమయం అంచనా కట్టలేకపోవచ్చు. ఎన్ని గంటలయిందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు! ఆయన ఎడం మణికట్టుమీద ఉన్న వాచీ సరిగానే తిరుగుతున్నది. ఒంటిగంట అయిందని చెపుతోంది. సమయం ముల్లు జరుగుతోంది ముందుకి. ఇంకా ముందుకి – సెకను తర్వాత సెకను, నిమిషం తర్వాత నిమిషం ప్రతి వర్తమానం గతం అయి మాయమైపోతోంది. కొత్తది వస్తోంది. తన రూపురేఖల్ని పోగొట్టుకోవడానికి!

ఒకప్పుడు ఈ కొండలదండ! చొరబడ్డానికి వీల్లేనిది! కీకారణ్యాలు, అడవి దారులు!! ఒకప్పుడు నడిచివెళ్ళడానికి దారులు లేవు! పెద్ద పెద్ద భూభాగాలు! శుభ్రపరుచుకున్నాక అజ్ఞాతమనుషులు, కష్టసుఖాల సభ్యత ఏర్పడింది. ఎవరు కడుతున్నారు? ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు నాశనం చేస్తున్నారు? ఎవరు విధ్వంసం చేస్తున్నారు? కట్టిన ఏ బస్తీ ఎన్నేళ్ళు నిలిచి ఉంది? వందల ఏళ్ళు! వేల వేల సంవత్సరాలు! మళ్ళీ మొదలు! అడివే! తీరూ తెన్నులేని వనాలు! మట్టిపొరలు! మళ్ళా అడవులు నరకడం, మంట పెట్టడం, వ్యవసాయం, పంట, కొండలు, గుట్టలు, ధ్వంసమైనవి! పొలాలు అక్కడక్కడ? ఎవరు చెప్పగలరు? ఎన్ని యుగాల కథ ఇది? చెప్పేది సత్యమా? కల్పనా? దారులు ఏర్పడ్డాయి, రోడ్లు పడ్డాయి, వంతెనలు వచ్చాయి. ఇదిగో ఈ రోడ్డు మీద ఎందరి ప్రాణాలో పోయాయి. ఎంతెంతమందో ఎన్నో విధాలుగా చనిపోయారు! ఎప్పుడు ఎక్కడ క్రూరంగా! రక్తమాంసాలు, కన్నీళ్ళు ఈ రోడ్డులో కలిసిపోయాయి!

ఒకప్పుడు అవి ఉండేవి! తర్వాత లేవు! దుఃఖం, దురవస్థ ఉండేవి! ఉన్నాయి. అత్యాచారాలు, అన్యాయాలు, దోపిడీలు, హింస, నిస్సహాయుల కన్నీళ్ళు! బీదవాళ్ళ ఆర్తనాదాలు! అదృశ్య అజ్ఞాత శక్తిని ఆదుకోమని వేడుకోడాలు! మళ్ళీ ఆశ, నడుం బిగించడం, సాహసం, ఎంత బలహీనమైనప్పటికీ తిరిగి మరో ప్రయత్నం! మళ్ళీ మళ్ళీ మరో మరో ప్రయత్నం! ఈ శూన్యమార్గం మీదా మనిషి చరిత్ర పరుచుకుని ఉంది. శూన్యంలో దాక్కుని ఉంది. విశ్వమూర్తి బాబు కూచుని ఉన్నారు!!

రాళ్లమయమైన చోట ఓ రాయి మరో రాయి దగ్గర ఉంటుంది. చెట్టు దగ్గర చెట్టు ఉంటుంది. కొమ్మల్లో ఆకు పక్క ఆకు ఉంటుంది. నిజానికి అన్నీ వేరు వేరైనవే!! మట్టికింద వేళ్ళు అన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. భూమి కంపిస్తూనే మొత్తం రాళ్ళలో స్పందన! అన్ని రాళ్ళు మొత్తం అంతా మట్టే ఒకే ధరిత్రివే అయినా వేరు వేరైన అంశాలు! ఓ రోజున ధరిత్రి లేకుండా పోతే? అప్పుడు? ఏదీ ఉండదు! ఎవరూ ఉండరు!

లోకంలో చాలామందిలాగానే విశ్వమూర్తి బాబూ వార్తాపత్రిక చదువుతూ ఉంటారు. ఇన్ని యుగాల మానవ అస్తిత్వం ఉంటుందా? ధ్వంసం అయిపోతుంది ఏమో!! సందేహమే! ఒకదానిని మించి మరొకటి మొత్తం సృష్టిని తుడిచిపెట్టేసే మారణాస్త్ర శస్త్రాలు! ఓ పద్ధతి ప్రకారం కూడబెడుతున్నారు!! కూడబెట్టడం ప్రక్రియ పెరుగుతోంది. వేగం పుంజుకుంది! నాలికలు జాస్తూ అపనమ్మకం, లోభం, హింస! అగ్నిశిఖల్లా లేస్తున్నాయి! లెక్కపెట్టలేనన్ని హత్యలు, అత్యాచారాలు, అన్యాయాలు, అసభ్యకృత్యాలు, పులి భయం గిలికి!! ఆలోచన చేసి సహాయం పొందడం – అయినా ఎవరికి తెల్సు? ఆ సహాయం ఉంటుందో ఊడుతుందో! అన్నిటి గురించీ దేశంలో జరుగుతున్నవీ విదేశాల్లో జరుగుతున్నవీ చదువుతున్నారు. ఓ చోట కరువు, ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు! దేశంలో తనచుట్టు పక్కలే ఎన్నెన్ని సంఘటనలు! తిండికి కరువు, ఆకలితో అలమటించే పిల్లలు! కల్తీ తిండి తిని చావులు, పిల్లల్ని అమ్ముకోవడాలు, జబ్బులతో చావడాలు! పందుల మందలు చచ్చిపోతున్నట్టు సమూహాలు సమూహాలు చచ్చిపోతున్నారు! పనీపాటా లేక ఎంతోమంది రోడ్డున పడ్డారు. కూడు, గుడ్డా, నీడ లేక! వికలాంగులు! ఎన్నెన్ని ఆశలు! ఎన్నెన్ని కలలు! ఎన్నెన్ని శుభారంభాలు! అన్నిటికి అన్నీ మళ్ళీ మాయమైపోతాయి! ఎడారిలో ఓసారి చిరుజల్లు ఎప్పుడో పడ్డట్టు! వెనువెంటనే ఇంకిపోయినట్టు! చూస్తే మళ్ళీ అదే పొడిబారిన మిరుమిట్లు గొలిపే ఎడారి!

ఇవన్నీ వార్తలు మాత్రమే! అక్షరాల మీద కళ్ళు తిప్పగానే మనసు బరువెక్కిపోతుంది. ఆ తర్వాత క్షణం – మరేం ఉండదు. రోజువారీదే ‘నేను’, ‘నా’ తో సంబంధించినదే ఉంటుంది. నత్త ఎప్పుడో ఒకసారి గుల్లలోంచి బయటికి వస్తుంది. వెంటనే మళ్ళీ గుల్లలోకి దూరిపోతుంది!

విశ్వమూర్తి బాబు ఆలోచనలు సాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖున ఆయన రిటైరవుతారు. అవ్వాలి! అవుతారు! ఇల్లుంది. ఇద్దరు కొడుకులూ ప్రయోజకులయ్యారు. మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆడపిల్లలిద్దరూ సుఖసంతోషాలతో ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అప్పులు ఏం లేవు. పెన్షను వస్తుంది. బతడానికి చాలు! అయినా ముప్పైరెండేళ్ళ అలవాటైన జీవితానికి స్వస్తి చెప్పాలి. బతికుండగానే పెనుమార్పు! చిత్రమైన చింత! ఒక పీడకలలా అనిపించినా, ఏదవాలో అదవుతుంది! కాని అనుకోకుండా ఉండలేకపోతున్నారు! మనస్సు మునకలు వేస్తోంది. ఆర్ద్రమవుతోంది!

ప్రయిమరీ స్కూలు మాస్టారు శ్రీవత్సపాఢి! పొడుగ్గా, తెల్లగా మెరిసే తేమకళ్ళు, పెదిమల మీద దాగీదాగని చిరునవ్వు, బళ్ళో చేరడానికి తను వెళ్ళడం నిన్న మొన్నలా ఉంది. అమాయకపు పిల్లాడి మొహం చూసి ఆయనకి ఎందుకో మమకారం కలిగింది. పిల్లాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు. దుఃఖీశ్యాం! బాగా చదివించు, పేరేమిటన్నావ్? బావురీబంధువా? అబ్బే విండానికి బాగోలేదు. వీడికి విశ్వమూర్తి అని పేరు పెడదాం. విశ్వమూర్తి ఎవరో తెల్సా? మన స్కూలు ఇనస్పెక్టరు బాబు. బాగా చదువుకున్నవారు. పెద్దపేరు ఉన్నవారు. చదివి పెద్దయ్యాక నువ్వూ ఆయనలా అవాలి! తెలిసిందా? పుట్టిన తేదీని రెండేళ్ళు తగ్గించి రాయడమే మంచిది. భవిష్యత్ ఉద్యోగంలో మరో రెండేళ్ళు పనికొస్తుంది!

ఆయన అలా తగ్గించి వేయడం వల్ల గాని లేకపోతే ఏడాదిన్నర ముందే ఆయన ఉద్యోగం అయిపోయి ఉండేది! శ్రీవత్సపాఢి తన శుభం కోరినవారు. పాపం కాలం చేయడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డారు. ముసలయ్యారు. రిటైరయ్యారు. మహా లేమి బతుకులో కూతురికి వైధవ్యం వచ్చింది. పెళ్ళాం రోగిష్టిదయింది. రోగం ముదిరే చనిపోయింది. కొడుకులిద్దరూ ఆవారాగాళ్ళే, దేశాలు పట్టి ఎక్కడికో పోయారు. ముసలి మాష్టారు ఒంటరివారయిపోయారు. ఎవరైనా పిలిస్తే దైవకార్యాలు పూజలూ నిర్వహించడానికి వెళ్ళేవారు. మంత్రం వేసి అశుభాలు పోగొట్టడానికి ఇంకొకరి ఇంటికి పిలుపొస్తే వెళ్ళేవారు. పిల్లల్ని తమ దగ్గరికి పంపితే వాళ్ళకి అక్షరముక్కలు నేర్పేవారు. ఊళ్ళోవాళ్ళూ, పేటలోనివాళ్ళు ఏదిస్తే దానితో రోజు గడుపుకునేవారు. ఒక్కోరోజు ఏదీ లేకపోతే ఉపవాసమే!

విశ్వమూర్తిబాబు చెవివరకూ ఈ భోగట్టాలు వచ్చాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత ఎమ్మే పాసయ్యాక ఊరికి వెళ్ళారు. శ్రీ వత్సపాఢి గారి ఊరు. అస్థీ చర్మం మిగిలిన ముసలాయన చప్పి దవడలతో ఆయనని చూసి నవ్వారు. కౌగలించుకుని వీపు మీద రాస్తూ దీవెనలు ఒకటే దీవెనలు!

విన్నాన్రా బాబూ విన్నాను. పెద్దవాడినయ్యావని! ప్రతి భోగట్టా తెలుస్తూనే ఉంది. చిన్నప్పుడు నిన్ను చూసి నేనేమనుకున్నానో అదే అలాగే అయ్యావు! నాకు చాలా తృప్తిగా ఉంది. చూస్తూ ఉండు ఇంకా ఇంకా గొప్పవాడివవుతావ్! పెద్ద ఆఫీసరవవుతావ్! కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకుంటావ్!

ఆ తర్వాత మరి నాలుగేళ్ళకే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు!

ఆ ముసలి మాస్టారుగారి కోసం ఏం చేయగలిగారు? ఆయనతో ఏ రకమైన సంబంధం పెట్టుకోగలిగారు? ఆత్మగ్లానితో ఆయన గుండె కలుక్కుమంటోంది. తర్కంతో తన మనస్సును సమాధానపర్చుకోడానికి ఆలోచించారు. అలా అనుకుంటే ఎంతమంది మాస్టర్ల దగ్గర చదువుకున్నారో కదా! ఎన్నెన్ని చోట్ల ఎంతెంతమంది మాస్టర్లు! ఆ మాస్టార్లందరూ చదువు చెప్పినందుకు జీతాలు పుచ్చుకున్నారు. చదువు చెప్పడమే వాళ్ళ పని. ఒక్కొక్కరు ఎక్కువ మమత చూపెడ్తారు. ఔదార్యంతో ఉంటారు. తమ బాధ్యతని మాత్రమే నిర్వర్తిస్తారు మరికొందరు! అంతే! అయినా ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వాలని ఉందా? ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలా? ఉహుఁ అక్కరలేదు! చెయ్యక్కర్లేదు! మనసులో తర్కవితర్కాలతో కిందా మీద పడ్డాక చివరికి పశ్చాత్తాపం మిగిలింది! నేను మరిచిపోయాను. తప్పు చేశాను నేను! ఏ రకంగానూ దాన్ని దిద్దుకోలేను! దాన్ని మరిచిపోనూ లేను!

చీకటిపడిపోతోంది. రోజు ఇంకా మిగిలే ఉంది. వెలుగు ఇంకా మసకబారింది. ఎంతెంత ఎంతలా వెనక్కి దిగపడిపోయింది! ఎన్ని ఎత్తులు! ఎన్ని పల్లాలు! ఎన్ని కొండలు! మైదానాలు! ఇటువేపూ అటువేపూ వస్తూ, వచ్చి మాయమయ్యాయి! దగ్గరగా, దూరంగా. ఎన్ని వూళ్ళు! ఎన్ని ఇళ్ళు! ఇలాగ్గానే ఎంతోమంది వస్తారు. వెళ్ళిపోతారు! మొత్తం అంతా చీకటి! ఎంతమంది మనుషులు! ఎన్నెన్ని ఆవులు, గొఱ్ఱెల మందలు, దారిలో హఠాత్తుగా తమతోపాటు కలిసొచ్చారు! విడిపోయారు! వెళ్ళిపోయారు! ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు?

కారు వెళ్తోంది. ఆయన ఎదట అంధకారం! ఒంటరితనం! రెండూ నోరు తెరుచుకున్నాయి. ఆ పెద్దనోరు ఆయనని ఎంతో వేగంగా తనలో లాక్కుపోతోంది.

శ్రీవత్సపాఢి జ్ఞాపకం మరి ఎంతమందిని గుర్తు చేసింది. ఊరు, చిన్నతనం నుండి, భిన్న భిన్న ప్రదేశాల్లో రకరకాల మనుషులు ఎంతమంది ఎవరు ఎప్పుడు తమపట్ల స్నేహం చూపెట్టారో, వ్యవహారాన్ని సానుకూలం చేశారో, నోటిమాటతో పనిచేసి పెట్టో సానుభూతిని అభిమానాన్ని ధైర్యాన్ని ఇచ్చారో, సంబంధం కొద్ది రోజులే అయినా ఎవరో ఒకరు భరోసాతోనో మాటతోనో ఆయన కష్టసమయంలో సహానుభూతిగా ఆహా అన్నారు! ఆయనపట్ల గౌరవం విశ్వాసం ఉంచారు. అమాయకంగా ఆధారపడ్డారు. ఆ స్నేహం ఊపిరి ఉన్నంతవరకు ఉంటుందనుకున్నారు. వాళ్లంతా తమ హితైషులనుకున్నారు. నిజంగానే కష్టసుఖాల్లో ఎంత ఆత్మీయులో వాళ్ళంతా! ఏదో కలిసి తిరిగిన మిత్రులు కారు! తమ స్వార్థం కోసం అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా అవొచ్చు! కాని అందరికందరూ అప్పుడు ఆయన వాళ్ళే అయ్యారు. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి ఎవరు ఎక్కడ ఉన్నారో?! ఎక్కడ దిగబడి మాయమయ్యారో! ఎప్పుడన్నా హఠాత్తుగా ఎవడైనా కలిస్తే వాడు పూర్తిగా మారిపోయి కొత్త మనిషిలా ఉంటాడు. లేదూ ఆయనే వేరొక విధంగా మరో మనిషిలా అయిపోయారు! రాయి పక్క రాయి!! ఇద్దరూ ఒకరికొకరు ప్రయోజనం లేనివాళ్ళు! తన బతుక్కి అర్థవంతమైన భాగంగా వాళ్ళెవరూ తోచలేదు. లోకంలో ఎంతోమంది! తమ స్వార్థం అనే దారి బత్తెం, ఆధారంగాని లేకపోతే ఎవరికేనా ఎవరితోనైనా ఏమిటి అనుబంధం??

ఈ ఏకాంతంతో వాలిపోతున్న రోజు, నీడతో నిండిన చీకటిలోకి లాక్కుపోతున్న జారిపోతూ గడిచిపోతున్న సమయం!!

గతంలోని ఎన్నో మొహాలు అలా గుర్తుకువస్తూనే ఉన్నాయి. ఆయనకి అలవాటైన ఆలోచనలు, దృష్టికోణం మారిపోయినట్టు తోస్తున్నది. మనసు పశ్చాత్తాపంతో కళవళపడుతోంది. ఇది కొత్త అనుభవం!

కృతఘ్నుడ్ని అయ్యాను! ఋణగ్రస్తుణ్ణయ్యా. ఎవరి ఋణము తీర్చుకోలేకపోయాను.

మనిషన్నవాడు ఒక్కడూ ఒంటరిగా ఏదన్నా సాధించగలడా? మట్టిలోంచి అంకురం పొటకరిస్తుంది. వృక్షం అవుతుంది. ఎంతమంది స్నేహసానుభూతులు! సహాయాలు! బలహీనక్షణాల్లో ఎవరివల్లో ఎవరి ఉపకారమో! దిగాలుపడి కూలబడిన సమయంలో అందించిన చేయూత, ఆసరా, భయంలేదని వెన్నుతట్టిన చెయ్యి! ధైర్యాన్ని ఉత్సాహాన్ని పుంజుకునేటట్టు ఎవరో ఎప్పుడో యిచ్చిన భరోసా! – ఇవేవీ దొరక్కపోతే మనిషన్నవాడు బతగ్గలడా? ఎలా బతుకుతాడు?

ఆయన మనసు కరిగి నీరైపోతోంది. దృఢత్వం జావ కారిపోతోంది. వాస్తవానికి ఆయన ఓ క్షుద్రమైన దోమ! గాల్లో జుమ్మనే దోమ మాత్రమే ఆయన!!

ఆ మొహాలన్నీ మాయమైపోతున్నాయి. తొలగిపోతున్నాయి. కేవలం కళవళపాటు కరుణాత్మకంగా మిగిలి ఉంది.

స్థాణువులా కూచున్నారు. తన అస్తిత్వం, తన స్వార్థం మరిచిపోయారు. ఉద్వేగంతో కూడిన సహానుభూతితో కిందా మీదా పడుతున్నారు. అపనమ్మకం, నైరాశ్యం, లేమి! వాటిమధ్య ఆయన పెరిగారు. ఎదురుదెబ్బలు ఎన్నో తిన్నారు!

ఆ రోజుల్లో ఒట్టు వేసుకున్నారు! నేను పెద్దవాణ్ణి కావాలి. నిలబడాలి. నిలబడి చూపెట్టాలి. తనకోసం మాత్రమే కాదు. సమాజంలో ఏ వర్గంలో అయితే పుట్టారో, దేని కష్టసుఖాలు తన అస్థిని పట్టి అవగాహన కలిగించాయో ఆ వర్గానికి, ఆ జనానికి తను బతుకంతా సేవ చేస్తారు!!

తర్వాత ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి! ఎంత దారిద్ర్యం, ఎంత దురవస్థ, ఎంత నైరాశ్యం తన దృష్టికి రాలేదు? అవే అవే కనబడుతూ వచ్చాయి. అవే అవే జరగకూడనివి జరుగుతూ వచ్చాయి. ఇప్పుడూ అదే పీకులాట! పాకులాట! నేనేమన్నా మంచి చెయ్యగలిగానా? నాదీ అయిన భాగంలోంచైనా కొంత తగ్గించుకుని ఎవరికైనా కొంచెం ఇచ్చేనా? గొప్పలు పోయాను. బడాయిలు పోయాను. గొప్ప గొప్ప కలలు కన్నాను. ఇంత పిసరు ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఎంతో చేసేశానని సంతోషపడి తృప్తి చెందాను! చెయ్యడం నా చేతిలో లేదు. చేసే బాధ్యత పైవాళ్ళది! అనుకుని నిశ్చింతతో ఉన్నాను!

ధణేలుమని చప్పుడయింది. ధ్యానానికి భంగం కలిగింది. కారు ఆగిపోయింది.

”బద్మాష్! ఒరేయ్ బద్మాష్!” డ్రైవరు గట్టిగా అరిచాడు. బండిలోంచి కిందికి దిగేడు.

“ఏమయింది హుస్సేన్?”

“ఎవడో జాత్తక్కువ బద్మాష్ కుర్ర వెధవ! బండిమీద రాయి విసిరి కొట్టి పారిపోయాడు”

ఆయనా కారు దిగారు. ఢెంకనాల్‍లో ఓ కూడలి. సాయంత్రం ఏడుగంటలు. రోడ్డు వెలుతురుగా ఉంది. జనం వస్తూపోతూ ఉన్నారు. బండికి ఓ చోట సొట్ట పడింది! డ్రైవరు గోల చేశాడు. ఆ బద్మాష్ కుర్రవెధవ ఎవడో ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. ఎటు పారిపోయాడో ఎక్కడ దాక్కున్నాడో తెలీలేదు. తిరిగి వెళ్ళేక బండిని గేరేజికి తీసుకువెళ్ళి సొట్ట తీయించాలి. అదో తంటా పని!!

“పద బయల్దేరు. టీ తాగుతావా? కుర్రాళ్ళు ఎంతగా దుర్మార్గపు బద్మాష్‍లుగా అయిపోతున్నారు!! రోజులలా ఉన్నాయి! అంతా అరాజకత్వం! మహా ఘోరంగా తయారయింది. పెద్దవాళ్ళని చూసి కుర్రకారూ వాళ్ళలాగే ప్రవర్తిస్తోంది!”

~ ~

ఒడియా : గోపీనాథ్ మహంతి

తెలుగు : చాగంటి తులసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here