దైవమా నీకిది న్యాయమా

0
8

[కన్నడంలో శ్రీమతి గిరిజారాజ్ రచించిన ‘ఈ సావు న్యాయవే’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]ఆ[/dropcap]కాశంలో నవ్వుతున్న పున్నమ చంద్రుణ్ణి చూస్తూ చూస్తూ ఇంకో బీడీ వెలిగించుకున్నాడు జయప్ప. ఆ బీడీ పొగ రింగులు రింగులుగా బయటకి వస్తూ కరిగిపోతూన్నట్లే, తన భార్యాబిడ్డల గుఱించిన ఆలోచనలూ గుర్తుకొస్తూ మాయమవుతున్నాయి. అది విద్యుత్ చితాగారం. దాని ఆవరణలో లెక్కలేనన్ని వృక్షాలు లేచి నిల్చుని ఉన్నాయి. ప్రవేశద్వారంలో కాటికాపరి హరిశ్చంద్ర మహారాజుగారి తైలవర్ణచిత్రం!

నడిరేయి దాటింది. చితాగారంలో కాలిపోతున్న శవాల కమటు వాసనను భరించలేక బయట గాలి పీల్చడానికి, బయట అక్కడ వెలుగుతూన్న విద్యుద్దీపాల వెలుగులో వెదుకుతూ వచ్చి అక్కడున్న ఓ పెద్ద మర్రిచెట్టు క్రింద రాతి బెంచీ పైన పడుకున్నాడు. ఆకాశం లోకి చూస్తూ, “సెందురుడా, సల్లని తండ్రీ! నీ సల్లని ఎలుగు ఇక్కడ ఈ మశాణంలో ఈగూడదు అనుకోక, ఇత్తావుండావే, ఎంత మంచోడివయ్యా మా యప్పా! ఈ మనుసులుండారే.. నీయట్లా కాదులే.. థూ.. మనుసులు సాలా సెడిపోయినారు. అంద్కే గదా, ఈ బూ బారాన్ని తక్వ సేయాలనే ఆపైనోడు నాటకమాడుతా వుండాడు ఈ ‘కరోనా’ను పంపించి”. తాగిన కల్లు లోపల పనిచేస్తూ వుంది. ఓ తేన్పు వచ్చింది. “ఈ పీన్గులు కాలిన వాసన ఏంజేసినా పోదు. దీని సిగతరగ.. అబ్బబ్బ! నా ఎరికలో ఇన్ని పీన్గుల్ని నేనెప్పుడూ చూసిందే లేదు” అని తనలో తాను గొణుక్కుంటూ బెంచి మీద వాలిపోయాడు. రాత్రి రెండు గంటలయినా శవాలను కాల్చే పని ముగియలేదు. జయప్పతో పాటు పనిచేసే ఇంకొకడు ఇంకా లోపలే పని చేస్తూమన్నాడు. “రే, సీనా! ఏం చేస్తావుండావా లోన, రారా బయటికి, ఇంకా అయిపోలేదేమిరా.. రారా బయటకి” అని పిల్చాడు బిగ్గరగా. శీను గాడు జయప్ప కంటె ఏడెనిమిది ఏళ్ళ చిన్నవాడు.

“ఉండన్నా వస్తా” అన్నాడు వాడు లోపల్నుంచి. కొంచం సేపు అయిన తర్వాత వాడు బయటకొచ్చాడు.

“ఇంత పొద్దులో నీ తాగుడేంది! సాల్చెయ్యి”

“సర్లేరా! ఇంత రేతిరి పొద్దున కూడు తినేదేంది? ఐదారుసార్లు టీ తాగి తాగి కడుపంతా ఓ మాదిరిగా వుండాది రా. ఆకలి సచ్చిపోయింది. కల్లు తాగాలని అనిపిస్తా వుండాదిరా బిడ్డా” అన్నాడు జయప్ప. శీనుగాడికి తాగే అలవాటు లేదు. జయప్ప పెళ్లాం పిల్లలు వేరే ఉన్నారాయె. “ఆ పిల్లోడు కణ్ణన్ గాడు ఇడ్లీ, వడ, చెట్నీ ఇచ్చి పోయిండు. తినబుద్ధి కాలేదు. వాంతి కొచ్చినట్టయితాది”, అన్నాడు జయప్ప.

“సరే! నేను వస్తాను. నీవు బద్రం గుండు. నే లేకపోతే నా కడా కొడుకు నిదరే పోడు. నే వచ్చేవరకూ అలానే మేల్కొనే వుంటాడు. నీవూ రా, జయణ్ణ. నీ రూం కాడ నిన్నిడిసి పోతా” అన్నాడు శీను.

“ఆడకెళ్లి నేనేం జేసేదిరా! దయ్యం లెక్కన ఒంటిగా పడుకోవాల. నా తాన కొట్లాడి నా పెండ్లాం ఊరికి ఎల్లి పోయింది గదా. ‘ఈడుంటే కరొనా వొచ్చి అందరం సచ్చిపోతాం – వచ్చేయ్ – అక్కడే ఏదైనా పని చూస్కోని బతుకుదాము. సాలు ఈ పీనుగులు కాల్చే పని’ అని సెప్పినాది. ఇది కాక నా కింకేం పని తెల్సురా.. ముఫ్ఫై ఏళ్ళ నుంచి వైనంగా ఈ పని చేస్కుంటా వచ్చినా.. నెల ముగిసిందంటే జీతం గ్యారంటీ. ఏక్దంన ఇడిసి పెట్టి ఎట్టా పోయేదిరా. కరోనా ఏమ గూటం గొట్కోని ఇక్కడే వుంటాదా ఏంది? కరోనా రాకముందు మూడు రోజుల కో పారి ఒకటో రెండో పీనుగు లొచ్చేవి. ఇది వచ్చిందే తడవు కుప్పలు కుప్పలు.. నా హయాంలో సూసిందే లేద్రా శీనప్పా – ఇప్పుడు ఊరికి బోవాల, పెండ్లాం బిడ్డల్ని సూడాల అనిపిస్తా వుందిరా శీనప్పా. నా కొడుకు పెద్దోడు లోహిత్ గాడికి నేనంటే పంచప్రాణాలు, ‘సానా దినాల తర్వాత వొస్తే ఇంట్లోకి రానీను’ అనిందిరా నా పెండ్లాము. ఈడు, ఈ పిల్లోడు కణ్ణన్ గాడికి నేనంటే అదెంత ఇస్వాసమో నా యాల్ది. ‘నాయినా నాయినా’, అని నా ఎనకాలే తిరుగుతా వుంటాడు. మొన్న ఏం జేసినాడో తెల్పునా?.. సెప్పా పెట్టకుండా ఆళ్లూరి కెళ్ళిపోయినోడు నిన్న వొచ్చినాడు. అదెవరో ఆయన, ఆయన నాయనది బూడిద కావాలని వచ్చినాడు. దాన్ని యాడ పెట్టినాడో ఆ కణ్నన్ గాడినే అడగాల. ఆణ్ణి సూత్తే నా కొడుకును సూసినట్టే అయితాది రా. సరే – నీవు పోరా శీనా. పొద్దు పోయినాది”, అని ఏదో వాగుతూ నిట్టూర్చాడు. శీను గాడు వెళ్లిపోయాడు.

జయప్ప ఒంటిగా మిగిలి పోయాడు. వాడికి భయం గియం లేదు. చచ్చిపోయినోళ్లు దయ్యాలై చుట్టూ చేరి నాట్యమాడినా తనకేమీ భయం లేదంటాడు. ‘నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడుతాడు’ అంటాడు. ఈ చితాగారం నా జీవనంలో ఒక భాగమై పోయిందంటాడు. దానిపైన మమకారాన్ని పెంచుకున్నాడు. ఒక్కడే తనలోతాను మాట్లాడుకుంటూ.. నిద్ర ఎప్పుడొచ్చిందో అక్కడే ఒరిగిపోయాడు. వారికి మెలకువ వచ్చేటప్పటికే, శీనుగాడు, కణ్ణన్ గాడు తమ తమ పనులను ప్రారంభిస్తున్నారు. శవాలను మోసుకొచ్చిన వాహనాలు వరుసలో నిల్చొని ఉన్నాయి.

“ఒరే కణ్ణన్” అని పిలవగానే వాడు పరుగెత్తుకొచ్చి, “నాయినా, నిన్ను లేపొద్దు అని సెప్పినాడు శీనూ అన్నా.. సానా పొద్దు పోయినంక పండుకొన్నావంటనే.. ఏడి ఏడి కాఫీ తీసుకొత్తా నుండు” అన్నాడు.

“సరేరా, అంతలోకీ కాళ్ళూ, మొగం కడుక్కొని వస్తా” అంటూ ఐదారు కుళాయిలున్న చోటికి అడుగులు వేశాడు జయప్ప.

ముఖం కడుక్కోడానికి వొంగినప్పుడు జేటులో వున్న మొబైలు జారి క్రింద పడింది. దాన్ని తీసుకుని, ‘థూ, దీనమ్మ. సెడిపోయింది. ఊర్నుంచి పెండ్లాము ఎన్ని సార్లు ఫోన్ చేసిందో ఏమో. దీని సిగదరగ.. పని.. పని.. ఈ పని ఒత్తిడిలో వాళ్ళకి ఫోన్ చేయడమే మర్చిపోయినాను’ అనుకున్నాడు. కణ్ణన్ గాడు ఇచ్చిన కాఫీని చప్పరించినాక బలం వచ్చినట్టయ్యింది.

“రారా! బిడ్డా!” అని వాణ్ణి పిల్చి తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని వాడి వీపు నిమురుతూ “ఒరే కణ్ణన్, నిన్ను సూసినప్పుడల్లా నా కొడుకే గుర్తొస్తాడురా. ఆడు అంతా నీ లెక్కనే వుంటాడు. అదే ఎత్తు.. అంతా నీ మాదిరి గానే”

“ఔనా.. ఆడు సదువుతా వుండాడా నాయినా?”

“సదువా సింతకాయా. ఇప్పుడు ఈ లాక్‌డౌన్‍ల సదువు ఏడరా? అందర్నీ పాస్ చేసినారు. నా కొడుకు.. ఆడు పుత్తకమే సేతిని పట్టడు” అంటూ బిగ్గరగా నవ్వుతూ, “ఇట్లా అయితే నీవూ.. నా మాదిరిగానే పీనుగులు కాల్చే పని సేయాల సూడు అంటా వుంట” ఇంకా ఏదో అనబోతూ వుంటే “వద్దు వద్దు నాయినా వాడు బాగా సదువుకోని” అన్నాడు కణ్ణన్.

ఆ రోజు జయప్ప పొద్దుటే లేచి కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని, కణ్ణన్ గాడిచ్చిన కాఫీ తాగుతూ కూర్చున్నాడు. చితాగారపు గేటు వద్ద ఎవరివో ఏడ్పులు వినిపిస్తున్నాయి. ఈ ఏడ్పులు వినీ వినీ జయప్పకు అలవాటయి పోయింది.

“అదేందో సూసి రారా” అని కణ్ణన్ గాడిని పంపించాడు. అక్కడే గేటు దగ్గర ఓ మధ్య వయస్కురాలు రోదిస్తూ వుంది. వాణ్ణి చూసి ఆ అంబులెన్స్ సిబ్బంది, “ఒరే, ఇక్కడ జయప్ప అనేవోడు పని చేస్తా వున్నాడా రా?” అడిగారు.

“అవును.. ఎందుకు?”

“పిల్చరా వాణ్ణి. బయటకి రమ్మను రా. ఈయమ్మ జయప్ప భార్య” అన్నారు వాళ్లు.

పరుగెత్తు కెళ్ళి, ఆ విషయాన్ని జయప్పకు చెప్పాడు కణ్ణన్ గాడు. సంతోషం ఉరకలు వేసింది జయప్పకు. – అంటే నన్ను పడుకోమని ఈడికే వచ్చేసిందేమిరా” అంటూ గేటు దగ్గరకు వచ్చాడు. వచ్చిన జయప్పను వాటేసుకుని వలవలా ఏడవసాగింది ఆమె.

“ఏమయ్యిందే సావిత్రి. అంద్రూ బాగానే ఉండారు గదా?” అడిగాడు కంగారుగా.

ఆయమ్మ ఏడుస్తూనే “ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయావు. శీనప్పకు ఫోన్ జేసినా, ఆడూ తీయకపోయాడు. మన లోహిత్ గాడు..” అంటూ బిగ్గరగా ఏడవసాగింది.

“ఏమిటయ్యిందే ఆడికి?”

“ఏంటయ్యిందా.. ఆడు మనల్ని ఇడ్సి పోయినాడయ్యా” ఇంకా ఎక్కువయ్యింది ఆమె ఏడుపు.

ఈ మాటల్నీ జీర్ణించుకోలేకపోయాడు జయప్ప. కొయ్యబారిపొయ్యాడు.

తేరుకుని, “అదేందో సెప్పే సాయిత్రీ.. ఏమయ్యిందే?”

“నీ కొడుక్కి కోవిడ్ వచ్చి సచ్చిపోయినాడయ్యా” అన్నాడు, ఒకడు.

“నీవు ఇక్కడుంటావని నీ పెళ్లాం చెబితే ఆయమ్మనూ పిల్చుకొని వచ్చినాము. వ్యాన్‌లో నీ కొడుకు శవం ఉంది. దూరం నుంచే చూడు. ముట్టుకోడానికి వీల్లేదు.”

జయప్ప నమ్మలేక పోయాడు. “లేదు, నేను నమ్మేదే లేదు. లేదు.. నా కొడుకు సచ్చి పోలేదు. ఆణ్ణి నే సూసి తీరాల.” అని ఏడుస్తూ వాన్ వెనుక భాగాన్ని చేరి తలుపులు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వ్యాన్ సిబ్బందిలో ఒకడు, బలవంతంగా వెనుక్కులాగి “ఏయ్, ఊరికే వుండయ్యా.. శవాన్ని ముట్టగూడదని నీకు తెలియదా ఏంటి?” అన్నాడు.

“ఎట్టాగైనా తండ్రి గదా, ఓ సారి సూడనీ” అన్నాడు ఇంకొకడు.

“సరే దూరం నుంచే చూడు. నీ కొడుకు శవాన్ని నీవే కాల్చాల గదా” అన్నాడు మొదటివాడు.

“రే.. నాలుక అదుపులో బెట్టుకొని మాట్లాడు.. కన్నతండ్రి వాడు. అట్లా ఎటకారంగా మాట్లాడవద్దు” అని వారించాడు రెండోవాడు.

జయప్ప ఏడుపుకి అంతే లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వాడి భార్య వాణ్ణి సముదాయిస్తూనే “ఊర్లోకి కరోనా వచ్చినాది. లోహిత్ గాడికి జొరం వచ్చి వొళ్ళు కాలిపోయె. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయినాడు. బెంగుళూర్‌కు పిల్చుకుపో, ఆడైతే అన్ని సౌకర్యాలూ వుంటాయి అన్రి. నువ్వు కూడా ఈడనే వుండావనే దైర్యంతో వచ్చేస్తి. ఆస్పత్రిలో సేర్పించినా, బిడ్డ దక్కలేదు” అని ఏడుస్తూ వివరించింది.

“మరి మన సిన్నక్క ఏడుంది?” తన కూతుర్ని గురించి అడిగారు.

“పక్కింట్లో ఇడిసి వచ్చినా!”

“నీ కొడుకు పేరు లోహిత్తా?” అడిగారు వ్యాన్ సిబ్బంది.

“ఔనయ్యా. అరిశ్చంద్ర మహారాజు కొడుకు వేరే పెడ్తి”

“రోజూ వాడి గురించే చెబుతువుండే” అన్నాడు శీనుగాడు.

జయప్పను హత్తుకొని ఊరడిస్తూ శీనుగాడు ఉండిపోగా, కణ్ణన్ గాడు నిల్చున్నవాడు నిల్చున్నట్టుగానే ఉండిపోయాడు ఆకాశం వైపు చూస్తూ. ‘దైవమా నీకిది న్యాయమా’ అన్నట్టుగా వున్నాయి వాడి చూపులు.

~

కన్నడ మూలం: శ్రీమతి గిరిజారాజ్

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here