దంతవైద్య లహరి-15

10
7

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

వంకర టింకర పళ్ళు..!!

ప్ర: గురువు గారు! వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, ఎత్తు పళ్లకు పరిష్కార మార్గం సెలవీయండి. సాధారణంగా ఈవయస్సులో వీటికి చికిత్స అనుకూలంగా ఉంటుంది?

– శ్రీమతి సరళ (లిక్కి) టీచర్, సఫిల్‌గూడ.

జ: ముఖారవిందంలో, పళ్ళు – పలువరుస ప్రత్యేకతను సంతరించుకుని వుంటాయి. అంటే ముఖం అందంగా కనపడే విషయంలో దంతసౌందర్యంకు అధిక ప్రాధాన్యత ఉందని అర్థం అన్నమాట! మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, తమకు అందమైన పలువరుస వుండాలని కోరుకోవడం సహజం. అలా ఉండడం అనేది కొందరికే సాధ్యం. అందరికి అందమైన పలువరుస లేకపోవడానికి కారణాలు అనేకం. అలా అని, అందమైన పలువరుస లేదని ఎవరూ బాధపడవలసిన పనిలేదు. ఒక వయసు వచ్చిన తరువాత, ఎత్తు పళ్ళను, ఎగుడు – దిగుడు పళ్ళను, వంకరటింకర పళ్ళను, చికిత్స ద్వారా అందమైన పలువరుసగా తీర్చిదిద్దుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆ చికిత్స ‘సౌందర్య దంతవైద్యం’లో ప్రధాన భాగం అయిన ‘ఆర్థోడాంటిక్ చికిత్స’ లేదా క్లిప్పుల వైద్యం. ఈ చికిత్స గురించి సరైన అవగాహన లేకుండా, దాని గురించి అసలు ఆలోచించకూడదు. చికిత్స గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాక మాత్రమే, తమ పిల్లలకు ఈ చికిత్స చేయించే ప్రయత్నం చేయాలి.

చికిత్స గురించి ఆలోచించే ముందు, అసలు ఎత్తుపళ్లు లేదా వంకరటింకర పళ్ళు ఎందుకు వస్తాయో కూడా సాధారణ పాఠకులు సైతం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నాక ఈ చికిత్స అవసరం ఏమిటో పూర్తిగా తెలిసే అవకాశం వుంది.

చిన్నవయసులో డబ్బాపాలు (బోటిల్ ఫీడింగ్) తాగే పిల్లల్లోనూ, తల్లిదండ్రుల సరైన ఆదరణకు నోచుకోని పిల్లల్లోనూ, బొటన వేలు చీకే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు కొంతమందిలో, తల్లిదండ్రుల జాగ్రత్తల మూలంగా కొద్దీ కాలంలోనే పోతుంది. కొద్దిమంది పిల్లల్లో ఎక్కువకాలం (తల్లిదండ్రుల నిర్లక్ష్యం, తెలియని తనం వల్ల కావచ్చు) ఈ అలవాటు కొనసాగటం మూలంగా ఎత్తుపళ్లు రావడమే గాక, ముందరి పళ్ళ మధ్య ఖాళీ (డయస్టీమా) ఏర్పడి చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆడపిల్లలలకైతే ఇది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇక్కడ తప్పనిసరిగా ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం అవుతుంది.

 

ముందస్తు దంతవైద్య పరీక్షల్లో ఇవన్నీ నిర్ధారింపబడి నిర్ణయం తీసుకోబడతాయి.

అలాగే, దవుడలు చిన్నగా వుండి, పళ్ళు యథావిధిగా పూర్తిస్థాయిలో వున్నప్పుడు, పళ్ళు ఎత్తుగానూ, వంకర టింకరగా వచ్చే అవకాశం వుంది. ఇలాంటి వారిలో పై దౌడ దంతాలు (మోలార్స్) క్రింది దౌడ దంతాలు (మోలార్స్) ఒకదానికొకటి ఆనుకొని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని శాస్త్రీయ పరిభాషలో ‘మాల్ అక్లూసన్’ అంటారు. ఇలాంటి వారు ఆహార పదార్థాలు నమలలేరు. అలాగే దౌడ కీలులో (టి.ఎం.జె) నొప్పి పుట్టి ఇబ్బంది కలిగే అవకాశం వుంది. ఇలాంటి మిశ్రమ సమస్యలకు పరిష్కారం ఆర్థోడాంటిక్ చికిత్స మాత్రమే! అది కూడా సకాలంలో జరిగినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. కొందరిలో దౌడలు పెద్దగా వుండి, పళ్ళు చిన్నవిగాను, ఉండవలసిన సంఖ్యకంటే తక్కువగాను ఉండడం మూలాన, పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో కూడా శస్త్రచికిత్సతో కూడిన ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం అవుతుంది.

ఆర్థోడాంటిక్ చికిత్స ఎప్పుడు?:

చాలామంది తల్లిదండ్రులు ఈ చికిత్స గురించిన అవగాహన లేక సమయం మించిపోయాక, చికిత్స వీలుకాని పరిస్థితులలో, నిరుత్సాహానికి, గురి అయి ఆందోళన చెందుతారు. ఈ చికిత్స గురించి ముందే తెలిసి ఉంటే సరైన సమయంలో ఈ చికిత్సను వినియోగించుకుని సత్ఫాలితాలు పొందవచ్చును, సహజమైన అందమైన పలువరుసను పొంది, తద్వారా దంత సౌందర్యానికి అర్హులు కావచ్చును.

సాధారణంగా, ఈ చికిత్స 12-15 సంవత్సరాల మధ్యకాలంలో అనుకూలంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఫలితాలు ఏమాత్రం ఆశాజకంగా ఉండకపోగా, ఒకోసారి పళ్ళు సచ్చు (నాన్ -వైటల్) పడిపోవచ్చు. ఒకోసారి సమస్యను బట్టి ఏడు సంవత్సరాల వయసులోనే చికిత్స ప్రారంభించవలసిన అవసరం రావచ్చు. దీనిని, సమస్యను బట్టి, ఎప్పుడు చికిత్స చేయాలన్నది దంతవైద్యులు నిర్ణయిస్తారు. ఈ చికిత్సలో, చికిత్స చేసే దంతవైద్యులు ఎంత బాధ్యతగా వుంటారో, చికిత్స పొందేవారు కూడా అంతే బాధ్యతగా ప్రవర్తించాలి. లేకుంటే, చికిత్స నిష్ప్రయోజనంగా మారి, ఖర్చు చేసిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే, కనీసం ఆరు నెలలకొకమారు పిల్లలకు ‘ముందస్తు దంత వైద్య పరీక్షలు’ చేయించాల్సి ఉంటుంది.

~

నోటి పుళ్ళు:

ప్ర: డాక్టర్ గారూ.. మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు. ఆయన దంతాలు అరిగిపోయి బ్లేడు మాదిరిగా తయారై, నాలుకకు పుండ్లు పడి ఆహరం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి పరిష్కార మార్గం సూచించగలరు.

జ: వృద్ధాప్యానికి చేరువవుతున్న స్త్రీ, పురుషులలో, ఈ పరిస్థితి సాధారణంగా కనిపిస్తుంది. కొంతమందిలో ఆహరం తీసుకోలేని పరిస్థితి ఏర్పడి, అనారోగ్యానికి ఆందోళనకు గురిచేస్తుంది. కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల, వివిధ కారణాల మూలంగా పంటికి దెబ్బలు తగలడం వల్ల, నిద్రలో పళ్ళు నూరడం (బ్రక్సిజం) వంటి కారణాల వల్ల పళ్ళు అరిగిపోవడం, సూదిగా లేదా పదునుగా మారడం జరుగుతుంది. ఇలాంటి పళ్ళు/దంతాలు, సున్నితమైన నాలుకను, నోటిలోపలి బుగ్గలను గాయపరుస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే పండ్లుగా మారి, పిదప నోటి కాన్సరుకు దారితీసే ప్రమాదం వుంది. అందుచేత ఇలాంటి సమస్య వున్నవారు తక్షణమే దంతవైద్యులను సంప్రదించాలి.

సూదిగా వున్న దంతాలను నునుపుగా చేయడం గాని, అవసరం అయితే, పంటి తొడుగులు (క్రౌన్స్) చికిత్స గాని చేసి త్వరలో ఉపశమనం పొందే ఏర్పాటు చేస్తారు. నొప్పిబిళ్లలతో ఇతర క్రీములతో స్వంత వైద్యం చేసుకుంటూ, తాత్సారం చేసినట్లయితే, స్వయంగా ప్రాణహానికి స్వాగతం పలికినట్టే అవుతుంది.

‘నోటిలో అశ్రద్దకు గురైన పుళ్ళు (అల్సర్స్)
నోటి కాన్సర్ కు పునాదిరాళ్లు..!’

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here