దంతవైద్య లహరి-19

10
12

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

ఎత్తు పళ్ళు – చికిత్స:

ప్ర: సార్.. మా అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. ఈ మధ్యనే అమ్మాయికి పెళ్లి కుదిరింది. వచ్చే సంవత్సరం జనవరిలో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే అమ్మాయికి కొద్దిగా ముందరి పళ్ళు ఎత్తుగా ఉంటాయి. మామూలు పరిస్థితులలో పెదవులు రెండూ కలుసుకోవు. మా అమ్మాయికి వచ్చే రెండునెలల్లో క్లిప్పుల వైద్యంతో ఎత్తు పళ్ళను సరిచేయవచ్చునా? తెలుపగలరు.

-శ్రీమతి ముంతాజ్ బేగం, మలకపేట, హైదరాబాద్.

జ: ఇటువంటి పంటి సమస్యల గురించి గతంలో కొద్దిగా చర్చించడం జరిగింది. అది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. అయినా, ఇది అందరికీ ఉపయోగమైన అంశం గనుక మళ్ళీ కాస్త విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

క్లిప్పుల చికిత్స (ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్) హడావిడిగా చేసేది కాదు. ఈ చికిత్స కొద్ధి రోజుల్లోనో, కొద్ది వారాల్లోనో, కొద్ది నెలల్లోనో ముగిసేది కాదు. కనీసం ఒక సంవత్సరకాలం లేదా అంతకంటే ఎక్కువకాలం పట్టవచ్చు. అది కూడా అనుకూల పరిస్థితులలో మాత్రమే సాధ్యం అవుతుంది. అనుకూల పరిస్థితులు అంటే.. ఈ చికిత్సకు వయసు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే, పిల్లల్లో ఈ సమస్య  తలెత్తితే తక్షణమే దంతవైద్యులను (ఆర్థోడాంటిస్ట్) సంప్రదించాలి. ఇలా ముందస్తు దంతవైద్య పరీక్షలు చేయించడం వల్ల, చికిత్స ఎప్పుడు మొదలు పెట్టాలన్నది దంతవైద్యులు నిర్ణయిస్తారు. అంటే ఈ చికిత్స ఎంత తక్కువ వయసులో మొదలుపెడితే ఫలితాల రేటు అంత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప 14-15 సంవత్సరాల వయసుకంటే ముందు ఈ చికిత్స మొదలుపెడతారు. చాలామంది పదవ తరగతి ఫైనల్ పరీక్షలు అయిపోగానే ఈ చికిత్సను ఇష్టపడతారు. సెలవుల్లో చికిత్సకు అలవాటు పడే అవకాశం ఉండడమే గాక, ఆర్థోడాంటిక్ చికిత్సకు ఇది అనుకూలమయిన వయసు. వయసు పెరిగేకొద్దీ చికిత్సాకాలం కూడా పెరుగుతుంది, ఫలితాల శాతం తగ్గుతుంది.

ఒక్కోసారి పళ్ళ ఎత్తునుబట్టి దౌడలో స్థలం చూపించడం కోసం, అంటే ఎత్తు పళ్లు వెనక్కి జరగడం కోసం ప్రీ-మోలార్స్ నాలుగు తీయవలసి వస్తుంది. ఆ ప్రదేశంలో ముందరి పళ్ళు సర్దుకున్నాక పళ్ళ ఎత్తు తగ్గుతుంది. ఈ పళ్ళు జరగడం అనేది వేగంగా జరిగే ప్రక్రియ కాదు. చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. అలా జరిగేలా క్లిప్పులను తయారు చేస్తారు. అయితే ఈ చికిత్సలో, ఆర్థోడెంటిస్ట్ కంటే చికిత్స పొందేవారి బాధ్యత, ఓపిక ఎక్కువగా ఉండడం మీదనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుచేత వైద్యుల సూచనలు తూ.చ. తప్పకుండా పాటించాలి. లేకుంటే ఖర్చుచేసిన సొమ్ము వృథా కావడమే కాక, మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది. అంటే, పళ్ళు తిరిగి యథాస్థానంలోనికి వెళ్లిపోవడం, పళ్ళు కదిలిపోవడం, లేదా పళ్ళు సచ్చుపడిపోవడం వంటి నష్టాలు జరిగే ప్రమాదం వుంది.

ఇక చివరగా తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆర్థోడాంటిక్ చికిత్స హడావిడిగా చేసేది/చేసుకునేది కాదు! దీనికి చికిత్సాకాలం ఎక్కువ. అందుకని ఈ విషయం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అశ్రద్ధ చేయక సకాలంలో ఈ చికిత్సను పొందడం అవసరం. ముఖ సౌందర్యానికి, అందమైన పలువరుస అవసరం అన్న మాట మరచిపోకూడదు!

~

నోటి దుర్వాసన:

ప్ర: డాక్టర్ సాబ్, నాదొక సున్నితమైన విషయం. మావారు బ్యాంకు ఉద్యోగి. ప్రజాసంబంధాలు గల అధికారి. ఆయన మాట్లాడుతుంటే, భరించలేని నోటి దుర్వాసన కొడుతోంది. చెబితే ఎక్కడ ఫీల్ అవుతారోనని నా బాధ. ఆయన దగ్గరకు వస్తుంటేనే, నాకు వణుకు పుట్టినట్లై వాంతి వచ్చినట్లవుతున్నది. ఇది ఆయన దృష్టికి ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వండి.

– శ్రీమతి —————, అఫ్జల్ గంజ్, హైదరాబాద్..

జ: మీ పేరు చెప్పలేదంటే, విషయంలోని సున్నితత్వం అర్థం అయింది. మీలాంటి చాలామందికి ఈ అనుభవం సర్వసాధారణం. కేవలం భర్తల నుండి మాత్రమే కాదు, భార్యల నుండి కూడా ఈ సమస్య ఎదురవుతుంది. లేదంటే భర్తల శాతమే ఎక్కువ! మీరే అంతగా ఇబ్బందిపడుతుంటే, బ్యాంకులో ఆయన గురించి ఎలాంటి గుసగుసలు వస్తాయో ఊహించడం అంత కష్టం కాదు. ప్రతివాళ్ళు చెబితే ఆయన బాధపడతాడు అనుకుంటారు గానీ, తెలిసి ఆయనకు చెప్పకపోవడం నేరం.

అందులోనూ మొదటి నేరస్థులు మీరే అవుతారు. ఇలాంటివి చెప్పడం ద్వారానే వారికి మేలు చేసినవారం అవుతాము. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాలి.

నోటి నుండి దుర్వాసన రావడానికి కారణం.. నోటి అపరిశుభ్రత, చిగురువ్యాధులు, కట్టుడు పళ్ళు, ఈ.ఎన్.టి. సమస్యలు, ఊపిరితిత్తి సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వగైరా. మీవారు బ్యాంకు అధికారి అంటున్నారు కనుక ఆయనకు ఉద్యోగరీత్యా ఉండే పనుల ఒత్తిడి వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంది. ముందుగా నోటి దుర్వాసన.. అనేది వ్యాధి కాదని, వ్యాధి లక్షణం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మీ వారికి ముందుగా మీరే విషయం అర్థమయ్యేలా వివరించండి. సాధ్యమయినంత త్వరగా ఆయనను  దంతవైద్యులకు చూపించండి. వారి పరిధిలోని వైద్యం వారు చేస్తారు. లేదా అవసరమైన వైద్య నిపుణులకు రిఫర్ చేస్తారు.

మీరు, మీవారి దంతధావనం విషయంలో  కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఏమి తిన్నా, పండ్ల రసాలు త్రాగినా వెంటనే నోరు బాగా పుక్కిలించే అలవాటు చేయండి. రాత్రి పడుకునే ముందు, ఉప్పునీళ్లతో గాని, అందుబాటులో వున్న మౌత్ వాష్‌తో గానీ నోరు పుక్కిలించే అలవాటు చేయండి. సంవత్సరానికొక మారైనా ముందస్తు దంతవైద్య పరీక్షలు చేయించండి. మీ సంసారిక జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఇది మీకోసమే కాక సమాజానికి కూడా గొప్ప సేవ చేసినట్లు అవుతుంది.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here