కాజాల్లాంటి బాజాలు-76: డాసైంసైన చానల్

0
10

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం పనవగానే అలవాటు ప్రకారం వదినకి ఫోన్ చేసేను. కాల్ కట్ చేసింది వదిన. ఇంకా వదిన పనవలేదేమోనని ఓ పావుగంటాగి మళ్ళీ చేసేను ఫోన్. మళ్ళీ కట్ చేసింది. ఏమైంది వదినకి? రోజూ ఈ టైముకి యిద్దరం బోల్డు కబుర్లు కలబోసుకుంటామే అనుకుంటూ విసుగు చెందని విక్రమార్కినిలా మళ్ళీ ఫోన్ చేసేను. ఇప్పుడూ కట్ చేసింది. కట్ చెయ్యడమే కాదు.. “డోంట్ డిస్టర్బ్” అంటూ మెసేజ్ కూడా పంపింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకిలా చేస్తోంది వదినా.. నా మీదేమైనా కోపం వచ్చుంటుందా అనిపించింది ఒక్క క్షణం. మళ్ళీ అంతలోనే సర్దుకున్నాను. ఊహు.. అలా అయుండదు. నేను చేసిన పనేదైనా నచ్చకపోతే ఆ మాట నా మొహం మీదే చెప్పే చనువు వదిన కుంది. మరేమైవుంటుందీ.. అనుకుంటూ తర్జనభర్జన పడుతున్నాను. డిస్టర్బ్ చెయ్యొద్దందంటే యేదో ముఖ్యమైన పని మధ్యలో వుండుంటుంది. అదేదో అయేక వదినే పిలుస్తుందిలే అని నన్ను నేను సమర్ధించుకుంటూ కూర్చున్నాను.

అతి కష్టం మీద ఒక అరగంట గడిచాక వదిన ఫోన్ చేసింది. ఎత్తుతూనే ఆత్రంగా అడిగేను

“ఏం చేస్తున్నావ్ వదినా అంత ముఖ్యమైన పనీ?” అంటూ.

“వీడియో తీస్తున్నాను..” అంది తాపీగా.

“వీడియోనా…ఎవరిదీ..”

“నాదే.. నేనే తీసుకుంటున్నాను.”

“ఎందుకూ..”

“జనాలని జాగృత పరచడానికి..”

నా కర్థం కాలేదు. “ఈ మాటలేంటి వదినా…మరీ అంత గ్రాంథికమా!”

“సరే.. మామూలుగా చెప్తాను, విను. ఇప్పుడున్న పరిస్థితిలో జనాలలో భయం తగ్గించి… వాళ్ళలో ఆశా, ఉత్సాహం కలిగించడానికి నేను చక్కటి మార్గదర్శకాలు చెపుతూ ఒక వీడియో చేసేను.”

“నువ్వా…నీకేం తెల్సనీ..” అనుకోకుండా వచ్చేసింది నా నోట ఆ మాట.

వదిన వెంటనే అందుకుంది..

“నువ్వీ మాట అంటావని నాకు తెల్సు. నేను డాక్టర్‌ని కాదు…సైంటిస్టుని కాదు… సైకాలజిస్టుని కాదు.. కనీసం నర్సునైనా కాదు. కానీ ఇప్పటికి యేడాదికి పైగా వీళ్లందరూ చెపుతున్నవి వింటుంటే, చూస్తుంటే నాకు ఈ కరోనా అనే రోగంమీద ఒక విధమైన పట్టు వచ్చేసింది. ఈ మహమ్మారి ఎందుకు వస్తుందో… ఎలా విస్తరిస్తుందో… అప్పుడు దాని లక్షణాలు ఎలా వుంటాయో… అలాంటప్పుడు మనం ఎలాంటి మందులు తీసుకుంటూ, యేయే జాగ్రత్తలు పాటించాలో అన్నీ తెల్సిపోయేయి. అందుకే యిప్పుడు నేను ‘డాసైంసైన’ అయిపోయి అందరికీ సూచనలు యిస్తూ వీడియో తీసేను.”

“ ‘డాసైంసైన’ అంటే..”

“అబ్బా.. అన్నీ నీకు విడమర్చి చెప్తే కానీ అర్థం కాదా.. ‘డాసైంసైన’ అంటే డాక్టర్ ప్లస్ సైంటిస్టు ప్లస్ సైకాలజిస్టు ప్లస్ నర్స్ అని అర్ధం.” విసుక్కుంది వదిన.

వామ్మో అనుకున్నాను. “అన్నీ నువ్వొక్కదానివే చెప్పేస్తున్నావా..”

“మరీ..ఈ సమయంలో ఎవరికి వారే బీపీ, పల్సూ, ఆక్సిజన్ లెవెల్సూ చూసుకోవాలంటే నర్సు కుండే నాలెడ్జ్ వుండాలా వద్దా!.. అలా చూసుకున్నాక యే మందు ఎప్పుడు వేసుకోవాలో తెలీడానికి డాక్టర్ చెప్పే విషయాలు తెలియాలా వద్దా! కొత్తకొత్తగా ఈ మహమ్మారి ఎన్నెన్ని రూపాలు మారుస్తోందో సైంటిస్ట్‌కి తెల్సినట్టు తెలియాలా వద్దా.. యిన్నీ తెల్సుకుని ఎవరికి వారు భయపడిపోకుండా ఆశాజీవుల్లా యెలా వుండాలో తెలియాలంటే సైకాలజీ పాఠాలు చెప్పాలా వద్దా!”

“అంటే యివన్నీ నువ్వే చెప్పేస్తావా!”

 “కాకపోతే యింకెవరు చెప్తారు. ఇప్పటికి యేడాది పైనుంచి దీని గురించి వీళ్ళందరు చెప్తున్నవి వింటున్నాను, చూస్తున్నాను. ఒక డాక్టర్‌కి వైద్యం గురించే తెలుస్తుంది. అలాగే ఒక సైంటిస్టుకి దానిమీద చేసే రీసెర్చ్ గురించే తెలుస్తుంది. కానీ వీళ్ళందరు చెప్పేవి వింటున్న నాకు అన్నింటిమీదా విపరీతమైన జ్ఞానం వచ్చేసింది. ఆ జ్ఞానాన్ని తోటివారందరికీ పంచి, వాళ్లంతా నిరాశలో పడి కృంగిపోకుండా వుండడానికి యేం చెయ్యాలో చెపుతూ వీడియో చేసేను. దాన్ని నీకు పంపిస్తున్నాను. ఎలా వుందో చూసి చెప్పు..” అంది.

వదిన చెప్పింది వింటుంటే నాకు “ఆస్తంతా పోతే పోయింది కానీ లా లో వున్న లొసుగులన్నీ తెల్సేయి.” అనే సామెత గుర్తొచ్చింది.

“ఏంటి.. మాట్లాడవేం.. చూసి అవి సరిపోతాయో లేకపోతే యింకా యేమైనా కలపాలో చూసి చెప్తావా..” అన్న వదిన మాట వినిపించింది ఫోన్‌లో.

ఒక్కసారి వులిక్కిపడి “చెప్తా… చెప్తా..” అంటూ ఫోన్ పెట్టేసి వదిన పంపిన లింక్ క్లిక్ చేసేను. చెయ్యగానే “డాసైంసైన చానల్” అని కనిపించింది.

అందులో వీడియో ఓపెన్ అవగానే “ఇది చూస్తే కోవిడ్ ఢాం” అనే కేప్షన్ కనిపించింది.

నేను యెక్కడ ఢామ్మని కింద పడిపోతానోనని కుర్చీని గట్టిగా పట్టుకున్నాను.

ఆ తర్వాత వదిన వాళ్ల తమ్ముడిపెళ్ళిలో వాళ్ళు తనకి పెట్టిన కంచి పట్టుచీర కట్టుకుని, క్రితం శ్రావణమాసంలో అన్నయ్య కొన్న నెక్లెస్ పెట్టుకుని, ముక్కుకీ నోటికీ కలిపి మాస్కు కట్టుకుని, ముందు టేబుల్ మీద రకరకాలయిన వస్తువులు పెట్టుకుని, కుర్చీలో వెనక్కివాలి కూర్చుని కనిపించింది.

కెమెరా తనమీద ఫోకస్ అవగానే కుర్చీలో కాస్త ముందుకి జరుగుతూ “అందరికీ నమస్కారం” అంది.

తర్వాత తన నోటి కున్న మాస్కుని ఒక చెవినుంచి తీసి నెమ్మదిగా మరో చెవివైపు పెడుతూ

“మాస్కు యెలా పెట్టుకోవడమన్నదే కాదు అవసరమైనప్పుడు దానిని యెలా పక్కకి తప్పించాలో కూడా తెల్సుకోవాలి. ఈ మహమ్మారిని జయించే క్రమంలో నేను మీకు చెప్పబోతున్న మొదటిపాఠం యిదే. మాస్కును తియ్యాలనుకున్నప్పుడు యెప్పుడూ గడ్డం కిందకి లాగకూడదు. ఒక చెవినుంచి రింగు తప్పించి, మాస్కు మొత్తాన్ని యిలా రెండోవైపుకి తీసుకురావాలి.” అంటూ తన మొదటి పాఠాన్ని చూపించింది.

“ఇంక మీరందరూ గుర్తు పెట్టుకోవలసిన రెండో విషయం. ఈ మహమ్మారి మిమ్మల్నేమీ చెయ్యలేదని మీరంతా చాలా ధైర్యంగా వున్నారు కదా.. నాకు తెలుసు. కానీ పిటీ యేమిటంటే మీరు ధైర్యంగా వున్నారన్న మాట మీరు మర్చిపోతున్నారు. అందుకే ఈ మహమ్మారి పేరు వినగానే భయంగా చూస్తున్నారు. అదేంటీ… మీరేంటో మీకు తెలీదా.. నేను కొత్తగా చెప్పాలా.. సరే చెప్తున్నాను వినండి.

రేపేమవుతుందన్న ఆలోచనైనా లేకుండా మీరంతా స్థలాలూ, యిళ్ళూ కొనుక్కుంటున్నారా లేదా… పండగలూ ఫంక్షన్లూ చేసుకుంటున్నారా లేదా.. అంతదాకా యెందుకూ.. యేడాదికి సరిపడా ఆవకాయ పెట్టుకున్నారా లేదా…”

వదిన ఒక్క క్షణం మాటలు ఆపి యెదురుగా మనుషులున్నట్టే వారివైపు చూసి మాట్లాడుతున్నట్టు మాట్లాడసాగింది.

“చూసేరా… చూసేరా.. ఆవకాయ పేరు చెప్పగానే మీ మొహాలు నవ్వుతో యెలా వెలిగిపోతున్నాయో చూసేరా! అందుకే మనందరం ఈ ఆవకాయ రుచిని ఆస్వాదిస్తూ హాయిగా యిలా నవ్వుతూ వుందాం..”

మా వదిన దేనికైనా సమర్థురాలని ఈ పాఠంతో నాకు తెల్సిపోయింది. అందుకే వీడియో పూర్తిగా చూడకుండానే వదినని అభినందించడానికి ఫోన్ కలిపేను. మీకు వదిన చేసిన వీడియో మొత్తం చూడాలని వుందా! అయితే వదిన ‘డాసైంసైన’ చానల్‌కి లైక్ చేసి, సబ్‌స్క్రైబ్ చేసి, కామెంట్ పెట్టి, షేర్ చెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here