డమాంబుష్ జబ్బు

0
10

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘డమాంబుష్ జబ్బు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ల[/dropcap]క్ష్మమ్మ ఫోన్ ఎత్తగానే, “ఏవిటమ్మా, నీకు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయట. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. అన్ని టెస్టులూ, స్కాన్‌లూ నార్మల్‌గా వచ్చాయని, బి‌.పి., సుగర్ కూడా నార్మల్ అని అంటున్నారు. హెచ్.బీ. లెవెల్స్ కూడా బావున్నాయనే అంటున్నారు కానీ ఇలా ఎందుకు జరుగుతోందో మాత్రం చెప్పేడవలేకపోతున్నాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు అమెరికా వచ్చేయి. ఇక్కడ నీకు మరోసారి అన్ని రొటీన్ టెస్టులూ చేయిస్తాను. మీ కోడలు కూడా అదే అంటోంది. లేదంటే, నేనే ఇండియా వచ్చి నీ బాగోగులు చూసుకుంటాను. నాన్న ఒక్కడే నిన్ను చూసుకోవడం కష్టం కదా” చెప్పాడు మధు తత్తరబిత్తర అయిపోతూ.

“ఈ మాత్రం దానికి నువ్వెందుకు అమెరికా నుండి అమలాపురం రావడం. మేవే త్వరలో ఓసారి అక్కడకు వస్తాంలే. నువ్వు ఇంత కంగారు పడిపోతున్నావు కనుక, నీకు అసలు విషయం చెప్పేస్తానురా. శారీరక జబ్బు కాదు, మానసికం” అని ఆమె ఇంకేదో చెప్పేంతలో

“వద్దు, నువ్ నాకు ఇంకేం చెప్పొద్దమ్మా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. నాకు తెల్సిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు. ఎలాంటి మానసిక సమస్యలైనా సమోసా తిన్నంత తేలిగ్గా పరిష్కరిస్తాడు” అని ఇంకేదో చెప్పేలోపు,

“అబ్బా అది కాదురా నాయనా, నే చెప్పేది పూర్తిగా విను ముందు. కంగారు పడి అలా అనవసరంగా నలిగిపోకు” చెప్పిందామె .

దాంతో, అరక్షణం ఆగి, అంకెలు లెక్కపెట్టుకుని, కాస్త నిదానించి “సరే ఇప్పుడు చెప్పమ్మా” అన్నాడు .

“నాది నిజమైన జబ్బు కాదురా, డమాంబుష్ జబ్బు, అంటే ఉత్తుత్తి జబ్బన్నమాట. నువ్ అమెరికా వెళ్లిపోయాక నేను ఈ పెద్ద ఇంట్లో చిన్న మరబొమ్మలా ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాను. సరే ఇక ఇలా కాదని, ఈ చివరి వయసులో మీ నాన్న కూడా నాతో ఉంటే, మనసుకి బావుంటుందని, మీ నాన్నతో పోట్లాడి, ఆయన్ని నొప్పించి మరీ వాలెంటరీ రిటైర్మెంట్ పెట్టించాను. ఆ తర్వాత కొంత కాలం, చంటి పిల్లాడిలానే అనుకున్నట్టే ఇంటిపట్టునే ఉండేవారు. తర్వాత, స్నేహితులూ, షికార్లు, ఆ సంస్థ అతిథిగా పిలిచిందనీ, ఈ సంస్థ అతిథిగా పిలిచిందనీ వెళ్ళిరావడం. మళ్ళీ నాది ఈ లంకంత కొంపలో ఒంటరి బతుకే అయిపోయింది. సరే ఇలా కాదని ఆయనికి నచ్చ చెప్పి చూశాను. ఆయన అప్పటికి తల ఊపినట్టే ఊపి, మళ్ళీ పొద్దున్నకి మామూలే. అందుకే ఇక ఇలా లాభం లేదనుకున్నాను. లేని జబ్బుని నెత్తిన వేసుకుని, సరిగ్గా ఆయన వచ్చే సమయానికి ముందు, కళ్ళు తిరిగి పడిపోయినట్టు రెండు మూడు సార్లు నటించాను. దాంతో ఇప్పుడు చచ్చినట్టు ఇంటిపట్టునే ఉంటున్నారు. అలా నా పథకం పారింది. అదీ అసలు సంగతి” చెప్పిందామె.

“పోన్లెమ్మా, నాన్నని కూడా ఈ పెన్షన్ తీసుకునే వయసులో ఎక్కువ టెన్షన్ పెట్టకు. ఇదంతా నిజం అనుకుని, నీకు ఏవౌతుందో అని ఆయన ఆరోగ్యం పాడుచేసుకుంటే, మనిద్దరం కలిసి బాధపడాలి. కనుక ఈ నాటకానికి వీలైనంత త్వరగా ముగింపు ఇచ్చి, ఆయనకి ఈ సమస్య నుండి ఉపశమనం ఇవ్వు. నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా నీకు ఏం జరుగుతుందో అని తెగ హడిలిపోతున్నారు. నేనే ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నాను. ఎప్పుడూ అతి మంచిది కాదు” చెప్పాడు మధు .

“సరి సర్లేరా, నేను మీ అమ్మని. ఆయనకి భార్యని. పిల్ల కుంకవి నువ్వే ఇంత ఆలోచిస్తే, పెద్ద కుంకని నాకెంత ఆలోచన ఉంటుందో ఊహించుకో, కనుక మీ అయ్య ఆరోగ్యం గురించి అంతలా అతలాకుతలం అయిపోకు” అని ఆమె చెప్తుండగానే, ఆ గుమ్మం దగ్గర ఏదో చప్పుడు అయింది. “మీ నాన్న వచ్చినట్టున్నాడు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాలే” అంటూ ఫోన్ పెట్టేసింది లక్ష్మమ్మ. తర్వాత, సోఫాలో కాస్త నీరసంగా వెనక్కి జారబడి శేఖరం ఇంట్లోకి అడుగుపెట్టగానే, “వచ్చారా” అంది అతని వైపు చూస్తూ.

“రొటీన్ ప్రశ్నలు వేయకుండా, ఆ టాబ్లెట్స్ వేసుకో. కొంత ఉపశమనం ఉంటుంది. ఈ రోజు నేను పూర్తిగా ఇంట్లో ఉంటాను. నీ రోగం” అని ఆపేసి, “అదే నీ జబ్బు తగ్గిపోతుందని, త్వరలోనే నువు మళ్ళీ మామూలుగా అయిపోతావని, ఇందులో బయపడాల్సింది ఏం లేదని డాక్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు” చెప్పి, ఫ్రూట్స్ తెచ్చిన బ్యాగ్ డైనింగ్ టేబల్ మీద పెట్టాడు.

“పొనీలెండి, అలా అయితే నేను హాపీ. మీరు పక్కనే ఉండండి, నాకు ఏ మందులూ అక్కరలేదు” చెప్పింది శేఖరం చేయి పట్టుకుంటూ.

“ఈ విషయం మందులు కొనే ముందు చెప్పవలసింది కదా, ఇప్పుడు మళ్ళీ అతను రిటన్ తీసుకుంటాడో లేదో” అన్నాడు ఆ మెడిసిన్స్ అందుకుంటూ.

“భలే వారే, నేనేదో మాట వరసకి అన్నాను. ఆ మందులు అక్కడే ఉంచండి” చెప్పింది.

ఇంతలో శేఖరానికి ఫోన్ రావడంతో, ఎత్తి “ఆ సుబ్బారావ్, ఈ రోజు కాదు, ఇక ఏ రోజూ నేను మీ సంస్థ మీటింగ్స్‌లో పాల్గొనలేను. నువు కూడా రిటైర్ అయిన వాడివి, మీ ఆవిడకి సమయం ఇవ్వు. ఇలా అటూ ఇటూ తిరిగితే, రేపు ఆవిడ కూడా మా ఆవిడలానే మానసిక క్షోభకి గురయ్యినట్టు యాక్టిం..” అని క్షణం ఆగిపోయి, “అదే మా ఆవిడలానే మానసిక ఇబ్బందులు ఎటాక్ అయ్యే అవకాశం ఉంది” .చెప్పి ఫోన్ పెట్టేసాడు శేఖరం.

‘ఏంటి ఈరోజు ఈయన విచిత్రంగా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. కొంపదీసి నా డమాంబుష్ జబ్బు విషయం గానీ తెలిసిపోయిందా’ అనుకుంటూ అతని వంక చూసి ఓ చిన్న నవ్వు నవ్వింది.

శేఖరం కూడా నవ్వి కన్ను కొట్టాడు. దాంతో ఆమె సందేహం రెట్టింపు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here